‘జాగృతి.. అమృత భారతి’ని ఆవిష్కరించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

చిన్నతనం నుంచి విరివిగా పత్రికలు చదవడం వల్ల రాజకీయాలపట్ల,ఉద్యమాలపట్ల ఆసక్తి ఏర్పడిరదని, ‘జాగృతి’ జాతీయ వారపత్రిక అధ్యయనం వల్ల రాజకీయాలలో మనుగడ సాగించగలిగానని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశహితం, సత్యప్రచారం కోసమే ఈ పత్రిక ఆవిర్భవించిందని ఆయన అన్నారు. నవంబర్‌ 11 సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ‘జాగృతి’ దీపావళి`2023 ప్రత్యేక సంచిక ‘జాగృతి.. అమృత భారతి’ని ఆయన ఆవిష్కరించారు. 75 సంవత్సరాల క్రితం ప్రచురణ ఆరంభించిన ‘జాగృతి’, ఇప్పుడు స్వతంత్ర భారతదేశ చరిత్రను తన వ్యాసాల ద్వారా ఈ సంచికతో అందించింది. అధికారంలో ఉన్నవారు చెప్పిందే చరిత్ర కాదని, అందుకు ఆధారాలు, పరిశోధన, విశ్లేషణ ఉండాలని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కోణంలో ‘జాగృతి’ తన వంతు పాత్రను ఈనాటికీ పోషిస్తున్నదని చెప్పారు. మనకంటూ ప్రచారం అవసరం లేకున్నా, సమాచారం చేరవేయడానికి పత్రికా వ్యవస్థ అవసరమని గురూజీ భావించారని, ఆ విధాన నిర్ణయం మేరకు ప్రాంతీయ భాషలలో ఆరంభమైనవే యుగధర్మ, పాంచజన్య, జాగృతి అని మాజీ ఉపరాష్ట్రపతి చెప్పారు. పత్రికా పఠనం ప్రజల నిత్యజీవితంలో ఒక భాగమని, అందునా ‘జాగృతి’ లాంటి నిష్పక్షపాత సమాచార పత్రికలను ఆదరించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. చిన్నపత్రికలను, అందునా మాతృభాషలో ఉన్న పత్రికలను ప్రోత్సహించడం అందరి కర్తవ్యమని చెప్పారు.

 ‘ఆర్‌ఎస్‌ఎస్‌ మీద నిషేధం కొనసాగుతుండగానే 1948 డిసెంబర్‌ నెల మధ్యలో ‘జాగృతి’ విజయవాడ నుంచి ప్రచురణ ప్రారంభించింది. తొలి సంచికనే నిషేధించారు. మళ్లీ మూడు వారాల తరువాత నిషేధం ఎత్తివేశాక పునఃప్రారంభమైంది. అటు నెహ్రూ, పటేల్‌ వంటి పెద్దలు ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల తీవ్ర వైమనస్యం ప్రదర్శిస్తున్నప్పటికీ రాష్ట్రంలో పట్టాభి, కొండా వెంకటప్పయ్య వంటివారు ‘జాగృతి’కి అభినందనలు తెలిపారు. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి వంటి వారు ఆశీస్సులు ఇచ్చారు. తరువాత మళ్లీ అత్యవసర పరిస్థితి కాలంలో (1975) కూడా ఈ పత్రిక నిషేధాన్ని చవి చూసింది. అయోధ్య కట్టడం కూలిన డిసెంబర్‌ 6, 1992 తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించినప్పటికి ‘జాగృతి’ వెలువడిరదని ఆయన చరిత్రను గుర్తు చేశారు.

75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జరిగిన ప్రతి రాజకీయ, సామాజిక పరిణామాన్ని ‘జాగృతి’ తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. కశ్మీర్‌, గోరక్షణ, గోవా స్వాతంత్య్ర పోరాటం, అంతర్జాతీయ సమస్యలు, కమ్యూనిస్టు వ్యతిరేక ఉద్యమం, అయోధ్య వంటి అన్ని అంశాల మీద విస్తృతంగా వ్యాసాలు ప్రచురించింది. సాహిత్యం, సైన్స్‌, కళ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్‌లు దేనినీ విడువకుండా ఒక యజ్ఞంలా వ్యాఖ్యానిస్తూ వచ్చింది. దీనదయాళ్‌ ఉపాధ్యాయ, సావర్కర్‌, లాల్‌ బహదూర్‌శాస్త్రి వంటి వారి దుర్మరణాల గురించి ప్రత్యేక శ్రద్ధతో విశ్లేషణలు అందించిందని ఆయన చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరణతోనే పనిచేసే భారతీయ జనసంఫ్‌ు, విశ్వహిందూ పరిషత్‌, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌, భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు, వనవాసీ కల్యాణ్‌ ఆశ్రమ్‌ వంటి అనుబంధ సంస్థలన్నింటి గురించి, వాటి సేవాకార్యక్రమాల గురించి ఎంతో సమాచారం అందించింది. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజపేయి, దత్తోపంత్‌ ఠేంగ్డీ, సుచేతా కృపలానీ, జేబీ కృపలానీ వంటి వారందరి వ్యాసాలు ఇందులో కనిపిస్తాయి. చరిత్ర గురించి ‘జాగృతి’ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. భారతదేశ చరిత్రను వక్రీకరిస్తున్న సంగతి ఈ పత్రిక 75 ఏళ్ల క్రితమే గ్రహించింది. వందలాది చారిత్రక కథలు, కొన్ని చారిత్రక నవలలు, చరిత్ర వ్యాసాలు కూడా సంచికలలో విరివిగా కనిపిస్తాయి. పదునైన రాజకీయ వ్యాసాలు, సునిశిత సంపాదకీయాలు జాగృతి ప్రత్యేకం. విదేశాంగ విధానం, దేశ భద్రత, అణువిధానం మీద ‘జాగృతి’ ఎంతో చర్చ జరిపింది. ఏ విధంగా చూసినా ‘జాగృతి’ ఒక విజ్ఞాన సంపద. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రను వాస్తవికంగా చిత్రించిన పత్రిక జాగృతి అని ఆయన కొనియాడారు.

 సంపాదకులు ఏ ఆలోచనా ధోరణికి చెందినప్పటికీ, సంపాదక స్థానంలో కూర్చున్నప్పుడు మంచి న్యాయమూర్తిగా వ్యవహరించాలని కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంపాదకుడు డాక్టర్‌ కె. రామచంద్రమూర్తి అన్నారు. సంపాదకీయం అంటే పత్రిక హృదయమేనని అన్నారు. సంపాదకుడు ఏ అభిప్రాయాలతో ఉన్నప్పటికీ విషయాన్ని విశ్లేషించి సమాజ హితం కోరే సందేశం ఇవ్వాలని ప్రముఖ న్యాయనిపుణులు వీఆర్‌ కృష్ణయ్యర్‌ ఒక సందర్భంలో అన్నారని ఆయన గుర్తు చేశారు. అప్పుడే సంపాదకీయాలకు గౌరవం ఇనుమడిస్తుందని చెప్పారు. సంపాదకులు, పత్రికలు సమాజహితాన్ని కోరి వర్తమానాన్ని పరిశీలిస్తూ భవిష్యత్తుకు మార్గదర్శనం చేయాలని అన్నారు.

జాతీయ దినపత్రికలకు సంపాదక బాధ్యతలు నిర్వర్తించిన కోటంరాజు రామారావు, మానికొండ చలపతిరావు, ఖాసా సుబ్బారావు లాంటి తెలుగువారు ఆ కోణంలో కృతకృత్యులయ్యారని గుర్తు చేశారు. ప్రస్తుత ‘సంచలన వార్తా కథనాల’యుగంలో ‘జాగృతి’ జాతీj వార పత్రిక అదే పంథాను కొనసాగించడం అభినందనీయమని డా.రామచంద్రమూర్తి అన్నారు.

‘జాగృతి’ దీపావళి-2023 ప్రత్యేక సంచిక గురించి సంపాదకుడు డా. గోపరాజు నారాయణ రావు పరిచయం చేస్తూ, ఇది స్వతంత్ర భారత దేశ చరిత్రకు ప్రతిబింబమని అన్నారు. ‘స్వతంత్ర భారత్‌ అంత ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం గల ‘జాగృతి’ ఆయా సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. వాటిని నిర్భీతితో, నిష్కర్షగా , నిర్మాణాత్మక విమర్శ, విశ్లేషణలతో పాఠకులకు అందిం చింది. ముఖ్యంగా దేశ విభజన నాటి పరిస్థితులను కూలంకషంగా చర్చించి మరుగునపడిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. పత్రికలకు దార్శనికత ప్రధానమనే వాక్కు జాగృతి విషయంలో అక్షరాల రుజువైంది. ఆంధ్రకు రాజధాని ఏది? అనే సందిగ్ధ పరిస్థితే అందుకు ఉదాహరణ. మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయినప్పుడు (1953) రాజధాని విషయంలో సాగిన తర్జనభర్జనలు,చర్చోపచర్చలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేరు పడిన తరువాత (2023) పునరావృతమవుతున్నాయి’ అన్నారు. దేశ చరిత్రలో మొదటి నుంచి వక్రీకరణలు చోటు చేసుకున్నాయని, చరిత్రకారులు కొన్ని పరిమితులు, ఒత్తిళ్లకు లోబడే సంఘటనలు నమోదు చేశారని డా.గోపరాజు అన్నారు. ఈ విషయంలో అకాడమీలు, విశ్వవిద్యాలయాలూ తగినంతగా కృషి చేయలేదనే వ్యాఖ్యానాలు ఉన్నాయని చెప్పారు. ఆ లోటును భర్తీ చేయడానికి అన్నట్లు ‘జాగృతి’ ఇతర శీర్షికలతో పాటు చారిత్రక సంఘటలను, చారిత్రక కథలకు ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. .

 ఏ పత్రిక, ఏ రచయితైనా త్రికాలాలను అన్వయించి చూడాలని, అప్పుడే ఈ కృషి సార్థకమవుతుందని సభకు అధ్యక్షత వహించిన జాగృతి ప్రకాశన్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు డాక్టర్‌ చిలుకమారి సంజీవ అన్నారు. గతాన్ని గుర్తు చేసుకుంటూ, వర్తమానాన్ని పరిశీలిస్తూ భవిష్యత్‌ను మదింపు చేయడం మాధ్యమాల లక్షణమని, ‘జాగృతి’ దానిని కచ్చితంగా పాటిస్తూ వస్తోందని చెప్పారు. ‘గతాన్ని కాదనలేను/వర్తమానం వద్దనబోను/భవిష్యత్తును వదులుకోను/’అన్న మహాకవి దాశరథి ‘పునర్నవం’ కవితా ఖండిక పంక్తులను అన్వయించి చెప్పారు.

ఎన్నో ప్రత్యేక సంచికలు తీసుకువచ్చిన జాగృతికి ఇప్పుడు ఈ సంచిక మరింత ప్రత్యేకమని అన్నారు. ట్రస్ట్‌ కార్యదర్శి పులిగడ్డ రాఘవేంద్ర స్వాగతం పలికారు. ‘జాగృతి మాజీ సంపాదకులు డాక్టర్‌ వడ్డి విజయసారథి వేదికనలంకరించారు.


మచిలీపట్నంలో

జాతీయ భావాలకు కట్టుబడి 75 ఏళ్లుగా తెలుగు పత్రికా రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న జాగృతి పాఠకుల సంఖ్యను మరింతగా పెంచుకుంటూ శతజయంత్యోత్సవాలు కూడా జరుపుకోవాలని పళపతి సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు. జాగృతి అమృతోత్సవాల సందర్భంగా వెలువరించిన దీపావళి ప్రత్యేక సంచిక`2023 ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ నవంబర్‌ 13న మచిలీపట్నంలో (రాబర్ట్‌సన్‌ పేట) వేంచేసి ఉన్న  శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో జరిగింది. సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో జాగృతి పత్రిక తనదైన పాత్ర పోషిస్తోందని సభకు అధ్యక్షత వహించిన బ్రహ్మశ్రీ విష్ణుబళ్ల సూర్యనారాయణశర్మ  కొనియాడారు. గడిచిన 75 సంవత్సరాల దేశ చరిత్ర మొత్తం ఈ ప్రత్యేక సంచికలో, ఈ ఒక్క పుస్తకం చదవటం వల్ల తెలుసుకోవచ్చు అని కొమరగిరి చంద్రశేఖర్‌  వ్యాఖ్యానించారు. సంచికను పరిచయం చేస్తూ, వారపత్రికలు, పక్ష పత్రికలు మాస పత్రికలు దేశ చరిత్రకి డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ అని చెప్పారు. జర్నలిజంలో జాగృతి 75 సంవత్సరాలుగా నిస్పాక్షికమైన పాత్ర పోషిస్తోందని, అందుకు ఉదాహరణ: 1965 యుద్ధ సమయంలో లాల్‌బహుదూర్‌శాస్త్రినీ, బంగ్లాదేశ్‌ యుద్ధ సమయంలో ఇందిరాగాంధీనీ కొనియాడిన జాగృతి, ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇందిరాగాంధీని విమర్శించేందుకు వెనుకాడలేదని ఆయన గుర్తు చేశారు. ఈ సంచికను సమీక్ష చేసే అవకాశం నాకు ఇచ్చి ఉండకపోయి ఉంటే ఈ చరిత్రని  తెలుసుకునే సదవకాశం తనకు వచ్చి ఉండేది కాదని, ఇలాంటి అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. చరిత్ర అధ్యాపకులు సవరణ వెంకటేశ్వరరావు తన స్పందన తెలియజేస్తూ, ఎన్నో పత్రికలలో నిష్పాక్షికమైన సంపాదకీయం కనుమరుగైనప్పటికీ జాగృతి నిష్పక్షపాత సంపాదకీయాలతోనే అమృతోత్సవం జరుపుకుందని అన్నారు. సమ్మెట సురేష్‌ కుమార్‌ స్వాగతం పలికారు. కాపూర్‌ చంద్రశేఖర్‌ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో వాసుదేవరావు, శ్రీకాంత్‌, గాంధీ, సత్యనారాయణమూర్తి, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

About Author

By editor

Twitter
Instagram