‘ఇది నా సుందర స్వప్నం, ఇది నా ఆశల హర్మ్యం / ఇది నా జీవిత లక్ష్యం, మాతృదేశమిది నా సర్వస్వం’ అన్నారొకరు. ‘అజేయ స్వర్ణభారతం, మదీయ దివ్య నందనం / తరంతరం నిరంతరం ప్రచండ భవ్యకేతనం’ అని ఆలాపించారు మరొకరు. ఇవి వనితల, కవితల భావతరంగాలు. వందేమాతరం, జయ జయ భారత జననీ పావని, నమ హిందు మాతా, వేదధాత్రీ జ్ఞాననేత్రీ వందనమిదే జనయిత్రీ… ఇవన్నీ భారతమాతకు సమర్చన రూపాల్లో కొన్ని. జైజై భారత మాతా, జైజై భాగ్యోపేతా/ జైజై కీర్తి సంజాతా, జైజై విమల విఖ్యాతా అన్నవారున్నారు. దేశమే దేహం, ధర్మమే ప్రాణం / ప్రతీ పౌరుడూ ఒక రక్త్తకణం అంటూ ఉద్బోధించిన వారూ ఉన్నారు. ఈ అన్నీ దేశభక్తి ప్రపూరితాలు. ఇంకా అక్షరాల గవాక్షాలను తెరిచిచూస్తే – ‘భరత జాతి సత్త్వమ్మును పరీక్షించ బోకుము /అది సహనానికి ఏలిక, సమరానికి కాళిక’ దృశ్యమూ కానవస్తుంది. మన స్వాతంత్య్ర మహోద్యమ రంగాన ఎందరెందరో ధీరచరితలు. వారి త్యాగ చింతన, నిస్వార్థ ప్రవృత్తి, సమయ స్ఫూర్తి అనుపమానాలు. పలు దశాబ్దాలకు ముందే మహిళామణులు తమదైన తీరున దేశ స్వేచ్ఛా గీతికలు వినిపించారు. వారిలో కొంతమందికి సంబంధించి, ఇది అక్షరార్చన, వారి ధీరోదాత్తత గురించిన సంక్షిప్త సమర్పణ.


భీమాబాయి హోల్కర్‌ ‌పేరు వినే ఉంటారు. మధ్యప్రదేశ్‌ ‌ప్రాంతీయురాలు. రాణి అహల్యాబాయి కుటుంబీకురాలు. అరవై ఏళ్లకు పైగా జీవనకాలం. స్వేచ్ఛా పిపాసకు తల్లి కృష్ణాబాయి ప్రథమ స్ఫూర్తి. మాతృభూమి పరిరక్షణకు ఆనాడే నడుం కట్టి పోరాటబాట పట్టారు భీమాబాయి. తిరుగుబాటు ప్రకటించి ఆ మేర బృందాలకు నేతృత్వం వహించారు. భీమ అనేది దృఢత్వానికి మారు పేరని అందరి ఎదుటా నిరూపించారు. ఆంగ్ల పాలక దమననీతికి వ్యతిరేకంగా కత్తి చేతపట్టి సమర నాదం చేశారామె. తమ ఇండోర్‌ ‌ప్రాంతంపైన పాలకపక్ష కన్నుపడిందని గమనించగానే సత్వర చర్య చేపట్టారు. అలుపూ సొలుపూ లేని పోరుశక్తికి ఆమె ఉదాహరణ. తనకు పరిపూర్ణ స్ఫూర్తిదాయని మరెవరో కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి! ఝాన్సీకీ రాణి. తొలి పేరు మణికర్ణిక.

పోలికలు అనేకం

లక్ష్మీబాయి, భీమాబాయి జీవిత ఘట్టాల్లో పోలికలెన్నో కనిపిస్తాయి. లక్ష్మీబాయిది మహారాష్ట్ర. స్వస్థలం సతార ప్రాంతం. తల్లి భాగీరథి. జాతీయ, ఆధ్యాత్మిక భావనల మేళవింపు. అందరూ చిన్నప్పుడు లక్ష్మీబాయిని ‘మనూ’ అని పిలిచేవారు. తండ్రి సెన్యాధిపతి కాబట్టి, కుమార్తెకు కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి యుద్ధ విద్యలెన్నో నేర్పించారు. అటు తర్వాత ఆమెకు ఝాన్సీ పట్టణ నేతతో వివాహం అయినందునే, ఝాన్సీ అనే పేరు జత చేరింది. పుట్టిన బిడ్డ కొన్ని రోజులకే తిరిగి రాని లోకాలకు తరలివెళ్లడంతో, బంధువుల్లోని ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారు. అనంతరం మరికొన్ని రోజులకే ఆమెకు పతీవియోగం.

అప్పట్లో బ్రిటీషియుల శాసనాల ప్రకారం, రాజ్యాధిపతి మగసంతానం లేకుండా మరణిస్తే రాజ్యమూ పోయినట్లే! ‘ఇదేం నిబంధన? ఝాన్సీ ప్రాంతాన్ని మీకు నేనెందుకు అప్పగించాలి’ అన్నదే లక్ష్మీబాయి సూటిప్రశ్న. దీనికితోడు ఆంగ్లేయుల కుటిలనీతి, దమనకాండ, పాలనా తంత్రం ఆమెలో నిరసన జ్వాలలు రగిలించాయి. రణసీమలోకి దిగి శత్రుసేనను తరిమికొట్టారు. తదుపరి పరిణా మాలతో, తన సేన గ్వాలియర్‌కు చేరుకుంది. అక్కడే భీకరపోరు కొనసాగింది. వీరమరణం సంభ వించింది. అప్పుడు ఆమెకు మూడు పదుల వయసైనా లేదు. అందుకే ఝాన్సీ, గ్వాలియర్‌ – ‌రెండు ప్రదేశాల్లోనూ ఆ రాణి ప్రతిమలు ఏర్పాట య్యాయి. ఎంతో ధీశాలి, యుద్ధనీతి కోవిదురాలు కాబట్టే తదుపరి కాలంలో స్మారక చిహ్నాలనేకం నెలకొన్నాయి. తనది పరిపూర్ణ నారీతత్వం. క్రియా శీలతకు ప్రబల తార్కాణం. జయభారతికి ప్రియపుత్రిక. ‘ఒక చంకన బిడ్డ చూడు, ఒక వంకన ఖడ్గమాడు’ అనేలా సమరశీలత. రణమున రయమున వెళ్లే హయమున ఆమె విజృంభణ శూరత. లక్ష్మీబాయికి, భీమాబాయికి జీవన క్షేత్రంలో కొన్ని సంఘటనల రీత్యా పోలికలున్నాయి. ధీరగుణంలో ఇద్దరూ ఇద్దరే. వారికి వారే సాటి. లక్ష్మీబాయి కుమారుడూ – పుట్టిన కొన్ని రోజులకే అస్తమించాడు. ఆనందరావు అనే బాలుడిని దత్తత తీసుకున్నారు లక్ష్మీబాయి దంపతులు. అటు తర్వాత కొంత కాలానికి ఆమె భర్త కూడా కాలం చేశారు. రాజ్య నిర్వహణ బాధ్యత అంతా ఆమెదే అయింది. వారసుడి ఎంపిక… దత్తతతో కుదరదంటూ బ్రిటిష్‌ ‌పాలకులు అడ్డుపడ్డారు. తమ సామ్రాజ్యంలోకి ఝాన్సీ నిర్వాహక ప్రాంతాన్ని కలిపేసుకోవాలని ఎత్తుగడవేశారు. అందువల్లనే లక్ష్మీబాయి రణశంఖం పూరించాల్సి వచ్చింది. స్వాతంత్య్ర పరిరక్షణ కోసమే ఆమె ఉద్యమ పథాన్ని ఎంచుకుని వీరనారిగా చరిత్రపుటల్లో నిలిచింది.

దీక్షా దక్షతలకు ప్రతీకలు

ఆ ఇద్దరు నారీమణులదీ ఏకైక దీక్ష. స్వధర్మ పరిరక్షణ కోసమే వారి పట్టుదల. సాహసంతో పరాక్రమించడమే లక్ష్మీబాయి, భీమాబాయిలకు తెలుసు. ఎదురు నిలిచి పోరాడితేనే సంకెళ్లు తెగుతా యని సేనలను ఇద్దరూ ఉత్సాహపరిచారు.

మాతృదేశ సంరక్షణకే మానవుండు

త్యాగియై జీవితము వినియోగపరచు

అట్టి ధీరాత్ముడే పూజ్యుడతని జన్మ

సార్థకంబగు – నిస్వార్థ చరితుడతడు

ఇవే ఉద్బోధలు వీర నారులకూ వర్తిస్తాయి.

ధరణీతలి దద్దరిల్ల

భరతభూమి జృంభించును

యుద్ధ సిద్ధమై శత్రు

వ్యూహమ్ములు ఛేదించును

అనేలా ఇరువురూ కదనభేరిని మారు మోగించారు.

‘విజయీభవ విజయీభవ వీరభటా!’ అంటూ పురుషులు, మహిళలను సంగ్రామ రంగాన నిలిపారు. ప్రత్యేక దళాలుగా ఏర్పాటుచేసి, ప్రత్యర్థి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రూపొందించి, మడమ తిప్పని రీతిన పోరాటం కొనసాగించారు.

వీరభరిత విస్ఫారిత

విజయశౌర్య వాహినివై

ధర్మబలాన్వితుడవై

స్వాతంత్య్ర రక్షణాంకితుడవై

బరిలోకి దూకాలని స్త్రీ పురుషులిరువురినీ కర్తవ్యోన్ముఖులుగా చేశారు. ‘ఇది స్వతంత్ర సంగ్రామము, స్వరాజ్య మహాధ్వరము / ఆత్మరక్ష రణఫలమ్ము, అరిరక్షణ యజ్ఞఫలము’ అంటూనే స్వేచ్ఛా పిపాసను సేన నరనరాన రగిలించారు.

ధర్మచక్ర జయపాతక

ధరించి పురోగమించు

వీరసైన్య విక్రమాంక

విస్ఫారకులై రారండీ… అంటూ యువతను ఆహ్వానించారు. లక్ష్మీబాయి, భీమాబాయితోపాటు ఝల్కారీ బాయి గురించీ మనం ఈ స్వాతంత్య్ర ఉత్సవ సందర్భంలో స్మరించి తీరాలి. ఝాన్సీ లక్ష్మీబాయి సేనలోని వనిత విభాగానికి కీలక బాధ్యత వహించిందీమె. బుందేల్‌ ‌ఖండ్‌ ‌ప్రాంతీయులకు మరపురాని వీరనాయిక. ఝాన్సీ ప్రాంతంలోని ఒక చిన్న పల్లెటూరు తనది. వ్యవసాయ కుటుంబం. పిన్న వయసులోనే తల్లిని కోల్పోయింది. తండ్రి నుంచి ఆత్మరక్షణ, యుద్ధ విద్యలు అభ్యసించింది. తన సేన ఆయుధ విభాగంలోని వ్యక్తిని వివాహం చేసుకుంది. ఝాన్సీ లక్ష్మీబాయి సారథ్యంలోని ‘దుర్గావాహిని’కి నాయకురాలిగా అనంత శక్తి సామర్థ్యాలు కనబరచింది. ఒక సందర్భంలో ఆమె లక్ష్మీబాయి రూపంలా అనిపించేది. విజయమో వీర స్వర్గమో అనే నినాదంతో నేటికీ విఖ్యాతగా వనితా లోక జేజేలు అందుకుంటోంది ఝల్కారీబాయి.

 భారత ప్రథమ మహాసంగ్రామం అనగానే స్ఫురించే ఈ ధీరనారీమణులు ప్రత్యర్థి పక్షాల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నవారు. సకల వనితా ప్రపంచానికీ మార్గదర్శకులు.

లోకైక ప్రతిభా ధురంధరీ! నవలోక ప్రభాతత్వమౌ

నీ కర్తవ్య పరాయణత్వము జనానీకమ్ము  చేపట్టులే!

శ్రీకారమ్మయి భారతోర్వి భువన శ్రేయమ్ము సాధించులే!

సాకల్యముగ నీవు నిల్పిన జనస్వామ్యము వర్ధిల్లులే!

అంటూ రాజీ అన్నది తెలియని స్థిరసంకల్పుల వీరనారీత్రయానికి కైమోడ్పులర్పిద్దాం. ఈ ముగ్గురి సాహస ప్రవృత్తి, సంకల్ప శక్తి తరతరాలకీ ఆరాధ్య నీయాలు, ఆదర్శప్రాయాలు.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram