– సుజాత గోపగోని, 6302164068

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. రోజు రోజుకూ పొలిటికల్‌ ‌హీట్‌ ఎక్కువైపోతోంది. విపక్షాలు ప్రధానంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై దృష్టి సారించాయి. అధికార బీఆర్‌ఎస్‌ ‌మాత్రం ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఏడుగురికి మినహా దాదాపు సిట్టింగ్‌లకు అందరికీ మరోసారి ఛాన్స్ ‌కల్పించింది. అయితే, ఇప్పటికే ప్రతి నియోజక వర్గంలోనూ అన్ని కోణాల్లో మంచి పట్టు సంపాదించుకొని విజయం తమదే అన్న ధీమాతో ఉవ్విళ్లూరుతున్న సిట్టింగ్‌లను చేజార్చుకోలేకనే బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు అతి ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించారన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా పలుకుబడిని, అధికార వర్గాలతో సంబంధాలను చూసినా, ఇన్నాళ్లుగా ప్రతిపక్షాలకు కనీసం ఛాన్స్ ‌లేకుండా, విపక్షాలకు చెందిన అభ్యర్థులను ప్రజల్లో ఇమేజ్‌ ‌పొందకుండా ఎప్పటికప్పుడు కట్టడిచేసిన అధికార పార్టీ శాసనసభ్యులు.. ఆర్థికంగానూ నిలదొక్కుకున్నారన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థికంగా బలపడ్డ సిట్టింగ్‌లు బీఆర్‌ఎస్‌ ‌నుంచి వెళ్లిపోకుండా కట్టడిచేసే ప్లాన్‌లో భాగంగానే అభ్యర్థుల ప్రకటన జరిగిందని విశ్లేషకులు కూడా గట్టిగా చెబుతున్నారు. అయితే, ‘షరతులు వర్తిస్తాయి’ మాదిరిగా.. చివరలో కొన్ని మార్పులు, చేర్పులు ఉండొచ్చని కూడా కేసీఆర్‌ ఓ ‌మాట వదిలారు. అంటే.. ఇప్పటినుంచే అభ్యర్థులు జనంలో ఉంటారని, ఒకవేళ చివరలో అభ్యర్థుల పేర్లు మార్చినా.. వాళ్లకు ఇతర పార్టీల్లోకి వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయన్న పక్కా వ్యూహం ఇందులో ఉందంటున్నారు.

అయితే, ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు మాత్రం బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుతెన్నులు, హామీల స్థితిగతులపై ఫోకస్‌ ‌పెట్టాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయి నాయకులతో పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకుంటూ బీఆర్‌ఎస్‌ను ఎండగట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, గతంలో బీఆర్‌ఎస్‌ (‌నాటి టీఆర్‌ఎస్‌) ‌పార్టీ ఇచ్చిన హామీలు, చేసిన హడావిడి చర్చకు వస్తున్నాయి. తెలంగాణ అంటేనే కాళేశ్వరం అన్న రీతిలో తయారయ్యిందని, ఆ ప్రాజెక్టు మినహా రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులన్నీ పడకేశాయని విపక్షాలు కొత్త అస్త్రం బయటకు తీశాయి. వాస్తవ పరిస్థితి కూడా అలాగే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌కు దక్షిణ తెలంగాణ గండం వెంటాడు తోందంటున్నారు. కేసీఆర్‌ ‌సర్కారు.. ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ… దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులపై చూపించడం లేదన్న చర్చ, విపక్షాల నుంచి విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితు ల్లోనే.. ఉమ్మడి నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో కృష్ణా జలాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా బేసిన్‌లోని గ్రామాల్లో సాగునీటి సౌకర్యం లేక వ్యవసాయ పనులు నత్తనడకన సాగడం బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే గుబులు ఆ పార్టీలో మొదలైంది.

ఉత్తర తెలంగాణలో గోదావరి బేసిన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టును భారీ ఖర్చుతో నిర్మించిన సీఎం కేసీఆర్‌.. ‌దక్షిణ తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగానే ఉన్నాయి. కేసీఆర్‌ ‌సీఎంగా మొదటి సారి బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత 2015 జూన్‌ 11‌వ తేదీన కరివెన దగ్గర పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. బూత్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘కుర్చీ వేసుకుని ఈ ప్రాజెక్టును కట్టిస్తా.. నాలుగేండ్లలో నీరు అందిస్తా.. మూడేండ్ల లోనే 70% పాలమూరు పచ్చబడేలా చేస్తా..’ అని ప్రకటించారు. కానీ, తొమ్మిదేళ్లయినా ఇంకా పెండింగ్‌లోనే పెట్టడంపై ఇప్పటికే జిల్లాల్లో చర్చలు మొదలయ్యాయి. ‘పాలమూరు నుంచి ఎంపీగా ఉంటూ తెలంగాణను తెచ్చిన’ అని గొప్పగా ఆ సభలో ప్రకటించిన కేసీఆర్‌.. ‌నెలకు రెండుసార్లు వస్తానని, పనులను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ‘పాలమూ రును కట్టి చూపిస్తా.. ఇదే నా శపథం’ అని ప్రకటిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి ఎలా ఉన్నా దక్షిణ తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాక పోవడంతో ఆ ప్రభావం ఇప్పుడు బహిర్గతమవు తున్నది. వానాకాలం సీజన్‌ ‌మొదలైనా సాగు పనులు నత్తనడకన నడుస్తున్నాయి.

అటు కాల్వల్లో నీరు లేక, ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులు పూర్తికాక, సమయానికి వర్షాలు పడక రైతులు తిప్పలు పడుతున్నారు. మరో మార్గం లేని రైతులు రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల దాకా ఖర్చు పెట్టి కొత్తగా బోర్లు వేయించుకుంటున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి కష్టాలు తప్పవని రైతులు నిర్ధారణకు వచ్చారు. ఒక సీజన్‌ ‌మొత్తం నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళనలో అన్నదాతలు ఉన్నారు.

మరోవైపు.. ప్రజలను ఆకర్షించే ఉద్దేశంతో కొత్త సచివాలయంలో మే ఒకటో తేదీన తొలి సమీక్షా సమావేశంగా పాలమూరు ప్రాజెక్టుపైనే సీఎం కేసీఆర్‌ ‌నిర్వహించారు. సచివాలయంలో తన చాంబర్‌లో ఆసీనులైన మొదటగా సంతకం చేసిన ఫైళ్లలోనూ పాలమూరు జిల్లా సాగునీటికి సంబంధించినవి ఉన్నాయి. కరివెన, ఉద్దండాపూర్‌ ‌రిజర్వాయర్ల నుంచి నీటిని నారాయణపేట, కొడంగల్‌, ‌వికారాబాద్‌ ‌తదితర ప్రాంతాలకు తరలించడానికి వీలుగా కాలువలు తవ్వాలని ఆదేశించే ఫైళ్లు అందులో ఉన్నాయి. కరివెన రిజర్వాయర్‌కు సంబంధించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జూలైలో నీటి తరలింపు మొదలు పెట్టాలని, ఆగస్టు నాటికి ఉద్దండాపూర్‌ ‌వరకు చేరుకోవాలని ఆ సమావేశంలో అధికారులను ఆదేశించారు. జూన్‌ 19‌వ తేదీన కేసీఆర్‌ ‌నిర్వహించిన సమావేశంలో, సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఆగస్టు చివరి నాటికి తాగునీటి కోసం నార్లాపూర్‌, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్‌ ‌జలాశయాల్లోకి నీటిని ఎత్తిపోయాలని, అందుకు అవసరమైన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి సమర్ధులైనవారికి అప్పగించాలని అధికా రులను ఆదేశించారు. కానీ, ఆ పనులు ఇంకా సాగు తూనే ఉన్నాయి. బిల్లులు విడుదల కావడం లేదు.

రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పనులకు బిల్లులు విడుదల కావడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో నిధులన్నీ వివిధ సంక్షేమ పథకాల వైపునకు వెళ్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల పనులు మందగించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 26 భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. జూలై నాటికి వీటికి సంబంధించి రూ.13 వేల 599.87 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. వీటిలో బిల్లులు సిద్ధమై, దాఖలు చేసి, టోకెన్‌ ‌నంబర్లు కూడా ఇచ్చినవి రూ. 9వేల 758.20 కోట్ల దాకా, బిల్లులు సమ ర్పించినవి రూ. 3,841.67 కోట్ల వరకు ఉన్నాయి. బకాయిల్లో అత్యధికం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చెందినవే ఉన్నాయి. ఈ పథకానికి రూ.5,768.92 కోట్లుపెండింగ్‌లో పడిపోయాయి. దీంతో పాటు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూ.3,679.95 కోట్లు, సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 1176 కోట్లు చెల్లించాల్సి ఉంది.

అటు.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర విద్యుత్తు రుణ సంస్థల నుంచి రుణాలు ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు.. ఆర్థిక బాధ్యత-బడ్జెట్‌ ‌నిర్వహణ చట్టం – ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటిపోవడంతో జాతీయ స్థాయి సంస్థలేవీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడం లేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు రెండు టీఎంసీలు తరలించే ప్రధాన పథకానికి మాత్రమే అనుమతి ఉంది. రోజుకు ఒక టీఎంసీ అదనంగా తరలించే పథకానికి అనుమతు ల్లేవు. ప్రస్తుతానికి అనుమతులు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి కీలకమైన రెండో దశ కోసం పర్యావరణ అనుమతి ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు నిపుణుల మదింపు కమిటీ సిఫారసు చేసింది. అయితే ప్రాజెక్టు సవివర నివేదిక-డీపీఆర్‌-‌వివాదంలో ఉంది. దీనికి అనుమతి ఇవ్వలేమని, నీటి కేటాయింపుల వివాదం తేలాల్సిం దేనని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. నిర్మాణంలో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ. 55 వేల కోట్లు దాటింది. దీన్ని పూర్తి చేయా లంటే రాష్ట్ర ప్రభుత్వ ఖాతా నుంచి నిధులు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఉంది. ఇదివరకు ఎత్తిపోతల్లో ఎలక్ట్రో మెకానికల్‌ ‌కాంపోనెంట్లకు పవర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌(‌పీఎఫ్‌సీ)-రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ ‌కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) రుణాలు ఇచ్చేవి. అయితే, కేంద్ర జలశక్తి శాఖ.. అనుమతి లేనివాటి జాబితాలో పెట్టడంతో ఈ ప్రాజెక్టులకు రుణాలు ఆగిపోయాయి. కాళేశ్వరం మాదిరిగానే హెడ్‌లు మాత్రమే పూర్తిచేసి, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను దేవుడి దయకు వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.

ఇక, ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ అత్యంత కీలకమైన దశ. ఈ పనుల కోసం రూ. 322 కోట్లు విడుదల కావల్సి ఉంది. భూములు కోల్పోయిన వాళ్ల పునరావాసానికి రూ. 224 కోట్లు అవసరం అవుతాయి. భూ సేకరణకు సకాలంలో నిధులివ్వక పోవడంతో భూములను వదులుకోవడానికి రైతులు సిద్ధంగా లేరు. భూసేకరణ, పునరావాసానికి నిధులిస్తేనే ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచగలమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. బకాయిల నేపథ్యంలో పనులు చేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది. సబ్‌ ‌కాంట్రాక్టర్ల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది. దీంతో, ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణపనుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తుందా అని చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ‌క్షేత్రస్థాయి నేతలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు బెంగ పట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మెజార్టీ స్థానాలు బీఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకున్నది. మరి ఈసారి పరిస్థితి ఏంటన్న దానిపై ఆ పార్టీలో సందేహాలు వ్యక్తమవు తున్నాయి. దక్షిణ తెలంగాణ రైతులు ఎలా ఆలోచిస్తారో, వారి ఓటు ఎటు పడుతుందోననే ఆందోళన గులాబీ నేతల్లో మొదలైంది. రైతులను కన్విన్స్ ‌చేయడం అధికార పార్టీకి సవాలుగా మారింది. ఒక సీజన్‌ ‌మొత్తం రైతులు నష్టపోతే అది వచ్చే ఎన్నికల్లో ఎలాంటి చేటు తెచ్చిపెడుతుందోని అధికార పార్టీ నేతలకు భయం పట్టుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్టుతో పాలమూరు ప్రాజెక్టును పోల్చుకుని ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌, ‌నల్లగొండ జిల్లాలు రైతులు ఓటు వేసే టైమ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ప్రచారం చేస్తున్నాయి. పాలమూరు ప్రాజెక్టు పనుల్లో జరిగిన జాప్యాన్ని ఎత్తి చూపి కేసీఆర్‌ను టార్గెట్‌ ‌చేస్తున్నారు. మరి.. బీఆర్‌ఎస్‌ ఈ ‌పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుందో, విపక్షాల విమర్శలకు ఏం సమాధానం చెబుతుందో.. చివరకు ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram