శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ‌నిజ శ్రావణ బహుళ పంచమి – 4 సెప్టెంబర్‌ 2023, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌బీజేపీ చూపు గగనాన్ని దాటి దూసుకుపోతూ ఉంటే, కాంగ్రెస్‌ ‌దృష్టి పాతాళం అంచుల కోసం వెంపర్లాడుతోంది. ఈ శతాధిక సంవత్సరాల రాజకీయ పక్షంలో నోటి తీట ప్రవీణులకు ఎప్పుడూ లోటు లేదు. అవతలి వ్యక్తి ఎలాంటి వారని చూడకుండా నోరు పారేసుకునే ఉత్సాహవంతులకు అసలే కొదవ లేదు. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు సేవలు అందించి ఉండొచ్చు. ఆ పార్టీకి చెందిన ఇందిరాగాంధీకీ, రాజీవ్‌కీ సన్నిహితులే కావచ్చు. ఈ దేశానికి ప్రధానిగా కూడా సేవలు అందించి ఉండవచ్చు. ఆఖరికి ఈ దేశాన్ని ఒక క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కించిన ప్రతిష్ట రూపాయి మందాన ఉండొచ్చు. వారు మన మధ్య లేకపోవచ్చు గాక. అయితేనేం! అలాంటి వారి చరిత్ర మీద బురద చల్లకూడదనేమీ లేదు ఆ పార్టీలో. సోనియా గాంధీ ఉండగా తగుదునమ్మా అంటూ ప్రధాని పదవి చేపట్టడం ఏమిటి? ఇది గాంధీ కుటుంబం పట్ల ఘోర అపచారం కాదా! అసలు ఇలాంటి అభిప్రాయం గాంధీ కుటుంబంలోనే గాఢంగా ఉంది. గాంధీజీ సిద్ధాంతాలు గాలికి వదిలేసినా గాంధీ కుటుంబాన్నీ, ఆ పార్టీనీ తనివి తీరా సేవించుకుంటున్న వారు కోకొల్లలు. అందులో మణిశంకర్‌ అయ్యర్‌ది ప్రథమ స్థానం.

ఈ మధ్య ఈయనో పుస్తకం అచ్చేసి దేశం మీదకి వదిలిపెట్టాడు. పేరు ‘మెమోయర్స్ ఆఫ్‌ ఎ ‌మావెరిక్‌-‌ది ఫస్ట్ ‌ఫిఫ్టీ ఇయర్స్’. ‌పుస్తకం రాసిన తరువాత ఆవిష్కరించే పని ఉంటుంది. ఎటొచ్చీ నిలువెల్లా ప్రచార యావ ఉన్నవాళ్లు ఆ ఆవిష్కరణను పురస్కరించుకుని కొంత పైత్యం కూడా పంచుతారు. తన పుస్తక ఆవిష్కరణ వేళనే మణిశంకర్‌ అన్నాడు, ‘పీవీ నరసింహారావు మతవాది అని.’ ఆపై ‘బీజేపీ తొలి ప్రధాని’ అని ముక్తాయించాడు. ఈ మణిపూస రామ్‌ ‌రహీమ్‌ ‌యాత్ర ప్రారంభించదలచి పీవీ అనుమతి కోసం వెళ్లాడట. అందుకు పీవీ, ‘నీ యాత్రకు నాకేమీ అభ్యంతరం లేదు. కానీ సెక్యులరిజానికి నీవు చెబుతున్న నిర్వచనంతో ఏకీభవించను.’ అన్నారట. ‘నా నిర్వచనంలో దోషమేమిటి’ అని మణిపూస అడిగిందట. అందుకు, ‘మణి! ఇది హిందూ దేశమన్న సంగతి నీకు అర్ధం కానట్టే ఉంది చూడబోతే’ అన్నారట పీవీ. కూర్చున్న కుర్చీలో నుంచి లేస్తూ మణి, ‘బీజేపీ సరిగ్గా ఇలాగే అంటుంది’ అన్నాడట. కాబట్టి బీజేపీ నుంచి వచ్చిన మొదటి ప్రధాని వాజపేయి కాదు, పీవీ అన్నదే మణి కవి హృదయం.

ఎన్నికలు సమీపిస్తుంటే మణికి పూనకం వస్తుంది, ఇలాంటి చచ్చు ప్రకటనలు చేస్తూ నలుగురి నోళ్లలోను నానేందుకు తంటాలు పడుతూ ఉంటాడని పీవీ మనుమడు ఎన్‌వీ సుభాశ్‌ ‌వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబీకులు తప్ప ఇంకెవరు ఈ దేశ ప్రధాని పదవిని అధిరోహించినా కాంగ్రెస్‌ ‌తట్టుకోలేదన్న సంగతి మణిశంకర్‌ ‌ద్వారా మరొకసారి బహిర్గతం చేయించారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ ‌పాత్రా సరిగానే చెప్పారు. కాబట్టి రాహుల్‌ను తప్ప మరొకరిని ప్రధాని పదవిలో చస్తే కాంగ్రెస్‌ ‌చూడదని ఈ విధంగా ‘ఇండియా’ శిబిరానికి హెచ్చరిక పంపారని కూడా పాత్రా గుట్టు విప్పారు.

మావెరిక్‌ అన్న పదానికి స్వతంత్రుడు, ఎవరికీ తలవంచడు, సంప్రదాయ పంథాలో నడవనివాడు వంటి అర్ధాలు ఉన్నా, ముగుతాడు అవసరమైన జంతువు అని చెప్పడానికి కూడా ఈ పదం వాడతారట. మణిశంకర్‌ ‌విషయంలో రెండోది తూకం వేసినట్టు సరిపోతుందని అనిపిస్తుంది. కాంగ్రెస్‌ ‌పార్టీలో నిజంగానే ఈయనొక మణిపూస. సరిగ్గా ఎన్నికల ముహూర్తంలోనే పూనడం ఈయన నైజం. 2014లో మోదీని చాయ్‌వాలా అని ఎద్దేవా చేసిన ఘనుడు ఇతడే. ఈ మాట అని బీజేపీని మణే నెగ్గించాడని కాదుకానీ, కాంగ్రెస్‌కి మాత్రం విశ్రాంతి కల్పించడానికి ఆ మాట కాస్త దోహదం చేసిందనే అంటారు. 2017లో గుజరాత్‌ ఎన్నికల వేళ మోదీ గురించి వాగి పార్టీని నిలువునా ముంచినందుకు ఇతడిని పార్టీ నుంచి గెంటేశారు. 2019లో లోక్‌సభ ఎన్నికలకి మళ్లీ పూనకం. మళ్లీ అవే వ్యాఖ్యలు. పైగా తన వ్యాఖ్యలలో తప్పేమీ లేదని ఢంకా బజాయించిన నిస్సగ్గరి ఇతడు.

తన రచనను ఇంకొన్ని రత్నాల వంటి అభిప్రాయాలతో మణి అలంకరిం చాడు. పాకిస్తాన్‌లో 99.9 శాతం ఉత్తములేనట. అసలు వాళ్ల నుంచి వెల్లువెత్తే ప్రేమను తట్టుకోవడమే కష్టమట. అయితే ఓ సర్వేలో ఈ సంగతిలోని నిజమెంత? ఆ మాటను మీరు ఎలా స్వీకరిస్తారు? అని అడిగితే 56 శాతం మంది వికారం వచ్చినట్టు మొహం పెట్టారట. పాకిస్తాన్‌లో మైనారిటీలను చావగొడుతున్న మాట నిజం అంటూ ఈ మధ్య కూడా నివేదికలు వచ్చాయి. అరెస్టులూ జరిగాయి. చర్చిల మీద దాడి నిందితులని జైళ్లకి పంపారు. అయినా మణి మాట ప్రకారం ఆ ఒక్క శాతమే ఇదంతా చేస్తోంది. మిగలిన వారంతా బంగారుకొండలు. ఏదో కొద్దిమంది వైఖరి వల్ల మనం సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును నిలిపివేయడమేనా? 99 శాతం బుద్ధిమంతులే ఉన్న ఆ పొరుగు దేశంతో చర్చలకు వెళ్లకపోవడం మహాపాపం కదా అన్న అభిప్రాయా లను కూడా తన గ్రంథరాజంలో మణి పొదిగారు. భారత్‌లో తిష్ట వేసిన పాక్‌ ‌ప్రేమికుల బలగానికి తానే పెద్దనని స్వచ్ఛందంగా ప్రకటించుకున్నాడు.

 మా కుటుంబమే కనుక అధికారంలో ఉంటే అయోధ్య కట్టడం కూలేది కాదు అంటూ లోగడ ఆ పార్టీ యువరాజు, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌  ‌స్వయంగా బొంకలేదా! కానీ ఈ వ్యాఖ్యను ధాన్యంపొల్లు కంటే హీనంగా చూసింది భారతజాతి. ఎందుకంటే, అందులో వాస్తవికత ఎంతో జనానికి తెలుసు. అయినా కానీ అధినాయకుడి మాటను తాను గౌరవిస్తున్నానని కష్టపడి రాసిన తన గ్రంథంలో మణి ప్రకటించాడు. రాహుల్‌, ‌మణి, దిగ్విజయ్‌ ‌వీరంతా కాంగ్రెస్‌కు సరైన వారసులు. జాతీయ భావాలను పిసరంత కూడా సహించరు. ఆ క్రమంలో పార్టీ పరువే కాదు, దేశ ప్రతిష్ట మసకబారినా ఫరవాలేదు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram