సామాజిక పరివర్తన అన్నది అంత సులభంగా చోటు చేసుకునేది కాదు. అందుకు ఎంతో ప్రేరణ, ఆదర్శ వ్యక్తులు, సంస్కర్తలు అవసరం. ముఖ్యంగా మహిళలకు, వారికి  సంబంధించిన విషయాలకు ఎంతో ప్రణాళికా రచన అవసరం అవుతుంది. జులై 21-23 వరకు మూడురోజులపాటు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన రాష్ట్ర సేవికా సమితి జాతీయ కార్యవర్గ, ప్రతినిధుల సమావేశాలలో మహిళల సంక్షేమానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.

‘‘స్వరాజ్‌, ‌స్వధర్మ, స్వదేశీ అన్న మూడు ధర్మాలను స్వీకరించి, సామాజిక పరివర్తన కోసం కార్యకర్తలను సిద్ధం చేద్దాం,’’ అని రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ సంచాలిక శాంతక్క పిలుపిచ్చారు. ఆమె రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత  ప్రతినిధుల సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశం సందర్భంగా జరిగిన అన్ని సెషన్లలోనూ ప్రముఖ సంచాలిక శాంతక్కా, ప్రముఖ్‌ ‌కార్యవాహిక సీతా గాయత్రీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో 38 ప్రాంతాల నుంచి మొత్తం 370 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా, ప్రస్తుత స్థితిగతులు, వ్యాప్తికి ప్రణాళికలు, పనిని మరింత బలోపేతం చేయడాన్ని గురించి విశ్లేషించి, చర్చించారు. వివిధ ప్రాంతాలలో మహిళలకు వ్యతిరేకంగా పెరుగుతున్న నేరాలు, హింస, క్రూర అత్యాచారాలు, వేధింపులకు సంబంధించిన ఘటనల గురించి తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశారు. ఈ సమస్యపై చర్చించి, కార్యాచరణ ప్రణాళికలను తయారు చేశారు.

మణిపూర్‌లో మహిళల పట్ల ఆందోళన

సమావేశం సందర్భంగా మణిపూర్‌ ‌మహిళల రక్షణపై ప్రకటనను కూడా విడుదల చేశారు. ‘‘ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మహిళలకు వ్యతిరేకంగా జరిగిన క్రూర దాడులు, అమానవీయ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ, బాధిత మహిళల పట్ల సానుభూతి’’ని రాష్ట్ర సేవికా సమితి వ్యక్తం చేసింది. ఈ క్రూరమైన ఘటనలకు బాధ్యులైన నేరగాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి, పోలీసులకు, దర్యాప్తు ఏజెన్సీలకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లోని సహాయక శిబిరాలలో మగ్గుతున్న సోదరీమణులకు రాష్ట్ర సేవికా సమితి సంఘీభావం తెలుపుతూ, ఈ కష్ట సమయంలో వారికి మద్దతును, తోడ్పాటును తమ వాలెంటీర్ల ద్వారా అందించడంలో క్రియాశీలకంగా పని చేస్తోంది. మణిపూర్‌ ‌వంటి సంఘ టనలు పునరావృతం కాకుండా నివారించేందుకు, సమాజంలోని అందరు సభ్యులు చైతన్యవంతమై ఆ దిశలో పని చేసేందుకు కట్టుబడి ఉండాలని సీతా గాయత్రి పిలుపు ఇచ్చారు.

చర్చలు-నివాళులు-పుస్తకాల విడుదల

సమావేశంలో పరివార ప్రబోధన్‌, ‌సమాన పౌర చట్టం పై వివరణాత్మక చర్చ కూడా జరిగింది. మూడు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలలో మరణించిన ప్రముఖ వ్యక్తులు, ప్రమాదాలు, విపత్తులలో ప్రాణాలు కోల్పోయిన దేశ పౌరులకు,  అంకితభావంతో సమాజం కోసం పనిచేసిన సోదర, సోదరీ మణులకు నివాళులు అర్పించారు. హిందవి స్వరాజ్య 350వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని స్మరించుకోవడం, ఆదర్శ వీరమాత జిజియాబాయి దార్శని కతలకు నివాళిగా ‘గీత్‌ ‌జిజువా’ పుస్తకాన్ని విడుదల చేశారు. దీనితో పాటుగా, 75 నీతి కథల (రామాయణ, మహాభారతం నుంచి తీసుకున్న కథలు సహా) సంకలనం ‘కథామృత్‌’‌ను కూడా విడుదల చేశారు.

‘ఆర్గనైజర్‌’ ‌నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram