–    డాక్టర్‌ పార్థసారథి చిరువోలు

రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతలు హుందాగా వ్యవహరించాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి. అలా ఉండలేనప్పుడు అది వారికే కాదు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రతిష్ఠకు కూడా భంగకరంగా మారుతుంది. అంతేకాదు, ఆ సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థకు కూడా ఆ వ్యక్తి మాయని మచ్చగా మిగిలిపోతాడు. డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌ పార్లమెంటులో ఇటీవల చేసిన వ్యాఖ్యలు, తరువాతి పరిణామాలు ఇందుకు రుజువు. కానీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఇక ఆపడం మంచిదన్న సంకేతాలు ఈసారి విపక్షాల నుంచి కూడా రావడం పెద్ద పరిణామం. ఎన్నికల ఫలితాలు చూసి కూడా డీఎంకే వదరుబోతు ఇలా వ్యాఖ్యానించడం చాలామందికి నచ్చలేదు. మూడు రాష్ట్రాలలో గెలిచిన పార్టీని ఈ విధంగా వ్యాఖ్యానించేవాళ్లు ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కాదు, నాగరిక ప్రపంచంలో ఉండ డానికి అనర్హులు. ద్రవిడ రాజకీయాలలో కుసంస్కారంతో పాటు, హిందూ వ్యతిరేక పైత్యం కూడా ఎక్కువే.


ఇండియా కూటమి భాగస్వామి డీఎంకే వివాదాలను రాజేస్తూ వార్తలకెక్కటం ఇంకా ఆపడం లేదు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇంకా సద్దుమణగలేదు. మరో ఎంపీ డీఎన్‌ వి సెంథిల్‌ కుమార్‌ తన అనుచిత వ్యాఖ్యలతో మరొకసారి నిప్పు రాజేశారు. దీనిపై బీజేపీ భగ్గుమంటోంది. ఆల్‌ ఇండియా హిందూ మహాసభ బీజేపీకి మద్దతుగా నిలిచించి. ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ దేశమంతా హెలికాప్టర్ల ద్వారా గోమూత్రం చల్లి శుద్ధి చేయాలని ఆల్‌ ఇండియా హిందూ మహాసభ ప్రకటించింది.

ఇంతకీ ఎంపీ ఏమన్నారు? లోక్‌సభలో జమ్మూ కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు, 2023పైన చర్చ సాగుతోంది. అప్పుడే మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలుపు సంబరాలు కూడా ఆరంభమైనాయి. దీనిని భరించలేని సెంథిల్‌కుమార్‌, ‘బీజేపీకి ఎన్నికలలో గెలిచే శక్తి హిందీ భాషా ప్రాంతాలలో మాత్రమే ఉంది. మనం సాధారణంగా గోమూత్ర రాష్ట్రాలుగా వాటిని పిలుస్తాం. దక్షిణ భారతదేశంలో ఆ పార్టీ అడుగుపెట్టలేదు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఏం జరిగిందో మీరు చూసే ఉంటారు. మేం అక్కడ బలంగా ఉన్నాం. అక్కడ కాలు మోపుతామని కల కూడా కనలేరు’ అని అసందర్భం ప్రలాపం చేశారు.

దీనితో కేంద్ర మంత్రులు, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘డీఎంకే దుష్పరిపాలన వల్ల చెన్నై కుంగిపోతోంది. పార్లమెంటు ప్రతిష్ఠ కూడా దెబ్బ తింటోంది. నార్త్‌ ఇండియా మిత్రులను పానీపూరీ అమ్మకందారులని, టాయిలెట్‌ క్లీనర్లను నిందిస్తూ వచ్చారు. ఇప్పుడు డీఎంకె ఎంపీ గోమూత్ర వ్యాఖ్యలకు దిగారు. ఈ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది’’ అని పేర్కొన్నారు. ఈ వివాదానికి కాంగ్రెస్‌ దూరంగా ఉండటానికి ప్రయత్నించింది. ఎంపీ కార్తీ చిదంబరం ‘ఎక్స్‌’లోనే స్పందించారు. ‘ఈ పదాలను ఉపయోగించటం చాలా దురదృష్టకరం. ఇవన్నీ అనుచితమైనవి. మర్యాదకు భంగం కలిగించేవి (అన్‌ పార్లమెంటరీ). సెంథిల్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’’ అని సూచించారు. ‘ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండేలా చూసుకోవటం ముఖ్యం’ అన్నారు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పి.ఎల్‌. పునియా, పేరు చెప్పటానికి ఇష్టపడని దక్షిణాది కాంగ్రెస్‌ నేత కూడా సెంథిల్‌ నోటి దురుసును తప్పుపట్టారు. ‘‘దేశంలో ఉండే భిన్నత్వాన్ని అంగీకరించటం ముఖ్యం. తరచూ వివాదాస్పదం కావటం అనేది మంచిది కాదు’’ అని సలహా ఇచ్చారు.

ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్‌ ఝూ మాట్లాడుతూ, ‘మన సంస్కృతికి, నాగరికతకు భంగకరంగా ఉండే వ్యాఖ్యలు చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి. దీనివల్ల బీజేపీలో మనోభావాలను దెబ్బతినటాన్ని అర్థం చేసుకోగలను. అదే సమయంలో ప్రతిపక్షాలు మొత్తం తీవ్రవాదాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయని ప్రధాని స్థాయి వ్యక్తులు వ్యాఖ్యానించటాన్ని సహించలేకపోతున్నాను. ఎవరికీ హాని కలిగించని విధానాన్ని అనుసరించటానికి అందరం సమష్టిగా ప్రయత్నిద్దాం’ అని వ్యాఖ్యా నించారు. సమాజ్‌ వాదీ పార్టీ ఎంపీ జావేద్‌ ఆలీఖాన్‌ మాట్లాడుతూ, ‘ఒక ప్రాంతాన్ని వేరు చేసి ఈ రకంగా చూపించటం తగదు’ అని వ్యాఖ్యానించారు. ‘వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి చెందిన వారయినా వాటిని అంగీకరించేది లేదు’ అన్నారు సీనియర్‌ జనతాదళ్‌(యు) నేత కేసీత్యాగి.

సెంథిల్‌ వ్యాఖ్యలపైన తన సొంత పార్టీ డీఎంకే దిద్దుబాటు చర్యలకు దిగింది. డీఎంకే ఆర్గనైజేషనల్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌. భారతి ఒక ప్రకటన చేస్తూ, ‘సెంథిల్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకునేలా ఉన్నాయని, ఈ విషయం తెలియగానే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ అలాంటి పదాలు ఉపయోగించినందుకు ఎంపీని మందలించా’రని ప్రకటించారు. పార్టీ హై కమాండ్‌ ఆదేశాల మేరకు, ప్రతి ఒక్కరూ బహిరంగంగా మాట్లాడేటప్పుడు మర్యాదను, గౌరవాన్ని కాపాడు కునేలా వ్యవహరించాలని కోరుతున్నాం అని హెచ్చరికలు చేశారు.

పార్టీ ఆదేశాల మేరకు తన తప్పును అంగీకరించ టానికి సెంథిల్‌ సిద్ధపడ్డారు. ‘నేను చేసిన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనయినా గాయపరిచి ఉంటే క్షమించండి. నా వ్యాఖ్యలను ఉపసంహరించు కుంటున్నా. పార్లమెంటు రికార్డుల నుంచి వాటిని తొలగించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అంతకు ముందు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ లోనూ పార్లమెంటులో తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్‌ చేశారు. ‘నేను కొన్ని మాటలను అసంబద్ధంగా వాడాను. ఇందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. క్షమించవలసిందిగా కోరుతు న్నాను’ అని ప్రకటించారు.

మెజారిటీ వర్గం మీద అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసి, తరువాత లాంఛనంగా చెంపలు వాయించుకోవడం ఇక్కడ చాలా పార్టీలకు ఒక అలవాటుగా మారింది. సెంథిల్‌ క్షమాపణలు చెప్పినా, ఉదయనిధి ఆ పని చేయలేదు. అందుకే బీజేపీ తన విమర్శలను దాడిని తగ్గించలేదు. కాంగ్రెస్‌తో పాటు ఇండియా సంకీర్ణ కూటమిలోని పార్టీలన్నీ సనాతన ధర్మాన్ని చెడ్డగా చూపించటానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. వాళ్ల ఆలోచన అంతా హిందూ త్వను, సనాతన ధర్మాన్ని అవమానించటమే. ‘ఎన్నికల్లో ఓటమి తర్వాత వాళ్లు (కాంగ్రెస్‌) నిస్పృహతో నిందలకు దిగుతున్నారు. వాళ్ల ఆలోచన స్పష్టంగా ఉంది. వాళ్లు ఈవీఎంలను తప్పుపడుతు న్నారు. ఈ దేశ సంస్కృతికి, గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ‘తుకడే,. తుకడే’ గ్యాంగుతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని మేం ఏం మాత్రం సహించం’ అన్నారు. సనాతన ధర్మం, హిందువులు, హిందీ మాట్లాడే ప్రజలకు వ్యతిరేకంగా డీఎంకే నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కుట్రలో ఒక భాగం’ అని వ్యాఖ్యానించారు.

ఆల్‌ ఇండియా హిందూ మహాసభ బీజేపీకి మద్దతుగా నిలిచింది. స్టాలిన్‌ వ్యాఖ్యలతో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించాం. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలలో గెలుపునకు ఇది బీజాలు వేస్తుందని ఆ సంస్థ నేతలు అభిప్రాయపడ్డారు. ఆల్‌ ఇండియా హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్‌ మాట్లాడుతూ ‘ప్రపంచానికి ఆవు తల్లిలాంటిది. గోవు, గోమూత్రం అనేవి పూజనీయ మైనవి. ఇలాంటి వాటిపైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు సెంథిల్‌ సిగ్గుపడాలి’ అని వ్యాఖ్యా నించారు. ‘ఈ వ్యాఖ్యలను బట్టి సెంథిల్‌ డీఎన్‌ఏ మొగల్స్‌ నుంచి వచ్చినట్టుగా అర్థం అవుతోంది. ఈ వ్యాఖ్యల వల్ల దేశమంతా హిందూత్వను మేల్కొలుపు తుంది. దేశమంతా కాషాయజెండా రెపరెపలాడు తుంది. గోమూత్రాన్ని వెదచల్లి దేశం మొత్తాన్ని శుద్ధీకరిస్తే అసుర ఆలోచనలన్నీ తొలగి పోతాయి. దేశమంతా విశ్వగురువుగా మారుతుంది’ అని తీవ్రంగానే వ్యాఖ్యానించారు.

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, సెంధిల్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘ఈ రోజుల్లో కూడా ఉత్తరాది.. దక్షిణాది విభజన తేవటం దురదృష్టకరం. అందులోనూ తమిళనాడుకు చెందిన ఎంపీ గోమూత్ర రాష్ట్రాలు అంటూ ఉత్తరాదిని విడదీసి చూపటం విచారకరం’ అన్నారు. అవి గోమూత్రం రాష్ట్రాలు ఎంత మాత్రం కావు. గోముద్ర ఉన్న రాష్ట్రాలు అని అభిప్రాయపడ్డారు.

సెంథిల్‌కుమార్‌ వృత్తిరీత్యా రేడియాలజిస్టు. 2019 ఎన్నికల్లో ధర్మపురి లోక్‌సభస్థానం నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తారు. జులై 2022లో, ధర్మపురి జిల్లాలో ఒక రోడ్డు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఒక ప్రభుత్వ అధికారిపైన ఆయన విరుచుకుపడటం వివాదాస్పదమైంది. ‘ప్రభుత్వ కార్యక్రమాలను ఈ రీతిగా నిర్వహించడా నికి అనుమతి లేదన్న విషయం మీకు తెలియదా? మిగతా మతవిశ్వాసాల మాటేమిటి? క్రిస్టియన్లు, ముస్లింలు, ద్రవిడ కజగం, ఇతర మతాల వారి సంగతేమిటి? క్రిస్టియన్‌ ఫాదర్‌ని, మసీదు ఇమామ్‌ ను కూడా పిలవండి’ అంటూ హడావిడి చేసిన ఘనుడు ఇతడే. ఆ ఏర్పాట్లన్నింటినీ వెంటనే తొలగించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు తనను ఆహ్వానించ వద్దని కూడా ఆయన వీరంగం వేశారు. ఎందుకంటే ‘ఇది ద్రవిడ పాలన’. ఇదంతా రాజకీయంగా ఫోకస్‌ కావటానికి సెంథిల్‌ చేసిన మోళీగా రాజకీయ పరిశీలకులు ఆనాడే భావించారు. డీఎంకే నేతలు కూడా భిన్నంగా స్పందించారు. ‘సిద్ధాంతపరంగా చూస్తే ఏ ప్రభుత్వ కార్యక్రమం కూడా మతపరమైన కార్యక్రమంలా సాగకూడదనే విషయంతో నేను ఏకీభవిస్తాను. గానీ, సోషల్‌ మీడియాలో రాజకీయం చేయాలనుకున్న ఎంపీ ఎత్తుగడను మాత్రం నేను సమర్థించను’ అని ఒక నేత వ్యాఖ్యనించారు.

నిజానికి డీఎంకే నాయకులది అక్కడ ద్విపాత్రాభి నయం. బయట నాస్తికులు. హిందూ వ్యతిరేకులు. కానీ హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకించేవారు కూడా బీజేపీ వారితో పాటే దేవాలయాలను సందర్శించటం, పూజలు చేయటం మామూలే. ఇది అందరికీ తెలుసు. మంచిరోజులు, ముహూర్తాలు చూసుకోకుండా ఒక పెళ్లి గానీ, ఒక గృహప్రవేశం గానీ, ప్రమాణస్వీకారం కార్యక్రమం గానీ డీఎంకేలో ఎక్కడయినా జరగుతోందో చూపించమని ఇతర పార్టీలు నిలదీశాయి. 2012లో మద్రాసు హైకోర్టు దీనిపై స్పష్టత ఇచ్చింది కూడా. ప్రభుత్వ కార్యాల యాల్లో ‘ఆయుధ పూజ’ లాంటివి నిర్వహించటం లౌకిక భావనలను దెబ్బ తీయదన్న హైకోర్టు వ్యాఖ్యానాలను ఇప్పుడు పలువురు గుర్తు చేశారు. డీఎంకే నాయకుల ఉత్తరాది వ్యతిరేకత అంతా ఎరిగినదే. 2021లో రాష్ట్ర మంత్రి కె.ఎన్‌. నెహ్రూ మాట్లాడుతూ, బిహారీలు ‘బుర్ర తక్కువ వాళ్లయినా’ తమిళుల ఉద్యోగాలను తన్నుకు పోతున్నారని వ్యాఖ్యానించారు. 2022లో డీఎంకే రాజ్యసభ ఎంపీ టికెఎస్‌ ఎలంగోవన్‌ మాట్లాడుతూ, హిందీ భాష తమిళనాడును శూద్రుల స్థాయికి దిగజారుస్తుందని అనటం వివాదాస్పదమైంది. డీఎంకే ఆర్గనైజేషనల్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌.భారతి మాట్లాడుతూ ఔత్తరాహులు తమిళనాడులో పానీ పూరీలు అమ్ముతారు. మాతో అన్నింటిలో విభేదిస్తున్న గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి కూడా అలాంటి వారే అని ధ్వజమెత్తారు. ఈ ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలని అన్న తరువాత ఈ పైత్యం ఇంకాస్త పెరిగింది.

ఇప్పుడు సెంథిల్‌ చేసిన గోమూత్ర వ్యాఖ్యలు ఈ వరసలో తాజావి. ఎంపీ వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించినా దానిని విస్మరించటా నికి కేంద్రంలోని బీజేపీ నాయకత్వం సిద్ధంగా లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిపై ప్రయోగించ టానికి ఇది పదునయిన అస్త్రమని భావిస్తోంది. దీనితో డీఎంకే తనకు అంటిన బురద కడుక్కోవాలని ఎంతగా ప్రయత్నించినా, దాని మరక ఇప్పట్లో తొలిగి పోయేటట్టుగా కనిపించటం లేదు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram