– పెనుగొండ బసవేశ్వర్

తెల్లవారుజామున ఐదు కావ స్తోంది. చలికి గడ్డకట్టిన చీకటి మరింత చిక్కగా తయారైంది. మంచు దుప్పటి కప్పుకున్న చెట్లు ఇంకా నిద్రలోనే జోగుతున్నాయి. మెలకువలో కలిసేందుకు చీకటి కూడా బద్ధకిస్తున్న చలికాలం. ఈ టైంలో ఇంతమంది జనాలకి ఏంపనిరా? అని ఆశ్చర్యంతో చూస్తున్న కరెంటు స్తంభపు దీపపు కళ్లు. అప్పటిదాకా పనిచేసిన పారిశుద్ధ కార్మికులు శ్రమచిందించి రోడ్లకు అద్దిన చెమట తాలూకు మెరుపు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అదిగో అప్పుడే బలరాం తన కొడుకు ఆదిత్యను బండిమీద కూర్చోబెట్టుకొని కరీంనగర్‌ ‌బస్టాండుకి బయలు దేరాడు.

అంతకుముందు పావుగంట ఇంట్లో జరిగింది మనం తెలుసుకోవాలి.

‘‘ఇంతచలిలో అవసరమా, పొద్దెక్కాక ఏడింటికో ఎనిమిదింటికో వెళితే కొంపలేం అంటుకుంటాయి’’ అన్న భార్య కవిత మాటలను అడ్డంగా నరికేసాడు బలరాం.

‘‘కాలేజీవాళ్లు ఇచ్చిన సెలవులు ముష్టి రెండురోజులయితే, దానికి వీడు ముక్కుతూ మూల్గుతూ ఒంట్లో బాగోలేదని, గట్టిగా అడిగితే మనసు బాగోలేదని అడ్డమైన రీసన్స్ ‌చెప్పి రెండు రోజులు కలిపి, ఆ తరువాత మీతో అసలు ఉన్నట్టేలేదు డాడీ అంటూ ఎప్పటిలానే మరోరోజు కలిపి చివరికి ఆదివారం వెళ్లి చేసేదేముందని ఇదిగో వారం మింగేసాడు. ఇంకా వాడిమీద లేనిపోని గారాబంచూపి గబ్బుపట్టించకు’’

‘‘అబ్బ, అక్కడ కాలేజీవాళ్లు కూడా మీ అంత కఠి•నంగా ఉంటారోలేదో .. మీరే వాడి కాలేజీ ప్రిన్సిపాల్‌ అయినట్టు యమ డిసిప్లిన్‌’’ ‌చిరుబురు లడుతూ చీరకొంగును విసిరికొట్టింది.

‘‘అవునే సంవత్సరానికి లక్షన్నరఫీజుకట్టి చదువుకోమంటే, నెలకోసారి ఇంటికి వచ్చి ఇలా కాలేజీ ఎగ్గొట్టి చదువులకు నామంపెట్టి పైనుండి ఇక్కడ ఖర్చుపెట్టి సాధించేదెంటే నాకర్థం కాదు?’’

‘‘సరేలెండి ఎప్పుడు లెక్కలేనా? పాపం పిల్లవాడు మనల్ని వదిలి హైదరాబాదులో హాస్టల్లో అడ్డమైన గడ్డితింటూ ఎలా ఉంటున్నాడోనని కొంచెం కూడా మీకు రంది లేదు.’’

‘‘నీలాగా నేనుకూడా రందిపెట్టుకుంటే గుండుకొట్టించుకున్నట్టే. చదువు సంకనాకి వాడు ఎందుకూ కొరగాకుండాపోతే అప్పుడు ఎవడు సమాధానం చెప్పాలి? అదంతా కుదిరేపనికాదుగాని నువ్వు నోరుమూసుకొని లోపలికివెళ్లి వాడిని బయటికిపంపించు.’’

వచ్చిన ప్రతిసారి తప్పనిసరితంతులా జరిగే ఈ సెండాఫ్‌ ‌సంభాషణ మళ్లీమళ్లీ వినలేక ఆదిత్య చెవులకు ఇయర్‌ ‌ఫోన్స్ ‌తగిలించుకొని డాడీ అరుపుకోసం ఎదురు చూస్తున్నాడు.

‘‘ఒరేయ్‌ ఆదిత్య అవతల బస్సు మిస్సయిందంటే మళ్లీ 300 బొక్క… పదపద’’ సైరన్‌ ‌మోగింది. బ్యాక్‌ ‌ప్యాక్‌ ‌తగిలించుకొని ‘బై మమ్మీ, చెల్లికి చెప్పు’ అంటూ స్కూటర్‌ ‌వెనుక కూర్చున్నాడు.

స్కూటర్‌ ‌మెల్లగా నల్లని రోడ్డుమీద చలిచీకటిని చీల్చుకుంటూ ముందు• కెళ్తోంది. ఇద్దరిమధ్య మౌనం కూర్చుంది. బస్టాండ్లో రెడీగాఉన్న బస్సెక్కి టికెట్‌ ‌తీసి కొడుకు చేతిలో పెట్టి పక్కనే ఖాళీ సీట్లో కూర్చున్నాడు. ఆదిత్య పితృబోధకి సిద్ధం ఐపోయాడు.

బలరాం కొడుకును చేతితోతట్టి ‘‘ఏరా వచ్చినప్పటినుంచి ఆన్లైన్‌లోనే ఉంటావు. అమ్మానాన్న లకి దూరంగా ఉంటున్నానని, హైదరాబాదులో ఉన్నప్పుడు మమ్మల్ని మిస్‌ అవుతున్నట్టు తెగబాధ పడతావు. ఎలావచ్చావో అలాగే వెళ్లిపోతావు. వెళ్లేటప్పుడు ఏ జ్ఞాపకాలనూ మూటకట్టుకోకుండానే ఖాళీ చేతులతోనే వెళ్లిపోతావు. ఏం లాభంరా! నువ్వుమాతో గడుపుతావేమోనని ఎదురుచూస్తాం, కానీ ప్రతిసారి నిరాశే అవుతుంది. సమయం పోతే మళ్లీ రాదురా.’’ బలరాం తనలోని బాధను, కోపాన్ని, ఆవేదనని కొడుకుతో మొరపెట్టుకున్నాడు. బస్సు కదలగానే జాగ్రత్త అంటూ ఒక 500నోటు జేబులోపెట్టి బస్సుదిగి బయలుదేరాడు వాట్సప్‌ ‌మెసేజ్‌ ‌సౌండ్‌ ‌కోసం ఎదురుచూస్తూ. రెండు నిమిషాలు గడిచిందో లేదో సెల్లు ట్రింగ్‌ అం‌ది. ఆదిత్య నుండి వాట్సాప్‌ ‌మెసేజ్‌ ‘‌సారీ నాన్నా’. అలవాటై పోయిన బలరాం మెసేజ్‌ ‌వంక అలాచూసి ఓ వెర్రినవ్వు నవ్వి ఇంటివైపు వెళ్లిపోయాడు.

                                                                                             *          *          *

 రెండునెలలు గడిచాయి. వన్‌ ‌ఫైన్‌ ‌మార్నింగ్‌ ‌వన్‌ అం‌డ్‌ ఓన్లీ సన్‌ ‌నుండి ఫోన్‌ ‘‘‌మమ్మీ నాకు విపరీతంగా కడుపునొప్పి. మోషన్స్ ఏమీ తినలేక పోతున్నాను’’

‘‘అయ్యో ఆదీ, ఏమైందిరా హాస్టల్‌ ‌ఫుడ్‌ ‌పడలేదా?’’

 ‘‘అంటే నిన్నరాత్రి..కొంచెం..బయట ఫ్రెండ్స్‌తో.. లైటుగా..’’ నసిగాడు

‘‘ఏంట్రా బయటపార్టీనా? అడ్డమైన గడ్డితిని అడ్డగోలుగా తాగితే అంతేమరి. నీదసలే సున్నితమైన కడుపు.. ఆ జంక్‌ ‌ఫుడ్‌ ‌తినకురా అంటే వినవు. టాబ్లెట్‌ ‌వేసుకున్నావా?’’

‘‘వేసుకున్న మమ్మీ.. అయినా తగ్గట్లేదు’’

‘‘మజ్జిగ ఉంటే బాగాతాగు’’

‘‘రాత్రి నుండే తాగడం స్టార్ట్ ‌చేశా.’’

‘‘ఏం స్టార్ట్ ‌చేశావురా బీరు తాగడమా?’’

‘‘అబ్బా కాదుమమ్మీ చల్ల తాగాను, పొద్దున కూడా తాగాను. అయినా కంట్రోల్‌ అవ్వట్లేదు తట్టుకోలేకపోతున్నా.’’

‘‘పోనీ హాస్పిటల్‌ ‌వెళ్లక పోయావా?’’

‘‘ఇక్కడ హాస్పిటల్లో నాతో ఎవరుంటారు మమ్మీ, చందూ కూడా లేడు టైముకి.’’

‘‘మరి ఏంచేస్తావ్రా?’’

‘‘నేను వచ్చేస్తా ఇంటికి, రెండు రోజులుండి మోషన్స్ ‌తగ్గగానే వెళ్లిపోతా.’’

‘‘అమ్మో మీనాన్న ఏమంటాడోరా’’ భయంభయంగా చుట్టూచుస్తూ గుసగుసగా అన్నది.

‘‘నువ్వు చెప్పు మమ్మీ నీమాట వింటాడు. నేను వచ్చిన తర్వాత మళ్లీ గొడవ అవొద్దు. అందుకే నీకు ముందే చెప్తున్నా’’

‘‘సరేసరే నాన్న..బయలుదేరి వచ్చేయ్‌ ‌మరి’’ ఫోన్‌ ‌పెట్టేసిందోలేదో ‘మమ్మీ’ అంటూ ఆదిత్య ఇంట్లోకి పరుగున వచ్చి కవితను కౌగిలించుకున్నాడు.

‘‘అమ్మనా భడవా..ఆల్రెడీ వచ్చేసి ఫోన్‌ ‌చేసావా? ఎంత దొంగనా రాస్కెల్విరా నువ్వూ’’ అంటూ బుగ్గగిల్లింది. ‘‘నా స్వీట్‌ ‌మమ్మీ’’అంటూ ఆదిత్య ప్రేమగా అమ్మను మరింతగా అలుముకున్నాడు.

ఇరవై ఏళ్లు వచ్చినా అరవై ఏళ్లు వచ్చినా అమ్మకౌగిలిలో దొరికే అలౌకిక ఆనందం మరెక్కడా దొరకదు. కొన్ని విలువైన అనుభూతుల సమయాన కాలం కూడా నిశబ్దంగా ఉండి పోతుంది. రెండు మనసుల అలైబలైతో రెప్పపాటు ఇల్లు తల్లిగా మారింది. అమ్మ మనస్సు ఉన్నఫళంగా తడిగా మారింది.

‘‘ఏంట్రా ఇలా చిక్కిపోయావు’’ అంటూ కొంగుతో కొడుకు మొహం తుడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంది.

‘‘మమ్మీ నువ్వు మరీను.. ఈమాటగాని డాడీ ముందు అన్నావంటే వేయింగ్‌ ‌మిషన్‌ ‌మీద నిలబెట్టిమరీ కడుగుతాడు’’

 ‘‘సర్లేగాని కాళ్లుచేతులు కడుక్కునిరా భోజనం వడ్డిస్తా’’. అమ్మ చేతివంటను అమ్మమనసు ప్రేమను కడుపునిండా నింపేసుకుని టాబ్లెట్‌ ‌వేసుకుని పడుకున్నాడు ఆది.

సాయంత్రం ఆరు కావస్తుంది. బలరాం,సింధు లోపలికివస్తూ గుమ్మంలో ఆదిత్య షూస్‌ ‌చూసి చూడంగానే అరిచినంత పని చేశారిద్దరూ.. ఒకరు ఆందోళనగా మరొకరు ఆనందంగా.

‘‘ఏంటే నీ పుత్ర రత్నం మళ్లీ దిగబడ్డాడా? ఈసారి ఏం మాయరోగం వచ్చిందట? కాలేజీకి తిన్నగా ఒక రెండునెలలైనా వెళ్లడా వాడు?’’

ప్రశ్నలు వర్షం కురుస్తుంటే కొడుకు కోసం అడ్డంగా గొడుగులా మారి భర్తవైపు అడుగులేస్తూ ‘ఉశ్శో.. మాట్లాడ కండి’ అన్నట్టు సైగచేసింది. లోపలికి వచ్చాక కాఫీ, మంచి నీళ్లు అందిస్తూ కొడుకు రాక ఘట్టాన్ని సీరియల్‌ ‌జీడిపాకం చేయకుండా షార్ట్ ‌ఫిలింలాగా సూటిగా చెప్పింది. ఖర్మ ఖర్మ అని నెత్తి కొట్టుకుంటూ స్నానానికని బాత్రూంలోకి వెళ్లాడు. రాత్రి భోజనానికి రమ్మంటే కడుపులో బాలేదని డుమ్మాకొట్టాడు ఆదిత్య.

మధ్యరాత్రి సుమారు ఒకటిన్నర ప్రాంతంలో బలరాం బాత్రూంకోసం లేచినప్పుడు హాల్లో ఏదో వెలుగు కనిపించింది. అటువైపు వెళ్లిచూస్తే ఆదిత్య సెల్లులో మాట్లాడుతున్నాడు. బలరాంకి కోపం నెత్తికెక్కింది.

‘‘ఒరేయ్‌ ఆదీ, 24 గంటలు సెల్లు చూసేపనే అయితే ఇక్కడిదాకా రావడం మమ్మల్ని డిస్టర్బ్ ‌చేయడం ఎందుకురా, అక్కడే ఉండొచ్చుగా’’ గట్టిగా అన్నాడు.

ఉలిక్కిపడ్డ ఆదిత్య ‘‘అయ్యో డాడీ మీరింకా పడుకోలేదా? వాటర్‌ ‌కావాలా?’’ లేచి ఫ్రిజ్‌ ‌లోంచి బాటిల్‌ ‌తెచ్చి ఇచ్చాడు.

‘‘దీనికేం తక్కువలేదు..చీకట్లో సెల్లుచూస్తే కళ్లు దొబ్బుతాయి. చూసింది చాలుగానీ పడుకో’’

 ‘‘తెలుసునాన్నా..సరే, ఒక పదినిమిషాల్లో పడుకుంటాను.’’

‘‘ఏ.. చెప్పగానే పడుకుంటే ఏమన్నా నామోశీనా. గేమ్‌ ‌మధ్యలో వదిలేస్తే నష్టమా? అదిఅంత ఇంపార్టెంటా?’’

‘‘అదేమీలేదు నాన్న, ఒక పదినిమిషాలు ప్లీజ్‌.. ‌పడుకుంటా.’’

‘‘మీరుమారరు అంతే’’ అనుకుంటూ బెడ్రూమ్‌ ‌లోకి వెళ్లిపోయాడు.

                                                                                             *          *          *

ఉదయం 6:30కి లేచి ఒకగంట వాకింగ్‌ ‌చేసి వచ్చారు భార్యాభర్తలు. వేడివేడి చాయితాగుతూ వరండాలో కూర్చున్నారు.

‘‘పిల్లలు లేచారా?’’

‘‘మీరుమరీను.. వాడు ఏఅర్ధరాత్రి పడుకున్నాడో ఏమో! ఇప్పుడప్పుడే లేవడు. సింధుకూడా వాళ్ల అన్నయ్యతో చాలారాత్రి వరకు ఏవో లెసన్స్ ‌చెప్పించుకుంటూ గడిపింది. కాసేపయ్యాక లేపుతాను’’

‘‘ఆ మిడ్నైట్‌ ‌మసాలా కళ్లారా చూసానులే. కాలేజీలో జిమ్‌ ఉం‌ది, రోజు కాసేపు చేస్తే ఆరోగ్యానికి మంచిది కదా.. అసలే మనిద్దరికీ షుగర్‌ ఉం‌ది మన పిల్లలకి వచ్చేఛాన్స్ ‌చాలా ఎక్కువ. ఇలా బద్దకిస్తే ఒబెసిటీ వచ్చి చిన్న వయసులోనే షుగర్‌ ‌వస్తే వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?’’

‘‘ఎందుకండీ పిల్లలకోసం మంచిగా మాట్లాడ కుండా అలా శాపాలు పెడతారు?’’

‘‘నేను చెప్పేది అక్షరాలా నిజమే, నా బాధంతా షుగర్‌తో మనం పడేబాధలు మన పిల్లలకు రాకూడదనే’’

‘‘నేను చెప్తాలేండి..’’ అంటూ టిఫిన్‌ ‌చేయడానికి వంటింట్లో దూరింది.

పేపర్‌ ‌ముందేసుకుని కూర్చున్నాడు బలరాం. ఎనిమిదింటికి లేచిన సింధు డాడీ గుడ్‌ ‌మార్నింగ్‌ అం‌టూ కౌగిలించుకుంది. నా బంగారం అంటూ చేతులు చుట్టేసిన బలరాం గారాల బిడ్డను ముద్దు పెట్టుకున్నాడు. నిద్ర సరిపోయిందా బేటా అంటూ తలనిమిరాడు. ఎక్కడ డాడీ…రాత్రి పడుకునేసరికి 12 దాటింది, కానీ అన్నయ్యవల్ల చాలా డౌట్స్ ‌క్లియర్‌ అయ్యాయి. సరేనాన్న నేను రెడీఅవుతాను అంటూ స్నానానికి వెళ్లిపోయింది.

‘‘ఏవండోయ్‌ ‌శ్రీవారు మీరు ఆ పేపర్లో మునిగితే ఇంక బయటికిరారు గానీ ప్రతిరోజులా హడావిడిగా వెళ్లకుండా కాస్త తొందరగా స్నానం చేసి రండి, టిఫిన్‌ ‌రెడీగా ఉంది’’

‘‘ఉండవోయ్‌ ‌కనీసం హెడ్‌లైన్స్ అన్నా చదవకపోతే ఏదో వెలితిగా ఉంటుంది’’ వీలైనంత ఎక్కువగా చదివి లేచాడు. ఇంటర్మీడియట్‌ ‌చదువుతున్న సింధు తనకాలేజీ బస్సురాగానే ‘‘డాడీ నేనువెళ్తున్న నువ్వు తొందరగా రెడీ అయివెళ్ళు’’ వెళ్లిపోయింది.

మధ్యాహ్నం 12:00కి లేచాడు ఆదిత్య. కవిత వంటింట్లో తనకు ఇష్టమైన హిందీ పాటలు వింటూ వంట చేస్తోంది.

‘‘ఏరానాన్న లేచావా ఎలా ఉంది కడుపులో?’’

‘‘కొంచెం బెటర్‌ ‌మమ్మీ’’

‘‘సేమ్యా ఉప్మా చేశాను నీకు ఇష్టమని, తింటావా?’’

‘‘అబ్బా ఇప్పుడు వద్దులేగానీ కొంచెం మజ్జిగ చేసివ్వు. సేమియా తర్వాత తింటా ఎవరికి పెట్టకు’’

‘‘సరేలేరా నీకోసమే పక్కన పెడతాను’’ మజ్జిగ ఇచ్చింది.

‘‘మీ నాన్నకి నీ గురించే రందిరా..నువ్వు చదువుని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తావో అని, బ్యాక్‌ ‌లాగ్స్ ఉం‌టే క్యాంపస్‌ ‌ప్లేస్మెంట్‌ ‌రాదని ఆయనబాధ. తన కొడుకు తనకంటే బెటర్‌ ‌పొజిషన్లో ఉండాలని ఆయన కోరిక.’’

‘‘నాకు తెలుసు మమ్మీ, నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ఇంజనీరింగ్‌ ‌చదివే పిల్లలు హైస్కూల్‌ ‌పిల్లలలాగా పుస్తకాల పురుగును కాను. అలా అని అందరూ కాలేజీలు ఎగ్గొట్టి బలాదూర్‌ ‌తిరుగుతానని అనుకోవద్దు.’’

‘‘నాకు తెలుసురా నువ్వు శ్రద్ధగానే చదువుతావని.. ఎందుకో మీనాన్నకే కొంచెం నమ్మకం తక్కువ… భయం ఎక్కువ.’’

‘‘డోంట్‌ ‌వర్రీ! నేను మీకు ఏ విషయంలోనూ చెడ్డపేరు తీసుకురాను ప్రామిస్‌. ‌నాకు కాస్త లాప్టాప్‌తో పని ఉంది’’ అంటూ తన రూమ్‌లోకి వెళ్లిపోయాడు. సాయంత్రం 6 దాటిన తర్వాత ప్రతిరోజులాగే ఆఫీస్‌ ‌నుండి వస్తూవస్తూ కూతుర్ని పికప్‌ ‌చేసుకుని ఇల్లు చేరుకున్నాడు బలరాం.

‘‘ఏంచేస్తున్నావ్‌ ‌మేం వచ్చేసాము’’

‘‘తెలుసులెండి రోజు అలవాటేగా.. టైం చూసాను మీకు కాఫీ సింధూకి బూస్ట్ ఇదిగో’’ ఇద్దరికీ అందించి తనుకూడా కాఫీ తాగుతూ కూర్చుంది.

‘ఎక్కడా మీ పుత్రరత్నం?’ అడిగాడు

‘‘వాడి ఫ్రెండ్‌ ‌రాహుల్‌ ‌వచ్చాడండి వాడికి ఆన్లైన్లో ఏదో అప్లై చేసేది ఉందట,అలాగే ఎగ్జామ్‌ ‌కి ఏదో గైడెన్స్ ‌కావాలని అడిగితే వెళ్లాడు’’

‘‘ఇంకేముంది రాత్రివరకు మొహం చూపించరు కదా అయ్యగారు.. ఇది మాకేం కొత్త కాదు కదా.. సరేలే.’’

యధావిధిగా మరో సాయంత్రం గడిచింది. మరో రాత్రి కూడా తండ్రీ  కొడుకులు ఎదురుపడతారే మోనని ఎదురు చూడకుండానే గడిచిపోయింది.

                                                                                             *          *          *

ఉదయం ఎనిమిది కావస్తోంది. ఆదిత్య రూములో అలారం మోగింది. దిగ్గున లేచి కూర్చున్న ఆదిత్య అలారం ఆఫ్‌ ‌చేసి మమ్మీమమ్మీ అంటూ వంటింట్లోకి వెళ్లాడు.

‘‘మమ్మీ మమ్మీ ఈరోజు డాడీని లీవుపెట్టమని అడగొచ్చు కదా…నాకోసం ఒక్కరోజు. డే అంతా కలిసిఉందామే.. చెల్లిని కూడా కాలేజీ ఎగ్గొట్టమని చెప్తాను.’’

‘‘ఓహో అదాసంగతి, ఇంతపొద్దున లేచాడు ఏంట్రా అని నేను షాక్‌ అయ్యాను కదరా. కాకపోతే నీబ్యాడ్‌ ‌లక్‌.’’

‘‘ఏం‌టే ఏమైంది?’’

‘‘మీనాన్న పొద్దున ఏడు గంటలకే జంపు.. వాళ్ల యూనియన్‌ ‌మీటింగేదో ఉందట. లంచ్‌కి కూడారాడట.’’

‘‘డాడీతో ఒక ముఖ్యమైన విషయం చెబుదామని అనుకున్నానే.. సర్లేకానీ ఏంచేస్తాం.’’

‘‘ఏంట్రాఅది నాకు చెప్పవా? మీ డాడీకి మాత్రమే చెప్తావా? నేనుకూడా డిగ్రీ చదివానురోయ్‌. ఏదో మీముగ్గురి సేవలకి ఆటంకం కలుగుతుందని నౌకరి చేయట్లేదు.’’

‘‘అయ్యో మమ్మీ అలాకాదు డాడీకూడా ఉంటే అందరికీ ఒకేసారి చెబుదామని అనుకున్నా అంతే.’’

‘‘టిఫిన్‌ ‌పెట్టనా.. తింటావా?’’

‘‘ఉహూ.. వద్దు. అలవాటు లేదుకదా ఇంత పొద్దున తినడం.’’

‘‘ఎలాగూ మీనాన్నలేరు కాసేపు పడుకోపో.’’

‘వద్దులేవే ఆ కూరగాయలు ఇటివ్వు కోసిస్తా.. నువ్వు పొయ్యి మీద వేసేయ్‌’’

‘‘ఏంఅక్కర్లేదు నేను టకటక చేసేస్తాను కానీ అలాకూర్చుని కబుర్లుచెప్పు. కాలేజీ విశేషాలు ఏంటిరా?’’

‘‘ఏముంటాయి అమ్మ రొటీన్‌..’’

‘‘అం‌టే.. ఫ్రెండ్స్, ‌మరీ ముఖ్యంగా గర్ల్ ‌ఫ్రెండ్స్.. ఎవరితోనైనా ప్రేమలో పడడం అలాంటివి.’’

‘‘అయ్యబాబోయ్‌ ఈరోజుల్లో అమ్మాయిలు అబ్బాయిల్ని బకరాలనుచేసి బండ్లమీదఎక్కి సినిమాలు షికార్లుతిప్పి వాడిని పిప్పి పిప్పిచేసి వదిలేస్తున్నారు. అంత ఓపిక నాకులేదు.’’

‘‘అదేంట్రా కాలేజీలో అంతమంది అమ్మాయిల్లో ఒక్కరు కూడా నచ్చలేదా?’’

‘‘నచ్చడం వేరు, ఫ్రెండ్షిప్‌ ‌వేరు, ప్రేమవేరు అమ్మా, అలాగే జీవిత భాగస్వామిగా ఎన్నుకోవడం వేరు. నేను ఎవరిని ఫ్రెండ్స్ ‌స్టేజిదాటి దగ్గరికి •రానివ్వలేదు. రానివ్వాలని అనిపించేంతగా ఎవరూ నచ్చలేదు కూడా.’’

‘‘ఓకేరా ఈ వయసులో ఇవన్నీ మామూలేకదా అనిఅడిగాను అంతే’’

కరీంనగర్లో తనతో ఇంటర్‌ ‌చదివిన ఫ్రెండ్స్ ‌కలుద్దాం అంటే సాయంత్రం బయటికివెళ్లి డిన్నర్‌ ‌చేసిబాగా పొద్దుపోయాక ఇల్లుచేరాడు. తర్వాత జరగడానికి కొత్తగా ఏమీలేదు. అందరూ పడుకున్నారు. తాను లాప్టాప్‌ ‌ముందేసుకుని కూర్చున్నాడు.

                                                                                             *          *          *

 ఉదయం ఐదు గంటల సమయం, గడ్డకట్టిన చలి జనాల్ని గడగడ వణికిస్తోంది. బలరాం ఆదిత్య స్కూటర్‌ ఎక్కి బస్టాండక్‌ ‌వెళుతున్నారు. అలవాటైన మౌనాన్ని బలరాం యధావిధిగా బద్దలుచేస్తూ కొడుక్కి బోధ మొదలుపెట్టాడు. ‘‘అవున్రా ఆదీ.. వచ్చావు వెళ్లావు అన్నట్లు కాకుండా వచ్చేప్పటికీ వెళ్లేటప్పటికీ కొంచెం తేడా ఉండాలి కదా? ఇంట్లో గడిపిన జ్ఞాపకాలను వెంట తీసుకెళ్లాలి కదా’’ ఇలా బస్టాండ్‌ ‌చేరెంత వరకు ఏదో చెబుతూనే ఉన్నాడు. గాలి శబ్దానికి సరిగ్గా వినపడక పోయినా తను ఏంచెప్తాడో సారాంశం ఆదిత్యకి తెలిసిందే.

బస్టాండ్‌లో బస్సు రెడీగా ఉంది. కొడుక్కి టికెట్‌ ‌కొనిచ్చి పక్కన ఖాళీసీట్లో కూర్చుందామని అనుకు న్నాడు కానీ బస్సు కదలడంతో చేసేదిలేక చెప్పేదిలేక టకటక బాయ్‌ ‌చెప్పి బయలుదేరాడు. బండి తాళంచెవి కోసం స్వెటర్‌ ‌జేబులో చేయి పెడితే ఏదో కాగితం తగిలింది. ఏంటబ్బా తీసిచూశాడు. అది ఒక ఉత్తరం, ఆదిత్య వాళ్ల నాన్నకు రాసింది. ఆశ్చర్యంతో చదవడం మొదలుపెట్టాడు.

‘‘డియర్‌ ‌డాడీ, మీకు ఎలాచెప్పాలో తెలియక మీ కళ్లలోకి సూటిగా చూస్తూ మాట్లాడలేక ఈలెటర్‌ ‌రాస్తున్న. మీరంటే నాకు భయం కాదు గౌరవమే, కానీ ఎదురు పడాలంటే ఏదో బిడియం అడ్డుపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకండి. నేను బాగానే చదువుతు న్నాను. పనిలో పనిగా ఆన్లైన్‌లో కంప్యూటర్‌ ‌కోర్సులు కూడా నేర్చుకుంటున్నాను. అలాగే వారానికి మూడు రోజులు రాత్రిపూట కాలేజీ పని పూర్తి చేసుకున్నాక అమెరికాలో ఇద్దరు హైస్కూల్‌ ‌స్టూడెంట్స్‌కి మ్యాథ్స్ ‌ట్యూషన్‌ ఆన్లైన్లో చెబుతున్నాను. ప్రతి చిన్న అవసరానికి మిమ్మల్ని డబ్బులు అడగకూడదని. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు సెల్లు లేదా లాప్టాప్‌తో గడపడం ముఖ్యంగా ఈ కారణాల వల్లే. మొన్ననే అమెజాన్‌ ‌వెబ్‌ ‌సర్వీసెస్‌ (••) ‌సర్టిఫికేషన్‌ ‌కూడా సంపాదించాను. అదే విషయం మీకుచెప్పి అందరం కలిసి ఒకరోజంతా సరదాగా గడుపుదామని అనుకున్నాను. కానీ మీరు చాలాపొద్దున్నే వెళ్లిపోయారు. ఇంజనీరింగ్‌ ‌చదువుతున్న విద్యార్థు లను చిన్నపిల్లలలాగా చూడొద్దు నాన్నా. ప్రతి దానికి తల్లిదండ్రుల మీద ఆధారపడతారని, ప్రతివిషయం వాళ్లకు చెప్పేచేస్తారని అనుకోవద్దు. సెల్లు చూసినంత మాత్రాన సమయాన్ని వృథా చేస్తున్నారని భావించ వద్దు. ఎంతసేపూ సెల్లు చూస్తున్నానని అనుకున్నారు కానీ నేను ఏం చేస్తున్నానని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు మీరు. చెప్పినా మీరు నమ్మరని నే•నూ చెప్పలేదు.

నేను మీ బిడ్డను. మీరు తలవంచుకునేలా ఏ పని చేయను. నేను చాలాసార్లు మీతో గడపడానికి నా పరిస్థితి మేరకు పరిధి మేరకు ప్రయత్నించాను. మీ ఆఫీస్‌ ‌బిజీ షెడ్యూల్‌ ‌వల్ల, యూనియన్‌ ‌లీడర్‌గా, ఇతర పనుల వల్ల అది సాధ్యపడలేదు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా రెండురోజులు కనీసం ఒక్కరోజు నాకోసం లీవ్‌ ‌పెట్టండి. మీతో పూర్తిరోజు గడపాలని నాకూ ఉంటుంది. మిమ్మల్ని సంతృప్తి పరచలేకపోతే బాధపెడితే క్షమించండి.

ఇట్లు మీ ఆదిత్య.

బలరాం గుండె బరువెక్కింది. కొడుకుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా అన్నకోణం అతన్ని మరింత బాధ పెట్టింది. వాడు చెప్పింది నిజమే. నా ఆఫీస్‌, ‌నా యూనియన్‌ ‌ఫ్రెండ్స్ అని తిరిగానే తప్ప కొడుకు వచ్చాడని వాడి టైమింగ్స్‌తో అడ్జస్ట్ అవ్వడానికి ఒక్కరోజుకూడా సిన్సియర్గా ప్రయత్నించ లేదు. అప్రయత్నంగా బలరాం కళ్లలోంచి రాలిన కన్నీటిబొట్లు ఉత్తరాన్ని కడిగాయి. బస్సు వెళ్లిపోయి రెండు నిమిషాలు గడిచింది. సెల్లులో వాట్స్అప్‌ ‌మెసేజ్‌ ‌శబ్దం ట్రింగ్‌మంది అదే మెసేజ్‌ ‘‌సారీ నాన్నా’. కాకపోతే ఈసారి ఆదిత్య పెట్టలేదు. ఆదిత్యకు వచ్చింది. ఎవరు పెట్టారో చెప్పాలా? అక్కర్లేదు కదా!

వచ్చేవారం కథ..

రేపన్నది నీదికాదు

-కె.వి.లక్ష్మణరావు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE
Instagram