‘చాలా మంచి పని జరిగింది, చాలామంచి పని జరిగింది’ అన్నాడు.‘ఉక్కు మనిషి’ సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయి పటేల్‌. ‌సాధారణంగా గంభీరంగా ఉండే వ్యక్తి. నిర్వికారంగా ఉండే ఆ వ్యక్తి కె.ఎం, మున్షీతో అలా అన్నారు. బహుశ సంస్థానాలకు సంబంధించిన యేదో జటిల సమస్యకు పరిష్కారం దొరికిందేమో!

బ్రిటన్‌ ‌జాతీయులు కుటిల రాజకీయాలలో నిష్ణాతులు. గత్యంతరం లేక భారత్‌ ‌నుండి వెళ్లిపోతూ అనేక రాజకీయ కల్లోలాలు సృష్టించిపోయారు. సంస్థానాలు తమ ఇష్టానుసారంగా భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌లలో విలీనం చేసుకోవచ్చు, లేదా స్వతంత్య్రాన్ని ప్రకటించుకోవచ్చుననేది అందులో ఒకటి. ముస్లింలు, హిందువులు తనకు రెండు కళ్లు లాంటి వారనీ, హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేస్తే హిందువులు బాధ పడతారనీ, భారత్‌లో విలీనం చేయడం ముస్లింలకు ఇష్టం లేదనీ ఈ పరిస్థితుల్లో తన రాజ్యం స్వతంత్రంగా ఉండటమే మంచిదని తెలివిగా ప్రకటించాడు. నిజాం వాస్తవంగా సంస్థానం లోని అధిక సంఖ్యాకులైన హిందువులు స్వతంత్ర భారత్‌లో విలీనం కావడానికే మొగ్గు చూపారు. వీరికి ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌, ఆర్య సమాజాలు అందుకు కృషి చేశాయి. ‘మూడు కోట్ల చేతులు నీ మేడను పడతోస్తాయి, మెడనే విడదీ స్తాయి, నీకు నిలుచు హక్కులేదు, నీకింక దిక్కులేదు’ అన్నాడు దాశరథి. ఆగస్టు 15, 1947 నాటి నుంచి హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ఆం‌దోళనను తీవ్రతరం చేసింది. తీవ్రమైన దమనకాండ జరిగింది.‘తన గాథను తానే స్మరించి, భోరున ఏడ్చింది ధరణి’ అన్నారు సోమసుందర్‌.

‌లాయక్‌ఆలీ ప్రధాని కాగానే డమ్మీ మంత్రి వర్గాన్ని ఏర్పాటుచేసి దానిలో కొందరు హిందువులను (మాట వినే రామాచారి లాంటి వారిని) చేర్చి తాను మత సహనం గల వ్యక్తిగా ప్రచారం చేయించుకు న్నాడు నిజాం. లాయక్‌ అలీ బయట నుండి గూండా లను జైలుకు తీసుకువెళ్లి జనవరి 11,1948న రాజకీయ ఖైదీలను విపరీతంగా కొట్టించారు. దీనితో రామాచారి రాజీనామా చేశాడు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేకమంది విద్యార్థులను విశ్వవిద్యాలయాల నుండి బహిష్కరించారు. ధన ప్రాణమానాలకు రక్షణ లేకపోవడం వలన లక్షల సంఖ్యలో ప్రజలు వలసపోయారు. ఈ అన్యాయాన్ని బయటపెట్టిన పత్రికల నోళ్లు మూయించారు. బయటనుండి కిరాయి పత్రికా విలేకరులను రప్పించి, తన గురించి అంతర్జాతీయ పత్రికలో వచ్చేటట్లు చేసుకున్నాడు. భారత ప్రభుత్వంపై విషప్రచారం అందులో భాగం. ‘పడమటి బొల్లిగద్దలు పొడిచి పొడిచి తిని విడిచిన అగ్ని సంస్కారం నోచని నగ్న శవాలను’ చూశాను అన్నారు దాశరథి. ఈ దశలో న్యాయవాదులు చేసిన ఉద్యమం స్మరణీయమైనది.

ఖలీల్‌ ‌జిమ్మా సిద్ధికి హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి. వినాయక్‌రావు విద్యాలంకార్‌ ‌హైకోర్టులో ప్రముఖ న్యాయవాది, జాతీయవాది. 1948 ఫిబ్రవరిలో హైకోర్టు న్యాయవాదులందరూ వినాయక్‌ ‌రావు నివాసంలో సమావేశమై, నిజాం హింసాకాండ గురించి చర్చించుకున్నారు. తరువాత 129 ప్రముఖ న్యాయవాదుల సంతకాలతో ప్రధాన న్యాయమూర్తికి ఒక విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. ఇది దాని సారాంశం.

‘శ్రీయుత ప్రధాన న్యాయమూర్తి గారికి,

ఉన్నత న్యాయస్థానం, సర్కారే ఆలీ!

తమరి సమక్షంలో తమకు కొన్ని చేదు నిజాలను, యదార్థ దుస్థితిని నివేదించే పరిస్థితి ఏర్పడినందుకు చింతిస్తున్నాం. న్యాయవాదుల సంఘం (బార్‌) ‌ప్రజలకు న్యాయమందించేందుకు కృషి చేస్తుంది. అవసరమైనప్పుడల్లా ప్రభుత్వానికీ, ప్రజలకూ మార్గదర్శకత్వం చేస్తుంది. మీకు ఈనాడు ఏర్పడిన విషమ పరిస్థితి తెలియనిది కాదు. అయినా మీ దృష్టికి కొన్ని వాస్తవాలను తీసుకురావలసిన బాధ్యత మాకుంది.

దేశంలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజల యోగక్షేమాలను చూడడం ప్రతీ ప్రభుత్వ ధర్మం. కానీ ఇక్కడి ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైంది. దాని పాలనా యంత్రాంగం నిరుపయోగంగా ఉంది. సంస్థానంలో కొంతకాలం నుంచి బహిరంగ దోపిడీలు, హత్యలు మామూలైపోయాయి. అయినా ప్రభుత్వం ప్రజారక్షణకు ఎలాంటి చర్యలు తీసుకో లేదు. పైగా ఈ దుష్కృత్యాలను కప్పిపుచ్చుతోంది. ఫలితంగా సాయుధ గూండాలూ, దోపిడీ దొంగలూ దళాలుగా ఏర్పడి గ్రామాలను లూటీ చేస్తున్నారు. హత్యలూ, మానభంగాలు, దహనాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. పోలీసులు ప్రజలను కాపాడడానికి బదులు అక్కడక్కడా గూండాలకు అండగా ఉంటు న్నారు. ఇక్కడ ప్రబలిన మత దురహంకార కార్యకలా పాలూ, అత్యాచారాల గురించి బాధ్యతాయుతమైన వ్యక్తులు, పత్రికలు ప్రభుత్వాన్ని హెచ్చరించినా ప్రయోజనం లేకుండాపోయింది. పైగా ప్రభుత్వమే మత కలహాల విషాన్ని వెదజల్లుతున్న సంస్థలకు విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన పత్రికలను నిషేధించి, అనేకమంది న్యాయవాదులను జైళ్లలో నిర్భంధించారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా ప్రజలు ఇళ్ల• వదిలి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. గ్రామవాసులు అడవులలో తలదాచుకుంటున్నారు. సంస్థాన పాలనా యంత్రాంగం స్తంభించిపోయింది.

ఈ పరిస్థితులు చక్కబడే వరకూ మేము న్యాయ స్థానాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాం. సంస్థానాల్లో శాంతి భద్రతలను పునరుద్ధించే వరకూ కోర్టులను బహిష్కరిస్తాం. శాంతిభద్రతలు నెలకొనా లంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడాలి. ప్రజల క్షేమాన్ని కాపాడే ప్రభుత్వం కావాలని రాజ్యంలో అన్ని వర్గాలు కోరుతున్నాయి. అప్పటి వరకు మేము న్యాయస్థానాలలో పని చేయడం సాధ్యం కాదు. న్యాయస్థానాలను అవమానపరిచే ఉద్దేశం మాకు లేదు. మా క్లయింట్లకు ఇబ్బంది కలుగకుండా వేరే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ రాజ్యంలో శాంతిభద్రతలు నెలకొనే కాలం వస్తుందని విశ్వసిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం.’

హైదరాబాదు చరిత్రలోనే ఇది ఒక అపూర్వ ఘటన. సహాయ నిరాకరణోద్యమ కాలంలో కూడా విజయవంతంకాని కోర్టుల బహిష్కరణ ఇక్కడ సంపూర్ణంగా జరిగింది. సుమారు నాలుగు వందల మంది యూనిఫారమ్‌ ‌ధరించి కాలినడకన హైకోర్టుకు ఊరేగింపుగా వెళ్లి ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞాపన పత్రం సమర్పించి తిరిగి వినాయకరావు గారింటికి బయలుదేరారు. ఈ చర్యను సమర్థిస్తూ మద్రాసు బార్‌ అసోసియేషన్‌ ‌తీర్మానం చేసింది. ఆలిండియా రేడియో వార్తను ప్రసారం చేసింది. ఈ సాహసవంతమైన పనివలన హైదరాబాద్‌ ‌నిజస్వరూపం ప్రపంచానికి తెలిసింది. దీనిని మించి న్యాయవాదులు మరో పటిష్టమైన పని కూడా చేశారు. సంస్థానంలో జరిగిన అత్యాచారాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించారు. ఈ రికార్డులు భారత ప్రభుత్వ వాదనకు అసాధారణ బలాన్నిచ్చాయి. కోర్టుల బహిష్కరణ వార్త సర్దార్‌ ‌పటేల్‌ను కలిచి వేసింది. ‘చాలామంచి పని చేశారని’ ఆ సందర్భంలోనే అన్నారు.

సంస్థానంలో ప్రబలిన ఆరాచకత్వాన్ని కళ్లారా చూసిన మేధావివర్గం తల్లడిల్లి పోయింది. సదాశివ రావు అనే యువ న్యాయవాది మిత్రులు జె.వి.నర్సింగ రావు, మాధవరెడ్డి, బారిష్టర్‌ ‌సహాబుద్దీన్‌లతో కలిసి ఆలోచించాడు. ఆర్థిక బలం లేని న్యాయవాదుల సంగతి ప్రధాన సమస్యగా మారింది. కాబట్టి రూ. 10,000 సహాయనిధిని పోగుచేయాలని ఆలోచిం చారు. కొందరు అది జరిగాకే కోర్టుల బహిష్కరణ చేపట్టాలని సూచించారు. జె.వి.నర్సింగరావు తన భార్య నగలు తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని తీసుకు వచ్చారు. దానితో పని ప్రారంభమయ్యింది. కె.వి. రంగారెడ్డి, దొంతి గోపాలరెడ్డి సహాయపడ్డారు. ఆందోళన సాగినంతకాలం ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇవ్వడానికి, వనపర్తి రాజా రామేశ్వర్రావు ముందుకు వచ్చారు. తన ఇంట్లో న్యాయవాదుల సమావేశాలు జరుపుకోవడానికి కాశీనాథ్‌రావు వైద్య అంగీకారం తెలిపారు. ఈ సంస్థకు ‘ప్లీడర్సు ప్రొటెక్టు కమిటీ’ (పీపీసీ) అని పేరు పెట్టారు. వినాయకరావు విద్యాలంకార్‌ అధ్యక్షుడు. ఉపాధ్యక్షులుగా గోపాల రావు ఎక్బోటే, కార్యదర్శిగా ధరణీధర్‌, ‌కోశాధికారిగా జె.వి.నరసింగరావులను ఎన్నుకున్నారు. వసంతరావు మధుఖేడ్కర్‌ ఇం‌టిని పీపీసీ కార్యాలయంగా నిర్ణ యించారు. తరువాత ఆ ఇల్లు ‘హైదరాబాద్‌ ఆనంద భవన్‌’ అని పేర్గాంచింది. తనకు లోబడి పనిచేయాలని స్టేట్‌ ‌కాంగ్రెసు కోరినా పీపీసీ నిరాకరించింది. ఏ రాజకీయ పక్షానికి చెందకుండా పనిచేసింది.

నియమిత కాలంలో జిల్లా, తాలూకా స్థాయు లలో న్యాయవాదులు న్యాయస్థానాలను బహిష్కరించే స్థాయికి వచ్చారు. కొన్ని న్యాయస్థానాలు పూర్తిగా స్థంభించిపోయాయి. ఎక్కడ గృహ దహనాలు, లూటీలు, హత్యలు, మానభంగాలు జరిగినా సంస్థ సభ్యులు స్వయంగా వెళ్లి సమాచారం సేకరించి తీసుకువచ్చేవారు. ఈ సమాచార సేకరణలో లింగాయత్‌ ‌నాఫ్సరెన్స్, ‌స్థాయీ సంఘం, హిందూ దినపత్రిక విలేఖరి వామన్‌రావులు బాగా సహాయ పడ్డారు. జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా విజ్ఞప్తి పత్రాలను ప్రధాని నెహ్రూకు, ఏజెంటు జనరల్‌ ‌కె.ఎం.మున్షీకి, కాంగ్రెసు అధ్యక్షులు బాబూ రాజేంద్ర ప్రసాద్‌కు పంపేవారు. ముఖ్యమైన ఫోటోలు, ఘటన లకు సంబంధించిన కాగితాలు ప్రభుత్వ శ్వేత పత్రానికి ఉపయోగపడ్డాయి.

హైదరాబాద్‌లో మజ్లిస్‌ ఇతేహదుల్‌ ‌ముసల్మీన్‌ ‌చేస్తున్న తీర్మానాలను, ఉపన్యాసాలను ఆంగ్లంలోనికి అనువదించి భారతప్రభుత్వానికి పంపించేవారు. అవే నాలుగు పెద్ద సంపుటాలు. ఇతర భారతీయ భాషల పత్రికలకు పీపీసీ రజాకారుల వార్తలను పంపేది. అయితే కొద్దికాలంలోనే నిజాం పాలకవర్గం పత్రికలపై నిషేధం విధించింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురించారన్న కారణంగా ‘రహనుమా’ మూత పడింది. ‘ఇమ్రోజ్‌’ ‌సంపాదకుడు షోయబ్‌ ఉల్లాఖాన్‌ను హత్య చేశారు.

న్యాయవాదుల నిరసనలు, ఊరేగింపులు సంఘటనా స్థలాలలో ప్రజలను విచారించడం వలన పాలక యంత్రాంగంలో కలవరాన్ని కలిగించాయి. న్యాయవాదుల గుర్తింపు రద్దు చేయాలని నిజాంకు నివేదించడం మొదలైంది. అయినా పీపీసీ కార్య కర్తలు నిర్భయంగా కార్యక్రమాన్ని కొనసాగించారు. దానితో వారిని అరెస్టు చేయడం మొదలైంది. శ్రీరామచంద్ర ఖాదేకర్‌, ‌వాసుదేవరావు, గౌసుద్‌కర్‌ ‌లను బాంబు కేసులో అరెస్టు చేశారు.

1948 సెప్టెంబరు నెలలో ప్రధాని మీర్‌లాయక్‌ ఆలీ ఓ ప్రకటన చేస్తూ ‘సంస్థానంలో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉన్నాయి, కనుక భారతసైన్యానికి నిజాంపై దాడి చేయాల్సిన అవసరం లేదని’ పేర్కొన్నారు. ఆ వెంటనే హైదరాబాదు లాయక్‌ ఆలీ ప్రకనటను ఖండిస్తూ వినాయకరావు (పీపీసీ అధ్యక్షుడు) దానిని ఖండించారు. ‘ప్రధానమంత్రి లాయక్‌ ఆలీ సంస్థానంలో శాంతిభద్రతలు నెలకొన్నా యని ప్రకటించడం సత్యదూరం. గత ఆరుమాసాల నుండి న్యాయవాదులు ఎందుకు కోర్టులు బహిష్కరిస్తున్నారు? 15 జనవరి, 1948 నుండి 11 ఆగస్టు 1948 మధ్య జరిగిన సంఘటనలను మా సమితి విచారించింది. మజ్లిస్‌ ‌సభ్యులు జరిపిన అత్యాచారాలను కొన్నిటిని తీసుకుంటే వాస్తవం బయటపడుతుంది. పైన పేర్కొన్న కాలంలో 353 గ్రామాల్లో ఘోర కిరాతకాలు జరిగాయి. 50 గ్రామాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. గ్రామస్థు లను చంపేశారు. ఆ అమానుష కిరాతకాలను వర్ణించాలంటే మాటలు చాలవు. ఒక్క గోర్జ గ్రామంలో 200 మందిని చంపి, 75 లక్షల రూపాయల ఆస్తిని దోచుకున్నారు. 500 మంది హిందువులను వరుసగా నిలబెట్టి ముస్లింలు కాల్చివేశారు. ఒక మతాన్ని దోచుకున్నారు. కాశీం రజ్వీ అనేక ప్రాంతాలను దోచుకుని లారీల్లో నింపుకొని విజయయాత్ర సాగించాడు. జనవరి నుండి ఆగస్టు వరకూ ఆయా ప్రాంతాల్లో జరిగిన ఘోర మారణకాండను కప్పిపుచ్చడం మాకు సాధ్యం కాదు. మానభంగాలు, మంగళసూత్రాలు లాక్కోవడం నిత్యం జరిగేదే. వీటన్నిటిని విస్మరించి ఇక్కడ శాంతి భద్రతలు నెలకొన్నాయని ప్రకటించడం ప్రపంచం కంట్లో దుమ్ము చల్లడమే. ప్రజలకు రక్షణ కల్పించ కుండా అత్యాచారాలను ఎదుర్కొనకుండా ప్రపంచాన్ని మభ్య పెట్టడం మీకు సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.

లాయక్‌ ఆలీ ప్రకటనను ఖండిస్తూ వెలువడిన ప్రకటన తర్వాత పరిణామాలు వేగంగా మారి పోయాయి. వ్యతిరేక ప్రకటన వెలువడిన మరుసటి రోజు రాత్రి నిజాం పోలీసులు వినాయకరావు ఇంటిని చుట్టుముట్టారు. ఆయన నివసించే జామ్‌భాగ్‌లోని కింబట్‌లో అరెస్టు చేసి, చంచల్‌గూడాలో ఉంచారు. అప్పటికే అరెస్టు అయి ఆ జైల్లో ఉన్న స్వామి రామా నంద తీర్థ ‘మీరు కూడా వచ్చేశారా? అన్నారట. ‘అవును మిమ్మల్ని విముక్తం చేయడానికి’ అన్నారట వినాయకరావు. ఆపరేషన్‌ ‌పోలో తరువాత న్యాయ వాదులు, రాజకీయ ఖైదీలు విడుదలయ్యారు. పీపీసీ సేకరించిన సమాచారాన్ని ఎనిమిది పెట్టెలలో పెట్టి భారతీయ గూఢచారి విభాగాధిపతి నగర్‌వాలాకు స్వాధీనం చేశారు. ఈ అమూల్య చారిత్రకపత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు.

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE