సనాతన ధర్మం మీద వస్తున్న విమర్శలకు దీటుగా స్పందించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ సమావేశంలో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీనికి భుజాలు తడుముకోవలసిన వాళ్లంతా వెంటనే తడుముకున్నారు. అందులో మొదటి స్థానం తమిళనాడు మొదటి కుటుంబానిదే. వీళ్లు తాజాగా సనాతన ధర్మం మీద మొదలుపెట్టిన యుద్ధం ప్రమాదకరమైనది. భారతదేశాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టివేయాలన్న కుట్రతో జరిగినది. దీని వెనుక ఉన్నవి ఇంకెన్ని? 

సీతా మహాసాధ్వినీ, రైలు బోగీలో దయనీయంగా కన్నుమూసిన కరసేవకులనీ స్టాండప్‌ ‌కమేడియన్‌ల పేరుతో ముస్లిం ఉన్మాదాలు ఎద్దేవా చేస్తారు.

జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడితే అన్ని మర్యాదలు మరచిపోయి నాయకులు, ఆచార్యులు, పత్రికారచయితలు కోరస్‌గా అడ్డమైన కూతలూ కూస్తారు.

రామచరిత మానస్‌లో కొన్ని కులాలను అవమానించే వ్యాఖ్యలు ఉన్నాయంటూ దగ్ధకాండకు సిద్ధమవుతాడు ఇంకొకడు.

అయోధ్యలో గుడి ఎందుకు? కళాశాలో, ఆసుపత్రో కట్టొచ్చు అంటాడొకడు.

సనాతన ధర్మం డెంగీ, కరోనా వంటిది, నిర్మూలించాలంటాడు ఒకడు.

కళాశాల విద్యార్థులంతా దేశం మీద పడి సనాతన ధర్మాన్ని విమర్శించే ఉపన్యాసాలు ఇవ్వాలంటుంది ఒక పార్టీ.

సనాతన ధర్మం ఎయిడ్స్ ‌వంటిది, ప్రపంచానికే ముప్పు అని పేలతాడు ఇంకొకడు.

భారతదేశంలో కింది కులాలకు, మైనారిటీలకు రక్షణ లేదంటూ అంతర్జాతీయ వేదికల మీద మాత్రమే లెక్చర్లు దంచుతాడు మరొకడు.

డిజ్‌మ్యాంటిలింగ్‌ ‌గ్లోబల్‌ ‌హిందుత్వ అంటూ విదేశీ విశ్వవిద్యాలయాలలో గోష్టులే పెడతారు పనీపాటా లేని దేశద్రోహులు.

ఈ సరస్వతి ఎవరు? ఈ లక్ష్మి ఎవరు? ఎవరికి పుట్టారు అని వాగుతాడొకడు.

కానీ, అల్లాను ఏమన్నా సర్‌ ‌తన్‌సే జుదా అంటూ వీరంగం వేస్తారు.

దీనికంతటికీ ఉన్న ఒక పేరు భావ ప్రకటనా స్వేచ్ఛ.

ఈ ధోరణికి ఉన్న ఇంకా పెద్ద పేరు సెక్యులరిజం.

ఇలాంటి భావ ప్రకటనా స్వేచ్ఛ, సెక్యులరిజం వెర్రితలలు వేసి, ముదిరి దేశ సమైక్యతకు ముప్పు స్థాయికి ఎదిగిపోతున్న తరుణంలో ఇప్పుడు ప్రధాని మోదీయే నేరుగా ఎదురుదాడికి దిగారు. ఇది అనివార్యం.

మధ్యప్రదేశ్‌, ‌చత్తీస్‌ఘడ్‌ ‌రాష్ట్రాల పర్యటనలో (సెప్టెంబర్‌ 15) ‌ప్రధాని ఘాటుగా, సూటిగా సనాతన ధర్మ ద్వేషులపై విమర్శలు చేశారు. ‘దురహంకార కూటమి (ఇండియా కూటమి) ఇటీవలే ముంబైలో సమావేశమైంది. దానికి ఒక విధానం లేదు. ఒక నాయకుడు లేడు. సనాతన ధర్మం మీద దాడి చేస్తూ, నాశనం చేయాలన్న ఒకే ఒక్క అజెండా మాత్రం ఉంది’ ఎలాంటి దాపరికాలూ లేకుండానే పెద్ద ఎత్తున విమర్శకు దిగారు మోదీ. ‘సనాతన ధర్మం నుంచి గాంధీజీ స్ఫూర్తి పొందారు. ఆయన సాగించిన స్వాతంత్య్ర పోరాటం సనాతన ధర్మం కేంద్రంగానే సాగింది. గాంధీజీ జీవితాంతం అదే పాటించారు. రాణి అహల్యాబాయి హోల్కార్‌, ‌ఝాన్సీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్‌ ‌వంటి వారంతా సనాతన ధర్మాన్ని నమ్మి ముందుకు సాగారు.’ మరిచిపోయారా? అన్నట్టు ప్రధాని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో వీరందరినీ అవమానపరుస్తూ విపక్ష కూటమి బహిరంగంగా నీచ విమర్శలకు దిగుతోంది. నిజానికి అవి విమర్శలు కావు. మెజారిటీ ప్రజల మనోభావాల మీద దాడులు. సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నవారంతా దీనిని గమనించాలి అని ప్రధాని గుర్తు చేశారు. అంటే భారత్‌లో తమ ఆటలు సాగాలంటే, మళ్లీ బొఫో ర్సులు, ఆసియాడ్‌ అవినీతి, టూజీ అవకతవకలు జరగాలంటే ఇప్పుడు ప్రభుత్వం పోవాలి. గతంతో బీజేపీకి ఉన్న ప్రేమను తుంచాలన్నదే వాళ్ల కుట్రగా ప్రధాని భావిస్తున్నారు. అది నిజమే కూడా. సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నవాళ్లంతా అధికారం కోసమే ఇదంతా చేస్తున్నారు.

‘భారత్‌ను, ప్రాచీన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కనుమరుగు చేయాలని చూస్తున్న విపక్ష ఇండియా కూటమి కుయుక్తుల పట్ల ప్రజలు నిత్యం జాగరూకులై ఉండాలి’ అని ప్రధాని నేరుగా పిలుపునివ్వడంలోని అంతరార్థం ఇదే అనిపిస్తుంది. మన దేశానికి మన విశ్వాసాలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని కూడా అన్నారు. ‘కొందరు అధికారం కోల్పోయాక ప్రజల పట్ల ద్వేషం పెంచు కున్నారు. అందుకే ప్రజల గుర్తింపుపై, సంస్కృతిపై దాడి చేస్తున్నారు. దేశంలో వేలాది సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్నదే వారి లక్ష్యం. సనాతన ధర్మం వ్యక్తులకు కాదు, వారు చేసే కర్మకు (పనులకు) ప్రాధాన్యం ఇస్తుం’దని ప్రధాని లోతుగానే విమర్శించారు. ఆ క్రమంలోనే సనాతన ధర్మంపై సాగుతున్న దాడికి దీటుగా స్పందించాలని ప్రధాని నేరుగా పిలుపునిచ్చారు.

ప్రస్తుతం భారతదేశంలో హిందువులనూ, సనాతన ధర్మాన్నీ కించపరిస్తే కొన్ని నిర్దిష్ట ప్రయోజ నాలు సిద్ధంగా ఉంటున్నాయి. మొదటి ప్రయోజనం, ఆ మాత్రం వాగుడు సామర్థ్యం ఉంటే అతడు రాత్రికి రాత్రే మేధావి స్థానానికి ఎదిగిపోతాడు. కొందరికి రాజకీయ పార్టీలలో గుర్తింపు వస్తుంది. కొందరికి ఉద్యోగాలలో పదోన్నతులు కూడా దక్కుతాయి. అన్నింటికీ మించి మైనారిటీల ఓట్లు రావాలంటే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు, ఇతర సంకర రాజకీయ పార్టీలు అనుసరించిన ఏకైక వ్యూహం హిందూ వ్యతిరేకత. ప్రస్తుతం ఈ రకమైన ఓట్ల ఉన్మాదం, పదవీ దాహం హిందూ వ్యతిరేకతతో తీర్చుకోవాలన్న దురద నాయకులలో మితిమీరింది. బీజేపీ, ఒకటి రెండు దాని మిత్రపక్షాలు తప్ప హిందూ ద్వేషంతో ఓట్లు సంపాదించుకోవాలన్న విధానమే ఎక్కువ పార్టీలలో నేడు సుస్పష్టం. ఈ క్రమంలోనే తామంతా ఏకం కావాలన్న ఆలోచనకు హిందువులు రావలసిన అవసరం ఉందని ప్రధాని నిష్కర్షగానే చెప్పినట్ట యింది. ఇప్పుడు హిందూధర్మం మీద వినపడుతున్న వ్యాఖ్యలు కఠోరమైనవి. కుసంస్కారం నిండి ఉన్నవే. వీటిని భావ ప్రకటనా స్వేచ్ఛగానో, ఇక్కడ సెక్యులరిజం అంటే ఇదే అని నమ్మించడానికో జరుగుతున్న కుట్రలాగే కనపడుతున్నది. అయితే ఇదంతా దేశంలో తమ తమ విశ్వాసాలను రుద్దాలని ప్రయత్నిస్తున్న ఎడారి మతాలకు వీరి వైఖరి సాయపడుతోంది.

దేశంలో తానొక సచ్చీలుడనైన రాజకీయవేత్తగా చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ అనేకసార్లు హిందూత్వను విమర్శించినవాడే. ఆఖరికి రామమందిరం నిర్మాణం తథ్యమని తేలిన తరువాత కూడా, అంటే 2014లో కూడా అక్కడ ఆలయం కట్టడం సాధ్యమని మా నాయనమ్మ కూడా నమ్మడం లేదని సెలవిచ్చిన అహంకారి ఇతడు. అలాగే అయోధ్య వివాదాస్పద స్థలంలో ఆసుపత్రి, లేదా పాఠశాల వంటివి నిర్మించాలంటూ అనేక పర్యా యాలు ఉచిత సలహా కూడా పడేశాడు. వీటన్నిటికీ పరాకాష్ట 2019లో ఇతడు సామాజిక మాధ్యమాలలో పెట్టిన బొమ్మ. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే స్వస్తిక్‌ ‌మీద ఆమ్‌ఆద్మీ పార్టీ గుర్తు చీపురుతో ఒక వ్యక్తి దాడి చేస్తున్నట్టు ఆ చిత్రంలో ఉంది. మోదీ ప్రభుత్వం తన తప్పిదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నదని చెబుతూ, జేఎన్‌యూకు నిప్పు పెట్టిన హనుమను, మోదీని చిత్రించిన ఒక వ్యంగ్య చిత్రాన్ని కూడా కేజ్రీవాల్‌ ‌సామాజిక మాధ్యమాలలో ఒక సందర్భంలో ఉంచాడు.

నోటివాటంతో బతికే రాజకీయ నాయకులకు హిందూత్వయే పెద్ద ఆధారం. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ఎం‌పీ మొహువా మొయిత్రా ఇందుకు మంచి ఉదాహరణ. జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిన మాట వాస్తవం. అది భారత పురావస్తు శాఖ కనుగొన్న శివలింగం. న్యాయస్థానాలు ధ్రువీకరించిన వాస్తవం. కానీ ఈమె ఒక ట్వీట్‌లో ఈసారి బాబా అటామిక్‌ ‌పరిశోధన కేంద్రంలో తవ్వ కాలు జరుగుతాయని ఆశిద్దాం అంటూ వ్యాఖ్యా నించారు. జ్ఞానవాపి మసీదులో వజూఖానాలో దొరికిన శివలింగం మీద ఎవడి నోటికి వచ్చినట్టు వాడు వాగాడు. రాతలు రాశారు. వీటికి పరాకాష్ట ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చరిత్ర ఆచార్యుడు రతన్‌లాల్‌ ‌పెట్టిన పోస్టు. ఆ శివలింగాన్ని చూస్తే శివుడికి కూడా ఆనాడు సున్నతి జరిగిందని అనిపిస్తుంది అన్నాడతడు. ప్రొఫెసర్‌ ‌రవికాంత్‌ ‌చందన్‌ అనే మరొక అజ్ఞాని మరొక విపరీత వ్యాఖ్య చేశాడు. కొందరు అర్చకుల చట్టవిరుద్ధ కార్య కలాపాలకు ఆగ్రహించే ఔరంగజేబు కాశీ ఆలయాన్ని నేలమట్టం చేశాడట. ఇలాంటి అజ్ఞానులకు ప్రొఫెసర్‌ ఎస్‌ఎల్‌ ‌భైరప్ప రాసిన ‘ఆవరణ’ నవల చదివితే కాస్త జ్ఞానం వస్తుంది. కనువిప్పు కలిగే అవకాశం ఉంది. చిత్రం ఏమిటంటే, ఈ చరిత్ర ఆచార్యత్వం వెలగబెడుతున్న ఆ మూర్ఖుడు చందన్‌ ‌ప్రస్తావించిన ఆ పుస్తకం, రచయిత కూడా విశ్వసనీయత కలిగినవి కావు. తాను ఈ పుస్తకం పూర్తి ఆధారాలతో రాయలేదనీ, కాబట్టి ఇందులోని విషయాన్ని లోతైనదిగా భావించవద్దని చెప్పుకున్నాడు. కానీ మాట్లాడడానికి ఏమీ లేని ఇలాంటి అజ్ఞానపు పీఠాధిపతులు వాటినే ఎంచుకుని వాగుతున్నారు. రఖీబ్‌ ‌హమీద్‌ ‌నాయక్‌ అనే మరొక ఉన్మాది కూడా తన అజ్ఞానం మొత్తం ప్రదర్శించుకున్నాడు. అమెరికా అధ్యక్ష భవనం, దాని ముందు నీటి ఫౌంటేన్‌ ‌ఫోటో పెట్టి, ఇక్కడ నీటి ఫౌంటేన్‌ ఉన్నా శివలింగం దొరకలేదని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రకటించారు అని రాసకున్నాడు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించు కోవాలి. టీవీ చర్చలలో, లేదా కాలమ్‌లలో ఇలాంటి ముస్లిం మేధావులు, జర్నలిస్టులు తమవైన విశ్వాసాలు, మతం ఆధారంగానే మాట్లాడుతున్నారు తప్ప, వాస్తవం జోలికి పోవడం లేదు. యాంకర్‌ ‌ప్రశ్నతో పనిలేదు. తాము దేశం మీద రుద్ద దలిచిన వాదననే ముందుకు తెస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అయినా, పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చిన సత్యమే అయినా వాళ్లకి పట్టదు. మత పరిధి నుంచి మాత్రమే దేనినైనా వారు చూస్తున్నారు. ఈ ధోరణికి ప్రస్తుతం ఉన్న పేరు సెక్యులరిజం.

ప్రొఫెసర్లు, ముల్లాలు, రోడ్డున పోయే ఆవారాలు అంతా కూడా హిందూధర్మం ప్రస్తావన వచ్చేసరికి ఒకే విధంగా స్పందిస్తున్నారు. ఒకే రకమైన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ లేని తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. అలీఘడ్‌ ‌ముస్లిం యూనివర్సిటీ అనుబంధ జేఎన్‌ ‌వైద్యకళాశాల ఫోరెన్సిక్‌ ‌ప్రొఫెసర్‌ ‌డాక్టర్‌ ‌జితేంద్రకుమార్‌ ఇం‌దుకు మంచి ఉదా హరణ. లైంగిక అత్యాచారం గురించి విద్యార్థులకు వివరించవలసి వచ్చినప్పుడు హిందూదేవుళ్లను ప్రస్తావిస్తూ పాఠం చెప్పడం ఇతడి జబ్బు. దీని మీద దర్యాప్తు జరిపిన అధికారులు వాస్తవాలు నిగ్గు తేలిన తరువాత సస్పెండ్‌ ‌చేశారు. ఇతడు తరగతి గదిలో చెప్పినవి రాయడానికి కూడా సందేహించవలసి వస్తున్నది. అంత జుగుప్సాకరం.

దేశంలో ఎనభయ్‌ ‌శాతానికి పైగా హిందువులు. వ్యాపారాలన్నింటికి వారి కొనుగోలు శక్తే ఆధారం. అయినా వ్యాపార సంస్థలకు హిందువు అంటే గౌరవం లేదు. ఇది నిజం. 2019లో రెడ్‌ ‌లేబుల్‌ అనే టీ పొడిని మార్కెట్‌లోకి విడుదల చేసినప్పుడు ఒక వ్యాపార ప్రకటన వచ్చింది. ఒక హిందువు వినాయకుడి బొమ్మ కొనడానికి వెళతాడు. బేరం జరుగుతూ ఉండగా, వృద్ధుడైన బొమ్మల వర్తకుడు స్కల్‌ ‌కేప్‌ ‌తీసుకుని పెట్టుకుంటాడు. దీనితో ఆ హిందువు తాను ముస్లిం దగ్గర కొనుగోలు చేయనని వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. కానీ అప్పుడే ఆ బొమ్మల వర్తకుడు టీ ఇస్తాడు. వెంటనే అది తీసుకుని తాగుతాడు హిందువు. పైగా బొమ్మ కొనుగోలు చేస్తాడు. ఎంత అవమానం! తనిష్క బంగారు ఆభరణాల వ్యాపారులు లవ్‌ ‌జిహాద్‌ను ప్రేరేపిస్తున్న తీరులో వ్యాపార ప్రకటన విడుదల చేసి, చివరికి ఉపసంహరించుకున్నారు.

కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ విదేశీ వేదికల మీద చేసిన ప్రకటనలు మొత్తం భారత జాతిని అవమానించేవే. ఇటీవల కూడా నాలుగు ఐరోపా దేశాల పర్యటనలో ఆయన ఇదే చేశాడు. ఒకటే పాట – భారతదేశంలో మైనారిటీలకు రక్షణ లేదు. కింది కులాలవారికి దిక్కు లేదు. శాంతి భద్రతలు లేవు. ఫాసిజం రాజ్యమేలుతోంది. ఇవే. రాహుల్‌, ఈయన పార్టీ కాంగ్రెస్‌ ‌కేంద్ర బిందువుగా ప్రస్తుతం ఇండియా కూటమి ఇరుసుగా సాగుతున్న రాజకీయాలు మొత్తం హిందూ వ్యతిరేక కార్య కలాపాలే. ఇందులో ఉన్న చాలా పార్టీలు హిందూ వ్యతిరేక భావజాలంతో ఉన్నవే. ఇవేనా! ఇండియా కూటమితో కలవక పోయినా హిందువుల ప్రయోజ నాలు, విశ్వాసాలు, మనోభావాలు పట్టని పార్టీలు దేశం నిండా ఉన్నాయి. కేసీఆర్‌ ‌బీఆర్‌ఎస్‌, ‌జగన్‌ ‌వైఎస్‌ఆర్‌ ‌కూడా ఇలాంటివే. రాజకీయాలతో ప్రమేయం లేదని చెప్పుకుంటూ, సామాజిక కార్యకర్తలమంటూ, సాంస్కృతిక కార్యకర్తలమంటూ స్వయం ప్రకటిత మేధావులకు కూడా తక్కువ లేదు. వీరందరి లక్ష్యం ఒక్కటే- హిందూ వ్యతిరేక ప్రచారం. ఇందుకు తాజా ఉదాహరణ తమిళనాడు ఉదయనిధి స్టాలిన్‌ అనే మంత్రి, డీఎంకే ఎంపీ ఎ. రాజా చేసిన వ్యాఖ్యలు. వీటికి సమాధానం ఇవ్వక తప్పదు. గళం విప్పక తప్పదు. సామాజిక, న్యాయపోరాటం చేయకా తప్పదు. నిజానికి ఇందుకు మోదీ పిలుపునివ్వవలసిన అవసరం లేదు. ప్రతి భారతీయుడు అందుకు నడుం కట్టాలి.

భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చీకటి దినాలుగా మిగిలిపోయే కొన్ని రోజులు ఉన్నాయి. సెప్టెంబర్‌ 17,1949 అలాంటి రోజే. ద్రవిడ మున్నేట్ర కళగం అనే ఒక వేర్పాటువాద, విధ్వంసక పక్షం ఆవిర్భవించి నది ఆ రోజునే. అదే డీఎంకే. ఆ మరునాడే పార్టీని ప్రారంభించిన సీఎన్‌ అన్నాదురై తన రాజకీయ, సైద్ధాంతిక గురువు గురించి మహత్తరమైన సత్యాలని తమిళులకి వెల్లడించాడు. ఆ గురువు పేరే ఈవీ రామస్వామి నాయకర్‌. ‌కొందరు పెరియార్‌ అన్న బిరుదు కలిపి పిలుస్తారు. అన్నాదురై మాటల ప్రకారం పెరియార్‌ ఒక నియంత. తన వయసులో సగం కంటే తక్కువ వయసు ఉన్న మణియమ్మాళ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే తామందరి ఆశయం సోషలిస్టు ద్రవిడమ్‌ ‌వికసించడమే కాబట్టి నాయకర్‌ ‌చిరకాలం జీవించి ఉండాలనీ కూడా అన్నాదురై ఆకాంక్షించాడు. ఇంతకీ ద్రవిడమ్‌ అం‌టే దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజ్యం. ఔను, డీఎంకే ఆద్యంతాలు విభజన రాజకీయాలు. వేర్పాటు ధోరణి.

పెరియార్‌ అభిప్రాయాలు, ప్రకటనలు ఎంత రాక్షసంగా, అవివేకంతో విరాజిల్లేవో చెప్పడానికి మాటలు చాలవు. ఆగస్ట్ 15, 1947‌న స్వాతంత్య్రం రావడానికి కొద్ది ముందు (జూలై 27) ఆ స్వాతంత్య్రం మూడు ‘బి’లకు సంబంధించినది (బ్రిటిష్‌, ‌బనియా, బ్రాహ్మణ) మాత్రమేనని ఎద్దేవా చేశాడు. 1939 నుంచి కూడా ద్రవిడ ఉద్యమం ఆ మూడు కులాలను శత్రువులగానే పరిగణించింది. కానీ అన్నాదురై మాత్రం ఆ మూడు కులాలలో ఒక ‘బి’ని (బ్రాహ్మణ)ని వదిలేశాడు. మిగిలిన రెండింటి గురించి చెప్పాడు. కానీ ఈ సిద్ధాంతం ఓట్లు సంపాదించేవరకే. 1967లో అన్నాదురై రాజాజీతో చేతులు కలిపాడు. 1971లో కరుణానిధి ఇందిరాగాంధీతో చేతులు కలిపాడు. చిత్రంగా ఆ రెండు సందర్భాలలోను కట్టు తప్పి చేసుకున్న ఒప్పందం కారణంగా ఓడిపోయినది ‘స్వచ్ఛమైన తమిళుడు’ కామరాజ్‌ ‌నాడార్‌ ‌కావడం విశేషం. తరువాత అన్నాదురై డీఎంకేకి దూరంగా జరిగాడు. తరువాత ఒకసారి డీఎంకే, మరొకసారి అన్నాడీఎంకే గెలుస్తూ తమిళనాడును ఏలాయి. ఇప్పటికీ ఏలుతున్నాయి.

బురదలో దిగి కంకణం తీసుకోమని చెప్పే పంచతంత్రం కథలో ముసలి పులిలాగే మాట్లాడు తున్నాడు తమిళనాడు దేవదాయ ధర్మాదాయ మంత్రి శేఖర్‌ ‌బాబు. ఇంత గొడవ జరిగిన తరువాత కూడా డీఎంకే హిందువులను హృదయ పూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నదనీ, తమ పార్టీ సనాతన ధర్మాన్ని సమర్థిస్తుందనీ సిగ్గూ ఎగ్గూ లేకుండా చెప్పడం ఎంత విడ్డూరం! ద్రవిడ కళంకులు మొత్తం సనాతన ధర్మాన్ని టోకున వ్యతిరేకించరట. ఆ ధర్మంలో సతీసహగమనం ఉంది కాబట్టి డీఎంకే వ్యతిరేకమట! ఇప్పుడెక్కడ ఉంది, సహగమనం. అలాంటి పనే ఈ డీఎంకే సాక్షాత్తు తమిళనాడు శాసనసభలో చేసింది. జయలలిత వస్త్రాలు నిండు సభలో చింపిన పార్టీ అది. అలాగే సనాతన ధర్మంలో కులం గొడవ ఉందట. ఎంత భేషజం! డీఎంకేలో లేదా? కులం అనేది పురోగామి అంశం కాదట. తాత, తండ్రి, మనవడు అధికారం పట్టుకు వేలాడితే అది పురోగతి అవుతుంది కాబోలు. డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ మిగలలేదు కాబట్టి సనాతన ధర్మం అనే అంశాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రచారం చేస్తున్నారని శేఖర్‌బాబు అభిప్రాయం. సనాతన ధర్మంలో ఆడవారు శీలరక్షణ కోసం సతీసహగమనం చేసేవారని కొత్త చారిత్రక అంశాన్ని శేఖర్‌బాబు సృష్టించాడు. పైగా ఈ సూక్ష్మం అన్నామలైకి అర్ధం కావడం లేదని కూడా తేల్చారు. ఇంతకీ ఉదయనిధి వాగిన వేదిక మీద ఆశీనుడై సర్వం మైమరచి విన్న శేఖర్‌బాబుకి హఠాత్తుగా ఇలాంటి జ్ఞానోదయం ఎందుకయినట్టు? ఏమీలేదు. ముంబై మైరారోడ్‌ ‌పోలీసు స్టేషన్‌లో సనాతన ధర్మం మీద అవాకులూ చెవాకులూ వాగినందుకు ఉదయనిధిపై కేసు నమోదైంది. వెంటనే శేఖర్‌బాబు నాలుక మడత పడింది. బుర్ర పనిచేసింది. సామాజిక స్పృహ, భావ ప్రకటనా స్వేచ్చలకు వక్రభాష్యం చెప్పుకుంటూ ఇటీవల కొందరు బాధ్యతలేని రచయితలు కూడా ఈ విధ్వంసక శిబిరంలో భాగస్వాములు అవుతున్నారు. సనాతన ధర్మం మీద కారుకూతలు కూయడానికి ఉదయనిధి ఎంచుకున్న వేదిక ఇలాంటి రచయితలు సమకూర్చినదే. పేరు కూడా సనాతన ధర్మ వ్యతిరేక సభ. ధనిక, పేద వర్గాల మధ్య ఘర్షణ అనివార్యమన్న నమ్మకంతో ఉన్న ఎర్ర ర•చయితలు అది వట్టి భ్రమ అని తేలిపోయాక, కులాల మధ్య చిచ్చుతో అలాంటి ఘర్షణ తేవాలని, అంతిమంగా అదే సోషలిజాన్నీ వీలైతే కమ్యూనిజాన్ని తెస్తుందని నమ్ముతున్నారు. వీళ్లని ఉదయనిధి వంటివాళ్లు ఉపయోగించుకుంటారు. నిజానికి సినిమా, రచనారంగం, పత్రికారంగం మొదటినుంచి ద్రవిడ వాద ప్రచారానికి చెప్పుల మాదిరిగా ఉపయోగ పడ్డాయి. కరుణానిధి ఎంత నీచమైన మాట మాట్లాడినా దానిని ఖండించేవారూ, ఖండిచని వారూ చివరికి చెప్పే మాట, ఆయనో గొప్ప రచయిత. అయితే ఏమిటి? రచయితల పని ఇదా? మనో భావాలను గాయపరచడమా? సంస్కారహీనంగా వాగడమా? అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, దిగిపోయాక ఒకరకంగా దేవుడి గురించి మాట్లాడ డమా? చిత్రంగా ఉదయనిధి వాగిన తరువాత కాంగ్రెస్‌ ‌యువతరం కూడా దానిని అందుకున్నది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక శాసనసభ సభ్యుడు ప్రియాంక్‌ ‌ఖర్గే, రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు చిదంబరం కుమారుడు కార్తి కూడా ఉదయనిధి చెప్పిందాంట్లో సత్యం ఇబ్బడిముబ్బడిగా ఉందని తేల్చి పారేసినవారే. అందుకే ఇండియా కూటమి ఒక సనాతన ధర్మ వ్యతిరేక శిబిరం అని దేశం గుర్తించవలసి ఉంటుంది. ఈ దేశాన్ని తిలకం ధరించే కొందరు చీల్చారని ఆర్‌జేడీ నాయకమన్యుడొకడు కొత్త చరిత్ర ఉల్లేఖించాడు.

తమిళ భాషా సమాజానికి కొన్ని దశాబ్దాలుగా ఒకే విషయం వినడం అలవాటైపోయింది. అది హేతువు పేరుతో సాగిన నిర్హేతుక విషప్రచారం. పెరియార్‌ ఈవీ రామస్వామినాయకర్‌, ‌సీఎన్‌ అన్నాదురై, తరువాత ఎం. కరుణానిధి ఊకదంపుడు అది. అంతా హిందూత్వం మీద నీచమైన దాడి. మాటల నిండా వెకిలి. అడుగుకో గుడి కనిపించే తమిళ నాడులో ఈ రకమైన వాగాడంబరం ఒక మత్తులా పనిచేస్తోంది. బ్రాహ్మణుల ఆధిపత్యం మీద పోరు అంటూ గాలితో యుద్ధం చేయడం, చెమటలు కక్కడం మరొక అంశం. దేవుళ్లని బూతులు తిట్టడం ఇంకొక జుగుప్సాకర ధోరణి. ఇలాంటి ఒక అధమాధమ ధోరణిని తమిళనాడులో ప్రవేశపెట్టిన వాడు రామస్వామి నాయకర్‌.

‘‌దేవుడే లేడు. అతడిని సృష్టించినవాడొక మూఢుడు. దేవుడు పేరు చెప్పుకునే వాడొక అజ్ఞాని. దేవుడిని ఆరాధించేవాడొక అనాగరికుడు’ ఇది రామస్వామి నాయకర్‌ ‌మతం. ద్రవిడవాద భాష్యం. దీనికి కొనసాగింపు ఎంకె స్టాలిన్‌ ‌కుమారుడు, తమిళనాడు యువజన సంక్షేమ, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ‌చేసిన వ్యాఖ్యలు. ఈ రకమైన ఒక విష సంస్కృతికి కారణం అడిగితే రొంబ పైత్యంతో కూడిన విశ్లేషణ ఒకటి చేస్తూ ఉంటారు. సనాతనం అంటే మిగిలిన భారతదేశానికంతటికీ ఒక రకంగాను, తమిళనాడు ప్రజలకు మాత్రం వేరే విధంగాను అర్థమవుతుందిట. సనాతన ధర్మానికి ద్రవిడనాడు దూరమని వారు చెబుతారు. కులం పేరు చెప్పి సమాజాన్ని విడదీసే దుష్టత్వం సనాతన ధర్మంలో ఉందట. ఇంతకాలం ఇలాంటి అబద్ధాలతో డీఎంకే బతికిపోయిందని, సామాజిక మాధ్యమాలు బలంగా ఉన్న ఈ కాలంలో ఆ కట్టుకథలు చెల్లవని, జనం ఈ వేర్పాటువాద పైత్యాన్ని అర్థం చేసుకుంటు న్నారని బీజేపీ నాయకులు అంటున్నారు.

నిజానికి ఉదయనిధి ప్రేలాపన పట్ల డీఎంకేలోనే కొందరు అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సనాతన ధర్మం అంటే, అది చెప్పే సిద్ధాంతాలు సాధారణ ప్రజలకు అర్థం కాని మాట నిజమే. అయినా ఆ ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు తిడితే వాళ్లు సహించరు. రాజ్యాంగం అందరూ చదవరు. అందరికీ అర్ధం కూడా కాదు. కానీ రాజ్యాంగాన్ని దూషిస్తే ప్రతిస్పందన ఉంటుంది. సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం మీద విమర్శ కూడా అంతే అంటున్నారు వారు. ఈ విషయం అర్ధం చేసుకోవా లని డీఎంకేలోనే కొందరు అభిప్రాయపడడం విశేషం. ఎందుకంటే, ప్రస్తుత పరిస్థితులు వేరు. ఈ కాలం తీరు వేరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అది బీజేపీకి లాభం చేకూర్చవచ్చు. అంటే నాస్తిక రాజ్యంలో బీజేపీ చొరబడవచ్చునని వారు భయపడుతున్నారు. ఉదయనిధి వ్యాఖ్యలతో ఒక వర్గం ఇకపై డీఎంకేకి దూరం కావచ్చు. ఇంకొన్ని వర్గాలవారు ఆ వ్యాఖ్యల కారణంగానే డీఎంకే వెనుక చేరవచ్చునని అంటున్నారు. ఈ వర్గాలు ఏవో ఊహించడం కష్టం కాదు. ఉదయనిధి ఒక క్రైస్తవుడు. ఆ వర్గం డీఎంకే చెంతకు చేరవచ్చు.

సనాతన ధర్మం మీద ద్వేషాన్ని ఒక సామాజిక సంక్షోభం దిశగా తీసుకువెళ్లాలన్న ఆలోచన డీఎంకేలో ఈసారి స్పష్టంగానే కనిపిస్తున్నది. ఉదయ నిధి డెంగ్యూ, కరోనా అంటూ విమర్శించాడు. కేంద్ర మాజీ మంత్రి అదే పార్టీ ఎంపీ ఎ. రాజా అయితే హెచ్‌ఐవీ అంటూ మరింత దిగజారి విమర్శలకు దిగాడు. ఈ వివాదాన్ని విద్యార్థుల మధ్యకు తీసుకుపోయి అశాంతి వాతావరణం సృష్టించే ప్రయత్నం కూడా జరిగింది.

తమిళనాడులోని తిరువారూర్‌ ‌జిల్లాలోని ఒక ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను ఇందుకు ఉపయోగించుకోవాలని డీఎంకే చూసింది. తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి ద్రవిడవాద నాయకుడు అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 15‌న డీఎంకే కత్తూరు అనే చోట సనాతన ధర్మ వ్యతిరేక కార్యక్రమం నిర్వహించింది.తరువాత తిరువారూర్‌లో ఉన్న తిరు వి.కా.ఆర్టస్ ‌ప్రభుత్వ కళాశాల ఒక నోటీసు జారీచేసింది. విద్యార్థులంతా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను దేశం మీదకు వదలాలని ఆ నోటీసు సారాంశం. అయితే సామాజిక మాధ్యమాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ నోటీసును ఉపసంహ రించుకున్నారు. బీజేపీ నాయకుడు రాజ్యవర్ధన్‌ ‌సింగ్‌ ఆరోపణ ప్రకారం విద్యార్థులంతా కత్తూరులో నిర్వహించిన కార్యక్రమం ఆధారంగా ఉపన్యాసాలు తయారు చేసుకుని ఉపన్యాసాలు దంచాలని నోటీసులో కళాశాల యాజమాన్యం పేర్కొన్నది. యూదుల మీద వ్యతిరేకతను పెంచడానికి సరిగ్గా ఇదే పంథాలో అడాల్ఫ్ ‌హిట్లర్‌ ‌కూడా జర్మన్లను రెచ్చగొట్టాడని సింగ్‌ ‌గుర్తు చేశారు.

బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ ‌సనాతన ధర్మం మీద అజ్ఞానాన్ని ప్రదర్శించడంలో, అవాకులూ చెవాకులూ పేలడంలో పేరుపొందాడు. ఆఖరికి ఉదయనిధి వివాదం తరువాత తాను వెనుకపడి పోకూడదన్నట్టు ఈ నటుడు సెప్టెంబర్‌ 10‌న కర్ణాటకలోని కలుబురిగిలో జరిగిన ఒక సమా వేశంలో అదే ధోరణి ప్రదర్శించాడు. ఎవరైతే సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని తీవ్రంగా మాట్లాడతారో వారెవరూ హిందువులే కాదని తీర్పు ఇచ్చేశాడు. హిందుత్వ గురించి, సనాతన ధర్మం గురించి ఏ గాడిద ఏమి వాగినా హిందువులంతా మౌనంగా ఉండాలన్నదే ఇతడి కవి హృదయమనిపిస్తుంది. అసలు వీళ్ల బాధే ఇది. గతంలో రాముడి విగ్రహానికి చెప్పుల దండ వేసినా తలొంచుకు పోయిన హిందువు ఇప్పుడు అంతు చూస్తానని అంటున్నాడు. ఇలాంటి నీచులను న్యాయస్థానాలకు ఎక్కిస్తు న్నాడు. విద్యల దేవత సరస్వతీమాతను నగ్నంగా చిత్రించినా హిందువు కళ్లు మూసుకుని తప్పుకున్నాడే గాని, ప్రతిఘటించలేదు. కానీ ఇప్పుడు కన్నెర్ర చేస్తున్నాడు. సనాతన ధర్మం గురించి సానుకూలంగా మాట్లాడడ మంటే, ఒక దుష్ట రాజకీయాన్ని సమర్థించడమేనన్న విషయాన్ని వాళ్లకి గుర్తు చేయాలని ప్రకాశ్‌రాజ్‌ అదే వేదిక మీద ఉన్న రచయితలకీ, సామాజిక కార్యకర్తలకీ హితబోధ చేశాడు. ఇలాంటి అజ్ఞానపు మేళమంతా మొదట మాట్లాడేది హిందుత్వం వల్ల పురోగామి దృక్పథం నశించిపోతుందనే కదా! ఈ ధోరణిలో వీళ్లంతా ఇస్లాం మత మౌఢ్యానికీ, క్రైస్తవంలోని అనాకారితనానికీ భద్రత కల్పిస్తున్నారు. బురఖా నుంచి బయటకు రాలేని ముస్లిం స్త్రీ గురించి వీళ్లకి పట్టదు. మహిళలు చదువుకోకూడదని ఫత్వాలు విడుదలవుతున్నాయి. దాని గురించీ మాట్లాడరు. కొన్ని దేశాలలో అసలు పాఠశాల సమీపం వరకు కూడా మహిళను రానివ్వడం లేదు.

విదేశాల సంగతి ఎందుకు ఇక్కడ అనొచ్చు. కానీ అఫ్ఘానిస్తాన్‌ ‌వంటి దేశాలలో మతోన్మాదులు అమలు చేస్తున్న సంప్రదాయాలనే కదా ఇక్కడ కూడా అమలు చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వాళ్లకి మద్దతు ఇవ్వవద్దని మొత్తం భారతదేశం ప్రకాశ్‌రాజ్‌ ‌వంటి వాళ్లకీ, రచయితల పేరుతో చలామణి అయిపోతున్న కిరాయి మూకలకీ తెలియ చెప్పవలసిన సమయంవచ్చింది. పాస్టర్‌ ‌తాకగానే సర్వరోగాలు నయం అయి పోతున్నాయని చూసే వేలాది ఏసు మహిమాన్విత వీడియోల గురించి ఈ ప్రకాశ్‌రాజ్‌ ‌వంటి పక్షపాత రోగులకు తెలియదా? కొబ్బరినూనెను సర్వరోగ నివారిణిగా నమ్మమని చెప్పే క్రైస్తవ సన్యాసినులు, మత గురువుల సంగతేమిటి? పైగా సనాతన ధర్మం అందరికీ విద్య అన్న అంశాన్ని వ్యతిరేకిస్తుందట. ఇప్పుడు ఏ మతంలో అందరికీ విద్య అనే అంశం దారుణ అవమానాలకు గురి అవుతున్నదో ఈ దివాంధులకు తెలియదా? చదివితే ప్రశ్నిస్తారు కాబట్టి అక్షరాన్ని అందనివ్వరు, పేదరికం యథాతథంగా ఉండాలి కాబట్టి చదువుకోనివ్వరు, చదివితే శాస్త్రీయ దృక్పథం పెరుగుతుంది కాబట్టి ఆ పని చేయనివ్వరు ఇలాంటి అరిగిపోయిన రికార్డునే ప్రకాశ్‌ అక్కడ వేశాడు. అక్కడ కూర్చున్న వాళ్లంతా చదువుకున్న వాళ్లే. ప్రకాశ్‌రాజ్‌ ‌కూడా చదువుకునే ఉంటాడు. కానీ వీళ్ల దృష్టి ఎంత పాక్షికమో ఈ మాటలను బట్టి అర్ధం కావడం లేదా? అసలు ఇతడు స్త్రీలను అవమానించని సినిమాలలో, హీరోయిన్‌నీ, వాంప్‌నీ అర్ధనగ్నంగా చూపించే సినిమాలలో, సూపర్‌మేన్‌ను మించి పోయే హీరో వికృత విన్యాసాలు ఉన్న సినిమాలలో నటించకుండా ఉంటే అదే పదివేలు.

గతంలో ఉత్తర భారతంలో ఈ ధోరణి తక్కువ. కానీ ఇటీవల కాలంలో అక్కడ కూడా ఈ ధోరణి బలిసింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నాయకుడు స్వామిప్రసాద్‌ ‌మౌర్య కూడా హిందూ వ్యతిరేక, హిందూ పవిత్ర గ్రంథాల వ్యతిరేక వ్యాఖ్యలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. ఇతడు హిందూధర్మమే ఒక మిథ్య అంటాడు. రామచరిత మానస్‌లో కొన్ని కులాలను కించపరిచే వ్యాఖ్యలు ఉన్న భాగాలు ఉన్నాయి కాబట్టి వాటిని దగ్ధం చేయాలంటూ కొద్దికాలం క్రితం హడావిడి చేశాడు. అందుకు ప్రయత్నించాడు. ఇతడి మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఇతడి వంటి అవకాశవాది రాజకీయాలలో అరుదు. ఇతడు గడచిన యోగి ఆదిత్యనాథ్‌ ‌ప్రభుత్వంలో మంత్రి. ఇటీవల జరిగిన ఎన్నికలలో టిక్కెట్టు ఇవ్వలేదు. దీనితో సమాజ్‌వాది పార్టీలో చేరాడు. అక్కడ ఎంఎల్‌సీ అయ్యాడు. కాబట్టి హిందుత్వను దూషిస్తే, బీజేపీని వీడి వస్తే వాళ్లు తక్షణమే సెక్యులరిస్టులు అయిపోతారు. విపక్ష శిబిరంలో పెద్ద పీఠమే దక్కుతుంది. మౌర్య కూతురు ఇప్పటికీ బీజేపీ ఎంపీగానే ఉన్నారు. హిందుత్వ మీద మౌర్య చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. అంతేతప్ప ఇలాంటి ప్రకటనలు సరికాదని హెచ్చరించలేదు. పార్టీ నుంచి పంపించలేదు.

 దేశంలో అత్యవసర పరిస్థితి (1975) నాటి పరిస్థితులు ఉన్నాయని నిరంతరం విమర్శలకు దిగే కాంగ్రెస్‌ అం‌డ్‌ ‌కంపెనీ అలవాటు కొద్దీ అత్యవసర పరిస్థితిని అమలులోకి తెచ్చింది. 14మంది టీవీ యాంకర్లను, పత్రికా రచయితలను బహిష్కరించా లంటూ తీసుకున్న నిర్ణయం ఇందుకు సంబంధించినదే. వివిధ చానళ్లలో, వేదికలో వారు నిర్వహించే కార్యక్రమాలకు తాము హాజరు కాబోవడం లేదని ఇండియా సెప్టెంబర్‌ 15‌వ తేదీన ప్రకటించింది. ఇది ముందు రోజు తీసుకున్న నిర్ణయం. అత్యవసర పరిస్థితి కాలంలో పత్రికల కార్యాలయాలకు విద్యుత్‌ ‌సరఫరా నిలిపివేస్తే, ఇప్పుడు అదే పార్టీ నాయకత్వంలో ఏర్పడిన ఇండియా మరొక రకంగా వారి కార్యక్రమాలను నిలిపివేయా లని చూస్తున్నది. ఆ యాంకర్లు, జర్నలిస్టుల పేర్లను కూడా విడుదల చేసింది. దీనికి న్యూస్‌ ‌బ్రాడ్‌కాస్టర్స్ అం‌డ్‌ ‌డిజిటల్‌ అసోసియేషన్‌ ‌నిరసన తెలిపింది.

ఇండియా కూటమి ఒక విధ్వంసక కూటమి. దాని అసలు రూపం చాలా తొందరగానే బయట పడుతోందని అర్ధం చేసుకోవాలి. ఇది హిందూ ధర్మానికి, సనాతన జీవనానికి బద్ధ శత్రువు. భారత సార్వభౌమాధికారాన్ని నిరంతరం విమర్శిస్తూ అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడేవాళ్లే దీనికి నాయకులు. అత్యవసర పరిస్థితి పట్ల దీనికి ఉన్న మోజు కూడా వెల్లడవుతున్నది. క్రైస్తవ మిషనరీలు, ముస్లిం మతోన్మాదం ఈ దేశానికి చేసిన ద్రోహం పునరావృతం కావడానికి మాత్రమే ఈ కూటమి ఉపయోగపడుతుంది. షాహీన్‌బాగ్‌ ‌మద్దతుదారులు, జార్జి సారోస్‌ ‌చేతిలో కీలుబొమ్మలు, కుహనా సెక్యులర్‌ ‌వాదులు దీనికి మార్గదర్శకులు. అందుకే 2024 ఎన్నికలు దేశానికి కీలకం కానున్నాయి. సనాతన ధర్మం మార్పునకు అంగీకరించేది. అది ముస్లిం మతోన్మాదం వంటిది కాదు. అది ప్రపంచ మంతటా మతాంతరీకరణలను ప్రోత్సహించదు. క్రైస్తవం వంటిది కాదు కదా! ఇప్పుడు బీజేపీ మీద వ్యతిరేకత అంటే, బీజేపీని ఓడించడం అంటే సనాతన ధర్మాన్ని ఓడించడమేనన్న నిర్ణయానికి ఇండియా కూటమి వచ్చింది. పేరు బీజేపీది. అసలు లక్ష్యం సనాతన ధర్మం. బహుపరాక్‌.

‌కొసమెరుపు: సనాతన ధర్మంపై సమ్యమనంతో మాట్లాడలని డీఎంకే అధిష్టానం ఆదేశించడం ఈ ధర్మంలో తొలి విజయం.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram