ఆ దేవాలయం బ్రహ్మగిరి, నీలగిరి, కాలగిరి అనే మూడు కొండల నడుమ అద్భుత ప్రకృతి సౌందర్యం నడుమ కొలువై ఉంటుంది. గోదావరి నదీ మూలం కూడా కొద్దిదూరంలోనే. అందుకే గొప్ప పవిత్రక్షేత్రంగా కూడా ప్రసిద్ధి. ఇదే నాసికా త్య్రంబకం. ఇక్కడి శివాలయం హిందువులందరికి పరమ పవిత్రమైనది. ఇక్కడి శివలింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలు దర్శనమిస్తుంటాయి.

హిందువులందరూ ఆరాధించే 12 జ్యోతి ర్లింగాలలో నాసిక్‌ ఒకటి. ఇలాంటి ఆలయంలో కొందరు ముస్లింలు ప్రవేశించడానికి ప్రయత్నిం చారన్న వార్త నిస్సందేహంగా కలవరం కలిగిస్తుంది. మే 13వ తేదీ రాత్రి 9 గంటల తరువాత ఆ ఘటన జరిగింది. సమీపంలో జరిగే ఉర్స్ ‌కార్యక్రమానికి వెళుతున్న కొందరు ముస్లింలు తాము ఆలయంలోకి వెళతామని, శివుడికి అగరవత్తుల ధూపం చూపి వస్తామని కోరారని వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు ఆలయ భద్రతా సిబ్బంది అభ్యంతరం తెలిపింది. అయినా వారు చొచ్చుకువెళ్లడానికి ప్రయత్నించారన్న వార్తలు మొదట వచ్చినా తరువాత సర్దుకున్నాయి. నిజానికి జ్యోతిర్లింగాల దర్శనం హిందువులకే పరిమితం. ఇవి ఉన్న ఆలయాల పరిసరాలకు కూడా ఇతర మతస్థులను అనుమ తించరు. నిజానికి ఏ హిందూ ఆలయంలో అయినా ఇదే నిబంధన అమలులో ఉంటుంది. మే 13 ఘటన తరువాత మహారాష్ట్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్‌ ఈ ‌ఘటన మీద దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిం చారు. ఈ బృందం తాజాగా జరిగిన ఘటన మీదే కాదు, గత ఏడాది కూడా జరిగినట్టు చెబుతున్న ఘటన గురించి కూడా దర్యాప్తు చేస్తుంది. కానీ ఇంతలోనే మహారాష్ట్ర నవ నిర్మాణ సంఘటన్‌ ‌నాయకుడు రాజ్‌ ‌ఠాక్రే, ఉద్ధవ్‌ ‌ఠాక్రే వర్గీయుడు సంజయ్‌ ‌రౌత్‌ అది ముస్లింల సంప్రదాయమని, దీని మీద దర్యాప్తులు అవీ సరికాదని, దానిని కొనసాగించుకునే వెసులుబాటు కూడా వారికి కల్పించాలని ప్రకటనలు ఇచ్చేశారు. నాసిక్‌ ‌వచ్చిన రౌత్‌ ‌విలేకరులతో కూడా ఇదే విషయం చెప్పారు. అయితే అగరబత్తీ ధూపం ద్వారబంధం దగ్గర మాత్రమే జరుగుతుందని అన్నారు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాస్తవాలు వెంటనే తెలియవలసి ఉంది. హిందువులు సహన శీలురు కాబట్టి వెంటనే రెచ్చిపోలేదు. శ్రీనగర్‌లోని హజ్రత్‌ ‌బల్‌ ‌మసీదులో ప్రవక్త వెంట్రుక పోయిందన్న వదంతితోనే రక్తపాతం సృష్టించిన మైనారిటీలు ఉన్న దేశం మనది. ఇప్పుడు నాసిక్‌ ఆలయంలో అగరుబత్తీ ధూపం వేయగోరుతున్నవారు కూడా ఆ మైనారిటీ వర్గీయులే కూడా. మే 17వ తేదీన హిందూ మహాసభ రంగప్రవేశం చేసి ముస్లింలు వచ్చినందుకు ఆలయ ప్రాంగణంలో గోమూత్రం చల్లి, సంప్రోక్షించింది. ఆలయంలో ప్రవే శించేందుకు ప్రయత్నించిన వారిని అరెస్టు చేయాలని మాత్రమే ఈ సంస్థ కోరింది. తమను ప్రవేశించనీయకుంటే చుట్టుపక్కల ఉన్న ఆలయాలను మూసివేస్తామని ముస్లింలు బెదిరించారని, అది సహించ రానిదని హిందూ మహాసభ ఆరోపించింది. పోలీసు యంత్రాంగం అకీల్‌ ‌యూసుఫ్‌ ‌సయ్యద్‌, ‌సల్మాన్‌ అకీల్‌ ‌సయ్యద్‌, ‌మాతిన్‌ ‌రజా సయ్యద్‌, ‌సలీం బక్షు సయ్యద్‌ల మీద ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు చేసింది.

ఈ వివాదానికి మరొక కోణం కూడా ఉంది. ఆలయానికి కొద్దిదూరంలో జరుగుతున్న ఉర్స్ ఉత్సవం కోసం వెళుతున్నవారు తాము ఆలయంలోకి వెళతామని, అగర్‌బత్తీ ధూపం వేసి, శివలింగం మీద చదర్‌ ‌కప్పుతామని మొదట అధికారులను అడిగారు. అందుకు అధికారులు అంగీకరించలేదు. దీనితో వారు లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేసినా, సాగ లేదు. తరువాత బలవంతంగా బయటకు పం పేశారు. కాదు చదర్‌ ‌కప్పడానికి చొచ్చుకు పోయారన్న వాదన కూడా ఉన్నా ఇది బలంగా లేదు.

శివాలయానికి కొద్దిదూరంలోనే ఉర్స్ ‌కార్య క్రమం ఏటా జరుగుతుందని, అక్కడకు ఊరేగింపుగా వెళ్లే సమయంలో త్య్రంబకేశ్వర ఆలయంలో ఉత్తర ద్వారం దగ్గర ఉన్న మెట్ల దగ్గర అగరుధూపం వేయడం చిరకాలంగా వస్తున్నదని ఉర్స్ ‌నిర్వా హకుడు మాతిన్‌ ‌సయ్యద్‌ ‌చెప్పాడు. తమకు అల్లా మీద, శివుని మీద కూడా విశ్వాసం ఉందని అక్కడి వారు చెప్పుకుంటున్నారు. చాలాకాలంగా ఈ సంప్రదాయం అమలులోనే ఉన్నా తాము ఎప్పుడూ గర్భగుడిలోకి ప్రవేశించే ప్రయత్నం చేయలేదని అతడు చెప్పాడు. అయితే ఇంతకాలం లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని అతడు ప్రశ్నించాడు. నాసిక్‌లో ముస్లిం జనాభా తక్కువ. అయినా ఈ ఘటన తరువాత రెండు వర్గాలు సమా వేశమై సమస్యను శాంతియుతంగా పరిష్కరించు కున్నారని నాసిక్‌ ఎస్‌పీ శహాజీ ఉమప్‌ ‌చెప్పారు. ముస్లింలు ఆలయంలోకి చొరబడ్డారంటూ సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలలో నిజం లేదని స్థానికులు కూడా చెబుతున్నారు. కానీ ఈ వార్త తెలిసిన వెంటనే నాసిక్‌లో ఉద్రికత్తలు చెలరేగాయి. కొద్దిపాటి ఘర్షణలు కూడా జరిగాయి. రెండువైపుల కొందరిని అరెస్ట్ ‌చేశారు.

ఈ ఘటన త్య్రంబకేశ్వర ఆలయం గతాన్ని తప్పక గుర్తు చేసేదే. 1690లో ఈ ఆలయాన్ని మొగల్‌ ఆఖరి చక్రవర్తి ఔరంగజేబ్‌ ‌ధ్వంసం చేశాడు. అప్పటికే అది వందేళ్ల చరిత్ర కలిగిన ఆలయం. అంతేకాకుండా అక్కడే ఒక మసీదును నిర్మించి, నాసిక్‌ ‌పేరును గుల్చనాబాద్‌ అని మార్చాడు. ప్రఖ్యాత చరిత్రకారుడు జదునాథ్‌ ‌సర్కార్‌ ఇచ్చిన వివరాల ప్రకారం అదే సమయంలో ఎల్లారా, నర్సింగ్‌పూర్‌, ‌పండరిపూర్‌, ‌జేజురి, యవత్‌ (‌భూలేశ్వర్‌) ఆలయాలను ఔరంగజేబ్‌ ‌కూల్చాడు. అయితే పీష్వా బాలాజీ బాజీరావ్‌ 1751‌లో గుల్చనాబాద్‌ను స్వాధీనం చేసుకుని ఔరంగజేబ్‌ ‌నిర్మించిన మసీదును కూలగొట్టి ఆలయం నిర్మించుకున్నారు. తిరిగి నాసిక్‌ ‌పేరును వాడుకలోకి తెచ్చారు.

ఉర్స్ ‌జరిగిన సందర్భంలో త్య్రంబకేశ్వరుడిని ఆరాధించడం తమ సంప్రదాయమని ముస్లింలు చెప్పవచ్చు. అది చిరకాలంగా సాగుతున్న సంప్ర దాయమే అయితే దాని గురించి స్థానిక హిందువులు ఆలోచించవచ్చు. కానీ ఇటీవల కాలంలో కాశీలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగాన్ని తీసుకువెళ్లి చేతులు కడుక్కునే చోట ఉంచారంటేనే వారికి హిందూ విశ్వాసాల మీద ఎంత గౌరవం ఉన్నదో అర్ధమవు తుంది. నిజానికి ఇస్లాం విగ్రహారాధనను ద్వేషిస్తుంది. కాగా హిందూ దేవాలయాల మీద హక్కునో, ఆధిపత్యాన్నో ప్రకటించుకునే కుట్రలు ముస్లిం మతోన్మాదుల వైపు నుంచి ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్ది మాసాల క్రితమే తమిళనాడులో 13వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయాన్ని వక్ఫ్ ఆస్తులలో భాగంగా చూపించారు. కర్ణాటకలో ఏటా తాము ప్రార్థనలు చేసుకునే మైదానంలో హిందువులు పండుగ జరుపుకోవడానికి ముస్లింలు అంగీకరించలేదు. ఇవి తాజా ఉదాహరణలు మాత్రమే. ఒకప్పుడు హిందువులు, ముస్లింలు పరస్పరం తమ తమ పండుగలలో సహకరించు కున్నారు. ఇది చారిత్రక వాస్తవం. కానీ ఇటీవల కాలంలో, మారిన జాతీయ అంతర్జాతీయ పరిస్థితు లలో ముస్లింలలో కొందరు ఒక రకమైన ఉన్మాదం వైపు అడుగులు వేస్తున్నారు. భారతదేశంలో కుహనా మేధావులు, దొంగ సెక్యులరిస్టులు హిందూ-ముస్లిం ల మధ్య దూరాన్ని మరింత పెంచే ప్రయత్నంలోనే ఉన్నారు. హిందువుల శోభాయాత్రలు మసీదుల ముందు నుంచి వెళితే దాడులకు దిగడం, హిందువు లను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం ఎక్కువైంది. దీనిని ఒక్క మేధావి, సెక్యులరిస్టు ఖండించే సాహసం చేయడం లేదు. ఈ కారణంగానే ముస్లింలలోని ఆధిపత్య భావన ఇంకా పెరుగు తున్నది. ఇలాంటి వాతావరణాన్ని హిందువులు మరచిపోలేరు. చాలా ఆలయాలలో ఉన్న దర్గాలను తొలగించడానికి కూడా వారు అంగీకరించడం లేదు. తమ కట్టడాల పట్ల వాటి ఉనికి పట్ల ముస్లింలు ప్రదర్శిస్తున్న వైఖరి హిందువులను బాధించేదిగా మాత్రమే ఉంది. మధుర ఆలయ విముక్తి, జ్ఞానవాపి వివాదంలో ముస్లింలు అనుసరిస్తున్న వైఖరి సామరస్యం దిశగా సాగుతుందని చెప్పడానికి ఉపకరించదు. నిజంగా శివుడినీ, అల్లానూ సమంగా కొలిచే సమ భావన ఉంటే ముస్లింలను హిందువులు స్వాగతించడానికి వెనుకాడరు. హిందూ జీవన విధానంలో తమకూ హక్కులు ఉన్నాయని చెబుతున్న వారు, వారి ఆక్రమణలలో ఉన్న వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు హిందువులకూ ఉండాలని భావించాలి. ఆ కోణం నుంచి నాసిక్‌ ఆలయ వివాదం కొత్త దారి చూపుతుందని ఆశిద్దాం.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram