ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలికే దేశాలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు ఎలా అవుతుందో చెప్పలేకపోతున్నాయి. తమ దేశ పౌరుని హత్యలో భారత్‌ ‌ప్రమేయం ఉందని ప్రకటించి, కెనడా తాను తీసిన గొయ్యిలో తానే పడింది. ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామమని భారత్‌ ఎత్తి చూపడంతో ప్రపంచం ముందు దోషిగా నిలిచింది. భారత్‌తో పెట్టుకోవడం సింహం నోట్లో తల పెట్టడమేనని మిత్రదేశాలు స్పష్టం చేయడంతో ఇరకాటంలో పడింది. భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడో స్వదేశంలోనూ ప్రతిష్ట కోల్పోయారు.

ప్రపంచం మారిపోతోంది. పాశ్చాత్య దేశాలు ఉనికిని కోల్పోతున్నాయి. భారత్‌ ‌ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా అడుగులేస్తోంది. నిన్నటి దాకా అగ్రదేశాలు ఇప్పుడు పెత్తనాన్ని వదులుకుంటు న్నాయి. ఈ పరిణామాన్ని కొన్ని దేశాలు జీర్ణించు కోలేకపోతున్నాయి. భారత్‌కు పాకిస్తాన్‌, ‌చైనా శత్రువులని సగటు భారతీయులు భావిస్తుంటారు. కానీ కెనడా వంటి గుంటనక్కలు తామూ ఉన్నామని చాటుకున్నాయి.

భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఉసిగొల్పిన పాకిస్తాన్‌ ‌పరిస్థితి ఎలా మారిందో తెలుసు. ఇప్పుడు కెనడా కూడా అదే దారిలో ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదు లకు వత్తాసు పలుకుతున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ‌ట్రూడో దేశాన్ని ప్రమాదంలోకి నెట్టారు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ‌ప్రోద్బలంతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పారిపోయిన ఖలిస్తాన్‌ ‌వాదులకు కెనడా ఆశ్రయం ఇచ్చింది. ఈ వైఖరికి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదులకు పాకిస్తాన్‌ ఐఎస్‌ఐతో మాత్రమే కాదు. లష్కరే తాయిబాతో కూడా సంబంధాలున్నట్లు బయటపడింది. కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌ ‌దల్లా (27)కు లష్కరే తాయిబాతో సంబంధాలున్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పంజాబ్‌లో ఉన్న హిందూనేతలే లక్ష్యంగా దాడులు జరపాలని అర్ష్‌దీప్‌ ‌కుట్రలు పన్నాడు.

భారత్‌-‌కెనడా మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడానికి కారణం ఏమిటి? నిషేధిత ఖలిస్తాన్‌ ‌టైగర్‌ ‌ఫోర్స్ (‌కేటీఎఫ్‌) ‌నేత హర్‌దీప్‌సింగ్‌ ‌నిజ్జర్‌ను ఈ ఏడాది జూన్‌ 18‌న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. నిజ్జర్‌ ‌భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడి అక్కడకు చేరినవాడే. హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని ట్రూడో చేసిన ఆరోపణలతో భారత్‌, ‌కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన 78వ సర్వసభ్య సమావేశంలో ట్రూడో పాల్గొన్నారు. నిజ్జర్‌ ‌హత్యలో భారత్‌ ‌పాత్ర, ఈ విషయంపై భారత్‌ ‌ఖండన గురించి స్పందించాలని పీటీఐ వార్తా సంస్థ కోరింది. ట్రూడో నోరు విప్పకుండానే వెళ్లిపోవడం గమనార్హం. భారత్‌తో బంధం తమకు ముఖ్యమైనదే అయినప్పటికీ తమ చట్టాలను గౌరవించడం, దేశ పౌరులను రక్షించుకోవడం తమ బాధ్యత అని కెనడా రక్షణ మంత్రి బిల్‌ ‌బ్లెయిర్‌ అం‌టున్నారు. మరి కెనడా గడ్డ మీద భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు జరుగు తుంటే మనం ఎలా ఊరుకోగలం?

ట్రూడో ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమేనని దుయ్యబట్టారు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ ‌బాగ్చి. ట్రూడో పార్లమెంటులో మాట్లాడిన తర్వాత ఆక్కడి భారత దౌత్యకార్యా లయంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ ‌విభాగం అధిపతి పవన్‌ ‌కుమార్‌రాయ్‌ను బహిష్కరించినట్లు ప్రకటించారు. భారత్‌ ‌కూడా ఘాటుగానే స్పందిం చింది. ఇక్కడి కెనడా హైకమిషనర్‌ ‌కామెరూన్‌ ‌మెక్‌కేను పిలిపించి, కెనడా ఇంటెలిజెన్స్ ‌సంస్థ అధికారి ఒలీవియర్‌ ‌సిల్వెస్టర్‌ ఐదు రోజుల్లోగా దేశాన్ని వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అంతకుముందు కెనడా ప్రభుత్వం సైతం భారత్‌లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో భారత్‌ ‌సైతం కెనడాలో ఉండే భారతీయు లకు అడ్వైజరీ జారీ చేసింది.

సెప్టెంబర్‌ 11, 2001‌న అమెరికా మీద అల్‌ ‌కాయిదా దాడి చేసింది. తరువాత అమెరికా అల్‌ ‌కాయిదాకు ఆశ్రయం ఇస్తున్న అఫ్ఘానిస్తాన్‌పై నాటో దళాలతో కలిసి ప్రతిదాడి చేసింది. పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందిన ఒసామా బిన్‌ ‌లాడెన్‌ను హత మార్చింది. మరో అల్‌ఖైదా నాయకుడు అల్‌ ‌జవహరిని గుట్టుగా మట్టుపెట్టేసింది అమెరికా. ఇరాక్‌లో ఆ దేశ మిలిటరీ జనరల్‌ ‌ఖాసిం సులేమాని డ్రోన్‌ ‌దాడిలో చనిపోయారు. ఇదీ అమెరికా పనే. ఈ అన్ని సందర్భాల్లోనూ చెప్పిన కారణం ఆత్మరక్షణే. లాడెన్‌ను చంపిన ఘటనలో కెనడా కూడా పాత్రధారి. ఈ ఆపరేషన్‌ను ఇరు దేశాల అధినేతలు లైవ్‌లో తిలకించి ఆనందించారు. నిజ్జర్‌ ‌కూడా ఉగ్రవాదే. కెనడాలో ఆశ్రయం పొందుతూ అక్కడి ఉగ్ర ముఠాల ఆధిపత్యపోరులో మరణించాడు. ఈ విషయంలో భారత్‌ ‌మౌనం వహించింది. నిజ్జర్‌ ‌విషయంలో భారత్‌ అలాంటి ఆత్మరక్షణ వాదన కూడా చేయటం లేదు. ఎంతో మంది హత్యలకు కారణమైన ఒక ఉగ్రవాది చనిపోతే దాన్ని భారత్‌కు ఆపాదించడం ఏమిటి? హర్‌దీప్‌ ‌సింగ్‌ ‌నిజ్జర్‌ ‌హత్యపై కెనడాకు అమెరికాయే నిఘా సమాచారం అందించిందని ‘న్యూయార్క్ ‌టైమ్స్’ ‌పత్రిక పేర్కొంది. అయితే ఇందులో భారత్‌ ‌పాత్ర ఉందన్న విషయాన్ని మాత్రం కెనడా నిఘావర్గాలే కనుగొన్నాయని తెలిపింది. భారత దౌత్యవేత్తల సంభాషణల సమాచారం ఆధారంగా ట్రూడో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని ఆ కథనంలో వెల్లడించింది. మరోవైపు జీ7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా నిజ్జర్‌ ‌హత్య నిందను భారత్‌పై రుద్దాలని కెనడా చేసిన పయత్నాలు బెడిసికొట్టాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో నిజ్జర్‌ ‌హత్య అంశాన్ని ఖండించే విషయాన్ని చేర్చాలని కెనడా చేసిన లాబీయింగ్‌ ‌విఫలమైంది. ప్రస్తుతం ఈ గ్రూప్‌నకు జపాన్‌ అధ్యక్షత వహిస్తోంది.

ట్రూడో ఆరోపణలను అమెరికా విదేశాంగశాఖ నిపుణులు ఖండించారు. కెనడా కావాలా, ఇండియా కావాలా? అనేది తేల్చుకోవాల్సి వస్తే అమెరికా కచ్చితంగా భారత్‌ ‌వైపే ఉంటుందన్నారు పెంటగాన్‌ ‌మాజీ అధికారి మైఖెల్‌ ‌రూబిన్‌. ‌ప్రధాని హోదాలో జస్టిన్‌ ‌ట్రూడో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కెనడాతో మా బంధాన్ని పునర్నిర్మించుకుంటాం అని తెలిపారు మైఖెల్‌. అమెరికాలోని అత్యధిక సిక్కుల వాణికి ఖలిస్తాన్‌ ఉద్యమం ప్రాతినిధ్యం వహించడం లేదని ‘సిక్స్ ‌ఫర్‌ అమెరికా’ వ్యవస్థాపకుడు జెస్సీ సింగ్‌ ‌చెప్పారు. భారత్‌ ‌సిక్కులు ఖలిస్తాన్‌కు అనుకూలం కాదన్నారు. ఈ నేపథ్యంలోనే కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని న్యూయార్క్ ‌కేంద్రంగా పనిచేస్తున్న సిక్కు వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ ‌సింగ్‌ ‌పన్నూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కానీ ‘ఈ వీడియో అభ్యంతరకరం, విద్వేషపూరితం. అది మేం పాటించే విలువలకు విరుద్ధం. విద్వేషాలు, దురుసు చర్యలు, బెదిరింపులు, అభద్రత, భయాలకు కెనడాలో చోటు లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ.. పరస్పరం గౌరవించుకుంటూ చట్టాలను పాటించాలి’ అని కెనడా ప్రజా భద్రతా విభాగం పేర్కొంది. కెనడాతో దౌత్య సంబంధాల నిలిపివేత నేపథ్యంలో భారత్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ ఖలిస్తానీ ఉగ్రవాద నేతల ఆస్తులపై దాడులు ఆరంభించింది.

ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులోను కెనడా ప్రధాని ట్రూడో వ్యవహారశైలి భిన్నంగా కనిపించింది. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రెసిడెన్షియల్‌ ‌సూట్‌లో ఉండేందుకు నిరాకరించారు. దీనిపై భారత నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత రాష్ట్రపతి ఇచ్చిన విందుకు కూడా హాజరు కాలేదు. రాజ్‌ఘాట్‌ ‌దగ్గర జరిగిన కార్యక్రమంలోనూ అంటీ అంటనట్లుగానే ఉన్నారు. ట్రూడో మన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖలిస్థానీ సానుభూతిపరుల దుశ్చర్యల  పట్ల మోదీ అందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తానీ నిరసనలపై ఇద్దరం మాట్లాడుకున్నట్లు ట్రూడో కూడా మీడియాకు తెలిపారు.సదస్సు ముగిసిన తర్వాత కెనడా ప్రధాని ఆలస్యంగా స్వదేశానికి బయల్దేరారు.

భారత్‌తో వివాదం ముదురుతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడోకు స్వదేశంలో షాక్‌ ‌తగిలింది. ప్రధానిగా ఆయన ప్రతిష్ట దారుణంగా పడిపోయింది. ప్రధానిగా ప్రతిపక్ష నేత పియరీ పొయిలివ్రే వైపు దాదాపు 40శాతం మంది కెనడా ప్రజలు మొగ్గు చూపారు. గ్లోబల్‌న్యూస్‌ అనే సంస్థ నిర్వహించిన పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవ డానికి తమ పార్టీదే బాధ్యత అని ట్రూడోకు చెందిన లిబరల్‌ ‌పార్టీ సభ్యులూ అంగీకరిస్తున్నారు. ఉగ్ర వాదుల బెదిరింపులతో హిందువుల్లో భయం నెలకొందని భారత సంతతికి చెందిన అధికార పార్టీ ఎంపీ చంద్ర ఆర్య వ్యాఖ్యానించారు. ‘ఖలిస్థాన్‌ ఉద్యమం అనేది హింసతో కూడుకున్నది. 38 ఏళ్ల క్రితం జరిగిన ఎయిరిండియా బాంబు దాడి ఘటన చరిత్రలోనే అతిపెద్ద సామూహిక హత్యాకాండ. దానిని కెనడియన్లు మరచిపోయారు. ఇందిరాగాంధీ కట్‌ఔట్‌ను ఊరేగించడం లాంటి భావ ప్రకటనా స్వేచ్ఛను ఏదేశం అంగీకరిస్తుంది? హిందూ కెనడియన్లు కెనడా వీడి పోవాలంటూ గురుపత్వంత్‌ ‌సింగ్‌ ‌పన్నూ హెచ్చరించినప్పటికీ చర్యలు తీసుకోక పోవడం శోచనీయం’ అని చంద్ర ఆర్య పేర్కొన్నారు.

తాజా వివాదాలతో భారత్‌- ‌కెనడాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు బ్రేక్‌ ‌పడింది. ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారమైన తర్వాతే ఈ చర్చలను పునఃప్రారంభిస్తామని భారత్‌ ‌స్పష్టంగా చెప్పింది. ఇరుదేశాల మధ్య దాదాపు 200 విద్యా సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. 3.19 లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడా విద్యాసంస్థల్లో నమోదు చేసుకున్నారు. 2021లో కెనడా ఆర్థిక వ్యవస్థకు భారతీయ విద్యార్థుల ద్వారా మొత్తం 4.9 బిలియన్‌ ‌డాలర్లు (సుమారు రూ.40వేల కోట్లు) సమకూరింది.

కొన్నేళ్లుగా భారత్‌- ‌కెనడాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరిగింది. 2022-23 నాటికి 8.16 బిలియన్‌ ‌డాలర్లకు చేరింది. కెనడాకు ఫార్మా ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్ ‌పనిముట్లను భారత్‌ ఎగుమతి చేస్తుంది. వీటి విలువ 4.1 బిలియన్‌ ‌డాలర్లు. కాగా కెనడా నుంచి భారత్‌కు పప్పులు, కలప, కాగితం, మైనింగ్‌ ఉత్పత్తులు దిగుమతి అవుతాయి. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, ఆర్థిక సేవల విభాగాల్లో భారీగా పెట్టుబడులు ఉన్నాయి. ఇలా 2022 చివరి నాటికి 45 బిలియన్‌ ‌డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు అంచనా. కెనడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే నాలుగో దేశంగా భారత్‌ ‌నిలుస్తోంది. అయితే జీ20 సదస్సు వేళ చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు స్వేచ్ఛా వాణిజ్య సంప్రదింపులకు బ్రేకులు వేశాయనే చెప్పొచ్చు.

తండ్రీకొడుకులు ఇద్దరూ ఖలిస్తాన్‌ ‌మద్దతుదారులే

కెనడా ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడోది మొదటి నుంచి ఖలిస్తాన్‌ అనుకూల వైఖరే. ఆయన ప్రభుత్వాన్ని కాపాడు తున్నది ఖలిస్తానీ మద్దతుదారు న్యూ డెమొక్రటిక్‌ ‌పార్టీ. దాని నాయకుడు జగ్మీత్‌ ‌సింగ్‌ ‌ధాలివాల్‌ (‌జిమ్మీ). 2021 ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అసవరమైన మెజారిటీ ట్రూడోకు చెందిన లిబరల్‌ ‌పార్టీకి రాలేదు. మొత్తం 338 స్థానాలకు 150 మాత్రమే వచ్చాయి. 24 సీట్లు దక్కించుకున్న న్యూ డెమొక్రాటిక్‌ ‌పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనితో జగ్మీత్‌ ‌పార్టీ బలమైన శక్తిగా మారింది.

జస్టిన్‌ ‌ట్రూడో కాలంలో భారత్‌- ‌కెనడా సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా దిగజారాయని మనం భావిస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం- జస్టిన్‌ ‌ట్రూడో తండ్రి పిరె ట్రూడో కూడా ఖలిస్తానీల విషయంలో ఇలాగే అనుకూల వైఖరి అవలంబిం చారు. భారత్‌తో ఇలాగే ఘర్షణ పంథాలో నడిచారు. 300 మందికిపైగా భారతీయ ప్రయాణికులతో కూడిన కనిష్క విమానాన్ని గాల్లోనే ఉగ్రవాదులు పేల్చటానికి పరోక్షంగా కారణమయ్యారు. ఆ ఘటనపై విచారణ జరిపిన జస్టిస్‌ ‌జాన్‌ ‌మేజర్‌ ‌కమిషన్‌ ‌కూడా కెనడా నిఘా విభాగాన్ని, పోలీసులను, అధికారులను తీవ్రంగా తప్పుబట్టింది.

ఈ విమానం పేల్చితకు కారణమైన బబ్బర్‌ ‌ఖల్సా సభ్యుడు తల్వీందర్‌ ‌సింగ్‌ ‌పర్మార్‌ను ఇప్పగించాలని భారత్‌ ‌చేసిన అభ్యర్థను పిరె ట్రూడో తోసిపుచ్చారు. కనిష్క పేలుడుకు కారణమైన పర్మార్‌ను, ఇతరులనూ కెనడా ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇందర్‌జిత్‌ ‌సింగ్‌ అనేవాడికి 15 ఏళ్ల జైలుశిక్ష విధించి, మిగిలినవారిని వదిలేసింది. 1974లో పోఖ్రాన్‌లో భారత్‌ అణుపరీక్ష నిర్వహించ డాన్ని కూడా పిరె ట్రుడో వ్యతిరేకించారు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram