విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్‌లో అనూహ్య విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. ఒక రకంగా ఇది ప్రతిపక్ష కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టిన చారిత్రిక విజయం. 230 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 163 చోట్ల విజయం సాధిస్తే, కాంగ్రెస్‌ 66 సీట్లకే పరిమితమైంది. ఒక స్థానాన్ని భారత్‌ ఆదివాసీ పార్టీ దక్కించుకుంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని, కాంగ్రెస్‌కు అవకాశాలున్నాయని ఎన్నికలకు ముందు వరకూ విశ్లేషకులు భావించారు. పోలింగ్‌ తర్వాత వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ అయితే బొటాబొటి మెజారిటీతో బీజేపీ అధికారం నిలుపుకుంటుందని చెప్పాయి. చివరకు అందరి అంచనాలు తలకిందులయ్యాయి.

నిజానికి మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఈ స్థాయి విజయం మాత్రం అనూహ్యమే. ఎందుకంటే మధ్యలో 15 నెలల కాంగ్రెస్‌ పాలనను మినహాయిస్తే రాష్ట్రంలో 20 ఏళ్లుగా బీజేపీదే అధికారం. ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత అంతో ఇంతో పెరిగే ఉండాలి. కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఆ రాష్ట్ర ఓటర్లు పూర్తి సానుకూలతతో ఇచ్చిన ఓటు ఇది. ఈ ఘనత కచ్చితంగా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌దే.. ప్రధాని మోదీ ప్రభావం దీనికి అదనం.

అంచనాలన్నీ ఉత్తి మాటలేనని చేతలలో చూపించారు శివరాజ్‌ సింగ్‌. కొద్ది నెలల క్రితం దాకా కూడా కొట్టొచ్చినట్టుగా కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకతను శివరాజ్‌ సింగ్‌ సమర్థంగా అధిగ మించిన వైనం అబ్బురపరిచేదే. ఈ విజయానికి దోహదం చేసిన అంశాలు ఎన్నో ఉన్నాయి.

క్షేత్రస్థాయి సమన్వయం

బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీలోని ముఖ్య నాయకులు మొదలు క్షేత్రస్థాయి కార్యకర్తల వరకూ ఎంతో శ్రమించారు. ఆటుపోట్లను తమకు అనుకూలంగా మలుచుకోవ డానికి, కేంద్ర మంత్రులు సహా అనేక మంది ప్రాంతీయ నేతలు, ఎంపీలను ఎన్నికల్లో పోటీ చేయిం చాల్సిన అవసరం ఉందని బీజేపీ ప్రారంభంలోనే అర్థం చేసుకుంది. వారిని పోటీకి దింపింది. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో శ్రమించారు.

మేరా బూత్‌ సబ్సే మజ్‌బూత్‌

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి స్వల్ప దూరంలో ఆగిపోయిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి బీజేపీ ముందు నుంచే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత జూలై నుంచే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా, మరో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆయనకు డిప్యూటీగా నియమించింది. ఇంకో మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా నియమించింది.

2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్రమోదీ భోపాల్‌లో ప్రారంభించిన ‘మేరా బూత్‌ సబ్సే మజ్‌బూత్‌’ ప్రచారం బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి దోహద పడిరది. బీజేపీ సంస్థాగత బలం, దాని హిందుత్వ కార్డు, ప్రధానమంత్రి అభివృద్ధి మంత్రం, ప్రచారంలో జాతీయ అహంకారం గురించి మాట్లాడటం బీజేపీకి బాగా పనిచేసినట్లు కనిపించింది.

‘లాడ్లీ బహ్నా’ పథకం

శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా ‘లడ్లీ బెహనా పథకం చుట్టూ బీజేపీ తన ప్రచారాన్ని నడిపించింది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం అందించే ‘లాడ్లీ బెహనా’ పథకాన్ని ప్రారంభించిన బీజేపీ మహిళా కార్డు అధికార పార్టీకి బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. దీనికి అదనంగా డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా ప్రజల హృదయాలను హత్తుకున్నాయని చెప్పవచ్చు.

మళ్లీ అధికారంలోకి వస్తే ‘నారీ సమ్మాన్‌’ నిధి పేరిట ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీకి ప్రతిగా లాడ్లీ బెహనా యోజన తీసుకొచ్చారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,250 చొప్పున ఇచ్చే ఈ పథకం బాగా హిట్టయింది. ఈ మొత్తాన్ని క్రమంగా నెలకు రూ.3,000కు పెంచుతా నని కూడా శివరాజ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 2.72 కోట్ల మహిళా ఓటర్లుంటే, ఏకంగా కోటిన్నర మంది మహిళలు దీని లబ్ధ్దిదారులు! ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చిందని భావిస్తున్నారు. అంతేగాక శివరాజ్‌పై అధిష్టానం అభిప్రాయాన్ని మార్చడం ద్వారా ఆయన్ను తిరిగి సీఎం అభ్యర్థి రేసులో బలంగా నిలిపింది.

కలిసొచ్చిన మోదీ ప్రచారం

ఈ విజయాన్ని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రధాని మోదీ ఘనతగా అభివర్ణించారు. ఆయన నేతృత్వంలోని ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’ వల్లే ప్రజలు బీజేపీపై విశ్వాసముంచారని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు కూడా విజయానికి బాటలు వేసినట్లు పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌ ప్రజల హృదయాల్లో ఉన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజల అభ్యున్నతికి తోడ్పాటునందించాయి. బీజేపీ శ్రేణులంతా కలిసికట్టుగా కష్టపడి పనిచేశాయి. రాష్ట్ర ప్రజల్లో అసలు ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత లేదు. ప్రజలంతా మాతోనే ఉన్నారు. కొంత మంది కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారు. కానీ, ప్రజలు మమ్మల్ని విశ్వసించారు’ అని అన్నారు.

అందరివాడు ఈ మామాజీ

మధ్యప్రదేశ్‌ ప్రజలు ‘మామాజీ’ అని అప్యాయంగా పిలుచుకునే శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ముఖ్య మంత్రిగా పేరుంది. రాజకీయాల్లో ఆయన అపార అనుభవశాలి. 2005 నుంచి సీఎంగా (2018-2020 మధ్య 15 నెలలు మినహా) కొనసాగు తున్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆయన్ను దాదాపుగా పక్కన పెట్టేసినంత పనిచేసింది. ఓ దశలో తన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నా ఆయన మనోధైర్యం కోల్పోలేదు. పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించి మరోసారి అధికార పీఠానికి బాటలు వేశారు. కాంగ్రెస్‌తో హోరాహోరీ ఉంటుందనుకున్న పోరును కాస్తా ఏకపక్షం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మధ్యప్రదేశ్‌ ఒక కుటుం బంగా మారిందని, ప్రజలు తమపై ఉన్న ప్రేమతో బీజేపీకి గ్రాండ్‌ మెజారిటీ వస్తుందని తాను ముందే చెప్పినట్లు శివరాజ్‌సింగ్‌ తెలిపారు. అది ప్రతిచోటా స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

నాలుగుసార్లు సీఎం

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మధ్యప్రదేశ్‌కి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మొదటిసారిగా 2005లో మొదటి సారిగా సీఎం అయ్యారు. ఆ తర్వాత 2008లో రెండోసారి, 2013లో మూడోసారి సీఎంగా చేసింది. 2018 ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 109 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ పార్టీ, ఇతర పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పార్టీ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ ముఖ్య మంత్రి అయ్యారు. అయితే 2020లో ఆ పార్టీ సీనియర్‌ జ్యోతిరాదిత్య సింధియా సహా 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం పడిపోయింది. దీంతో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామం తర్వాత ఈసారి మధ్యప్రదేశ్‌లో బీజేపీ సర్కారు మళ్లీ రావడం కష్టమని భావించినా, తన పని తీరుతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.

కాంగ్రెస్‌ సమన్వయ లోపం

శివరాజ్‌ సింగ్‌ వివాదాలకు దూరంగా నిరాడంబరతపై రాష్ట్ర ప్రజల్లో మొదటి నుంచీ ఉన్న సానుకూల భావన ఓట్ల రూపంలోనూ ప్రతి ఫలించింది. మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీని సమన్వయ రాహిత్యం ఈసారి బాగా దెబ్బ తీసింది. పీసీసీ చీఫ్‌ కమల్‌నాథ్‌, అగ్రనేత దిగ్విజయ్‌సింగ్‌ మధ్య విభేదాలు ప్రచార పర్వంలో పలుసార్లు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), జేడీయూ, ఆప్‌లకు రిక్తహస్తాలే మిగిలాయి.

దిగ్విజయ్‌కు ఘోర పరాభవం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌కు ఈ ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతు దారులలో చాలా మంది ఓటమిని చవిచూశారు. ఆయన సోదరుడు లక్ష్మణ్‌ సింగ్‌, మేనల్లుడు ప్రియవ్రత్‌ సింగ్‌ సహా చాలా మంది బంధువులు వారి వారి నియోజకవర్గాల్లో పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కొడుకు జైవర్ధన్‌ సింగ్‌ మాత్రమే రఘోఘర్‌ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఇక దిగ్విజయ్‌ మద్దతు దారులు అనేక మంది ఈ ఎన్నికల్లో మట్టికరిచారు. ముఖ్యంగా లహర్‌ నియోజకవర్గం నుంచి డాక్టర్‌ గోవింద్‌ సింగ్‌, రౌ నియోజకవర్గం జీతూ పట్వారీ ఓటమిపాలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను మాజీ సీఎం, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్‌ కలిశారు. రాజధాని భోపాల్‌లోని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నివాసానికి వచ్చిన కమల్‌నాథ్‌ ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. కమల్‌నాథ్‌ను సాదరంగా ఆహ్వానిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లారు.

ఓటమికి కమల్‌నాథ్‌ కారణం.. సంజయ్‌ రౌత్‌

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌ నాథ్‌ కారణమని శివసేన (ఉద్ధవ్‌) నాయకుడు సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ కొన్ని సీట్లను ఇండీ కూటమిలోని భాగస్వామ్యులతో పంచుకుని ఉంటే మరోలా ఉండేదన్నారు. సమాజ్‌ వాదీ పార్టీతో సీట్లు పంచుకోవాలనే ఆలోచనను కమల్‌నాథ్‌ వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నేతలు చురుగ్గా ప్రచారం చేసినప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఓటమికి కమల్‌నాథ్‌ కారణమని, విపక్ష కూటమితో కలిసి కాంగ్రెస్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు.

 – క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram