– ఉలి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‘తనది సోంవారం.. మందిది మంగళారం.. అన్నట్టుంది గీ దునియా తరీఖా..’’ అనుకున్నాడు యాదగిరి.

ఈ మాట అనుకోవడం ఇది మొదటిసారి కాదు..!

తనకి కాస్తా జ్ఞానం అబ్బిన తరువాత.. లోకంతీరు కొంచెం కొంచెం అర్థమవుతున్నా కొలది.. యాదగిరిలో ఎన్నెన్నో ఆలోచనలు..! ఒక్కొక్క ఆలోచన.. ఒకదానికొకటి చిక్కుముడి వేసుకుంటూ చిక్కుచిక్కుగా.. అల్లిబిల్లిగా.. ఏటూ తేల్చుకోలేని, పజిల్లా తయారయింది..!

మనకి స్వాతంత్య్రం వచ్చింది అనేది అబద్ధం..!

మనది ప్రజాస్వామ్యం దేశం అనేది అబద్ధం..!!

ప్రతిరోజూ అబద్ధాలతో బతకడమొక్కటే నిజంలాంటి అబద్ధం..!!

ఇలాంటి చిత్రవిచిత్ర ఆలోచనలు ఒక్క యాదిగిరిలోనే ఎందుకొస్తాయో తెలియని తికమక..

అయోమయ.. సంశయం…?!?

ఇంకా.. ఇం..కా… ఏ.. దో…

ఏ… మ.. రె..మి.. టో..!?

ఒక శుభ ముహూర్తంలో..యాదగిరి పెళ్లి బాజా మోగింది.

బంధుమిత్రులందరూ పెళ్లి మండపంలో ఉన్నారు. తాళికట్టు శుభవేళ సమీపిస్తున్నా కొలది పెళ్లి హడావిడి పెరగసాగింది.

అందరి చూపులు పెళ్లిమండపం వైపే వున్నా.. కనిపించిన వారితో పలకరింపులు.. చిరునవ్వులు.. గత స్మృతులు.. మాటల సందళ్లు…

ఇంతలో పెళ్లి జరిపిస్తున్న పురోహితుడు ‘‘ఘర్థి మేళం మ్రోగించండి’’ అని చెప్పడంతో సన్నాయి మేళం వాళ్లు మేళతాళాలు ఘట్టిగా వాయిస్తున్నారు.

పురోహితుడు మంత్రోచ్ఛారణ మొదలెట్టారు.

‘‘మాంగళ్యం తంతునానేనా…’’

వధువు మెడలో తాళి కట్టడానికి యాదగిరి ముందుకు వంగాడు.

ఇంతలో ఉరుము లేని పిడుగులా ‘‘స్టాపిట్‌..’’ అనే అరుపు వినిపించి, అందరూ అవాక్కయ్యారు..!

ఊపిరి సలపని ఉద్వేగంతో మండపాన్ని సమీపిస్తున్న పోలీసులను చూసి, నివ్వెరపోతున్నారు..! అక్కడున్న వారందరిలో ఏదో తెలియని ఆందోళన..!

ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే కుతూహలం..!

సంతోషంగా జరుగుతున్న ఆ పెళ్లితంతులో ఈ పోలీసుల రంగప్రవేశం ఏమిటో అర్థం కాలేదు వాళ్లకి..!

ఈ పెళ్లి ఆటంకానికి అసలు కారణం అక్కడున్న వారిలో ఒక్క పెళ్లికొడుకైన యాదగిరికి మాత్రమే తెలుసు..!

ఆ పోలీసులను తీసుకొచ్చింది యాదగిరి భార్య దేవమ్మ.

‘తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని.. దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హడావిడిగా పోలీసులు సరాసరిగా పెళ్లి మంటపంలోకి వచ్చి, రెండో పెళ్లి చేసుకుంటున్న యాదగిరిని అడ్డుకున్నారు.

అప్పుడు.. అర్థాంతరంగా ఆగిపోయిన తన రెండో పెళ్లిని తలచుకొన్న యాదగిరి పదేపదే తలచుకున్న మాటలు…

‘మనకి స్వాతంత్య్రం వచ్చింది అనేది అబద్ధం..!

మనది ప్రజాస్వామ్యం దేశం అనేది అబద్ధం..!!

ప్రతిరోజూ అబద్ధాలతో బతకడమొక్కటే నిజంలాంటి అబద్ధం..!!’’

యాదగిరి రెండో పెళ్లి కేసు కోర్టుకు వచ్చింది.

ఈ కేసు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఒక చర్చనీయాంశంగా మారింది.

అందుకు కారణం

యాదగిరి లేవనెత్తిన ప్రధానాంశం.. ‘తన రెండో పెళ్లికీ, శాసనమండలికీ ముడి పెట్టడం’..!! తన అడ్వకేట్‌ ‌ద్వారా ఈ విషయాన్ని కోర్టుకు సమర్పించడంతో మీడియా ద్వారా పాకింది, అన్ని రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారి, సంచలనం సృష్టించింది.

నిజమే.. యాదగిరి లేవనెత్తిన అంశం మామూలు విషయం కాదు..!

రాష్ట్ర శాసన వ్యవస్థలో ఏదేని చట్టం చేయడా నికి.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎమ్మెల్యేలతో కూడిన అసెంబ్లీ వుండగా, మేధావివర్గం ఎన్నుకున్న ఎమ్మెల్సీలతో కూడిన శాసనమండలి కూడా ఉన్నప్పుడు.. తనకు మొదటి భార్యతోపాటు  రెండో భార్య ఉంటే తప్పేమిటీ..? అనేది యాదిగిరి సంధించిన ఘాటైన ప్రశ్న..!!

మొదటి భార్య తన కుటుంబ విషయంలో సరైన నిర్ణయం, ఆలనాపాలన చూసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు.. రెండో భార్య ఆ విధులను నిర్వహించి, కుటుంబ క్షేమం చూసుకుంటుంది కదా..! అని యాదగిరి వాదన..!

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని.. రాజకీయవ్యవస్థలో వున్న వివిధ అంశాలలో కూడిన వ్యాస పరంపరలతో మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి. దాంతో, ప్రజలలో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.

భారతదేశంలోని రాష్ట్రాల శాసన వ్యవస్థలో  దిగువసభ అయిన అసెంబ్లీ, ఎగువసభ అయిన శాసన మండలి (విధాన పరిషత్‌) ‌రెండూ వున్నాయి. రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం మన దేశంలోని 29 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది. ఉత్తరప్రదేశ్‌,‌బిహార్‌, ‌కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణలలోనే ఈ విధమైన రెండు సభలు ఉన్నాయి. మిగతా 23 రాష్ట్రాలలో శాసన మండలి లేదు.

ఓటు హక్కు కలిగిన ప్రజలు ఎన్నుకున్న  ఎమ్మెల్యేలతో కూడిన అసెంబ్లీ ఒకటైతే, స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు మొదలైన మేధావి వర్గం ఎన్నుకున్న ఎమ్మెల్సీలతో కూడిన శాసన మండలి రెండవది.

శాసనమండలిని మొదటిసారిగా ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రద్దు చేశారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యులు అధికంగా ఉండటం వల్ల ప్రభుత్వ బిల్లును శాసనమండలి ఆమోదించేది కాదు. దీంతో రామారావు అసహనానికి గురై శాసన మండలిని తొలగించారు.

కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత.. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసన మండలిని ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు కానీ, ఆ బిల్లు ఆమోదం పొందలేదు. 2004లో వై. ఎస్‌. ‌రాజశేఖర్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందటంతో మళ్లీ శాసనమండలి అమలులోకి వచ్చింది.

రూల్‌ 71 ‌ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైనా మంత్రిత్వ శాఖ తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారాన్ని ఈ నిబంధన శాసన మండలిలోని సభ్యులైన ఎమ్మెల్సీలకు కల్పిస్తోంది. దీని ప్రకారం.. చర్చకు స్వీకరించిన బిల్లును శాసనమండలిలో తిరస్కరిస్తే, తిరిగి అసెంబ్లీకి వెళుతుంది. అప్పుడు కూడా అసెంబ్లీ మళ్లీ ఆమోదించి, రెండోసారి శాసనమండలికి పంపుతుంది. రెండవసారి ‘మండలి’ ఆమోదించక పోయినా, దానిని  పరిగణనలోకి తీసుకోకుండా గవర్నర్‌ ‌వద్దకు వెళుతుంది. గవర్నర్‌ ఆమోదం పొందినట్లయితే, ఆ బిల్లు.. చట్టంగా మారుతుంది. అంటే, ఎమ్మెల్సీల కంటే.. ఎమ్మెల్యేలకున్న అధికారం పటిష్టమైనది..!

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘మరి, మొదటి భార్యకే అన్ని హక్కులు      ఉంటాయిగా..? రెండో భార్యకు న్యాయం ఎలా చేసినట్లవుతుంది..?’’ అని ప్రతివాద లాయర్‌ ‌ప్రశ్నించారు.

‘‘నిజమే సారూ..! మొదటి పెండ్లాం ఉండంగా, రెండో పెండ్లి చేస్కోవద్దంటున్నారు. తప్పు అంటున్నారు. మరి, గీ పెజలందరూ ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్లేలుండంగ.. గా ఎమ్మెల్సీ లెందుకు సెప్పుండ్రీ..? ఆళ్లకు జీతబెత్తాలు, సెక్కూరిటీ ఖరుచులు.. లచ్చలు, కోటలు రూపాయల్‌.. ‌గయన్నీ పెజలు సొమ్మె గదా..? దండుగ జేసుడెందుకు..??’’ అడిగాడు యాదగిరి.

‘‘అంటే, నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే, తప్పు కాదంటాప్‌ – అం‌తేనా..?’’ ‘‘ఔ మల్ల.. గంతెగదా..!’’

‘‘ప్రభుత్వం పరిపాలన కోసం ఏర్పాటు చేసే కొత్త చట్టాల రూపకల్పనలో చర్చ కోసం.. మేధావివర్గాల చేత ఎమ్మెల్సీల నియామకం జరుగుతుంది. బోడి• గుండుకూ, మోకాలి చిప్పకూ ముడిపెట్టినట్లు, నీ రెండో పెళ్లికీ, శాసన మండలికీ ముడి పెడతావేం..? రెండూ ఒకటెలా అవుతుంది..?’’ అడిగాడు ప్రతివాద లాయర్‌.

‘‘ఔ.. ‌సారూ..? ఆళ్లు గోప్పోళ్లయితే, రెండు దఫాల ఆళ్లు ఒప్పుకోకుంటే.. గా బిల్లును గవరునర్‌ ‌సాబ్కు కాడికి పంపుడేందీ..? గీ పెజలు ఏసిన ఓట్లతోటి గెలిసిన ఎమ్మెల్లేల మాటనే చెల్లుతుంది గదా..? ఇగ, గా ఎమ్మెల్లీసీలు ఎందుకుంటారు..? గాడ, ఎమ్మెల్లీసీలున్నట్లె.. నా ఇంట్ల రెండో పెండ్లాముంటే, తప్పేంటీ సెప్పుండ్రీ..? ఇద్దర్ని చక్కంగనే చూసుకుంట గదా..?’’

‘‘ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరికీ న్యాయం చేయలేరుగా..?’’ మళ్లీ అడిగాడు ప్రతివాద లాయర్‌. ‘‘ఇద్దరు బిడ్డలున్నోళ్లు.. ఒక్క పిల్లగాన్నే సాదుకుంటరా ఏందీ..? కొడుకు లెక్కనే, కూతుర్ని పావ్రం జేస్తరు..’’ చెప్పాడు యాదగిరి.

‘‘యువరానర్‌.. ‌యాదగిరి వితండవాది అని త్రోసిపుచ్చడానికి లేదు. అతను ఎత్తి చూపుతున్నది. మామూలు విషయం కాదు. ప్రభుత్వానికీ, ప్రజల సొమ్ముకూ ముడిపడి ఉన్న అధికారిక అంశం. దీనిని కూలంకుషంగా పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుతున్నాను’’ అని వివరించాడు ప్రతివాద లాయర్‌.

‌వాదోపవాదాలు విన్న తరువాత.. తుది తీర్పును వచ్చే సోమవారం వెలువడుతుందని ప్రకటించారు జడ్జి.

ఈ కేసు వివరాలతో.. ఇటు వార్తపత్రికలలోనూ ప్రముఖంగా ప్రచురించారు, అటు టి.వి. ఛానెల్స్ ‌లోనూ చర్చ కార్యక్రమాలు ప్రసారం చేశారు.

ప్రజలలోనూ ఎక్కడ చూసినా.. ఇదే చర్చ..!

రెండో పెళ్లి చేసుకుంటే, తప్పేంటీ..?

ఎమ్మెల్యేల మాటనే చెల్లినప్పుడు.. ఎమ్మెల్సీలు ఎందుకు..??

రోజురోజుకీ.. ప్రజలలో ఆసక్తి పెరిగింది. వచ్చే సోమవారం జడ్జిమెంట్‌ ఎలా వెలువడుతుందో అనే ఉత్సాహం రెట్టింపయింది..!

సోమవారం..

యాదగిరి రెండో పెళ్లి కేసు తీర్పు ఏ విధంగా వస్తుందోనని రాష్ట్రంలోని ప్రజలందరూ ఆసక్తితో ఉండటంతో ఒక ప్రముఖ టి.వి. ఛానెల్స్ ‌వారు తాజా వార్తల సమాచారంగా కోర్టు ప్రాంగణంలో నుండి ప్రత్యక్ష ప్రసారం చేపట్టారు.

అందరూ ఆసక్తిగా టి.వి. వార్తల కోసం ఎదురుచూస్తున్నారు.

యాదగిరి రెండో పెళ్లి కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జిగారు ముందుగా యాదగిరి మొదటి భార్య ప్రవేశపెట్టమన్నారు.

యాదగిరి భార్య దేవమ్మ బోనులో నిలబడగానే ‘‘మీ భర్త యాదగిరి రెండో పెళ్లి చేసుకోవడానికి నీకు సమ్మతమేనా..?’’ అడిగారు జడ్జి. ఆ ప్రశ్నతో కోర్టులో ని వారంతా అవాక్కయ్యారు..!

దేవమ్మ ఏమని జవాబు చెపుతుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. ఒప్పుకుంటే, బావుంటుందనీ.. యాదగిరి ఆశగా ఎదురు చూశాడు. అన్ని విధాల ఆలోచించిన దేవమ్మ తడబడకుండా బదులిచ్చింది. ‘‘ఆయనిట్టం.. చేసుకోనియ్యుండ్రీ..!’’

ఆ మాటతో యాదగిరి ముఖంలో సంతోషం విరిసింది. అదీ ఒక్క క్షణ కాలమే. ‘‘గట్లయితే, నేను గూడా రెండో పెండ్లి చేస్కోవడం తప్పు కాదంటేనే..!’’ అంటూ కండిషన్‌ ‌పెట్టింది దేవమ్మ.

అక్కడున్న వాళ్లంతా ఒక్క క్షణం షాక్‌ అయ్యారు..!

యాదగిరి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది..!!

ఆ మాటలోని భావం అర్థమయ్యే సరికి అక్కడి వారి పెదవులపై చిరునవ్వు మెరిసింది దేవమ్మ సమయస్ఫూర్తికి.

దేవమ్మ మనోభావం తెలిసిన జడ్జి వెంటనే తన తీర్పు వెలువరించారు.

‘‘స్త్రీ, పురుషులు ఎవరైనా.. సమానమేనని మరోసారి నిరూపించింది దేవమ్మ. మగవారికో న్యాయం, ఆడవారికో న్యాయం ఉండకూడదని ఘంటాపథంగానే చెప్పేసింది. ఇక, రెండోపెళ్లి విషయంలో యాదగిరిని తీవ్రంగా మందలిస్తూ, మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. చట్టరీత్యా చర్య తీసుకోవచ్చని పోలీసుశాఖకు ఆదేశించడమైనది. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన అంశం.. యాదగిరి ఎత్తి చూపిన శాసనమండలి విషయం. ‘అల్పుని మాటయే జనవాక్యంబ’నీ పరిపాలన సాగించిన శ్రీరాముని సాక్షిగా.. రామ రాజ్యంలా ప్రభుత్వ పాలన ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నట్లుగానే.. ఈ విషయంపై తగు వివరణ ఇవ్వవలసిందిగా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడ మైనది’’

తుది తీర్పు వినగానే యాదగిరి మరోసారి అనుకున్నాడు.

‘తనది సోంవారం.. మందిది మంగళారం.. అన్నట్టుంది గీ దునియా తరీఖా..’’

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram