తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని బరిలో దిగిన భారతీయ జనతా పార్టీ తన విజయంపై ధీమాగా ఉంది. ప్రధాన రాజకీయ పక్షాలకు భిన్నంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని ప్రకటించడం, దశాబ్దాల తరబడి నానుతున్న ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించడం చారిత్రక అంశాలుగా భావిస్తోంది. వీటితో పాటు అనేక అంశాలపై కేంద్ర మంత్రి,పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి ‘జాగృతి’ తో ముచ్చటిస్తూ…

తెలంగాణ ఏర్పడిన తరువాత అసెంబ్లీకి మూడోసారి జరుగుతున్న ఎన్నికలివి. ఇంతకుముందు ఎన్నికలకీ, ఈ ఎన్నికలకీ ఉన్న తేడా ఏమిటి ?

గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది. ఈసారి మొదటిసారిగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్‌ డబ్బు, మద్యాన్నే ఎక్కువగా నమ్ముకుంది. బీజేపీ` కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు, బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చి పోటీ చేస్తోంది. కర్ణాటకలో అమలుకు సాధ్యంకాని సంక్షేమ పథకాల హామీలతో అధికారానికి వచ్చిన కాంగ్రెస్‌, ఇక్కడ ఆరు గ్యారెంటీల పేరుతో ఎక్కువగా ప్రచారం చేస్తోంది.

సూర్యపేట జనగర్జన, ఎల్‌బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మాదిగ ఉపకులాల విశ్వరూప సభల తరువాత మొత్తంగా వచ్చిన మార్పు ఏమిటి ? అది ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి?

గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళుతున్నాం. ఇదొక చారిత్రాత్మక, సాహసోపేత నిర్ణయం. డెబ్బై ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ బీసీ ముఖ్యమంత్రి కాలేదు. దీంతో పాటు గత మూడు దశాబ్దాలుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించి, న్యాయపరమైన చిక్కులను సత్వరం తొలగించి, పరిష్కారం చూపేందుకు కమిటీని ఏర్పాటు చేయడం వల్ల ఆ సామాజిక వర్గాల్లో బీజేపీ పట్ల విశ్వాసం పెరిగింది. ముఖ్యంగాఈ సామాజికవర్గం ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి స్వయంగా పాల్గొనడం గొప్ప విషయం. ఈ రెండు అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ కృషి చేస్తోంది.

తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కూడా తనవంతు కృషి చేసింది. స్వర్గీయ సుష్మాస్వరాజ్‌ను తెలంగాణ ప్రజలు ‘చిన్నమ్మ’ అని పిలుచుకునేటంత అనుబంధం కనిపించింది. అయితే బీజేపీ తెలంగాణలో ఎదగడానికి అది ఆశాజనకమైన పంథాలో ఉపయోగపడలేదు. అలాగే కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చినట్లు చెప్పుకుంటు న్నప్పటికీ ఆ పార్టీకీ ప్రజలు పట్టం కట్టడం లేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి.

పార్లమెంట్‌లో బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదన్నది పచ్చి నిజం. అయితే ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకుని 45 సీట్లకే పోటీచేయడం రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యం కాలేదు. అందుకే ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. తరువాతి (2018) ఎన్నికలకు ఆరు నెలల ముందే టీఆర్‌ఎస్‌ పార్టీ ‘రైతుబంధు’ వంటి కార్యక్రమాలను తెచ్చి, ముఖ్యంగా రైతుల్లో ఒకరకమైన అపోహ సృష్టించి ఓట్లు పొందింది. ఎన్నికల తరువాత ఆ అన్ని పథకాలు ప్రజలకు ఉపయోగపడకపోగా రాష్ట్రం అప్పులపాలైంది. దీనిని అర్థం చేసుకున్న ప్రజలు ఇప్పుడు ఆ పార్టీని ఓడిరచేందుకు సిద్ధం అయ్యారు. నాటి ప్రతికూల పరిస్థితులు ఇపుడు తెలంగాణ బీజేపీకి లేవు. కేంద్రంలో మోదీ నాయకత్వంలోని సుస్థిర ప్రభుత్వం, పథకాలు ఇక్కడ బీజేపీకి లాభించనున్నాయి. ఏ అశయంతో తెలంగాణ ఉద్యమం సాగిందో ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల బీఆర్‌ఎస్‌ పైన వ్యతిరేకత పెరిగింది. అది బీజేపీ గెలుపునకు ఉపకరిస్తుంది.

కాళేశ్వరం (మేడిగడ్డ) బ్యారేజీ కుంగుబాటు ఉదంతాన్ని ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎలా చూస్తున్నది?

లక్ష ముప్పైఅయిదు వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లో భాగం అయిన మేడిగడ్డ బ్యారేజ్‌ వద్ద పిల్లర్లు కుంగి పోవడంతో మొత్తం కాళేశ్వరం అస్తిత్వమే ప్రశ్నార్థ్ధ కంగా మారింది. ఉత్తర తెలంగాణలోని గోదావరి జలాలను ఉపయోగించుకోడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు 15 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుతో పాటు 15 లక్షల ప్రస్తుత ఆయకట్టును స్థిరీక రించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. మేడిగడ్డ నుండి నీటిని లిఫ్ట్‌ చేయాలని సంకల్పించిన ఈ ప్రాజెక్టులో అక్కడే నీటిని నిలుపలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల అంత వ్యయమూ గోదావరిలో కొట్టుకు పోయినట్లుగానే బీజేపీ భావిస్తోంది. అందుకే బీజేపీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం మీద పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమయిన చర్యలు తీసుకుంటాం.

కేంద్ర పథకాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనవిగా చెప్పుకుంటున్నది.ఈ అంశం సరైన వాస్తవాలతో ప్రజల దగ్గరకు ఎందుకు చేరలేకపోయింది.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తోంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకూ, రాజ్యాంగపరంగా రావలసిన నిధులను విడుదలచేస్తూ అనేక ప్రాయోజిత కార్యక్రమాలను చేపడుతోంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అమలు చేయాల్సి ఉండగా, ఈ పథకాలను తనవిగా ఈ ప్రభుత్వం చెప్పుకుంటోంది. బీజేపీ కార్యకర్తలు శక్తి కొలదీ ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు వాస్తవాలను తెలసుకుంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిననాటికి ఇది మిగులు రాష్ట్రం. దానిని బీఆర్‌ఎస్‌ అప్పుల రాష్ట్రంగా మార్చింది. ఈ అంశాన్ని బీజేపీ ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్లింది ?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి మిగులు రాష్ట్రం అని చెప్పుకున్నప్పటికీి రాష్ట్ర విభజన ద్వారా రూ.57వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం వంతు అప్పుగా నిర్ణయించారు. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పూర్తిగా బ్యాంకులు సహా వివిధ ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న అప్పుల ద్వారానే అమలు చేశారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు, కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులన్నీ కలపి రూ.6లక్షల కోట్లకుపైగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయవనరులు పెంచుకోకపోగా పథకాల అమలుకు అప్పులు లేదా అస్తుల అమ్మకంపైనే పూర్తిగా ఆధారపడిరది. ఒకరకంగా  తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పవచ్చు. చేసిన అప్పులకు ఏటా రూ. 60 వేల కోట్లు వడ్డీగా చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా, ఏకపక్షంగా చేపట్టిన అనేక ప్రాజెక్టుల ఫలితం ప్రజలకు అందక పోగా వారికి అప్పులు మిగిలాయి.

ఆలయ భూములు అమ్ముతానని, వక్ఫ్‌ బోర్డును కాపాడుతానని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ‘ముస్లిం డిక్లరేషన్‌’పై బీజేపీ స్పందన ఏమిటి?

బీజేపీ దృష్టిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే. లౌకికవాదం పేరుతో ముస్లిం, మైనార్టీ సంతష్టీ కరణతో వారి ఓట్ల కోసం ఎంతకైనా దిగజారు తున్నారు. వీరు రాజ్యాంగంలోని సెక్యులరిజాన్ని మరిచిపోయి రాజకీయ సెక్యులరిజాన్ని అమలు చేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన సెక్యులరిజం నిర్వచనాన్ని ఈ రెండు పార్టీలూ తుంగలో తొక్కుతున్నాయి. హిందూ దేవాలయాల ఆదాయం నుంచి ధూపదీప నైవేద్యానికి సైతం నిధులు కేటాయించకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నాయి. ఇతర మతాల కార్యక్రమాలకు మాత్రం ప్రభుత్వ నిధులు ఇస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగ బద్ధ సెక్యులరిజాన్ని తప్పక అమలు చేసి అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుంది.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రకటించిన ఉచిత పథకాల గురించి ఏమంటారు?

‘సంక్షేమం, అభివృద్ధి’ బండికి రెండుచక్రాలుగా ముందుకు పోవాలని బీజేపీ కోరుకుంటోంది. నిజమైన పేదలకు సంక్షేమ పథకాలు పూర్తిగా అందాలని భావిస్తోంది. సమాజం లోని అత్యంత పేద వారికి మొదటి అవకాశం కల్పించాలన్నదే బీజేపీ మూలసిద్ధాంతం. పన్నుల రూపంలో ప్రజలు కట్టే సొమ్ము అర్హులయిన పేదలకు అందాలన్నదే బీజేపీ లక్ష్యం. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రకటించిన ఉచితాలు ఓట్లవేటలో ఇస్తున్నవే. అధికారమే లక్ష్యంగా ప్రకటిస్తున్నవే.

బీజేపీలో అసమ్మతి మాట వినిపిస్తున్నది. దీనిని ఎలా అధిగమిస్తారు?

అది మీడియా సృష్టే. ప్రతి బీజేపీ కార్యకర్త ఒక సిద్ధాంతంతో కలిసికట్టుగా పనిచేస్తాడు. ఐక్యతే మా పార్టీ విజయ రహస్యం. కార్యకర్తలు, నాయకులు అందరూ సమష్టిగా పనిచేస్తున్నారు. పార్టీలో కొత్తగా వచ్చిన వారితో పాత వారికి కొంత అసమ్మతి ఉన్నా, పూర్తిగా అధిగమించాం. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుంది.

మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి ?

రాష్ట్రంలో 58% ఉన్న బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తున్నాం, దశాబ్దాలుగా ఫలాలకు నోచుకోని ఎస్సీ ఉపకులాల వర్గీకరణతో దళిత సాధికారతకు కృషి చేస్తున్నందుకు, మోదీ ప్రభుత్వం తెలంగాణలో కొనసాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ అక్రమాలపై బీజేపీ శ్రేణులు చేసిన పోరాటాలే తెలంగాణలో బీజేపీకి అధికారం అందిస్తాయి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram