– డి. అరుణ

ఆర్ధిక, భౌగోళిక, రాజకీయ రంగాలలో తాము సాధించిన విజయాలతో నూతన ఉత్సాహాన్ని నింపుకున్న బ్రిక్స్ (‌బిఆర్‌ఐసిఎస్‌- ‌బ్రెజిల్‌, ‌రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా) కూటమి ఏకధ్రువ ఆధిపత్య గుప్పిట నుంచి  ప్రపంచాన్ని తప్పించి, బహుళ•ధ్రువ ప్రపంచానికి పునాదులు వేసేందుకు కృషి చేస్తూ మరో ఆరు దేశాలను తమ కూటమిలోకి ఆహ్వానించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ 2023‌వ సదస్సు అర్జెంటీనా, ఇథియోపియా, ఇరాన్‌, ‌సౌదీ అరేబియా, యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌కు వచ్చే ఏడాది నుంచి సభ్యత్వం ఇచ్చింది. 

రిజర్వు కరెన్సీగా డాలరు ఆధిపత్యాన్ని, దాని అండతో అమెరికా ఆంక్షల పేరుతో చెలరేగిపోతున్న విధానాన్ని చూసిన ప్రపంచ దేశాలకు సహనం నశించిపోయింది. ఇప్పటివరకూ ముడిచమురు, పెట్రోలు వంటి ఇంధనాల కోసం అమెరికా ఏదో ఒక సాకు చూపి అవి ఇబ్బడి ముబ్బడిగా ఉన్న దేశాలపై ఏదో ఒక సాకుతో యుద్ధాన్ని చేసి, అక్కడి ఆర్ధిక వ్యవస్థలను ధ్వంసం చేయడం, అందుకు నాటో పేరుతో ఐరోపా దేశాలు సహకరించడం మనం చూశాం. అందుకే ఇప్పుడు ఐరోపాయేతర ఖండాలు, దేశాల రహితంగా బ్రిక్స్ ‌కూటమి పని చేయాలని నిర్ణయించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ ‌తనను ఆహ్వానించాలని కోరినా, వాటికన్‌ ‌సిటీ తనకు పరిశీలకుని హోదా ఇవ్వమని అడిగినా బ్రిక్స్ ‌నిర్ద్వం ద్వంగా నిరాకరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అయితే, ఐరోపా దేశాలకు తమ కూటమిలో చోటు లేదని ఉపన్యాసంలో స్పష్టం చేశారు.

నూతన ప్రపంచ క్రమానికి నాంది పలుకుతున్న సమయంలో బ్రిక్స్ ‌సభ్య దేశమైన భారత్‌ ఆగస్టు 23న ఇంతకు ముందు ఎవ్వరూ మోపని ప్రాంతంలో చంద్రునిపై కాలు మోపి తమ సత్తా ఏమిటో చాటుకోవడమే కాదు, లా సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ దీన్ని ప్రపంచ విజయంగా, అందరికీ ఉప యోగపడేదిగా అభివర్ణించడం ద్వారా తమ కార్యశైలి ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పారు. ఈసారి బ్రిక్స్ ‌సమావేశం దక్షిణ ఆఫ్రికా ఆధ్వర్యంలో జరిగింది. ఏకధ్రువ ప్రపంచంలో రిజర్వు కరెన్సీగా చెలామణి అవుతున్న డాలర్‌ ‌స్థానంలో తమ తమ స్థానిక కరెన్సీలను ప్రవేశపెట్టేందుకు మార్గాలను సమావేశం అన్వేషించింది. కాగా, ఐరోపా యూని యన్‌ ‌ప్రవేశ పెట్టిన ‘యూరో’ వంటి కరెన్సీని ప్రవేశపెట్టేందుకు దేనితో దానిని ముడిపెట్టి విలువను నిర్ణయించాలనే విషయం ఇంకా శైశవ దశలోనే ఉన్నది.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ కూటమి అధికార ప్రతినిధి కావడమే కాదు, ప్రపంచంలో 40% జనాభాకు, ప్రపంచ జీడీపీలో 25%కి పైగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత పాత్ర ఉండాలన్న కీలక ఆకాంక్ష, లక్ష్యాలను బ్రిక్స్ ‌కలిగి ఉండటం వల్లనే దాదాపు 50 దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశాల రెండవ రోజున కొత్తగా ఆరు దేశాలను ఇందులోకి చేర్చుకుంటున్నట్టు బ్రిక్స్ ‌ప్రకటించింది. కూటమిని ఏర్పరచిన పదమూడేళ్ల తర్వాత కొత్త సభ్యులు ఇందులో భాగములయ్యారు.

కొవిడ్‌ ‌మహమ్మారి అనంతరం మారిన పరిస్థితులలో 15వ బ్రిక్స్ ‌సమావేశపు జొహెన్నాస్‌బర్గ్ ‌ప్రకటన ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంటోంది. ఉద్భవిస్తున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ సంస్థలలో మరింత ప్రాతినిధ్యం ఉండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలతో ప్రపంచ వాణిజ్య సంస్థ భిన్నంగా వ్యవహ రించకూడదని కోరుతూ, ఏకపక్ష నిర్బంధ పద్ధతుల పట్ల బ్రిక్స్ ఆం‌దోళన వ్యక్తం చేసింది. అనేక దేశాలలో పెరుగుతున్న వడ్డీ రేట్లు రుణ దుర్బలత్వాన్ని ఉధృతం చేసిన అంతర్జాతీయ సంస్థను పట్టి చూపుతూ, అంతర్జాతీయ రుణ/ బాకీ అంశాలను తగిన రీతిలో పరిష్కరించాలని కోరింది. బ్రిక్స్ ఉమ్మడి ప్రయోజ నాల ఐక్యతను లక్ష్యాలు ప్రదర్శించాయి. జనాభా పరంగా, జీడీపీ పరంగా చెప్పుకోదగిన బలాన్ని కలిగి ఉన్నందున, అంతర్‌ ‌బ్రిక్స్ ‌సహకారానికి సమావేశం ప్రాధాన్యం ఇచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఉద్భవిస్తున్న మార్కెట్ల మధ్య చర్చల ద్వారా చెల్లింపుల పద్ధతులు, అందులో స్థానిక కరెన్సీలకు ప్రాధాన్యం ఇచ్చింది. బ్రిక్స్ ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్‌ ‌బ్యాంక్‌ (ఎన్‌ఎం‌డి లేదా బ్రిక్స్ ‌బ్యాంక్‌) అత్యంత చక్కగా రూపొందించిన పాలనా వ్యవస్థతో పటిష్టమైన విజయాన్ని సాధించిందనే చెప్పాలి. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నిధులతో పోల్చి చూస్తే ఎన్‌డీబీ కేటాయింపులు స్వల్పమే అయినప్పటికీ భవిష్యత్‌ ఆశాజనకంగా కనిపిస్తోంది.

పర్యావరణ మార్పు యుగంలో నిలకడైన వృద్ధిని సాధించడం గురించి, అంతర్జాతీయ పాలనా సంస్క రణలు, స్థానిక కరెన్సీలలో వ్యాపారాన్ని క్రమబద్ధంగా పెంచుకుంటూ పోయే పక్రియ గురించి సమావేశం చర్చించింది. అభివృద్ధి పథంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థలు డాలరేతర కరెన్సీలలో వ్యాపారాన్ని చేయడానికి మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ పరిణామం రష్యాపై ఆంక్షల అనంతరం ఊపందుకుంది.

కాగా, ఇప్పటికీ డాలరే ప్రపంచ రిజర్వ్ ‌కరెన్సీ హోదాను కలిగి ఉన్నప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు దాని ఆధిపత్యాన్ని తిరస్కరించడం పెరిగిపోతున్నది. ఈ విషయాన్ని అనేకమంది ఆర్ధిక నిపుణులు, యుఎస్‌ ‌సీనియర్‌ అధికారులు గుర్తించ డమే కాదు, తన విదేశీ విధానాన్ని అమలు చేయడం కోసం ఎడాపెడా ఆర్ధిక ఆంక్షలను విధించుకుంటూ పోతే, భవిష్యత్తులో డాలర్‌ ‌తన ఆధిపత్యాన్ని కోల్పోతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమం లోనే డీడాలరీకరణ ప్రచారం ఊపందు కుంటోంది.

ఈ నేపథ్యంలో బ్రిక్స్ ‌కూడా ఐరోపా యూనియన్‌ ‌లాగానే బ్రిక్స్ ‌కరెన్సీని ముద్రిస్తామని ప్రకటిస్తుందనే వాదనలు వినిపించాయి. తమ సభ్య దేశాల మధ్య సీమాంతర వాణిజ్యం కోసం ఉమ్మడి కరెన్సీగా బ్రిక్స్ ‌దీనిని తీసుకువస్తుందని అన్నారు. అయితే అటువంటి దేమీ ఈ సమావేశం సందర్భంగా చోటు చేసుకోలేదు. అయితే, భవిష్యత్తులో అది జరగదనే హామీ కూడా లేదు. బ్రిక్స్ ‌దేశాలన్నింటికీ సౌకర్యవంతమైన బాలెన్స్ ఆఫ్‌ ‌పేమెంట్స్ ‌మిగులు ఉన్నప్పటికీ, అందుకు అవసరమైన సంస్థాగత నిర్మాణం, దానిని నిలుపుకునే స్థాయిలో సుస్థిరత లేవు. పైగా, ఈ కరెన్సీ అంగీక రించేందుకు అన్ని దేశాలూ ఒక తాటి మీదకు రావడం, ఒక ఎక్స్‌చేంజ్‌ ‌రేటు పద్ధతిపై అంగీకారానికి రావడం వంటి అనేకానేక అంశాలను రూపొందించు కోవలసి ఉంటుంది. కనుక బ్రిక్స్ ‌కరెన్సీ ఇప్పుడప్పుడే రాకపోయినప్పటికీ, స్థానిక కరెన్సీలలో ఏకపక్ష వాణిజ్యం పుంజుకునేందుకు వేదిక సిద్ధమైంది.

భారత్‌ ‌పాత్ర

కోవిడ్‌ ‌నేపథ్యంలో దేశాల ఆర్ధిక పరిస్థితులు అతలాకుతలం కావడం, ఆ సమయంలోనే భారత్‌ ఆరోగ్యం నుంచి ఆర్ధికం వరకూ తన జనాభాను కాపాడు కోవడమే కాక, ఇతర దేశాలకు కూడా తోడ్పడి ప్రత్యేకతను సంతరించుకొని, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించింది. అన్నింటికన్నా ప్రధానమైనవి భారత దేశ ప్రయోజనాలే అన్న లక్ష్యంతో ప్రధాని మోదీ అన్ని దేశాలతోనూ సమానంగా సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల హిరోషిమాలో జరిగిన జి7 సదస్సులోనూ, అనధికారికంగా జరిగిన క్వాడ్‌ ‌సదస్సులోనూ పాల్గొనడంతో భారత్‌ ‌యుఎస్‌ ‌వైపు మొగ్గుతున్నదా అనే భావన వచ్చిన కొద్దిరోజులకే, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకమని భావించే బ్రిక్స్‌లో చురుకైన పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బ్రిక్స్ ‌పాశ్చాత్య వ్యతిరేక కూటమిగా ఉండాలన్నది చైనా కోరిక. కానీ, భారత్‌ ‌మాత్రం బ్రిక్స్ ‘‌పాశ్చాత్యేతర కూటమి’గా ఉండటమే మేలని సూచిస్తోంది. అటు రష్యాతోనూ ఇటు చైనాతో సమస్యలున్నప్పటికీ, షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సిఒ)లో భాగంగా భారత్‌ ‌వారితో సంబంధాలు కొన సాగిస్తోంది.

ప్రపంచానికి ఒక వృద్ధి ఇంజన్‌గా భారత్‌ ఉం‌టుందని, అందుకు కారణం విపత్కర పరిస్థితు లను కూడా భారత్‌ ఆర్ధిక సంస్కరణలుగా మార్చడ మేనని ప్రధాని మోదీ చెప్పారు. గత కొద్ది ఏళ్లలో వ్యాపారం చేయడం సరళీకృతం అయిందని, తాము ప్రజాసేవల బట్వాడా, సుపరిపాలనపై దృష్టి పెట్టామన్నారు. నేడు భారత్‌లో అన్ని స్థాయుల్లోనూ యుపీఐను ఉపయోగిస్తున్నారని, ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో డిజిటల్‌ ‌లావాదేవీలను నిర్వహి స్తున్నది భారతదేశమేనని ఆయన చెప్పుకొచ్చారు.

దానితోపాటుగా ప్రపంచంలోనే అతిపెద్ద 3వ స్టార్టప్‌ ‌పర్యావరణ వ్యవస్థ భారత్‌లో ఉందని, అందులో 100 యూనికార్నస్ ఉన్నాయని బ్రిక్స్ ‌బిజినెస్‌ ‌ఫోరం నాయకులతో చర్చ సందర్బంగా చెప్పారు.

లాభపడనున్న భారత్‌, ‌చైనా

భారత్‌, ‌చైనాలకు రక్షణపరంగా భిన్నమైన లక్ష్యాలు, ప్రయోజనాలు ఉన్నప్పటికీ, స్థానిక కరెన్సీలలో వాణిజ్యం కారణంగా ఈ రెండు దేశాలూ బాగా లాభపడనున్నాయి. ఇప్పటికే బ్రిక్స్‌లోని కొన్ని దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య చెల్లింపుల కోసం తమ స్వంత కరెన్సీలను ఉపయోగిస్తున్నాయి. అలాగే, సౌదీ అరేబియా కూడా చమురు లావాదేవీలకు సంబంధిం చిన చెల్లింపులను రెన్‌మిన్‌బీలో చేసేందుకు ఒప్పందం చేసుకుంటుండగా, భారతదేశం బ్రిక్స్ ‌కూటమి బయిటున్న దేశాలతో కూడా దైపాక్షిక వాణిజ్య చెల్లింపులను స్థానిక కరెన్సీలలో చేసుకోవ డాన్ని విస్తరింపచేస్తోంది. వాణిజ్య చెల్లింపులను రూపాయలలో చేసేందుకు దాదాపు ఇరవైకి పైగా దేశాలను ప్రత్యేక వోస్ట్రో బ్యాంకు ఖాతాలను తెరవవలసిందిగా భారత్‌ ఆహ్వానించింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ నెల మొదట్లో యుఎఇకి తొలి చమురు చెల్లింపులను రూపాయలలో చేసింది.

జి7 కూటమికి పోటీగా బ్రిక్స్

‌చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈ ‌కూటమి జి7కు భౌగోళిక రాజకీయ ప్రత్యర్ధిగా ఉండాలని ప్రతిపాదించారు. అయితే భారత్‌ ‌మాత్రం ఇందుకు అంగీకరించక, సమరసంగా, అందరూ లాభపడేలా ముందుకుపోవాలని చెప్తోంది. ముందు వెనుకలు ఆలోచించకుండా, పద్ధతీ పాడూ లేకుండా సభ్యులను చేర్చుకుని, పోటీ కోసం బ్రిక్స్‌ను విస్తరించడం వల్ల ఉపయోగం లేదని మెత్తగా హెచ్చరిస్తోంది. పెరుగు తున్న బ్రిక్స్ ‌ప్రాబల్యాన్ని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మొత్తం 40 దేశాలకు పైగా బ్రిక్స్ ‌పట్ల ఆసక్తి ప్రదర్శించగా, 23 దేశాలు తమను కూడా ఇందులో చేర్చుకోవలసిందిగా దరఖాస్తులు సమర్పించాయి. కాగా, బ్రిక్స్ ‌నాయకులు సంప్ర దించుకుని ఆరు దేశాలను ఎంపిక చేశారు. అవి – అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్‌, ‌సౌదీ అరేబియా, యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్ (‌యుఎఇ). ఈ దేశాలు కూడా 2024 జనవరి నుంచి అధికా రికంగా బ్రిక్స్ ‌సభ్యులు కానున్నాయి.

బహుళ ధృవ ప్రపంచానికి అడ్డంకారాదు

ప్రస్తుతం తనకున్న ఆర్ధిక సామర్ధ్యం, ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా రష్యా వంటి అగ్ర దేశం తనపై ఆధారపడి ఉండటం, తన ఆర్ధిక శక్తితో ఇతర సభ్య దేశాలను ప్రభావితం చేయగల సామర్ధ్యాన్ని చైనా కలిగి ఉండటం కూడా బ్రిక్స్ ‌విస్తరణకు భారత్‌ ‌బ్రేకులు వేయడానికి కారణమని అంటున్నారు. బ్రిక్స్‌ను వేగంగా విస్తరించనిస్తే, చైనా దానికి పాశ్చాత్య వ్యతిరేక వాసనలు పులుముతుందని, ఇది బహుళ ధ్రువ ప్రపంచాన్ని సాధించాలన్న లక్ష్యం నెరవేర నివ్వదని భారత్‌ ‌భావిస్తోంది. ఈ కూటమిలో సభ్యుల మధ్య సమానత్వమన్నది ప్రాథమిక లక్షణంగా ఉంటూ వస్తోంది, విస్తరణ ఎక్కువగా ఉంటే అది సమతుల్యతను దెబ్బతీసి, భారత్‌ను, చైనాను రెండు వర్గాలుగా విడదీయగల శక్తిని కూడా కలిగి ఉంటుంది. కనుక, బ్రిక్స్‌ను విస్తరిస్తే తన భౌగోళిక రాజకీయ అజెండాను అనుసరిం చేందుకు, అభిప్రాయాలను రుద్దేందుకు చైనాకు ఒక వేదికను ఇచ్చినట్టు అవుతుంది.

ఒకవేళ భారత్‌, ‌చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గల్వాన్‌ అనంతరం ప్రతికూల స్థితికి చేరకపోయి ఉంటే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మాంద్యంలోకి వెడుతున్న తరుణంలో గ్లోబల్‌ ‌సౌత్‌లో ప్రాంతీయ సమగ్రతకు, ఆర్ధిక సంస్థలు అభివృద్ధికి కృషి చేసి ఉండేవి. ఇంకా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వద్ద సైనిక సమీకరణ కారణంగా, విశ్వాస రాహిత్యం వల్ల బ్రిక్స్‌లో పోటీ దృక్పథాలు కనిపిస్తాయి. పైగా, అమెరికాతో సత్సంబంధాలను నెరపుతున్న భారత్‌కు మాత్రం చైనా, యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌మధ్య చిక్కుకుపోవడం ఇష్టపడడం లేదు. అందరితో సమానమైన సంబంధాలను కలిగి ఉండాలని కోరుకుంటోంది.

ఆఫ్రికాతో మరింత వాణిజ్యం

2023లో జరిగిన బ్రిక్స్ ‌సమావేశాలు ఆఫ్రికా దేశాలతో వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసు కోవడం గురించి చర్చించాయి. ఈ క్రమంలో ఆఫ్రికా ఖండంలో ఇప్పటి వరకూ స్పృశించని మార్కెట్లను అన్వేషించేందుకు బ్రిక్స్ ‌దేశాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది. దానితో 2030 నాటికి వారి మధ్య 500 బిలియన్లను దాటనుంది.

బ్రిక్స్ ఏర్పాటుకు దారి తీసిన కారణాలు

1990వ దశకంలో సోవియట్‌ ‌రష్యా పతనా నంతరం, అమెరికా బాహుబలి అయిపోయింది. తనను సవాలు చేయడానికి ఏశక్తీ లేని ఏకధ్రువ ప్రపంచంలో యుఎస్‌ ‌తాను ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతూ, అన్ని అంతర్జాతీయ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచం మీద పెత్తనం చెలాయిస్తూ వస్తోంది. దీనంతటికీ కారణం, డాలరు రిజర్వు కరెన్సీ కావడం వల్ల ఏ దేశం కూడా దాని శక్తికి అడ్డుకట్ట వేయలేకపోయింది. అభివృద్ధి చెందు తున్న దేశాలు తమ ప్రయోజనాలను పరిరక్షించు కోవడం కోసం ‘బ్రిక్‌’ ‌సంస్థను 2006లో ఏర్పాటు చేసుకున్నాయి. తొలుత బ్రెజిల్‌, ‌రష్యా, ఇండియా, చైనాలతో ఏర్పడిన ఈ కూటమి తొలి సమావేశం 2009లో రష్యాలోని యెకటెరిన్‌బర్గ్‌లో జరిగింది. మరు ఏడాదే బ్రిక్‌ ‌నాయకుల ఏకాభిప్రాయంతో దక్షిణ ఆఫ్రికా చేరడంతో అది ‘బ్రిక్స్’‌గా మారింది. కొత్తల్లో ఆర్ధిక, వాణిజ్య, పెట్టుబడి భాగస్వాములుగా ఉన్న ఈ కూటమిలోని దేశాలు అనంతరం కాలంలో మరింత బహుముఖీయంగా, బహుజాతీయంగా తమ కార్యకలాపాలను విస్తరించాయి.

కొత్త దేశాల వల్ల ఉపయోగం

అమెరికా తనకు, తన 13 మిత్ర దేశాలకు కీలక ఇంధన భద్రతను బలోపేతం చేసేందుకు అనుసరించిన ఖనిజ భద్రతా భాగస్వామ్య పద్ధతి (ఎంఎస్‌పి) వంటి పద్ధతినే బ్రిక్స్ అనుసరించనుంది. దక్షిణ అమెరికాలో మూడవ లిథియం రిజర్వులు గల దేశమైన అర్జెంటీనాకు సభ్యత్వం ఇవ్వడంతో లిథియం సరఫరాలకు లోటు ఉండదు. కీలక ఖనిజాల సరఫరా లంకెలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను బ్రిక్స్ ‌పెంచనుంది. బ్రెజిల్‌లో లిథియం, కీలక ఖనిజాలలో ఇప్పటికే సౌదీ అరేబియా విశేషంగా పెట్టుబడులు పెడుతోంది.

అంతేకాదు, ప్రపంచ చమురు సరఫరాలో 42శాతాన్ని కలిగిన అతిపెద్ద చమురు ఎగుమతి దారులైన సౌదీ అరేబియా, యుఎఇ, ఇరాన్‌లు బ్రిక్స్‌లో ఉం డటం అన్నది ఆ కూటమికి విలువను ఆపాదించే విషయమే. వెనిజులా, ఇరాన్‌పై పాశ్చాత్య ఇంధన ఆంక్షల గురించి అనేక సంవత్సరాలుగా ఒపెక్‌+‌దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి. దీనివల్ల పెట్టుబడులు, ఎగుమతి సరఫరాలు దెబ్బతింటున్నా యన్నది వారి ఆందోళన. అయితే, అతిపెద్ద చమురు, సహజవాయు దిగుమతిదారులైన చైనా, భారత్‌ ‌బ్రిక్స్‌లో ఉండడం మరొక ప్లస్‌ ‌పాయింటే, రష్యాను లక్ష్యంగా చేసుకున్న ధరల నియంత్రణ సంకీర్ణంలో చేరేందుకు ఈ రెండు దేశాలూ అంగీకరించని విషయం తెలిసిందే. ఇంధన ఆంక్షలు పెరిగి పోతుండడంతో, ద్వైపాక్షిక ఇంధన ఒప్పందాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. అది కూడా చైనా రెన్‌మిన్‌బీ లేదా భారతీయ రూపాయలలో కుదుర్చు కుంటున్నారు.

ప్రపంచ సంక్షేమం కోసం బ్రిక్స్ ‌చేస్తున్న కృషి ఇంకా శైశవ దశలోనే ఉంది. ఆ కూటమి లక్ష్యాలు, కార్యాచరణ వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలే కాదు పేద దేశాలు కూడా లాభపడతాయి. ‘వసుధైక కుటుంబం’ అన్న భారత భావనను నిజం చేయడంలో ఈ కూటమి తనవంతు దోహదం చేస్తోంది.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram