అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాష్ట్రం మొత్తం తమ సొంత జాగీరులా భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారం ద్వారా పెద్ద అవినీతికి పాల్పడుతున్నట్లు బీజేపీ మహిళా మోర్చా ఆరోపిస్తోంది. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేస్తోంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే క్రమంలో పురందేశ్వరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి మద్యంపై యుద్ధం ప్రకటించారు. మహిళా మోర్చా నేతలతో కలిసి నరసాపురంలోని మద్యం షాపులను ముట్టడించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని మద్యం తాగి అస్వస్థతకు గురై  ఆస్పత్రుల్లో్ల  చికిత్స పొందుతున్న పలువురిని ఆమె పరామర్శించారు. మద్యం సీసాలను పగులగొట్టి నిరసన తెలిపారు.

మహిళల పుస్తెలతో మద్యం అమ్మకాలు పెంచుతూ వైసీపీ నాయకులు జేబులు నింపుకుంటు న్నారని పురుందేశ్వరి ఆరోపించారు. రోజుకు లక్ష రూపాయలు అమ్మకాలు జరిపిన ఒక మద్యం షాపులో కేవలం 700 రూపాయలకు మాత్రమే బిల్లులు లెక్కలు చూపించారని, మద్యం అమ్మకాల ద్వారా జేబులను భారీగా నింపుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఇది అతిపెద్ద అవినీతి వ్యవహారమని, దీనిని ప్రజలకు వివరించడం ద్వారా ప్రభుత్వ దోపిడీని తెలియచేస్తామన్నారు. ఈ అవినీతి, అవకతవకలను వెలికి తీసేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. మద్య నిషేధంపై రాష్ట్రవ్యాప్తంగా దశల వారి ఉద్యమాన్ని చేపట్టి రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగినబుద్ధి చెబుతామని హెచ్చరించారు.

లెక్కల్లోనూ అక్రమాలు

రాష్ట్రంలో మద్యం పేరుతో భారీగా అవినీతి జరుగుతోందనేది బీజేపీ ఆరోపణ. రాష్ట్ర బడ్టెట్‌లో మద్యం ద్వారా రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందని వైసీపీ ప్రభుత్వం చూపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 15 శాతం మంది మద్యం తాగుతున్నారు. 5 కోట్ల ప్రజల్లో 15 శాతం అంటే 80 లక్షల మంది. వీరంతా ఒక్కొక్కరు సగటున రోజుకు రూ. 200 చొప్పున ఖర్చుపెడితే రోజుకు రూ.160 కోట్ల వంతున నెలకు రూ.4,800 కోట్లు, ఏడాదికి రూ.58,700 కోట్లు ఆదాయం వస్తుంది. మిగిలిన రూ.36,700 కోట్ల సొమ్ము ఎటు పోతోంది? ఇంతకన్నా పెద్ద అవినీతి ఉంటుందా? దీనిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే నిజానిజాలు వెలుగుచూస్తాయని బీజేపీ అంటోంది. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేసిన జగన్మోహన్‌రెడ్డి, తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే మద్యం విక్రయించే విధానాన్ని తెచ్చి మొత్తం వ్యాపారాన్ని అస్మదీయులకు అప్పగించి కోట్లు కొల్లగొట్టడం వాస్తవం కాదా అని బీజేపీ ప్రశ్నిస్తోంది? గతంలో అమ్మే బ్రాండ్‌ ‌మద్యం లేకుండా చేసి, కొత్త రకాలు అమ్ముతున్నారని, వీటి తయారీసంస్థల్లో అత్యధిక భాగం వైసీపీ నాయకులవేనని బీజేపీ ఆరోపిస్తున్నది. ‘లిక్కర్‌ ‌తయారీ కంపెనీల యామాన్యాలను బెదిరించి, వాటిని లాక్కుని పేర్లు మార్చి నడుపు తున్నారని చెబుతోంది. కంపెనీని స్వాధీన పరిచేందుకు నిరాకరించే వారి విషయంలో ఏదో లొసుగు/అంశాన్ని పట్టుకుని ఇబ్బంది పెడుతున్నారు. తన కంపెనీని ఇవ్వాలన్న అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ మాటను కాదన్నందుకు తన కంపెనీ మద్యాన్ని రాష్ట్రంలో అమ్మనీయడం లేదని ఒక తయారీదారుడు వాపోయారు.

నాసిరకం తయారీ ?

నాసిరకం మద్యం తయారవుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. మొలాసిస్‌కు ఈస్ట్ ‌కలిపి ఫర్మెంటేషన్‌ ‌చేస్తే దాంట్లోంచి రెక్టిఫైడ్‌ ‌స్పిరిట్‌ ‌వస్తుంది. ఆ స్పిరిట్‌ను డిస్టిల్‌ ‌చేస్తే దానిలో హెక్టైన్‌, ‌బ్యూటైన్‌, ‌హిమైన్‌ అనే హానికారక పదార్థాలు వస్తాయి. ఈ మూడింటిని వేరుచేసి ఈ రెక్టిఫైడ్‌ ‌స్పిరిట్‌లో కొంత నీరు కలిపి దుష్ప్రభావం లేకుండా ఉండేలా కంపెనీలు మద్యాన్ని తయారుచేస్తాయి. కాని రాష్ట్రంలోని కంపెనీలు ఈ మూడు హానికారక పదార్థాలను తొలగించకుండానే రూ.12 లకే రెక్టిఫైడ్‌ ‌స్పిరిట్‌ను తయారుచేసి మరో రూ.3 లతో నీరు, రంగుఫ్లేవర్‌ను కలిపి లీటర్‌ ‌మద్యాన్ని రూ.600 నుంచి రూ.800లకు అమ్ముతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. నాణ్యత లేని ఈ మద్యం తాగినవారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. పేగు సమస్యలు, ఉదర సమస్యలు, లివర్‌ ‌సిర్రోసిస్‌, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కాలేయ సమస్యలు, ఆల్కాహాలిక్‌ ‌న్యూరోపతి సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. కొందరు తక్కువ వయసులోనే చనిపోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వినియోగదారులే మద్యం దుకాణాల వద్ద చెబుతూ ప్రభుత్వాన్ని దూషించడం కనిపిస్తున్న విషయమే.

రాష్ట్రంలో తయారైన మద్యం తాగి మరణించిన వారి వివరాలు బీజేపీ జిల్లాల వారీగా సేకరిస్తోంది. ఈ జాబితాలను ప్రజలకు వివరించి రాష్ట్ర ప్రభుత్వం అమ్మే మద్యం గురించి, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రచారం చేయనుంది.

భారీ కమిషన్‌

‌ప్రభుత్వ పెద్దలకు కమీషన్‌ ‌ముట్టచెబుతున్న కంపెనీల నుంచే ఆంధప్రదేశ్‌ ‌బెవరేజెస్‌ ‌కార్పొరేషన్‌ (ఎపీఎస్‌ ‌బీసీఎల్‌) ‌మద్యం కొంటోందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కమీషన్ల రూపంలో ప్రభుత్వ పెద్దలకు ఏటా రూ. కోట్లు ముడుతున్నట్లు ఆరోపణ లున్నాయి. ఆ లెక్కన వెనకేసుకున్నదెంత? అనేది తేలాలి. ఏపీఎసీబీసీఎల్‌ ‌వద్ద సుమారు 100 కంపెనీలు నమోదు చేసుకోగా… వాటిలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులు, కమీషన్లు చెల్లిస్తున్న 18 కంపెనీలకే మద్యం కొనుగోళ్ల ఆర్డర్లు ఇవ్వడం ఏమిటని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

 రాయలసీమలోని ఒక దివంగత నేతకు చెందిన మద్యం కంపెనీని… వైసీపీ అధికారానికి వచ్చిన వెంటనే, ప్రభుత్వంలో నెం.2గా చక్రం తిప్పుతున్న నాయకుడి కుమారుడు స్వాధీనం చేసుకోగా, ఆ కంపెనీకే ఏపీఎస్‌ ‌బీసీఎల్‌ ‌రెండేళ్లలో రూ.1,863 కోట్ల విలువైన 1.16 కోట్ల కేసుల మద్యం కొనడానికి ఆర్డరిచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మద్య నిషేధం హామీని తుంగలో తొక్కి, నాసిరకం బ్రాండ్లు మాత్రమే దొరికేలా చేసి, ధరలు విపరీతంగా పెంచేయడం ప్రజల్ని దోచుకోవడం కాదా? అని ప్రశ్నిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌• ‌ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం వ్యాపారాన్ని కొందరు రాజకీయ నాయకులు, అధికారులు సిండికేట్‌గా ఏర్పడి తమ అధీనంలోకి తెచ్చుకుని, మూడేళ్లలో రూ.2,000 కోట్ల లబ్ధి పొందారని ఈడీ తేల్చింది. 800 దుకాణాలున్న ఛత్తీస్‌గఢ్‌లోనే అంత పెద్ద అవినీతి జరిగితే 2,934 దుకాణాలున్న ఏపీలో, మద్యం వ్యాపారం మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకున్న వైసీపీ నాయకులు, వారి అస్మదీయులు ఏ స్థాయిలో మింగేస్తూ ఉండాలి? అనేది చర్చనీయాంశం అయింది.

అప్పులే ముఖ్యం

మద్యంపై వచ్చే ఆదాయాన్ని సెక్యూరిటీగా చూపి అప్పులు తెచ్చుకోవడం దేశంలో ఒక్క ఆంధప్రదేశ్‌కే చెల్లింది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం పెంచి కార్పొరేషన్లకు మళ్లిస్తోంది. లిక్కర్‌పై వ్యాట్‌ ‌రూపంలో వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుని ఆ మొత్తాన్ని ఇతర రూపాల్లో వసూలు చేసుకునే అధికారం కార్పొరేషన్‌కు కల్పించింది. ఆ రాబడిని చూపించి రూ.వేల కోట్ల అప్పులు తెచ్చేస్తోంది. అంటే రాష్ట్రంలో ప్రజలు తాగుతూ ఉండాలి. దానిపై ఆ కార్పొరేషన్లకు రాబడి వస్తూ ఉండాలి. ఆ రాబడి నుంచి ఎప్పటికప్పుడు వేల కోట్ల వడ్డీలు చెల్లిస్తూ.. ఆ అప్పులు తీరుస్తూ ఉండాలి. అంతిమంగా రాష్ట్రంలో లక్షల జీవితాలు నాశనమైపోతున్నా వైసీపీ సర్కార్‌ అప్పులు తెచ్చుకుంటూ ఉంటుంది. ‘ఈ అప్పులు రాజ్యాంగ విరుద్ధం. ఇది చెల్లదు.. ఇది సరికాదు’ అని కేంద్రం, రిజర్వుబ్యాంకు ఘోషిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా రూ. వేల కోట్ల అప్పులు చేస్తోంది.

హామీలేమయ్యాయి?

అధికారం కోసం ప్రజలకు వైసీపీ లెక్కలేనన్ని హామీలిచ్చింది. అందులో ముఖ్యమైనది సంపూర్ణ మద్యపాన నిషేధం. ‘మద్యపానం కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమై పోతున్నాయి. అందుకే అధికారంలోకి రాగానే మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 స్టార్‌ ‌హోటళ్లకే పరిమితం చేస్తాం’ – 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్‌ ఇచ్చిన హామీ ఇది. దాంతో మహిళలు నమ్మి ఓటేసి గెలిపించారు. కాని నాలుగున్నరేళ్లుగా జరుగుతున్నది వేరు. నిషేధం మాట అటుంచి అమ్మకాలు పెంచేశారు. ప్రభుత్వం నాసిరకం సరకును రెండు రెట్లు అధిక ధరకు అమ్ముతుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అదికాక ఇక 20 ఏళ్లకు పైగా రాష్ట్రంలో మద్యనిషేధం అమలుకు నోచుకోకుండా ప్రభుత్వం బ్యాంకులతో అగ్రిమెంటు చేసుకుంది. మద్యం వ్యాపారాన్ని పాక్షికంగా కూడా నిషేధించమని అప్పుల కోసం బ్యాంకులకు వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే ఈ ప్రభుత్వం మద్య నిషేధానికి తిలోదకా లిచ్చినట్లే. మద్యపాన నిషేధ విషయంలో జగన్‌ ‌తమను మోసం చేశారని మహిళలు శాపనార్ధాలు పెడుతున్నారు.

పైగా ప్రభుత్వం అమలుచేసే అమ్మఒడి, చేయూత, ఆసరా పథకాలకు అవసరమైన నిధులను బెవరేజెస్‌ ‌కార్పొరేషన్‌ ‌ద్వారానే సమకూర్చు కుంటున్నట్లు ప్రభుత్వం చెప్పడం అర్థ్ధరహితం. మద్యానికి అలవాటుపడి బానిసలైనవారి జేబులు ఖాళీచేసి, అనారోగ్యం కలుగచేసి ఆయా కుటుంబా లను ఛిన్నాభిన్నం చేస్తూ, ఈ పథకాల పేర్లతో ఓట్లు కొనుగోలు చేసు కోవడం దుర్మార్గమని మహిళలు విమర్శిస్తున్నారు.

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ, ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram