– కె.కె.రఘునందన

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘సార్‌! ఎం‌దుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి…మీ అబ్బాయికి ఈ చదువుపై ధ్యాస లేదు. ఆసక్తి లేనప్పుడు దండించడం సబబు కాదని మిమ్మల్ని పిలిచాను. పైగా లోపల్లోపల ఏవో వల్లించుకుంటూ మాటి మాటికీ దణ్ణాలు పెట్టేస్తుంటాడు. మీరు ఏమను కోనంటే నాదో సూచన…’’ నన్ను పాఠశాలకు పిలిచాక నాతో రంగనాథం మాష్టర్‌ అన్న మాట.

ఏమిటో చెప్పండన్నట్లుగా కుతూహలంగా చూసాను.

‘‘మీ వాడిని కూడా మీ దారిలోనే పెట్టండి. తనకి ఆ వైపు వెళితే రాణిస్తాడేమోనని నా అభిప్రాయం. నమ్మకం కూడా. ఇలా చెప్పానని మరోలా అనుకో కండి.’’ అని మొహమాటపడుతూనే చెప్పారాయన.

నన్ను చూస్తూనే అభిరాముడు దగ్గరగా వచ్చి ‘‘నాన్నా!’’ అంటూ చుట్టుకు పోయాడు. మరోమాట మాట్లాడకుండానే వెనుదిరిగాను.

‘‘పిల్లాడు బాగా చదువుతున్నాడని మాష్టారు చెప్పారా?’’ శ్రీమతి విద్యావతి కళ్లల్లో నిండుగా ఆశ…

 జరిగింది చెప్పాను. ‘‘వాళ్లలాగే చెబుతారండీ! ఈరోజుల్లో పనికిరాని కుర్రాళ్లని వేళ్లపైన లెక్క పెట్టొచ్చు. రాయికి కూడా చదువుమప్పేలాగ ఎన్నో సంస్థలు వేలల్లో ఎక్కడికక్కడున్నాయి. మన నాలుగిళ్ల వతల ఉండే శివబ్రహ్మం గారు తన కొడుకుని విశాఖపట్నంలో చేరిస్తే ఆర్నెల్లలోనే మెరికలాగ తయారు చేశారట. మరి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చేరిస్తే ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి…’’ అని మా మధ్య చర్చ సాగుతుండగానే అభిరాముడు మెడలో సంచీ వేసుకుని వచ్చేశాడు.

‘‘ఏమైందిరా? మధ్యలోనే వచ్చేశావేమి?..’’అని ఆత్రుతగా అడిగింది విద్యావతి.

‘‘ఏమోనమ్మా! వాళ్లు చెప్పింది నాకేం అర్థం కావడం లేదు…మరి వెళ్లనమ్మా!’’ అని చెప్పేసి రయ్‌మని వీధిలోకి పరిగెత్తాడు.

‘‘వీడికి ఆటలపై దృష్టి ఎక్కువైపోయింది. వీడినిలా గాలికి, ధూళికి వదిలేస్తే జీవితం పక్కదారి పడుతుంది. మరి తాత్సారం చేయకుండా ఆ శివబ్రహ్మం గారిని కలిసి వాళ్లబ్బాయిని ఎక్కడ చేర్చారో కనుక్కుని అక్కడకి తీసుకెళ్లి ఉంచండి…వీడో దారిలోకి వస్తాడు…’’ అని చెప్పాక నేను కదలక తప్పలేదు.

శివబ్రహ్మం చెప్పినప్పటికీ అక్కడ ఫీజులకి నాకొచ్చే ఆదాయంతో తట్టుకోగలనో,లేదోనన్న సంశయం ఎక్కువైంది. ‘‘ఆ ఫీజులకి అంత సొమ్ము కట్టగలనాని ఆలోచిస్తున్నాను విద్యా!’’ అని డీలాపడి పోయాను.

 ‘‘వాడి బాగే మనకు ముఖ్యమనుకుంటే నా నగలు కూడా తాకట్టు పెట్టడానికి సిధ్ధమండీ. అమ్మాయికి పెళ్లి చేసి పంపేశాం. ఇక మిగిలింది వీడి భవిష్యత్తేగా… తప్పదండీ ..’’ అని చెప్పడంతో కొంత ధైర్యం కూడదీసుకుని విశాఖపట్నం వెళ్లాను వాడు రానని మొండికేస్తాడేమోనన్న నా అనుమానం తొలగింది. కొత్త ప్రదేశం అనేసరికి అభిరాముడు కొంత హుషారు కనపరిచాడు..

అక్కడి వసతిగృహంలో చేర్చి వారందరికీ అప్పచెప్పి తిరిగి వచ్చాను. ఇంతకాలం మా దగ్గరున్న వాడినొక్కసారి ఒంటరిగా విడిచిపెట్టి రావడం చాలా బాధించింది. ‘‘అలాగ బాధపడితే ఎలాగండీ… వాడో దారిలోకి రావాలనేగా మన ప్రయత్నం. ఉండనీండి. వాళ్లే మనవాడికి తీరిక లేకుండా చదువులోనే ఉంచుతారు.’’ అని శ్రీమతి ధైర్యం ఇచ్చినా అటువైపే ధ్యాస…

ఒకవారం అయ్యేసరికి అభిరాముడు కుదురు కున్నాడేమోనని సంబరపడ్డాం. ఐతే ఆ ఆశ మరో ఐదు రోజులకే బూడిదలో పోసిన పన్నీరైంది. ఆ విద్యాసంస్థ నుండి ఫోన్‌. ఏమైందోనని గబగబ పరిగెత్తాను. ‘‘మీవాడినిక్కడ చేర్చడం శుధ్ధ దండుగ. మేం చెప్పేది ఏదీ మీవాడికి ఒంటబట్టడం లేదు. ఎంతసేపు ఏవో శ్లోకాలు వల్లె వేసుకుంటూ కనిపిస్తాడు. అందువలన మీకు డబ్బు వృథా తప్ప మరోటి కాదు. తీసుకెళ్లిపోండి..’’ నేనేదో చెప్పే ప్రయత్నం చేయబోతూంటే అడ్డుపడి వెంటనే సొమ్ములో కొంత తగ్గించి తిరిగి ఇచ్చేసి వెనక్కి పంపేశారు..

ఉసూరుమంటూ పెట్టేబేడతో ఇల్లు చేరిన నన్ను చూసి. ‘‘ఏమండీ! వీడి గురించి నాకు బెంగ పట్టు కుందండీ…’’ అన్నది కన్నీళ్లు పెట్టుకుంటూ విద్యావతి.

‘‘అయ్యా! మిమ్మల్ని ఈవో గారు అర్జంట్‌గా రమ్మంటున్నారు. ఆలయం రద్దీగా ఉందిట’’ అని దేవాలయం నుండి కబురొచ్చిన మరుక్షణం బైల్దేరాను. వెళ్లగానే నాలుగు అక్షింతలు వేసారు ఈవో…ఐనా భరించక తప్పలేదు. అసలే శనివారం. పట్నంలో ఉన్నవాళ్లంతా మందలా దిగుతారు. సాయంత్రం దాకా ఒకటే జనప్రవాహం. తీర్థప్రసాదాలు అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. భక్తులకి ఏ లోటు వచ్చినా సిబ్బందిపైన ఫి•ర్యాదులు చేస్తారు..

ఇంటి దగ్గరున్న అభిరాముడు కూడా ఆలయానికి వచ్చేశాడు. అది చూసిన శివబ్రహ్మం ‘‘అదేంటి! నేను చెప్పినట్లుగా విశాఖలో మీవాడిని చేర్చలేదా?’’ అని విస్తుబోతూ ప్రశ్నించాడు.

అంతా చెప్పాను. ‘‘నువ్వు మాత్రం ఏం చేస్తావు అవధానీ! ఇక వాడిని కూడా నీ బాటలోనే నడిపించు మరి. ఎవరికి ఏది ప్రాప్తమో మరి…’’ అని ఉస్సురని నిట్టూర్చాడు.

‘‘వాళ్లెవరో చెప్పారని మళ్లీ మీలాగే వాడినీ ఈ గుళ్లూ గోపురాలలో సేవలకి పరిమితం చేస్తారా? నాకసలు ఇష్టం లేదండీ. జీవితాంతం మీరెంత కష్టాలనెదుర్కొన్నారో మీకు తెలీనిది కాదు. మీ నాన్న కూడా అలాగే బ్రతికారు. ఎన్నో కష్టాలకు కన్నీ ళ్లకు ఎదు రొడ్డి…మళ్లీ మీ వారసత్వం గానా?’’ నన్ను దులిపేసింది విద్యావతి.

‘‘మరి గాలికొదిలేయాలా చెప్పు? వీడికా ఆ ఇంగ్లీషు చదువులబ్బవు..ఈ ఊళ్లో మన తెలుగులో జాయిన్‌ ‌చేసినా సరిగా లేడు. మరి నన్ను బుర్ర కొట్టుకోమంటావా?’’ కోపమొచ్చి ఎగిరాను.

అప్రశాంతతకు నిలయమైంది మనసు. అభిరాముడిని పెంచడంలో విఫలమైనామా?ఆ రోజుల్లో చక్కగా ఏదో ఉద్యోగం చేసుకుని బ్రతుకు దామని అనుకున్న నా ఆశలకు తిలోదకాలివ్వడానికి కారణం నాన్నే! ఇంటి వారసత్వం నిలబెట్టాలిరా… సొంతూరొదిలి ఎక్కడో నౌకరీలంటూ పోతే రేపు వయసుడిగాక మమ్మల్ని ఎవరు చూస్తారు…’’ అని నా భావాలకు గండికొట్టారు.

మరి ఈరోజూ అదే పంథాలో పయనం. వాడిని ఎంతో గొప్ప చదువులు చదివిద్దామనుకున్న నా ఆశయాన్ని అణగద్రొక్కి ఒడంబడిపోయాను. అదే విద్యావతిలో నెగళ్లు రేపింది. ‘‘మళ్లీ మీ గుండుపిలక చదువులెందుకండీ ? నాకసలిష్టం లేదు…’’ అంటూ వితండవాదం చేసింది. ఐనా నా నిర్ణయం మరింత బిగుసుకుంది.

‘‘ఒరే! మీ తాతగారి దగ్గరనుండీ కోవెలలో కట్టళ్లు (ఆలయంలో దేవుడికి నివేదించగా మిగిలిన ప్రసాదంగా ఇచ్చే అన్నం, పప్పు లాటివి) తెచ్చి తినడం, ఎవరో ఇచ్చిన పైసలు తీసుకోవడం, దానధర్మాలను పట్టడం. ఇంతకుమించి మన జీవితాలెంతవరకూ ఎదిగాయి చెప్పు? ఆస్తులంటూ ఏమైనా కూడబెట్టుకో గలిగామా? కనీసం చక్కటి ఇల్లైనా కట్టగలిగామా? నువ్వు నిర్ణయం తీసుకునే ముందు మరోసారి యోచించు…’’ అని మా అమ్మ నిలదీసింది.

అందులో వాస్తవమెంతున్నా సరే! ఇప్పుడు నేను ఈ నిర్ణయం తప్ప మరోటి తీసుకునే అవకాశం కూడా శూన్యమైంది. ఎటుకాకుండా ఉంచేస్తే రెంటికీ చెడ్డ రేవడి అవుతాడన్న బెంగ. అందుకే ధైర్యంగా ఒక అడుగు ముందుకేసాను.

శివబ్రహ్మం సీతానగరంలో ఏదో ఆశ్రమం ఉందని అక్కడ వేదవేదాంగాలు, ఆలయానికి పనికి వచ్చే నిత్యానుష్ఠాన విధివిధానాలు బాగా నూరి పోస్తారని చెబితే అభిరాముడిని తోడ్కొని వెళ్లడానికి సిధ్ధమైనాను. వెళ్లే ముందు కూడా విద్యావతి, మా అమ్మ కూడా నన్ను వెనక్కే లాగారు. ఐనప్పటికీ దృఢచిత్తంతో నడిచాను.

అభిరాముడి రూపాన్ని చూసి ముగ్ధులైనారు సత్యానంద సరస్వతి. ‘‘విద్యను ఔపోసన పట్టగల నేర్పుంటే తప్పక రాణిస్తాడు. ఇక్కడకొచ్చిన వారందరికీ అదే చెబుతాను. మీరు నిశ్చింతగా వెళ్లొచ్చు. ఏమైనా సందేహముంటే పిలుస్తాను’’ అని కొండంత భరోసానిచ్చిన స్వామీజీకి వినమ్ర ప్రణామాలర్పించి తిరుగుముఖం పట్టాను.

ఇంటికొచ్చి సంతోషంగా జరిగిన సంగతి చెబుదామని అనుకున్న నాకు ఇంట్లో మౌన నిరసన ఎదురైంది.నా మట్టుకు నేను ఆలయానికి వెళ్లిపోయాను.

——————–

‘‘ఎంచక్కా పిల్లలంతా దగ్గరలో ఉన్న కాన్వెంట్లకి బ్యాగులేసుకుని పోతుంటే మహ దుగ్ధగా ఉంది. మంచిమంచి బట్టలేసుకుని షోకులు చేస్తున్న పిల్లలను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది. మీలాగే వాడికీ ఓ పంచెగుడ్డ, భుజంపైన కండువా తప్ప మంచి బట్టలు తొడుక్కునే యోగం లేదు కామోసు..!’’ అని విచారంగా ముక్కు చీదుతూంటే విద్యావతిని ఓదార్చినప్పటికీ నా నిర్ణయం ఘోరంగానే భావించింది. అమ్మ సరేసరి!!

ఎప్పటికప్పుడు దులుపుతూనే ఉన్నారు. నిజానికి ఈ వృత్తిలో ఆదాయం నికరంగా ఉండదు. పెద్ద ఆలయాలలో ఉద్యోగాలైతే పరవాలేదు కాని, ఇలా చిన్నచితక దేవాలయాలలో కేవలం భుక్తికి లోటుండదు తప్ప విలాసాలు వెలిగిద్దామంటే కుదరదు. సర్దుబాటు బ్రతుకే చివరిదాకా. ఇలా రోజులు గడుస్తుండగానే ఆశ్రమం నుండి పిలుపు..

కంగారు పడుతూనే వెళ్లాను. వీడుగాని దీనికి కూడా పనికిరాడని చెప్పి తిరక్కొడతారేమోనన్న శంక.

‘‘మీ అబ్బాయి…అదే… అభిరాముడు గురించి ఎలా చెప్పాలో నాకు మాటలు రావడం లేదయ్యా!..’’ అని ఆగారు సత్యానంద సరస్వతి. గాబరా పడ్డాను. ఈలోగా ఎవరో వస్తే లోపలి నుండి అభిరాముడిని తీసుకుని రమ్మన్నారు.

‘‘ఏదీ! శ్రీసూక్తం వల్లెవేయి..’’ అనడంతోటే వినమ్రంగా ముందు గురువు గారికి పాదాభివందనం చేసి చేతులు కట్టుకుని లయబధ్ధంగా చెప్పాడు.

‘‘చూశారా! మీ వాడి ఉచ్ఛారణ. స్పష్టతకు ప్రతిబింబం. ఇంతమంది శిష్యులకు చెప్పినా రాని తృప్తిని మీవాడికి నేర్పాక పొందాను. ఈ విద్యను అల్పంగా చూసే వారికి జవాబుదారిగా మిగిలి పోతాడు మీవాడని చెప్పగలను. ఎప్పుడో తప్ప ఇంటికి పంపలేను. మీరు గుండెలపైన చేతులేసుకుని నిశ్చింతగా వెళ్లవచ్చు.’’ అని చెప్పాక అభిరాముడిని ఒకసారి దగ్గరగా తీసుకుని మాటలాడాను. వాడికక్కడి వాతావరణం ఆకర్షించిందని అర్థ్ధమైంది…

ఇంటికి వచ్చాక అదే విషయం చెప్పినా వాళ్లు ఇంకా అదే అభిప్రాయంలో ఉన్నారని, కాలమే సమాధానమిస్తుందని మిన్నకుండిపోయాను.

——————–

అత్యంత వేగంగా సాగేది కాలమని వేరేగా చెప్పక్కరలేనట్లుగానే, అభిరాముడి వేదవిద్య ముగియడం, ఆశ్రమం నుండి వచ్చేయడం జరిగింది. అక్కడ నుంచి వాడికి ఈ విద్యలో దొరికే నౌకరీ కోసం వెతుకులాట మొదలైంది. కొన్ని చిన్న ఆలయాలలో అర్చకుడిగా వృత్తిని ప్రారంభించాడు. ఇంటికి దగ్గరలోనున్న ఆలయంలో ధూపదీప నైవేద్యాలను పెట్టే పని కేవలం ఇచ్చే జీతం ఐదువేలే! ఐనా తొలి అడుగు తప్పదని చేర్చాను.

సరిగా అదే సమయంలో వీడి తోటివాళ్లలో ఒకడైన స్వరూప్‌ ‌తను చదివే కాలేజీ ప్రాంగణ ఎంపికల్లో నౌకరీ వచ్చిన శుభ సందర్భంలో చుట్టుపక్కల కొన్ని కుటుంబాల వారిని విందుకి ఆహ్వానించాడు. మేమంతా వెళ్లాం. విందుకు ముందుగా చిన్న ప్రసంగాల వంటివి కుర్రాడిని అభినందిస్తూ చేశారు.

‘‘ఇలాటి చదువులు చదివిన ఎవరూ కూడా ఉత్తినే ఉండడం లేదీ రోజుల్లో. ఆడపిల్లలు సైతం హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. చదువవగానే సాఫ్ట్ ‌వేర్‌ ‌నౌకరీలు వాళ్లని పిలుస్తున్నాయి. స్వరూప్‌ ఈ ‌చదువు చదువుకుని మంచి పని చేశాడు…’’ అని ఒకరు అభినందించారు. తరువాత మరికొందరు కూడా అదే ప్రస్తావనతో ప్రసంగించారు…

చివర నా వంతు వచ్చింది. నేను స్వరూప్‌ని మెచ్చుకుని ఒక చిన్ని బహుమతిని కూడా ఇచ్చాను. అదే సమ యంలో అభిరాముడు వచ్చి ఆశీర్వచన మంత్రాలను స్పష్టంగా వల్లించాడు. అందరి దృష్టి వాడిపైన పడింది.

‘‘అదేంటి మీ వాడిని ఇంగ్లీషు చదువులలో పెట్టలేదా? మళ్లీ మీలాగేనా…?’’ అని ఈసడించుకున్నట్లుగా మాటాడారు..అది కొంత బాధనిపించిన మాట సత్యదూరం కాదు.

‘‘చూశారా! లోకం తీరు ఎలాటిదో? మనవాడు ఈ పాండిత్యంలో ఎంత నేర్పరి ఐనా..నెలకింతని వేతనం తెచ్చుకుంటే అది ఒక అందం…ఛీ! ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఇందులోనే పెట్టారు.’’ అని శ్రీమతి విద్యావతి దెప్పి పొడిచింది…

‘‘చూడు దేవుడెలా రాస్తే అలా జరుగుతుంది. వాడే నడిపిస్తాడు. ఎదురు చూడడం మన విధి…’’ అన్నాను.

‘‘కర్మ సిద్ధాంతం వల్లించకురా. తప్పటడుగు వేసి కప్పిపుచ్చుకుంటున్నావు..’’ అమ్మ కూడా వంత పాడింది.

తర్వాత పట్నంలో ఏదో ఆలయంలో ఇంతకంటే ఎక్కువ జీతమని చెబితే అక్కడ చేరాడు అభిరాముడు. మొదట సరళంగా సాగిన నౌకరీలో అక్కడున్న ఆలయ ట్రస్ట్ ‌తీసుకున్న నిర్ణయం వాడికి అడ్డంకిగా మారింది. మొదట ఉన్న వంటవాడిని తీసేసి అన్ని పనులు ఒక్కడే చేసుకోవాలని జీతం ఇద్దరికీ ఇవ్వలేమని చెప్పారు. హతాశుడైనాడు. ఐతే నేనిచ్చిన సలహాతో తనకొచ్చిన జీతంలోనే ఒక వంటవాడిని కూడా పెట్టుకోవలసి వచ్చింది. ఒక రెండు నెలల దాకా సాఫీగా సాగిన ఉద్యోగంలో మళ్లీ కల్లోలం. వచ్చిన వంటవాడు పేచీకి దిగాడు. పళ్లెంలో పడే దక్షిణలలో తనకూ వాటా కావాలని…వచ్చేది అర్చకులకి కదా చెందాలని అభిరాముడి వాదన. దానికి ఒప్పుకోకపోతే మానేస్తానని భీష్మించుకు కూచున్నాడు. మరి వంటవాడిని మానిపించక తప్పలేదు. పాపం అన్నీ అభిరాముడే చేసుకునేవాడు. ఒక తండ్రిగా నేను కూడా వాడికి సహాయ సహకారాలను చేతనైనం తగా చేస్తూనే ఉన్నాను…

‘‘చూశారా! వాడి అవస్థలు. మీరూ ఇలాగే పడలేదూ? హాయిగా ఉండాల్సిన ప్రాణాన్ని కోరి నరకంలోకి తోసారు..’’ అని మళ్లీ నిందలేసింది శ్రీమతి.

కాలమెప్పుడూ ఒక రీతిన సాగదు. జనంలో ఆధ్యాత్మికత, వాస్తు నమ్మకాలు విస్తృతంగా పెరిగాయి. అది అభిరాముడికి మేలయింది. వ్రతాలు, జపాలు చేయడంలో దిట్టగా నలుగురి నోళ్లలో నానడంతో ఆలయంలో వచ్చేదాని కంటే ఆదాయం భారీగా పెరిగింది. గృహవాస్తు కూడా అబ్బటంతో ఎక్కడ నిర్మాణాలైనా సరే అభిరాముడినే వెంట తీసుకుని వెళ్లేవారు. అతడి చేతితో శంకుస్థాపన చేసి మొదలెడితే ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుందన్న నమ్మకం అందరిలో ఏర్పడింది. అక్కడి నుంచి ఇక తిరుగు లేకుండా పోయింది.

కొడుకు జీవితంలో ఈ మార్పులు చూస్తున్నా సరే విద్యావతిలో ఇంకా ఏదో వెలితి. తన కొడుకు ఏ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగో లేక బ్యాంక్‌ ‌నౌకరీయో కాకుండా ఇలా ఉన్నందుకు. టిప్‌ ‌టాప్‌ ‌గా స్టైలిష్‌గా లేనందుకు ఆవేదన. ఎక్కడైనా శుభకార్యాలకు వెళ్లినపుడు అక్కడ బంధువులు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక పోయేది. ‘‘మళ్లీ మీ అబ్బాయి కూడా మీ వారసత్వమేనా?’’ అని ఒకరు… ‘‘ఇప్పుడు ఎవరిని అడిగినా సాఫ్ట్ ‌వేర్‌ ‌నౌకరీలే’’… ‘‘ పిలక పెట్టుకుని అర్చనలు చేసే అబ్బాయిలకు అసలు అమ్మాయిల నివ్వడానికి కూడా వెనకడుగేస్తున్నారు’’ ఇలా ఎన్నో సూటిపోటి మాటలు. అవన్నీ విన్న మీదట నిరాశ నిస్పృహలకు లోనయ్యేది విద్యావతి.

——————–

హఠాత్తుగా ఒకరోజున నాకు సత్యానంద సరస్వతి గారి నుండి పిలుపొచ్చింది. వెళ్లి పాదాభి వందనం చేయగానే ఆశీర్వదిస్తూ… ‘‘మీ అభిరాముడు మంచి పేరుప్రతిష్టలు తెచ్చుకుని ఉన్నతస్థాయికి ఎదిగాడు. అతడి జీవితంలో మరో మలుపు ఏమిటంటే… కొత్తగా కడుతున్న ఒక పెద్ద వే•ంకటేశ్వరుని దేవాలయానికి విగ్రహప్రతిష్ఠను అతనికే అప్పగించమని నాకు ప్రభుత్వం నుండి కబురొచ్చింది. అక్కడ జరిగే రుత్విక్కుల పారాయ ణలు, వేదపఠనం, కోటి దీపోత్సవం వంటివన్నీ మీ వాడి నేతృత్వంలోనే జరుగుతాయి. స•హాయ సహకా రాలు ఇతరుల ద్వారా నెరవేరుతాయి…’’ అని చెప్పడంతోనే నా మదిలో ఎన్ని ఆనందమయ తరంగాలు పొర్లిపొంగాయో చెప్పలేను. ఈ మాట అన్నప్పుడు ఒక పేలవమైన నవ్వొకటి వెలసి మాయమైంది విద్యావతిలో.

కొద్దిరోజులకే అంగరంగ వైభవోపేతంగా పట్నం చివరన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ అభిరాముడి ఆధ్వర్యంలో జరిగింది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ అధికార్లు ఆ కార్యక్రమాలకు ఆకర్షితులైపోయి ఇక నుండీ ఆలయ అభివృద్ధికి అనేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. చుట్టుపక్కల నుంచి వచ్చిన జనంకి కొదవ లేదు.

ఈ సంఘటన తదుపరి అభిరాముడి పేరు మార్మోగిపోయింది. ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా అతడినే సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా సత్యానంద సరస్వతి ప్రముఖ శిష్యుడు కావడం కూడా అతని అభివృధ్ధికి దోహదపడింది.

ఇలా కొంతకాలం గడిచేసరికి అభిరాముడికి అసలు తీరికలేనంత వ్యాపకమై• •పోయింది. అలాటి సమయంలోనే ఒకరోజు వాడు మా ఇంటికి వచ్చిన తరుణంలోనే జరిగిందా సంఘటన. ‘‘అయ్యా! మాది పిఠాపురం. మా అమ్మాయిని మీ అబ్బాయికి అడగా లని వచ్చాం. మీరు అంగీకరిస్తే అది మహద్భాగ్యంగా భావిస్తాం’’ అని చెప్పడంతో నివ్వెరపోయాం.

‘‘మా వాడు సాఫ్ట్ ‌వేర్‌ ఇం‌జనీర్‌ ‌కాదు. కేవలం ఒక ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నాడు. వచ్చే అమ్మాయి కూడా జీవితాంతం అదే దారిలో నడవాల్సి ఉంటుంది. అది మీకిష్టమైతే పిల్లపిల్లాడు నచ్చు కున్నట్లైతే ముందుకెళదాం…’’ అని చెప్పేసరికి.. ‘‘ఈ సాఫ్ట్ ‌వేర్‌ ‌నౌకరీలకు లక్షల్లో జీతాలున్నా అవి ఎప్పుడు ఊడతాయో ఎంతవరకూ ఉంటాయో చెప్పలేం… పైగా మీ అభిరాముడికి ఉన్న పేరు ప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు ఎవరికీ రావు. అది చూసే మేం ముందు కొచ్చాం.’’ అని వినయంగా చెప్పారు. అభిరాముడు తన నిర్ణయాన్ని పెద్దలుగా మాకే వదిలిపెట్టాడు. అమ్మాయి అందానికి, అణకువకి లోటు లేదు.

ఇది జరిగాక బంధువులు తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ‘‘ఇప్పుడు అబ్బాయిలకు పెళ్లి కావడమే గగనమైపోతుంటే మీ అభిరాముడికెలాగ అయిందో! మా పిల్లలకు వేలకి వేలు జీతాలు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలూనూ…ఐనా ఏ అమ్మాయి పెళ్లికి మొగ్గటం లేదు…’’ అని ఉస్సురని నిట్టూర్పులు…

ఈ అనుకోని మార్పులు చూస్తున్న శ్రీమతి విద్యావతి, అమ్మ కూడా చెప్పలేనం తగా నిర్ఘాంతపోయారు…

‘‘చూశారా! ఆ రోజు సాహసించి నేను తీసుకున్న నిర్ణయం మీకు చేదుగా అనిపించింది. కాని ప్రస్తుతం…ఈ వైభోగం ఎవరికి వస్తుంది చెప్పండి…’’ అన్నాను గర్వంగా..

‘‘ఔనండీ! వాడి బ్రతుకు కూడా మీలాగే ఒడుదొడుకులౌతుందని భయపడ్డాం. కాని ఇప్పుడు మాకూ మీలాగే ఎంతో ఆనందంగా, గొప్పగా ఉంది. వాడికే కాదు…వాడినింతవాడిని చేసిన మనక్కూడా లోకంలో పేరుప్రతిష్ఠలు దక్కాయి..’’ అని నిండు మనసుతో అంటున్నప్పుడు విద్యావతి కళ్లలో ఆనందబాష్పాలు కదలాడాయి.అమ్మ కళ్లలో సైతం కర్పూర హారతులు వెలుగొందాయి.

అవి చూశాక మరి నా హృదయం ఎంత సంబరపడిందో చెప్పనలవికాదు…

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram