వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి శీతాద్రి

సుశ్లోకం బైన హిమాద్రి నుండి భూలోకంబునందుండి’’

పవిత్రమైన గంగానదీమ తల్లిని చూచిన గంగాధర్‌కు ఉద్వేగం ఉప్పొంగి ఎంతో ఆనందం కలిగింది. సాక్షాత్తు పరమశివుని జటాజూటంలో నుండి మనల్ని పునీతులను చేయడానికి అవతరించిన భాగీరధికి సాష్టాంగ నమస్కారం చేసాడు. ‘మీ కార్యక్రమాలు నేను చేయిస్తాను’ సాబ్‌ అనే ఒక సన్నని గొంతు విని అటు చూసాడు. చక్కగా పంచె కట్టు విభూది రేఖలతో మెడలో రుద్రాక్షలతో ‘బాలశివుని’లా కన్పించాడు ఒక బాలుడు. పట్టుమని పదేళ్లయిన లేని ఆ పసివాడిని ఆప్యాయంగా చూస్తూ ‘ఏమేం చేయిస్తావు’ అని అడిగాడు.

 ఆ బాలుడు ‘‘ఇలా అడుగుతున్నందుకు మన్నించండి సాబ్‌, ‌మీకు తండ్రిగారు ఉన్నారా’’ అని అడిగాడు. ‘‘లేరు’’ తల్లిదండ్రులకు, పితృదేవతలకు పితృకార్యం చేయిద్దామనే వచ్చాను అని గంగాధర్‌ ‌చెప్పాడు.

‘‘అయితే ముందు సంకల్పయుతంగా స్నానం చేయిస్తాను. ప్రాయశ్చిత్త మంత్రాలు చెప్తాను. మీచేత శాస్త్రీయుతంగా శ్రార్ధకర్మ చేయిస్తాను. మీకు తోచినది ఇవ్వండి’’ అని వినయంగా చెప్పాడు ఆశ్చర్యంగా చూసాడు గంగాధర్‌ ఆ ‌బాలుని వంక. అతనిలో మంచి కళ కనిపించింది తను స్పందించే లోపే ‘‘ఏయ్‌ ‘‌విస్సు’ ఎందుకొచ్చావ్‌ ‌యిక్కడికి నీవేం శాస్త్రాలు చదివావని!! ఇవన్నీ చేయించకూడదని తెలియదా’’ అని కర్కశంగా ఒక పురోహితుడు ఆ బాలుణ్ణి కసురుకొన్నాడు.

గంగాధర్‌ ఆ ‌బాలునివైపు చూస్తున్నాడు. అతనికి కన్నీళ్లు వచ్చాయి. కండువాతో తుడుచుకొంటూ వెక్కుతూ ‘‘మన్నించండి సాబ్‌…‌మా నాన్నగారు పోయి మూడునెలలైంది. నేను, అమ్మ, చిన్న చెల్లెలు మాత్రమే ఉన్నాము. అమ్మ వంటలు చేసి మమ్మల్ని పోషిస్తోంది. ప్రస్తుతం మా అమ్మకు పని కూడా ఎక్కువగా దొరకటం లేదు ఏదో చేసి మా కడుపులు నింపుతోంది కాని తను’’…. దుఃఖంతో వాక్యం పూర్తి చేయలేకపోయాడు. అతను కాస్త తమాయించుకొని’’ ‘‘అమ్మ భోజనం చేసి 3 రోజులు అయింది సాబ్‌..ఈ ‌రోజు ఎలాగైనా డబ్బు సంపాదిద్దామని వచ్చాను…. మన్నించండి’’ వెళ్లిపోబోయాడా బాలుడు.

‘‘గంగాధర్‌కు గుండె పిండేసినట్లయింది’’ అన్నపూర్ణాదేవి వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో ఒక ఇల్లాలికి అన్నం కూడా దొరకడం లేదా!

‘ఏమిటమ్మా నీ లీలలు. ఏమిటమ్మా నీ మాయ’ అని తన మనస్సులో మధనపడుతూ నాయనా ‘విస్సూ’ ఒక్క నిమిషం’ అని బాలుడిని దగ్గరగా తీసుకొని  1000/- రూపాయుల తీసి యిచ్చాడు గంగాధర్‌. ‘‘ఇం‌టికి కావలసిన సరుకులు కొనుక్కుని వెళ్లు’’ అని చెప్పాడు. విస్సు అతనిని విదిలించుకొని దూరం జరిగాడు. దెబ్బ తిన్నట్లు గంగాధర్‌ ‌కేసి చూసాడు. ‘‘నేను బిచ్చగాడిని కాదు సాబ్‌, ఆ ‌విశ్వేశ్వరుడే నాకేదో దారి చూపుతాడు’’ అని వెళ్లిపోవడం ప్రారంభించాడు.

గంగాధర్‌కు ఆశ్చర్యం కలిగింది. ఏం చేయాలో పాలుపోలేదు. తన కళ్లముందో ఒక శోత్రియ కుటుంబం ఆకలితో అలమటిస్తుంటే అది తెలిసి కూడా ఏమీ చేయకుండా ఉండడం మహాపాపం అనిపించింది.

 చిన్నప్పటి నుండీ కూడా సనాతన ధర్మం బోధించిన ఆశయాలను నిక్కచ్చిగా అమలుచేస్తున్న వైదిక బ్రాహ్మణ కుటుంబం గంగాధర్‌ది. తండ్రిగారు పౌరోహిత్యం చేస్తూ పవిత్రంగా జీవిస్తున్నారు. తమ గ్రామంలోని తన బంధువులందరూ యిలాగే జీవిస్తున్నారు. ఉన్నదాంట్లోనే దాన ధర్మాలు చేస్తూ తృప్తిగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అతిథి• అభ్యాగతులు లేకుండా తమ కుటుంబం భోజనం చేసిన రోజులు చాలా తక్కువ. తనను మాత్రం గంగాధర్‌ ‌తల్లిగారు పట్టుపట్టి ఇంగ్లీష్‌ ‌చదువులు చదివించారు. తను కూడా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ‘‘నాయనా గంగాధర్‌! ఎక్కడ ఉన్నా ఎంత సంపాదించినా మానవత్వపు విలువలను, మన ధర్మం మనకు చెప్పిన సూక్తులను మర్చిపోవద్దు. ధర్మం తప్పకుండా రెండు చేతులతో బాగా సంపాదించు పది చేతులతో దాన ధర్మాలు చేయి. పంచయజ్ఞాలను అమలుచేయి. దాచుకున్నవాడు దోచుకున్నవాడితో సమానం అని ఎప్పుడు మర్చిపోవద్దు. మన వెంట వచ్చేవి మనం చేసిన పుణ్యకార్యాల ఫలితం మాత్రమే’ అనే తన తండ్రిగారి సలహాను మర్చిపోకుండా ప్రశాంతంగా జీవిస్తున్నాడు. తన భార్య కూడా పూర్తిగా తనకు సహకరిస్తోంది. అటువంటి తను తన కళ్ల ముందే యిబ్బందిలో ఉన్న మంచి కుటుంబాన్ని ఎలా ఉపేక్షించగలడు. మరేం చేయాలి విస్సు కనుమరుగవుతుంటే ఒక ఉపాయం తట్టింది. గట్టిగా విస్సుని పిలిచాడు గంగాధర్‌ అయిష్టంగానే వచ్చాడు.

విస్సు నాకో సహాయం చేయగలవా అని నెమ్మదిగా అడిగాడు గంగాధర్‌. ‌నేనేం చేయగలను అన్నట్లు ఆశ్చర్యంగా చూసాడు విస్సు. అతని చూపులకు సమాధానంగా ‘నేను సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఈ రోజు పితృకార్యం చేసాను కనుక బయట ఎక్కడా భోజనం చేయలేదు. ఎక్కడ చేయాలో తెలియడం లేదు. మీ అమ్మగారితో చెప్పి నాకు భోజనం తయారు చేయిస్తే పవిత్రంగా, శుచిగా మీ ఇంట్లో భోజనం చేస్తాను. మీకు కుదురుతుందా! ఇబ్బంది ఏమి లేదు కదా!’ అని అడిగాడు.

విస్సుకు ఆనందం కలిగింది. అమ్మ ఈవ్వాళ భోజనం చేసే అవకాశం ఆ విశ్వేశ్వరుడు కలగచేస్తున్నందుకు ఎంతో ఉత్సాహం కలిగింది. మనస్సులోనే స్వామికి కృతజ్ఞతలు చెప్పి ‘‘తప్పకుండా సాబ్‌..ఇప్పుడే వెళ్లి అమ్మకు చెప్పి వస్తాను. మిమ్మల్ని మా ఇంటికి తీసుకొని వెడతాను’’ అని నాలుగు అడుగులు వేసి మళ్లీ నీరసంగా వెనక్కి వచ్చాడు. ‘‘మన్నించండి సాబ్‌ ఇం‌ట్లో సరుకులు ఏమీ లేవు అమ్మ ఎలా వంట చేస్తుంది’’ అన్నాడు. వెంటనే గంగాధర్‌ అదేం సమస్య కాదు. నేను మా డ్రైవర్‌కు చెప్తాను. అతనిని నీవు తీసుకొని వెళ్లు. అతను సరుకులన్నీ  కొనిస్తాడు అన్నాడు. గంగాధర్‌ ‌డ్రైవర్‌ని పిలిచి కాస్త ఎక్కువగానే అన్ని వస్తువులు కొనివ్వమని చెప్పాడు.

‘నువ్వు సరుకులన్నీ ఇంట్లో పెట్టించి మనందరికీ వంట చేయమని అమ్మకు చెప్పి తిరిగి వచ్చెసేయ్‌ ‌నాకు ఊరుకొత్త. ఏమి దేవాలయాలు చూడాలో నీవే తీసుకొని వెళ్లాలి’ అన్నాడు గంగాధర్‌. ‌మహా ఉత్సాహంగా అలాగే అంటూ వెళ్లిపోయాడు విస్సు.

స్నానాదికాలు పూర్తిచేసి పితృకార్యం ముగించి, చేయించిన వారిని సంతృప్తి పరిచాడు గంగాధర్‌. ఈలోగా విస్సు వచ్చాడు. ముందుగా ‘‘కాలభైరవ స్వామి దర్శనం చేయించాడు. తర్వాత విశ్వేశ్వర స్వామి, గణపతి, విశాలాక్షి శక్తిపీఠం, అన్నపూర్ణాదేవి దర్శనాలు చేయించాడు. ప్రతిచోట పూజా సామాగ్రి కొనడంతో సహా తనే చూసుకొన్నాడు. దేవాలయాల గురించి కాశీ విశిష్టత గూర్చి వివరంగా చెప్పాడు. గంగాధర్‌కు ఎంతో ఆనందాశ్చర్యాలు కలిగాయి.

అప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అయింది. ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. కారులో వెళ్లే అవకాశం లేదు. అన్నీ ఇరుకుగా ఉన్న సందులు, చిన్న చిన్న  ఇళ్లు, జనం…అన్నీ దాటుకుంటు నెమ్మదిగా నడిచాడు గంగాధర్‌. ‌విస్సును అనుసరిస్తూ, చూస్తుంటే ఎక్కువగా పూజారులు, పురోహితుల ఇళ్ల లాగానే ఉన్నాయి. పేదరికం స్పష్టంగా కనిపిస్తుంటే గంగాధర్‌కు బాధ, భయం కలిగాయి. మన సనాతన ధర్మానికి మూల స్తంభమైన బ్రాహ్మణీకం, పౌరోహిత్యం యింత పేదగా ఉంటే ఎంత కాలం ఇది నిలుస్తుంది? ఇప్పటికే పూజలు, వ్రతాలు ‘సీడీ•’ల  సహాయంతో ఇంటివద్దనే చేసుకొంటున్నారు. ఈ వృత్తిలో వున్న యువకులను వివాహం చేసుకుందుకు అమ్మాయిలు ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితులలో తనలాంటివారు ఇంగ్లీష్‌ ‌చదువులు చదివి ఉద్యోగాలు చేసుకొంటున్నారు. కాలక్రమేణ ఈ వ్యవస్థ అంతరించిపోతుంది. ‘స్వామీ నీవే ఈ ధర్మాన్ని, సంప్రదాయాలను, ప్రాచీన పవిత్ర వ్యవస్థలను కాపాడాలి’ అని మనస్సులోనే ప్రార్థించాడు.

విస్సు వాళ్ల ఇల్లు ఇల్లు చిన్నది. ఒక్క గది. చిన్న వంట గది ఉన్నాయి. అంతే. వెనకాల స్నానాలు గది ఉంది. బయట అన్ని ఇళ్ల ముందు అరుగులు ఉన్నాయి. కాసేపు ఆ అరుగు మీదే కూర్చున్నాడు. విస్సు గంగాధర్‌కు కాళ్లు  కడుగుకుందుకు నీళ్లు ఇచ్చాడు. తుడుచుకొందుకు తుండుగుడ్డ కూడా ఇచ్చాడు. మర్యాదగా లోపల పీటవేసి కూర్చోపెట్టి విస్తరి వేసి పదార్థాలు వడ్డించాడు. విస్సువాళ్ళ అమ్మ లోపల నుండి వండిన పదార్థాలు విస్సుకు అందించారు. మౌనంగా భోజనం చేసాడు గంగాధర్‌. ‌తృప్తిగా లేచి, విస్సుని, అమ్మగారిని భోజనం చేయమని చెప్పి బయట అరుగుమీద కూర్చున్నాడు. అందరి భోజనాలు అయ్యాక విస్సు గంగాధర్‌తో ‘మీ దయవలన మేము ఈవేళ తృప్తిగా భోజనం చేసాము. సరుకులు మీరే యిచ్చినందుకు వేరే డబ్బు ఏమీ వద్దని చెప్పమంది అమ్మ. మీరు పంపిన సరుకులతో చాలా మిగిలిపోయాయి. వాటిని మీకే ఇచ్చేయమంది అమ్మ’’

ఆశ్చర్యపోయాడు గంగాధర్‌. ‌రేపటి భోజ నానికి లేకపోయినా ఆమె అలా చేయడం నిజాయతీకి, ఆత్మాభిమానానికి పరాకాష్ట అని అనుకొన్నాడు. లోపలికి చూస్తూ ‘బెహెన్‌ ‌జీ’ మీతో కొద్దిగా మాట్లాడాలి., ఇలా వస్తారా! అన్నాడు. లోపలే నిలబడి ‘చెప్పండి’ అంది.

మేము హైదరాబాదులో ఉంటాము. మాది పౌరోహిత్య కుటుంబమే. మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుండి మన ధర్మం గురించి మనిషిగా నా కర్తవ్యం వివరంగా బోధించారు. నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను. నా జీతంలో 25 శాతం అవసరమున్నవాళ్లకు ఇస్తూ నాన్నగారి సలహా పాటిస్తున్నాను. మీ కుటుంబంతో పరిచయం ఆ విశ్వేశ్వరుడే కల్పించాడు. విస్సును చూడడం, మీ ఇంటికి రావడం, మీ చేతి వంట తినడం ఇవన్నీ ఒదిగి ఉండేవి కావు. మీ ఆయనకు ప్రతిరూపాలైన మీ పిల్లల పట్ల మీకు ఎంతో బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీరు సక్రమంగా నెరవేర్చాలంటే మీకోదారి ఆ విశ్వేశ్వరుడు చూపించాలి. ఆయన లీలల్లో భాగంగా నన్ను ఇక్కడకు పంపించాడు. మీ ఆత్మాభిమానం. మీ నిజాయతీ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. మీవంటివారికి అండగా ఉండగలిగితే నా జన్మధన్యమైనట్లే అని భావిస్తాను. ఈ ఉద్దేశం, ఈ ప్రేరణ ఆ విశ్వేశ్వరుడే కలిగించాడు. ఇలా నేను చేయగలిగితే మా నాన్నగారు పుణ్యలోకాలలో ఎంతో ఆనందిస్తారు. ఆయనకు ఆ ఆనందం కలిగించమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తు న్నాను. మిమ్మల్నందరిని నేను హైదరాబాద్‌ ‌తీసుకొని వెడతాను. మీకో అన్నయ్యను పంపించాడు ఆ స్వామి అని భావించండి. విస్సును చదివిద్దాం- అన్నీ నేను చూసుకుంటాను. దయచేసి నాకీ సత్కార్యం చేసే అదృష్టం కలగజేయండి’ అంటుంటే కంఠం దుగ్ధమైంది గంగాధర్‌కు.

 నెమ్మదిగా చెప్పింది ఆమె. ఏ జన్మలో మేము చేసుకొన్న పుణ్యమో ఇక్కడ జన్మించాం.ఆ గంగామాతను, విశ్వేశ్వర సాన్నిధ్యాన్ని మాకు ఇచ్చిన ఈ పవిత్రమైన స్థలాన్ని వదలి మేము ఎక్కడికి రాలేము. ఏమి అనుకోకండి. మీ దయకు నా వినయపూర్వక కృతజ్ఞతలు. విస్సు పౌరోహిత్యం నేర్చుకుంటుండగానే..’ ఆమె దుఃఖంతో వాక్యం పూర్తి చేయలేకపోయింది. మెల్లగా తమాయించుకొని ‘వాడు వేదాధ్యాయనం చేయాలి. అన్ని క్రియలు చేయించడం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. తండ్రి వృత్తినే కొనసాగించాలి. స్వామి సన్నిధిని, గంగామాతను సేవిస్తూ ఇక్కడే ఉండాలి. అదే వాళ్ల నాన్నగారి కోరిక. దానిని అధిగమించే అధికారం నాకు లేదు. ఏమి అనుకోకండి, మీ మాటను కాదన్నందుకు. ఆ విశ్వేశ్వరుడినే నమ్ముకొన్న మాకే లోటు ఉండదు’ అని నెమ్మదిగా స్పష్టంగా చెప్పింది.

ఇటువంటి సమాధానమే వస్తుందని ముందు గానే అనుకొన్నాడు, ఆశ్చర్యం కలగలేదు. పైగా ఆమె మాటలు ఆనందం కలిగించాయి. మంచి మాట చెప్పారు బెహన్‌జీ. మీ మాటలు మీ భక్తికి, మీ సంస్కారాన్ని సూచిస్తున్నాయి. తప్పకుండా అలాగే చేద్దాం. నేను నా మేనల్లుడు చి।। విస్సు కోసం ప్రతి నెల కొంత డబ్బు పంపిస్తాను. మీరందరు ఏ లోటు లేకుండా జీవించాలి. పిల్లలను పైకి తీసుకొచ్చే  పవిత్రమైన బాధ్యతను మీరు సంపూర్ణంగా నెరవేర్చాలి. దయచేసి మీ పిల్లల కోసమైన నా అభ్యర్థన అంగీకరించండి. నన్ను బాధపెట్టకండి’ అని అన్నాడు గంగాధర్‌. ఆమె ఏమి మాట్లాడలేదు. మౌనంగా కళ్లు మూసుకొని ఆలోచించ సాగింది.

 నిజమే, తనకో అండ కావాలి. గత మూడు నెలల్లో తానెంత బాధపడిందో పిల్లలకు ఇంత తిండి పెట్టడానికి ఎంత ఇబ్బంది కలిగిందో మనసులో మెదిలింది. తన ఆత్మాభిమానం తన పిల్లలకు శాపం కాకూడదు. డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో విస్సు చదువు కూడా మానేసాడు. రోజూ ఉదయమే నది ఒడ్డుకు వెళ్లి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎన్నాళ్లిలా? ఆ పసివాడు తిప్పలు పడి అన్ని క్రియలు బాగా నేర్చుకోకపోతే ఎలా గడుస్తుంది  జీవితం? అని విశ్వేశ్వరుని దీనంగా వేడుకుంది. తనకు కర్తవ్యం బోధించమని, నెమ్మదిగా లోపలి నుంచో గంగాధర్‌ను చూసింది. ఎంతో నిర్మలంగా పవిత్రంగా కనిపించాడు. ఆ స్వామి పంపిన దూత లాగానే అనిపించాడు. స్వామీ ఏమి నీ లీలలు అనుకొంది. గంగాధర్‌ ఉన్న గదిలోకి వచ్చి అతని పాదాలను కళ్లకు అద్దుకొని లోపలికి వెళ్లిపోయింది.

తన కాశీయాత్ర సంపూర్ణంగా ఫలించినందుకు తన తండ్రికి, విశ్వేశ్వరునికి కృతజ్ఞతలు అర్పిస్తూ విస్సు చేయి పట్టుకొని సంతృప్తిగా బయల్దేరాడు గంగాధర్‌.

–  పురిఘళ్ల శ్రీనివాసరావు రాజేశ్వరి

About Author

By editor

Twitter
YOUTUBE