వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో తీవ్ర వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ధరలను అదుపు చేయలేదు. అభివృద్ధి జరగలేదు. సమస్యలను పరిష్కరించలేదు. పన్నుల భారాలు మోపింది. శాంతిభద్రతలు క్షీణించాయి. ఆయా అంశాలను విపక్షాలు ప్రశ్నించడాన్ని, విమర్శలను భరించలేకపోతోంది. వారిపై వ్యక్తిగత దాడులకు దిగుతూ చౌకబారుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పులు, ఆర్థిక అవకతవకలు, అన్యాయాల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేస్తున్న విమర్శలను తట్టుకోలేని మంత్రులు, వైసీపీ నాయకులు ఆమెను కుటుంబపరంగా, వ్యక్తిగతంగా విమర్శించారు.

ఇటీవల ప్రొద్దుటూరు, గుంటూరు, విజయ వాడ, రాజమండ్రి, విశాఖల్లో పర్యటించిన పురందేశ్వరి ప్రభుత్వ వైఫల్యాలను నిశితంగా వివరించారు. రూ. లక్షల కోట్లు అడ్డగోలుగా అప్పులు చేయడంలో నిబంధనలు తుంగలో తొక్కారని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి తూట్లు పొడిచారని, భవిష్యత్‌లో మద్యంపై వచ్చే ఆదాయాన్ని అడ్డం పెట్టుకుని కార్పొరేషన్‌ ‌ద్వారా రుణాలు పొందారని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను అమలు చేయలేకపోతున్నారని, కేంద్రం నిధులను కొల్లగొడుతున్నారని, కనీసం పంచాయతీలకు నిధులు చేరకుండా దారి మళ్ల్లిస్తున్నారని పురందేశ్వరి ఆధారాలు చూపుతూ ఎండగట్టారు. దీనిపై మంత్రులు రోజా, విడదల రజని, గుడివాడ అమర్‌నాధ్‌, ‌బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయ సాయిరెడ్డి… పురందేశ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. అధికారంలో ఉన్నది వైసీపీ. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది, అభివృద్ధి చేయాల్సింది, శాంతిభద్రతలు అదుపులో ఉంచా ల్సింది, పేదరికం తగ్గించాల్సింది, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాల్సింది, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సింది, వాటిని సక్రమంగా ఖర్చు పెట్టాల్సింది వైసీపీ ప్రభుత్వమే. కాని అదేదో పురందేశ్వరి బాధ్యత అయినట్లు, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నట్లు వైసీపీ ఎదురు ప్రశ్నవేస్తోంది. ఈ ధోరణిని బట్టి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో ఉందనే అనుమానం కలుగక మానదు. తాము ఈ ప్రశ్నలపై 24 గంటల్లో శ్వేత్రపత్రం విడుదల చేస్తామని తితిదే ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి ప్రకటించినా నిర్ణీత సమయంలో ఆ పని చేయలేకపోయారు. పాలనా వైఫల్యాలపై సమాధానం చెప్పలేకపోవడం అంటే తమకు పాలన చేతకావడం లేదని, ప్రజలను ఇబ్బందులు పెడుతూ తప్పు చేశామని ఒప్పుకున్నట్లే. ఈ నేపథ్యంలో బీజేపీ తీవ్రంగా స్పందించి, నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలను సంధించింది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ అంశాలను ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నామని, వీటికి సమాధానం చెప్పాలని సవాల్‌ ‌విసిరింది.

1). మద్య నిషేధం హామీ ఏమైందని బీజేపీ ప్రశ్నిస్తోంది. మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ, పేదల రక్తం దోచేస్తున్నారని, మహిళలకు ఏం సమా ధానం చెబుతారని ప్రశ్నించింది. మద్యాన్ని అయిదేళ్లలో దశలవారీగా నిషేధిస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని మరచిపోవడం అటుంచి భవిష్యత్‌లో రాబోయే ఆదాయాన్ని తనఖాగా పెట్టి ఇప్పటివరకు రూ.38 వేల కోట్లు అప్పులు తెచ్చింది. నాసిరకం మద్యం రెట్టింపు ధరలకు అమ్ముతూ పేదల ఆరోగ్యాన్ని హరిస్తూ, మహిళల పుస్తెలు తెంచుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.

2). రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను ఎందుకు పునర్నిర్మించడం లేదని బీజేపీ ప్రశ్నించింది. న్యూ డెవలెప్‌మెంట్‌ ‌బ్యాంకు రుణ సహాయంతో రెండుదశలలో చేపట్టిన రహదారుల నిర్మాణం, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారులు, మండల కేంద్రాల మధ్య అనుసంధాన రహదారుల రెండు వరుసలుగా విస్తరణ, మధ్యలో వంతెనల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 2021లో చేపట్టిన మొదటి దశ పనులు 20శాతం కూడా పూర్తికాలేదు. రెండో దశ కింద ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో 1267.56 కి.మీ. రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. రెండు దశల్లోనూ ప్రభుత్వం తన వాటాను సమకూర్చక పోవడం వల్లే ఈ పనులు జరగడం లేదన్నది వాస్తవమని విపక్షాలు కూడా చెబుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

3) తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధప్రదేశ్‌ ఎం‌దుకు వెనుకబడిందన్నది బీజేపీ ప్రశ్న. వ్యవసాయం, ఆక్వా, ఉద్యానరంగం ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయని, అయినా తలసరి ఆదాయం పెరగలేదని, అప్పులు మాత్రం పెరిగాయని పేర్కొంది. ఆయా రంగాలకు ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. గిట్టుబాటు ధరలకు ధాన్యాన్ని సేకరించడం లేదు. రైతుల నుంచి సేకరించిన బియ్యానికి సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో వడ్డీలు భరించాల్సివస్తోంది. వడ్డీల భారంతో రైతులు తక్కువ ధరకే మిల్లర్లకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. రాయితీపై యంత్రపరికరాలు ఇవ్వడం లేదు.

4). జలజీవన్‌ ‌మిషన్‌ను రాష్ట్రంలో ఎందుకు వినియోగించుకోలేదు? ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? దేశంలో ఈపథకాన్ని ఉపయోగించుకోని ఏకైక రాష్ట్రం ఆంధప్రదేశ్‌ ‌మాత్రమే. గ్రామీణంలో ఇంటింటికీ కుళాయి నీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం పనితీరు రాష్ట్రంలో సరిగా లేదని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌ ఇటీవల రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. 2021 తర్వాత కేంద్రం ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు పైసా కూడా ఉపయోగించుకోని ఏకైక రాష్ట్రం ఆంధప్రదేశ్‌ అని అన్నారు.

5). కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కేటా యించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోయారు? ఇళ్ల స్థలాల్లో వచ్చే కమీషన్‌ ‌కోసం 30 లక్షల ఇళ్ల స్థలాలను సేకరించారు. ఇళ్లు నిర్మిస్తే కమీషన్‌ ‌రాదు కాబట్టి ఆ పని చేయలేదా అని బీజేపీ ప్రశ్నించింది. పేదల ఇళ్ల స్థలాలకోసం సేకరించిన భూముల కొనుగోలు వ్యవహారం అవినీతిమయంగా మారింది. తక్కువ విలువైన భూములకు మూడు నుంచి నాలుగురెట్ల ధరలకు ప్రభుత్వంతో కొనుగోలు చేయించి భూయజమానులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు పంచు కున్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేశారని ఆంధప్రదేశ్‌ ‌బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు పలుమార్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి నేటివరకు కేటా యించిన 25 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ఉద్దేశ పూర్వకంగా పూర్తిచేయలేదు. గత ప్రభుత్వం చేపట్టి వివిధదశల్లో ఉన్న 3లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2020-21, 2022- 23లలో 1,80,715 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో పూర్తయినవి 167 మాత్రమే. 2020-21లో 1,816 ఇళ్లు మంజూరు కాగా ఒక్క ఇంటి నిర్మాణాన్నీ పూర్తి చేయలేదు. 2021-22లో గృహాలు మంజూరు చేయలేదు. 2022-2023లో 1,78,899 ఇళ్లు మంజూరు కాగా, 2,167 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. మొత్తంగా రాష్ట్రానికి మంజూరు చేసిన ఇళ్లలో 1.19 శాతం నిర్మాణాలే పూర్తైయ్యాయి.

6). బాలల అక్రమ రవాణా విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆందప్రదేశ్‌ 3‌వ స్థానంలో ఉంది. కొవిడ్‌ ‌ముందుతో పోలిస్తే ఈ అక్రమ రవాణాలు చాలా ఎక్కువయ్యాయి. 2016-20 మధ్య రాష్ట్రంలో బాలల అక్రమ రవాణాకు సంబంధించి 50 ఘటనలు చోటు చేసుకోగా, 2021-22లో ఆ సంఖ్య 210కు పెరిగింది. దేశంలో బాలల అక్రమ రవాణా అత్యధి కంగా జరుగుతున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో అత్యధికంగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేకదినోత్సవాన్ని పురస్కరించు కుని కైలాస్‌ ‌సత్యార్థి చిల్డ్రన్స్ ‌ఫౌండేషన్‌ (‌కేఎసీసీఎఫ్‌), ‌గేమ్స్ 24 ‌సెవన్‌ ‌సంస్థలు ‘‘భారత్‌లో బాలల అక్రమ రవాణా సమాచార విశ్లేషణ’’ పేరిట ఓ నివేదిక విడుదలచేశాయి. 21రాష్ట్రాల పరిధిలోని 262 జిల్లాల్లో కేసీసీఎప్‌ , ‌దాని భాగస్వామ్య సంస్థలు కలిసి బాలల అక్రమ రవాణా కేసుల సమా చారాన్ని విశ్లేషించి ఈ నివేదికలో పొందు పరిచాయి. దానిప్రకారం ఆంధప్రదేశ్‌లో కొవిడ్‌ ‌తర్వాత అక్రమ రవాణా బారినపడుతున్న బాలల సంఖ్య సగటున 68 శాతం పెరిగింది.

7). రాష్ట్రంలో పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫల మయ్యారు? పట్టణ, గ్రామీణ వైద్య, ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, జనరల్‌ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్య పరీక్షలు ఎందుకు అందుబాటులో లేవు? మందులు ఎందుకు ఇవ్వడంలేదు? వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు? బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చలేదని విద్యార్ధులు, నిపుణులు ఆరో పిస్తున్నారు. ప్యానల్‌లో ఉన్న 80 శాతం కార్పొరేట్‌ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందడంలేదు. వారికి గల బకాయిలే అందుకు కారణం. అధికారంలోకి వస్తే ఆసుపత్రుల్లో రూ.వెయ్యికి మించి అయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌ ‌రెడ్డి ఇప్పుడు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సదుపాయం లభించకపోవడంపై సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్‌ ‌చేస్తోంది.

వీటితో పాటు ‘ఉన్నత విద్యను ఎందుకు నిర్ల్యక్షం చేశారు? పీజీ విద్యార్థులకు ఎందుకు ఉపకార వేతనాలు దూరం చేశారు? డిగ్రీలో తెలుగును రద్దు చేసి, ఆంగ్లభాషకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు?’ అని బీజేపీ ప్రశ్నించింది. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీని నెరవేర్చడంలేదని, 2.50 లక్షల బాక్‌లాగ్‌ ‌పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని బీజేపీ నిరసించింది.

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ,

ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram