– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

రైల్వేబోర్డు… జయావర్మ సిన్హా… ఈ రెండు పేర్లూ ఇప్పుడు మారు మోగుతున్నాయి. భారతీయ రైల్వేది అనేక దశాబ్దాల చరిత్ర. ప్రపంచ స్థాయిలో అతిపెద్ద వ్యవస్థగా ప్రఖ్యాతి. అమెరికా, రష్యా, చైనావంటి అగ్రదేశాలతో సరి పోల్చదగిన అత్యంత భారీ సంస్థ. మన కేంద్ర ప్రభుత్వంలోని అత్యంత కీలక శాఖ. దేశవ్యాప్తంగా వేలాది స్టేషన్లు, వాటి ద్వారా నిత్యమూ కోట్లమంది ప్రయాణి కుల రాకపోకలు. నిరంతరం వారందరి భద్రతకే పెద్దపీట. ప్రయాణాలకు, వస్తు రవాణాకు సమధిక ప్రాధాన్యం. మొత్తం మీద 170 సంవత్సరాల సుదీర్ఘ పయనం. ఇంకా ధాటిగా చెప్పాలంటే – జాతి జీవరేఖ రైల్వేశాఖ, విధి విధానాలు, నిర్దేశిత లక్ష్యాలతో అలుపూ సొలుపూ తెలియనంత యాత్ర! ముందుగా సంస్థాగతమైన సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ. దాని కొనసాగింపుతో సురక్షణ సాధించడం అనంతర ధ్యేయం. అంటే శాస్త్రీయతా కల్పన, భద్రతాసాధన. దీనికోసమే లక్షలాది సిబ్బంది ఉన్నారు. ప్రణాళికలు, కార్యాచరణలు అసంఖ్యాకంగా రూపొందిస్తున్నారు. ఆశించిన మార్పుచేర్పులను నిర్ణీతకాలంలో సాకారం చేసుకోవాలంటే, దృఢతర నిర్వాహక బృందం అత్యవసరం. అందుకే రైల్వేబోర్డు. ఉద్యోగుల సంఖ్య, కంప్యూటర్‌ ‌వినియోగ సామర్థ్యంపైన చూపులన్నీ కేంద్రీకృతమై ఉంటాయి. పరిపాలనా సౌలభ్యం కోసమే జోన్ల వారీగా వర్గీకరణ. ప్రతీ ప్రాంతీయ విభాగం నిర్వహణలోని ప్రాంతాలను డివిజన్లుగా ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. అలా దేశమంతటా కలిపి ఎన్నెన్నో డివిజన్లు. అన్ని విధాలా ప్రాముఖ్యమున్న రైల్వేబోర్డుకి శతాబ్ద కాలం తర్వాత తొలి అధ్యక్షురాలు జయ. ఈ కారణంగానే ఇవే పేర్లు ఇప్పుడు ప్రతిధ్వనిస్తున్నాయి మరి.

‌రైల్వే శిఖరాగ్రంగా పేరొందిన బోర్డు తరచుగా నివేదికలను భారతీయ మంత్రిత్వశాఖకు పంపు తుంటుంది. ప్రధాన కార్యాలయముంది దేశ రాజధాని నగరంలోనే. ప్రయాణికులకు సేవలు, ఛార్జీలకు సంబంధించిన సర్వీసులు, అనుబంధ రవాణా పక్రియలు, ట్రావెల్‌ ఏజెన్సీ కార్యకలాపాలు, ఇతర పనులన్నీ బోర్డు పరిధిలోనివే. అధ్యక్షుడు / అధ్యక్షురాలితోపాటు కార్యదర్శి; అదే విధంగా ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ‌ట్రాఫిక్‌ ‌పరంగా సభ్యులుంటారు. స్టాఫ్‌ ‌తరఫున ఒకరు, ఫైనాన్స్ ‌కమిష నర్‌గా ఒకరు విధులు నిర్వర్తిస్తుంటారు. భద్రత, మార్కెటింగ్‌ ‌విభాగాల పనులు పర్యవేక్షకులూ పనిచేస్తుంటారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన కొన్ని ఏళ్ల వరకు చీఫ్‌ ‌కమిషనర్‌ ‌పాత్ర ఉండేది కానీ, అటు తర్వాత లేదు.  బోర్డు ప్రతినిధుల సంఖ్యనీ ఆనాడే కుదించారు. విధాన నిర్ణయాలు, సాంకేతిక అంశాల పరంగా బాధ్యతలను అప్పగించి; కాలక్రమంలో బోర్డును విస్తరించారు. అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారమంతటినీ నవీకరిస్తుంటారు. సమస్యల పరిష్కార సమాచారం, సవాళ్లు – వాటిని ఎదుర్కొంటున్న విధానం, అభివృద్ధి కార్యక్రమాల సమగ్రవివరణ, సవాళ్లు – వాటిని ఎదుర్కొంటున్న విధానం, అభివృద్ధి కార్యక్రమాల సమగ్రవివరణ, రైల్వే టూరిజం, ముఖ్యమైన డాక్యుమెంట్ల వివరణ మంతటినీ ప్రదర్శిస్తుంటారు. ఉద్యోగ వివరం, బోర్డు తీర్మానాలు, ఇంకా ఎన్నెన్నో అంశాలను రైల్వే బోర్డు తరఫున పొందుపరుస్తుంటారు. క్విక్‌లింక్స్ ‌నిర్వహణ మరొక విధి. ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తున్నపుడు సహజంగానే మన మదిలో దక్షిణ మధ్య రైల్వే మెదులుతుంది. విశిష్టమైన ఈ జోన్‌ ఏర్పాటై వచ్చే అక్టోబరు నాటికి ఐదున్నర దశాబ్దాలకు పైనే అవుతుంది. దీని నియంత్రణలోనే పలు విభాగాలు, ఇవి ఉభయ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధప్రదేశ్‌లతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్రలకు సంబంధించిన ప్రాంతాలు. ఇదే జోన్‌లోని రైల్వేస్టేషన్లు అనేకం. ఈ సమాచార దర్శినిలో రైళ్ల రాకపోకల సమయాలు, నిర్ణీత స్టేషన్లు, సీట్ల లభ్యతలు, రైల్వే రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు వివరాలు, ఆర్థిక, సాంకేతిక విషయాలెన్నో పొందుపరిచి ఉండటం కనిపిస్తుంది. ఇలా అనేకానేక పనుల్ని సమన్వయం చేయాల్సిన బోర్డు ఛైర్‌పర్సన్‌ ‌కర్తవ్యాలంటే మాటలా? దీక్షాదక్షతలన్నవారికే సుసాధ్యం.

ఆకట్టుకున్న శైలి

బోర్డు ఛైర్‌పర్సన్‌, ‌ప్రధాన కార్యనిర్వహణ అధికారిణిగా జయను నియమించడం ఎంతైనా విశేషం. మొత్తం బోర్డు చరిత్రలోనే ఈ ప్రధాన పదవిని పొందిన మహిళామణి ఆమె. ఇప్పటికే అధికార బాధ్యతలు చేపట్టారు. 2024 ఆగష్టు నెలాఖరువరకు విధులు నిర్వహిస్తారు. తన నియమానికి కేంద్ర క్యాబినెట్‌ ‌నియామకాలు కమిటీ ఆమోదముద్ర వేసినప్పుడు, అందరూ హర్షించారు. జయావర్మ భారతీయ రైల్వే మేనేజిమెంట్‌ ‌సర్వీసెస్‌కి చెందినవారు. ఇప్పటివరకు ఆపరేషన్స్, ‌బిజినెస్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌పరంగా రైల్వేబోర్డు సభ్యురాలిగా ఉంటూ వచ్చారు. ఇంతదాకా సీఈవోగా ఉన్న అనిల్‌ ‌స్థానాన్ని జయ భర్తీ చేసినట్లయింది. నిర్ణాయక శక్తికి పేరు గడించిన ఈ వనిత అలహాబాద్‌ ‌విశ్వవిద్యా లయంలో చదువుకున్నారు. 1998లోనే భారతీయ రైల్వే ట్రాఫిక్‌ ‌సర్వీసులో చేరారీమె. అంతేగాక; వివిధ జోన్లలో పలు హోదాల్లో పని చేశారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సేవ లందించిన వ్యక్తి. మునుపు బంగ్లాదేశ్‌లోని భారత హై కమిషన్‌లో రైల్వే సలహాదారుగా ఉన్న అనుభవశీలి. అక్కడ విధులు నెరవేరుస్తూ ఉన్న తరుణంలోనే మైత్రీ ఎక్స్‌ప్రెస్‌ ‌ప్రారంభం అయింది. అది ఇక్కడి కోల్‌కతా నుంచి అక్కడి ఢాకాకు ప్రయాణం. ఆ సందర్భంలో జయ ఎంతగానో పరిగణన అందుకోగలిగారు. ఆమెను దేశప్రజలంతా ప్రసార సాధనాల్లో చూసింది గత జూన్‌ ‌ప్రాంతంలో. ఆ సమయంలోనే ఒడిశాలో సంభవించిన రైలు ప్రమాదం ప్రతీ ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. అదే సంఘటన పూర్వాపరాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందచేసిన సహాయాలు, చేపట్టిన నిర్ణయా లన్నింటినీ తానే విలేకరుల ముందు ఉంచారు. వీటన్నింటి నేపథ్యంలో సరికొత్త నియామకం ఎందరెందరి దృష్టినో ఆకట్టుకుంది. తానే రైల్వేబోర్డుకు పరిపాలనాధినేత్రి. తానే రైల్వే మంత్రిత్వశాఖకు సంబంధించినంతవరకు ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ. శాఖలో మూడున్నర దశాబ్దాల సేవకు ప్రతిఫలమా అన్నట్లు ఇప్పుడు ఈ నూతన పదవిని స్వీకరించారు.

అనుభవాల ప్రాతిపదికగా…

ఉత్తరప్రదేశ్‌లోని మహానగరం ప్రయాగరాజ్‌. ‌జనసంఖ్యలో అధికం, అభివృద్ధిలో ప్రధానం. విద్య, సాంస్కృతిక రంగాలకు ఆలవాలం. అదే జయవర్మ స్వస్థలం. పాఠశాల విద్య నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్‌ ‌స్థాయివరకు అక్కడే. ఆమె తండ్రి ప్రభుత్వ ఉన్నతాధికారి. ఆమె సోదరుడు సైతం ఉన్నత స్థాయి అధికారే. సైకాలజీ చదువుకున్న జయ అటు తర్వాత ఉద్యోగ పర్వంలో భాగంగా, కాన్పూర్‌ ‌సెంట్రల్‌ ‌స్టేషనులో అసిస్టెంట్‌ ‌కమర్షియల్‌ ‌మేనేజర్‌గా ఎంపికయ్యారు. రైల్వే బోర్డులో మొదటి మహిళా సభ్యురాలిగా విజయలక్ష్మి ఉండేవారు. అయితే మొదటి అధ్యక్షురాలి స్థానం మాత్రం జయనే వరించింది. గత అనుభవాలు, నేర్చుకున్న అంశాలు, తెలుసుకున్న సరికొత్త సమాచారాల ప్రాతిపదికగా ఆమె ఈ మధ్య వ్యక్తపరచిన అభిప్రాయాలు ఇవీ;

–  వనితాశక్తికి సరిహద్దులు లేవు. వాటిని ఎవరూ నిర్ణయించలేరు కూడా. నిర్దేశించడమూ సాధ్యం కాదు ఎవరికీ.

–  విధి నిర్వహణ పట్ల అంకిత భావం సహజంగానే స్త్రీలలోనే ఎక్కువ. చిత్తశుద్ధితోపాటు నిజాయతీ, అవసరమైతే ఎటువంటి పరిస్థితినైనా ఎదిరించి నిలిచి గెలవడం వారికి బాగా తెలుసు.

–   అవకాశాలు ఉండాలేగానీ, వేదికలు లభించాలే కానీ స్త్రీ శక్తి తప్పకుండా ప్రస్ఫుటమవుతుంది. అది ఎప్పుడూ కాంతిమంతమే.

–  రైల్వే బోర్డులో ప్రధానంగా కావాల్సింది నిర్ణయశక్తి. ఆచరణకు వీలుగా, సహకార సమన్వయాలనూ పెంపొందించాల్సి ఉంటుంది. అదంతా నాకు ఇప్పుడు ఒక అవకాశంగా లభించింది.

–  క్షేత్రస్థాయి సమస్యలు, ఇతర స్థితిగతులు తెలుసుకోగలిగాను. వాటిమీద ఒక అవగాహన అయితే నాకు ఉంది. పరిష్కార దిశలో ఎటువైపు నుంచి ఏఏ అవరోధాలు వస్తాయన్నదీ ఇప్పటికే గ్రహించగలిగాను. తెలుసుకుంది ఆచరించడమే ఇక జరగాలి.

– వ్యవస్థలోని లోటుపాట్లు, బలహీనతలు తెలియనివేమీ కావు. ఒక ఉన్నతాధికారిణిగా, సంస్థ అధ్యక్షురాలిగా వాటి వివరాలను సభ్యుల నుంచి, ఇతర విభాగాల నుంచి ఆహ్వానిస్తాను. అన్ని కోణాల నుంచీ ఆలోచించి, ఏ సమస్యకి ఎటువంటి పరిష్కారం చేయాలన్నది ఆలోచించు కుంటాను. స్వయం నిర్ణయానికే ప్రాముఖ్యం. అదే సందర్భంలో వివిధ వర్గాల అబిప్రాయాలనీ పరిగణనలోకి తీసుకుంటాను.

–  పరిధిలో తీసుకునే నిర్ణయాలు ఎటూ ఉంటాయి. ఒక్కోసారి; వాస్తవ పరిస్థితులు, మారుతున్న రీతుల ఆధారంగానూ నిర్ణయాలను మార్చు కోవాల్సి వస్తుంటుంది. అందుకు నేనేమీ వెన కాడను. రైల్వే బోర్డు అంతిమ లక్ష్యం – ప్రజా ప్రయోజనాల పరిరక్షణ. అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ఉండేలా నా వంతు ప్రయ త్నాలను నేను తప్పక చేస్తాను.

స్థిరమైన నిశ్చయం, దృఢమైన కార్యశీలత నిండిన జయవర్మ అంతరంగ తరంగాలే అవన్నీ! అన్నీ నెరవేరతాయని, ఆమె సారధ్యంలో రైల్వే జీవన రేఖ మరింత కాంతివంతమవుతుందని మన మందరం కూడా ఆశించవచ్చు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram