టి.ఎన్‌.భూషణ్‌

తెలంగాణ ఎన్నికల ఫలితాలు పాలకుల అహంకారం, అధికార దుర్వినియోగం, అవినీతి, అభివృద్ధినిరోధంవంటి అంశాలపై ప్రజల వ్యతిరేకతను ప్రతిబింబించాయి. బీఆర్‌ఎస్‌ నాయకులు, అనుచరుల అధికారమదానికి ఈ ఎన్నికల ద్వారా సరైన బుద్ది చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు  వేయని ఎత్తులేదు. కాని అవి ఫలించలేదు. ఆయన, ప్రతి ఎన్నికల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటు పురిగొల్పి గెలిచే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. అయితే ఇందులో బీఆర్‌ఎస్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ   ప్రభుత్వానికి ప్రధాన పాత్ర ఉంది. ఆ రెండు పార్టీల  సీఎంలు  కలిసి తమ ఉభయులకు మేలు జరిగేలా ఈ ఎత్తు వేసినట్లు రెండు రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలు విమర్శిస్తున్నాయి. నాగార్జున సాగర్‌ నీటిపై తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో యుద్దం చేస్తున్నట్లు ప్రజలను నమ్మించి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని బీఆర్‌ఎస్‌ పార్టీ, అదే నీటికోసం తెలంగాణతో పోరాటం చేస్తున్నట్లు వైసీపీ  నమ్మించే ప్రయత్నం చేశాయి. కాని ఇదంతా పెద్ద డ్రామగా నమ్మినతెలంగాణ ప్రజలు, ఈ వ్యవహారాన్ని అసలు పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్‌ను ఓడిరచారు. ఆదే వ్యవహారంలో ప్రయోజనం పొందాలనుకుంటున్న వైసీపీకి  సానుభూతి రావడం మాట దేవడెరుగు ఇదంతా పెద్ద మాయగా ప్రజలు విమర్శిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ పోలింగ్‌ నవంబరు 30న జరుగుతుందనగా, ముందురోజు (29) అర్ధరాత్రి కృష్ణా జలాల పేరుతో నాగార్జునసాగర్‌ కేంద్రంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా హైడ్రామాకు తెరదీశాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు, నర్సరావుపేటల నుంచి వందలాది మంది పోలీసులు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నాగార్జునసాగర్‌ చేరుకున్నారు. సాగర్‌ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వ అధీనంలోని రిజర్వు పోలీసు బందోబస్తులో ఉంది. ఎపీ పోలీసులు సాగర్‌ప్రాజెక్టు 13వ గేటు వరకు దూసుకెళ్లి తమ అధీనంలోకి తీసుకున్నారు. ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. వాహనాలు తనిఖీ చేసి ఆంధ్ర ప్రాంతం వారికి మాత్రమే అనుమతిచ్చారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆంధ్ర ఇరిగేషన్‌ శాఖ అధికారులు కుడి కాలువకు నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కృష్ణా నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు నీటిని విడుదల చేసే క్రస్ట్‌ గేట్ల మెయింటెనెన్స్‌తో పాటు కుడి కాలువ గేట్ల మెయింటెనెన్స్‌ కూడా తెలంగాణ వైపు భూభాగంలో ఉన్న ఇరిగేషన్‌ శాఖ అధికారుల అధీనంలోనే ఉంటాయి.

తాజాగా ఆ వ్యవస్థను రాష్ట్ర అధికారులు మార్చివేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర హద్దుల్లోనే కుడి కాలువకు నీటి విడుదల చేసేందుకు అనువుగా సిస్టమ్‌ను ఏర్పాటు చేసి, ఉదయం నీటిని విడుదల చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలోని చెరువులకు గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్‌ శాఖ అధికారులు చెప్పారు. మొదటగా 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం 3,000 క్యూసెక్కుల వరకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు అయిదు టీిఎంసిల నీటిని  తీసుకోనున్నట్లు తెలిపారు. దీనిపై వైసీపీ సర్కారు ‘సాగర్‌ నుంచి నీళ్లు కావాలని కృష్ణానదీ నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ) ను అడిగితే ఇవ్వలేదని అందువల్ల ఈరకంగా నీటిని తీసుకుంటున్న’ట్లు పేర్కొంది.

బోర్డుపై నెపం

నీటిని విడుదల చేయాలని కోరకుండానే ఏపీ ప్రభుత్వం అకస్మాత్తుగా పోలీసు బలగాల మోహ రింపుతో డ్యామ్‌పై హడావిడి చేయడంపై కృష్ణానదీ నిర్వహణ బోర్డుకే (ఆర్‌ఎంబీ) విస్మయం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ కేఆర్‌ఎంబీ లేఖరాసింది. దీని ప్రకారం… ఈ ఏడాది అక్టోబరు 6న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో… మూడు విడతలుగా చెరో 15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు మాత్రమే విడుదల చేస్తామన్న ప్రతిపాదనకు తెలంగాణ, ఏపీ అంగీకరించాయి. ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు కూడా చేశారు. తమకు ఎప్పుడెప్పుడు నీరుకావాలో ఏపీ అధికారులే షెడ్యూలు ఇచ్చారు. దీనిప్రకారం… అక్టోబరు 10 నుంచి 20వరకు 5 టీఎంసీలు విడుదల చేశారు. ఆ తర్వాత… జనవరి 8 నుంచి 18 వరకు 5 టీఎంసీలు, ఏప్రిల్‌ 8నుంచి 18 మధ్య మరో 5 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ కోరింది. మధ్యలో నీటి విడుదల కోసం ఎలాంటి ఇండెంట్‌ పెట్టలేదని కేఆర్‌ఎంబీ స్పష్టంచేసింది. ‘‘మీరు ఇచ్చిన షెడ్యూలు ప్రకారం అక్టోబరులో 5 టీఎంసీలు విడుదల చేశాం. నవంబరులో నీళ్లు కావాలని మీ నుంచి ఎలాంటి ఇండెంట్‌ రాలేదు. అయినప్పటికీ… వెయ్యి మంది పోలీసులతో వచ్చి, జలాశయాన్ని ఆక్ర మించి, బలవంతంగా గేట్లు తెరిచి, కుడికాల్వకు నీరు విడుదల చేశారని తెలంగాణ నుంచి ఫిర్యాదు అందింది. సాగర్‌ నుంచి వెంటనే నీటి విడుదల నిలిపివేయండి’’ అని కేఆర్‌ ఎంబీ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ, సాగర్‌ను తెలంగాణ నిర్వ హించాలని నిర్ణయం జరిగినట్లు గుర్తు చేసింది. వెరసి… జగన్‌ సర్కారుది దుందుడుకు చర్యగా తేల్చి చెప్పింది.

పోలీసులపై కేసులు

రెండు రాష్ట్రాల పాలకపక్ష పెద్దలు ఆడిన డ్రామాలకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఇరకాటంలో పడ్డారు. ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటుగా మారింది. తెలంగాణ ఎన్నికలు జరిగే రోజునే రెండు ప్రభుత్వాలు నాగార్జున సాగర్‌ డ్యామ్‌ దగ్గర జలవివాద సమస్యను ఉన్న పళంగా తెరపైకి తీసుకొచ్చాయి. రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రుల ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రయత్నించి, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అక్కడి రప్పించి హడావిడిచేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పైకి రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతున్నట్లు సృష్టించారు. ఈ వివాదంలో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు బాగానే ఉండగా ఏపీ పోలీసులు మాత్రం కేసుల్లో ఇరుక్కున్నారం టున్నారు. వారిపై ఏపీ పోలీసులపై నాగార్జున సాగర్‌ విజయపురి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఏ-1గా ఏపీ పోలీస్‌ ఫోర్స్‌ను పేర్కొంది. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకొచ్చారని, సాగర్‌ కుడి కాల్వ గేటు నుంచి ఏపీకి నీటిని వదిలారని, ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకు ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులో తెలిపింది. దీనిపై ఎపీ పోలీసులు కూడా విజయపురి సౌత్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగార్జున సాగర్‌ జలాల విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. సాగర్‌ జలాల విడుదల విషయంలో నవంబరు 28వ తేదీకి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ, డ్యామ్‌ నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు అప్పగించడంతో పాటు సీఆర్పీఎఫ్‌ దళాల పర్య వేక్షణకు అప్పగించాలని కేంద్రం శాఖ కార్యదర్శి ప్రతిపాదించారు.రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి.

ఏపీపై తెలంగాణ ఫలితాల ప్రభావం

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చే జరిగే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోను పునరావృతం అవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దల్లో మితిమీరిన ఆహంకారం, పెచ్చు మీరిన ఆవినీతి, కుటుంబ పాలన. ఆ పార్టీ ఓటమికి దారి తీశాయి. ఇవే అంశాలు వైసీపీ ప్రభుత్వ పాలనలోనూ మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అవినీతికి కేంద్ర బిందువుగా మారింది. మద్యం, మైనింగ్‌, ఇసుక మాఫియాల ద్వారా రూ. వేలకోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతున్నాయి. ఇసుక, మద్యం, గనులు, భూములు, కబ్జాలు, సెటిల్మెంట్లలో అక్రమ సంపాదనతో అధికార పార్టీలో కొందరు నేతలు వేలకోట్ల స్థాయికి ఎదిగారు. జగన్‌ ప్రభుత్వం అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా తయారైంది. తప్పు ఎత్తి చూపితే భరించలేరు. విపరీతమైన అణిచి వేతను ప్రయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి.. ఆయన చుట్టూ ఉన్న కొద్దిమంది మినహా మరెవరికీ పాలనలో ప్రమేయం లేదు. జగన్‌ కోటరీ మినహా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బొమ్మల్లా ఉండిపోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాదిరిగా ఇక్కడ కూడా జగన్‌ కుటుంబసభ్యులు, ఆయన చుట్టూ ఉండే కొద్ది మందే సమస్తం నిర్దేశిస్తున్నారు. అందుకే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా బలంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. పేర్లు మార్పు మినహా తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. కానీ ప్రజల్లో ఒకసారి వ్యతిరేకత వచ్చిన తర్వాత అవేవీ ఓటమి నుంచి కాపాడలేక పోయాయని తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదిన్న రేళ్లు అవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రా సీఎం జగన్‌ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల సమస్యలపై కూర్చొని చర్చించిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజన హామీలపై కేంద్రం నిర్వహించిన సమావేశాలలోనూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిష్కారానికి చొరవ చూపలేదు. ఇంతకాలం మౌనంగా ఉండి, ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వివాదం సృష్టించారని రెండు రాష్ట్రాల ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల రోజు రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్‌, జగన్‌ సెంటిమెంటు రగిలించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

– సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram