– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌సెప్టెంబర్‌ 27‌వ తేదీన ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రపంచ దేశాలను హెచ్చరించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అక్కడితో ఆగలేదు. రెండు రోజుల తరువాత వాషింగ్టన్‌ ‌గడ్డ మీద నుంచే కెనడాకు పరోక్షంగా మొట్టికాయలు వేశారు. నిజ్జర్‌ ‌హత్య ఆరోపణల నేపథ్యంలోనే మా దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందంటూ అక్కడి అధికార ప్రతినిధులు చేసిన అధిక ప్రసంగానికి జవాబుగానే జైశంకర్‌ ‌స్పందించారు.

కెనడాలో హింసాత్మక వాతావరణం, దౌత్య వేత్తలను భయపెట్టే పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. ఇది ఎందుకంటే అక్కడ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదుల స్వర్గంలో భావ ప్రకటనా స్వేచ్ఛ స్వరూప స్వభావాలు ఇవేనని ఆయన ఎద్దేవా చేసినట్టయింది. కెనడాను, పాకిస్తాన్‌ను జమిలిగా విమర్శిస్తూ, నిజం చెప్పాలంటే ఆ రెండు దేశాలకు పెద్ద తేడాలేదని ప్రపంచం గుర్తించాలని కూడా ఆయన చెప్పినట్ట యింది. అదే సమయంలో ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట ఎంత వాస్తవమో జైశంకర్‌ ‌తన వాదనతో రుజువు చేశారు. జి20 యూనివర్సిటీ గ్రాండ్‌ ‌ఫినాలే కార్యక్రమంలో పాల్గొన్న మోదీ భారత్‌ ‌దౌత్య విధానం ఇప్పుడు శిఖరాగ్రం మీద ఉందని చెప్పారు. నిజానికి ఇవాళ్టి ఉగ్రవాదం, ఇతర సమస్యలకు మూలం కొన్ని అగ్రరాజ్యాలేనన్నది సత్యం.

 ఉగ్రవాదం విషయంలో తమ దేశ రాజకీయ ప్రయోజనాలను బట్టి కాకుండా, ఆ సమస్య నిర్మూలనకు చిత్తశుద్ధితో పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు. భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుకుంటున్న దేశాలను కూడా జైశంకర్‌ ‌తూర్పార పట్టారు. ఈ క్రమంలోనే ఆయన అగ్రరాజ్యాల గుత్తాధిపత్యానికి అంతిమ ఘడియలు సమీపించిన సంగతిని కూడా గుర్తించాలని అన్నారు. ఇదే జైశంకర్‌ ఉపన్యాసంలో ప్రపంచాన్ని ప్రధానంగా ఆకర్షించింది. ఐక్యరాజ్య సమితిపై కొన్ని దేశాలే ఆధిపత్యం వహించే రోజులు పోయాయని ఆయన తేల్చి చెప్పేశారు. జి20లో ఆఫ్రికన్‌ ‌యూనియన్‌కు స్థానం ఇచ్చిన చారిత్రక ఘటన ఐరాసకు ప్రేరణగా ఉండాలని కూడా జైశంకర్‌ ‌స్పష్టం చేశారు.

తలపండిన దౌత్యవేత్త జైశంకర్‌ ‌మాట్లాడు తున్నారంటేనే ప్రతి ఒక్కరు ఆసక్తి ప్రదర్శిస్తారు. ముఖ్యంగా ఎదుటివారు నోరెత్తని రీతిలో ధైర్యంగా ఆయన చెప్పే మాటలు ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకర్షిస్తాయి. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన సుబ్రహ్మణ్యం జైశంకర్‌ ‘‘‌కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమకు అనుకూలమైన రీతిలో నిర్వచిస్తున్నాయి’’ అని పరోక్షంగా కెనడాకు చురకలంటించడమే కాదు, ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న భారత ప్రతిష్టను, నాయకత్వ లక్షణాలను వెల్లడించడానికి అధిక ప్రాధాన్యమివ్వడం విశేషం. కెనడాను దోషిగా నిలపడంలో భారత్‌ ‌సాధించిన విజయం తక్కువదేమీ కాదు. ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడోయే మెట్టు దిగవలసిన పరిస్థితికి మన విదేశాంగ విధానం తెచ్చింది. ‘‘నాయకత్వం వహించే శక్తిగా ఎదగాలన్న ఆకాంక్షతో ముందుకు పోతున్న ప్పుడు మరింత బాధ్యతాయుతంగా, తోడ్పాటు నందించే రీతిలో వ్యవహరించాలి. మనం ఏర్పరచుకున్న లక్ష్యాలే, ముందువారి కంటే మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి’’ అన్నారు జైశంకర్‌. ‌తూర్పు-పశ్చిమ దేశాలమధ్య ధ్రువాత్మకత బాగా పెరిగిపోవడం, ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య విభజనరేఖ మరింత లోతుగా ఉన్న తరుణంలో దీన్ని సరిచేసేందుకు దౌత్యమార్గాలే చక్కని పరిష్కారమని జి-20 ఢిల్లీ సదస్సు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన జి-20 సమావేశాన్ని అధ్యక్ష స్థానంలో భారత్‌ ‌విజయ వంతంగా నిర్వహించిన తీరును సభ దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో ‘‘తీవ్రవాదం, హింసపై ప్రపంచం రాజకీయంగా తనకు అనుకూలమైన రీతిలో స్పందించే విధానం తప్పని’’ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ ‌పెంచి పోషిస్తున్న తీవ్రవాదం, జమ్ము- కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను చొప్పిస్తున్న తీరును ఎండగట్టడం సాధారణంగా భారత ప్రతినిధులు చేసే ప్రసంగాల్లో చోటుచేసుకుంటుంది. కానీ ఈసారి కెనడా పేరును ప్రస్తావించకుండానే ఆ దేశంపై విమర్శల అస్త్రాలను సంధించడం విశేషం.

 నిజానికి భారత్‌, ‌యు.ఎన్‌. ‌వేదికపై ఎప్పుడూ పాకిస్తాన్‌, ‌చైనా పేర్లను నేరుగా ప్రస్తావించదు. ప్రస్తుత పరిస్థితిలో కెనడా పేరును నేరుగా ప్రస్తావిస్తే, ప్రపంచ•వ్యాప్తంగా ఈ వార్త ఇప్పటికే పతాకశీర్షికల్లో ఉన్నందువల్ల, ఐక్యరాజ్య సమితి వేదికపై సమస్య మరింత జటిలమవుతున్న ఉద్దేశంతోనే జైశంకర్‌ ఆ ‌పని చేయలేదని దౌత్యనిపుణుల అభిప్రాయం. అంతేకాదు ప్రస్తుతం ఈ సమస్య కేవలం తమ రెండు దేశాలకే పరిమితమని భావించి దీన్ని మరింత రచ్చ చేయకూడదన్న ఉద్దేశంతోనే భారత్‌ ‌సంయమనంతో వ్యవహరించిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

కెనడా ఆరోపణల ‘మబ్బులు’ ఇప్పటి వరకు తిరుగులేకుండా సూర్యుడి మాదిరిగా వెలిగిపోతున్న భారత దౌత్యాన్ని కొంతమేర కప్పేసిన నేపథ్యంలో, మన దేశ ఆకాంక్షలను ప్రపంచానికి వెల్లడించడానికి జైశంకర్‌ ఈ ‌వేదికను ఉపయోగించుకున్నారనే చెప్పాలి. ‘‘గ్లోబల్‌ ‌సౌత్‌’’‌కు వాణిగా నిలబడటం, వర్థమాన దేశాల్లో నెలకొన్న అసహనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రాధాన్యతనివ్వడం కనిపిస్తుంది. గ్లోబల్‌ ‌సౌత్‌కు చెందిన 125 దేశాల సమస్యలను జి-20 అజెండాలో చేర్చడంలో అధ్యక్షురాలిగా భారత్‌ ‌కృతకృత్యమైన అంశంతో పాటు, కేవలం భారత్‌ ‌ప్రయత్నం వల్లనే ఆఫ్రికన్‌ ‌యూనియన్‌ ‌దేశాలకు జి-20లో శాశ్వత సభ్యత్వం లభించిందన్న సత్యాన్ని కూడా ఆయన సమావేశం దృష్టికి తెచ్చారు. అదీ కాకుండా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా, బలీయమైన ఆర్థికశక్తిగా రూపొందుతున్న భారత్‌ ‌ప్రాధాన్యతను వెల్లడిచేసే రీతిలో ఆయన ప్రసంగం కొనసాగింది. ముఖ్యంగా 415 మిలియన్‌ ‌ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన దేశంగా భారత్‌ ‌విజయాన్ని ఆయన సభ దృష్టికి తెచ్చారు.

నిజానికి కెనడా ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడో తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షులు వ్లాదిమిర్‌ ‌జెలన్‌స్కీ కెనడా పార్లమెంట్‌ను సందర్శిం చినప్పుడు, రెండో ప్రపంచయుద్ధంలో నాజీల తరపున పోరాడిన ఉక్రెయిన్‌ ‌వృద్ధ సైనికుడు యారోస్లావ్‌ ‌హంకా (98)ని పార్లమెంట్‌కు పిలిచి జస్టిన్‌ ‌ట్రూడోతో సహా పార్లమెంట్‌ ‌సభ్యులు ‘హీరో’గా ఆకాశానికెత్తేయడం తీవ్ర విమర్శలకు దారి తీయడమే కాదు ఏకంగా ఇజ్రాయిల్‌, ‌రష్యాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసే దాకా వెళ్లింది. యారోస్లావ్‌ ‌హంకాను ఆహ్వానించడానికి ప్రధాన కారకుడైన స్పీకర్‌ ఆం‌థోనీ రోటా అన్ని రాజకీయ పార్టీల ఒత్తిడితో రాజీనామా చేశాడు. చివరకు ప్రధాని ట్రూడో కెనడా ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. దీంతో కెనడా పరువు పోయింది. ఈ ప్రతికూల పరిణామం, నిజ్జర్‌ ‌హత్య విషయంలో భారత్‌పై ఆరోపణలు చేస్తున్న జస్టిన్‌ ‌ట్రూడో ప్రభుత్వంపై పడిందన్న సత్యాన్ని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. హర్దీప్‌సింగ్‌ ‌నిజ్జర్‌ ‌విషయంలో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడో తాజాగా భారత్‌కు అనుకూలంగా మాట మార్చడం ఆయన క్రమంగా నిజాన్ని గ్రహిస్తున్నారనడానికి సంకేతం. సెప్టెంబర్‌ 28‌న మాంట్రియల్‌లో ఆయన మాట్లాడుతూ ‘‘గ్లోబల్‌ ‌స్థాయిలో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను గుర్తిస్తున్నాం. ఇలాంటి సమయంలో కెనడా దాని మిత్ర పక్షాలు భారత్‌తో సంబంధాలను మెరుగు పరచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి’’ అన్నారు. భారత్‌ అభివృద్ధి చెందుతున్న ఆర్థికశక్తి. భౌగోళిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. కిందటేడాది ఇండో-పసిఫిక్‌ ‌వ్యూహాన్ని మేం అందించాం. తమ దేశం ఇప్పటికీ భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడానికి కట్టుబడి ఉందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేదన్నారు. అయితే నిజ్జర్‌ ‌హత్య విషయంలో అమెరికన్లు తమతోనే ఉన్నారని ఆయన పాతపాటే పాడినా, బ్లింకన్‌, ‌జైశంకర్‌ల మధ్య వాషింగ్టన్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అసలు నిజ్జర్‌ ‌ప్రస్తావనే రాకపోవడం కెనడా ప్రధానికి అశనిపాతం వంటిదే. భారత్‌- ‌మధ్య ప్రాచ్యం-యూరప్‌ ‌కారిడార్‌పై వీరి మధ్య ప్రధానంగా చర్చలు జరగడం నిజ్జర్‌ ‌హత్య వివాదాన్ని నెత్తికెత్తుకొని ‘తలకు రోకలి చుట్టుకున్న చందంగా’ ఇబ్బందులు ఎదుర్కొనడానికి అమెరికా సిద్ధంగా లేదన్నది స్పష్టమైంది. అవసరాలు మాత్రమే సంబంధాలను శాసిస్తాయన్న సత్యాన్ని జస్టిన్‌ ‌ట్రూడో ఇప్పటికైనా గ్రహించడం మంచిది.

ఇదిలాఉండగా కెనడాలో దారుణహత్యకు గురైన బెలూచిస్తాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త కరీమా బెలూచ్‌ ‌విషయంలో ఆ దేశ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడం లేదని బెలూచ్‌ ‌వాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మునీర్‌ ‌మంగల్‌ ‌వేస్తున్న ప్రశ్నకు కెనడా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. మానవ హక్కులు కేవలం తీవ్రవాదులకేనా? సాధారణ ప్రజలకు ఉండవా? అన్న ప్రశ్నలను ఆయన లేవనెత్తుతున్నారు.

 ‘‘పంచనేత్రాల’’ల్లో భాగమైన న్యూజిలాండ్‌, ఆ‌స్ట్రేలియా, ఇంగ్లండ్‌ ‌దేశాలు నిజ్జర్‌ ‌హత్య వివాదంలో తలదూర్చడం లేదు. కానీ కెనడా ఒత్తిడి అమెరికాపై తీవ్రంగా ఉంది. సాటి ఆంగ్లోసాగ్జన్‌ ‌దేశంగా, తన ఆర్థిక వ్యవస్థపై ఆధారపడే దేశంగా కెనడాకు మద్దతివ్వక తప్పని పరిస్థితి అమెరికాది. కానీ వర్తమాన భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఎట్టిపరిస్థితుల్లో భారత్‌ను వదులుకోలేదు. ఇదే సమయంలో అమెరికా రాజకీయాల్లో యూదుల లాబీ చాలా బలంగా ఉంటుందనేది తిరుగులేని సత్యం. డెమోక్రాట్స్ ‌లేదా రిపబ్లికన్స్ ‌వీరి మద్దతుకోసం విపరీతంగా ప్రయత్నిస్తారు. యూదు దేశమైన ఇజ్రాయిల్‌ ‌భారత్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడు. అమెరికాకు ఇక చెప్సాల్సిన అవసరమే లేదు. భారత్‌కు అనుకూలంగా అమెరికాలో పావులు తిప్పే సామర్థ్యం ఇజ్రాయిల్‌ ‌సొంతం. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్ ‌ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం ఆగిపోయే అవకాశాలే ఎక్కువ. అప్పుడు ప్రపంచ రాజకీయం సమూలంగా మారిపోక తప్పదు. ఇక కెనడా విషయానికి వస్తే 2025లో ఆ దేశంలో జరిగే ఎన్నికల్లో జస్టిన్‌ ‌ట్రూడో ఓటమి ఖాయమని ప్రస్తుత పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే భారత్‌-‌కెనడాల మధ్య సంబంధాలు మళ్లీ మామూలు స్థితికి రావచ్చు. కానీ భారత్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్‌.‌డి.ఎ. మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. అంటే అమెరికా, కెనడాల్లో నాయకత్వ మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ కానీ భారత్‌లో మాత్రం కాదు. ఈ పరిణామాలను గమనిస్తే, భారత్‌ ‌విదేశాంగ విధానం ‘‘మబ్బు లేని సూర్యుడిలా’’ వెలిగిపోవడం ఖాయం. ఇటీవల పాక్‌లో అమెరికా రాయబారి డేవిడ్‌ ‌బ్లోమ్‌ ‌పాక్‌ ఆ‌క్రమిత గిల్గిట్‌-‌బల్టిస్థాన్‌ ‌ప్రాంతంలో ఆరు రోజుల పాటు జరిపిన రహస్య పర్యటన వివాదం రేపింది. ఏడాది కాలంలో ఆయన ఈ ప్రాంతంలో పర్యటించడం ఇది రెండోసారి. కెనడా వివాదం నేపథ్యంలో భారత్‌ను ఇబ్బందిపెట్టే రీతిలో అమెరికా, పాక్‌ అనుకూల వైఖరి అవలంబిస్తున్నదంటూ వస్తున్న వార్తలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పి.ఒ.కె.లో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. వీటినుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికే అమెరికా రాయబారి పర్యటనను వెలుగులోకి తెచ్చారని భావించాలి. రాజకీయాలు ప్రజల ఆకలిని తీర్చవు. పి.ఒ.కె. ప్రజల ఇక్కట్లను డేవిడ్‌ ‌బ్లోమ్‌ ఏ ‌విధంగానూ తీర్చలేడు. యు.ఎస్‌. ఆ ‌పని చేయదు. ఇక చైనా పాకిస్తాన్‌లో తన ఆర్థిక నడవాకు తగులుతున్న ఎదురుదెబ్బల నేపథ్యంలో, ఆఫ్ఘనిస్తాన్‌ ‌ద్వారా ప్రత్యామ్నాయంగా తన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనదేశాన్ని వ్యతిరేకించిన పాక్‌ అడుక్కుతింటోంది. చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతోంది. కొండను ఢీకొన్న పొట్టేలు మాదిరి పరిస్థితి ప్రస్తుతం కెనడాది!

నిజ్జర్‌ ‌హత్యకేసులో మరో ట్విస్ట్

‌హర్‌దీప్‌ ‌సింగ్‌ ‌నిజ్జర్‌ ‌హత్యకేసులో మరో ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ‌చోటుచేసు కుంది. పాకిస్తాన్‌కు చెందిన ఐ.ఎస్‌.ఐ.‌పక్కా ప్రణాళికతో నిజ్జర్‌ను మట్టుబె ట్టినట్టు తాజాగా వార్తలు వస్తుండటం, భారత్‌- ‌కెనడాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య పరమైన ఇబ్బందుల నేపథ్యంలో కీలక పరిణామంగా చెప్పాలి. తారిఖ్‌ ‌కియానీ, రహత్‌రావు అనే ఇద్దరు అపరేటివ్స్‌ను ఐ.ఎస్‌.ఐ. ‌కెనడాలో నియమించి వారి ద్వారా సీమాంతర దేశాల్లో తమ కార్యకలాపా లను కొనసాగిస్తున్నదన్నది ఈ వార్తల సారాంశం. రావు, కియానీ, గురుచరణ్‌ ‌పన్నులకు ముఖ్యమైన ఆదాయ వనరు మత్తుమందులు, ఇమ్మిగ్రేషన్‌ ‌వ్యాపారం. నిజ్జర్‌ ‌హత్యకు ప్రధానంగా మూడు కారణాలు ఈ వార్తల ద్వారా వెల్లడవుతున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన వాధ్వాసింగ్‌, ‌రంజిత్‌సింగ్‌ ‌నీతాలు తమకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించలేక పోవడం, ఐఎస్‌ఐకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో గత రెండేళ్లుగా కెనడాలోకి కొత్తగా తాము ప్రవేశపెట్టిన గాంగ్‌స్టర్‌లకు మద్దతివ్వాలని వత్తిడి తీసుకు వస్తున్నప్పటికీ, నిజ్జర్‌ ‌పెడచెవిన పెట్టి, మాజీ ఖలిస్తానీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకోవడం ఐ.ఎస్‌.ఐ ‌బాస్‌లను ఆగ్రహానికి గురి చేసిందన్నది మొదటి కారణం. నిజ్జర్‌కు స్థానిక సిక్కు జాతీయుల్లో క్రమంగా పలుకుబడి పెరుగుతుండటం ఐఎస్‌ఐ ‌కన్నెర్రకు రెండో కారణం. కెనడాలో ఖలిస్తానీ శక్తులను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నిజ్జర్‌ ‌స్థానంలో మరొకరిని తీసుకొనిరావాలన్న ఉద్దేశంతో ఐఎస్‌ఐ ఈ ‌దుశ్చర్యకు పాల్పడిందన్నది మూడో కారణం. కెనడాలో నిజ్జర్‌ ‌నివాసానికి సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన మాజీ జనరల్స్, ‌హవల్‌దార్లు ఐ.ఎస్‌.ఐ. అధికార్లు నివసిస్తుం టారనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో కొత్తవారు నిజ్జర్‌ను సమీపించడం దుస్సాధ్యం కాబట్టి, అతడి హత్యకు రావు, కియానీలను ఐ.ఎస్‌.ఐ. ‌నియోగించి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా డ్రగ్స్ ‌వ్యాపా రం తారిఖ్‌ ‌కియానీ, రహత్‌రావులు నియంత్రిస్తుండటం వల్ల, వీరిలో ఎవరో ఒకరికి నిజ్జర్‌ను హత్యచేసే బాధ్యతను ఐఎస్‌ఐ అప్పగించి ఉండవచ్చునని ఈ వార్తలు పేర్కొంటున్నాయి. అయితే తాను కొత్తగా కెనడాలో ప్రవేశపెట్టిన క్రిమినల్‌ ‌నేపథ్యమున్న గ్యాంగ్‌లను నిజ్జర్‌ ‌హత్యకు ఐ.ఎస్‌.ఐ. ‌నియోగించిం దనేది మరో కథనం. కథ ఎన్ని మెలికెలు తిరిగినా నిజ్జర్‌ ‌హత్యలో అన్ని వార్తలూ ఐ.ఎస్‌.ఐ.‌నే చూపుతున్నాయి. ముసుగులు ధరించిన ఇద్దరు దుండ గులు, సాడాన్‌ ‌కారులో వచ్చి నిజ్జర్‌ ‌నడుపుతున్న ట్రక్‌కు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో అక్కడికక్కడ మృతి చెందాడన్నది కథనం. ఏకంగా అతనిపై దుండగుడు 50 బుల్లెట్లు పేలిస్తే, 34 నిజ్జర్‌ ‌శరీరంలో దూసుకుపోయాయని కూడా వార్తలు వచ్చాయి. ప్రభుత్వ సంస్థలే ఇటువంటి హత్యకు పాల్పడితే ఇన్ని బుల్లెట్లు ప్చేరని, కేవలం ఇది ప్రతీకారంగా చేసిన హత్యేనన్నది ఈ వార్తల్లో వ్యక్తమవుతున్న ఒక వాదన కోణం భారత్‌కు అత్యంత బలాన్నిచ్చే అంశం. సంఘటన జరిగిన 20 నిమిషాల వరకు పోలీసులు ప్రదేశానికి చేరుకోలేదని కూడా వార్తలు వచ్చాయి. హత్యకు ఆరురోజుల ముందు నిజ్జర్‌ ‌కెనడా అధికార్లను కలిసాడని అదేవిధంగా హత్య జరగడానికి ముందు గురుద్వారాకు వెళ్లమని కొంతమంది కెనడా అధికార్లు నిజ్జర్‌కు సూచించారన్నది కూడా వార్తల సారాంశం. మరి అన్ని జాగ్రత్తలు తీసుకునే నిజ్జర్‌ ‌గురుద్వారాకు వెళుతున్నాడని హంతకులకు చెప్పిందెవరన్నది ఇప్పటికీ మిస్టరీనే! ఏమైతేనేం ఐఎస్‌ఐ ‌చాలా జాగ్రత్తగా పక్కా ప్లాన్‌తో నిజ్జర్‌ను హతమార్చి ఆ పాపాన్ని భారత్‌ ‌మీదకు నెట్టడంలో విజయం సాధించిందని కూడా ఈ వార్తలు వెల్లడించాయి.

కేవలం గుప్పెడు మంది తీవ్రవాదులు, ప్రపంచ దేశాల సంబంధాల్లో ఏ విధంగా చిచ్చుపెట్టగలరో, దౌత్యనీతిని ఏ విధంగా ఛిద్రం చేయగలరో తెలియ జెప్పే ఒక గొప్ప దృష్టాంతం ఇది. జస్టిన్‌ ‌ట్రూడో వంటి అపరిపక్వ దేశాధినేతలు వీరి ఉచ్చులోపడి, తమ దేశ ప్రతిష్టను ఏ విధంగా మంట గలుపుతారో, ఇదే సమయంలో భారత్‌లో మోదీ వంటి పరిణితి చెందిన రాజకీయ నాయకత్వం ఈ విపరిణామాన్ని ఏ విధంగా సమర్థవంతంగా తిప్పికొట్టగలదో కూడా ప్రపంచ రాజకీయ యవనిక వీక్షించిన అరుదైన ‘విచిత్ర’ సంఘటనగా నిజ్జర్‌ ఉదంతం ప్రపంచ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.

About Author

By editor

Twitter
Instagram