– సలీం

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన

చీకటి.. గదినిండా దట్టంగా అల్లుకున్న చీకటి.. నా మనసులో కూడా చీకటి.. ఆనందాల హరివి ల్లులు విరిసిన నా జీవితాకాశంలో ఒక్కసారిగా వొలికిపోయిన చీకటి.. నా నరనరాల్లో పాకుతూ విషాదం..అయాన్‌కి ఆటిజం స్పెక్ట్రవ్‌ు డిజార్డర్‌ ఉందని ఉదయం డాక్టర్‌ చెప్పగానే భళ్లున పగిలి, వేయి ముక్కలైన నా మాతృ హృదయం.. అయాన్‌ కిపుడు రెండున్నరేళ్లు. వాడు పుట్టిన క్షణం నుంచి డాక్టర్‌ ఆ మాట చెప్పేక్షణం వరకు ఎన్ని స్వర్గాలు నా ఒళ్లో వాలిన ఆనందాన్ని అనుభవించానో..

వాడు పుట్టిన రోజు.. ఎంత తీయటి జ్ఞాపకమో.. ఓ బిడ్డకు జన్మనివ్వడం ఎంతటి మధురమైన అనుభూతినిస్తుందో అనుభవంలోకి వచ్చిన రోజది. నా పక్కలో పడుకోబెట్టిన బాబుని చూసుకోగానే, స్వర్గం దిగొచ్చి మంచం మీద వాలినట్టనిపించింది. వాడెంత ముద్దుగా ఉన్నాడో.. ఎంతందంగా ఉన్నాడో.. వాడి కళ్లు చూశారా? విచ్చుకున్న తెల్ల కలువల్లా ఉన్నాయి కదూ.. అచ్చం నాపోలికే.. పెదవులు చూశారా.. లేత గులాబీపూల మృదువైన రెక్కల్లా ఉన్నాయి కదా!అంటూ మురిసిపోతుంటే నా భర్త కూడా ఆ ఆనందంలో పాలు పంచుకున్నాడు.

బాబుని చూసుకోవడం కోసం నేను చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి యేడాదిపాటు శెలవు పెట్టాను. నాకు తోడుగా అమ్మను పిలిపించుకున్నాను. పేరు పెట్టే విషయంలో నాకూ మాఆయనకు మధ్య పెద్ద గొడవైంది. అతను పెడ్దామన్న పేర్లేవి నాకు నచ్చలేదు. నా కొడుకు అందానికి తగ్గట్టు ఉండాలి కదా పేరు.. కొన్ని వందల పేర్లు వెతికి, చివరికి అయాన్‌ అని పెట్టాము.

మొదటి పుట్టినరోజుని ఎంత ఘనంగా జరిపామో.. ఫంక్షన్‌కి వచ్చిన నా సహోద్యోగులు అయాన్ని ఎత్తుకుని ముద్దుచేస్తూ ‘‘అయాన్‌! అయాన్‌! అని ఎంత పిలిచినా పక్కకు తిరిగి చూడడేమిటి? అందంగా ఉన్నాడని పొగరా? ఈ విషయంలో కూడా అచ్చం నీపోలికే’’ అంటూ నవ్వారు.

అయాన్‌కి మూడో నెలలోనే దేశంలో కరోనా సంక్షోభం మొదలైంది. నా శెలవు ముగిసిపోయాక, వర్క్‌ ఫ్రం హోం చేయసాగాను. అయాన్‌ ఎంత బుద్ధిమంతుడో.. అల్లరి చేసేవాడు కాదు. తన పాటికి తను ఆడుకునేవాడు. వాడి కోసం యూట్యూబ్‌లో రైవ్స్‌ు పెడితేచాలు.. వాడి మొహం వింత తేజస్సుతో వెలిగిపోయేది. వాడి మొహంలో విచ్చుకునే ఆనందం చూడటం కోసమైనా టీవీ పెట్టాలనిపించేది..

వాడికి బంతుల్తో ఆడుకోవడం ఇష్టమని, అమెజాన్‌ నుంచి పాతిక బంతులు తెప్పించాను. వాటిని వరసగా పేర్చి, నా వైపు ఏదో ఘనకార్యం చేసినట్టు చూస్తాడు. నేను చప్పట్లు కొడుతూ ‘‘వావ్‌ అయాన్‌.. గ్రేట్‌’’ అనగానే వెన్నెల కురిసినట్టు నవ్వేవాడు. నా వర్క్‌ ఫ్రం హోంకి అడ్డురాకుండా ఉన్నందుకు ఎంత ముచ్చటేసేదో..

వాడి రెండో పుట్టిన రోజుకి అమ్మ ఊర్నుంచి వచ్చింది. ‘‘రెండేళ్లు నిండుతున్నా మాట్లాడటం లేదేమిటమ్మా.. అమ్మా, తాతా అని కూడా పలకడం లేదేందుకు’’ అని అమ్మ నడిగాను.

‘‘నీ తమ్ముడికి నాలుగో యేడు నిండాకే మాట లొచ్చిన విషయం మర్చిపోయావా? మేనమామ పోలిక వచ్చి ఉంటుంది’’ అంది అమ్మ.

అలా అనడంతో అప్పటివరకు మనసులో ఉన్న బెంగ కొద్దిగా ఉపశమించింది. వాడి వయసున్న పిల్లలు మాట్లాడుతుంటే చూసి ఎంత దిగులేసేదో.. ఆడపిల్లల్తో పోలిస్తే మగపిల్లలకు మాటలు కాస్త ఆలస్యంగా వస్తాయి కదా! అనుకుని మొదట్లో సమాధానపడేదాన్ని. కానీ మా కొలీగ్స్‌ వాళ్ల మగపిల్లలు ఏడాదిన్నరకే మాట్లాడటం చూసి, అయాన్ని తల్చుకుని భయమేసేది. వాళ్లు అమ్మానాన్నల్తో బైబై చెప్పేవాళ్లు. అయాన్‌ చేత బైబై చెప్పించడానికి ఎంత ప్రయత్నించానో.. చేతిని పట్టుకుని వూపుతూ ‘‘బై బై అను’’ అని నేర్పబోతుంటే చేతిని బలంగా లాక్కుని, వెళ్లిపోయి తన ఆట వస్తువుల్ని వరసగా పేర్చడంలో నిమగ్నమైపోయేవాడు. బంతుల్నే కాదు బొమ్మకార్లు, బొమ్మ బస్సులు..ఏవి కొనిచ్చినా వాటిని వరసగా పేరుస్తాడు

ఒకానొక సమయంలో వాడికి వినికిడి సమస్య ఏమైనా ఉందేమోననే అనుమానం వచ్చింది. మాటలు రావాలంటే మొదట శబ్దాలు విన్పించాలి కదా. ఎన్నిసార్లు ‘‘అమ్మా  అను.. తాతా అను’’ అంటూ వాడికికన్పించేలా నోరు పెద్దగా తెరిచి పలికినా లాభం ఉండేది కాదు. వాడు తల తిప్పేసుకుని, పక్క గదిలోకెళ్లి ఒంటరిగా కూచుని ఆడుకునేవాడు. వాడికి విన్పిస్తుందో లేదో తెల్సుకోవడం కోసం వాడి వెనక స్టీల్‌గ్లాసుని కింద పడేశాను. వాడు చప్పున తల తిప్పి చూసి, మళ్లా తన ముందున్న వస్తువుల్ని ఒక వరసలో పెట్టడంలో మునిగిపోయాడు.

ఎంత రిలీఫ్‌గా అన్పించిందో.. హమ్మయ్య.. వాడికి చెవులు బాగానే పని చేస్తున్నాయి. ఇప్పుడు కాకున్నా ఎప్పటికైనా మాట్లాడతాడన్న నమ్మకం ఏర్పడిరది. ప్రతి ఆదివారం నేనూ మాఆయన కలిసి వాణ్ణి పార్కులకు తీసుకెళ్లి ఆడిరచే వాళ్లం. వాడు మిగతా పిల్లల్తో కలిసి ఆడేవాడు కాదు. వాళ్లకు దూరంగా వెళ్లి ఆడుకునేవాడు. ‘‘నా కొడుక్కి చూశారా ఎంతటి ఇండివిడ్యువాలిటీనో.. వాడికి నాలానే మనుషుల్తో కలవడం ఇష్టం ఉండదనుకుంటా. ఇప్పటి నుంచే ఏకాంతాన్ని ప్రేమిస్తున్నాడన్మాట’’ అంటూ మురిసిపోయేదాన్ని.

మరో ఆర్నెల్లు గడిచిపోయాయి. అయాన్‌లో ఎటువంటి మార్పుా లేదు. ఈ మధ్య ముంగాళ్లమీద నడవడం నేర్చుకున్నాడు. వాడికదో సరదా అనుకున్నాను. వాడికెంత తెలివో.. అన్నం తినాలంటే టీవీలో యూట్యూబ్‌ పెడితే సరిపోదు. అందులో వాడికి ఇష్టమైన రైమ్సే పెట్టాలి. లేకపోతే నోరు తెరవడు. ఇష్టం లేని రైవ్స్‌ు పెడ్తే చాలు, వాడి మొహంలో కోపం, చిరాకు కన్పిస్తాయి. వాడికి నచ్చిన రైవ్‌ు తెరమీద కన్పించగానే మొహం ప్రశాంతంగా మారిపోతుంది. లేచి నిలబడి గాల్లో చేతులూపుతూ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. ఏదేమైనా నా కొడుకు అందరిలాంటి వాడు కాదు. వాడు స్పెషల్‌ కిడ్‌ అనుకున్నాను తప్ప ఆ ప్రవర్తనలో ఏదో జబ్బు దాగుందన్న విషయం అప్పుడు నాకు తెలియలేదు.

అయాన్‌కి జలుబూ దగ్గు… డాక్టర్‌ నర్సింగరావు క్లినిక్‌కి తీసుకెళ్లాం .చిన్నప్పటి నుంచి అయాన్‌కి ఏ అనారోగ్యం వచ్చినా మేము ఆ డాక్టర్‌ దగ్గరకే వెళుతుంటాం. ఆయన వెయిటింగ్‌ లాంజ్‌లో చాలామంది తల్లులు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. నెలల పిల్లలు తల్లుల ఒళ్లల్లో ఉంటే, రెండు మూడేళ్ల వయసున్న పిల్లలు లాంజ్‌లో పరుగెత్తుతూ ఆడుకుంటున్నారు. అయాన్ని నాకు కూడా కిందకు దింపాను. వాడి దగ్గరకు మూడేళ్ల పాప వచ్చి నిలబడిరది. వాడు వెనక్కి తిరిగి పరుగెత్తాడు. ఆ పాప కూడా వాడి వెనకే పరుగెత్తింది. వాడు నిలబడగానే నవ్వుతూ వాణ్ణి ముట్టుకోబోయింది. అయాన్‌ ఆ పాపను నెట్టేసి, దూరంగా వెళ్లి నిలబడ్డాడు.

ఇదంతా తన ముందున్న సీసీ టీవీలో డాక్టర్‌ గారు గమనిస్తున్నారన్న విషయం మాకు తెలియదు. మా వంతు రాగానే అయాన్ని ఎత్తుకుని, నేనూ నా భర్తా లోపలికెళ్లాం. ఎప్పుడూ నవ్వుతూ కన్పించే డాక్టర్‌గారు ఎందుకో ముభావంగా కన్పించారు.

‘‘మా బాబుకి నిన్నటి నుంచి జలుబు డాక్టర్‌గారూ. దగ్గు కూడా విపరీతంగా ఉంది’’ అన్నాను.

‘‘వర్షాకాలం మొదలైంది కదమ్మా. జలుబులు జ్వరాలు మామూలే’’ అంటూ స్టెత్‌తో బాబుని పరీక్షించాడు. డాక్టర్‌ స్టెత్‌ని బాబు ఛాతీ మీద పెట్టబోతుంటే, వాడు భయంతో పెద్దపెద్దగా కేకలు పెట్టసాగాడు.

‘‘హలో అయాన్‌.. ఇంతకు ముందు చాలాసార్లు వచ్చావుగా. ఇప్పుడు కొత్తగా ఎందుకు భయపడ్తున్నావు?’’ అంటూనే డాక్టర్‌ పరీక్ష చేయడం పూర్తి చేశాడు.

మందులు రాసిస్తూ మధ్యలో తలయెత్తి, ‘‘బాబుకి ఆటిజం అనే సమస్య ఉందనిపిస్తోందమ్మా. ఓసారి ఆటిజం ఎవాల్యుయేషన్‌ టెస్ట్‌ చేయించండి’’ అన్నాడు.

ఆ మాట వినగానే గుండెల్లో శతఘ్ని పేలినట్టు భయపడిపోయాను. ఆటిజమా? నా కొడుక్కి ఆటిజం సమస్య ఉందా? చాలా ఆరోగ్యంగా ఉన్నాడు కదా. అసలీ ఆటిజం ఏమిటి? ఎప్పుడూ వినలేదే..

‘‘ఆ జబ్బు నా కొడుక్కి ఉందని ఎలా చెప్తున్నారు డాక్టర్‌? మీరేమీ టెస్టులు చేయలేదే. నా కొడుకు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు కదా’’ కళ్లలో నీళ్లు పొంగుకొస్తుండగా అడిగాను.

‘‘ఆటిజం అనేది జబ్బు కాదమ్మా. అదొక డిజార్డర్‌. దాన్ని నిర్థారించడానికి రక్తపరీక్షల్లాంటివి ఏవీ లేవమ్మా. పిల్లల ప్రవర్తనని పరిశీలించడం ద్వారా గుర్తించ వచ్చు. ఇందాక మీ అబ్బాయి పిల్లల్తో కలవకుండా ఒంటరిగా ఆడుకోవడాన్ని సీసీ టీవీలో గమనించాను. ఐ కాంటాక్ట్‌ కూడా తక్కువగా ఉంది. నేను ‘హల్లో అయాన్‌’ అని ఎన్నిసార్లు పిలిచినా నా వైపు చూడలేదు. స్టెత్‌ని గుండెల మీద పెట్టబోతుంటే మిగతా పిల్లలు దానివైపు కుతూహలంతో చూస్తారు. దాన్ని ముట్టుకుంటారు. దాంతో ఆడుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ వీడు నన్ను చూసి భయపడి ఏడ్చాడు గమనించారా? ఇవన్నీ ఆటిజం స్పెక్ట్రవ్‌ు డిజార్డర్లో కన్పించే లక్షణాలే’’ అన్నాడు డాక్టర్‌.

నాకు కన్నీళ్లు బొటబొటా కారిపోతున్నాయి. ‘‘ఈ ఆటిజం ఎందుకొస్తుంది డాక్టర్‌?’’ ఏడుస్తూనే అడిగాను.

‘‘చాలా కారణాల వల్ల రావొచ్చమ్మా. జెనెటికల్‌గా రావొచ్చు. కడుపుతో ఉన్న సమయంలో వచ్చిన జబ్బులు, వాడిన మందులు కారణం కావొచ్చు. గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల వయసు ఎక్కువగా ఉండటం వల్ల కావొచ్చు. ఎన్విరాన్మెంటల్‌ కారణాలు కూడా కావొచ్చు.’’

‘‘మా అబ్బాయికి ఏ కారణం వల్ల వచ్చిందంటారు?’’ నా భర్త అడిగాడు.

‘‘ఇదీ కారణమని కచ్చితంగా చెప్పలేం’’ అంటూ నా వైపు తిరిగి ‘‘మీరు ఉద్యోగం చేస్తున్నారా?’’ అని అడిగాడు.

‘‘చేస్తున్నాను డాక్టర్‌. కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ని. డెలివరీ సమయంలో శెలవు పెట్టాను. బాబుకి ఏడాది వయసొచ్చేవరకు ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత నుంచి వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాను.’’

‘‘ఆ సమయంలో బాబుని చూసుకోడానికి ఇంట్లో మీ అత్తగానీ, అమ్మగానీ ఉన్నారా?’’

‘‘లేరు డాక్టర్‌.’’

‘‘మరి ఎలా మేనేజ్‌ చేశారు?’’

‘‘మా ఇంట్లో స్మార్ట్‌ టీవీ ఉంది డాక్టర్‌. అందులో బాబుకి యూట్యూబ్‌లో వచ్చే రైవ్స్‌ు పెడ్తే చాలు. వాడు నన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు. టీవీ చూసినంత సేపు చూసి, పక్క గదిలోకెళ్లి వాడిపాటికి వాడు ఆడుకునేవాడు. మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు డాక్టర్‌’’ అన్నాను.

‘‘మీ అబ్బాయికి ఆటిజం డిజార్డర్‌ రావడానికి మీరే కారణమనిపిస్తోందమ్మా. మీరు చేసిన తప్పుల వల్ల వీడిలో వర్చువల్‌ ఆటిజం డిజార్డర్‌ లక్షణాలు ఏర్పడ్డాయనిపిస్తోంది.’’

‘‘నేనేం తప్పు చేశాను డాక్టర్‌? నాకు నా కొడుకంటే ప్రాణం’’ వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాను.

‘‘మీరు రెండు తప్పులు చేశారమ్మా. పిల్లవాడితో గడపాల్సింది పోయి ఉద్యోగం చేశారు. ఎన్ని లక్షలు సంపాయించారు చెప్పండి? డబ్బులు ముఖ్యమా పిల్లవాడి ఆరోగ్యం, ఆనందం ముఖ్యమా? మీరిద్దరూ చదువుకున్నవాళ్లేగా. ఏడాది రెండేళ్ల పిల్లలకు టీవీ చూపించకూడదన్న విషయం కూడా తెలియదా? పిల్లవాడి బ్రెయిన్‌ ఎదిగే వయసది. వాణ్ణి టీవీకి అలవాటు చేస్తే, బయటి ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది?’’ కొద్దిగా కోపంగా అన్నాడు.

‘‘పిల్లలకు మొబైల్‌ ఫోన్‌ ఇవ్వకూడదని కదా అంటారు. దాన్నుంచి వచ్చే రేడియేషన్‌ పిల్లల మెదడుకు ప్రమాదకరమని నాకు తెలుసు. టీవీ చూపిస్తే ఏమౌతుంది డాక్టర్‌? ఏడెనిమిది అడుగుల దూరంలో కదా టీవీ ఉంటుంది. అందులో రైవ్స్‌ు చూపించడంలో తప్పేముంది? రేపు స్కూల్లో చేర్పిస్తే వాళ్లు కూడా ఇవే రైవ్స్‌ు నేర్పిస్తారు కదా’’ అన్నాను.

‘‘చాలా తప్పు ఆలోచనమ్మా. ఎదిగే వయసులో పిల్లలకు ఏ గ్యాడ్జెట్స్‌ కూడా ఇవ్వకూడదు. పిల్లల మెదడులోని న్యూరాన్స్‌, వాళ్లకు ఐదారేళ్లు వచ్చే వరకు పెరుగుతుంటాయి. మొబైల్‌ఫోన్‌, టీవీ, నోట్‌ప్యా డ్స్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్స్‌… ఇవన్నీ పిల్లలకు ప్రమాదకరమే. గంటలు గంటలు టీవీలో రైవ్స్‌ు చూడటంవల్ల పిల్లల్లో మెలటోనిన్‌ అనే హార్మోన్‌ అణచివేయబడుతుంది. దానివల్ల పిల్లలు నిద్రకు దూరమౌతారు.కళ్లు, చెవులు తప్ప మిగతా సెన్సరీ ఆర్గాన్స్‌ వాడటం మర్చిపోతారు. ఆ రంగు రంగుల ప్రపంచంలోనే ఆనందం దొరుకుతూ ఉండటం వల్ల దానికోసం బయట వెతకాల్సిన అవసరం ఉండదు. మీరు పిల్చినా మాట్లాడినా మీ వైపు చూడరు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఉద్యోగంవల్ల వచ్చే కాసిని డబ్బుల కోసం పిల్లవాడి జీవితంతో ఆడుకున్నారు కదమ్మా. నా ఉద్దేశంలో పిల్లలకు ఐదేళ్ళు వచ్చే వరకు తల్లులు ఉద్యోగాలు చేయకూడదు. వాళ్ల సమయమంతా పిల్లలకోసమే వెచ్చించాలి. ఇంతకూ మీ బాబు మాట్లాడు తున్నాడా?’’

‘‘లేదు డాక్టర్‌’’ అన్నాను. మనసంతా దిగులు నిండిపోయింది. అపరాధ భావన కార్చిచ్చులా నరాల్లోకి పాకుతోంది.

‘‘మాటలు రావమ్మా. ఎలా వస్తాయి? మీరు పగలంతా కంప్యూటర్‌ ముందు కూచుంటే వాడితో మాట్లాడే సమయం ఎక్కడ దొరుకుతుంది? సరే. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు పిల్లవాడికి రెండున్నరేళ్లే కాబట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టండి. ఉద్యోగం మానేయండి. వాడిని ఆటిజం నుంచి బయటికి తీసుకు రావడానికి ఏం చేయాలో చెప్తాను’’ అన్నాడు.

ఇంటికి రావడం ఆలస్యం నా భర్త తీవ్ర పదజాలంతో నన్ను నిందించసాగాడు. ‘‘నీవల్లనే నా కొడుక్కి ఆటిజం వచ్చింది. నీలా ఉద్యోగాలే ముఖ్యమనుకుంటూ పిల్లల్ని నిర్లక్ష్యం చేసేవాళ్లకు పిల్లలెందుకు’’ అన్నాడు.

వాడు అతని కొడుకేనా? నా కొడుక్కూడా కదా. తొమ్మిది నెలలు మోసి, కనింది నేను కదా. వాడు పుట్టాక ‘నా జీవితంలో జరిగిన అద్భుతం అయాన్‌’ అని కదా మురిసిపోయాను. నేనెందుకు వాడికి ఆటిజం డిజార్డర్‌ వచ్చేలా ప్రవర్తిస్తాను? తప్పు చేశాను నిజమే. వాడికి టీవీని అలవాటు చేసింది నేనే. అది తెలియక చేసిన తప్పు. దానివల్ల వర్చువల్‌ ఆటిజం వస్తుందని నాకు తెలియదు. అసలు ఆటిజం అంటే ఏమిటో, ఎలా వస్తుందో, లక్షణాలేమిటో తెలిస్తే కదా జాగ్రత్త పడటానికి. ఐనా తప్పు తప్పే. నేను చేసిన తప్పు వల్ల నా కొడుకు శిక్ష అనుభవించడమే విషాదం. అది నాకు దుస్సహంగా ఉంది.

ఉద్యోగానికి రాజీనామా చేశాను. అయాన్‌ నా కళ్ల ముందు తిరుగుతుంటే నేను చేసిన అపరాధం ప్రాణం పోసుకుని కదుల్తున్నట్టే ఉంది. వాడి మొహం వైపు చూస్తే చాలు ఏడుపు తన్నుకుంటుా వస్తోంది. ఎంత ముద్దుగా ఉంటాడో.. వాడి నోటినుండి ‘అమ్మా’ అనే పిలుపు కోసం ఎంత తహతహలాడేదాన్నో.. వాడుమాట్లాడకపోవడానికి కూడా కారణం నేనే.. నా కొడుకు ఎప్పటికైనా మాట్లాడతాడా? అమ్మా అని పిలుస్తాడా? దానికోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలో.. గుండెల్లో పదునుగా గుచ్చుకుంటూ అపరాధభావన..

బాబుకి ఆటిజం ఉందని డాక్టర్‌ చెప్పిన మరునాడు, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్లో ఎవాల్యుయేషన్‌ చేయించాం. ఛైల్డ్‌ సైకియాట్రిష్ట్‌ ‘మైల్డ్‌ టు మోడరేట్‌ ఆటిజం’ అని రిపోర్ట్‌ యిచ్చింది.

 ‘‘మా బాబుకుంది వర్చువల్‌ ఆటిజమా లేకపోతే క్లాసిక్‌ ఆటిజమా మేడం?’’ అని అడిగాను. అయాన్‌కి ఆటిజం అని తెల్సినప్పటినుంచి గూగుల్‌లో దానికి సంబంధించిన సమాచారం కోసం ఎన్ని వెబ్‌సైట్‌లు వెతికానో.. ఎన్నెన్ని వీడియోలు చూశానో.. వర్చువల్‌ ఆటిజం ఐతే స్క్రీన్‌ చూడకుండా చేస్తే చాలు ఆరు నెలల్లో పిల్లలు పూర్తిగా ఆ డిజార్డర్‌ నుంచి బైటపడ్తారు అని చదివాను. క్లాసిక్‌ ఆటిజం ఐతే ఆ లక్షణాల్ని కొద్దిగా తగ్గించగలం తప్ప పూర్తిగా బాగుచేయలేమని, జీవితాంతం ఆటిజంతో బతకాలని రాసి ఉండటంతో భయం పట్టుకుంది. నా కొడుక్కి వర్చువల్‌ ఆటిజమే ఉండేలా చూడు దేవుడా! అని ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నానో. అందుకే ఆ విషయం నిర్ధారించు కుందామని అడిగాను.

‘‘అలా చెప్పలేమండి. రెండిరటిలో కన్పించే లక్షణాలు ఒకేలా ఉంటాయి’’ అందావిడ. ‘‘మీరు థెరపీలు ఇప్పించండి. ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి పిల్లలకు స్పీచ్‌ థెరపీ, బిహేవియరల్‌ థెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీలు ఇచ్చే సెంటర్‌ అడ్రస్‌ ఇస్తాను. వాళ్లను కల్సుకుని మాట్లాడండి’’ అని సలహా ఇచ్చింది.

నా భర్త థెరపీ సెంటర్‌కి వెళ్దామన్నాడు. నేను ఇష్టపడలేదు. ఆ విషయంలో మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ కూడా అయింది. బాబుకి ఆటిజం అని తెల్సినప్పటి నుంచి తరచూ మా మధ్య పోట్లాటలు జరుగుతున్నాయి. డాక్టర్‌ నర్సింగరావు మాత్రం థెరపీలు ఇప్పించమని చెప్పలేదు. ‘ఆరు నెలలు ఆగాక అప్పుడు థెరపీ అవసరమో లేదో చెప్తాను’ అన్నాడు. నేను ఆయన సలహాని పాటించడానికే నిర్ణయించు కున్నాను. ఆరు నెలల్లో తగ్గకపోతే, అది వర్చువల్‌ ఆటిజం కాదని నిర్థారించుకున్నాక, థెరపీల అవసరం వస్తుందని అతని ఉద్దేశం కావొచ్చు.

‘బాబుని ప్రకృతికి దగ్గరగా పెంచండి. మట్టిలో ఆడుకోనివ్వండి. వాడికి వర్షం అంటే ఏమిటో, ఎండ ఎలా ఉంటుందో తెలిసేలా పెంచండి. రఫ్‌గా పెంచండి. మొదట స్కూల్లో జాయిన్‌ చేయండి. ఇక్కడి కార్పొరేట్‌ స్కూళ్లు వద్దు. ప్లే స్కూళ్లలో పిల్లల కోసం రెండు మూడు గంటలు టీవీ పెడ్తారు. మీ ఊరెళ్లిపోండి. లేదా మీ అత్తగారి ఊరెళ్లండి. అక్కడి అంగన్‌వాడీ స్కూల్లో చేర్పించండి. చాలామంది పిల్లలుంటారు కాబట్టి బాబుకి సోసలైజేషన్‌ అలవాటౌతుంది. మాటలు కూడా తొందరగా వస్తాయి’ అన్నాడు డాక్టర్‌.

‘‘మా అమ్మానాన్న దగ్గరకెళ్దాం. అక్కడి స్కూల్లో చేర్పిద్దాం. ఓ ఆరు నెలలు నువ్వు అక్కడే ఉండు. నేను మధ్య మధ్యలో వచ్చి చుాసిపోతుంటాను’’ అన్నాడు నా భర్త.

అత్తామామల ఇంట్లో ఉండటం నాకిష్టం లేదు. నాకు ఊపిరాడనట్టు, కళ్లకు కన్పించని తాళ్లతో బంధించినట్టు ఉంటుంది. బాబు గురించి స్వేచ్ఛగా శ్రద్ధ తీసుకోలేను. అందుకే మా ఊరు వెళ్తానని చె ప్పాను. మా ఊరు ఒంగోలు. ఇంటికి దగ్గరగానే అంగన్‌వాడీ స్కూల్‌ ఉంది. అక్కడ పనిచేస్తున్న టీచర్లు అమ్మకు బాగా తెల్సినవాళ్లే.

చాలా కష్టపడి నా భర్తను ఒప్పించాను. అలా ఒప్పించడానికి కూడా ఎన్ని గొడవలు పడాల్సి వచ్చిందో.. ఎన్ని తిట్లు తిన్నానో.. ఎన్నిసార్లు నిందని శిలువలా మోశానో… నా కొడుకును ఆటిజం నుంచి బయటికి తీసుకురావడం కోసం ఎన్ని కష్టాలైనా భరించడానికి, ఎన్ని అవమానాలెదురైనా సహించడానికి సిద్ధపడ్డాను.

ఒంగోల్లో మా ఇంటి దగ్గరున్న అంగన్‌వాడీ స్కూల్లో బాబుని చేర్పించాను. ఓ ఇరవై మంది పిల్లలవరకు ఉన్నారక్కడ. ఇద్దరు టీచర్లు.. ఒక ఆయా.. వాళ్లతో మా వాడికి ఆటిజం అని చెప్పలేదు. ఇంజనీరింగ్‌ డిగ్రీ నాకే దాని గురించి సరైన అవగాహన లేకుండా పోయింది కదా. మరి వీళ్లకేం అర్థమౌతుంది? అదేదో మానసిక జబ్బని అనుకుంటే నాకొడుకుని చిన్నచూపు చూస్తారన్న భయం.. అందుకే ‘‘వీడికి మనుషుల్తో కలవడం ఇష్టం ఉండదు. ఒంటరిగా ఆడుకుంటాడు. పిల్లల్తో కలిపి ఆడిరచండి. సోషల్‌ బిహేవియర్‌ డెవలప్‌ అయ్యేలా చేయడం ముఖ్యం’‘ అని చెప్పాను.

మొదటి రోజు ఓ అరగంట నేను కూడా వాడితో పాటు స్కూల్లో కుాచోడానికి అనుమతి ఇచ్చారు.అరగంట తర్వాత మెల్లగా జారుకుని ఇంటికొచ్చాను. పది నిమిషాలు కాకముందే టీచర్‌ నుంచి ఫోనొచ్చింది. ‘‘బాగా ఏడుస్తున్నాడు మేడం. ఎంత బుజ్జగించినా ఏడుపు ఆపడం లేదు. వచ్చి తీస్కెళ్లండి’’ అంది టీచర్‌. నేను వెళ్లేటప్పడికి పిల్లలు కూచుని ఉన్న చోట కాకుండా గదిలో ఓ మూలకెళ్లి కూచుని ఏడుస్తున్నాడు. ఇంటికి తెచ్చేసుకున్నాను.

రెండు వారాలు ఇదే తంతు. స్కూల్‌ కి తీసుకెళ్లిన అరగంట లోపల ఫోన్‌ రావడం.. వెళ్లి బాబుని ఇంటికి పిల్చుకురావడం. ఇలా ఐతే వాడెలా బాగుపడ్తాడో అర్థం కావడం లేదు. రోజూ సాయంత్రాలు పార్కులకు తిప్పుతున్నా. నేను పక్కనుంటే బాగానే ఆడుకుంటున్నాడు. ఎటొచ్చీ పార్కులో ఆడుకుంటున్న మిగతా పిల్లల్తో మాత్రం కలవడం లేదు.

మూడు వారాలు కష్టపడ్డాక, స్కూల్లో ఏడవకుండా కూచోవటం అలవాటైంది. అదీ గంటా రెండు గంటలే. ఆ మాత్రానికే ఎంత సంతోషపడిపోయానో. మరో వారం దాటాక టీచర్‌ ఫోన్‌ చేసి పిలిపించింది. ఏం జరిగిందో అనుకుంటూ కంగారుపడ్తూ పరుగెత్తాను. ‘‘ఎంత ప్రయత్నించినా మీ అబ్బాయి మిగతా పిల్లల్తో కలవడం లేదు మేడం. ఇదిగో చూడండి ఎలా దూరంగా కూచుని బిల్డింగ్‌ బ్లాక్స్‌ని వరసగా పేర్చుకుంటున్నాడో. వాటితో ఎలా ఆడాలో ఎన్నిసార్లు నేర్పామో.. ఐనా ఇలా లైన్‌గానే పెడ్తు న్నాడు. అలా కాదని వాటిని కదిలిస్తే చాలు, కోపంతో పెద్ద పెద్దగా కేకలు పెడ్తున్నాడు’’ అంది టీచర్‌.

ఓ అరగంట వాడి పక్కన కూచుని, ‘‘ఇలా వరసగా పెట్టకూడదు అయ్యూ.. చూడు నేనెలా చేస్తున్నానో’’ అంటూ ఒకదానిమీద ఒకటి పెట్టి చూపించాను. వాడు చేత్తో వాటిని కిందపడేసి, మళ్లా వరసగా ఒకదాని పక్కన ఒకటి పేర్చసాగాడు. ఇంతక్రితం వాడు బంతుల్ని వరసగా పెడ్తుంటే అది ఆటిజం లక్షణమని తెలియక ఎంత మురిసిపోయానో గుర్తొచ్చి, ఏడుపొచ్చేసింది.

వాణ్ణి ఎత్తుకుని బయటకొస్తుంటే, లోపల్నుంచి ఓ టీచర్‌ మరో టీచర్తో ‘‘ఆ అబ్బాయికి మెంటల్‌ రిటార్డేషన్‌ ఉందనిపిస్తోంది’’ అనడం విన్పించిది.

ఇంటికొచ్చాక వాణ్ణి గుండెలకు హత్తుకుని ఎంతసేపు ఏడ్చానో! నా కొడుకు మెంటల్లీ రిటార్డెడ్‌ కాదు అని పెద్దగా అరిచి చెప్పాలనిపించింది. ఆ టీచర్ని పట్టుకుని రెండు చెంపలూ వాయించాలని పించింది. ఎంత మాటంది నాకొడుకుని… మనుషు లెందుకింత నిర్దయగా ఉంటారు? ఎందుకింత క్రూరంగా మనసుకి గాయాలు చేస్తారు?

నా కొడుకు పెద్దయ్యాక కూడా సమాజం ఇలానే అని వాణ్ణి హింసిస్తే నేను తట్టుకోగలనా? లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఎంత కష్టమైనా సరే పడ్తాను. నా కొడుకులో ఆటిజం డిజార్డర్‌ లేకుండా చేస్తాను. అందుకోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను.

ఇంటర్నెట్‌లో ఆటిజం ట్రీట్‌మెంట్‌కి సంబంధించిన వీడియోలన్నీ చూడసాగాను. వాటిలో కొన్నింటిలో సూచించిన విధంగా అయాన్‌కి నేర్పసాగాను.

నాలుగు నెలలు గడిచాయి. అయాన్‌లో వస్తున్న మార్పులు ప్రస్ఫుటంగా కన్పించసాగాయి. పిల్లల్తో కలుస్తున్నాడు. బంతుల్ని వరసగా పేర్చడం లేదిప్పుడు. వాడి ఐ కాంటాక్ట్‌ కూడా మరింత మెరుగుపడిరది. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ల పెదవుల కదలికల్ని గమనిస్తున్నాడు. కానీ ఒక్క అక్షరం కూడా పలకడం లేదు.

రోజూ వాణ్ణి ఒళ్లో నా ఎదురుగా కూచోబెట్టుకుని, నోరంతా తెరిచి ‘‘అమ్మా.. అమ్మా అను’’ అంటూనే ఉన్నాను. వాడు నవ్వుతున్నాడు తప్ప తిరిగి పలకడం లేదు. ఎంతటి నిరాశని గుండెలమీద పర్వతంలా మోస్తున్నానో నాకే తెలుసు. ఐనా ప్రయత్నం మాత్రం మానలేదు.

అయాన్ని స్కూల్లో చేర్పించి ఐదు నెలలు..

ఓ రోజు వెంటనే రమ్మని టీచర్‌ ఫోన్‌ చేస్తే ఉన్న పళంగా పరుగెత్తాను. అయాన్‌ నేల మీద కూచుని ఉన్నాడు. అతని ఎదురుగా బిల్డింగ్‌ బ్లాక్స్‌ పడి ఉన్నాయి.

‘‘అయాన్‌ .. ఇందాక చేశావే అలా మళ్లా చేయి. మమ్మీ చూస్తే సంతోషపడ్తుంది’’ అంది టీచర్‌.

వాడు ఒక్కో బ్లాక్‌ని తీసుకుని ఒకదానిమీద ఒకటి అమరుస్తూ, ఎత్తైన టవర్ని కట్టి, నా వైపు చూసి నవ్వాడు. ‘‘సుాపర్‌ ..’’ అంటూ టీచర్లిద్దరూ చప్పట్లు కొట్టారు. నాకెంత సంతోషమనిపించిందో. వాడు పెద్ద ఇంజనీరై అద్భుతమైన భవంతిని నిర్మించినంత సంబరపడిపోయాను. ‘‘వావ్‌ అయాన్‌.. గ్రేట్‌’’ అంటూ వాణ్ణి ఎత్తుకుని ముద్దుపెట్టుకున్నాను.

మరో నెల గడిచిపోయింది.

ఓ సాయంత్రం ఎప్పటికి మల్లే వాణ్ణి నా ఒళ్లో ఎదురుగా ఉండేలా కూచోబెట్టుకుని, ‘‘అమ్మా అను.. చూడు.. ఇలా అనాలి’’ అంటూ నోరు తెరిచి ‘‘అమ్మా’’ అన్నాను. వాడు నవ్వాడు తప్ప పెదాలు కదిలించ లేదు.

‘‘ప్లీజ్‌ రా కన్నా.. ఒక్కసారి అమ్మా అనరా.. నీ గొంతు వినడం కోసం తహతహలాడిపోతున్నారా.. అమ్మా అనే పిలుపుకోసం తపించిపోతున్నారా.. ఆటిజం లక్షణాలేవీ ఇప్పుడు నీలో కన్పించడం లేదు అయ్యూ! ఒక్క మాట్లాడలేకపోవడం తప్ప. ఒక్కసారి అమ్మా అను. నీలో ఉన్న ఆటిజంని పూర్తిగా తరిమేశానని సంతోషపడ్తాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకున్నానని సంతృప్తి పడతాను. నన్ను నమిలి తినేస్తున్న అపరాధ భావన నుంచి నన్ను విముక్తురాలిని చేయరా. ప్లీజ్‌.. ఒక్కసారి అమ్మా అనరా’’ అంటూ వాడి కళ్లలోకి చూస్తూ ‘‘అమ్మా అను .. అమ్మా అను’’ అన్నాను.

 అయాన్‌ పెదవుల్లో కదలిక.. తన చిన్ని నోరు తెరిచి ‘‘అమ్మా’’ అన్నాడు.

వాణ్ణి గుండెలకు హత్తుకుని, సంతోషాతిరేకంలో నేను కన్నీటి వరదలా మారిపోయాను.

వచ్చేవారం కథ

ఓం తయ్రంబకం యజామహే!

– డా॥ ఎమ్‌. సుగుణరావు

About Author

By editor

Twitter
Instagram