‘ప్రాణం కంటే మానం ముఖ్యం’ అని విశ్వసించే భారతీయ మగువలు తెగిస్తే ఎంతటి వారికైనా గుణపాఠం తప్పదనేందుకు నైజాం పాలనలో సూర్యాపేట పోలీస్‌ ‌స్టేషన్‌పై దాడి నిదర్శనం. మద్యం మత్తులో యువతులతో నగ్నంగా నృత్యం చేయిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోలీసు అమీన్‌తో పాటు ఇతర పోలీసులపై తోటి మహిళలు ‘రుద్రమదేవి’లై దాడికి దిగడంతా తీవ్ర గాయాలతో పలాయనం చిత్తగించారు.

‘‘ఎక్కడ కలకంఠి కన్నీరొలుకుతుందో అక్కడ సిరి ఉండదు’’ అనేది పెద్దల మాట. ‘‘ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు నివసిస్తారు’’ అని ఒక సుభాషితం. అలా ప్రాచీన భారతీయ సమాజంలో స్త్రీకి గొప్ప స్థానం ఉంది. కాని నాటి తెలంగాణ సమాజం పరిస్థితి అందుకు భిన్నంగా ఉండేది. అక్కడి స్త్రీలు పడ్డ బాధలు వర్ణనాతీతం. డా।। ఆడువాల సుజాత ‘తెలంగాణ తల్లి ఎత’’ అంటూ రాసిన కవితలో..

‘అడ్డమొచ్చినోన్ని అడ్డంగా నరుకుతాం,

తెలంగాణ పొద్దుపొడుపు వచ్చే దాకా పోరాడ తాం’ అన్నారు.

‘‘ఎన్ని పోరాటాలు చూసిందో

ఎన్ని ఆరాటాల్ని మోసిందో

ఎన్ని కష్టాలను కాసి

చరిత్ర కెక్కిన ఈ నేల

ఎన్ని అసువుల్ని బాసిందో’’ అంటూ ‘‘మన తెలంగాణా కవిత’’లో   నెల్లుట్ల రమాదేవి రాశారు

కాకతీయ రుద్రమ దేవి, సమ్మక్క, సారాలమ్మ, ఐలమ్మ, జాయపసేనాని, సర్వాయి పాపన్న, కొమరం భీం, దాశరథి సోదరులు, కాళోజీ వంటి వారు ఎన్నో చారిత్రక విశేషాలను వెల్లడించారు. వసంత సుబ్రహ్మణ్యం తెలంగాణ స్త్రీల ప్రాధాన్యతను కొని యాడారు. మహిళల విశిష్టతకు సాటిలేని ప్రాంతం. తెలంగాణ సాయుధ పోరాటంలో అనేకమంది స్త్రీలు ‘‘గాయాలే గేయాలై’’ బయటకు వచ్చారు. మూకు మ్మడిగా గళమెత్తారు, ధ్వజమెత్తారు. అనేక ఉద్యమాలలో, పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కొందరైతే ఉద్యమవీరులకు వెన్ను దన్నుగా ఉంటూ ఆత్మస్థైర్యానిచ్చారు.

నిజాం రాష్ట్ర ప్రథమ ఆంధ్ర మహాసభ జోగి పేటలో జరిగింది. నిజాం రాష్ట్రంలోని ఆంధ్రుల అభివృద్ధికి అత్యవసర అంశాల గురించి ఆలోచించ డానికే ఈ మహాసభను ఏర్పాటు చేశారు తప్ప, ఈ సభకు రాజ్యాంగ విషయాలతో ఎలాంటి సంబంధం లేదు.

హైదరాబాద్‌ ‌వివేకవర్ధినీ థియేటర్‌లో 1921 నవంబరు 12న జరిగిన హిందూ సంస్కారసభకు పూనే మహిళా విశ్వవిద్యాలయ స్థాపకులు దోండే కేశవ కార్వే, తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రముఖులు హాజరయ్యారు. వారంతా ఆంగ్లం, ఉర్దూతోపాటు తమ మాతృభాషల్లో ఉపన్యసించారు. హైకోర్టు న్యాయవాది అలంపల్లి వెంకట రామారావు తెలుగులో ఉపన్యాసం ప్రారంభించినప్పుడు సభికు లంతా గోల చేస్తూ ప్రసంగానికి అడ్డు తగలడంతో ఈ అవమానాన్ని భరించలేక తెలుగువారు నిరసన తెలుపుతూ బయటకు వచ్చారు. అలా వచ్చిన.. టేకుమళ్ల రంగారావు, మాడపాటి హనుమంతరావు, మిట్టలక్ష్మినరసయ్య, ఆదిరాజు వీరభద్రరావు, నడింపల్లి జానకీరామయ్య, బూర్గుల రామకృష్ణారావు, మందుముల నరసింగరావు, బోయనపల్లి వెంకట రామరావు, కొమ్మవరపు సుబ్బారావు, బూర్గుల నరసింహరావు, డా।। పందింటి రామస్వామి నాయుడు కలసి ఆంధ్ర జనసంఘాన్ని స్థాపించారు. అందులో సభ్యత్వం పొందడానికి ఒక రూపాయి చందాగా వసూలు చేయాలని నిర్ణయించారు. ఇలా మొద• వందమంది సభ్యులుగా చేరారు.

వీరు అనేక సంస్కరణలు చేపట్టి ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చారు. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలోని స్త్రీల, రైతుల సమస్యలపై పోరాడారు. 12వ ఆంధ్ర మహాసభలో 40 వేల మంది పాల్గొన్నారు. వెట్టిచాకిరీ రద్దు చేయాలని, నిజాంను ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని స్థాపించా లంటూ ఉద్యమించారు. ఈ తరుణంలో బూర్గుల అనంతలక్ష్మి నాయకత్వంలో మహిళాసభ ప్రారంభ మైంది.

నిజాం వ్యతిరేక పోరాట ఉద్యమంలో పాల్గొన్న అనేక మందిని నిర్బంధించి చంచల్‌ ‌గూడా (హైదరాబాద్‌) ‌జైల్లో ఉంచారు. వారిలో దాశరథి• కృష్ణమాచారి, హిందూ పత్రిక ప్రతినిధి నండూరి కృష్ణమాచార్యులు, అచ్యుతరెడ్డి పల్లెర్ల హనుమంత రావు (బూర్గుల రామకృష్ణరావు క్యాబినెట్‌లో మంత్రి) తదితరులు రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తగ్గుస్థాయిలో ‘వందేమాతరం’ పూర్తి గేయాన్ని ఆలపించేవారు. ఒకరోజు భోజనాలు చేసి, కొంతసేపు చర్చలు జరుపుకుని ‘వందేమాతరం’ పాడుదాం అనుకుంటూ ఉండగా, పదకొండు గంటల సమయంలో, డిప్యూటీ జైలర్‌, ‌రక్తసిక్తమైన శరీరంతో ఉన్న ఒక వ్యక్తిని వీరి బ్యారక్‌లోకి నెట్టి వెళ్లిపోయాడు. అతని నోట్లోంచి మాట రావడం లేదు. ముఖం బాగా వాచింది. ఒక కనుగుడ్డు బయటకు వచ్చేసినట్లు లావుగా, ఎర్రగా భయంకరంగా కన్పించింది. ఇంతలో నండూరి కృష్ణమాచార్యులు ‘స్టౌ’ వెలిగించి నీళ్లు కాచారు. వస్త్రంతో అతని పెదవులు తుడిచి, ‘‘మీరు ఎవరు?’’ అని అడిగారు.

‘‘నేను రంగనాయకుల్ని ఆంధ్ర మహాసభ కార్యకర్తను’’ అని సమాధానం చెప్పాడు వగరుస్తూ. ‘‘నన్ను పోలీసులు నల్లగొండ జిల్లా నకిరేకల్లు వద్ద పట్టుకున్నారు. ఇతడు గ్రామగ్రామం తిరిగి ప్రజలకు భరోసా కలిగిస్తున్నాడనీ, సూర్యాపేట సంఘటనకు ఇతనే ‘కారణమంటూ అరెస్టు చేసి బేరక్‌లోనికి తోశారు’’ అని వివరించారు. ‘‘పోనీలే ప్రాణాల్తో జైల్లో చేరావు అదే పది వేలు’’ అన్నారు తోటి సత్యా గ్రహులు. వేడినీటితో తేనీరు తయారు చేసిన నండూరి ‘‘టీ తాగు రంగనాయకులూ!’’ అన్నారు. అతి కష్టం మీద నాలుగు గుటకలు వేశాడు రంగనాయకులు. కాళ్ల నిండా దెబ్బలే. తలలో నుంచీ నెత్తురు వస్తుండగా, ‘‘రంగ నాయకులూ! పడుకో…నా దగ్గర కొద్దిగా బాండేజీ గుడ్డ, బె•న్‌జైన్‌ ఉన్నాయి, రేపు ఆసుపత్రికి తీసుకువెళతాను’’ అన్నారు పల్ల్లె• హనుమంతరావు.

‘నిద్ర ఎక్కడ వస్తుంది దేశం తగులబడి పోతుంటే!’’ అన్నారు రంగ నాయకులు.

సూర్యాపేట సంఘటన ఏమిటి?

సూర్యాపేట పోలీసు అమీన్‌ (‌సబ్‌ ఇన్స్‌పెక్టర్‌) ‌తప్పతాగి సమీప గ్రామాల్లోని పడుచుపిల్లల్ని పట్టి తెప్పించి నగ్నంగా నృత్యం చేయించాడు. పోలీసులు కర్రలతో కొడుతూ ఉండగా మన చెల్లెళ్లు, కూతుళ్లు అవమానం పాలైనారు. ఆడది అవమానాన్ని భరించగలదా? కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆడపిల్లల మధ్యన కుర్చీ వేసుకుని మద్యం తాగుతూ ఉంటే, తన చుట్టూ నగ్నంగా ఆడుతూ, తిరిగే వారిపై ఎక్కడెక్కడో చేతులు వేస్తూ, నవ్వుతూ ఆనందిస్తున్నాడు. ఈ విషయం తెలియగానే మధ్య వయస్కులైన స్త్రీలు ఒక చేతిలో రోకలి బండ, మరో చేత్తో కారప్పొడితో స్టేషన్‌పైకి బయలుదేరారు. అమీనా మీద దాడి చేశారు. ఈలోగా ఇద్దరు పోలీసులు ఇద్దరు బాలికల స్తనాలు కోశారు. రక్తం మడుగై పోయింది. మహిళలు పోలీసుల కళ్లలో, అమీన్‌ ‌కళ్లలో కారప్పొడి చల్లి రోకళ్లతో చావబాదారు. రోకలి దెబ్బలకు అమీన్‌ ‌స్పృహ తప్పి పడిపోయాడు (అటు తర్వాత ఆసుపత్రిలో మరణించాడు). పోలీసుల బుర్రలు పగిలాయి. తుపాకీలు వదిలి పారిపోయారు. అణచి ఉంచినంత కాలం బంతి అణిగి ఉంటుంది. అదే కాలితో తన్నితే పైకి లేస్తుంది. అలాగే అణచిపెట్టి, భయపెట్టినంత కాలం అణగిమణిగి ఉన్న మహిళలు చైతన్యవంతులై తిరగబడ్డారు. ఎంతో ఓర్పు గల భారతీయ స్త్రీలు తిరగబడితే ఇలానే ఉంటుంది.. అని రంగ నాయకులు వివరించాడు. ఇంకా ఇలా చెప్పాడు. ముఖాన రూపాయంత కుంకుమ ధరించిన సుమారు నూరు మంది స్త్రీలు ఒక్క ఉదుటన పోలీసులపై దాడికి దిగారు. పోలీసులను చితక కొట్టారు. వారిలో నూరుమంది రుద్రమదేవీలను చూశాను. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. మరిచిపోలేని సంఘటన. పల్లెటూరి అమాయక స్త్రీలల్లో ఇంతటి చైతన్యం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పోలీసులు వదలివెళ్లిన తుపాకులను ఆంధ్ర మహాసభ కార్యకర్తలు మరునాడు ఎత్తుకెళ్లారు. వాటినే సాయుధ పోరాటంలో వాడారు. ఇది సూర్యాపేటలో జరిగిన సంఘటన.

రంగనాయకులు నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో బస్సు ఎక్కుతుండగా పోలీసులు పట్టుకున్నారు. మొన్న జరిగిన సూర్యాపేట సంఘటనలో అతని ప్రమేయ మున్నదని అరెస్టు చేసి చితకకొట్టారు. ‘ఆడవాళ్లు మిమ్మల్ని కొడితే, మీరు నన్ను కొడతారేమండీ’ అని మొత్తుకున్నా వినలేదు. ఈ సంఘటన జరిగిన గ్రామాన్ని పూర్తిగా తగులబెట్టారు. తమ తుపాకులు తిరిగి ఇవ్వాలంటూ ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో కనపడ్డ వారినందరిని పోలీసులు, రజాకారులు చితక కొట్టారు. అయితే ఒక్క తుపాకీ కూడా దొరకలేదు. పోలీసులు, సైనికులు, రజాకారులు ఆ ప్రాంత వాసుల పేర్లను ఒక జాబితాగా రాసుకుని గ్రామాల్లోకి వెళ్లి దొరికిన వారిని కాల్చి చంపారు, దొరకని వారి ఇళ్లను తగులబెట్టారు, ఆస్తులను ధ్వంసం చేశారు.

రంగనాయకులు చెప్పిన వివరాలను విన్న దాశరథి, ‘బయట ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి? మేము ఈ జైల్లో నిస్సహాయులమై ఉన్నాం. నిష్క్రియా వాదులమై పోయామయ్యా!’’ అని వాపోయారు. ‘మనం ఇక్కడ ఇరుక్కు పోయామే! లేకుంటే బయట ఉండి ఉంటే ఉన్మాదులైన రజాకారులను, పోలీసు లను ఒకరిద్దరినైనా చంపి వీరస్వర్గం అలంకరిస్తే బాగుండేది’’ అనీ అన్నారు.

‘‘ఒక రొట్టె ముక్క తిని పడుకో నాయనా! రేపు చూదాం’’ అన్నారు అచ్యుతరెడ్డి. అందరూ తక్కువ స్వరంలో వందేమాతరం ఆలపించి గాఢ నిద్రలోనికి జారుకున్నారు.

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE