– కాశింశెట్టి సత్యనారాయణ

అయోధ్య సంస్థానం నుంచి వచ్చిన ఓ ఉర్దూ కవి ‘యాదోంకి బరాత్‌’ (‌జ్ఞాపకాల ఊరేగింపు) అనే పుస్తకం రాశాడు. దానిలో హైదరాబాద్‌, ‌నవాబు మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌కొలువులో తన అనుభవాలను వివరించాడు. మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌బహద్దూర్‌ 7‌వ నవాబు. అతడు బహు భాషావేత్త, సాహిత్యాభిమాని, కవి. కానీ, బూతులు మొదలు పెడితే అధికారులు తట్టుకోలేకపోయేవారు. 

స్వాతంత్య్రం వచ్చాక, సంస్థానాలు రద్దయిన కాలంలో సాహిత్యాభిమాని మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌తనకేమైనా సాయం చేస్తాడనే ఆశతో ఆ ఉర్దూ కవి జోష్‌ ‌హైదరాబాదుకు వచ్చాడు (ఈయన తరువాత పాకిస్తాన్‌లో మరణించాడు). నిజాం రాజు దర్శనం లభించడానికి ఎన్నో రోజులు పట్టింది. అయినా ఓపిగ్గా ఎదురుచూశాడు. ఎందరెందరి ద్వారానో నవాబు దర్శనం కోసం ప్రయత్నించాడు. చివరకు దొరికింది. కొన్నాళ్ల తరువాత ఉద్యోగం కూడా దొరికింది. ఇంతలో జోష్‌ ‌భార్య పిల్లలతో హైదరాబాద్‌ ‌వచ్చి, భర్తను కలిసి ఏడవటం మొదలు పెట్టింది. ‘‘ఎందుకు ఏడుస్తున్నావు? సంగతి చెప్పు’’ అన్నాడు కవి తన భార్యతో.

‘‘చెప్పడానికేముంది! మీ పిల్లల్ని మీరు తీసుకోండి, నేను నా ఉంగరంలో ఉన్న వజ్రం మింగి చచ్చిపోతాను’’ అంది భార్య. ‘‘ప్రాణం వదలడం దేనికి?’’ అడిగాడు జోష్‌. ‘‘‌మరో దాన్ని నిఖా (వివాహం) చేసుకుంటున్నారట కదా? టెలిగ్రాం వచ్చింది’’ అని టెలిగ్రాం చూపించింది. ‘‘ఓర్వలేని వాడెవ్వడో దొంగ టెలిగ్రాం ఇచ్చాడు’’ అన్నాడు జోష్‌. ఆ ‌రోజుల్లో హైదరాబాద్‌లో బహు భార్యాత్వం ఎక్కువగానే ఉండేది. అయినా ‘‘పిల్లల మీద ఒట్టు. ద్వితీయ వివాహం అబద్ధం’’ అన్నాడు. అప్పటికి కవి గారి భార్యకు నమ్మకం కలిగింది.

మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌బహదూర్‌ అం‌దరినీ సమానంగానే దూషించేవాడు. అందరిపట్ల ఏకవచనమే ప్రయోగించేవాడు. తన గురువైన హజ్రత్‌ ‌జలీల్‌ను కూడా ‘నువ్వు’ అనే సంబోధించేవాడు. గురువు కూడా నోరు మూసుకుని పడి ఉండవలసిందే. రాజుగారు రాసిన పద్యం పత్రికలో అచ్చయ్యేది. కిందనే గురువుగారి ప్రశంస కూడా అచ్చయ్యేది. అచ్చు వేయకపోతే ఆ పత్రిక ఇక వెలువడదు. ప్రశంసించకుంటే గురువు గారు కనపడరు. ఇది ఆ రాజు నైజం. ఎప్పుడూ జోగుతూ ఉండేవాడు. వీళ్ల అయ్య తాగి, తాగి 40 ఏళ్లకే అల్లాను చేరాడు.

ఓ రోజు జోష్‌ ‌నిజాం వద్దకు వెళ్లి తనకు ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘నీకు ఎంతమంది భార్యలు?’’ అని అడిగాడు నిజాం. ‘‘ఒక్కతేనండీ మహాప్రభో’’ అన్నాడు కవి. ‘‘మీది అవధ్‌ ‌సంస్థానం కదా? అక్కడ మగవారందరికీ ముగ్గురు, నలుగురు భార్యలుంటారే!’’ అన్నాడు నిజాం. ‘‘ఉంటారు, కాని నాకు నా భార్య అంటే చాలా ప్రేమ, పైగా ఆమె చాలాకాలంగా అనారోగ్యంగా ఉంది. మరోదాన్ని చేసుకుంటే ఈమె చికిత్స, ఆమె విచికిత్స మధ్య నేను నలిగిపోతాను’’ అన్నాడు కవి. ‘‘మీ ఆవిడకి జబ్బు ఎంతకాలం నుండి?’’ ‘‘అయిదేండ్ల నుంచి. చస్తున్నాను.’’ ‘‘ఎవరు చికిత్స చేశారు?’’ ‘‘చాలా మంది కాని ఉపయోగం లేదు’’ అన్నాడు కవి.

ఒక అయిదు రూపాయలు పనివానికిచ్చి వనమూలికలు తెప్పించి మందు తయారుచేయించి కవికి ఇచ్చాడు నిజాం. ‘‘నాకు తెల్సినంత వైద్యం ఈ డాక్టర్లకు తెలియదు. ఈ మందు ఉదయం, సాయంత్రం నీ భార్యకు ఇవ్వు. మృగశిర కార్తె ప్రవేశించగానే వచ్చి ఎట్లా ఉందో చెప్పు’’ అని పురమాయించాడు నిజాం. పదిహేను రోజుల్లో మృగశిర రానే వచ్చింది. కవి వెళ్లి తన భార్య ఆరోగ్యం పూర్తిగా బాగైందని చెప్పాడు. నిజానికి నిజాం ఇచ్చిన మందు పని చేయలేదు. ఆరోగ్యం బాగైందని తెలియగానే నవాబు గారి ముఖంలో ఆనందం తాండవించింది. హైదరాబాద్‌ ‌నగరంలోని డాక్టర్లను, భారతీయ వైద్యులను వెంటనే హాజరుపరచమని ఆదేశించారు. అంతా క్షణాల్లో కింగ్‌ ‌కోఠికి వచ్చి హాజరయ్యారు. ‘ముసలి నక్క’, ‘నిజాం సాలేగాడు’ ఏదో ఉపద్రవం తెచ్చాడని అందరికీ తెలుసు.

నిజాం తనకు కుడి వైపు వైద్యుల్ని, ఎడమవైపు భారతీయ డాక్టర్లను నిలబడమని ఆజ్ఞాపించాడు. అంతా చేతులు కట్టుకుని రెండువైపులా నిలబడ్డారు. మధ్యలో కొత్వాల్‌ (‌పోలీస్‌ ‌కమిషనర్‌) ‌వెంకట రామిరెడ్డిని నిలుచోమన్నాడు. బూతు పురాణం మొదలు పెట్టాడు నిజాం. రాసుకున్న అత్తరు వెగటు, చెమట కంపుతో కలిసి ఓ దరిద్రపు వాసన. పాన్‌లో ఏం కలిపాడో కానీ, ఇంకా భయంకరమైన కంపు. దానికి తోడు బూతులు. ఈ దరిద్రం వదిలించినందుకు పటేల్‌కి రుణపడి ఉంటారు హైదరాబాదీలు.

ఆ ఉర్దూ కవి జోష్‌ ‌తన భార్య చికిత్స కోసం ఇరవై వేలు ఖర్చు చేశాడు. నయం కాలేదు. నేను స్వయంగా రెండు మందులిస్తే పదిహేను రోజుల్లో బాగైంది. ఓరి నా బామ్మర్ది యెదవల్లారా (ఇది చాలా ఇష్టమైన తిట్టు)! మీకు వైద్యం తెలుసా? తెలుసా అంట? తెలుసు అన్నారంటే మిమ్మల్ని నగ్నంగా పడుకోబెట్టి మీ మల ద్వారాల గుండా రైలు నడిపిస్తాను. ఆ రైల్లో కూచునీ మన్మాడ్‌ ‌జంక్షన్‌ ‌దాకా వెళ్లిపోతాను తెలిసిందా?’’ అని బండబూతులు తిట్టాడు. బూతులు తిట్టడంలో నిజాంను ఎవరూ మించలేరు. రాజుగారి నోటి నుండి బండబూతులు విని వైద్యుల ఒళ్లు జలదరించింది. కొత్వాల్‌కైతే ఆ బూతులు గుర్తుకొస్తే ఆ పూటకి అన్నం సహించేది కాదట. ఎందరికో ప్రాణదానం చేసి బ్రతికించిన వైద్యులు మెలివేసిన మీసాలు వంగిపోయాయి. కాకులు డాక్టర్ల తల మీద కావు కావుమంటూ అరవసాగాయి. కనురెప్పల క్రింద ఎర్రమూతి కోతులు గెంతసాగాయి. ఇదంతా చూస్తూ ఉంటే నిశ్శబ్దంగా ఉన్న చెరువులో కొండమీద నుంచి బండపడి సంచలనం కలిగినట్లనిపించింది. ఇంత పేరు పడ్డ డాక్టర్లు కూడా నిజాం ముందు నోరు తెరవడానికి వీలులేదు. అందుకే ప్రభువుల కొలువు నరకప్రాయము అన్నారు కవులు. నిజాం నవాబు బండబూతులు వినని, తినని అధికారి ఆ రోజుల్లో లేడనే చెప్పాలి. బూతుల పంచాంగ పఠనం అతనికి దినచర్య. కానీ ఎంతటివారి ముందైనా జంకేవారు కాదు సురవరం ప్రతాపరెడ్డి. అటు ఆంధ్ర మహాసభలో, ఇటు ఆంధ్ర సారస్వత పరిషత్తులో ప్రముఖపాత్ర వహిస్తూ పత్రిక నడిపేవారు. చాలా పట్టుదల గల మనిషి. ‘‘నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము’’ అని ఎవరో రాశారట. అది ప్రతాపరెడ్డికి బాధ కలిగించింది. ఆ కవ్వింపు కారణంగా ‘‘గోలకొండ కవుల సంచిక’’ను 1934లో ప్రకటించారు. ఈ కవితా విలాస పుష్పం అమరచింత – ఆత్మకూరు సంస్థాన ప్రభ్విణి శ్రీశ్రీశ్రీ సవైరాణి భాగ్యలక్ష్మమ్మ బహద్దూరు వారికి అంకితం చేశారు. ఇందులో 354 మంది తెలంగాణ కవుల కవితలున్నాయి. ‘‘భాగ్య సంపూతః హైద్రాబాదు మాతః’’ అనే శీర్షికతో రాసిన కన్నెకంటి సత్యనారాయణమూర్తి కవిత అద్భుతంగా ఉంది. పురాణం పుల్లయ్య రాష్ట్రాధిక్యత అనే కవితలో నిజాం రాష్ట్రాంధ్ర కవులను గురించి చెబుతూ

‘‘ఇట్టి పండిత సత్తములెందరోని

 జాము రాష్ట్రంబు నందు నెసంగుచుండ

 కవులు లేరన్న యతని వాగ్గరిమ నెంచ

 అంధుడు జగంబులేదని యనుటగాదె’’ అన్నాడు

విద్వాంసుల పట్టికలో వారి వివరాలు ఉన్నాయి… అగస్త్యుడు (నలకీర్తి కౌమదీకర్త) వరంగల్లువాడు గౌరవ మంత్రి (లక్ష్మణ దీపికాకర్త) రాచకొండవాడు, సర్వజ్ఞ సింగ భూపాలుడు (రసార్ణ వసుధాకర్త) కూడా రాచకొండ వాడే. సోమనాథ కవి (వేములవాడ) రతి రహస్యం రాసిన హరి భట్టుది ఖమ్మం మెట్టు. రావిపాటి త్రిపురాంతకుడు (త్రిపురాంత కోదాహరణము) వరంగల్లు వాసి. శతావధానులు శేషాద్రి రమణ కవులు ఈ సంచికను గురించి రాస్తూ ‘‘గోలకొండ కవుల కుసుమముల్‌ ‌సమకూర్చి దండగ్రుచ్చె మా ప్రతాపరెడ్డి’’ అన్నారు. ‘‘భారత కంఠమున గూర్చు భాగ్యరేఖ అలవడె ప్రతాపరెడ్డి కత్యనఘమతికి’’ అన్నారు.

ఎవరో కవ్వించగా చక్కని కవితా సంపుటి వెలువడింది, ఆనాడు. నిజానికి తెలంగాణ అన్నా ఇక్కడ కవులన్నా, విద్యాంసులన్నా నాటి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతంలో నివసించే పెద్దలకు చాలా అభిమానం ఉండేది. విశ్వనాథ సత్యనారా యణ, మల్లంపల్లి సోమశేఖరశర్మ, కట్టమంచి రామలింగారెడ్డి తరచు హైదరాబాద్‌ ‌వచ్చి ఇక్కడ విద్వాంసులను కలుసుకునేవారు.

ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో 1925 ‘గోల కొండ పత్రిక’ అవతరించింది. అప్పుడది ద్వైవార పత్రిక! వారి సంపాదకీయాలు అద్భుతంగా ఉండేవి. నిజాం ప్రభుత్వానికి ఆ పత్రిక గుండెలపై కుంపటి. 1947 నుండి గోలకొండ దిన పత్రికగా రూపాంతరం చెందింది.

‘‘గోలకొండ దినపత్రిక తెలంగాణా ప్రజలను మేలుకొలిపిన మహా సంస్థ’’ అన్నారు దేవులపల్లి రామానుజరావు. పోలీసు చర్య జరిగేవరకు ప్రతాపరెడ్డి సంపాదకులు. ఆ తర్వాత నూకల సర్వోత్తమరెడ్డి మేనేజింగ్‌ ఎడిటర్‌గా బాధ్యత స్వీకరించారు. అప్పటి నుండి దేవులపల్లి రామానుజారావు సంపదకీయాలు రాస్తూ ఉండేవారు. ఆ సంపాదకీయాలు వాడిగా వేడిగా ఉండేవి. అది పత్రిక మాత్రమే కాదు మహాసంస్థ. అది అడుగు పెట్టని ఊరు ఉండేది కాదు. జైలులో ఉండగా కూడా ఈ పేపరే చదివే వాళ్లమని దాశరథి కృష్ణమాచారి రాశారు. గాడాంధకారంలో కాంతిరే• గోలకొండ పత్రిక అని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరస్వేచ్ఛ అసలే లేని నియంతృత్వ నిజాం పాలనలో నిత్యమూ నిజాల్ని తెలిపేందుకు సురవరం ప్రతాపరెడ్డి ఈ పత్రికను నడిపారు. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్ది ఒక అధ్యాయం. గోల్కొండ పత్రిక దానికి అనుబంధం.

వ్యాసకర్త : విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE