– కె. గోపీకృష్ణ,  విశ్రాంత ఉపన్యాసకులు

నిబంధన 1: ఎప్పుడూ డబ్బు పోగొట్టుకోకు.

నిబంధన 2: నిబంధన 1ని ఎప్పుడూ మరచిపోకు.

– వార్నర్‌ ‌బఫెట్‌, (అమెరికా వ్యాపార దిగ్గజం, దాత. బెర్క్‌షైర్‌ ‌హాత్‌వే సీఈఓ)

——

తాను మంచివాళ్ల చేతులలోనే ఉన్నానని ధనం గ్రహిస్తే అది ఆ చేతుల లోనే ఉండి పోవాలని అనుకుంటుంది. అంతేకాదు, మరింత పెరగాలని కూడా అనుకుంటుంది.

– ఇదవు కొయెనికన్‌ (అమెరికా ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, ‘వెల్త్ ‌ఫర్‌ ఆల్‌ ఆ‌ఫ్రికన్స్’ ‌పుస్తక రచయిత)

——

‘ధనం మూలం ఇదం జగత్‌’ అనే ఆర్యోక్తిని మనం అనుదినం మననం చేసుకోవాలి. ఆధునిక సాంకేతికత పురోగమిస్తున్న తరుణంలో ద్రవ్యం- దాని విలువ, ప్రాముఖ్యం, సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి, ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు- మదుపు, సంపద సృష్టి, ఆర్థికంగా పురోగతి సాధన తదితర అనేక అంశాలపై అవగాహన పెంపొందించు కోవలసిన ఆవశ్యకత ఉంది.

మనిషి పుట్టినప్పటి నుంచి మరణం వరకు నిత్యం తీసుకొనే నిర్ణయాలు అనేకం. అంటే వస్తుసేవల ఉత్పత్తి, పంపిణీ, కొనుగోళ్లు, అమ్మకాలు, బేరసారాలు, చెల్లింపులు, అప్పులు, తిరిగి చెల్లింపులు మొదలైనవి. ఈ అంశాలన్నీ ఆర్థిక అవగాహనపై ఆధారపడి ఉంటాయి. సమాజంతో అన్ని రకాల మానవ సంబంధాలకు మూలం ద్రవ్యం. ఆర్థిక అక్షరాస్యత అంటే ఏమిటి? మన వద్ద ఉన్న డబ్బును తెలివిగా ఎలా వినియోగించుకోవాలి అనే విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం. అనేకమంది జీవితంలో సరైన ఆర్థిక అక్షరాస్యత లేకపోవటంవల్ల ఆ కోణానికి సంబంధించి అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని వ్యయాలను పెంచుకొని అప్పుల పాలవు తుంటారు. దైనందిన, కుటుంబ వ్యయ రాబడుల బడ్జెట్‌ను రూపకల్పన ఎలా చేసుకోవాలనే అంశాలతో పాటు చాలా ఆర్థిక నిర్ణయాలతో ద్రవ్యాన్ని తెలివిగా గరిష్ఠ ప్రయోజనం కలిగే విధంగా కేటాయింపులు చేసుకొని సక్రమమైన మార్గాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో ఆస్తిపాస్తులను సమకూర్చుకునే దిశగా ప్రయాణించగల సామర్ధ్యాన్ని సమకూర్చుకోవడాన్ని ఆర్థిక అక్షరాస్యత అని చెప్పవచ్చు.

ఆర్థిక అక్షరాస్యతతో కుటుంబ బడ్జెట్‌ ‌రూపకల్పన, వ్యయాలపై అదుపు, సక్రమ వినియోగంతోపాటుగా పొదుపు ఎలాచేయాలి, వడ్డీ రేట్లపై అవగాహన, క్రెడిట్‌ ‌స్కోర్సు, పెట్టుబడి వ్యూహాలు మొదలైన అంశాలపై తగిన పరిజ్ఞానాన్ని పొందడంగా వ్యవహారించవచ్చును.

కేవలం విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకొనే అంశంగా ఆర్థిక అక్షరాస్యతను పరిగణించరాదు. అన్ని దశలతో ప్రతి వ్యక్తికి నిత్యం అవసరమైన అవగాహన ‘ఆర్థిక అక్షరాస్యత’. అన్ని వర్గాల వ్యక్తులకు, సంస్థలకు, అధికారులకు, యాజ మాన్యాలకు, నిర్వాసితులకు, ఆర్థికపరమైన అవగాహనను అందించేది ఆర్థిక అక్షరాస్యత.

ఏ వ్యక్తి అయినా నిత్య జీవితంలో ఆర్జించే రాబడులు, కుటుంబ వ్యయాలు, గృహ నిర్మాణం, పొదుపు- పెట్టుబడులు, షాపింగు, బీమా పాలసీలు, రిటైర్‌ ‌మెంటు పథకాలు, స్టాక్‌ ‌మార్కెట్‌ ‌కార్యకలాపాలు వంటి అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవలసి ఉంది. కేవలం వ్యాపార వాణిజ్యవేత్తలకు, ధనికులకే కాదు, ప్రతి వ్యక్తి ఆర్థిక అంశాలపై కనీస అవగాహన శక్తి కలిగి ఉండాలి. భవిష్యత్‌ అవసరాలకు బ్యాంకులలో పొదుపు ఖాతాలతో ద్రవ్య నిల్వ చేయటంవల్ల దీర్ఘకాలంలో ద్రవ్యం విలువ, కొనుగోలు శక్తి ఎలా మారుతుంది? ద్రవ్యాన్ని ఏఏ మార్గాలలో మదుపు చేయాలి? ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక నిర్వహణ సామర్థ్యాలను ఎలా పెంచుకోవాలి? ఇలాంటివి ఆర్థిక అక్షరాస్యత నేర్పుతుంది.

ఆర్థిక విద్య అంటే?

ఒక వ్యక్తి ఆర్థిక శ్రేయస్సుకు అనుకూలంగా ప్రభావితం చేసే ఎంపికలకు సంబంధించిన విద్య ‘ఆర్థిక విద్య.’

 ద్రవ్యాన్ని ఎలా వినియోగించుకోవాలి? ఎలా పొదుపు, మదుపులు జేయాలి? వ్యక్తి దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా ఎలా ముందుకు సాగాలి? ఆర్థిక చైతన్యం, పరిజ్ఞానం, ప్రణాళికల రూపకల్పన, అమలు ద్వారా ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఉపయోగపడే సోపానమే ఆర్థిక విద్య.

ఆర్థికపరమైన సమస్యలు లేదా ఆర్థిక అనిశ్చిత స్థితి తట్టుకోవాలంటే వ్యక్తికి ఆర్థిక ప్రణాళిక అత్యవసరం. ప్రస్తుతం ఎంత ఆదాయం సమకూరు తున్నది? కుటుంబ వ్యయాలు ఎలా పెరుగు తున్నాయి? రాబోవు కాలంలో పెరుగనున్న ఆదాయ, వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి? అందుకు అనుగుణంగా ఎలాంటివి ఆర్థికచర్యలు తీసుకోవాలి అనే పలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విజ్ఞానం ‘ఆర్థిక విద్య’ ద్వారా సమకూరుతుంది. ‘పదవీ విరమణ’ తప్పదు కనుక, రిటైర్మెంట్‌ ‌తదనంతర జీవన మనుగడకు అవసరమైన ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి? దీనికి సమాధానం పదవీ విరమణకు ముందుగానే అందుకు చర్యలు తీసుకోవాలి.

మానవుల ఆర్థిక జీవనయానంలో సప్త మార్గాలు ఉన్నాయి. ఒక మనిషి తాను పురోగమించేందుకు అతని ఆలోచనలు, సంకల్పబలం, సాధించాలనే తపన, సక్రమ ప్రణాళికలు, జాగరూకత వంటి అంశాలు దోహదం చేస్తాయి.

ఆర్థిక విద్య సముపార్జనలో అనేక రకాల అంశాల మిళితమై ఉన్నాయి. కేవలం జ్ఞానంతో ఎలాంటి ప్రయోజనమూ కలగదు. ఆ జ్ఞానాన్ని తన జీవిత అవసరాలకు అన్వయించి సక్రమ ప్రణాళిక ద్వారా ముందుకు సాగాలి. ఫలితాలు మాత్రం దీర్ఘకాలంలో సమకూరుతాయి.

కనుక, ప్రతి వ్యక్తీ ఆర్థిక అక్షరాస్యత సాధించాలి.

ద్రవ్య నిర్వహణ ఓ కళ

ఎంత మొత్తంలో ధనార్జన చేస్తున్నాం అనే ప్రశ్న కన్నా, సంపాదించిన ధనాన్ని ఎలా ఖర్చుచేస్తున్నాం అనే అంశం చాలా విలువైనది.

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌ ‌మంచి జీవన ప్రమాణాలు కలిగి ఉం డాలని కష్టించి వారిని ఉన్నత విద్యల వైపు, వృత్తి నైపుణ్యాల పెంచే దిశగా చదివించి పెద్ద పెద్ద ఉపాధి స్థాయిలలో నిల్పు తున్నారు. అయితే, నేటి మన విద్యా వ్యవస్థలో అర్థశాస్త్ర పరిజ్ఞానం అందించగలిగే అవకాశం ఎక్కువగా లేకపోవటం, ద్రవ్యం దాని స్వరూప స్వభావాలు, ఎలా సక్రమ మార్గాలలో ఖర్చుచేయాలి అనే విషయాన్ని విద్యార్థులు పొందలేకపోవటం వల్ల వారు అనేక పర్యవసానాలను ఎదుర్కొంటున్నారు.

(ఎ) మనం ఎంతమేరకు మన దగ్గరున్న ‘డబ్బు’ను సక్రమ మార్గంలో ఖర్చు చేయగల్గు తున్నాం?

(బి) కేవలం ‘ధనం’ ఎక్కువ మొత్తంలో సముపార్జన చేయటం వల్లనే ‘సంపద’ సృష్టి జరుగుతుందా!

(సి) నేటి ‘ధనికవర్గం’లోని వారు పుట్టుకతోనే, వారసత్వం వల్ల ధనికులుగా కొనసాగుతున్నారా?

(డి) ద్రవ్య నిర్వహణ ఎలా చేయాలి?

ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో వివిధ మార్గాలలో ధనార్జన చేసి కుటుంబ జీవనం, మనుగడ సాగిస్తున్నారు. మానవుల మనుగడ, భద్రత, అవసరాలు, సౌకర్యాలు, విలాసాల కోసం ఎంత మొత్తంలో ధనం అవసరం ఉంటుంది?

కొంతమంది జీవితం అంటేనే ‘డబ్బు’ను కూడ బెట్టడం, సంపదను సృష్టించటం అనే ఆలోచనతో అధికశ్రమకు లోనై, వివిధ మార్గాలలో శక్తికి మించి ద్రవ్యాన్ని సంపదిస్తున్నారు. మరికొందరు జీవిత కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని ‘పేదరికం’తో మ్రగ్గుతున్నారు.

అయితే, శ్రమజీవనం, సామాజిక జీవనానికీ మధ్య సౌకర్యవంతమైన జీవన పనిముట్ల కోసం పోరాటమే జీవిత గమ్యం కావాలి కానీ లక్ష్యం కారాదు.

నిరాడంబరమైన జీవనశైలితో, ఉన్నతమైన ఆలోచనలతో, చైతన్యం కలిగి ఉండి సక్రమ మార్గాలతో చట్టబద్ధమైన మార్గాలలో ద్రవ్య సముపార్జన చేయాలి.

అదేవిధంగా ఖర్చులపై నియంత్రణ అవసరం. ‘కుటుంబ బడ్జెట్‌’ను రూపకల్పన చేసుకొని రాబడి, వ్యయాలపై తగిన శ్రద్ధపెట్టి, ఆర్థికభద్రత కోసం ఆదాయంలో కనీసం 10శాతం ‘పొదుపు’గా భవిష్యత్‌ ‌వ్యయాల కోసం నిల్వ చేయాలి.

విలాసవంతమైన జీవన అవసరాలతో, పోటీ ప్రపంచంతో పరుగులు తీస్తూ ‘జీవిత లక్ష్యాల’ను మరచి, ‘డబ్బు’తోనే జీవితం అనే ‘భ్రమ’తో మానసిక ప్రశాంతతకు దూరంగా జీవించటంవల్ల కలిగే ప్రయోజనం శూన్యం.

ఆర్థిక అక్షరాస్యత ఎందుకు అవసరం?

 ఆర్థికాంశాలపై చేసే నిర్ణయాలకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించడంలో ‘ఆర్థిక అక్షరాస్యత’ సహాయకారిగా ఉంటుంది.

వివిధ రకాల ఆర్థిక స్థితిగతులను, రాబోయే కాలంతో జరుగబోయే ఆర్థిక పరిణమాలను అంచనా వేసేందుకు, ఆర్థిక అంశాలపట్ల అవగాహన మెరుగుపర్చటంలో ఆర్థిక అక్షరాస్యత తోడ్పాటును అందిస్తుంది. అంటే, కుటుంబ బడ్జెట్‌, ‌పొదుపు, పెట్టుబడులు, వ్యక్తిగత రుణ నిర్వాహణా సామర్థ్యం తదితర అనేక వ్యక్తిగత ఆర్థికాంశాలతోపాటు వ్యవస్థల స్థితిగతులు, దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను అర్థం చేసుకోగలుగుతారు.

తగిన సమాచారంతో కూడిన విశ్లేషణతో సరైన సమయంలో తగిన రీతిని ఆర్థికాంశాలతో నిర్ణయా లను తీసుకోగల్గి సమర్థతను ఆర్థిక అక్షరాస్యతవల్ల వ్యక్తులు పొందుతారు.

ఆర్థిక అక్షరాస్యతవల్ల ఆర్థికాంశాలలో సక్రమంగా ఎంపికలు చేయగలుగుతారు. లాభ నష్టాలను సక్రమంగా అంచనా వేయగలరు. ఊహించని జీవిత సమస్యలను సమర్థంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక ప్రణాళికల రూపకల్పన, వనరుల కేటాయింపు, ఎంపిక, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత ఏర్పాట్లు, రుణాల నిర్వహణ, వడ్డీరేట్లతో హెచ్చుతగ్గుల పర్యవసానాలను అంచనావేయగలిగే సామర్థ్యాలు ‘ఆర్థిక అక్షరాస్యత’ వల్ల సమకూరుతాయి. కనుక ‘ఆర్థిక అక్షరాస్యత’ కాదనలేనిది.

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram