– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

ఆసక్తికి కొదవలేదు. యువశక్తికి ఎదురులేదు.

నిర్మాతలైనా, నిర్ణేతలైనా వారే!

వేదికంటూ ఒకటుంటే అంతే చాలు.

ప్రతిభా సామర్థ్యాలు, దీక్షాదక్షతలు అన్నీ అక్కడే.

అభివృద్ధి, సంక్షేమం, కృషి, ఫలితం అంతా అదే.

సంస్కృతికి నాగరికతకీ నిర్వచనాలిస్తారు

స్వరోగమన పథంలో జాతిరథాన్ని నడిపిస్తారు

అన్నింటికన్నా మిన్న క్రీడా సంస్కృతి. ఇందులో యువత కోరేది, వారికి కావలసింది ప్రోత్సాహం. దీని సాధన కోసమే ‘ఖేలో ఇండియా’. ఔత్సాహికులకు సదుపాయాలు, శిక్షణ, పాటవ ప్రదర్శన అవకాశాలు కలిగిస్తే భారత పతాక ఖ్యాతి వినువీధికి చేరి రెపరెపలాడుతూనే ఉంటుంది. ఇందుకో విశ్వవిద్యాలయ స్థాయి ఉత్సవాలు ఇప్పటికే మొదలై జూన్‌ ‌తొలివారం దాకా కొనసాగుతున్నాయి. నిర్మాణ, నిర్వహణల రీత్యా జోరందుకుంటున్నాయి. ఐదేళ్ల కిందట భారత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ విస్తార పక్రియ ఇప్పుడు – వచ్చే ఒకటో తేదీపైన చూపులన్నీ కేంద్రీకరిస్తోంది. ఆ రోజున పుట్టినరోజుతోపాటు, మరికొద్ది కాలానికే స్వర్ణోత్సవ సంబరానికి చేరువవుతున్న మహిళా యోధురాలు కరణం మల్లీశ్వరి. ఆమెది దారుఢ్య రంగంలో దరిదాపు పాతికేళ్ల సుదీర్ఘ అనుభవం. జాతీయ స్థాయిలోని క్రీడా విశ్వవిద్యాలయమంతటికీ సారథ్య బాధ్యత వహిస్తున్న, రెండేళ్లుగా యువక్రీడా స్ఫూర్తిని విస్తృత ప్రాచుర్యానికి తెస్తున్న తన గురించిన వెలుగురేఖలు ఇదే సందర్భంగా…

ఇరవై రెండేళ్ల నాటి మాట. విశ్వవ్యాప్తంగా రెండొందలకు పైగా ప్రాంతాల జట్లు బరిలోకి దిగిన అత్యాధునిక ఒలింపిక్‌ ‌మహోత్సవాల్లో భారత్‌ ‌త•ళుక్కున మెరిసింది. అందుకు మూలం- తొలిగా పతకాన్ని సాధించిన ప్రథమ భారతీయ వనిత మల్ల్లీశ్వరి! ‘ఏకైక’ అనే పదానికి మారు పేరుగా నిలిచి -తెలుగు ప్రాంతం శ్రీకాకుళం జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి మహిళాశక్తిని దిగ్విజయ వంతంగా చేర్చారామె. జన్మించింది మారుమూల పల్లెలో. పదీ పన్నెండు ఏళ్లయినా రాకుండానే బరువులనెత్తే క్రీడాంశంలో కఠోర శిక్షణ. వివాహా నంతరం తరుపరి శిక్షణ కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లడమే జీవితంలో మలుపు. అటు తర్వాత జాతీయ స్థాయి శిక్షణ శిబిరానికి ఎంపికవడం, కొన్ని ఏళ్లయినా గడవకముందే వరల్డ్ ‌ఛాంప్‌గా నిలవడం శిఖరస్థాయి విశేషం. సహక్రీడా కారుడితో పెళ్లి అనంతరం సంభవించిందే ఒలింపిక్స్ ‌పతక సాధన. ఆ విజయోత్సాహం పూర్తిగా తీరకుండానే, తన తండ్రి అస్తమయం బాధించి మరికొంత కాలం మౌనంగానే ఉండాల్సి వచ్చింది. కానీ తన స్ఫూర్తి నేపథ్యాన్ని ఒకసారి అవలోకిస్తే… 1993 నుంచి రమారమి దశాబ్దంపాటు ఏటా విజయపరంపరలే! మెల్‌బోర్న్, ఇస్తాంబుల్‌ ‌చైనా, హిరోషిమా, బ్యాంకాక్‌, ‌సిడ్నీ… ఎక్కడ పాల్గొన్నా క్రీడోత్సాహ సత్ఫలితాలే! ఆసియా, ప్రపంచ, ఒలింపిక్‌ ‌స్థాయుల్లో పతకాల మోతతో ఆమె పేరు మారుమోగింది. ఓ మహోత్తుంగ తరంగం.

పడతి ప్రభావ కాంతి

ఒకే ఒక్క క్రీడాంశంలో ఒక్కసారిగా మూడు స్వర్ణాలు మల్ల్లీశ్వరి తరహా విలక్షణత. ప్రపంచ రికార్డును ఛేదించిన విశిష్టత, యువతులకు స్ఫూర్తిని  పెంచేలా వినూత్న కార్యక్రమాల నిర్వహణ ఆమెకి మాత్రమే సొంతమైన ప్రత్యేకత. క్రీడాశక్తికి బహుకృతిగా లభించే అర్జున పురస్కారాన్ని స్వీకరించారు. ఇది జరిగి ఇప్పటికి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నా, ఆ దీప్తి ఇంకా జన హృదయాల్లో నిలిచే ఉంది. దేశీయంగా క్రీడా భ్యున్నతిని పెంచి పరిపోషించే ఖేల్‌రత్న పురస్కృతీ ఆమెనే వరించింది. జాతి ప్రశస్తిని అంతర్జాతీయ వేదికమీద అజేయంగా నిలబెట్టినందుకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ప్రదానంచేసే సమున్నత పురస్కారం ఉంది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతులుమీదుగా అందే అత్యంత విశిష్ట గౌరవస్థాయి. వెయిట్‌ ‌లిఫ్టింగ్‌ అనగానే, దేశ విదేశాల్లోని ఎవరికైనా ముందుగా మదిలో మెదిలే పేరు మల్లీశ్వరి. క్రీడలు సహా విభిన్న రంగాల్లో పేరొందినవారికి ఇచ్చే పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని ఏనాడు ఆమె తనదిగా చేసుకున్నారు. అవార్డులు, పతకాలు అసంఖ్యాకంగా వచ్చినా, ఆమెది నిగర్వ తత్వం. ‘ఎవరైనా గుర్తింపు, గౌరవం కోరుకుంటారు. మహిళలకు లభించే ఆ విధమైన సమాదరణ ఎంతగానో ప్రభావకాంతికి కారణమవుతూ ఉంటుంది. ఒక వనిత పతకం సాధించడం వెనక దీక్షాదక్షతలు ఎన్నెన్నో ఉంటాయి. ఆ మాటకొస్తే, ఇతరులకన్నా స్త్రీ విజేతగా నిలవడంలో ఎన్నో సామర్థ్య అంశాలు నిబిడీకృతమవుతాయి. ఆ వాస్తవాన్ని, అంతర్లీన దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి’ అంటూ ఒక సందర్భంలో వ్యాఖ్యా నించారామె. ఇందులోని ప్రతీ అక్షరమూ లక్షల విలువ చేసేదే.

నచ్చేలా… మెచ్చేలా…

చిన్న వయసులోనే పెద్ద పెద్ద విజయాలు మల్లీశ్వరికి అలవాటయ్యాయి. పదహారేళ్ల ప్రాయంలోనే జాతీయ స్థాయి క్రీడోత్సవాల్లో పతకం గెలుచుకున్న మేటి. అంతర్జాతీయంగా పదుల సంఖ్యలో పతకాలు – వాటిల్లో అనేకం స్వర్ణాలు. ఇదీ ఆమె క్రీడా జీవిత ఘనఅంశం. ఇంతకన్నా మించిన గొప్ప విషయం – సాటివారి గెలుపును మనస్ఫూర్తిగా అభినందించడం. ఒలింపిక్‌ ‌మెడల్‌ను దేశానికి సంపాదించిపెట్టిన మొట్టమొదటి ఆ మహిళామణి. టోక్యో క్రీడోత్సవాల్లో రజతం సముపార్జించిన మీరాబాయి చానూను హృదయ పూర్వకంగా ప్రశంసించి అపురూప వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ‘సిడ్నే ఒలింపిక్స్ ‌తర్వాత ఇరవై ఏళ్లకు ఈ సమాచారం విని నా మనసు ఆనంద సంద్ర మైంది’ అన్నారామె. తన మాదిరే చిరుప్రాయంలోనే గెలుపుబావుటా ఎగురవేసిన వారిని అందరికీ నచ్చేలా మెచ్చుకోవడం మల్లీశ్వరి స్వభావానికి సూచిక. ఆ సమయంలో, సందర్భంలో తాను ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయ వీసీగా ఉన్నారు. భారత కీర్తిని అంతర్జాతీయ యవనిక మీద ధగధగలాడించినప్పుడు ఆమెకు పాతికేళ్లు. అంతకుముందు పుష్కరకాలం ఎంతగానో వేగసాధన. అవకాశం లభిస్తే దూసుకెళ్లే యువపటిమ భారతదేశంలో అనంతమని మరో సందర్భంగా అభిప్రాయపడ్డారు. ‘మనలో సమర్థత ఎంతెంతో ఉంది. గెలుపును అందిపుచ్చుకోవాలన్న తపనా పుష్కలంగా కనిపిస్తోంది. మన దేశ యువత ఆశిసోస్తోంది. సత్వర ప్రోత్సాహాన్ని, అంతరాలకు తావులేని ఉత్సాహపూరిత వాతావరణాన్ని’ అనడం ఆమె హృదయానికి నిలువుటద్దం. ఇందులోని భావోద్విగ్నతను ప్రభుత్వాలు గ్రహించగలిగితే, అంతకన్నా ఇక కావాల్సింది మరేముంటుంది?

బెదరవద్దు, ఎదురుచూడొద్దు

‘మీ అనుభవాలు మీకు ఏం నేర్పించాయి’ అని అడిగినప్పుడు ఇదిగో ఇదీఆమె సుదీర్ఘ సమాధానం. ‘ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం నా నైజం. బాల్యంలో తల్లిదండ్రులు నన్ను తీర్చిదిద్దారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా, కుటుంబంలోని నా అభిరుచినీ గుర్తించి వెన్నుతట్టారు. ఇది పుట్టినింటి సంగతి. ఇక మెట్టినింట కూడా నాకు అన్ని విధాలా ప్రోత్సాహమే. జీవితమంతా ఆనందోత్సాహాలతో సాగుతూ వస్తోంది. ఈ అనుభవాల జోడింపుతో, యువతకు ముఖ్యంగా… స్త్రీలకు నేను సూచన చేసేది ఒకటే. ఏ రంగాన్ని ఎంచుకున్నా, అంచులు తాకేలా ముందుకు సాగండి. ఇంటా బయటా వచ్చే అవాంతరాలను మీకు మీరుగా తొలగించుకునే ప్రయత్నాన్ని ఆపకుండా చేయండి. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తేనే ఏదైనా సాధ్యమవుతుందని నేను కూడా అంటాను. నేను అద్భుత విజయాలు సాధించి నప్పుడు, ప్రముఖుల నుంచి అనేకానేక హామీలతోపాటు అభినందనల జడివాన కురిసింది. ఆ వాగ్దానాల్లో నెరవేరినవి, నెరవేరనివీ ఉన్నాయి. అలా అని నేనెవరినీ పనిగట్టుకుని నిందించను. కొన్ని సమాచార మాధ్యమాలు ఆధారరహితంగా ప్రచారాలు చేశాయి. వాటికి నీతిసూత్రాలు వల్లించే పనీ నాది కాదు. ఎక్కడో ఏమూల నుంచో ఒక శక్తి ఉత్పన్నమైతే, అది మరింత విస్తరించే సదవకాశాన్ని బాధ్యతాయుత సంస్థలు కలిగించాలని మాత్రమే కోరుకుంటాను. ఇదొక్కటీ ఫలిస్తే, అనేక ప్రశ్నలకి సమాధానాలు లభించినట్లే.’ ఈ మాటల్లోని అంత రార్థాన్ని మనం తెలుసుకుంటే, వాస్తవాలు వాటికి అవే తేట తెల్లమవుతాయి. ఖేలో ఇండియా దృష్టి ఇప్పటికీ మల్లీశ్వరిపైనే కేంద్రీకృతమవడానికి మూల కారణాలేమిటో మనకు తెలియ వస్తాయి.

About Author

By editor

Twitter
Instagram