– జమలాపురపు విఠల్‌రావు/జాగృతి డెస్క్

‌భారత పార్లమెంట్‌ ‌నిర్వహణకు ఒక నిమిషానికి అయ్యే ఖర్చు రూ. 2.5 లక్షలు. ఇది లోక్‌సభ మాజీ కార్యదర్శి పీడీటీ ఆచార్య మొన్న మార్చిలో చెప్పిన లెక్క. సమస్య ఏదని కాదు, ఎంతటిదని కాదు, భారత అత్యున్నత చట్టసభ కార్యకలాపాలను అడ్డుకుని ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. పార్లమెంట్‌ ‌సమావేశాలను స్తంభింపచేయడం ఏకైక లక్ష్యంగా కనిపిస్తున్నది. మణిపూర్‌ ‌కేంద్ర బిందువుగా ప్రస్తుతం జరుగుతున్న గలభా ఇందుకు కొనసాగింపు మాత్రమే. మణిపూర్‌ ‌గురించి ప్రధాని వివరణ ఇవ్వాలన్న నినాదంతో విపక్షాలన్నీ  తరబడి చర్చలను స్తంభింపచేస్తున్నాయి. దీనికి పరాకాష్ట కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మీద ఆవిశ్వాస తీర్మానం. పార్లమెంట్‌ ‌సమావేశాలు ప్రారంభకావడానికి ఒకటి రెండు రోజుల ముందు ఒక వార్త వస్తుంది. ఆ ఉదంతం పాతదే అయినా పార్లమెంట్‌ ‌సమావేశాల ప్రారంభానికి కొన్ని గంటల ముందే దేశం మీదకు వస్తుంది. అది పట్టుకుని విపక్షాలు ఉభయ సభలను భ్రష్టు పట్టిస్తాయి. ఇదే ఇటీవలి విపక్ష విన్యాసం. కానీ ఇదొక ఖరీదైన ప్రతిష్టంభన. అపార ప్రజాధనం చట్టసభల ఖర్చు పేరుతో లూటీ కావడం కూడా.విపక్షాలు ప్రదర్శిస్తున్న ధారావాహిక ప్రహసనం.

వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆగస్ట్ 1‌వ తేదీకి తొమ్మిది రోజులు. కానీ జరిగింది శూన్యం. లోక్‌సభ, రాజ్యసభ నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి. చట్టసభలలో ‘సున్నా’ కార్యకలాపాల మూల్యం ఎంతో దేశమే తేల్చాలి. ఈ విషయంలో ప్రతిపక్షాలది అదే వ్యూహం. అదే మౌఢ్యం కూడా. గతంలో జరిగిన రఫేల్‌, ‌హిండెన్‌బర్గ్ ‌నివేదిక, పెగాసస్‌ ‌వివాదం బాటలోనే విపక్షాలు వ్యవహరిస్తు న్నాయి. ఇప్పుడు మణిపూర్‌ ‌సంక్షోభం. ఇది భారత జాతి గమనిస్తున్న సంగతి మాత్రం విపక్షాలకు పట్టడం లేదు.

పార్లమెంటు సమావేశానికి ముందు ప్రతిపక్షాలు ఇదే చందంగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తుంటే మరీ ఉష్ణోగ్రతలను పెంచేస్తుంటాయి. ఈ విపరీత ధోరణి, ప్రజాస్వామిక వ్యవస్థకు ఏమాత్రం గౌరవప్రదం కాని వైఖరి 2018లో మొదలయిందని అనిపిస్తుంది. ప్రముఖ జాతీయ పత్రికలు ‘ది హిందూ’, ‘ది ఇండియన్‌ ఎక్‌‌ప్రెస్‌’‌లలో రఫేల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ధరవరల్లో అవినీతి జరిగిందని వార్త రావడం, వెంటనే ప్రతిపక్షం దాన్ని అందిపుచ్చుకుని, ఆయుధంగా చేసుకుని పార్లమెంటులో రచ్చ చేసిన విధానం గుర్తుండే ఉంటుంది. ఇలా ‘కొన్ని’ పత్రికలు ప్రచురించే వార్తలే తమను ఎన్నికల సముద్రాన్ని దాటించే నావలన్న భావన పార్టీలలో ఉన్నట్టుంది. ఇటువంటి వార్తలను ఆయుధాలుగా భావించి పార్లమెంటును స్తంభింపచేస్తూ, రోజుకు రూ.9 కోట్ల (ఐదేళ్ల కిందటి అంచనా) చొప్పున ప్రభుత్వ ఖజానాకు నష్టాన్ని కలిగించాయి.

 ఐదేళ్ల కింద ముఖ్యంగా ఫ్రెంచి మీడియా సంస్థ నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హాలెండ్‌తో జరిపిన ఇంటర్వ్యూలో భారతీయ పక్షమే రిలయెన్స్ ‌పేరు సూచించిందన్న మాటలు ఆధారంగా చేసుకుని ప్రతిపక్షాలు చెలరేగిపోయిన తీరు ప్రజాస్వామ్యానికే ఒక మచ్చ. ఆ సమయంలో, రక్షణ మంత్రిత్వ శాఖ ఇందులో రెండు ప్రభుత్వాలకూ సంబంధంలేదంటూ ఇచ్చిన వివరణలు, తరువాత రఫేల్‌ ‌తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్‌ ‌రిలయెన్స్‌ను ఎంపిక చేసుకో వాలన్న నిర్ణయం తమదేనని, ఇలాంటి ఒప్పందాలే పలు కంపెనీలతో కుదుర్చుకున్నామని స్పష్టం చేయడంతో విపక్షాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఆఖరికి ఈ ఒప్పందాన్ని సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది.

మళ్లీ అవే దృశ్యాలు. మణిపూర్‌ ‌పేరుతో  పునరా వృత్తమవుతున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు క్రైసిస్‌ ‌టూరిజంను ప్రోత్సహిస్తున్నాయి. అట్టుడికిపోతున్న ప్రాంతాలకు వెళ్లి తమకు అనుకూలంగా ఉన్న పక్షాన్ని రెచ్చగొట్టి, అక్కడ పరిస్థితిని జటిలం చేయడమే క్రైసిస్‌ ‌టూరిజం లక్ష్యం.

అంతేకాదు, ప్రతిపక్షాల శైలిని తరచి చూస్తే మనకు టూల్‌ ‌కిట్‌ ‌గ్యాంగ్‌ల మోడస్‌ ఆపరెండై కనిపిస్తుంది. ఆధారరహితంగా దినపత్రికలలో వచ్చిన వార్తలను పట్టుకుని పార్లమెంటును ఎలా నిలిపి వేయాలి, ప్రజా దృష్టిని ఎలా ఆకర్షించాలి, సోషల్‌ ‌మీడియాలో ప్రచారం ఏ స్థాయిలో చేయాలి, దోషులు లేదా బాధితులుగా ఎవరిని చూపించాలి అనే విషయాలను ముందుగా నిర్ణయించుకొని బరిలోకి దిగి, ఎవరికి సాధ్యమైన విధ్వంసాన్ని వారు సృష్టించడమే ఈ ప్రణాళికల క్ష్యం. సిఎఎ, వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, దానికి ప్రతిపక్షాల మద్దతుపై అంశాలకు అద్దం పట్టడం లేదా?

2018 నాటి పార్లమెంట్‌ ‌సమావేశాలనే 2021 వర్షాకాల సమావేశాలు గుర్తుకు తెస్తాయి. అప్పుడు పెగాసస్‌ ‌గూఢచర్యం పేరుతో పార్లమెంట్‌ను స్తంభింపచేశారు. జూలై 18, 2021న ఇందుకు సంబంధించిన నివేదిక ఒక్కసారిగా దేశం ముందుకు వచ్చింది. ఈ నివేదిక రావడానికీ, పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావే శాలు ప్రారంభం కావడానికీ ఉన్న వ్యవధి కేవలం ఒక్కరోజు. ఒక అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం భారతదేశంలోని 300 సెల్‌ఫోన్లలో రహస్యంగా వినడానికి ఏర్పాటు జరిగింది. ఇవన్నీ మానవ హక్కుల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, దేశమంతటా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకులకు సంబం ధించినవే. ఈ గూఢచర్యం కోసం ఏర్పాటు చేసిన ఆ వినికిడి ఏర్పాటు ఇజ్రా యెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌జీ గ్రూప్‌ ‌చేసిందన్నదే ఇందులో ఆరోపణ. ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఎన్‌ఎస్‌జీ గ్రూప్‌ ‌కూడా జూలై 19న ఖండించాయి. ఫర్‌బిడెన్‌ ‌స్టోరీస్‌ ‌పేరుతో వెలువడిన ఈ కథనంలో అన్నీ అబద్ధాలేనని, ఆ వివరాలన్నీ ఊహాజనితాలనే ఎన్‌ఎస్‌జీ వెల్లడించింది.

తరువాతి ప్రహసనాన్ని మార్చి 13, 2023న మొదలైన బడ్జెట్‌ ‌రెండో దశ సమావేశాలలో ప్రతి పక్షాలు ప్రదర్శించాయి. దీనికి కేంద్ర బిందువు హిండెన్‌బర్గ్ ‌రిసెర్చ్ ఎల్‌ఎల్‌సి ఇచ్చిన నివేదిక. ఇది అమెరికా కేంద్రంగా పనిచేసే పెట్టుబడుల పరిశోధన సంస్థ. జనవరి 24, 2023న హిండెన్‌బర్గ్ ‌నివేదిక వెలువడింది. తొలిదశ బడ్జెట్‌ ‌సమావేశాలు జనవరి 30 నుంచి మొదలై ఫిబ్రవరి 13న ముగిశాయి. దీని ఫలితం ఏమిటి? సాధించినదేమిటి? శూన్యం. హిండెన్‌బర్గ్ ‌నివేదిక ఉద్దేశం ఏమిటి? గుజరాత్‌కు చెందిన భారత పారిశ్రామిక దిగ్గజం, గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ ‌మార్కెట్‌లో తన షేర్లకు లేని విలువను ఆపాదించి కృత్రిమంగా ధరలు పెంచింది. ఇంకా నిధుల మళ్లింపు, విదేశాల నుంచి ధనప్రవాహం వంటి తీవ్ర ఆరోపణలే ఉన్నాయి. ఈ అంశం మీదే ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను వారాల తరబడి స్తంభింపచేశాయి. ఆఖరికి సుప్రీం కోర్టు ప్రమేయంతో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం ‌సాప్రే నాయకత్వంలో ఒక దర్యాప్తు బృందాన్ని నియ మించింది. ఈ కమిటీ ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చింది.

మణిపూర్‌ ‌తాజా సంక్షోభం, గడచిన మే నెలలో జరిగిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం నిస్పందేహంగా ఆందోళన కలిగిస్తాయి. కానీ ఆ సమస్య, ఆ మహిళల మీద సానుభూతి కంటే మోదీని బోనులో నిలపాలన్న ప్రతిపక్షాల ధ్యేయమే ఎక్కువగా కనిపిస్తున్నది. చర్చకు పట్టుపట్టడం, ప్రభుత్వం ఒప్పుకుంటే కుంటిసాకులు చెప్పడం కనిపిస్తున్నది. పార్లమెంట్‌లో నానా యాగీ చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేస్తున్న విపక్షాలు మరోసారి ‘విజయవంతమైన ఓటమి’ కోసం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాయి. మణిపూర్‌ ‌సంఘటన లపై మోదీ ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో ఇండియన్‌ ‌నేషనల్‌ ‌డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్ (ఐ.ఎన్‌.‌డి.ఐ.ఎ) అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.

లోక్‌సభలో 332 మంది సభ్యుల మద్దతున్న ఎన్‌డీఏకు దీనివల్ల వచ్చే ప్రమాదం ఏమీలేదు. కాకపోతే మణిపూర్‌ ‌సంఘటనపై చర్చకు సమ్మతించినా, ప్రధాని నరేంద్రమోదీ ఈ అల్లర్లపై తక్షణం ప్రకటన చేయాలని కోరుతూ పార్లమెంట్‌ను స్తంభింపజేసిన విపక్షాలు.. అవిశ్వాస తీర్మానం ద్వారా సాధించిందేమిటో తెలియదు. కాకపోతే పార్లమెంట్‌లో మణిపూర్‌పై అన్ని పక్షాలూ చర్చిస్తాయి. ఇక ప్రధానికి మణిపూర్‌ ‌సంఘటనలను వివరించడంతో పాటు, పశ్చిమ బెంగాల్‌లో మహిళ లను వివస్త్రలను చేసిన సంఘటనలు, రాజస్తాన్‌లో ఎస్సీ మహిళలపై అత్యాచార సంఘటనలన్నింటిపై మాట్లాడే అవకాశం లభిస్తుంది. మణిపూర్‌ ‌మహిళలపై దురాగతాన్నీ, ఈ రాష్ట్రాలలో మహిళలపై జరిగిన దురాగతాన్ని ఒకే విధంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు చెప్పినా, చర్చలో అవి రాకుండా ఉండవు. ఈ విధంగా గతంలో తప్పుల్నే మళ్లీ చేస్తున్న విపక్షాలు ఇప్పుడు మోదీ చేతికి అస్త్రాన్నిచ్చాయి. విపక్షాలు తెలివిగా రాజకీయ క్రీడను నడుపు తున్నామని భావించినా, బీజేపీ, నరేంద్రమోదీ వారికి చెక్‌ ‌పెట్టేస్తున్నారు.

ఇంక అవి రాజకీయ పాఠాలు నేర్చుకునే దెప్పుడు? దేశంలో ప్రస్తుతం ఎనిమిది జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలు, 2700 చిన్నా చితకా పార్టీలు ఉన్నాయి. పార్లమెంట్‌లో 15 పార్టీలకు ఒక్కొక్క సభ్యుడు మాత్రమే ఉండగా పది పార్టీలకు ఐదు కంటే తక్కువ మంది ఎంపీలు ఉన్నారు. వీటితో దృఢమైన, నిర్మాణాత్మక ప్రతిపక్షం ఏర్పాటు నేతిబీరలో నెయ్యి చందమే. ఈ నేపథ్యంలో మనదేశానికి ఈ పార్టీలు గుదిబండ కాక మరేమిటి?

తమ తప్పులపై మౌనం

పశ్చిమ బెంగాల్‌, ‌రాజస్తాన్‌, ‌బిహార్‌ ‌వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో నేరాల రేటు విపరీతంగా ఉన్న అంశాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌ఠాగూర్‌, ‌మరో మంత్రి స్మృతి ఇరానీలు పట్టి చూపుతూ చేస్తున్న ఆరోపణలకు విపక్షాల నుంచి సమాధానం లేదు. గత నాలుగేళ్ల కాలంలో రాజస్తాన్‌లో మహిళలపై జరిగిన 33వేల లైంగిక దాడులకు సంబంధించిన కేసులు నమోదైన అంశాన్ని, పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను దారుణంగా కొట్టి వివస్త్రలను చేసిన సంఘటనలను ఆయన పట్టిచూపుతున్నారు.అయినా ఈ ఘటనలను మణిపూర్‌ ‌ఘటనతో కలిపి చూడడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం విచారకరం. బిహార్‌లోని బెగుసరాయ్‌లో ఒక మైనర్‌ ‌బాలిక, మరో పురుషుడు అభ్యంతరకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిపై దారుణంగా దాడిచేసిన సంఘటనకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ ‌చేసి, మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని మంత్రి బయటపెట్టారు. విపక్షాలు ఇటువంటి వాటిపై నోరు మెదపవు. రాజస్తాన్‌లో పెరుగుతున్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర మంత్రిని తక్షణమే పదవి నుంచి తొలగించిన ఘనత కాంగ్రెస్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లాట్‌ది!

మణిపూర్‌పై ఏకాభిప్రాయం శూన్యం

గురివింద సామెతగా ఉన్న విపక్షాల్లో మణిపూర్‌ ‌సమస్యపై ఏ పంథా అనుసరించాలనే దానిపై ఏకాభిప్రాయం లేదు. టీఎంసీ, ఆర్జేడీ, ఆప్‌లు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతుండగా, సీనియర్‌ ‌మాజీ కాంగ్రెస్‌ ‌నేత కపిల్‌ ‌సిబల్‌ ఏకంగా ముఖ్యమంత్రి బీరేన్‌ ‌సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ ‌చేయడం విచిత్రం. ఇదిలా ఉంటే, విపక్షాల పాలనలో ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులను మణిపూర్‌లో పరిస్థితిని అంచనా వేసేందుకు పంపాలని ముందుగా భావించినా, రాజకీయ విభేదాల భయంతో జులై 29, 30 తేదీల్లో ఎంపీలను పంపాలని నిర్ణయించాయి. ఇందులో సుస్మితాదేవ్‌ (‌టీఎంసీ), వందనా చవాన్‌ (ఎన్‌సీపీ), మోహువామజీ (జేఎంఎం), ఎన్‌.‌కె. ప్రేమ్‌చంద్రన్‌ (ఆర్‌ఎస్‌పీ), ఎ.ఎ. రహీమ్‌ (‌సీపీఐఎం) ఉన్నారు. అయితే రాహుల్‌ ‌గాంధీ, కాంగ్రెస్‌ ఎం‌పీలు హిబి ఈడెన్‌, ‌డీన్‌ ‌కురియకోసె, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌కు చెందిన డెరెక్‌ ఓ‌బ్రియాన్‌ ‌నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం, వామపక్షాల ప్రతినిధులు, ఎంపీలు జాన్‌ ‌బ్రిట్టాస్‌, ‌వినయ్‌ ‌విశ్వం తదితరులు కూడా ఇంతకు ముందే మణిపూర్‌ను సందర్శించారు.

మంచిపై కూడా విమర్శలేనా?

విపక్షం కేవలం ప్రభుత్వాన్ని నిందించడానికే ఉందా? ప్రస్తుత భారతదేశంలో అయితే విపక్షాలు ఇందుకే ఉన్నాయి. ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద, అవి ఇచ్చిన మంచి ఫలితాల గురించి గతంలో విపక్షాలు సంయమనం పాటించేవి. హుందాగా వ్యాఖ్యానించేవి. ఇప్పుడు అంతటి ఔదార్యం లేదు. బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్‌ ‌ఖాతా యోజన చాలా మంచి పథకం. దీన్ని ప్రశంసించడం ఇష్టం లేకపోతే విపక్షాలు మౌనంగా ఉంటే సరిపోయేది. ఇవన్నీ ‘జీరో అకౌంట్లు’ అంటూ ఎన్‌డీఏ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించాయి. నిజానికి జన్‌ధన్‌ ‌ఖాతాలన్నీ జీరో బ్యాలెన్స్ ‌కలిగినవే. నోట్ల రద్దు కూడా ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న గొప్ప చర్య. దీనివల్ల అధిక మొత్తంలో నల్లధనం బ్యాంకు లకు చేరింది. తర్వాతి దశలో బ్యాంకులు డిజిటల్‌ ‌కరెన్సీలోకి అడుగుపెట్టడానికి ఇది మార్గం సుగమం చేసింది. దీనివల్ల నల్లధనాన్ని చాలావరకు అరికట్ట డానికి వెసులుబాటు కలిగింది. నల్లధనాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యమయ్యే పనికాదు. కానీ నియం త్రించవచ్చు. నోట్లరద్దు దీన్ని సాధ్యంచేసింది. కలుగుల్లో ఎలుకల్లా బయటపడిన ఎన్నో నకిలీ కంపెనీలు రద్దయ్యాయి. వీటిపై చాలా కేసులు రిజిస్టరయ్యాయి కూడా. దేశానికి, ఆర్థిక వ్యవస్థకు మంచి చేకూర్చిన ఈ చర్యకు విపక్షాలు మద్దతివ్వక పోయినా కనీసం మౌనంగా ఉన్నా సరిపోయేది. కానీ ఈ చర్యలకు వక్రభాష్యాలు చెప్పాయి. ఆఖరికి కరోనా సహాయక చర్యలలో మోదీ ప్రభుత్వాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించినా మన ప్రతిపక్షాల దృష్టిలో కరోనా కాలంలో మోదీ చేతులు ముడుచుకుని కూర్చున్నారనే. ప్రతి అంశం మీద కొంపలు ముంచేస్తున్నదన్న రీతిలో గగ్గోలు పెడుతూ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు యథాశక్తి కృషి చేసినా ఫలితం దక్కలేదు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం ఓటర్లతో పోలిస్తే నేటి ప్రజల్లో రాజకీయ చైతన్యం, ఔచిత్యాన్ని గ్రహించే సామర్థ్యం చాలా ఎక్కువన్న సంగతిని అవి విస్మరించడం వల్ల ఈ విషయంలో వాటి వ్యూహం బూమరాంగ్‌ అయింది.

సర్జికల్‌ ‌స్ట్రెక్స్ ‌విషయంలో కూడా విపక్షాల వ్యవహారశైలిలో మార్పులేదు. యురి సంఘటన తర్వాత భారత సైన్యం పీఓకేలోకి ప్రవేశించి ఉగ్రవాదుల శిక్షణశిబిరాలను ధ్వంసం చేసింది. సైన్యమే ఈ విషయాన్ని వివరించింది. ఈ విషయంలో సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రశంసించకపోగా అసలీ సర్జికల్‌ ‌స్ట్రెక్స్ ‌వెనుక నిజానిజాలను ప్రశ్నించిన విపక్షాల నైజాన్ని ఏమనాలి? అదేవిధంగా భారతీయ వైమానికదళం పుల్వామా దాడులు చేసిన తర్వాత, విదేశాంగ శాఖ కార్యదర్శి విలేకరులకు దీనిని వివరించారు. ఇక్కడ కూడా విపక్షాలు మన వైమానికదళం చేసిన సాహసకృత్యాన్ని ప్రశంసించడం మాట అట్లా ఉంచి తక్కువ చేసి చూపడానికి యథాశక్తి ప్రయత్నించాయి. ఆఖరికి భారత్‌.. ‘‌మిషన్‌ ‌శక్తి’ కింద నాలుగు దేశాలతో కూడిన స్పేస్‌ ‌క్లబ్‌లో చేరితే, ఇక్కడ కూడా విపక్షాలది ‘శకుని’ పాత్రే.

బాధ్యత మరిచి..

జాతీయ భద్రతను ఎట్టిపరిస్థితుల్లో రాజకీయం చేయరాదన్న సత్యాన్ని విపక్షాలు గుర్తించాలి. 2020-21లో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌, ‌హర్యానాలకు చెందిన రైతులు మాత్రమే ఆందోళనకు దిగారు. దేశంలో ఎక్కడా వ్యతిరేకత లేదు. కానీ విపక్షాలు తమ రాజకీయ లబ్ధి కోసం, పంజాబ్‌లో దళారీ వ్యవస్థకు మద్దతిచ్చాయనే చెప్పాలి. ప్రభుత్వం వెనక్కి తగ్గడం వల్ల నష్ట పోయింది రైతులు మాత్రమే. విపక్షాలు కాదు కదా! జాతిహితం, దేశ భద్రత అనేవి భావోద్వేగ అంశాలు. ఎన్నికల్లో రాజకీయాలు కాదు, ఈ భావోద్వేగాలే కీలక పాత్ర పోషిస్తాయి. ఇస్రో, డీఆర్‌డీఓ వంటి సంస్థల నైపుణ్యాలు, సామర్థ్యాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయంటే ఆ ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానికే ఎందుకు చెందాలన్నది, చాలా మంది వేసే ప్రశ్న. దీనికి సమాధానం చాలా సులభం. దేశంలోని ఏ సంస్థకైనా నైపుణ్యం, సామర్థ్యం ఉంటేనే సరిపోదు. పౌర ప్రభుత్వం తీసుకునే దృఢమైన రాజకీయ నిర్ణయం వాటి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేందుకు దోహదం చేస్తుంది. అటువంటి నిర్ణయ సామర్థ్యం ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండితీరాలి.

నాటి సమన్వయం ఇప్పుడేదీ?

1991లో సోవియట్‌ ‌యూనియన్‌ ‌విచ్ఛిన్నం తర్వాత.. 1996లో అత్యాధునిక యుద్ధ విమానాలుగా పేరుపడ్డ సుఖోయ్‌ల విషయం నాటి ప్రధాని పీవీ నరసింహారావుకు బాగా తెలుసు. అప్పటికి వీటి కొనుగోలుపై భారత్‌-‌రష్యాల మధ్య ఒప్పందం కుదరనప్పటికీ, నాటి రష్యా అధ్యక్షుడు ఎల్సిన్‌ అభ్యర్థన మేరకు కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత కుదిరే ఒప్పందంలో ఈ అడ్వాన్స్ ‌మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఏవిధమైన నింద పడకుండా ఉండేందుకు, ముందు జాగ్రత్త చర్యగా పీవీ సూచన మేరకు నాటి రక్షణ శాఖ మంత్రి ములాయంసింగ్‌ ‌యాదవ్‌, ‌విపక్ష నేతలైన అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి, జస్వంత్‌ ‌సింగ్‌లతో సమావేశమై సంగతి వివరించారు. దేశభద్రతకు సంబంధించిన అంశం కావడంతో వీరు తమ సమ్మతిని తెలియజేయడంతో ప్రభుత్వం ముందు కెళ్లింది. అంటే దేశహితం విషయంలో పీవీ నరసింహారావు, అటల్‌బిహారీ వాజ్‌పేయి, ములాయంసింగ్‌ ‌యాదవ్‌, ‌జస్వంత్‌ ‌సింగ్‌లు ఒకే మాటపై నిలబడ్డారు. మరి దేశభద్రత విషయంలో అంతటి విజ్ఞత చూపే విపక్ష నాయకులు ప్రస్తుతం ఉన్నారా? అన్నది ప్రశ్న. మరో సందర్భంలో జెనీవాలో జరిగిన కీలకమైన ఐక్యరాజ్య సమితి సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా ప్రధాని పీవీ నరసింహారావు కోరినప్పుడు విపక్ష నేత అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి అంగీకరించి, సమర్థవంతంగా మనదేశ వాణిని సదస్సులో వినిపించడం నాటి విజయగాధ. ఈ సమావేశంలో కశ్మీర్‌ ‌సమస్యలను అంతర్జాతీయం చేయాలని చూసిన పాక్‌ ‌కుయత్నాలు ఫలించలేదు.

ఏదో ఒక సమస్యను పట్టుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలకు ఇప్పుడు దొరికిన ఆయుధం ‘మణిపూర్‌ అల్లర్లు’. ఇవి ఇప్పటివి కావు మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రభుత్వ హయాంలో కూడా జరిగాయి. ఈ అల్లర్లకు మూడు ప్రధాన కారణాలు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అక్రమ చొరబాటుదార్లను గుర్తించి వారిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేయడం. రెండోది మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం. మయన్మార్‌ ‌నుంచి అక్రమంగా వలసవచ్చి మణిపూర్‌ ‌పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని గుర్తించి వెనక్కి తిరిగి పంపే పక్రియను బీరేన్‌ ‌సింగ్‌ ‌ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తెంగ్‌నౌపాల్‌, ‌ఛురాచంద్‌పూర్‌, ‌కామ్‌జోంగ్‌, ‌చందేల్‌ ‌జిల్లాలకు చెందిన 41 గ్రామాల్లో 2187 మంది అక్రమ వలసదార్లను ఇప్పటివరకు గుర్తించారు. ఇది మయన్మార్‌లోని డ్రగ్‌ ‌మాఫియాకు ఎంతమాత్రం ఇష్టంకాదు. మూడోది మణిపూర్‌లో తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలకు, నార్కో-ఎకానమీకి సంబంధం ఉండటం. ఇది మణిపూర్‌ ‌పరిణామాలను లోతుగా అధ్యయనం చేస్తున్న వారు చెబుతున్న విషయం. ఈ ఏడాది ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల నేపథ్యంలో గంజాయి సాగు గతంలో మాదిరి సాధ్యం కావడం లేదు. మణిపూర్‌ ‌ప్రభుత్వ లెక్కల ప్రకారం 2013-16 మధ్య కాలంలో 1889 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేయగా, 2022 మార్చి 20 నుంచి 2023 ఏప్రిల్‌ 20 ‌వరకు 4305.1 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేయడం అక్కడ గంజాయి సాగు ఎంత విస్తృతంగా ఉన్నదో అర్థమవుతుంది. ఇక్కడ జరుగుతున్న డ్రగ్స్ ఉత్పత్తిలో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉంది. ఉదాహరణకు మే 8న మణిపూర్‌కు చెందిన ప్రత్యేక పోలీసు విభాగం నార్కొటిక్స్ అం‌డ్‌ అఫైర్స్ ఆఫ్‌ ‌బోర్డర్‌ (ఎన్‌ఏబీ) వారు ఇంఫాల్‌కు చెందిన ఫుఖ్రి ప్రాంతంలో దాడులు జరిపి 77 బస్తాల గంజాయి విత్తనా లతో పాటు మయన్మార్‌ ‌కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీటిని స్వాధీనం చేసుకున్న ఇల్లు అంతర్జాతీయ డ్రగ్స్ ‌ముఠాకు చెందిన వ్యక్తిది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అల్లర్ల సృష్టికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈ మాఫియాకు ‘రిజర్వేషన్ల’ సమస్య అంది వచ్చింది.

2007లో యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌జస్టిస్‌ (‌డీఓజే) ‘ది చైనీస్‌ ‌కనెక్షన్‌: ‌క్రాస్‌-‌బోర్డర్‌ ‌డ్రగ్‌ ‌ట్రాఫికింగ్‌ ‌బిట్‌వీన్‌ ‌మయన్మార్‌ అం‌డ్‌ ‌చైనా’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈశాన్య భారత్‌, ‌మయన్మార్‌ ‌ప్రాంతంలో రెండేళ్లపాటు అధ్యయనం చేసి దీన్ని విడుదల చేసినట్టు పేర్కొంది. మత్తుమందుల అక్రమ రవాణాను నిరోధించేం దుకు మయన్మార్‌ ‌ప్రభుత్వానికి యూఎస్‌ అం‌దిస్తున్న సహాయాన్ని నిలిపివేయడంతో, ఇండో-మయన్మార్‌ ‌ప్రాంతంలో గంజాయి సాగు విపరీతంగా పెరిగిపోయింద న్నది నివేదిక సారాంశం. చైనా, మయన్మార్‌లలో డ్రగ్స్ ‌నిరోధానికి కఠిన చట్టాలున్నప్పటికీ మయన్మార్‌ ‌సరిహద్దుల్లో పనిచేస్తున్న అత్యంత శక్తిమంతమైన మత్తుమందుల రవాణా ముఠాల్లో అధికశాతం మంది చైనీయులేనని నివేదిక స్పష్టం చేసింది. దీన్ని అమెరికా తనకు అనుకూలంగా తయారు చేసిందని భావించినా, ఇప్పుడు గంజాయి సాగు ‘గోల్డెన్‌ ‌ట్రయాంగిల్‌’ ‌దేశాలకు సరిహద్దుల్లో ఉన్న మణిపూర్‌ ‌ప్రాంతానికి విస్తరించిందనేది తిరుగులేని సత్యం. ‘మర్చంట్స్ ఆఫ్‌ ‌మ్యాడ్‌నెస్‌: ‌ది మెథాఫిటమైన్‌ ఇన్‌ ‌ది గోల్డెన్‌ ‌ట్రయాంగిల్‌’ ‌పేరుతో స్వీడిష్‌ ‌జర్నలిస్ట్ ‌బెర్టిల్‌ ‌లింట్‌నర్‌, ‌థాయ్‌లాండ్‌కు చెందిన రచయిత మైఖేల్‌ ‌బ్లాక్‌లు రాసిన పుస్తకంలో ఆగ్నేయా సియా దేశాల్లో మత్తుమందుల ఉత్పత్తి వెనుక బలీయమైన శక్తులున్నాయని స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో, ప్రస్తుతం మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ చల్లారకపోవ డానికి ఇటువంటి శక్తులే కారణమని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ వాస్తవాలను పరిగణనలోనికి తీసుకో కుండా పార్లమెంట్‌ను స్తంభింప చేయడమే పనిగా పెట్టుకున్న విపక్షాల ధోరణికి ఏ పేరు పెట్టాలి? చర్చకు పట్టుపట్టి ప్రభుత్వం సిద్ధమైతే వెనక్కి తగ్గే వైఖరిని ఏమనాలి? పార్ల మెంటును పనిచేయకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తే ఏదో సాధించవచ్చునని ప్రతిపక్షాలు అనుకోవడమే నీచమైన ఎత్తుగడ. ఇది గతంలోను రుజువైంది. కానీ ఆ విన్యాసాన్నే నమ్ముకుంటున్న విపక్షాలకు ప్రజలు ముమ్మాటికీ బుద్ధి చెబుతారు.


విపక్షాల క్షుద్ర రాజనీతి

ఊసరవెల్లి రంగులు మార్చినట్టు, పేరు మార్చినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనుకోవడం పొరపాటు. ఈ తొమ్మిది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, ప్రజాసంక్షేమం, దిక్సూచిగా రానున్న సార్వత్రిక ఎన్నికలలో జనతా జనార్దనుడు తన ఆంతర్యం విప్పబోతున్నాడన్న మాట అక్షరసత్యం. ఇటీవల 26 ప్రతిపక్షాలు (ఐ.ఎన్‌.‌డి.ఐ.ఎ) అని కొత్త అవతారం ఎత్తడం దేశవాసులు గమనించకపోలేదు. దేశ ప్రగతి రథ చక్రాలకు అడుగడుగునా అడ్డు పడుతూ మొత్తం దేశాన్నే ‘కబ్జా’ చేసుకోవడం క్షమించరాని ద్రోహం.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణం 370ని రద్దు చేసి తద్వారా కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసింది ప్రభుత్వం. స్త్రీలకు సమాన హక్కు, ప్రతిపత్తి సంతరించడానికి ‘కామన్‌ ‌కోడ్‌’ ‌తెచ్చేందుకు యత్నిస్తోంది. తాడిత, పీడిత, జనాభా సంక్షేమం కోసం పలు పథకాలను చేపట్టింది. సామాజిక, ఆర్థిక, సంస్కరణలు బహుళ ప్రయోజనం సాధించిన తీరు, తెన్ను గమనిస్తున్న విదేశాలూ భారత్‌ను ఒక ‘విశ్వగురువు’గా ఆరాధిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం అదే పనిగా దుమ్మెత్తి పోస్తున్నాయి. భవిష్యత్తులో తమ అస్థిత్వానికి చోటుండదు అన్న భయంతో ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాయి. పీకల దాకా అవినీతిలో కూరుకుపోయిన ప్రతిపక్షాలు నీతులు వల్లించడం, దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదేనని సగటు భారతీయుడికి అర్థం అయింది. ప్రధానమంత్రిని లక్ష్యంగా పెట్టుకుని ‘మోదీ హఠావ్‌’ అం‌టూ ఎంతకాలం హఠయోగం చేసినా, రోగం ముదురుతుంది తప్ప లాభం ఒరగదు.

అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మెతుకును పట్టి చూస్తే చాలు. దేశభక్తులు ఎవరో, దేశద్రోహులు ఎవరో దేశానికి బాగా తెలుసు. ఎర్రకోటపైన మువ్వన్నెల జెండా రెపరెపలాడక ముందే, పదవుల కోసం కాంగ్రెసు నేతలు మాతృదేశాన్ని విభజించడానికి సహకరించిన తీరు, జాతికి తలవంపులు తెచ్చిన తెన్ను మరుగున పడలేదు. బ్రిటిషు ప్రభువులు రగిల్చిన మత చిచ్చు రావణకాష్ఠంలా రగులుతూనే ఉన్నది. ‘నన్ను రెండుగా నరికి, నా దేశాన్ని రెండు ముక్కలుగా చేయండి’ – అన్న బాపూజీ ఆక్రందన ఇప్పటికీ చెవులలో రింగుమంటున్నది. ఏడు దశాబ్దాలు, కేవలం పదవీ వ్యామోహంతో నెహ్రూ – గాంధీ వారసత్వం దేశాన్ని అధోగతి పాలుచేసింది. ‘ఇందిరా – ఇండియా’ అన్న నినాదం నేడు విపక్షాల విషవృక్షం నీడలో విడివిడిగా పొడి పొడిగా మారిపోయింది. ‘మెజారిటీ’.. ‘మైనారిటీ’ ముందు గజగజలాడడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనిపించదు ఒక్క భారత్‌లో తప్ప. పక్కనే బల్లెంలా తయారైన పాకిస్తాన్‌లో మైనారిటీ హిందూ జనాభా తుడుచుకుపోయి, ధార్మిక, సాంస్కృతిక, చిహ్నాలయిన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు నేలకూలాయి.

ప్రస్తుతం న్యాయస్థానం పరిశీలనలో ఉన్న ‘జ్ఞాన్‌వాపి’ ఉదాహరణ ఒకటి చాలు దేశం ఎటుపోతున్నదో తెలుసుకోవడానికి. కాశికాపురి చారిత్రకంగా, పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం. సనాతన హిందూ ధర్మానికి సజీవ సంకేతం. ‘కాశీ’ అన్న పదానికి ప్రకాశవంతం అయిన ప్రదేశం అన్న అర్థం ఉన్నది. ఆ దేశమేలిన రాజులు, చరిత్ర సృష్టించారు. ఆచార్యులు విద్యాపీఠం నెలకొలిపారు. కాశీ అన్నపూర్ణాదేవిని నిరసించి వ్యాసుడు బహిష్కరణకు గురి అయ్యాడు. పవిత్రమైన గంగాజలంలో మునిగితే పాపాలు తొలిగిపోతాయని, ఆ పుణ్యభూమిలో మరణిస్తే పునర్జన్మ ఉండదని జన విశ్వాసం.

అలాంటి ప్రసిద్ధమైన క్షేత్రం, తీర్థం.. కాంగ్రెసు ప్రభుత్వపు వైఖరితో ఏ గతికి దిగజారిందో తలచుకుంటే నెత్తురు ఉడికిపోతుంది. ఓటుబ్యాంకు రాజకీయం కారణంగా జ్ఞాన్‌వాపి దరిదాపులకు వెళ్లలేని పరిస్థితిని కల్పించింది. గుడి చుట్టూ సైన్యాన్ని కాపలా పెట్టించింది. విశ్వేశ్వరుడి దర్శన భాగ్యం కోసం దేశ విదేశాల నుంచి వస్తున్న ఆస్థిక వర్ణానికి అందని ద్రాక్షపండుగా తయారయింది. కాశీకి పోతే కాటికి పోయినట్లేనన్న సామెతను అక్షరాలా అమలు చేసింది కాంగ్రెసు ప్రభుత్వం. గతంలో కాశీ మజిలీలలో కథా కాలక్షేపం చేస్తూ భక్తులు కష్టనష్టాలకు ఓర్చి కాశీయాత్రను జీవితంలో ఒక్కసారైనా పూర్తి చేసేవారు. రవాణా సౌకర్యాలు, ప్రయాణమార్గాలు, ఎన్ని వచ్చినా మొన్నటి దాకా కనీసం రైలులో శీఘ్ర గమనానికి అవకాశం లేకపోయింది.

భారతదేశానికి తలమానికమైన అయోధ్య, కాశీ, మధుర పుణ్యక్షేత్రాలు తురుష్కుల దాడికి గురి అయ్యాయి. వాటి పునఃవైభవం ఉట్టి పడేలా తీర్చి దిద్దాలన్న సంకల్పంతో బీజేపీ ముందడుగు వేసింది. రామజన్మ భూమిలో బాబరు కట్టించిన మసీదును కూలగొట్టినందుకు ఆనాటి ప్రధాన మంత్రి పీవీకి రాజకీయ వనవాసం తప్పలేదు. రాజ్యాంగబద్ధంగా హిందువులు రామమందిరం కట్టుకోవడానికి దశాబ్దాల కాలం పట్టింది. మోదీ ఆధ్వర్యంలో కాశీపురి మళ్లీ వెలుగులోకి రావడం ప్రతిపక్షాలకు కన్నెర్రగా ఉన్నది. వారణాసి నియోజకవర్గం నుంచి ఆయన అత్యధిక మెజారిటీతో ఎన్నిక కావడం వారికి మరింత బాధాకరంగా పరిణమించింది. మోదీని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదల తప్ప దేశం పట్ల, సార్వభౌమత్వం పట్ల, వికాసం పట్ల ఏ మాత్రం దృష్టి సారించలేకపోతున్నాయి విపక్షాలు. కాంగ్రెసు నిజస్వరూపం ఏమిటో ప్రజలకు బాగా అర్థమయింది. ఆత్మవిమర్శకు బదులుగా ఆత్మవంచనకు ‘ఒకనాటి’ జాతీయ పార్టీ పాలుపడడం శోచనీయం. నాయకత్వం కొరవడి కాంగ్రెసు నావ నడిసంద్రంలో భంగపడకుండా, అంతర్గత సంస్కరణలకు, కార్యకర్తలలో ఆత్మవిశ్వాసం పెంచుకోవలసిన సమయం ఆసన్నం అయింది.

ఆర్థిక నేరాలలో, అవినీతి చట్టం కింద నలిగిపోతున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెసుతో జతకట్టడం అంటే దొంగలు దొంగలు దేశాన్ని పంచుకోవడమేనన్న అభిప్రాయం రాను రాను బలం పుంజుకుంటున్నది. నిష్కల్మష రాజకీయానికి, ఆదర్శ ప్రజాస్వామ్య పరిపాలనకు శ్రీకారం చుట్టిన మోదీని ఎలాగైనా ఓడించాలనుకోవడం వృథా ప్రయాస అన్న సత్యాన్ని విపక్షాలు ఎంత త్వరగా తెలుసుకుంటే అంతమంచిది. కనీసం తమ అస్థిత్వం ప్రమాదానికి గురికాకుండా తల దాచుకునే అవకాశం ఉన్నది. బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలన్న దుష్టసంకల్పంలో ఉన్న విపక్షాలు కర్ణాటకలో గెలిచినంత మాత్రాన 2024లో దేశమంతా తమదే రాజ్యం అనుకోవడం దురాశ. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా, సత్యానిదే అంతిమ విజయం. ప్రతిపక్షాలను కూడగట్టుకుని అధికారం చేజిక్కించుకోవడానికి కాంగ్రెసు పన్నిన పన్నాగంలో భాగమే పార్లమెంటులో ‘అల్లరు’. మానస సరోవరంలో విహరిస్తున్న రాజకీయ రాజహంసలు పాలు, నీరు వేరు చేసే సహజ గుణా నికి భిన్నంగా ప్రవర్తిస్తే పరాభవం తప్పదు.

– నిరామయ

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram