నన్నయ నుండి ఆరంభమైన ఆంధ్ర సాహిత్యం 19వ శతాబ్ది వరకు పౌరాణిక కథలతో, పద్యాలతో సాహితీయానం సాగించింది. సాహితీ సంస్కరణ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం నవల, ప్రహసనం వంటి ప్రక్రియలను అందించాడు. తన రచనల ద్వారా సమాజంలో రచయితల బాధ్యతను గుర్తు చేశాడు. తెలుగు సాహిత్యాన్ని సంకుచితత్వం నుండి విశాల ప్రపంచంలోకి విస్తరించాడు. అద్భుతత్వం నుండి వాస్తవికతలోకి తీసుకొచ్చాడు. అను పూర్వికత నుండి ఆధునికత్వంలోకి మళ్లించాడు. దేవుళ్ల నుండి రాజుల నుండి ప్రజల దగ్గరకు రచనను చేరవేశాడు. శ్రోతను పాఠకుణ్ణి చేసి, పాఠకుల అభిరుచినీ, దృష్టినీ తీర్చిదిద్దాడు. గురజాడ తెలుగు సాహిత్యం స్వరూపాలను మార్చేశాడు. సమకాలీన సామాజిక వాస్తవికతను విమర్శనాత్మకంగా చిత్రించి, కందుకూరితో పాటు ఆధునిక సాహితీ రథసారథి అయ్యాడు. ‘‘సమాజం ద్వారా తాను ప్రభావితుడై రచనలు చేసి తన రచనల ద్వారా సమాజాన్ని ఉత్తేజితం చేసిన గురజాడ అగ్రగామి రచయిత’’ అని చెప్పిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి అభిప్రాయం సముచితంగా ఉంది.

గురజాడ తెలుగులో తొలి కథానికకు ఆద్యుడు. ఆయన ‘దిద్దుబాటు’ కథానికతో ‘కథానిక’ ప్రక్రియ రూపుదిద్దుకొంది. దిద్దుబాటు కథానిక 1909 ఫిబ్రవరిలో ‘ఆంధ్రభారతి’ పత్రికలో ప్రచురితమైంది. ఆయన మొత్తం ఐదు కథలు రాశాడు. ‘మీ పేరేమిటి’ ‘పెద్ద మసీదు’ సంస్కర్త హృదయం, మెటిల్డా వంటి కథలన్నీ సమాజ సంబంధాలే. వీటిలో ‘సంస్కర్త హృదయం’ గురజాడ ఇంగ్లీషులో రాసిన Stooping to raise అనే కథకు అవసరాల సూర్యారావు గారి అనువాదం. వీటిలో ఒక్క ‘పెద్ద మసీదు’ కథ తప్ప, మిగిలిన కథలన్నీ సమకాలీన ఇతివృత్తాలే. ‘పెద్దమసీదు’ కథలో హిందూ ముస్లిం మతాల మధ్య సంఘర్షణను చిత్రించాడు. ‘మీ పేరేమిటి’ కథలో మతాభిమానానికి హేతు వాదానికి మధ్య సంఘర్షణను చిత్రించాడు. ‘మీ పేరేమిటి’ కథానిక, మతంలో ఆధ్యాత్మికత లోపించి స్వార్థపర శక్తుల చేతుల్లో మతం భౌతిక కర్మకాండగా మిగిలిపోయిన స్థితిని తెలియ జేస్తుంది. ఇందులో దేవుని పేరు మీదున్న ఆస్తి మీదనే తప్ప, దేవుని మీద నమ్మకంలేని స్థితిని చిత్రించాడు. మతం కంటే పొట్టకూటికి ప్రాధాన్యమిచ్చే పాత్రలిందులో ఉన్నాయి.

‘పెద్ద మసీదు’ కథలో స్వస్థల, స్వమతాభిమానం మిన్నగా ఉండే పాత్రలున్నాయి. గురజాడ కథల్లో ‘దిద్దుబాటు’ ‘మెటిల్డా’ సంస్కర్త హృదయం సాంఘిక సమకాలీన సమస్యలను చిత్రించిన కథానికలు. ఈ మూడు కథల్లో స్త్రీ ప్రాధాన్య పాత్రలున్నాయి. స్త్రీలను హింసించే మోసగాళ్లు, దుర్మార్గులైన మగవాళ్లను మార్చగలిగిన స్త్రీలు వీటిలో కనిపిస్తారు. మగవాళ్లు చెప్పే నీతికీ, చేసే చేతకీ సంబంధంలేనివాళ్లు. ‘‘అప్పారావు కథలన్నీ జీవితాన్నీ, జీవిత వాస్తవాన్నీ ఆశ్రయించుకున్న సామాజిక చిత్రణలు’’ అని కె.వి.రమణారెడ్డి మహోదయంలో సముచితంగా వ్యాఖ్యానించారు.

‘దిద్దుబాటు’ కథలో చదువుకున్న భార్య ప్రియుల్ని ఆకర్షించడానికి ఉత్తరాలు రాస్తుందదోయ్‌’’ అన్న వాదాన్ని తిరస్కరిస్తుంది. స్త్రీ చదువుకుంటే దొడ్డి దారులు తొక్కే మగవాళ్లని సంస్కరిస్తుందని నిరూపిస్తుంది. దారితప్పిన భర్తను బెదిరించి సరిదిద్దడం ఇందులోని ఇతివృత్తం. కమలినీ, గోపాలరావు చదువుకున్న భార్యాభర్తలు. గోపాలరావు వేశ్యా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నానని భార్యకు చెప్పి సాని దగ్గర కాలం గడిపేస్తుంటాడు. అది తెలుసుకున్న కమలినీ ఒకరోజు తాను పుట్టింటికి పోతున్నట్లు ఉత్తరం రాసి పెట్టి మంచం కింద దాక్కుంటుంది. అర్ధరాత్రికి ఇంటికి వచ్చిన గోపాల రావు పరిస్థితిని గమనించి, తన తప్పు తెలుసుకొని రాముడనే నౌఖరుని మామగారి ఊరికి ప్రయాణం కమ్మంటుంటే కమలినీ నవ్వుతూ మంచం క్రింది నుండి బయటికి వస్తుంది.

గురజాడ కథలో ‘మెటిల్డా’ గొప్ప సౌందర్యవతి. ఒక వంటలక్క చెప్పిన యథార్థ గాథను మెటిల్డా కథగా గురజాడ మలిచాడు. ఆమె భర్త ఒక ముసలిపులి. వాళ్లింటికి ఎవరూ వెళ్లరు. ఆమె ఇంటి గుమ్మంలోకి ఎవ్వరూ రాకూడదని శాసనం. ఒక కాలేజి విద్యార్థి దారినపోతూ వాళ్ల గుమ్మం దగ్గర ఆగినందుకు అతణ్ణి పిలిచి ‘మెటిల్డా’ను తీసుకుపో శని విరగడౌతుంది’ అంటాడు ముసలిపులి. మెటిల్డా తన జోలికి రావద్దంటూ ఆ విద్యార్థికి ఉత్తరం రాస్తుంది. ముసలిపులి కొన్నాళ్లకు మళ్లీ ఆ విద్యార్థిని పిలిచి, అతని స్నేహితుల వల్ల తాను చాలా తెలుసు కున్నట్లు చెపుతాడు.

గురజాడ సమకాలీన జీవన పరిస్థితులనే కాక, సమకాలీన ఉద్యమాలను కూడా విమర్శనాత్మక దృష్టితో పరిశీలించాడు. సంఘ సంస్కరణోద్యమాన్ని సమర్ధిస్తూనే, సంస్కర్తల అశాస్త్రీయ ధోరణులను ఎండగట్టటం ఆయన విశిష్టత. తన సమకాలీన రచయితల కంటే ఆయన ఎంతో ముందున్నాడు. ‘‘సానిపిల్లలో ఉండే మానవత్వాన్ని మరచిపోకు. ఆమె సైతం ఒక మానవ వ్యక్తి అనే మాటను విస్మరించకు. ఆమె విచారం, కన్నీళ్లు, సంతోషం, ఆనంద బాష్పాలూ, నీ, నా సుఖ దుఃఖాలవంటివే’’ అని ఆయన మిత్రుడు ఒంగోలు ముని సుబ్రహ్మణ్యంకు రాసిన ఉత్తరంలో అన్నాడు. గురజాడ ఆదర్శవాదే కాని, ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలను అధిక్షే పించేందుకు వెనుకాడడు. అందుకు ఉదాహరణగా ‘సంస్కర్త హృదయం’ కథానిక నిలుస్తుంది. రంగ నాథయ్యర్‌ సీతాపూర్‌ కళాశాలలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ ఉన్నత భావోద్రేకి.

అన్యాయం, బలహీనత ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలంటాడు. వేశ్యా వ్యతిరేక ఉద్యమ నాయకుడిగా మునిసిపల్‌ కౌన్సిల్‌, దేవస్థానం బోర్డు, క్లబ్‌లను యాంటి, ప్రోనాచ్‌ వర్గాలుగా చీల్చగలిగాడు. క్లాస్‌రూంలో సైన్స్‌పాఠం చెబుతున్నా, అవకాశం కల్పించుకొని పడుపు ప్రవృత్తిని దుయ్యబట్టేవాడు. ఇలాంటి రంగనాథయ్యర్‌ ఒకరోజు దేవాలయానికి వెళుతున్న సరళ అనే వేశ్యా బాలికను చూసి ‘‘ఓప్‌ా… ఏమా సౌందర్య రాశి’’ అనుకుంటాడు. ఆమె వివరాలను తెలుసుకుంటాడు. ‘‘సరళ సునాయాసంగా లభిస్తే’’ అనుకుంటాడు. ఇంకో రోజు గుడిలో సరళ ప్రక్కనే నిలబడి ఆమె సాహచర్యం లభించాలని తపిస్తాడు. సరళకు అయ్యర్‌ అంటే గొప్ప ఆరాధనాభావం. ఆయన వేశ్యా సమస్య నిర్మూలనోద్యమకారుడు కావటమే కారణం. ఒకరోజు ఆమె ఆహ్వానాన్ని అందుకొని ఆమె ఇంటికి వెళతాడు. సరళను చూడగానే పడుపు ప్రవృత్తికి వ్యతిరేకంగా రాసిన తన భావాలను మరచిపోయి ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతాడు. ఆమె వీణమీటుతూ జావళీ పాడుతుంటే అయ్యర్‌ గబుక్కున లేచిపోయి ఆమె పెదవులను ముద్దు పెట్టుకొని దగాలో పడ్డాను’ అని అరుస్తూ పరుగెత్తివెళ్లిపోయి మర్నాడు ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఒకరిని లేవనెత్తబోయి తానే కిందపడే సంస్కర్తం తత్వానికి ఈ కథ నిదర్శనం.

గురజాడవారి కథానికలు సంఘ సంస్కరణ దీపికలుగా పాఠకుల్లో ఆలోచనరేకెత్తించాయి. తదనంతర కథానిక రచయితలకు మార్గదర్శకాలుగా నిలిచాయి.

– డా॥పి.వి.సుబ్బారావు, 9849177594, విశ్రాంత అధ్యాపకుడు

About Author

By editor

Twitter
Instagram