– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

సెప్టెంబర్‌ 17 ‌నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల ముగింపు సందర్భంగా

‘నైజాం విముక్తి స్వాతంత్య్ర అమృతోత్సవాలు’ ముగుస్తున్నాయి. కానీ ఆ పోరాటం వెనుక ఉన్న జ్ఞాపకాలు ఎప్పటికీ అమృతోపమానమే. అందులో మన ముందు తరాల చేదు అనుభవాలు ఉన్నాయి. కొన్నయినా వీరోచిత గాథలు ఉన్నాయి. ఏ అనుభవ మైనా కన్నీటితో తడిసినదే. నెత్తుటి చారికల కింద తడియారకుండా మిగిలి ఉన్న జ్ఞాపకమే. పాఠాలు నేర్పగలిగే సంఘటనలే అవన్నీ. ఎలా మరిచిపోతాం? ఓ బైరాన్‌పల్లిని, ఐలమ్మను, గోలకొండ పత్రికనీ, దాని స్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డిని ఎలా మరచిపోతాం? కృష్ణరాయాంధ్ర భాషా నిలయాన్ని ఎలా విస్మరిస్తాం? అది రగిలించిన భాషాభిమానం ఎలా చెరిగిపోతుంది? భాషాభిమానం నిలిపిన ఆత్మగౌరవ జాడ ఎలా మరపునకు వస్తుంది? నిజాంకు వ్యతిరేకంగా రాసిన నేరానికి తెగిపడిన షోయబుల్లా కుడి చేయి.. ఇంకా ఇలాంటివి ఎన్నింటినో మరచిపోలేం. అవి తెలంగాణ ప్రజల, తెలుగువారి గుండెలలో ఎప్పుడూ ఉంటాయి.

ఐదేళ్ల వయసులో చూసినా రజాకార్‌ ‌రక్తపాతం, అందులోని విషాదం జీవితాంతం మరుపునకు రాదు. అందులో గూడు కట్టుకున్న విషాదం, దాని సాంద్రత అలాంటివి. అందుకే ఆ జ్ఞాపకాలు అక్షరబద్ధమవు తూనే ఉన్నాయి. ఇంకా అవుతాయి. డాక్టర్‌ ‌బండ సరోజిని  ‘బర్రెంక చెట్టు… ఓయాది’ అలాంటిదే. ఇవన్నీ గతంలో జరిగిన గాయాలను రేపుకోవడమని ఎవరు అనుకున్నా, అది ఆత్మవంచన. అది మన తాతముత్తాల ఆస్తిత్వం పోరాట స్మరణ, వారి ఆత్మక్షోభకు నివాళి. లద్నూర్‌లో ఏప్రిల్‌ 3, 1941‌న డాక్టర్‌ ‌సరోజిని జన్మించారు. రజాకారులు ఘాతుకాలు తారస్థాయికి చేరేనాటికి ఆమె 5 లేక 6 సంవత్సరాల బాలిక. నిజానికి ఆమె రాసినది ఓ కథ అనే కంటే ఓ గొప్ప చారిత్రకాధారంగా గౌరవించ దగినది.  బైరాన్‌పల్లె సంఘటన జరిగిన సమయం లోనే జరిగిన మరో ఘోరానికి ఆమె కుటుంబ సభ్యులు సాక్షులే కాదు, బాధితులు కూడా. అదే లద్నూర్‌ ‌దాడి. ‘‘గా రోజు పుట్టిన గుడ్డు కాంచి తెలుగోల్లను పూర్తిగా సంపాలనే పిలాను వేసిన్రని బండ సరోజను నాయన పిలిచి సెప్పిండు.’’ ఈ వాక్యం రజాకార్ల రక్తదాహానికి అద్దం పడుతుంది. ఇక్కడ తెలుగోల్లు అంటే స్థానికులు. ఇంకా చెప్పాలంటే  ముస్లిమేతరులు.

ఐదు సంవత్సరాల వయసులో సరోజినిని పాఠశాలలో చేర్చారు. చేరిన మూడు నెలలకే 17-09-1948 రజాకార్ల దాడి (వాళ్ల నాయన జెప్పగ యిన్నదట) జరిగింది. లద్నూర్‌ను తగులబె ట్టారు. ‘దాంట్లె బడి గుడ నామ్‌ ‌నిషాన్‌ ‌లేకుండ కాలిపోయింది. గప్పుడప్పుడు యాది కొచ్చినప్పుడల్లా గా కాలిపోయిన బడికి వోయి అంతా కలె దిరిగి వచ్చేదట. కిలాసుల తాను కూకున్న జాగ చూసుకుం టుంటే చెప్పలేనంత ఏడుపొచ్చేదట (అయినా ఓ పక్క చిరు ఆనందం స్కూలుకు వెళ్ల నవసరం లేదు).

నిజానికి నిజాం విముక్తి పోరాటం ప్రజ్వరిల్లే వరకు హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో ఉన్నదంతా తుపాను ముందు ప్రశాంతతే. గుండె నిండా మంట ఉన్నా నిస్సహాయంగా ఉన్నారు. ఆ జీవితం ఎలా ఉంది? ‘సేన్లు, సెలకలల్ల పగులంతా పనిజేసిన. గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నట్టు సద్దిబువ్వ దిని యెన్నెల్ల ఈత సాపలు పరుసుకొని కూసోని దునియా ముచ్చట్లకు వెడుదురు. అవ్వ నాయనమ్మ మంచి మంచి కతలు, మస్తు పొడుపు కతలు సెప్పుదురు. రుద్రమ్మ, మల్లమ్మ, జాన్సిలచ్చిమి అలెగ్జాండర్‌, ‌పురుషోత్తముడు, అంబి కతలు, తానీషా, అక్కన్న, మాదన్న, రామదాసు చెరిత్ర జేప్పేటోల్లు’.

ఈ రచయిత్రి కూడా బడి ఎగ్గొట్టేదిట. బడిగంట యాల్లకు పిడకల కుచ్చెలు, గడ్డివాములు మక్కజొన్న జూలల్ల దాక్కునేదట. ఒగో త్యాప బడిగంట కొట్టేవరకు నిధురవోయినట్టు జేసేదట. స్కూలు ‘‘చెప్పరాసి’’ తాతమ్మా అని పిలిసేటోడు. నాయనమ్మ ఇంక పిల్ల లేవలేదని సేప్పేది ఆ గండం గట్టెక్కేది. లేసి మొకం కడుక్కొని ఊరి మీద పడేదిట. గవుండ్ల ఎల్లవ్వ, కురుమ లచ్చిమి పెద్ద చాలి సిద్దవ్వ, పటేండ్ల రంగవ్వ, కాపోల్ల అంజివ్వతోని ఆట లాడేదిట.

దూం పుల్ల ఆట ఆడేటప్పుడు ‘కుక్కకు మాంసం దొరికినది/అది వంతెన మీదగ పోయినది/ తన నీడను తానే సూచినది / వేరొక కుక్కని తలచినది / భౌ భౌ భౌ భౌ అరిచినది/ ఉన్నది కాస్త పోయినది… అన్న గీతం అనుకుంటూ  ఎగురుకుంట దూకే టోల్లట. తమ్ముడు గాలిలో అచ్చరం రాయాలి. గులక రాళ్లు ఏరు కొచ్చి ఆ అచ్చరాన్ని పేర్చాలి. దోస్తులంతా రెండు జట్లుగా విడిపోతారు. వారు ఆడపిల్లోల్లు, మగపిల్లోల్లు. పాట రూపంలో సాగేవి వాదోపవాదాలు.

ఆడపిల్లోల్లు: సిబ్చిలేనింటికి నా బిడ్డ నిస్తినీ

తాన తందయ్య గోగు పువ్వయ్యలో

మగపిల్లోల్లు:అప్పుడెందుకిచ్చినవు అరికాలి చెప్పే

ఆడ:కనరాని కంతలకు నా పిల్లనిస్తినీ

మగ :   సిగ్గెగ్గు లేకుంట నా ఇంటి కొస్తివి      

ఆడ: పిల్ల నిచ్చేటప్పుడు ఇల్లు సూడాలమ్మ

మగ:    ఇల్లు సూడకుంటా పిల్లనెట్లిస్తివి

ఆడ :    ఎరుక లేకిచ్చిన ఎనుగుల్ల వడ్డ…

ఈ కథలోనే నిత్య జీవితానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అవ్వ చిన్నప్పుడు తమ్ముణ్ణి కాళ్ల మీద వేసుకొని నువ్వుల నూనెతో కాళ్లు చేతులకి సున్నిపిండి పెట్టి ఉడుకు నీళ్లతో స్నానం జేయించేది. సరోజిని కూడా తన చెక్క బొమ్మకు అట్లనే చేసేదట. పెద్దయ్యాక పాలకురికి సోమన్న రాసిన బసవ పురాణం కతలో ఉన్న జెజ్జ మహాదేవి ‘పాటం’ బాగా మనసు కెక్కిందట. వాళ్ల అవ్వకు పాటలు, కీర్తనలు నాలుక మీదనే ఉండేవట. గురుబోధకు సంబంధించిన పదాలు చెప్పేది. పంచ భూతాల గురించి వివరించేది. ఈ విధంగా తెలంగాణ మట్టి పరిమళాలను మనకు అందించ గలిగారు, సరోజిని. బర్రెంక చెట్టు నీడలో ఇవన్నీ జరిగేవి. కానీ ఈ జ్ఞాపకాలు రజాకారులు రాసిన నెత్తుటి చరిత్రలో మౌనంగా ఉండిపోలేదు. నెత్తుటి మరకల తడి కూడా ఆరలేదు. ఇదే అందుకు ఉదాహరణ:

 ‘ఓ రోజు సందాల్ల లద్నూరు చెర్వు కట్టమీంచి ఓ మూడొందల మంది జై కొట్టుకుంట ఒత్తున్నరు. సేన్లు సెలకల నుంచి జనాలు గప్పుడే వచ్చి ఎసర్లు వెట్టి బువ్వొండి వారవెట్టుకున్నరు. ముసల్మాన్లు నమాజు చేసుకుంటున్నరు. మా నాయనమ్మగా సప్పు డేందో సూడమని తన అన్నని నిచ్చెనెక్కించింది. అన్న కొట్టం మీంచి సూసిండు. తెప్పలెక్క జనాలు ఒత్తన్నరని సెప్పిండు.’’ అది రజాకార్ల కాలం. వాడ కట్టులున్న దగ్గెర దగ్గెర ఇండ్లోల్లు సరోజిని ఇంటికి చేరుకునేవారు. బెడం పెట్టుకొని (లోపల తలుపుకు అడ్డంగా పెద్ద కర్రను రెండు వైపుల గోడలో దూర్చి ఉంచడం) ఏరే ఊర్లల్ల రజాకార్లు ఏమేమి జేసింది సెప్పుకుంట పానాలు అరిసేతుల పెట్టుకొని కూసునేవారు.

బండ సరోజిని గారి మేనత్తది బైరాన్‌పల్లి. ఆ ఊరి మీద దాడి జరిగిన నాడు వీళ్ల మేనత్త ఒంటి మీద నగలు ఒలుచుకున్నారు. ఆ ఊళ్లోనే  వారి తాత గాడిపెల్లి రామయ్యను తుపాకీతో కాల్చారు. దాడి జరిగాక వీరి నాయనమ్మ ఈమెను దీసుకుని రొండు బుడ్ల బియ్యం పోసి బండిగట్టి పంపించింది. ఆ తల్లీకూతుర్లు ఒకరినొకరు కౌగిలించుకుని ఏడ్చారు. తాత మీద పేలిన తుపాకీ గుండు ఎలా పోయింది చూపెట్టింది. ఆ ప్రాంతం మొత్తం నెత్తురుమయ మయింది. నెత్తురు మయమయిన ఆ జాగా ఇంకా తనకు గుర్తుందని సరోజిని చెప్పారు.

అలాగే సరోజిని నాయనమ్మ తమ్ముడు  పిట్టల కిట్టయ్య. ఎల్దండ గ్రామవాసి. ఆయనను రజాకార్లు కాల్చి చంపారు. అమాయకుల ఉసురు పోసు కున్నారు. నిజంగా ఈ గాథ అమానుషానికి చిరునామాగా ఉంటుంది. కిట్టయ్య మక్కజొన్న చేనులో ఉన్నప్పుడు రజాకార్లు అక్కడికి వెళ్లారు. ఆయన చేతనే మక్కజొన్న కంకులు విరిపించుకొని, కాలిపిచ్చుకున్నారు కూడా. అరుచుకుంలూ, నవ్వు కుంటూ రచ్చ రచ్చ చేస్తూ ఆ కంకులు ఒలుచుకు తిని, తాగేందుకు నీళ్లు కావాలని అడిగారు. కిట్టయ్య లొట్టి తీసుకుపోయి మోట బావి నుంచి నీళ్లు తెచ్చాడు. నీళ్లు తాగి రజాకార్లు చివరిగా బండి కట్ట మన్నారు. కిట్టయ్య భయం భయంగా ఎడ్లను దెచ్చి బండి కట్టాడు. ఆయనను బండికి ఎదురుగా నిలవెట్టి తుపాకీతో  కాల్చేశారు. దీంతో ఎల్దండ ఊరంతా గజగజ వణికిపోయింది.

హిందువుల ప్రాణాలు గాలిలో దీపం కంటే అన్యాయంగా ఉండేవి. నిరంతరం చావు భయంతో ఉండేవారు. ఈ ఉదాహరణ చూడండి: ‘గప్పుడు రజాకార్ల జమానా జోరుగుండె. ఫౌజు (సైన్యం) దిగేది. గాల్లు రాంగానే తెలుగోల్లందరు బెడాలు వెట్టుకొని, తలుపులు దగ్గరేసుకొని గొళ్ళేలు వెట్టుకొని బిక్కు బిక్కు మనుకుంట ఇండ్లల్ల కూసునేది. జైలు కానాల ఉన్నట్టు ఉండేది. పోరగాల్లం తలుపు సందుల నుంచి సూసేది. ఫౌజోల్లు గుర్రాల మీద ఊర్ల తిరిగేది. గుర్రాల డెక్కల సప్పుడు, పౌజోల్ల బూట్లు సప్పుడే ఇనబడేది. ఎటు వోయినా భయంగా వుండేది. గప్పుడే మా రామక్క (రచయితకు వరసకు అక్క) బిడ్డ కాల్లు సేతులకున్న వెండి కడియాలు, గుండు వోగులు తీస్కోని సంపి బాయి లేసిన్రు. ఎంత అమానుషం?’

బైరాన్‌ ‌పల్లె మీద చేసిన దాడి తరహాలోనే లద్నూరు మీద కూడా చెయ్యాలని రజాకార్లు పథకం వేశారు. ఎందుకంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి కొలిపాక నుండి లద్నూరు వచ్చి పోతు న్నారు. అలాగే నల్ల నర్సిములు, సర్వారెడ్డి గూడా వచ్చి వెళుతున్నారు. అందుకే ఈ ఊరిని లక్ష్యంగా చేసుకున్నారు. దాడి జరిగింది. ఊరుని పీనుగుల పెంట చేశారు. ఆ చీకట్లో హిందువులు, ముస్లింలని అన్న తేడా లేకుండా ఎవరికి  దొరికిన దారిలో వాళ్లు అడవిలోకి, పక్క ఊర్లకు పారిపోయారు. సరోజిని అవ్వ కూడా అదే చేసింది. ఈ చిన్న పిల్లల్ని తీసుకుని ఎల్దెండకు చేరుకుని, ఎల్లక్క ఇంట్లో తలదాచుకున్నారట. వీళ్లు చదువుకునే స్కూలు కూడా నామా రూపాలు లేకుండా కాలిపోయిందట.

‘బర్రెంక చెట్టు’ చదవడమంటే తెలంగాణ సామాజిక రాజకీయ చరిత్ర ఆకులను, పూలను, కొమ్మలను, రెమ్మలను చేతుల్లోకి తీసుకొని ఒక జీవిత పత్ర హరితాన్ని మనసులోకి దింపుకోవడం. మన ముందు తరం జీవితానికి మాంత్రిక లేపనం అద్ది మళ్లీ మొలకెత్తించడం. తెలంగాణ సాంస్కృతిక మూలల్లోకి దిగుడు బావిలోనికి దిగినట్లు దిగి పోవడం. సాధారణగా బర్రెంక చెట్టు పుల్లల్ని పంటి బలానికి మంచిదని దంత ధావనానికి వాడు తుం టారు. ఈ కథ కూడా తెలంగాణ సంస్కృతిక వారసత్వానికి ప్రతీక.

నిజాం రాజ్యంలో రజాకారులు, ముస్లిం మతోన్మాదులు చిందించిన నెత్తురు తక్కువేమీ కాదు. ఆ నెత్తుటి చారికలు ఎండిపోయి ఉండవచ్చు. కానీ వాటి కింద ఏ కాలమూ తీర్చలేని బాధలో నానుతున్న జ్ఞాపకాలు అలానే ఉన్నాయి. ఇప్పటికీ వాటి తడి ఆరలేదు. ఇంతకాలం ఈ కాలమ్‌లో మనం గుర్తు చేసుకున్నది వాటినే. అలా ఆ జ్ఞాపకాలను, నిస్సహాయత కింద నగిలిపోయిన కొన్ని తరాల క్షోభను గౌరవించుకున్నాం. స్మరించుకున్నాం. వారందరికి నివాళి ఘటిస్తూ ఇప్పటికి సెలవు.

(ఈ శీర్షిక ఈ వారంతో ముగిసింది)

About Author

By editor

Twitter
Instagram