‘ఇంతగజెప్పనేల హృదయేశ్వర! మీకేది ఇష్టమో అదే సంతసమౌను నాకును’ అంది ఊర్మిళ. లక్ష్మణ సతీమణి. అంతేకాదు ‘ప్రసన్న సుమంగళమూర్తి ఊర్మిళాకాంత యటంచు బేర్వడి అఖండ యశస్విని నౌటకన్న అత్యంత శుభోదయమ్ము కలదా- వసుధాస్థలి జీవితేశ్వరా!’ అని పలికింది. భారతీయతకు అక్షరపతాక, ప్రతీక రామాయణ మహాకావ్యం. అందులోని కీలకపాత్ర ఊర్మిళాదేవి. విస్మృతం కాదు..  విస్తృతం. తన భర్త…. అన్నగారి కోసం చేసినంత త్యాగాన్నే తానూ ప్రియవిభుడి పరంగా చేసింది. పూర్వాపరాలు పరిశీలిస్తే- సీతాలక్ష్మణ సహితంగా వనవాసం చేస్తున్నాడు రామభద్రుడు. మరో సోదరుడు భరతుడు సకల పరివారంతోనూ అక్కడికి వెళ్లాడు. అయోధ్యకు తిరిగి రావాలని ఎంతగానో అర్థిస్తున్నాడు. అదే ప్రాంతంలోని పర్ణశాలలో ఉన్న ఊర్మిళ దరికి చేరుకున్నాడు లక్ష్మణుడు. కన్నీటి పర్యంతమైన ఆమెను ఎంత కరుణార్ద్ర హృదయంతో పలకరించాడో, మనసు తెలిసి మసలిన సతి ఇంకెంతగా బదులిచ్చిందో  వర్ణించారు  పలువురు  కవులు. ఆ వివరాలు మహిళాశక్తిని అడుగడుగునా నిరూపిస్తాయి.

‘‘నీ భక్తి, పవిత్ర అనురక్తి, సంయుక్త త్యాగశక్తి నిరుపమానం అన్నాడు లక్ష్మణుడు. శ్రీకరం, సౌభాగ్య భాగ్యకరమైన నీ సహాయాన్ని అర్థిస్తున్నానన్నాడు. మనది సత్యసాంగత్య దాంపత్యమని, నీ ఉన్నతితో శాశ్వత ఉన్నతి సిద్ధిస్తుందని పలికాడు. అలనాడు స్వయంవర మహాసభలో చక్కదనాల చుక్కగా సుమధుర హాసవిలాసంతో నిలిచావు కదూ! అని గుర్తుకు తెచ్చాడు. అప్పుడు నీ నవ్వుతోపాటు పూలమాలికలూ హసించాయిలే అంటూ చమత్క రించాడు. ప్రణయ భాగ్యేశ్వరీ అని సంబోధించి, అదే సందర్భంలో ‘నీ కళ్లలోని అశ్రుకణాల్ని చూశా’నని వెల్లడి చేశాడు. కాదా మరి? మునుపు తాను ‘నేనూ అడవికి వెళ్తున్నా’ అన్నపుడు, సుస్థిర స్వరాన్ని వెలువరించేలా ప్రకటించినపుడు, క్షణకాలం ఆగిందామె. అప్పుడు తళుక్కుమని వెలిగి ఆగిన మందహాసంలో ఏ భావం దాగుందో, దాన్ని వ్యక్తపరచిన ఊర్మిళా దేవికే తెలుసు, పరిపూర్తిగా.

ధైర్యబోధలు ఎవరికి ఎవరు చేశారు?ఆ దంపతుల కళ్లు చెమర్చాయి. ఇరువురి మనో మందిరాల్నీ నిశ్శబ్ద జ్ఞాపకాలే ఆవరించాయి. ‘దైన్యం వద్దు ప్రియతమా! నీకు నువ్వే నిబ్బరాన్ని తెచ్చుకో’ అని లక్ష్మణుడు ఆమె భుజం తట్టాడు. ‘మహత్వ సత్వం ఉన్నదానివి; నీ సహానుభూతి, సహకార భావననే కోరుకుంటున్నా’ అన్నాడు. నా కోసమే నువ్వు పరితపిస్తూ కృశిస్తూ ఉంటే, నేను అక్కడ అటవీ సీమలో అన్న వెంట ఎలా ఉండగలన న్నాడు. ఆత్మబల సాధన ప్రస్తావనే ఇద్దరిలోనూ. ‘ఇది సుచరిత్ర. జగతిలో ఆదరణీయుల్ని చేస్తుంది. నువ్వు వాస్తవికతను గ్రహించు. నన్ను అనుగ్రహించు. చింతకాదు కావాల్సింది, చింతన. కర్తవ్య అనుసరణ అయ్యాక తిరిగి వస్తాను. ఇక్కడ నువ్వూ పెద్దల యోగ క్షేమాలు చూస్తూ ఉండు’ అంటూ మనసును కుదుటపరిచాడు. అప్పుడు ఆమె

ఎంచి మీయాన శిరసావహించుకన్న

ధృతి వహించి భవత్కాంక్ష దీర్చుకన్న

మీకు సహకారమొసగ శ్రమించుకన్న

ఊర్మిళకు భాగ్యమన్న వేరున్నదేమి!

అనడమే మనోబలానికి ప్రబల తార్కాణం. ఆమె జీవన యానం దీపశిఖలా ప్రభావితం. త్యాగం అనే పదానికి ప్రత్యక్షర రూపం. తొలి నుంచీ మితంగా, హితంగా మాట్లాడుతుండేది. సహనశీలతలో మిగతా అందరికన్నా మిన్నగా ఉంటుండేది. అందరితోనూ గౌరవ మర్యాదలతో, ఆదరాభిమానాలతో వ్యవహ రిస్తూ ఉండేది. రామాయణ మంతా కార్యకారణ సంబంధ పూరితమే. సరిగ్గా ఆ క్రమంలోనే, భర్త నిర్వహణలోని లోకోత్తర కార్యానికి తన వంతుగా ఉపకరించింది.

యువతిగా ఆమెవి బంగారు కలలు. వివాహ జీవితాన్ని సుమనోహరంగా తలుచుకుంది. వెనువెంటనే అయోధ్యా నగరానికి పయనమైంది. తనదైన ఆ ఆనందానుభూతికి ఎక్కడా అవధి అంటూ లేదు. బావగారు రామచంద్రుడికి రాజ్యపట్టాభిషేకం మరికొన్ని గంటల్లోనే. ఈ లోగా లక్ష్మణుడూ మహోత్సవ సభకు సంసిద్ధమవుతున్నాడు. ఆయనతో కలిసి సంతోషమంతటినీ పంచుకోవాలని అలంకృత అవుతోంది ఊర్మిళ.

ఇంకొంత సమయం గడిచాక, లక్ష్మణ దర్శనం. రాజకుమారుడిగా కాదు, మునివర్యుడిగా! నిమిషాల తరబడి మౌనమే రాజ్యమేలింది. అటు తర్వాత అసలు విషయం వెల్లడయింది. రాముల వారికి పట్టాభిషేకం ఆగిపోవడం, సీత సహా అరణ్యవాస పరిస్థితి కలగడం, వెంట వెళ్లేందుకు లక్ష్మణుడు సిద్ధమవడం.

అనంతర రీతిలో ఊర్మిళను లక్ష్మణుడు ప్రేమ పూర్వకంగా దీవించాడు. మందిరం నుంచి భారహృదయంతో నిష్క్రమించాడు. అన్నా వదినలకు ఆయన చేసిన సేవలో, వారి గురించి కనబరచిన శ్రద్ధాసక్తుల్లో పరోక్ష భాగస్వామ్యం చాలా మటుకు ఊర్మిళదే. నిర్ణీతకాలం కాగానే, పతి వచ్చేంతవరకూ, ఆమెవి ఎదురుచూపులే. కాలాన్ని ఆమె లెక్కించుకుందా? అంటే, కానే కాదు. ఆ కాలమే తనను తాను లెక్కించుకుందని అనుకోవాలి. ఆ రీత్యా ఆమె ఒక స్థిరశక్తి సంపన్నురాలు. కృతనిశ్చయంలో యోధురాలు. గెలవడమే తప్ప ఓటమి అనేదే తెలియనంతటి దక్షురాలు. ఎన్నో విధాలుగా తానొక విజేత. భర్త మానసాన్ని గెలుచుకుంది. అపార విశ్వాసాన్నీ సొంతం చేసుకుంది. సముచిత మార్గంగా అనుకున్న తీరునే నడిచి నిలిచింది. ఎప్పుడు ఎటువంటి వైపరీత్యం ఎదురైనా, సదాశను కోల్పోకూడదని నిరూపించింది. హృదయంలో స్థానం, దాన్ని ఎలా పదిలపరచుకోవాలో ఆచరించి చూపింది.

అనుకున్న సమయం రానేవచ్చింది. పతి స్పర్శ, పరామర్శ ఆమెలో అపూర్వ, అపురూప తేజస్సు నింపింది. సతి దర్శనం, పరిష్వంగనం ఆయనలోని ఆశావాదాన్ని వెల్లివిరిసేలా చేసింది. ‘అగ్రజ పట్టా భిషేకం రేపే’ అవడంతో, ఒక్క ఊర్మిళ అంతరంగ మేనా… కాదు కాదు.. ఆ మందిరం సమస్తం పరమాద్భుత అనుభూతితో నిండిపోయింది.

రామప్రభువును ఊర్మిళ ఏం కోరిందో తెలుసా? ‘మీ పాదపద్మాల ముందు ఎవరు ఏం సమర్పించినా సరే – అదంతా నా చేతుల మీదుగా చేరేలా అనుగ్ర హించండి’ అని. అదీ ఆమె వ్యక్తిత్వం, మూర్తిమత్వం.

అందుకే ఆమెను ఎందరెందరో ఈనాటికీ ఆరాధిస్తున్నారు. గుండె గుడిలో కొలువుదీర్చి సమర్చన సాగిస్తున్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ ‌ప్రాంతంలో ఊర్మిళ ఆలయముంది. అది ఇప్పటిది కాదు. పలు దశాబ్దాలకిందట అక్కడి పాలకులు నిర్మించింది. రాజ దేవాలయంగా పరిగణిస్తుంటారు ఇప్పటికీ. అలాగే మన తెలుగునాట కూడా మెదక్‌ ‌ప్రదేశంలో మందిరం ఏర్పాటై ఉంది. అక్కడ రామ సోదరులతో పాటు వారి సతీమణుల విగ్రహాలూ నెలకొన్నాయి.

వాల్మీకి విరచిత రామాయణంలో ఊర్మిళ పాత్ర పరిమితమే. ప్రత్యేకత మాత్రం అనంతం. మరొక సందర్భంలో లక్ష్మణుడు ఏమన్నాడు? సతి ఊర్మిళ లేనిదే తను జీవించలేనన్నాడు. వనవాసంలో ఉన్నంత కాలమూ తనకు నిద్ర, ఆహారం రెండూ లేవన్నాడు. కవి వర్ణనను ఇక్కడ పొందుపరిస్తే… ‘నిన్ను బాసినది మొదలూ ప్రాణసఖి నిద్రహారములెరుగను / నీవు లేవకయున్ననూ ఓ సఖీ ప్రాణములు నిలుపలేను.’ ఇది ఆమె విశిష్టతను ప్రస్ఫుటం చేసే కథనాంశం.

పట్టాభిషేకం దరిమిలా శ్రీరాముడూ ఊర్మిళను ప్రశంసించాడు. ‘ఎంతో కాలం వనవాసం చేశాం మేం ముగ్గురం. మాతో నువ్వు ప్రత్యక్షంగా లేవు కానీ, సహకారం సమస్తమూ నీదే. అయోధ్యలో నువ్వు చేసిన త్యాగమే మమ్మల్ని అక్కడ అడవిలో ఎన్నో సమస్యలు తట్టుకునేలా చేసింది. ధన్యులమమ్మా’ అంటాడు అపార ఆదరపూర్వకంగా.

శ్రీరామభద్రు లోకారాధ్య మహిమ

సౌమిత్రి భ్రాతృసేవా మహత్త్వమ్ము

భరతుని సౌభాత్ర భావబలమ్ము

శత్రుఘ్నమూర్తి ప్రశస్త విక్రమము

అనంతర క్రమంలో –

ఆర్య వశిష్ఠుష్టునాచార్యకత్వమ్ము

గాధినందను కృపా కల్పితాస్త్రమ్ము

ముని సతీ శాపమోక్షణ విధానమ్ము

శివధనుర్భంగ ప్రసిద్ధ శౌర్యమ్ము

ఆ వెంటనే సంవిధానంగా

జానకీ పరిణయోత్సవ వైభవమ్ము

జనక భూవభు మనస్సంతోష భరము

కైకయీ దుష్టభావాకల్పనమ్ము

ప్రభువినాశకమైన పట్టభంగమ్ము

జానకీరామలక్ష్మణ నివాసమ్ము

ఇదే సందర్భంలో, ఘట్టంలో, ఊర్మిళ వర్ణన వనితల అంతరంగానికి దర్పణం. ‘నానార్థ విపుల రత్నాకరోపమము / స్వర విశిష్ట కుశలవ ప్రసారితము /ధర్మార్థ కామ సంధాన తత్పరము/కరుణామయమ్ము జగద్ధి తాత్మకము’ రామాయణం. వాల్మీకి తదుపరి వచ్చిన అనేకానేక రామాయణాలూ ఊర్మిళ ప్రశస్తిని విశదీకరిస్తూనే ఉన్నాయి.

ఆమె త్యాగనిరతి, బుద్ధికుశలత, దూరదృష్టి, సంకల్ప సామర్థ్యం అసాధారణం. ఇంతకుముందే ప్రస్ఫుటం చేసినట్లు – ఊర్మిళది విస్మృత పాత్ర కాదు, విస్తృత జీవనయాత్ర. వనితా లోకాన ఆమె ప్రాధాన్యం, ఉన్న గౌరవం, పొందిన గుర్తింపు, కలిగించిన ప్రభావం అన్ని విధాలా విశిష్టమైనవే. అత్యంత సాహిత్య, చారిత్రక, సాంస్కృతిక సంపద రామాయణమైతే; వనితల పాత్రలకు సంబంధించి ఆమెది మరువలేని, మరపురాని ధీరోదాత్త చిత్రీకరణ. త్యాగమయి, అనురాగమయిగా ఊర్మిళది స్థిర, చిర, సురుచిర ప్రశస్తి!

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE