సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ఆశ్వీయుజ శుద్ధ నవమి – 23 అక్టోబర్‌ 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఎంత చిన్న యుద్ధమైనా ఇప్పుడు ప్రపంచ సమస్య. ఇప్పటికే ఉక్రెయిన్‌`రష్యా యుద్ధం ప్రపంచం నెత్తిన కొరివిలా మండుతున్నది. ఇప్పుడు ఇజ్రాయెల్‌, ముస్లిం ఉగ్రవాద సంస్థ హమాస్‌ మధ్య నెలకొన్న ఘర్షణ యుద్ధ వాతావరణాన్ని తీవ్రం చేసింది. హమాస్‌ తన సొంత బలంతోనే యుద్ధంలో దిగిందని ఇప్పుడు ఎవరూ భావించరు. ఎన్ని సంస్థలు, దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అండదండల నిస్తున్నాయో ఇప్పటికే బయటపడిరది.  మన ఇరుగుపొరుగు కూడా హమాస్‌నే సమర్థిస్తున్నాయి. ఈ యుద్ధం ఆగవలసిన అవసరం గురించి ప్రపంచ ప్రజలకి ప్రత్యేకంగా ఎవరూ పాఠాలు చెప్పక్కరలేదు. చిన్నదైనా, పెద్దదైనా యుద్ధం దారుణ అనుభవాలను మిగిల్చేది మాత్రమే. ఇది ఇజ్రాయెల్‌ను సమర్థించేవారికీ, హమాస్‌ను సమర్థిస్తున్నవారికీ తెలిసినదే. కానీ మారిన అంతర్జాతీయ పరిస్థితులను గమనించకుండా, స్థానిక రాజకీయాలు, రాజకీయ వైఫల్యాలు, బుజ్జగింపు వంటి నాటు పంథాల ఆధారంగా ఆ యుద్ధం గురించి మాట్లాడడమే హాస్యాస్పదం. ఇప్పుడు భారత ప్రతిపక్షం చేసిన పని ఇదే.

భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. కానీ విపక్షం ప్రభుత్వ విధానానికి పూర్తి వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్నది. ఈ పనిలో కాంగ్రెస్‌ ముందు ఉన్నది. దేశంలో కొన్నిచోట్ల పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. కానీ ఈ యుద్ధం మొదలుపెట్టినదెవరు? అన్ని నీతిసూత్రాలను, నైతిక విలువలను ధ్వంసం చేసినదెవరు? నిస్సందే హంగా హమాస్‌. అయినా విపక్షాలు వాస్తవాలు మాట్లాడకుండా హమాస్‌ను సమర్ధిస్తున్నాయి. అందుకు భారత రాజకీయాలలోని బుజ్జగింపు జాడ్యమే కారణం. పాలస్తీనా ప్రజల హక్కులను గౌరవించే విధంగాను, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉండే విధంగాను ఇజ్రాయెల్‌ మీద వత్తిడి తేవాలని కొన్ని భారతీయ విపక్షాలు ఎలుగెత్తాయి. కొందరు కేంద్ర మాజీ మంత్రులు, పార్లమెంట్‌ ప్రస్తుత, మాజీ సభ్యులు కలసి నేరుగా భారత్‌లో పాలస్తీనా రాయబారి అద్నాన్‌ మహమ్మద్‌ జబేర్‌ అబూలాహ్యాజాను ఇటీవల కలసి ఈ మాట చెప్పారు. ఆ ప్రబుద్ధులలో మణిశంకర్‌ అయ్యర్‌, శ్రీకాంత్‌ జెనా, బీఎస్‌పీ ఎంపీ దానిష్‌ అలీ, ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ రaా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావెద్‌ అలీ, జేడీయూ  నేత కేసీ త్యాగీ, సీపీఐ నాయకుడు డి. రాజా, సీపీఎం నాయకుడు నీలోత్పల్‌ బసు, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు షాహిద్‌ సిద్దికి, సీపీఐ(ఎంఎల్‌) నాయకుడు దీపాంకర్‌ భట్టాచార్య ఇంకొందరు కలసి అద్నాన్‌ను పరామర్శించి వచ్చారన్నమాట. గాజాలోని పాలస్తీనా వారి మీద ఇజ్రాయెల్‌ విచక్షణా రహితంగా బాంబుదాడులు చేయడాన్ని కూడా ఆ బృందం ఖండిరచిందని వార్త. అది ఒక వర్గం ప్రజల మీద జరిగిన మూకుమ్మడి హత్యాకాండగానే చూడాలని చెప్పింది. యుద్ధం చేస్తున్న ఇరువర్గాలు తక్షణం శత్రుభావనను వీడి, ఇంకా అమాయక జనం మరణించకుండా, మౌలిక వ్యవస్థలు ధ్వంసం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపక్ష బృందం ముక్తాయించింది.

మతోన్మాద ఉగ్రవాద సంస్థ హమాస్‌కు పాలస్తీనా దూరంగా జరుగుతున్న క్రమంలో మన విపక్షం ఇలాంటి అడుగు వేయడం ఎలాంటి విజ్ఞత?  పాలస్తీనా అధారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌ డబ్ల్యుఏ ఎఫ్‌ఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారు? హమాస్‌ చర్యలు, విధానాలు పాలస్తీనాకు ప్రాతినిధ్యం వహించేవి కావనే చెప్పారు. వెనుజులా అధ్యక్షుడు నికోలస్‌ మాడురోతో ఫోన్‌ ద్వారా చర్చించిన అబ్బాస్‌ పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఏకైక సంస్థ పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్‌ఓ) మాత్రమేనని చెప్పినట్టు కూడా ఆ వార్తా సంస్థ తెలియచేసింది.  అన్ని విధాల అండగా ఉండే అమెరికా కూడా ఇజ్రాయెల్‌ను ఆచితూచి అడుగు వేయవలసిందనే సూచిస్తున్నది. గాజా మీద ముప్పేట దాడికి ఇజ్రాయెల్‌ సిద్ధమవుతున్న సమయంలో, ఆ ప్రాంతాన్ని ఎక్కువ కాలంలో అధీనంలో ఉంచుకునే యోచన మంచిది కాదనే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హితవు చెప్పారు.

ఈ పరిణామంలో గమనించవలసిన అంశం` ఇజ్రాయెల్‌ సరిహద్దులు దాటి హమాస్‌ చొరబడిన కొద్దిగంటలలోనే ప్రధాని నెతన్యాహూ, నేషనల్‌ యూనిటీ పార్టీ నాయకుడు బెంజీ గన్జ్‌ చరిత్రాత్మక ప్రకటన చేశారు. ఆ ఇద్దరు రాజకీయ శత్రువులు. అయినా  తాము అత్యవసరంగా యుద్ధ కాలపు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. హమాస్‌ దాడికి ముందు క్షణాల వరకు కూడా వారి పార్టీల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. నెతన్యాహూ తీసుకురాదలచిన న్యాయ సంస్కరణలు ఇందుకు కారణం. అయినా తమ దేశంపై శత్రువు యుద్ధం ఆరంభించాడు కాబట్టి ఇజ్రాయెల్‌ రాజకీయపక్షాలన్నీ తాత్కాలికంగా విభేదాలను పక్కన పెట్టి సమైక్యంగా బయటి శత్రువుతో పోరాటానికి దేశాన్ని సమాయత్తం చేశాయి. ఇక్కడే దేశీయ, జాతీయ ధర్మం కనిపిస్తాయి. కౌరవులతో వైరం వరకు పాండువులు ఐదుగురు. కౌరవులు నూర్గురు. కానీ బయటి శత్రువుతో పోరాడవలసి వస్తే మనం నూట ఐదుమందిమి అని చెబుతాడు ధర్మరాజు. ఇది మహాభారత రచనా కాలానికి చెందిన మాటే కావచ్చు. కానీ ఒక వ్యవస్థ హితాన్ని నిజంగా కాంక్షించే రాజనీతి ఇదే. ఇప్పుడు ఇజ్రాయెల్‌ రాజకీయ పక్షాలన్నీ అనుసరించిన రాజనీతి ఇదే. ఇలాంటి ఇంగితజ్ఞానం మన విపక్షాలకు  లేదు!  నిజంగా వాటికి కావలసినది శాంతి కాదు. హమాస్‌ చేసిన దుండగాలు వారికి తెలియనివా? మొదట యుద్ధం ప్రకటించి, దొంగచాటుగా పసిపిల్లలను కూడా వదలకుండా అకృత్యాలు చేసిన హమాస్‌ విషయంలో ఆచితూచి వ్యవహరించవద్దా? మన రాజకీయ అనైక్యత ఇరుగు పొరుగుకు ఎలాంటి సంకేతాలు పంపుతుందో కూడా ఊహించని బాధ్యతా రాహిత్యం ఏమిటి?

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram