– చంద్రశేఖర ఆజాద్‌

ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

‘‘పిల్లల్ని కనాలో వద్దో మీరు మాత్రం నిర్ణయం తీసుకుంటారు. కానీ నా విషయంలో ఏం చదవాలో, ఎవర్ని ప్రేమించాలో’’ అంటుంటే….

‘‘ప్రేమా!’’ షాక్‌తో అంది అఖిల.

‘‘నేను మాట్లాడటం పూర్తికాలేదు. ఎవర్ని ప్రేమించాలో, ఎవర్ని ప్రేమించ కూడదో మీరే చెబుతారు. అయినా ప్రేమ అంటే అంత ఉలికిపాటు ఎందుకు? అంటే నేను ఎవరినీ ప్రేమించకూడదా! ఇప్పుడు నాకు అనుమానం వస్తోంది. నేను ఎవర్ని? మనిషినేనా? ఆడపిల్లనా? ఆడ రోబోనా?’’

అక్కడ వాతావరణం గంభీరంగా మారి పోయింది.

అప్పుడు రెండు చేతులూ జోడించింది.

‘‘నాకు జ్ఞానం తక్కువగా వున్నప్పుడు ఈ ప్రపంచాన్ని మీ కళ్లతో చూశాను. చుట్టుపక్కల వారి గురించి, బంధువుల గురించి మీరు చెప్పుకునే మాటలు నేను విన్నాను. అవన్నీ నిజం అనుకున్నాను. ఇప్పుడు నా కళ్లతో ఈ ప్రపంచాన్ని చూడాలని వుంది. నేను ఆలోచించి ఓ అభిప్రాయానికి రావాలని వుంది. ప్లీజ్‌ ‌గివ్‌ ‌మై స్పేస్‌ ‌టు మి…. డోంట్‌ ఎం‌టర్‌ ఇన్‌ ‌టు మై ఎరీనా’’ అని అక్కడి నుండి వెళ్లిపోయింది.

అఖిల ఇంకా తేరుకోలేకపోతోంది.

ఆదర్శ్‌కి ఆశ్చర్యంగా వుంది.

ఇప్పటిదాకా సరదాగా ఉండే ఆద్య మాత్రం తెలుసు. తనలో ఇంత వేదన వుందని, ఇన్ని ఆలోచనలు వున్నాయని తెలియదు. అమ్మా-కూతురు అప్పుడప్పుడు వాదించుకోవటం వింటాడు. సాధారణంగా కల్పించుకోడు.

ఇప్పుడు ఆద్య నా స్పేస్‌ ‌నాకు ఇవ్వమంటోంది!

అంత నిరంకుశంగా మా ఇద్దరి ప్రవర్తన వుందా? అసలు ఆద్యకు మేం ప్రేమని ఇవ్వటం లేదా? ఇంకో తమ్ముడో, చెల్లో కావాలనే కోరిక ఆద్యలో వుందా?

ఎందుకని అఖిల ఇంకొకరిని కనటానికి ఇష్టపడలేదు?

అప్పుడు మెల్లగా మొదలయిన దుఃఖం శబ్దంతో బయటకు రావటంతో అఖిలను చూసాడు. అఖిల ఏడుస్తోంది.

‘‘నువ్వేంటి చిన్నపిల్లలా?’’ అన్నాడు.

‘‘అది మాట్లాడిన మాటలు విన్నారుగా… మనిద్దరిని చిన్న పిల్లలుగా చేసి ఎన్ని మాటలు అంది. నేను ఆద్యకి ఏమివ్వలేదు. దానికంటూ ప్రత్యేక గది వుంది. ఆ గది తనది. నేను ఆ స్పేస్‌లోకి వెళ్లానా? ఇదా అమ్మను అర్థం చేసుకోవటం’’.

‘‘మనం తర్వాత మాట్లాడుకుందాం అఖిలా! నువ్వు ముఖం కడుక్కో చల్లటి నీళ్లతో’’.

‘‘వేడివేడి నీళ్లు నా మీద గుమ్మరించిపోయింది ఆద్య. మనసు కాలిపోయే మాటలు చాలా మాట్లాడింది. అసలు దాని మనసులో ఏముందో కనుక్కోండి’’.

‘‘కనుక్కుందాం. ముందు రిలాక్స్ అవు అఖిలా’’.

‘‘లేదు. లేదు… ఇన్ని రోజులు ఆద్య ఇలా మాట్లాడలేదు. దీని వెనకాల ఎవరో వున్నారు. కావాలని రెచ్చగొడుతున్నారు. మనం చూస్తూ కూర్చుంటే ఆద్య మనకు దూరం అవుతుంది ఆదర్శ్’’.

‘‘అలాంటి పని మనం జరగనీయం అఖిలా. మనం ప్రశాంతంగా ఆద్యతో మాట్లాడాలి. అసలు తన మనసులో నిజంగా ఏమన్నా వుందా? కోపంలో ఇలా మాట్లాడిందా అని తెలుసుకోవాలి. ఇక నుండి నువ్వు ఆద్యతో వాదనలు పెట్టుకోవద్దు’’.

‘‘దానితో వాదనలా! ఇంక నేను ఆద్యతో మాట్లాడను’’ అంది విసురుగా అక్కడి నుండి వెళ్తూ….

చిన్నప్పుడు ఆద్య గుర్తొచ్చింది – ఆదర్శ్‌కి.

అప్పుడు కోపం వస్తే చేతిలో ఏది వుంటే అది విసిరేసేది. అప్పుడు ‘ఇది తప్పు’ అని అఖిల ఎప్పుడూ చెప్పలేదు. పైగా నవ్వుకునేది. అది ఎంత నష్టం జరిగినా. తను ఏదన్నా అనబోతే….

‘‘ఎందుకు అరుస్తారు. పిల్లలు అల్లరి చేయరా… అది మనకున్న ఒకే పిల్ల. పగలగొడితే పగల గొట్టనీయండి. ఇంకొకటి కొనుక్కుంటాం’’ అన్నప్పుడు ‘ఇది పద్ధతి కాదు’ అని నోటి దాకా వచ్చిన మాటలని మింగేసేవాడు.

ఈ అలవాటు ఆద్యలో పెరిగిపోతే ముందు ముందు ఏం జరుగుతుందో అని విలవిలలాడి పోయిన క్షణాలు వున్నాయి. స్కూల్లో చేర్పించాక, కొత్త స్నేహాలు మొదలయ్యాక క్రమంగా మారిపోయింది. అప్పటి ఆద్యేనా ఇప్పటి ఆద్య అనిపిస్తుం టుంది. ఏమైనా ఇది ఇలా కొనసాగటం మంచిది కాదు. ఆద్యతో మాట్లాడాలి అనుకున్నాడు.

********

కృష్ణదాసు రామకృష్ణని చూడటానికి వచ్చాడు. అప్పుడు ఆయన లాన్‌లో నడుస్తున్నాడు. దూరం నుండి నిలబడి కొద్దిసేపు తన స్నేహితుడిని చూసాడు. అతని ఆరోగ్య రహస్యం ఏమిటా! అనిపించింది. గతంలో కంటే ఇప్పుడు మెరుస్తున్నాడు. తెల్లని వెంట్రుకలు కూడా రామకృష్ణకి అందాన్ని యిచ్చాయి. మీసం, చిన్న గడ్డం లాన్‌లో అలంకరించిన క్రోటన్స్‌ని తలపింప చేస్తున్నాయి.

రామకృష్ణ అదృష్టవంతుడు అనుకున్నాడు.

ముందుకు కదిలాడు. అప్పుడు ఆయన గమనించి… చిరునవ్వుతో…

‘‘దాస్‌… ‌కృష్ణదాస్‌’’ అన్నాడు.

‘‘ముందు నీయవ్వన రహస్యం గురించి చెప్పాలి రామకృష్ణా…’’

‘‘నీకు మాత్రం ఏమైంది. నీట్‌గా కోట్‌లో వచ్చావు. అయినా బెజవాడలో ఎండలు ఎక్కువ కదా… ఇబ్బందిగా లేదూ’’.

‘‘నీ దగ్గరికి కాస్త గ్రాండ్‌గా కనిపిద్దామని వచ్చాన్లే… చక్కగా వాక్‌ ‌చేస్తున్నావు. నాకు మోకాళ్ల నొప్పులు వచ్చాయి’’.

‘‘గుండెల్నే మారుస్తున్నారు. మోకాళ్లదేముంది దాసూ… రీప్లేస్‌ ‌చేయించు’’ అన్నాడు.

‘‘చేయించాలి. ఇంటి దగ్గర ఎవరూ లేరు’’

‘‘అంటే….’’

‘‘నా మిసెస్‌ ‌కూడా మా అబ్బాయి దగ్గరకు వెళ్లింది’’

‘‘నువ్వు కూడా వెళ్లాల్సింది. కమాన్‌’’ అని అక్కడ వున్న చెయిర్స్‌లో కూర్చున్నారు.

‘‘తను ఎప్పుడు వస్తుందో తెలియదు’’.

‘‘పోనీ నువ్వు అక్కడకి వెళ్లు. ఆపరేషన్‌ ‌చేయించుకో… అందరూ వుంటారు కదా!’’

‘‘నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నా బాధలు చెప్పుకోవాలి రామకృష్ణ’’

‘‘నీకూ బాధలా! ఓ.కె… ఇందాక నువ్వు అన్నావు. యవ్వనం-రహస్యం అంటూ… కహా గయా ఓ దిన్‌ ‌దాసూ… నా లోపల చాలా రోగాలు వున్నాయి. పైకి ఇలా కనిపిస్తున్నానని అనుకోవద్దు… ఎనీ మూమెంట్‌ ఐ ‌మే గో…’’

‘‘అందరం అంతేగాని డెత్‌ ‌గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావా?’’.

‘‘ఈ వయసులో అలాంటిది సహజం’’.

‘‘చాలా మారిపోయింది సమాజం. మనలాంటి వారు ఇవన్నీ భరించలేరు’’.

‘‘మీ ఇంజనీర్‌ ఎలా వున్నాడు?’’

‘‘అక్కడికే వస్తున్నాను. ఆ రోజు నువ్వు సీట్‌ ఇప్పించావు. తర్వాత నిన్ను కలవటం కుదరలేదు. అన్నట్లు నేను ఇంకా నీకు రుణగ్రస్తుడినే…’’

‘‘ఇలాంటి విషయాలు గుర్తు చేయటానికా నా దగ్గరకు వచ్చింది! నేను ఆ అప్పు నుండి బయట పడాలి అని నీకు బలంగా వుంటే మీ కేస్ట్‌లో మంచి వాళ్లకి డొనేట్‌ ‌థ•య్యి’’.

‘‘నీ దాతృత్వం అలానే వుంది’’.

‘‘ఈ డబ్బు ఎవరిది దాసూ… మనం సంపాదించాం. ఎప్పటికయినా అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాలి. ఇక్కడ దాతలూ స్వీకరించే వారంటూ వుండరు’’ అన్నాడు రామకృష్ణ.

‘‘మా అబ్బాయి మంచి స్థాయిలో వున్నాడు. అమ్మాయి కుటుంబం కూడా అంతే. మనవళ్లు, మనవరాళ్లు వున్నారు. కొంతమంది ఎబ్రాడ్‌లో వున్నారు’’.

‘‘అన్ని దేశాలూ చుట్టి రావాల్సింది దాస్‌’’.

‘‘‌నువ్వు ప్రపంచాన్ని చూసావు. నాకు కూడా ఒకప్పుడు నావాళ్లు అమెరికా వెళ్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్తున్నారు అని గర్వంగా వుండేది. అప్పట్లో నాకు కులాభిమానం వుండేది. మా అబ్బాయి దాన్ని బ్రేక్‌ ‌చేసాడు. వేరే కులం అమ్మాయి మా కోడలు. వేరే మతం అబ్బాయి మా అల్లుడు’’.

‘‘అందుకు బాధగా వుందా?’’

‘‘ఏ మాత్రం లేదు’’.

ఇద్దరూ నవ్వుకున్నారు.

‘‘ఇంకా ఇక్కడే ఈ కులం లుకలుకలు. ఇంకో ఫిఫ్టీ యియర్స్ ‌తర్వాత కులం-మతం-దేశం లేని మనుషులు ఈ ప్రపంచంలో సగం వుంటారు. అదలా వుంచు… ఇప్పుడు కృష్ణదాస్‌ ‌వాళ్ల కుటుంబానికే అవసరం లేదు’’.

రామకృష్ణ చిన్నగా తలూపాడు.

‘‘ఎవరి ప్రపంచం వారిది. ఇంకొకరిని అందులోకి అడుగు పెట్టనీయరు. అందుకనే నేను ఒంటరిగా బతుకుతున్నాను’’.

‘‘ఇప్పుడు నా కుటుంబం గురించి చెప్పుకోవా లంటే….’’ అని మాట్లాడలేక పోయాడు. అతన్ని నిశితంగా చూస్తున్నాడు. మెల్లగా కంట్రోల్‌ అయ్యాడు.

‘‘మా మనవడు ‘గే’. మా మనవరాలు పెళ్లి చేసుకోదు. సహజీవనం మాత్రం చేస్తుంది. వాళ్లు తమ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తుంటారు. ఇంకా ఇద్దరు న్నారు. వాళ్లు ఇండియాలో లేరు. వాళ్ల సమాచారం నాకు తెలియదు. రేపు ఎలా తయారవు తారో కూడా నా ఆలోచనలకు అందదు. ఇవన్నీ చూడటానికా నేను బతికి వున్నాను అనిపిస్తుం టుంది’’.

‘‘దాసూ మనం యస్టర్‌ ‌యిమర్స్ అం‌టుంటాం. మనం ఆ కాలానికి చెందిన వాళ్లం’’.

‘‘నువ్వు కూడానా?’’

‘‘మనం ఆకాశం నుండో, ఇంకో గ్రహం నుండో దిగి వచ్చామా? మనందరం ఎక్కడో ఫెయిల్‌ అయ్యాం. ఇంత టెక్నాలజీ వస్తుందని, ఇంత మనీ చెలామణిలోకి వస్తుందని నాలాంటి వారే ఊహించ లేదు. వీలయితే ఈ మార్పుల్ని అర్థం చేసుకోవాలి. అది మన మనసుకు కష్టం అయినప్పుడు వదిలేయాలి. అప్పుడు ప్రశాంతంగా వుంటాం. ఆకాశంలో వెన్నెల్ని చూస్తాం. ఇంద్ర ధనుస్సులు చూస్తాం. ఒట్‌ ‌వి కెనాట్‌ ‌ఛేంజ్‌ ‌దెమ్‌. అవునా?’’

‘‘ఏమో… ఎవరూ ఎలాంటి ప్రయత్నం చేయక పోతే ఇంకా వికృతం అయిపోదూ…’’

‘‘అందుకు ఒకటే మార్గం. మనుషుల మధ్య మనీ వుండకూడదు. ఆయుధాలు వుండకూడదు. ఒక్క ప్రేమ మాత్రమే వుండాలంటే ప్రపంచాల మధ్య గీతలనేవి వుండకూడదు. ఇవన్నీ సాధ్యం అవుతాయంటావా?’’

‘‘మనం చూడలేం’’.

‘‘మనమే కాదు. మానవజాతి చరిత్రలో చాలా జనరేషన్స్ ‌చూడలేవు. అంతిమంగా ప్రకృతికి కోపం వస్తుంది. ఏ అణుబాంబులూ చేయలేని విధ్వంసం అది చేస్తుంది. బిగ్‌ ‌బ్యాంగ్‌ అం‌టాం. అప్పటి దాకా జరిగే నాటకం ఇది’’.

‘‘ఫిలాసఫిలోకి వెళ్లిపోయావు’’.

‘‘లేదు. అది కూడా ఖరీదయిందే’’.

అప్పుడు కారు ఆగిన శబ్దం. అటు చూసాడు దాసు.

గోవింద్‌ ‌బుద్ధా… రిత్విక్‌లు వస్తున్నారు.

‘‘నమస్తే బుద్ధా గారు’’ అన్నాడు.

‘‘లోపల కూర్చోకపోయారా?’’.

‘‘రామకృష్ణ వాకింగ్‌ ‌చేస్తుండగా వచ్చాను. ఇక్కడే సెటిలయిపోయాం’’.

‘‘మాట్లాడుతుండండి’’ అని రిత్విక్‌తో లోపలకి వెళ్లిపోయాడు.

‘‘గోవింద్‌ ‌బుద్ధా చాలా ఎదిగిపోయాడు. మీ గురించి చాలా ప్రయత్నం చేసాను. చివరికి తెలిసింది గోవింద్‌ ‌మాత్రమే మీ గురించి చెప్పగలడు. అతనికి మాత్రమే తెలుసని’’.

‘‘య్యా… య్యా…. ఐ లైక్‌ ‌హిమ్‌… ఐ ‌లవ్‌ ‌హిమ్‌’’ అన్నాడు రామకృష్ణ.

‘‘డ్రింక్‌ ‌చేస్తావా రామకృష్ణా!’’

‘‘ఇంజూరియస్‌ ‌టూ హెల్త్…. ‌స్మోకింగ్‌ ‌కిల్స్’’ ‌నవ్వాడు.

‘‘నాకు టీనేజ్‌ ‌నుంచి అలవాటు’’.

‘‘ఎప్పుడన్నా మెడిసిసిన్‌లా తీసుకుంటాను దాస్‌’’.

‘‘‌మీ కుటుంబం గురించి చెప్పండి’’.

‘‘అది పెద్ద వంశవృక్షం. నేను మరిచి పోయేంతగా… అవన్నీ ఇప్పుడు వద్దు. సరదాగా కలుసుకున్నాం. మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. ఇదో సెలబ్రేషన్‌ అనుకుందాం. నువ్వు నాకు బాగా గుర్తుండటానికి కారణం నీ పాట. అప్పుడు చాలా అద్భుతంగా పాడేవాడివి’’.

‘‘ఇంకా గుర్తుందా?’’

‘‘ఇలాంటివే గుర్తుంటాయి. ఈ రోజు నువ్వు నాకు ఆ పాటను కానుకగా ఇవ్వాలి. నువ్వు సంగీతకారుడిగా ఎదుగుతావనుకున్నాను’’.

అప్పుడు అతని ముఖంలో విషాదం కనిపించింది.

‘‘నాకూ అలాంటి ప్రయత్నం చేయాలని వుండేది కృష్ణా… మన ఇద్దరి పేర్లలో కృష్ణుడున్నాడు. ఇప్పుడు ఆడవాళ్లు కొంత మంది మాలోని అన్ని కళల్ని, ప్రతిభని అణిచివేస్తున్నారు అంటారు. వాళ్లని నేను తప్పు పట్టటం లేదు. నేను నా కుటుంబం కోసం నా పాటను త్యాగం చేసాను. ఇప్పుడు నా కుటుంబా నికి నిన్నటి నా శ్రమ అవసరం లేదు. నా పాటలు, కలలు అవసరం లేదు. కుటుంబం ఓ మిథ్య రామకృష్ణా….!’’

‘‘నీతో నేను డిఫర్‌ అవుతున్నాను దాస్‌… ‌కుటుంబం ఏర్పడటమే మిథ్య అని బ్రేక్‌ ‌చేయటానికి, బ్లడ్‌ ఈజ్‌ ‌థిక్కర్‌ ‌దేన్‌ ‌వాటర్‌ అన్నారు’’.

‘‘మనకు ఏ సెంటిమెంటూ లేకపోతే ఎవరి కోసం పని చేయాలి? ఏ మార్పులకి, ఏ వెలుగుల కోసం? ఏ స్వర్గాల కోసం?’’ అన్నాడు.

అతన్ని తన్మయత్వంతో చూస్తున్నాడు దాసు.

********

ఆ రాత్రి అందరూ రూఫ్‌ ‌మీదకి చేరిపోయారు.

మధ్య మధ్యలో కాస్త స్కాచ్‌ ‌సేవిస్తుంటే కృష్ణదాసు పాడుతున్నాడు.

అలనాటి జానపద గీతాలు, ఒకటి రెండు పాత సినిమా పాటలు. చందమామ వెలుగులు, చందమామను సుతారంగా అడ్డుకుంటున్న చిన్న మేఘాలు…

‘పాట వినాలి పిల్లలూ’ అంటున్న చందమామ!

ఇప్పుడు ఓ చిరుజల్లు పడితే ఎలా వుంటుంది అనుకున్న రిత్విక్‌!

‘‘ఇం‌తకు మించిన వాన చినుకులు కావాలా’’ అంటున్న చిరుగాలి.

మరీ ముఖ్యంగా గోవింద్‌ ‌బుద్ధ పరవశాన్ని రిత్విక్‌ అం‌త దగ్గరగా చూడటం మరిచిపోలేని అనుభవం.

అప్పుడు గోవింద్‌ ‌చిన్న గజల్‌ అం‌దుకున్నాడు.

రామకృష్ణ కళ్లల్లో ఆశ్చర్యం!

గోవింద్‌ ‌పాడుతుంటే ఆయన బుగ్గ మీద నుండి జారుతున్న కన్నీళ్లు… ఎవరి కోసమో అన్వేషణ… ఎదురుచూపులు. అతని గుండెను అక్షరాలుగా మలిచి అందిస్తున్న గజల్‌.

అయిపోయాక రామకృష్ణ లేచి కౌగలించు కున్నాడు.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE