ఐదున్నర దశాబ్దాల సినీ ప్రయాణం… దాదాపు వెయ్యి పాత్రల పోషణ… ఈ రేర్‌ ఫీట్‌ను మరొకరు సాధిస్తే… బహుశా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేదేమో!  పద్మశ్రీ పురస్కారం వరించేదేమో!! కానీ వెండితెరపై తనదైన శైలిలో దరహాసాన్ని రువ్విన చంద్రమోహన్‌ మాత్రం ఎంత నిశ్శబ్దంగా ఈ రంగంలోకి అడుగుపెట్టారో… అంతే నిశ్శబ్దంగా దివికేగారు. వందలాది చిత్రాలలో తనదైన అభినయంతో అలరించిన ఆయన నవంబర్‌ 11వ తేదీ ఉదయం హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లోని సొంత ఇంటిలో తనువు చాలించారు.


చంద్రమోహన్‌ను జనం ‘లక్కీ’ మోహన్‌’ అనీ పిలిచేవారు. ఎందుకంటే ఆయన సరసన నటించిన నాయికలందరూ తరువాతి రోజుల్లో టాప్‌ హీరోయిన్స్‌గా రాజ్యమేలారు. అంతేకాదు సదరు చిత్రాలు జనాన్నీ కట్టిపడేశాయి. పొట్టివాడయినా మహా గట్టివాడు అని పేరు సంపాదించి కనికట్టు చేశారు చంద్రమోహన్‌. చంద్రమోహన్‌ కాసింత హైటు ఉంటే ఆయన ఫేటే మారిపోయి ఉండేదని చూసినవారు అనేవారు. అంతెందుకు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సైతం ‘చంద్రమోహన్‌ ఓ ఇంచు ఎత్తుగా ఉన్నా, మమ్మల్నందరినీ అధిగ మించేసేవాడు’ అని కితాబునిచ్చారు. ఆయన సరసన నటించిన నాయికలు తరువాతి రోజుల్లో అగ్రకథానాయకులతో జోడీ కట్టి ఆకట్టుకున్నారు- స్టార్‌ డమ్‌ చూశారు. అలాంటి వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది వాణిశ్రీ అనే చెప్పాలి. ఎందుకంటే చంద్రమోహన్‌ తొలి కథానాయిక వాణిశ్రీ. చంద్రమోహన్‌ సరసన నటించాకే వాణిశ్రీకి టాప్‌ స్టార్స్‌తో జోడీ కట్టే అవకాశాలు లభించాయి. అంతకు ముందు అనేక స్టార్స్‌ మూవీస్‌లో చెల్లెలు, మరదలు పాత్రలు ధరించారు చంద్రకళ. ఆమె కూడా చంద్రమోహన్‌ సరసన నటించిన తరువాతే టాప్‌ స్టార్స్‌ జంటగా నటించే ఛాన్స్‌ దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో నాయికగా మురిపించిన జయప్రద కూడా చంద్రమోహన్‌ సరసన నటించాకే టాప్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకున్నారు. ‘సహజనటి’గా పేరొందిన జయసుధ చంద్రమోహన్‌ సరసన నటించాకే స్టార్‌ డమ్‌ సొంతం చేసుకున్నారు. ఆల్‌ ఇండియా నంబర్‌ వన్‌ హీరోయిన్‌గా పేరొందిన శ్రీదేవి సైతం చంద్రమోహన్‌తో ‘పదహారేళ్ల వయసు’లో నటించాకే గుర్తింపు పొందారు. రాధిక, విజయశాంతి, మాధవి, రాజలక్ష్మి వీళ్లంతా ఆ కోవకే చెందుతారు.

చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. ఆయనకు సమీప బంధువు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ప్రోత్సాహంతో బాపట్లలో అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తి చేశాక, సినిమా రంగం వైపు సాగారాయన. దిగ్దర్శకుడు బి.యన్‌.రెడ్డి తన ‘రంగులరాట్నం’లో కథానాయకుని వేషం ఇచ్చారు. ఆయనే చంద్రమోహన్‌ అన్నపేరునూ పెట్టారు. ఆపైన లభించిన ప్రతీ పాత్రకు న్యాయం చేయాలనే తపించారు చంద్రమోహన్‌. తన తరం హీరోలయిన కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు చిత్రాలలోనూ ఆయన పలు విభిన్నమైన పాత్రలు పోషించారు. కేవలం సాంఘిక చిత్రాలలోనే కాదు… జానపద, చారిత్రక, పౌరాణిక చిత్రాలలోనూ చంద్రమోహన్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇతర హీరోల చిత్రాలలో కీలక పాత్రలు ధరిస్తూనే, తన దరికి చేరిన కథానాయక పాత్రల్లోనూ మెప్పించారు చంద్ర మోహన్‌. ఆయన హీరోగా తెరకెక్కిన కొన్ని చిత్రాలు తెలుగువారి మదిలో చెరిగిపోని ముద్ర వేశాయి. తమిళ హీరోలు శివకుమార్‌, భాగ్యరాజా చేసిన చిత్రాల రీమేక్స్‌లో నటించి మంచి పేరు తెచ్చు కున్నారు. విశేషం ఏమంటే… మొదటి నుంచీ చంద్రమోహన్‌ చాలా జాగ్రత్త పరుడు… ఆయన భార్య జలంధర రచయిత్రి… ఇద్దరూ కలసి మంచి ప్లానింగ్‌తో తమ సంసారనౌకను నడుపుకున్నారు… అప్‌ కమింగ్‌ హీరోస్‌ చిత్రాల్లో అప్పటి దాకా ఈక్వల్‌ రోల్స్‌ వేసిన చంద్రమోహన్‌, తరువాత క్యారెక్టర్‌ రోల్స్‌కు షిఫ్ట్‌ అయిపోయారు.. ఆ తరువాత మునుపటికంటే మరింత బిజీ అయ్యారు. చంద్ర మోహన్‌కు ఇద్దరూ కుమార్తెలే. వారు చిత్రసీమకు దూరంగా ఉన్నారు. అయితే… ఆయన మేనల్లుడు శివలెంక కృష్ణ ప్రసాద్‌ చంద్రమోహన్‌ వారసుడిగా చిత్రసీమలోకి నిర్మాతగా అడుగుపెట్టారు. ఆయన సహకారంతో శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌ను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. కథానాయకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా స్థిరపడిన చంద్రమోహన్‌ను రీ-ప్లేస్‌ చేసే మరో నటుడు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన భౌతికంగా దూరమైనా.. తెలుగు సినిమాలలోని ఆయన నటన ప్రేక్షకులకు మధుర స్మృతులను పంచుతూనే ఉంటుంది.

– అరుణ,వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram