ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

– చంద్రశేఖర ఆజాద్‌

‌రిత్విక్‌ ‌మాట్లాడలేదు.

‘‘విజయం ఓ మత్తు రిత్విక్‌. ‌బతికి వున్నంత వరకూ ఓ మెట్టుకూడా దిగకూడదు అనిపిస్తుం టుంది. ఒకప్పటి రచనలు వేరు. ఇప్పటి పాఠకులు వేరు. అందుకే నీ రచనలు ఎన్నో తిరస్కరించాను. నా మీద వచ్చే విమర్శలు నాకు తెలుసు. చెత్త కథలకు, నవలలకు బహుమతులు ఇస్తాననుకుంటారు. ఆ రచనల గురించి నాకు తెలుసు. కొన్ని రచనల్లోని గాఢతను మామూలు పాఠకులు భరించలేరు. నన్ను విమర్శించేవారు నేను ప్రచురించిన మంచి రచనల గురించి మాట్లాడరు. నువ్వు అలానే అనుకుంటావా?’’

‘‘ఎవరి స్ట్రాటజీలు వారికుంటాయి సర్‌. ‌సాధారణ ప్రచురణకి అంగీకరించ నప్పుడు కోపం వస్తుంది. నేను పత్రిక పెట్టినా అలాంటిది వుంటుంది’’.

‘‘పత్రిక పెట్టే ఆలోచన వుందా?’’

‘‘ఈ వయసులోనా! నా పుస్తకాలను ప్రచురించు కుంటే చాలు’’.

గోవింద్‌ ‌నవ్వాడు. కారు ముందుకు సాగుతోంది.

* * * * *

రిత్విక్‌ని ఓ ఇంటి ముందు దింపారు.

‘‘ఇది మన గెస్ట్ ‌హౌస్‌. ‌నువ్వు ఇక్కడ వుంటావు. ఇక్కడ నీకు ఏం కావాలన్నా మన వాళ్లున్నారు. కిచెన్‌ ‌వుంది. నేను రాత్రికి వస్తాను’’ అని గోవింద్‌ ‌వెళ్లి పోయాడు. ముందుగా హీటర్‌ ‌స్విచ్‌ ఆన్‌ ‌చేసాడు రిత్విక్‌. ఇం‌టి దగ్గర హారికకు ముందే చెప్పాడు. నేను విజయవాడ చేరుకున్నాక ఫోన్‌ ‌చేస్తాను. నువ్వు చేయవద్దు అని.

‘‘ఇప్పుడే గెస్ట్ ‌హౌస్‌కి చేరుకున్నాను. ఇక్కడ చాలా కంఫర్ట్‌గా వుంది. నేను పిల్లల్తో మాట్లాడతాను. పాస్‌పోర్ట్ ‌వచ్చేదాకా నువ్వు ఇంటి దగ్గర వుండు. తర్వాత నీ ప్రయాణం గురించి ఆలోచించుదాం. రాత్రి పూట మీ అక్కను నీ దగ్గరకు రమ్మను. తను ఖాళీగానే వుంది కాబట్టి పది రోజులు నీ దగ్గర వుండమను’’ చెప్పాడు హారికకు.

‘‘ఎందుకు రమ్మన్నారో దారిలో చెప్పారా?’’

‘‘ఇంకా లేదు. ఆయన చెప్పాక నీతో మాట్లాడ తాను’’.

‘‘అప్పుడప్పుడు మీరు ఫోన్‌ ‌చేయండి. మీరు ఎలాంటి మీటింగ్స్‌లో వుంటారో నాకు తెలియదు. నేను డిస్ట్రబ్‌ ‌చేయటం బాగుండదు’’.

‘‘అలాగే’’.

ఇంకొందరు మిత్రులతో మాట్లాడాడు.

తర్వాత ఇద్దరు కొడుకులతో మాట్లాడి స్నానం చేసాడు. అక్కడ గోవింద్‌ ‌బుద్ధ పత్రికలున్నాయి. అలాగే అన్ని రకాల దినపత్రికలు వున్నాయి. ఓ చోట ర్యాక్స్ ‌నిండా రకరకాల పుస్తకాలు, గోడల మీద గోవింద్‌ ‌చిత్రపటాలు వున్నాయి. పుస్తకాలను చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. అన్నిరకాల పుస్తకాలు వున్నాయి. అన్నీ వందల్లో, వేలల్లో వున్న పుస్తకాలు-ఖరీదైనవి.

తన గదిలో టేబుల్‌ ‌వుంది. దాని మీద లెటర్‌ ‌ప్యాడ్‌వుంది. రకరకాల రంగుల ఎ-4 పేపర్స్ ‌వున్నాయి. అన్ని రంగుల పెన్స్ ‌వున్నాయి. అందమైన కుర్చీ వుంది. అత్యంత ఆధునికమైన లెడ్‌ ‌టీ.వి. వుంది.టేబుల్‌ ‌ల్యాంప్‌ ‌వుంది. ఇదో క్రియేటివ్‌ ‌రూమ్‌లా వుంది.

 ప్రపంచాన్ని మరిచిపోయి రాసుకోవచ్చు ఇక్కడ.

అంతలోనే అతనికి మార్కస్ ‌గుర్తొచ్చాడు.

ప్రపంచానికి కొత్త మార్గాన్ని నిర్దేశించిన ఆ మహ నీయుడు రాసుకోవటానికి ఇంక్‌ ‌కోసం, కాగితాల కోసం తన కోట్‌ని తాకట్టు పెట్టవలసి వచ్చింది. తనకు కావలసిన సమాచారం కోసం ఆయన లైబ్రరీకి వెళ్లాడు. కోట్‌ ‌లేదని ఆయన్ని లోపలకు రానీయలేదు. మళ్లీ కోటును విడిపించుకోవటానికి చేసిన ప్రయ త్నంలో అతను కొని తెచ్చుకున్న సిరా ఎండి పోయింది.

ఇది చదివినప్పుడు మనసు బాధతో వూగి పోయింది. చరిత్రలో ఇలాంటి మహానుభావులు ఎందరో వున్నారు. అలాంటి వారిని తలుచు కున్నప్పుడు మాత్రం మనం ఎందుకు రాస్తున్నాం? ఎవరి కోసం రాస్తున్నాం? అన్న బాధ కలుగుతుం టుంది.

ఏదిఏమైనా ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. బాదరబందీ, ఆర్థిక సమస్యలు లేకపోతే, ఇలాంటి అవకాశాలుంటే గొప్ప సృష్టి జరగవచ్చు అను కున్నాడు.

అంతలోనే నవ్వు వచ్చింది.

ఇలాంటి అవకాశాలు వున్నవారు ఈ దేశంలో చాలా మంది వున్నారు. అంత మాత్రాన గొప్ప సృజన జరగటం లేదని.

దారిలో గోవింద్‌ ‌గారి ఆరోగ్యం గురించి అడగా లనిపించింది. అయినా ధైర్యం చేయలేకపోయాడు. ఇంతకు ముందు పసివాడిలా హాయిగా నవ్వే ఫోటోలు చూసాడు. ఇప్పుడు కాస్త లావు అయ్యారు. అంతే… తనకే రకరకాల సమస్యలు వచ్చాయి. గోవింద్‌ ‌తన కంటే ఏడు సంవత్సరాలు పెద్దవారు. శారీరక సమస్యలు రాకుండా ఎలా వుంటాయి!

‘‘చూద్దాం. ఆయనే చెబుతారు’’ అనుకున్నాడు.

* * * * *

రాత్రి తొమ్మిది గంటలవుతోంది.

అంతకు ముందు ఆయన ఫోన్‌ ‌చేసి చెప్పారు.

‘‘మనం డిన్నర్‌ ‌కలిసి చేద్దాం. కాస్త ఆలస్యం అయినా నువ్వు వెయిట్‌ ‌చెయ్యి’’. గోవింద్‌ ‌ముందు నుండి సంస్థలోనూ, వ్యక్తిగతం గానూ ఓ క్రమశిక్షణను ఏర్పరిచాడు. అక్కడికి ఎవరు వెళ్లినా తగిన మర్యాదలు జరుగుతాయి.

అక్కడి స్టాఫ్‌ ‌ముందు కూర్చోమంటారు. తర్వాత అటెండర్‌ ‌మంచి నీళ్లు తీసుకుని వస్తాడు. కాఫీ, టీ, ఏది కావాలంటే అది యిస్తారు. గోవింద్‌జీని కలవాలంటే మాత్రం ప్రాసెస్‌ ‌వుంటుంది.

సాధారణంగా ఆయన్ని ఆఫీసు సమయంలో కలవటం అరుదుగా వుంటుంది. తాను రమ్మంటే తప్ప బయట నుండి వచ్చిన వారు కలవలేరు. అందులోనూ అనేక ప్రాంతాల నుండి రచయితలు, పాఠకులు వస్తుంటారు. వారందరినీ కలిసి మాట్లాడటం మొదలుపెడితే ఆఫీస్‌ ‌పని చేసుకోవటం వుండదు.

మధ్యాహ్నం కొంచెం సేపు నిద్రపోయాడు. తర్వాత అక్కడున్న పుస్తకాల్లో ఒకటి తీసుకుని చదివాడు. అప్పుడు దారిలో వస్తున్నప్పుడు తన పిల్లల గురించి అడిగిన సంగతి గుర్తు వచ్చింది. ఎందుకలా అడిగారు? మామూలుగా అడిగారా? ఇంకేదయినా కారణం వుందా? అనిపించింది.

నిజానికి పిల్లల గురించి రిత్విక్‌ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. వారి గురించి హారిక చూసుకుంది. తను కూడా తక్కువ చదువుకుంది. హోమ్‌ ‌మేకర్‌గా మొదటి నుంచి వుంది. హారిక కూడా ఉద్యోగం చేసి వుంటే ఎలా వుండేదో తెలియదు. ఇప్పుడు అనుమానం వస్తోంది.

ప్రపంచంలోని ఎంతటి సెలబ్రెటీలయినా పిల్లల విషయంలో గట్టి సమస్యలు ఎదుర్కొన్నారు. అరుదుగానే తండ్రిని, తల్లిని మించిన వారు తయారయ్యారు.

‘‘మీరూ మీ రచనలు తప్ప మాకోసం ఎప్పుడు సమయం యిచ్చారు. అసలు మీ ప్రపంచంలో మాచోటు ఏమిటి? మీరు ఓ అందమైన కుటుంబాన్ని తయారు చేసుకోకుండా ప్రపంచం గురించి, మనుషుల గురించి ఎలా మాట్లాడతారు? ఇతరుల జీవితాల్లోకి, మనసుల్లోకి ఎలా తొంగి చూస్తారు?’’ అని అడుగుతున్నట్లు అనిపించింది.

అదే సమయంలో హారిక గుర్తు వచ్చింది.

హారిక నా గురించి ఏమనుకుంటోంది? నాతో జీవితం తనకు కంఫర్ట్‌గా వుందా? రాజీపడి బతుకుతోందా?

అప్పటికప్పుడు ఫోన్‌ ‌చేయాలనిపించి చేసాడు.

‘‘టీ తాగారా’’ అంది.

‘‘తాగాను. ముందో విషయం చెప్పు. నా గురించి నీ అభిప్రాయం ఏమిటి?’’

‘‘కొత్తగా అడుగుతున్నారేంటి?’’ అంది హారిక.

‘‘ఆలస్యంగా అడుగుతున్నాను. ఇప్పటికయినా అడగకపోతే నేను ఎవరో తెలుసుకునే అవకాశంరాదు అనిపించింది’’.

‘‘మన పెళ్లి జరిగి నలభై రెండు సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు మీకు నా అభిప్రాయం అవసరమా?’’

‘‘అందుకే అడుగుతున్నాను’’.

‘‘తెలుసుకుని ఏం చేయాలని?’’

‘‘తప్పులుంటే సరి చేసుకుందామని?’’

‘‘ఇందుకా మిమ్మల్ని గోవింద్‌గారు పిలిచింది!’’

‘‘ఎందుకు పిలిచారో నాకింకా తెలియదు. కొన్ని ప్రయాణాలు, కొన్ని ప్రశ్నలు మనల్ని వెనక్కి తిరిగి చూసుకోమంటాయి హారికా! రచయితలు సహజంగా ఊహల్లో బతుకుతుంటారు. వారి కల్పన ఊహ. తమ తీరని కోరికల్ని రచనలో చూసుకుంటారు. మా అంత పసిపిల్లలు ఎవరూ వుండరేమో!’’

‘‘నా గురించి మీరు ఏమనుకుంటున్నారు?’’ అంది హారిక.

‘‘ప్రశ్నకు ప్రశ్న సమాధానమా?’’

‘‘మీకే కాదు. అందరికీ అభిప్రాయాలు కావాలి. నేనూ తప్పులుంటే సరి చేసుకోవాలి కదా. నేను మీ జీవితంలోకి వచ్చాక బరువుగా ఫీలయ్యారా? బాధ్యతగానా, ప్రేమగానా?’’

రిత్విక్‌ ‌మాట్లాడలేదు.

‘‘చూసారా మీరు మాట్లాడలేకపోతున్నారు. ఇలాంటి ప్రశ్నలకి అప్పటికప్పుడు సమాధానాలు చెప్పటం కష్టం. జరిగిపోయిన జీవితం గురించి తవ్వుకోవాలి కదా’’.

‘‘నువ్వు మాట్లాడుతుంటే అందులో కవిత్వం వుందనిపిస్తోంది హారికా!’’

‘‘మీ జీవితంలోకి రాక ముందు హారిక వేరు. తర్వాత మీ రచనలకు మొదటి పాఠకురాల్ని నేను. ఆ అలవాటు ఇతర పుస్తకాలను చదివేలా చేసింది. ఎంతో కొంత నేర్చుకుంటాం కదా’’ అని….

‘‘మీరు ప్రశాంతంగా వుండండి. నా గురించో, పిల్లల గురించో ఆలోచించ వద్దు. మనం మాట్లాడు కుంటానికి ఇంకా సమయం వుంది. ఇప్పటి వరకు మనకు చిన్న చిన్న సమస్యలు మాత్రం వచ్చాయి. మన కుటుంబాన్ని కుదిపివేసే సంక్షోభం రాలేదు’’.

‘‘అలాంటిది వస్తుందంటావా?’’

‘‘సామెత చెబుతారుగా.. వాన రాకడా… ప్రాణం పోకడా ఎవరు చెప్పగలరని. ఎవరి జీవితంలో నయినా, ఎప్పుడయినా ఏదయినా జరగవచ్చు…’’ అంది.

వాన…వాన చినుకులు…మానస గుర్తొచ్చాడు. నిజంగానే అతను కథ కోసం చాలా నెలలు ఎదురు చూసాడు. కథ రాయనందుకు కోపం వచ్చి వుంటుంది. వాన చినుకులు ఎవరి కోసం? ఎవర్ని తడపటానికి? అందరూ బయటకు రాకుండా ఇళ్లల్లో కూర్చుని కాఫీలు తాగుతూ కిటికీల నుండి చినుకుల్ని  చూస్తుంటే ఎవర్నీ తాకవు. భూమిలో ఇంకుతుం టాయి. అవును. వాన చినుకులు నేల కోసం, మనుషులు వాన కోసమే ఎదురు చూస్తారు. అందులోనూ తొలకరి వానలంటే మరీ ఉత్సాహం.

అయితే వాన జడివానగా, తుఫాన్‌గా మార వచ్చు. అప్పుడు గాలి తోడయితే, భూకంపం వస్తే, సునామీగా, ఉప్పెనగా మారవచ్చు. కొన్ని దశాబ్దా లుగా అత్యంత శ్రమతో నిర్మించుకున్నవన్నీ కళ్ల ముందు కొట్టుకుపోతుంటే నిస్సహాయంగా చూడాల్సిందే.

వాన చినుకులు రాలని ప్రాంతాలున్నాయి. మనుషులున్నారు. వారి గుండెలు నెర్రెలిచ్చిన నేలలా వుంటాయి.

హారిక మాటలు వింటే మా జీవితాల్లోనూ తుఫాన్‌ ‌రాబోతోందా అనిపించింది రిత్విక్‌కి.

 గెస్ట్ ‌హౌస్‌ ‌బయటకు వచ్చాడు. అక్కడ లాన్‌ ‌వుంది. అందమైన క్రోటన్స్ ‌వున్నాయి. అక్కడ ఓ వయసు మీరిన వ్యక్తి పని చేసుకుంటున్నాడు. మొక్కలకి పాదులు చేస్తున్నాడు.

తలఎత్తి చూసాడు. ఆకాశం కనిపించింది. అప్పుడు చూసాడు. మూడు అంతస్తులుగా ఆ గెస్ట్ ‌హౌస్‌ని కట్టారు. మూడో అంతస్తు మీద ఓ రూమ్‌ ‌కనిపిస్తోంది. ఆ అద్దాలకు తెరలు వేలాడుతున్నాయి.

లోపలకి వెళ్లాడు. అప్పుడు గమనించాడు. అక్కడ లిఫ్ట్ ‌వుంది. పైకి వెళ్లాడు. అక్కడ ఆగాడు. అది కేవలం ఓ రూమ్‌ ‌కాదని అనిపించింది. తాళం వేసి వుంది. పైన రూఫ్‌ ‌గార్డెన్‌ ‌వుంది.

మళ్లీ కిందకి వచ్చాడు. పుస్తకం అందుకున్నాడు.

టీ తాగుతుంటే ఫోన్‌. అప్పుడు ఆరు గంటలు.

పది గంటలకు గోవింద్‌ ‌బుద్ధ వచ్చాడు.

* * * * *

‘‘బోర్‌ ‌కొట్టిందా?’’ అడిగాడు రిత్విక్‌ని.

‘‘లేదు సరే. ఇదో ద్వీపంలా వుంది. అన్ని ఏర్పాట్లు వున్న ద్వీపం. నాలాంటి వాళ్లకు ఇక్కడ బోర్‌ ‌కొట్టే అవకాశాలు తక్కువ’’.

‘‘ద్వీపాల్లో మనకు కావాల్సిన మనుషులు లేకపోతే….’’ అన్నాడు బుద్ధ.

రిత్విక్‌ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇద్దరూ ఫస్ట్ ‌ఫ్లోర్‌ ‌హాల్లో వున్నారు. ఆయన వెళ్లి ఓ స్కాచ్‌ ‌బాటిల్‌ ‌తీసుకు వచ్చి చూపించి…

‘‘ఇది ఫర్వాలేదా? లేదంటే నువ్వు వెళ్లి నీకు నచ్చింది సెలక్ట్ ‌చేసుకో రిత్విక్‌’’.

‘‘‌నేను….’’ అంటూ ఆగిపోయాడు.

‘‘అకేషనల్‌గా డ్రింక్‌ ‌చేస్తానని చెప్పావు కదా!’’

తలదించుకున్నాడు.

‘‘నా ముందు డ్రింక్‌ ‌తీసుకోవటానికి యిబ్బంది పడుతున్నావా! నాకు స్మోకింగ్‌ అలవాటు వుండేది. మా నాన్న దగ్గర మాత్రం తాగేవాడ్ని కాదు-పెద్దయ్యాక కూడా. మీ పిల్లలు స్మోక్‌ ‌చేస్తారా?’’

‘‘నాకు తెలిసి చేయరు సర్‌’’.

‘‘‌సరే. కూర్చో’’ అన్నాడు నవ్వుతూ.

ఇంతలో ఓ సర్వెంట్‌ ‌వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లాడు.

‘‘మనం ఇల్లుకట్టుకోవాలనుకుంటాం. ఎందుకు? అందరం కలిసి బతకాలి అని. గృహప్రవేశం చేస్తాం. పాలు పొంగిస్తాం. ఆ ఇంటి నుంచి ఒక్కొక్కరూ వెళ్లి పోతుంటారు. చివరికి ఇద్దరు మిగులుతారు. వాళ్లు భార్యాభర్తలు. అందులో ఒకరు వెళ్లిపోయా రనుకో..అప్పుడేం జరుగుతుంది’’ అన్నాడు గోవింద్‌.

అతన్నే చూస్తుంటే…

‘‘క్రమంగా శిథిలం అవుతుంది. మనం శిథిల భవనాలను ఎన్నో చూస్తుంటాం. ప్రతిదాని వెనకాల ఓ కథ వుంటుంది కదూ….’’

‘‘అవును సర్‌’’.

‘‘‌చీర్స్’’ అన్నాడు. తర్వాత…

‘‘మొదటిసారి కట్టుకున్న ఇల్లు క్రమంగా ఇరుకవుతుంది. ఇంకాస్త పెద్ద ఇల్లు కావాలి. ఎక్కువ గదులు వుండాలి అనుకుంటాం. డబ్బులు వస్తుంటాయి. అప్పుడు కట్టేవి మన కోసం కాదు. మన ఇగోని సంతృప్తి పరుచుకోవటానికి. నువ్వు ద్వీపం అంటున్నావు. అప్పుడప్పుడు మనుషులకి అలా ద్వీపాలకు పరుగులు తీయాలనిపిస్తుంది. ముఖ్యంగా భావుకులకి. అక్కడ ఓ ప్రేయసి లేకుండా, కనీసం లైఫ్‌ ‌పార్ట్నర్‌ ‌లేకుండా సముద్రాన్ని, చెట్లను ఎంజాయ్‌ ‌చేయగలరా ఎవరయినా….’’

About Author

By editor

Twitter
Instagram