‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

ఎలాంటి వ్యామోహపు పొరలు మనసుకు, శరీరానికి అంటించుకోకుండా ఓ రుషి పుంగవుడిలా ఉండిపోయాడు! సమాజ అవసరాల్ని గుర్తించి రుషులు గృహస్థాశ్రమం స్వీకరించినట్లుగా తనూ తన బాధ్యతలు నిర్వహిస్తూనే సాంసారికమైన అనుభూతులని ఎందుకు చవిచూడకూడదు?

అయితే… తనకు పరిశోధనలే ప్రాణం.

దానికి ఆటంకం కలిగించని స్త్రీ, సంతానాన్ని కనిచ్చి పెంచటానికి మాత్రమే ఉపయోగపడే స్త్రీ తనకు కావాలి.

ఆ నిర్ణయం తీసుకున్నాక అతడింక ఆలస్యం చెయ్యలేదు. వెంటనే తల్లి సత్యవతికి మెయిలిచ్చాడు. ఆమె ఆన్‌లైన్‌లోకి రాగానే, ‘‘ఈ మధ్య ప్రభుత్వాలు నాకొక ప్రపోజల్‌ ‌పెట్టిన విషయం విన్నావా?’’ అడిగాడు.

‘‘విన్నాను! అన్నీ తెలవకున్నా, తమ్ముడు చెప్పాడు! ఏమి లాభం కన్నా? నా కొడుక్కు పుట్టిన బిడ్డ, నా ఇంట్లో తిరిగి, నా ఇంట్లో పెరిగి, మా వంశాంకురంగా పెద్దవాడయి పేరు తెచ్చుకుంటే సంతోషంగాని, ఎవరికో పుట్టి, ఎక్కడో పెరిగితే, మాకానందమే ముంటుంది? వాడెలా పెరుగుతున్నాడో, ఏంచేస్తు న్నాడో మాకు తెలవదు కదా?’’ అంది.

‘‘పిచ్చమ్మా! ఇప్పుడు సైన్సుతో పాటు న్యాయ నిబంధనలూ పెరిగాయి. డాక్టర్‌ ‌వ్యాస్‌ ‌రూపాంకురం ప్రపంచంలో ఏ మూలన జన్మించినా, నా సంతా నంగా అది భారతదేశానికి చెందినవాడిగా మెడికల్‌ ‌కౌన్సిల్‌, ఐ.ఎన్‌.ఓ ‌నిర్ణయిస్తుంది. కాబట్టి నీకా సందేహమక్కరలేదు.

‘‘అసలు శారీరక సుఖాల మీద నాకు మనసు లేదు. ఇంతవరకు నాలో పురుషత్వపు జాడలను నేనే గమనించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేనింత వరకు నాలో నేను కూడా రమించని బ్రహ్మచారిని. ఇకముందా విషయమాలోచించాలి!’’ చెప్పాడు.

‘‘వివాహం చేసుకుంటే నీకొచ్చిన నష్టమేమిటి?’’ అడిగింది.

‘‘నష్టమేమీ లేదు. కానీ, ఓ వరవడిలో ప్రయాణిస్తున్న నే పెళ్లితో ‘దిశ’ మార్చుకున్న నదిలా అయిపోతే, నా ఆశయాలు దెబ్బతింటాయి. సంసారం కోసం నా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది!’’ చెప్పాడు.

‘‘ఏమిటో! తమ్ముడికి పెళ్లయి, పిల్లలు పుట్టక వాడలా! ఆరోగ్యం, చదువు, అందం, హోదా ఉండి నీవిలా! ఏదైతేనేమి, నా రెండు కళ్లకు చూపులేనట్లుగా ఉంది!’’ విచారించింది సత్యవతి.

‘‘పోనీ, కాంట్రాక్టు మ్యారేజి, బిడ్డను కని, ఇచ్చి వెళ్లిపోయే అమ్మాయిలెవరయినా దొరుకుతారేమో చూడు. చదువు, అందం, సంస్కారం ఉంటే చాలు. గంగావతరణాన్ని భరించిన శివుడిలా నన్ను కేవలం బిడ్డను కనటానికి భరించే ఇల్లాలిగా ఉండాలి. ఆమెకు నేనన్నీ సమకూర్చగలను. అయితే, ఆమెకు సంబంధించిన అనుబంధాల సంకెళ్లు నాకుండ కూడదు. అంగీకారమయితే అలాంటి అమ్మాయిని చూడు!’’ చెప్పి ఫోన్‌ ‌పెట్టేశాడు వ్యాస్‌.

అక్కడికే ఆవిడ చాలా ఆనందపడిపోయింది.

                                                                                          *       *       *

గీరా, భద్ర, వరూధిని, నాన్సీ, కల్పలత మరోసారి డాక్టర్‌ ‌వరదను కలిశారు.

‘‘హలో… ఏమిటిలా వచ్చారు?’’ చిరునవ్వుతూ పలకరించింది వరద.

డాక్టర్‌ ‌వరద తత్వమే అంత. ఎంతగా శాస్త్ర విజ్ఞానం మీద పట్టు కలిగి ఉంటుందో, అంతకు రెట్టింపు సహనాన్ని పేషంట్ల పట్ల కనబరుస్తుంది.

ప్రస్తుతం ఆమె ఓ సరోగెట్‌ ‌మదర్‌కు సిజే•రియన్‌ ‌చెయ్యాలి. అందుకే డేట్‌ ‌నిర్ణయించింది. అయితే, ఆ పేషంటుకు అనుకోకుండా లేబర్‌ ‌పెయిన్స్ ‌ప్రారంభమయ్యాయి.

రౌండ్స్‌కు వెళ్లి చెక్‌ ‌చేసినపుడు బేబి తల సరైన స్థితిలో లేదు. కానీ, కొన్ని లక్షణాలు కనిపించాయి. తను నిర్ణయించిన తేదీతో సంబంధం లేకుండా అనూహ్యంగా ఆ శిశువు తల క్రిందికొచ్చి సరోగేట్‌ ‌మదర్‌కి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.

అది వరదను సందేహంలో పడేసింది. వెంటనే గూగుల్‌కు లాగినయి, అలా జరిగినా శిశువు క్షేమంగానే ఉంటుంది. అలాంటి దశలో సిజేరియన్‌ ‌కన్నా సహజ ప్రసవమే క్షేమమని తేల్చుకుని రిలాక్సయింది.

‘ఎందుకో వాడికంత తొందర, బైటపడటానికి’ అనుకుంది. అంత టెన్షన్‌లో కూడా తన కోసం వచ్చినవారిని సున్నితంగా రిసీవ్‌ ‌చేసుకుంది.

‘‘చెప్పండి…!’’ తాపీగా ప్రశ్నించింది.

‘‘మీరు సూచించిన విషయాల్ని మేం ఆలో చించాం. మంచిదేననిపించింది!’’ చెప్పింది నాన్సి.

‘‘గుడ్‌! ‌పెళ్లయిన వారిలో కన్నా, మీలో యౌవ్వనం ప్రారంభమయినప్పటి నుంచి వెలువడే ‘అండాలు’ చాలా ఆరోగ్యవంతంగా, బలంగా, చైతన్యవంతంగా ఉంటాయి. రెండోది, అవి వృథాగా పోవడం. గృహిణులకయితే వారికే అవసరం. నేటి పరిస్థితుల్లో రేడియేషన్‌, ‌కాలుష్యం, టెన్షన్‌ ‌వంటివి ఎక్కువమంది స్త్రీ, పురుషుల్ని సంతానహీనులుగా నిలబెట్టాయి. మీ ఆలోచన చాలా ప్రయోజనకర మైనది. నేనెంత కమర్షియల్‌ ‌డాక్టర్నయినా, నాకూ మానవత్వముంది. అందుకే, మీకు ఇన్‌ఫాం చేశాను. అఫ్‌కోర్స్! ‌మీకన్ని విషయాలు తెలియజేసి, అంగీకారం తరువాతనే అనుకోండి!’’ చెప్పింది.

ఆమె మాటల్లో ఉద్వేగం లేదు. బక్రాలు దొరికారన్న సంతోషం లేదు. చాలా క్యాజ్‌వల్‌గా ఉంది. ఆ హుందాతనానికి ఆశ్చర్యపోయారు వాళ్లు.

‘‘అందుకే మా ‘అండాలు’ వృథా కాకుండా, వాటిని ‘దానం’ చేద్దామనుకుంటున్నాం. మాకూ కొంచెం ఆర్థిక వెసులుబాటు ఉంటుంది’’ చెప్పింది భద్ర.

‘‘థాంక్యూ! మీరు గొప్పగా ఆలోచించి శాక్రిఫైజ్‌ ‌చేస్తున్నారు’’ అంది వరద.

‘‘దానికి మీరింత గొప్ప పేరు పెట్టనవసరం లేదు డాక్టర్‌! ‌మాలో వృథాగా పోయే వాటిని, అంటే, మాకవసరం లేనివాటిని మాత్రమే ఇస్తున్నాం. అదీ ఫ్రీగా కాదు, డబ్బు డిమాండ్‌ ‌చేసి మరీ తీసుకుంటున్నాం!’’ కరాఖండిగా చెప్పేసింది నాన్సి.

‘‘ఆగు నాన్సీ! దీనికి శాస్త్రీయంగా వైజ్ఞానికంగా ఏవో ఆరోగ్యసూత్రాలు, సమస్యలు ముడివడే ఉంటాయి. అంత తేలిగ్గా మాట్లాడకు! మనలో నెలకు ఒక అండం విడుదలవుతుంది కాబట్టి, అల్టర్‌నేట్‌ ‌మంత్‌లో దానం చేసి, ఓ నెల ఉంచుకుని మరో నెల ఇద్దాం. లేకుంటే, మనకూ ముందు ముందు ఏమయినా అవసరపడొచ్చు!’’ మధ్యేమార్గంగా ఆలోచిస్తున్నట్టు చెప్పింది వరూధిని.

‘‘గుడ్‌ ఐడియా! నిజమే. మనం బ్యాలెన్స్‌గా ఉండటానికి హార్మోన్స్ ఉపయోగపడతాయి. అండాశయాలు లేకుంటే, అండాలు ఉత్పత్తి కావు. అందుకే గర్భసంచి తొలగించాల్సి వస్తే కూడా ఓవరీస్‌ ఉం‌చుతారు.

‘‘భగవంతుడు అన్నీ ఆలోచించే, మానవదేహాల్ని సృష్టించాడు. తెలివైన మానవుడు వాటిని సొమ్ము చేసుకుంటున్నాడంతే! ప్రకృతి మనకు నిస్వార్థంగా ఇచ్చినవాటిని, ఆర్థికపరంగా మనం ఉపయోగించుకుంటున్నా వాటిని మరో మంచిపనికే ఉపయోగిస్తున్నందుకు చింతించవలసినదేమీ కాదిది!’’వరూధిని చెప్పింది అంగీకరిస్తూ.

‘‘మీరు చెప్పిందానికి అంగీకరిస్తున్నాం డాక్టర్‌! ‌తొందరపెట్టకుండా మాకూ ఆలోచించుకునే సమయమిచ్చారు. భవిష్యత్తులో కుటుంబ జీవనం, ఐమీన్‌ ‌దాంపత్య జీవనంలో మాకెలాంటి సమస్యలూ రావుగా!’’ ఆరిందాలా ప్రశ్నించింది కల్పలత.

వారివంక ఒక్కక్షణం నవ్వుతూ చూసింది డాక్టర్‌ ‌వరద. ఆమెకు వారి మనసులు అర్థమయ్యాయి. డాక్టర్స్‌కే కాదు, ఇలాంటి వారికి కూడా పెట్టుబడి లేని సంపాదన కావాలి. అది అవసరాలకు కావచ్చు, విలాసాలకు కావచ్చు. ఎప్పుడైనా ఇచ్చేవాళ్లుంటేనే తీసుకునేవాళ్లు తయారవుతారు. అందుకు వీళ్లు… సిద్ధంగానే ఉన్నారు. తేల్చాల్సింది తనే! వారి మనసుల లోని సందేహాల్ని తీర్చటమే తన పని అనుకుంటూ, ‘‘మీకు ఎలాంటి సమస్యలూ రావు. రెండోది. ఈ విషయాలన్నీ చాలా గోప్యంగా ఉంటాయి. కడుపున మోసే మీరు గాని, మీ గర్భాన్ని అద్దెకు తీసుకున్న వాళ్లుగాని ఒకరినొకరు కలవరు. కేవలం డీ•ఎన్‌ఏ ‌పరీక్షతో వారి బిడ్డల్ని గుర్తించి తీసుకునివెళ్లిపోతారు. ఏ నెలలో ‘అండం’ అవసరమౌతుందో, ఆ నెలలో ముందు పదిహేను రోజులు, మీలో హార్మోన్స్ ‌సరిగా పనిచెయ్యటానికి, అండాలు చైతన్యవంతంగా, ఆరోగ్యంగా విడుదల కావటానికి ‘ప్రాజెస్తాన్‌’ ‌టాబలెట్స్ ఇస్తాం.

‘‘దానివల్ల సరోగేట్‌ ‌మదర్‌కు ఎలాంటి పునరుత్పత్తి సమస్యలు రావు. డొనేట్‌ ‌చేసే గర్భస్థశిశువు ఆరోగ్యంగా ఎదగటానికి గర్భాశయపు గోడలు గట్టిపడి పిండాన్ని రక్షిస్తాయి.

‘‘మీరెలాంటి సందేహాలు పెట్టుకోకుండా ముందుకు సాగవచ్చు. దీనికి మీకు నేను హామీగా ఉంటాను!’’ చెప్పింది డాక్టర్‌ ‌వరద.

వాళ్లు నవ్వి ఊరుకున్నారు.

గీరా మాత్రం ‘‘ఓకే, లాస్టు ఒన్‌ ‌థింగ్‌. ‌జన్యు పరంగా, మా డీఎన్‌ఏ ‌కూడా ఉంటుంది కాబట్టి, శిశువు మీద భవిష్యత్తులో మాకేమయినా హక్కుంటుందా?’’ ప్రశ్నించింది.

‘‘ఉండదు. అయినా, శిశువు ఎవరో, ఎక్కడుందో మీకు తెలిస్తేగా హక్కు గురించి ఆలోచించటానికి! రెండోది, జన్యుపరంగానయినా మీరు దాన్ని దానంగా ఇచ్చేశారు. ఆర్థికపరంగా డబ్బు తీసుకుని ఒప్పందం చేసుకున్నారు కాబట్టి, కోర్టుకు వెళ్లినా మీ హక్కు ఫలించదు’’ చెప్పింది.

తిరిగి ‘‘మీరేమి వర్రీ కావద్దు. మీ పిల్లలు మీకూ పుడతారు’’ అంది డాక్టర్‌ ‌వరద.

‘‘ఇదేదో అపరాధంగా భావించొద్దు. మీరివ్వ కున్నా అది నిరుపయోగమై మీ ఋతుచక్రం లోంచి జారిపోయేదే. ఇలా మీరు డొనేట్‌ ‌చేయడానికి ముందుకొచ్చినందుకు పిల్లల్లేని ఎంతోమంది దంపతులకు ఉపయోగపడతారు. వాళ్లు తల్లిదండ్రు లయి, ఆ తల్లులు మాతృత్వం సాధిస్తే, ఆ గొప్పదనా నికి పరోక్షంగా కారణం మీరే అవుతారు!’’ చెప్పింది డాక్టర్‌ ‌వరద.

‘‘మేము అండాలని డొనేట్‌ ‌చేస్తాం. మా వివాహం అయ్యేంతవరకు!’’ చెప్పారు.

‘‘నేను దేనికయినా, ఐమీన్‌ ‌సరోగెట్‌ ‌మదర్‌ ‌గానయినా సిద్ధమే!’’ చెప్పింది నాన్సి.

‘‘నాకూ సరోగెట్‌ ‌మదర్‌గా రావాలనుంది. నాకు తొమ్మిది నెలలు బిడ్డను మోసి కనాలనుంది. నిజానికి నాకా అవకాశం లేదు. నేను, పెళ్లయి, భర్త వదిలేసిన అమ్మాయిని కాబట్టి, అక్రమంగా పిల్లల్ని కనలేను. ఓ తల్లిగా అది లేకుండా ఉండలేను’’ స్థిరంగా చెప్పింది గీరా.

వరద వాళ్లను పంపేసి లేచింది రౌండ్స్‌కు.

                                                                                                       *       *       *

డాక్టర్‌ ‌వ్యాస్‌ ‌విశ్రాంతిగా తన గదిలో కూర్చున్నాడు. మనసు నిలకడగా లేదని తొలిసారిగా అతనికే అనిపించింది.

ఎందుకు నా మైండిలా అప్‌సెట్‌ అయింది? అమ్మ కోరిక సహజమేగదా! అందులో తప్పేముంది?

నిజమే, ఒక వ్యక్తిగా చూసుకుంటే నా పర్సనల్‌ ‌లైఫ్‌ ‌నా స్వంతం. కానీ నా ప్రతిభను నమ్మి నా పైన ప్రతీ ప్రభుత్వం బిలియన్‌ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నది. అలాంటప్పుడు. నా జీవితం, నా ఒక్కనిది కాదు. సమాజానిది. నా తదనంతరం నా తెలివితేటల్ని, మేధస్సును మరో తరానికందించే బాధ్యత నాదే• కదా!

అలా ఇవ్వనని, అది నా వ్యక్తిగతమనుకోవటం తప్పే! అయితే అమ్మ కోరిక తీర్చటంలో తప్పులేదు. కేవలం బిడ్డను కనిచ్చే ఒప్పందంపై ఏ అమ్మాయి అయినా కాంట్రాక్టు పద్ధతికి ఒప్పుకుంటే… తన ఆలోచనలకు తనే నవ్వుకున్నాడు.

వివాహం, సంతానం, గృహస్థజీవనం అనేది భారతీయ వ్యవస్థలో సర్వసాధారణం. అది సామాజికమైనది కూడా. ఆ సమాజంలోంచి వచ్చిన తను ఇంతగా ఆలోచించాల్సి రావటం ఆశ్చర్యం అనిపించింది.

సంబరాజు లీల (లట్టుపల్లి)

About Author

By editor

Twitter
YOUTUBE