– ఎం. రమేశ్‌కుమార్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

శేఖర్‌కి విసుగ్గా ఉంది. కావలసిన బస్‌తప్ప అన్నీ వస్తున్నాయ్‌. ‌వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలీదంటారు గానీ కావాల్సిన బస్సు రాకడ కూడా ఎవరికీ తెలీదేమో.. అసహనంగా అనుకున్నాడు. వర్షం బాగా పెరిగి కుంభవృష్టిగా కురుస్తోంది. ఆ వర్షాన్ని చూస్తూంటే లోకమంతా జలమయమవు తోందా అన్నట్టని పిస్తోంది. షెల్టర్‌లో ఒక చివర పాత కాలపు పెట్టె పట్టుకుని కూర్చున్న ముసలమ్మను గమనించాడు అతడు.

ఆవిడ చీర కట్టు, ఒద్దికగా కూర్చున్న తీరు చూస్తుంటే సాంప్రదాయకమైన కుటుంబం నుంచే వచ్చినట్టు అనిపిస్తోంది. చాలాసేపట్నుంచి అక్కడే కూర్చుని ఉందామె. మరి ఏ బస్‌ ‌కోసం చూస్తోందో.. అనుకున్నాడు.

మరో ఇరవై నిమిషాల సమయం దొర్లిపోయింది. శేఖర్‌కి విసుగ్గా ఉంది. పోనీ ఏదో ఆటోలో వెళ్దా మంటే తను వెళ్లాల్సిన స్టాప్‌ ‌చాలా దూరం. ఆ రూట్‌ ‌బస్సుకు అది చివరి స్టాప్‌. ఆటోలు కూడా డైరెక్టుగా అక్కడికి వెళ్లవు. ఏదైనా ప్రత్యేకంగా కట్టించుకొని వెళ్లాలి. ఈ టైములో అయితే కనీసం ఏ నూట యాభై లేదా రెండొందలు అడుగుతారు. అంత మొత్తం ఇచ్చి వెళ్లడం శేఖర్‌కి ఇష్టం లేదు. సరే చూద్దాం అనుకుని అలాగే కూర్చున్నాడు. మామ్మ ఇంకా నుదిటి మీద చెయ్యడ్డం పెట్టుకొని అలా చూస్తూనే వుంది. ‘అస లీవిడ ఏ బస్‌ ‌కోసం చూస్తోంది..? బస్‌ ‌కోసమయితే ముందుకొచ్చి చూసుకోవాలి కదా.. అసలు ముందు కెళ్లినాగానీ ఆ బస్‌ ఏ ‌వైపు వెళ్లేదో సరిగ్గా కని పించడంలేదు. మరి ఈవిడ అక్కడే కూర్చుం దేమిటి? బహుశా ఎవరో వస్తారని చూస్తోందేమో..! పాపం ఎంతసేపట్నుంచీ అలా చూస్తోందో..? ఓ పక్క వర్షపు జల్లు కొడుతున్నా ఆవిడ పట్టించుకోవడం లేదు..’ అనుకుని ‘‘మామ్మగారూ.. అక్కడ వాన జల్లు కొడుతున్నట్టుంది. కాస్త ఇలా లోపలికి జరిగి కూర్చోండి..’’ ఆవిడకు వినిపించేటట్టు అన్నాడు. ఆవిడ నన్నేనా.. అన్నట్టు ఒకసారి చూసి ‘‘లేదు బాబూ.. వాడొస్తే నన్ను చూడకుండా గబుక్కున లోపలకెళిపోతాడు.. ఇక్కడయితేనే వాడికి కనిపిస్తాను’’ చెప్పింది.

 అసలు వచ్చేది ఎవరు..? ఈవిణ్ణి చూడకుండా ఏ లోపలికి వెళ్లిపోతాడు..? శేఖర్‌కు ఏమీ అర్థం కాలేదు.

అదేదో ఆవిడనే అడిగితే పోలా.. అనుకుని తను కూర్చున్న చోటు నుండి మామ్మ కూర్చున్న వైపు వచ్చి కూర్చుని ‘‘ఇంతకీ ఎవరొస్తున్నారు మామ్మగారూ?’’ అడిగాడు.

 ‘‘నా కొడుకు బాబూ.. ఇప్పుడు వస్తాడు. అసలీ పాటికే రావాలి. ఆలస్యం అయిపోయినట్టుంది. అయినా వస్తాడు బాబూ.. ఎక్కడో చిక్కడిపోయి నట్టు న్నాడు’’ చెప్పింది.

శేఖర్‌కి మామ్మతో మాట్లాడదామనిపించింది. బస్‌ ఎలాగూ రావడం లేదు. కాసేపు ఈవిడతో మాట్లాడితే కాలక్షేపంగా అయినా ఉంటుంది అనుకు న్నాడు.

 ‘‘మీ అబ్బాయి ఎక్కణ్ణుంచి రావాలి..?’’ అడిగాడు.

 ‘‘బాబూ ఆ పేర్లు అవీ నాకు తెలీదు గానీ పని మీద ఎటో వెళ్లాడు. .. వచ్చేస్తాడు.. అందుకే ఇక్కడే కూచున్నాను’’

‘‘సరే.. ఇంతకీ మీరిక్కడకు ఎలా వచ్చారు? మీ అబ్బాయి తీసుకొచ్చాడా..? లేక మీ ఇల్లు ఇక్కడేనా?’’

‘‘అది కాదు బాబూ.. ఇద్దరం కలిసే వచ్చాం. ఎక్కడికో వెళ్లాలని తీసుకొచ్చాడు. తీరా ఇక్కడికొచ్చాక ఏదో అర్జెంటు పనిబడింది. ‘నువ్విక్కడే ఉండమ్మా.. నేనెళ్లి వచ్చేస్తాను.. మళ్లా ఇద్దరం వెళ్లిపోదాం..’ అని చెప్పి అదుగో.. ఇక్కడే.. ఆ పక్కనున్న మాకు తెలిసి నోళ్లింటి దగ్గర నన్నుంచి అటెల్లాడు. చాలా సేప యింది.. ఇంకా రాలేదని ఇక్కడకొచ్చి చూస్తున్నాను’’

‘‘ఓహో… అలాగా..’’ అన్నాడు శేఖర్‌.

అం‌తసేపూ తన పక్కనే నిల్చున్న కుర్రాడొకడు ఫోన్లో మాట్లాడుతూ వచ్చి ఫోన్‌ ‌కట్‌ ‌చేశాక ‘‘సార్‌.. ‌మీరు భవానీపురం వైపు వెళ్లాలా?’’ అడిగాడు.

‘‘అవును.. అయితే?’’

 ‘‘నేను కూడా అటే వెళ్లాలి సార్‌.. ఇప్పుడే మా ఫ్రెండ్‌ ‌ఫోన్‌ ‌చేశాడు. ఆ వైపు కల్వర్టు కొట్టుకుపోయి దారి మీద నుంచి నీళ్లు పారుతున్నాయట. అందువల్ల అటెళ్లే బస్సులు ఆపేశారట. చాలాసేపట్నుంచి మీరు కూడా నిల్చున్నారు కదా.. మీరూ ఆ బస్‌ ‌కోసమే చూస్తున్నారేమో అని చెప్పాను’’ అని చెప్పి ముందు కెళ్ళిపోయాడా కుర్రాడు.

 ‘అరె.. ఇప్పుడేం చెయ్యాలి..?’ శేఖర్‌కి కాసేపు ఏమీ అర్థం కాలేదు. భవానీపురంలో ఉన్న తమ్ము డింటికి వెళ్లి రేపు తెల్లవారుజామున అక్కణ్ణుంచి పెళ్లి వారు అరేంజ్‌ ‌చేసిన బస్సులో మరో ఊరికి పెళ్లికి వెళ్లాల్సుంది. బాగా దగ్గర బంధువుల పెళ్లి. కానీ తను వెళ్తున్న కారణం మరోటి ఉంది. చాలా ముఖ్య మైనది అది!

తమ్ముడితో మాట్లాడాలి.. అమ్మ గురించి! అవును.. అమ్మ గురించి మాట్లాడాలి. అమ్మ మొద ట్నుంచీ తన దగ్గిరే ఉంటోంది. తను ఉన్న ఊళ్లోనే స్థిరపడ్డాడు. మొదట్నుంచీ అలవాటైన ఊరు, ఇల్లు కాబట్టి అమ్మ ఎప్పుడూ తనదగ్గిరే ఉంది. ఎప్పుడైనా తమ్ముణ్ణి చూడాలనిపిస్తే అక్కడికి వెళ్లి ఓ వారం పదిరోజులుండి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు తన భార్య చాలారోజుల్నుంచీ ఓ విషయం శతపోరు పెట్టి చెప్తోంది. అదేంటంటే అమ్మకి వయసైపోతోంది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పటికే ప్రతినెలా మందుల కోసం చాలా డబ్బులు ఖర్చు చేయాల్సివస్తోంది. మరి ఇలాంటప్పుడు మీ తమ్ముడికి కూడా బాధ్యత ఉండాలి కదా.. అందుకని ఆవిణ్ణి అక్కడ కూడా కొంతకాలం ఉంచమనండి. అక్కడికీ, ఇక్కడికీ తిరుగుతూ ఉంటే ఎవరి దగ్గర ఉంటే వాళ్లు చూసుకుంటారు. మందులకీ అవీ ఎంతవుతోందో మీ తమ్ముడికి కూడా తెలుస్తుంది. అదీగాక రేప్పొద్దున్న ఆవిడ ఆరోగ్యం కోసం ఏదైనా పెద్ద ఖర్చు పెట్టవలసి వస్తే అప్పుడు నేను కూడా ఎంతో కొంత సాయం చెయ్యాలి అనే ఊహ అతనికి వస్తుంది. అంచేత మీరు ఎలాగూ ఈ రాత్రికి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఇదే అవకాశంగా తీసుకుని మీ తమ్ముడికి, మరదలికి ఈ విషయం నెమ్మదిగా తెలియజెయ్యండి. ఇందులో మనం చేస్తున్న తప్పేమీ లేదు.. బాధ్యత అనేది ఇద్దరికీ ఉండాలి కదా..! వాళ్లింటి దగ్గర కూడా కొంతకాలం ఉంటుంది. మీరు చెప్పకపోతే వాళ్లకి ఈ విషయం ఎప్పటికి తెలుస్తుంది..? ఇదంతా చెప్పి తనను ఈ రాత్రికే అక్కడికి వెళ్లమని బైల్దేరదీసింది భార్య. సరే.. ఇప్పుడు వెళితే పెళ్లికి వెళ్లినట్టుంటుంది.. పన్లో పనిగా రాత్రికి తమ్ముడినీ, మరదలినీ కూర్చోబెట్టి ఈ విషయం గురించి వాళ్లకి చెప్పడం కూడా కుదురుతుంది.. ఇదీ మంచిదే! అనుకున్నాడు తను. అసలీ విషయాన్ని వాళ్లు నొచ్చుకోకుండా ఎలా చెప్పాలా అని ఒకటికి రెండుసార్లు మనసులో అనుకున్నాడు కూడా.

కల్వర్టు కొట్టేసిందంటున్నారు గాబట్టి ఇప్పుడు అటువైపు వెళ్లే పరిస్థితి లేదు. ఏం చెయ్యాలి..? శేఖర్‌

‌సెల్‌ ‌తీసి తమ్ముడికి ఫోన్‌ ‌చేశాడు. అటువైపు తమ్ముడు ఎత్తగానే.. ‘‘ఒరేయ్‌.. ఇప్పుడు నేను మీ ఇంటికి రావడం కుదిరేట్టు లేదు.. పెళ్లికి కూడా హాజరు కాలేనేమో..’’ అని ఇంకా ఏదో చెప్పబో తుండగా ‘‘ఏవైందన్నయ్యా..?’’ అట్నుంచి అడిగాడు తమ్ముడు.

 ‘‘అదికాదురా..’’ అంటుండగా ఫోన్‌ ‌కట్టయ్యింది. చూస్తే ఎందువల్లనో గానీ సిగ్నల్‌ ‌పూర్తిగా పోయింది. సరే.. కాసేపాగి చెప్దాంలే.. ఇప్పటికైతే ఇంక ఇంటికెళ్లి పోవడం బెస్ట్.. అనుకున్నాడు. అతడికి ఎదురుగా మామ్మ కనిపించింది. ఆవిడింకా అలాగే ఎదురుచూస్తోంది. అతడికి ఓ సందేహం వచ్చింది. మామ్మ కొడుకు కూడా బహుశా ఆ వైపు నుంచే రావాలేమో..? అందుకే ఇంతవరకూ రాలేకపోయా డేమో..? అని.

‘‘మామ్మగారూ.. భవానీపురం వైపు రోడ్‌ ‌మీదకు నీళ్లు రావడం వల్ల బస్‌ ‌లు ఆపేశారట. బహుశా మీ అబ్బాయి కూడా అట్నుంచే రావాలేమో.. ఇంక ఇప్పుడు రాలేడనుకుంటాను.. మీరు చుట్టాలింటికి వెళ్లిపొండి. అక్కడే ఉంటే రేపు వచ్చి తీసుకెళ్తాడు’’ అన్నాడు.

 మామ్మ నవ్వింది. ‘‘లేదు బాబూ.. మావాడి సంగతి నీకు తెలీదు. బస్సులాగి పోతే ఏదో ఒకటి పట్టుకుని వొచ్చేస్తాడు.. అంతేగానీ వాడు ఇక్కడ నన్నొదిలేసి ఉండిపోడు’’ ఆవిడ మాటల్లో కొడుకు పట్ల అంతులేని ఆత్మవిశ్వాసం తొంగి చూసింది.

 ఈవిడ చెప్పేదీ నిజమే కావచ్చు. ఇప్పుడే ఆ కొడుకు వచ్చి ఈవిణ్ణి తీసుకెళ్తాడేమో.. అది సరేగానీ అంతవరకూ మాత్రం ఈ వర్షంలో ఈవిడ ఇక్కడుం డాల్సిన అవసరమేముంది..? ఆ చుట్టాలింట్లో ఉంటే అక్కడికే వస్తాడు కదా! అనుకొని ఆ మాటే ఆవిడకు చెప్పబోతుండగా టార్చిలైట్‌ ‌పట్టుకొని చూసుకుంటూ ఓ మనిషి అక్కడకు వచ్చాడు. ఆవిణ్ణి చూడగానే.. ‘‘అనుకున్నాను.. గేటు దగ్గరే ఉండేదానివి.. ఇక్కడకి వచ్చేసి కాపలా కాస్తున్నావా? పద..’

‘‘మీ అబ్బాయి ఫోన్‌ ‌చేశాడు. ఇప్పుడు రాలేనని చెప్పాడు. రేపు వస్తాడట.. పద పద.. లోపలికి పద’’ అన్నాడు.

అంత పెద్దావిణ్ణి పట్టుకుని అతను ఏకవచనంలో మాట్లాడటం శేఖర్‌కు ఏ మాత్రం నచ్చలేదు.

 ‘‘పాపం.. ఈ పెద్దావిడ ఎంతోసేపట్నుంచీ ఇక్కడే వాళ్లబ్బాయి కోసం చూస్తోంది.. మీరెవరు..? ఈవిడకు ఏమౌతారు?’’ అడిగాడు.

 ‘‘ఓహో ఈవిణ్ణి మీరు గమనిస్తున్నారా.. ఈవిడ గురించి మీకేం తెలీదు కదా.. చెప్పమంటారా?’’ అడిగాడతను.

‘‘చెప్పండి..? ఎవరీవిడ..? అసలు మీరెవరు?’’ అడిగాడు శేఖర్‌.

 ‘‘నేను ఈ పక్కనే ఉన్న వృద్ధాశ్రమం వాచ్‌మెన్‌ని సార్‌.. ‌నా పేరు వెంకటయ్య. ఈవిడో పిచ్చితల్లి. కొడుకుని అతిగా ప్రేమించి మోసపోయిన వెర్రితల్లి. ఈవిడకు పెళ్లయిన పద్దెనిమిది సంవత్సరాలకు లేక లేక కలిగాడు కొడుకు. ఎన్ని నోములు నోచిందో, ఎన్ని వ్రతాలు చేసిందో, బిడ్డకోసం ఎంతగా తపస్సు చేసిందో ఈవిడకే తెలియాలి. అలా కలిగిన ఆ బిడ్డకు పదేళ్లు రాకముందే ఈవిడ భర్త గతించాడు. ఆ తర్వాత ఈవిడ ఎన్నో పాట్లు, ఎన్నెన్నో అగచాట్లు పడి, అవమానాలను ఎదుర్కొని ఆ బిడ్డను పెంచి పెద్ద చేసింది. వాడు పెద్దయి ఓ ఉద్యోగం సంపా దించుకున్నాక పెళ్లి చేసింది. ఆ తర్వాత కొద్దికాలానికే ఆ కొడుకు ఈవిణ్ణి తీసుకుని ఈ పక్కనున్న మా వృద్ధాశ్రమానికి వచ్చాడు. ‘నాకు తెలిసిన ఓ దిక్కు మొక్కు లేని ఆవిణ్ణి తీసుకొచ్చాను. ఇక్కడ ఉంచాలంటే ఎంత డబ్బు కట్టాలి..?’ అని అడిగి తెలుసుకుని ఆ డబ్బు కట్టేసి తల్లిని ఇక్కడ అప్పజెప్పేశాడు.

ఈ పిచ్చితల్లికి మాత్రం తను ఏదో పని మీద అర్జెంటుగా వెళ్లాల్సి ఉందని.. ఈ ఆశ్రమం మన చుట్టాలదే అనీ అందాకా వాళ్లింట్లో ఉండమనీ, తను పని చూసుకుని వచ్చి తీసుకెళ్తాననీ చెప్పి వెళ్లాడు. ఆ తరువాత గానీ ఈవిడ అతని తల్లే అన్న విషయం మాకు తెలియలేదు. అతనిచ్చిన ఫోన్‌ ‌నెంబర్లు, అడ్రసు ఏవీ సరైనవి కావు. ఈవిడకు కష్టపడడం తప్ప ఏమీ తెలీని అమాయకురాలు పాపం. కొడుకు ఇలా ఇక్కడ వదిలేసి పోయాడని తెలియగానే ఈవిడకు మతి చలించింది. ఆ రోజు నుంచీ అంటే ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాల నుంచీ రోజూ పెట్టె పట్టుకుని ఆ గేటు దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎదురుచూడడం.. ఎవరు అడిగినా ‘నా కొడుకొచ్చేస్తాడు.. వచ్చి ఇప్పుడే నన్ను తీసుకెళ్లిపోతాడు..’ అని చెప్పడం.. ఇదే వరస! టైముకి భోజనం అదీ ఆయా వచ్చి తీసుకెళ్లి పెడుతుంది. అదయ్యాక మళ్లీ ఈవిడ గేటు దగ్గరికే వచ్చేసి ఎదురు చూస్తుంటుంది.. ఈ రోజు ఉదయం నుంచీ వర్షం పడుతోంది కదా.. అందుకని గేటు దగ్గర కాకుండా పెట్టె పట్టుకొని సరాసరి ఈ షెల్టర్‌లోకి వచ్చేసింది.. అదీ ఈ పిచ్చితల్లి కథ!’’

నిర్ఘాంతపోయి చూస్తున్న శేఖర్‌ ‌తేరుకోకముందే వెంకటయ్య ఆవిడకు ఏదో నచ్చచెప్పి తీసుకు వెళ్లిపోయాడు.

శేఖర్‌ అలాగే నిలబడి ఉండిపోయాడు.. హోరుమని వీస్తోంది గాలి..!

అతడు ఆలోచిస్తున్నాడు.. ఇంకా ఆశ్చర్యంగానే ఉంది అతడికి! ఇంత దుర్మార్గమైన కొడుకులు కూడా ఉంటారా..? అంత కఠినమైన మనసు ఎలా వచ్చింది అతనికి..!? లోకానికే మాయని మచ్చలు కదా అలాంటివాళ్లు!

 ఫెటిల్లున ఒక మెరుపు మెరిసింది. దేదీప్య మానమైన ఆ మెరుపు వెలుతురులో శేఖర్‌ ‌మనసులో ఉన్న ఒక వెలుగు చూడని ప్రదేశమేదో కాంతితో నిండిపోయింది. ఆ వెనుకే సత్యాన్ని గుర్తించమని జాగృతం చేస్తోందా అన్నట్టు ఫెళ ఫెళమంటూ ఒక ఉరుము!

అవును.. అలా అయితే మరిప్పుడు తనేం చెయ్యబోయాడు..? అంత ఘోరంగా కాకపోయినా తను కూడా ఎంతోకొంత స్వార్థంతో ఆలోచించలేదా? తమ్ముడికి ఈ మధ్యనే ఉద్యోగం వచ్చిందనీ, ఇంకా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడనీ తనకు తెలుసు. వాడు కూడా చెడ్డవాడేమీ కాదని.. అమ్మకీ, తనకీ కూడా ఎంతో గౌరవం ఇస్తాడనీ తెలుసు. అవసరం అయితే అమ్మ విషయంలో ఏదైనా చెయ్యడానికి వాడు వెనకాడడనీ.. ఆ ఆలోచన వాడిలో కూడా ఉందనీ తెలుసు.

అదీగాక అమ్మ మొదట్నుంచీ తాముంటున్న ఆ ఇంట్లోనే నాన్న జ్ఞాపకాలు తడుముకుంటూ బ్రతుకుతోందనీ, అందువల్ల ఎక్కడకు వెళ్లినా ఎక్కువ రోజులు ఉండలేదని కూడా తెలుసు. ఇన్ని విషయాలు తెలిసిన తను మాత్రం ఏం చేశాడు..? అవన్నీ ఎక్కడో మనసు మూలలోకి నెట్టేశాడు.

భార్య మాటలు విని అనవసరంగా తొందరపడి.. ఇప్పుడే ఏదోరకంగా అమ్మ బాధ్యత కొంత తమ్ముడి మీదకు నెట్టేస్తే సరి అనుకున్నాడు. శేఖర్‌ ‌మనసులో ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. అప్పుడు మోగింది సెల్‌.. ‌తమ్ముడు చేస్తున్నాడు.

 ‘‘అన్నయ్యా.. ఇందాకేదో చెప్తున్నావు. కట్‌ అయిపోయింది. మళ్లీ చేసినా నీకు కాల్‌ ‌వెళ్లలేదు..’’

 ‘‘అదేరా.. మీ వైపు కల్వర్ట్ ‌కొట్టుకుపోయి పైనుంచి నుంచి నీళ్లు పారుతున్నా యట.. అందువల్ల నాకు మరిప్పుడు రావడం కుదరదు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి రేపు పెళ్లికి కూడా నేను రాలేకపోవచ్చు’’

‘‘అవునన్నయ్యా.. అక్కడ కల్వర్ట్ ‌కొట్టుకుపోయిన సంగతి నాకూ ఇప్పుడే తెలిసింది.. మరి నువ్వు ఇంటికి వెళ్లిపోయావా?’’ అడిగాడు తమ్ముడు.

‘‘లేదు.. ఇంకా బస్టాప్‌లోనే ఉన్నాను.. ఏదో ఆటో పట్టుకుని వెనక్కి వెళ్లిపోతాన్లే..’’

‘‘రాత్రికి ఇంటికి వస్తాను ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు. ఇంతకీ ఆ విషయ మేమిటో చెప్పనేలేదు. దేనిగురించి అన్నయ్యా..?’’

రెండు క్షణాల గ్యాప్‌ ‌తర్వాత శేఖర్‌ ‌మాట్లాడాడు ‘‘అదా.. మరేం లేదురా! మనం కలిసి మాట్లాడుకొని చాలా రోజులైంది. ఫోన్లలో ఏదో అలో పోలోమంటూ మాట్లాడుకోవడమే తప్పించి ఒక దగ్గర కూచుని కాసేపు సరదాగా మాట్లాడుకోవడమే కుదరట్లేదు. అందుకే రాత్రికి మీ ఇంటికి వస్తే అంతా కూర్చుని కాసేపు సరదాగా మాట్లాడుకోవచ్చు అనుకున్నాను. అంతే..! ఈ వర్షం పుణ్యమా అని అది కూడా కుదర్లేదు’’

‘‘నిజమే.. ఈ పెళ్లి హడావిడి అయిపోయిన తర్వాత వదిన్నీ, పిల్లల్నీ తీసుకొని నువ్వోసారి రా అన్నయ్యా.. మేం ఇంట్లో దిగినప్పుడే వచ్చారు. ఆ తర్వాత అంతా కలిసి రానేలేదు. మీరు వస్తే రెండ్రో జులు హాయిగా కలిసి గడపొచ్చు’’ అన్నాడు తమ్ముడు.

 ‘‘సరే.. అలాగే వస్తాం.. ఇంక ఉంటాను మరి..’’ చెప్పాడు శేఖర్‌. ‌ఫోన్‌ ‌కట్‌ ‌చేశాక బైటికి చూశాడు. హోరుగాలి తగ్గింది. వాన వెలిసింది. ప్రకృతి కూడా ఇప్పుడు శేఖర్‌ ‌మనసులాగే ప్రశాంతంగా ఉంది!

సరిగ్గా అప్పుడే ఇంటి వైపు వెళ్లే ఆటో రావడంతో దాన్ని ఆపి ఎక్కి ఇంటికి బైల్దేరాడు శేఖర్‌.

About Author

By editor

Twitter
YOUTUBE