–  పి. చంద్రశేఖర ఆజాద్‌, 9246573575

ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

‘‘ఇప్పటి వరకు నా దగ్గర ఎందుకు పాడలేదు?’’ అడిగాడు.

‘‘అప్పుడు కృష్ణదాసు లేరుగా!’’.

‘‘బుద్ధా… నీ లోపల ఇంకెన్ని కళలు దాచుకున్నా వయ్యా’’ అన్నాడు కృష్ణదాసు.

‘‘పత్రికల కోసం మీరు ఎన్ని త్యాగాలు చేసారో ఇప్పుడే నాకు అర్థం అయింది. నా పాట నా కుటుంబానికి అవసరం లేదు. మీ పత్రికలు మాత్రం మా అందరికీ కావాలి’’ అంటూ ఆయన చేతులు అందుకుని ఊపేసాడు.

చివరిగా రామకృష్ణ సైతం ఓ ఆలాపన అందు కున్నాడు.

ఆ గొంతులో ఎలాంటి అపశ్రుతి లేదు.

అప్పుడే పిండిన పాలు నురగను పాలలో కలిపేసి నట్లు… అందులో ప్రకృతి కనిపిస్తున్నట్లు వుంది. ఆలాపన అయ్యాక నాలుగు వాక్యాలు… ఆ గంభీర మైన కంఠం నుండి…

‘‘చాలు ప్రభూ… ఈ రాత్రిని శాశ్వతం చెయ్యి’’ అన్నాడు దాసు.

‘‘ఇంకా మిగిలింది రిత్విక్‌’’.

‘‘ఇం‌తమంది గాయకుల మధ్య శ్రోతగా వుండటాన్ని మించిన అదృష్టం ఏముంటుంది? మీ అందరూ నా కంటే పెద్దవారు. అందరికీ పాదాభి వందనాలు’’ అన్నాడు రిత్విక్‌.

‘‘‌నీ రచనల్లో కవిత్వం. పాట పెనవేసుకుని వున్నాయ్‌ ‌రిత్విక్‌. ‌నిన్ను గుర్తించిన మా గోవింద్‌ ‌బుద్ధకి నా అభినందనలు’’ అన్నాడు రామకృష్ణ.

* * * * * * * * 

ఆద్య ఇంటికి వచ్చింది.

అప్పటికి ఆదర్శ్ ఇం‌కా రాలేదు. డోర్‌ ‌బెల్‌ ‌మోగగానే అఖిల తలుపు తెరిచి, ఆద్యను చూసి మాట్లాడకుండా వెళ్లిపోయింది.

ఆద్యకు నవ్వు వచ్చింది. అంతలోనే అమ్మను బాధ పెట్టానా అనిపించింది. అయినా తను అమ్మ దగ్గరికి వెళ్లలేదు. కాస్త బెట్టుగా వుండాలి. తను కూడా ఆలోచించాలి అనుకుంది. తలుపులు మూసి తన గదికి వెళ్లింది. స్నానం చేసింది. పుస్తకాలు ముందు పెట్టుకుని నోట్స్ ‌రాసుకుంటోంది. ఎంత సమయం అయిందో తెలియదు.

అప్పుడు తలుపు మీద చప్పుడు….

గది బయట అఖిల.

‘‘డైనింగ్‌ ‌టేబుల్‌ ‌మీద అన్నీ వున్నాయి’’ అని వెళ్లిపోయింది.

‘‘ఇది నా స్పేస్‌… ‌నా ఎరీనా అని నువ్వు గుర్తుంచుకున్నందుకు సంతోషం మమ్మీ… అయినా ఈ సరిహద్దులు ఎల్లకాలం వుండవు’’ అనుకుంది.

డైనింగ్‌ ‌టేబుల్‌ ‌దగ్గరకు వెళ్లి వడ్డించుకుంది.

ఆ అమ్మాయి ఆలోచనలు బాల్యంలోకి పరుగులు తీస్తున్నాయి.

అలా వెళ్లి ఓచోట ఆగిపోయింది.

ఆద్యను గాల్లోకి విసిరి పట్టుకుంటున్నప్పుడు ఎక్కడా భయం కలగలేదు. అనంతమైన ప్రేమ ఆ కళ్లల్లో!

అద్భుత స్పర్శ…అనుభూతి…అతను పక్కన వుంటే ఓ భరోసా. తను నిద్రపోతున్నప్పుడు పీడకలలో ఉలిక్కిపడి ఏడుపు రాగం అందుకుంటే ‘‘నేనున్నాను’’ అని ఓదార్చటం.

మళ్లీ కలలో అతనే…

ఎటు చూసినా దెయ్యాల మధ్య తను వుంది. అప్పుడు ఓ మహాకరవాలంతో అతను ప్రత్యక్షం. కరవాలం గాలిని చీల్చుకుంటూ రెండుసార్లు విన్యాసం. ఇప్పుడు దెయ్యాలు మాయం.

అతను చేయిసాచాడు. అందుకుంది. అలా గాల్లో తేలిపోతున్నారు. చుక్కల మధ్య నుండి మబ్బుల మధ్య నుండి చందమామ దగ్గరకు ప్రయాణం.

చందమామలోని అవ్వ దగ్గరికి చేరారు.

‘‘ఆద్య… నా ప్రాణం. నాకు రెండు ప్రాణాలు’’.

అప్పుడు అవ్వ తన తల మీద రెండు చేతుల్తో నిమిరింది.

వెన్నెలంతా తన ఒంటినిండా పాకుతోంది!

భోజనం ఎప్పుడు పూర్తి అయిందో తెలియదు.

అన్నీ సర్దింది. పళ్లెం సింక్‌లో పడేసింది. తన గదికి వెళ్లింది. ఓ పుస్తకం అందుకుంది.

‘‘మ్యూజింగ్స్ ఆఫ్‌ ఎ ‌గ్రాండ్‌ ‌పా’’.

అందులో మునిగిపోయింది.

* * * * * * * * 

‘‘ఏం చేస్తున్నావు రసజ్ఞా’’ ఫోన్‌లో అడిగింది వాళ్ల అమ్మ.

‘‘ఆస్కార్‌ ‌వైల్డ్ ‌పుస్తకం చదువుతున్నాను’’.

‘‘పుస్తకమా?’’ అంది భువనేశ్వరి.

‘‘ఆస్కార్డ్ ‌వైల్డ్ ఆక్స్ ‌ఫర్డ్ ‌యూనివర్సిటీ నుండి తయారయిన గొప్ప రచయిత’’.

‘‘అక్కడ ఇంకా చాలా గొప్పమంది వున్నారు. అందుకే నాకు ఇష్టం లేక పోయినా నిన్ను అంత దూరం పంపించాను రసజ్ఞా. నువ్వు మెడిసిన్‌కి చెందిన బుక్స్ ‌రిఫర్‌ ‌చేస్తున్నావనుకుంటాను’’.

‘‘అది రోజూ జరిగే పని మామ్‌. ‌మెడిసిన్‌ ‌శరీరానికి చెందిన రోగులకు పరిష్కారం చూపిస్తుంది. బుక్‌ ‌జీవితం గురించి చాలా విషయాలు చెబుతుంది. అఫ్‌కోర్స్ ‌నీకు తెలియంది కాదు’’.

‘‘ప్రభాత్‌ ‌నీకోసం ముంబయ్‌లో పెద్ద హాస్పటల్‌ ‌కట్టబోతున్నాడు. నీ స్టడీస్‌ ‌పూర్తి అయ్యేసరికి అది రెడీ అవుతుంది’’.

‘‘డాడీ పక్కన వున్నారా?’’

‘‘ప్రభాత్‌ ‌కాన్ఫరెన్స్‌లో వున్నాడు. ఆలస్యంగా వస్తాడు’’.

‘‘డాడీని తొందరపడవద్దని చెప్పు’’.

‘‘అదేంటి?’’

‘‘నా స్టడీస్‌ ఎప్పటికి పూర్తి అవుతాయో తెలియదు’’.

‘‘ఇంకా చదువుతావా?’’

‘‘చదువుకు అంతం వుంటుందా. ఇక్కడి నుండి స్టీఫెన్‌ ‌హాకిన్స్ ‌చేసిన కృషి ప్రపంచం ముందు వుంది. నాకూ కొన్ని పరిశోధనలు చేయాలని వుంది. ముఖ్యంగా అరుదయిన వ్యాధుల మూలాలను కనుక్కోవాలి’’.

‘‘ఇప్పుడు నీ వయసు ఎంతో తెలుసా?’’

‘‘నవ్వు వస్తోంది మామ్‌’’.

‘‘‌నీ ఎం.ఎస్‌. ‌పూర్తికాగానే నీ మ్యారేజ్‌ ‌చేయాలనుకుంటున్నాం’’.

‘‘అప్పుడే అల్లుడ్ని సెలక్ట్ ‌చేసారా?’’

‘‘అవన్నీ ప్రభాత్‌ ‌చూసుకుంటాడు. ఇప్పటికే ప్రముఖులు మమ్మల్ని అడుగుతున్నారు’’.

‘‘మామ్‌… ‌ముందే అన్నీ ఎందుకు ఫిక్స్ ‌చేస్తున్నారు?’’

‘‘నీ కజిన్‌కి మ్యారేజ్‌ అయి రెండు సంవత్సరాలు. ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా వుంటావు రసా…’’

‘‘నన్ను సంప్రదించకుండా మీరు కమిట్‌ ‌కావద్దు అంటున్నాను’’.

‘‘నీ మనసులో వుంది చెప్పు. నువ్వు ఎవరినన్నా లవ్‌ ‌చేసావా?’’

‘‘ఇప్పటి వరకు నా ప్రొఫెషన్‌ని ప్రేమించాను’’.

‘‘నువ్వు తెలివిగల అమ్మాయివని నాకు తెలుసు. ఆక్స్‌ఫర్డ్ ‌యూనివర్సిటీలో నీకు సీట్‌ ‌రావటం అంటే అది చిన్న విషయం కాదు. అయినా నువ్వు మీ అమ్మని చిన్నపిల్ల అనుకోవద్దు’’.

‘‘అనుకోను మామ్‌. ‌నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ‌వున్నారు. అంతే. నేను ఎవర్నీ లవ్‌ ‌చేయలేదు. ఇలా అనటం అంటే నిన్ను చిన్నపిల్ల అనా… నాకు నువ్వన్నా-డాడీ అన్నా రెస్పెక్ట్ ‌వుంది. ఐ లవ్‌ ‌యు బోత్‌. ‌నాది ఒక్కటే రిక్వెస్ట్. ‌నా మ్యారేజ్‌ ‌విషయంలో మాత్రం తొందరపడకండి. నేను ఎలాంటి వ్యక్తితో జర్నీ చేయాల్సి వుందో నేను తెలుసుకోవాలి’’.

‘‘మేం మా అమ్మా-నాన్న చెప్పిన సంబంధాలు చేసుకున్నాం’’.

‘‘ఎందుకలా చేసావమ్మా… నీకు మ్యారేజ్‌ ‌కాదనుకున్నావా?’’

భువనేశ్వరి మాట్లాడలేకపోయింది.

‘‘అమ్మమ్మ, తాతయ్య అంత రిజిడ్‌ అని నేను అనుకోను’’

‘‘అది నీకెలా తెలుస్తుంది రసజ్ఞా?’’

‘‘అలా అనుకుంటున్నాను. వాళ్లు మంచి సంబంధం అనుకున్నది ముందు నీకు చెప్పి వుంటారు. నీ అభిప్రాయం అడిగి వుంటారు. నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చి వుంటారు. అంతేగాని ఇది ప్రముఖుల సంబంధం. నేను వారికి మాట యిచ్చాను కాబట్టి చేసుకో అని వుండరు. ఇంకోటి అడగనా?’’

‘‘కాదంటే పూరుకుంటావా? కానీ…’’

‘‘నాన్నా-నువ్వు పెళ్లికి ముందు కలుసుకోలేదా? మాట్లాడుకోలేదా? నువ్వు నాన్నని నచ్చకుండానే చేసుకున్నావా?’’

‘‘పెళ్లి అన్న మాట అన్నందుకు బాగానే క్లాసు తీసుకున్నావు’’.

‘‘ఇది క్లాస్‌ ‌కాదు. మాకు లైఫ్‌.’’

‘‘‌సంతోషం… ఇవన్నీ లేకుండా ఎలా చేస్తారను కున్నావ్‌?’’

‘‘‌ముందు కమిట్‌ అవకండి అన్నాను. ఈ మాత్రం అనే డెమొక్రసి మన ఇంటిలో లేదా మాకు?’’

భువనేశ్వరి మాట్లాడలేకపోయింది.

‘‘మామ్‌….’’

‘‘‌మనం తర్వాత మాట్లాడదాం’’ అని ఫోన్‌ ‌కట్‌ ‌చేసింది.

* * * * * * * * 

‘‘మనుషుల మధ్య కాన్‌ప్లిక్టస్ ఎలా మొదలవుతాయి రిత్విక్‌’’ అన్నాడు రామకృష్ణ. ఆయన మాట్లాడాలి రమ్మంటే వచ్చాడు. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ఇలా అడగటంతో కాస్త కంగారు పడ్డాడు.

‘‘నువ్వు రచనలు చేస్తావు. టీ.వీ.లకు రాసావు. సినిమాలకీ పని చేసి వుంటావు. మీ బేసిక్‌ ‌ఫిలాసఫి కాన్‌ప్లిక్టే కదా… అంటే ఇద్దరి మధ్యనో ఓ కుటుంబం మధ్యనో ఘర్షణ వుండాలి. అది ఎక్కడ మొదల యింది? ఎందుకు మొదలు అయింది? అది ఎక్కడి దాకా తీసుకు వెళ్తుంది? ఆ తర్వాత వచ్చే ట్విస్ట్లు ఏమిటి? ఇవే కదా పాఠకుల్లో, ప్రేక్షకుల్లో, ఓ ఇంట్రెస్ట్‌ని, ఉత్కంఠనీ కలిగించేది!’’

‘‘అవును సర్‌’’.

‘‘అవి రచనలకూ-సినిమాలకూ బాగుంటాయి. జీవితంలో బాగుంటాయా? చివరిగా కాన్‌ ‌ఫ్లిక్టస్ ఎలా రిజాల్వ్ అవుతాయి?’’

‘‘మీరు జనరల్‌గా అడుగుతున్నారు సర్‌. ‌మీరు ప్రత్యేకంగా అడిగితే నా అభిప్రాయం చెప్పగలుగు తానేమో!’’

అప్పుడు ఆయన మామూలుగా అయ్యాడు.

‘‘నీ రచనలు చదివాను. పెద్ద మెలోడ్రామా వుండదు. చాలా సింపుల్‌ ‌గా మొదలు పెట్టావు. బిగ్‌ ‌బ్యాంగ్‌ ‌వుండదు. ఇప్పుడు కూడా అలానే రాస్తున్నావా?’’

‘‘మార్చుకున్నాను సార్‌… అయినా పెద్ద పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు’’.

‘‘అయినా చదువుతున్నారా?’’

‘‘నాకు కొంత మంది పాఠకులు వున్నారు సర్‌’’.

‘‘ఓ.‌కె…. ఓ.కె. వాళ్లు కూడా సెలయేరు లాంటి కథనాన్ని కోరుకుంటు న్నారేమో. నీలో భావుకత్వం వుంది. ఏదో చెప్పాలన్న తాపత్రయం కనిపించింది. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని వుంది’’.

‘‘దానికి ముందు నేను ఒకటి చెప్పాలి’’.

తలూపాడు.

‘‘నేను మామూలు రచయితని. మీరు ప్రపంచ సాహిత్యం చదివారని నాకు తెలుస్తూనే వుంది. అందుకని ఆ స్థాయిలో నన్ను ప్రశ్నలు అడగవద్దు. నిరాశ పడతారు. ఇంకా నా రచనల్లో ఘర్షణలు వుంటాయి సర్‌. అది మిస్సవను. అవి ఎలా చెబుతున్నాను అనే విషయంలో ఎవరి అంచనా వారిది’’.

‘‘బాగుంది. నీకు ఇద్దరు అబ్బాయిలు కదా?’’

‘‘అవును సర్‌’’.

‘‘‌వాళ్లు నీ దగ్గరకు వచ్చి మేం ఓ వ్యాపారం చేస్తాం. లేదా ఇండస్ట్రీ పెడతాం. మన ఇల్లో, పొలమో అమ్ముదాం అంటారు. అప్పుడేం చేస్తావు?’’

‘‘ముందు ఆ వ్యాపారమో మరొకటో నాకు వివరంగా రిపోర్ట్ ఇవ్వమంటాను’’

‘‘అందులో నీకు లోపాలు కనిపించాయి. ఈ ప్రాజెక్ట్ ‌వర్కవుట్‌ ‌కాదు అని నీ అనుభవం నీకు చెప్పింది. అప్పుడేం చేస్తావు?’’

‘‘అదే చెబుతాను’’.

‘‘అది మీ పిల్లలు అంగీకరించరు. వాళ్లు మేం ఎలా అయినా సక్సెస్‌ అవుతాం అని వాదిస్తారు. అప్పుడు ఆస్తిని అమ్మి వారికి ఇస్తావా? మీతో సంబంధాలు నాకు అవసరం లేదు. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అని వదిలేస్తావా?’’

‘‘ఇక్కడ రెండు మూడు అంశాలున్నాయి సర్‌. ‌ముందు నేను నా భార్యతో మాట్లాడ తాను. ఇలాంటి పరిస్థితి వుంది, మనమేం చేద్దాం అని. ఎక్కడో కొంత మంది తప్ప ఏ తల్లిదండ్రులయినా పిల్లల కోసమే ఏదయినా చేస్తారు సర్‌. అం‌దుకే సంపాదిస్తారు. దాంతో పాటు చివరి రోజుల్లో భద్రతని, చిటికెడు ప్రేమని కోరుకుంటారు. అందుకే పిల్లల నుండి అవి దొరక్కపోతే కనీసం ఆస్తులు వుంటే బయటి మనుషులతో అయినా పనులు చేయించుకోవచ్చు అనుకుంటారు. అందుకే ఆస్తులని తమ పేరు మీద వుంచుకుంటారు’’.

‘‘నా ప్రశ్నకి పూర్తి సమాధానం రాలేదు’’.

‘‘అమ్మలకి సహజంగా పిల్లల మీద ప్రేమ వుంటుంది. తొమ్మిది నెలలు వారిని కడుపులో మోస్తారు కాబట్టి. ఇలాంటి సందర్భం వస్తే హారిక కూడా, ముందు మనకి వున్న ఆస్తిని ఇద్దరికీ సమంగా యిచ్చేయండి. మన ఆరోగ్యానికి, రోజు వారి ఖర్చులకి కొంత పక్కన వుంచుదాం. మేం ఇంతకంటే చేయగలిగింది లేదు. ఇక నుండి మీ జీవితం మీ ఇష్టం అని చెబుదాం అంటుంది. అంతేగాని సాధ్యమైనంత వరకు మీ బతుకులు మీవి. ఇవన్నీ మీకు అనవసరం అనదు. నేను కూడా అంతే….’’

‘‘నువ్వు ఇప్పుడు యూత్‌ని స్టడీ చేస్తున్నావా రిత్విక్‌’’.

‌చిన్నగా తలూపాడు.

‘‘కుటుంబాలన్నీ ఒకటి కాదు. రకరకాల మానసిక స్థాయుల్లో, ఆర్థిక స్థాయుల్లో వుంటాయి. ఒక్కో ఫ్యామిలీలో మాట పట్టింపులు వస్తాయి. ఒక్క విషయం చెప్పు. నీ పిల్లలకి నీతో అభిప్రాయ భేదాలు వచ్చాయి. నీకు దూరంగా వుండాలనుకున్నారు. అలాంటి వారు నువ్వు సంపాదించిన ఆస్తులను మాత్రం ఎందుకు కాదనలేక పోతున్నారు. అవి మాత్రం కావాలి. మనుషులు అవసరం లేదు. ఇదేం ఫిలాసఫి? అంత పట్టుదల వున్నప్పుడు మీరు స్వంతంగా ఎందుకు మీ ప్రపంచాన్ని నిర్వహించు కోరు. మనందరం జీరో నుండి బయలుదేరిన వాళ్లమే కదా!’’

‘‘మీరు చెప్పింది వాస్తవం సర్‌. అలా పైకి వచ్చిన వారూ వున్నారు. రాను రానూ మన సమాజం మరీ క్లిష్టంగా మారిపోతోంది. ఎవరూ ఎవరికీ అర్థం కాని ఓ వాతావరణం వచ్చింది’’.

‘‘అర్థం కాకపోవటం అంటూ వుండదు రిత్విక్‌. ‌మనుషులు అలాంటి ప్రయత్నం చేయటం లేదు. అందుకు అనేక కారణాలున్నాయి. మీలాంటి రచయితలు, కళాకారులు ఇవన్నీ చర్చించాలి. దురదృష్టవశాత్తూ అలాంటి ప్రయత్నం తక్కువగా జరుగుతోంది’’.

‘‘అందుకు కూడా రకరకాల కారణాలు సర్‌. ఈనాటి జీవితంలోని క్లిష్టత, బాధ్యత లేకపోవటం సాహిత్యంలోనూ వుంటుంది’’.

ఆయన తలూపాడు. కొద్ది సేపు ఆలోచించాడు.

‘‘నేను కూడా ఓ పత్రిక పెట్టాలనుకున్నాను రిత్విక్‌’’ అనగానే ఆశ్చర్యంగా చూసాడు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram