మే 19వ తేదీన రెండు ప్రధాన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండూ ఆర్థికవ్యవస్థకు సంబంధించినవి. అలా అని ఒకదానితో మరోదానికి సంబంధం ఏమీలేదు. దేశంలో ప్రతిపక్షాలు, మేధావులు, ఒక వర్గం మీడియా, వాస్తవికతకు ఎంత దూరంలో ఉన్నాయో ఒక అంచనాకు రావడానికి మాత్రం ఆ రెండు పరిణామాలు అద్భుత ఉపకరణాలనిపిస్తాయి. ఇంతకాలం చేసిన ఒక ప్రచారం అబద్ధమని తేలినా, కొత్త అబద్ధాన్ని ప్రచారం చేయడానికి క్షణమైనా ఆలస్యం చేయకుండా సిద్ధపడుతున్న అత్యుత్సాహం ఆ వ్యవస్థలలో కనపడుతున్నది. భారత రిజర్వు బ్యాంక్‌ ‌రూ. 2,000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఇది రద్దు కాదు, ఉపసంహరణ అని చెబుతున్నా ప్రజలను గందరగోళ పరిచే కార్యక్రమాన్ని విపక్షాలు, ఆ వర్గం మీడియా ఆలస్యం లేకుండా ఆరంభించాయి. రెండోది-తమ షేర్లకు లేని విలువను ఆపాదించడం, పద్దుల విషయంలో భారత కార్పొరేట్‌ ‌దిగ్గజం గౌతమ్‌ ఆదాని ఆక్రమాలకు పాల్పడ్డారని చెప్పడానికి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు నియమించిన సంఘం ఆ రోజే నివేదిక ఇచ్చింది. అదాని వ్యవహారంలో జరిగిన దుష్ప్రచారం, పార్లమెంట్‌ ‌స్తంభన, షేర్‌ ‌మార్కెట్‌ ఒడుదుడుకులు, ప్రధాని మీద రాహుల్‌ ‌విష ప్రచారం, అంతర్జాతీయంగా భారత్‌ ‌ప్రతిష్టకు చేటు తెచ్చే పరిస్థితులు.. ఒక అబద్ధం మీద సాగాయని తేలిపోయింది. హిండెన్‌బర్గ్ అనే ఒక దొంగ సంస్థ ఇచ్చిన నివేదికతో కుక్కతోక పట్టుకుని గోదారి ఈదిన చందంగా ఇక్కడి రాజకీయ దొంగలు సృష్టించిన విధ్వంసమది. అదాని వ్యవహారం అబద్ధమని తేలినా, రూ. 2000 నోటు రద్దు గురించి కొత్త అబద్ధాలతో విపక్షాలు, ఆ మీడియా దేశం మీద పడుతున్నాయి.

————–

సెప్టెంబర్‌ 8, 2016‌న నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. దేశంలో నల్లధనం వెలికి తీయడం ఆ చర్య వెనుక ఉన్న ఉద్దేశం. అప్పుడు రద్దు చేసిన రూ. 1000 నోటు స్థానంలో వచ్చినదే రూ. 2,000 నోటు. ఇదీ ఇటీవల కాలంలో దాదాపు అదృశ్యమైంది. అసలు రూ. 2000 నోటు ముద్రణను 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిపివేశారు. అయినా కొన్ని వర్గాలలో ఆ నోట్లు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఈ నోటును పూర్తిగా చెలామణి నుంచి తప్పించవలసిందిగా మూడు నెలల క్రితమే బ్యాంకులన్నిం టికీ భారత రిజర్వు బ్యాంక్‌ ఆదేశాలు ఇచ్చింది. ఈ నోటును 2016లో చెలామణిలోకి తెచ్చారు. అప్పుడే ఇది కూడా రద్దు కాగలదన్న సూచనలు వచ్చాయి. ఎందుకంటే రూ. 1000 నోటు కంటే, బ్లాక్‌మనీ పోగుపడడానికి రూ. 2000 నోటుతో మరింత అవకాశం ఉందన్న అభిప్రాయాలు అప్పుడే వెల్లడైనాయి. ఇప్పుడు ఉపసంహరించినది ఆ రూ. 2000 నోటును మాత్రమే. కాబట్టి ఈ పరిణామం ఊహించనిది కాదు.

నోటు రద్దుకీ, ఉపసంహరణకీ తేడా ఉందని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. రూ. 2000 నోటును రిజర్వు బ్యాంక్‌ ఉపసంహరించినట్టు ప్రకటించింది. 1934 నాటి ఆర్‌బీఐ చట్టం 24(1) సెక్షన్‌ ‌కింద దీనిని ఉపసంహరించుకున్నారు. క్లీన్‌ ‌నోట్‌ ‌పాలసీ మేరకే ఈ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వు బ్యాంక్‌ ‌వివరణ ఇచ్చింది కూడా. రూ. 2000 నోట్లను 2017కు ముందు ఎక్కువగా, అంటే 89 శాతం విడుదల చేశారు. వాటి కాలపరిమితి అప్పటికి నాలుగు లేదా ఐదేళ్లని నాడే రిజర్వు బ్యాంక్‌ అం‌చనా వేసింది. నిజానికి యూపీఏ ప్రభుత్వం ఉండగా కూడా 2005లో ఒకసారి అంతకు ముందు వరకు ముద్రించిన నోట్లను ఉపసంహరించాలని రిజర్వు బ్యాంక్‌ ‌యోచించింది. ఆ నోట్లకి భద్రత తక్కువ అన్న అభిప్రాయానికి రావడం వల్లనే ఆ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికి 2005కు ముందు ముద్రించిన నోట్లకు చెలామణికి అవకాశం ఇచ్చింది. అంటే పాత నోట్లను చెలామణి నుంచి మాత్రం తప్పించారు. ఇప్పుడు రూ. 2000 నోటు ఉప సంహరణ కూడా అలాంటిదే. ఇదే క్లీన్‌ ‌నోట్‌ ‌పాలసీ.

 క్లీన్‌నోట్‌ ‌పాలసీ అంటే, దేశంలో నాణ్యమైన నగదును చెలామణిలో ఉంచడమే. ఏ నోటు కాలపరిమితి అయినా నాలుగు లేదా ఐదేళ్లు. కాబట్టి తరువాత వాటిని మార్చాలి. కొత్త నోట్లను, నాణేలను మార్కెట్‌లోకి పంపించాలి. ఇప్పుడు రూ. 2000 నోట్లు ఉన్నవారు ఎవ్వరూ వాటిని ఏం చేసుకోవాలంటూ తలలు పట్టుకో నక్కర లేదు. అలాగే మే 19 నుంచి ఈ నోటు ఒక చిత్తు కాగితమే అని భావించ నక్కరలేదు. రిజర్వు బ్యాంక్‌ 19 ‌ప్రాంతీయ కార్యాలయాలలో లేదా ఇతర బ్యాంకులలో కూడా వీటిని మార్చు కోవచ్చు. దీనికి కూడా నాలుగు మాసాల గడువు ఉంది. అంటే మే నెల 23 నుంచి సెప్టెంబర్‌ 30 ‌వరకు ఇందుకు అవకాశం ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో 2016లో జరిగిన కొన్ని పొరపాట్లను రిజర్వు బ్యాంక్‌ ‌దృష్టి పెట్టుకుని నోట్లు మార్చుకునే తీరుతెన్నుల గురించి వివరంగానే దేశ ప్రజల ముందు ఉంచింది. అయితే ఈ మార్పిడి చట్టబద్ధంగా జరుగుతుంది. అదే కొందరిని బాధించినట్టు కనిపిస్తుంది.

ఈ నోటు సాధారణంగా మధ్య తరగతి లేదా సాధారణ ప్రజానీకం దగ్గర కనిపించడం మరీ అరుదు. ఇవి రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారుల దగ్గర, రాజకీయ పార్టీల దగ్గర ఎక్కువ ఉంటాయని అంతా అంగీకరి స్తున్నారు. మరొక మాటలో చెప్పాలంటే నల్లధనం పోగుపడే చోట ఇవి ఎక్కువగా ఉంటాయి. 2018- 2019లో నిలిపివేసే వరకు ముద్రించిన రూ. 2000 నోట్ల విలువ రూ.6.73 లక్షల కోట్లు. ఇంతకీ ఇప్పుడు చెలామణిలో ఉన్నది వీటిలో 10.8 శాతం (3.62 లక్షల కోట్ల విలువైన నోట్లు). అంటే బ్యాంకులకు రావలసినవి ఈ నోట్లే. కాబట్టి ఈ నోట్లు ఎక్కడో ఏదో ప్రయోజనం కోసం చీకటిలో ఉన్నాయనే అర్థం.

చిత్రంగా చిరకాలంగా అజ్ఞాతంగా ఉన్న రూ. 2000 నోటు హఠాత్తుగా మే 20వ తేదీ ఉదయం నుంచి ప్రత్యక్షం కావడం మొదలయింది. జమ్ము కశ్మీర్‌లో అయితే 2018 తరువాత ముద్రించిన నోట్లు కూడా ప్రత్యక్షమయ్యాయని వార్తలు వచ్చాయి. అంటే అర్థం ఏమిటి? అచ్చు అసలు నోటులాగే ఉండే ఇలాంటి నోట్లను ప్రభుత్వం తప్ప ముద్రించ లేదు. లేదా పంచడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఆనాడు వచ్చిన నోట్లను భద్రపరచి ఉండాలి. జమ్ము కశ్మీర్‌లో జీ 20 సమావేశాలకు అడ్డంకులు కల్పించ డానికి, అందుకు కిరాయి మూక లను పురమాయించ డానికి కొంతమంది నోట్లు వినియోగిస్తున్నారని అర్థమవుతుందని నిఘా విభాగం అనుమానిస్తున్నది కూడా.

రూ. 2000 నోట్ల మార్పిడి గురించి ఇప్పటికే దినపత్రికలలో, టీవీ చానెళ్లలో, సామాజిక మాధ్య మాలలో ఉపసంహరణ, మార్చుకునే విధానం వంటి అంశాల మీద సమాచారం విరివిగానే వెలువడింది. అయితే ఒక ప్రముఖ తెలుగు టీవీ విశాఖపట్నంలో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యను మాత్రం ప్రసారం చేసింది. ఇది కశ్మీర్‌ ‌వ్యవహారమని అనలేం. కానీ నోట్లు మాత్రం ఎక్కడో రహస్యంగా ఉన్నాయని చెప్పడానికి రుజువు. ఇప్పుడు ఈ నోటు ఏం చేసుకోవాలో తెలియ డం లేదు అని అతడి వ్యాఖ్య. బయట వ్యాపారస్థులు, డ్రైవర్లు కూడా తీసుకోవడం లేదు అని కూడా నోటును ఊపుతూ చెప్పాడు. నోటు మార్చుకోవాలంటే బ్యాంకులకు వెళ్లండి అని అధికా రులు చెబుతుంటే కిరాణా వ్యాపారులనీ, డ్రైవర్లనీ ఎందుకు నిందించడం? అంటే ప్రజలు గందర గోళంలో పడిపోయారని చెప్పడం ఆ చానెల్‌ ఉద్దేశం. ఇది అతడి అజ్ఞానమా? అసలు చానెల్‌ అజ్ఞానమా? పైగా సెప్టెంబర్‌ 30 ‌వరకు కూడా ఇవి ఆర్థికవ్యవ స్థలో చెలామణి అవుతాయి. కానీ నోట్లు మార్చుకునే పని ఉన్నవారు అదనంగా ఇతరుల నుంచి నోట్లు తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడతారు? కాబట్టి బ్యాంకులను మాత్రమే ఆశ్రయించాలి. అక్కడ మాత్రం కొన్ని పరిమితులు ఉన్నమాట నిజం. వృద్ధులకీ, మహిళలకీ వేర్వేరు కౌంటర్లు తెరుస్తారు. రోజుకు పది నోట్ల వంతున మార్చుకోవచ్చు. అదికాక పోతే డిపాజిట్‌ ‌రూపంలో బ్యాంకులలో జమ చేసుకో వచ్చు. దీనికి పరిమితి లేదు. సెప్టెంబర్‌ 30 ‌తరువాత ఆ నోట్లు ఎవరి దగ్గరయినా ఉండిపోతే వాటి సంగతేమిటో మాత్రం ఆర్‌బీఐ వెల్లడించ లేదు. ఈ పరిణామంతో సాధారణ ప్రజలు భయ పడ వలసిన పనిలేదు. ఓట్లు కొనుక్కునే రాజకీయ పార్టీలు, కిరాయి మూకలను మేపే దేశద్రోహ సంఘాలు మాత్రమే ఈ ఉపసంహరణకు కలవరపడాలి.

—————————

అదాని గ్రూప్‌ ‌మీద ఆరోపణలు అబద్ధం

అదాని గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదాని మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యక దర్యాప్తు సంస్థ తేల్చింది. మార్కెట్‌లో తన షేర్లకు లేని విలువను ఆపాదించి కృత్రిమంగా ధరలు పెంచారన్న ఆరోపణలు, నిధుల మళ్లింపు, విదేశాల నుంచి ధనప్రవాహం వంటి ఆరోపణలపై సుప్రీం కోర్టు ప్రత్యేకంగా దర్యాప్తు జరిపించింది. అదాని గ్రూప్‌ ‌కంపెనీల షేర్ల ర్యాలీ విషయంలో నియంత్రణకు సంబంధించిన వైఫల్యం ఏమీ లేదని ఆ కమిటీ తేల్చింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ ‌పరిశోధక సంస్థ అదాని గ్రూప్‌ ‌మీద ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇలాంటి ఆరోప ణలు చేయడంతో దేశం అట్టుడుకినట్టు ఉడికింది. మార్కెట్‌ ‌నియంత్రణ సంస్థ ‘సెబి’ ఇచ్చిన వివరణ, డేటా ప్రకారం నియంత్రణ వైఫల్యాల వల్ల షేర్ల ధరలలో అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పలేమని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం తేల్చి చెప్పింది. ఈ మేరకు 173 పేజీల నివేదికను మే 19న నిపుణుల బృందం భారత అత్యున్నత స్థానానికి సమర్పించింది. అలాగే అదాని కారణంగా సెబి మీద ఆరోపణలను కూడా ధ్రువీకరించలేమని నిపుణుల బృందం చెప్పింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం ‌సాప్రే నాయకత్వంలోని ఈ బృందంలో కేవీ కామత్‌, ఓపీ భట్‌, ‌నందన్‌ ‌నిలేకని వంటి ఉద్దండులే ఉన్నారు. సందేహాస్పద విదేశీ సంస్థల నుంచి అదాని సంస్థల లోకి నిధులు వెల్లువెత్తాయన్న ఆరోపణలపై సెబి నిర్వహిస్తున్న దర్యాప్తులో కూడా ఇంతవరకు ఏమీ తేలలేదని కూడా నిపుణులు తెలియచేశారు. ఈ ఆరోపణ మీద సెబీ 2020 నుంచి దర్యాప్తు చేస్తున్నది. నిపుణుల నివేదిక అందిన వెంటనే అదాని గ్రూప్‌ ‌సంస్థ షేర్ల ధరలు పుంజుకున్నాయి.

అదాని మీద ఆరోపణలకు సంబంధించి భారత విపక్షాలు చేసిన రాద్ధాంతం అత్యంత అవమానకర మైనది. రాహుల్‌ ‌గాంధీ ఈ వివాదంలో చేసిన రగడ ఒక విధ్వంసానికి తక్కవ కాదు. బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట. మోదీకీ, గుజరాత్‌ ‌వ్యాపార దిగ్గజం అదానికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటో తేల్చా లంటూ మూర్ఖంగా వాదించారాయన. ఎన్నోరోజులు పార్లమెంట్‌ ‌కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ వివాదం మీద సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ విపక్షాలు నిరంతరం రగడను సృష్టిస్తూనే ఉన్నాయి. పార్లమెంట్‌ ‌సమావేశాలు ప్రారంభం కావడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఒక సమస్యను విపక్షాలు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు హిండెన్‌ ‌బర్గ్ ‌వంటి దొంగ కంపెనీలు చేయూత నిస్తున్నాయి. ఆ ఆరోపణలన్నిటిని అదాని గ్రూప్‌ ‌ఖండించింది. ఈ వివాదం సాగినంతకాలం ఆ గ్రూప్‌ ‌షేర్ల ధరలలో ఒడిదుడుకులు వచ్చాయి. చివరకు ఈ వివాదం మీద కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని  నియమిం చింది. అందుకు సీల్డ్ ‌కవర్‌లో కొన్ని పేర్లు పంపితే, సుప్రీంకోర్టు వాటిని కాదని తాను స్వయంగా ఒక కమిటీని నియమించడం మరొక విశేషం. ఇప్పుడు ఆ కమిటీయే అదాని గ్రూప్‌ ‌మీద హిండెన్‌బర్గ్ ఆరోపణలు అబద్ధాలని తేల్చింది. అంటే ఆ అబద్ధాల ఆధారంగా విపక్షాలు చేసిన విమర్శలు కట్టుకథలేనని తేలింది. ఈ కమిటీ నివేదిక గురించి ఇప్పుడు ఈ విపక్షాలు ఏమంటాయో చూడాలి!

అదాని సంగతి తేలిపోయింది. మళ్లీ తాజాగా రూ. 2000 నోటు మీద వివాదం ఆరంభించారు. నోటును రద్దు చేయడానికి, లేదా ఉపసంహరించు కోవడానికి ప్రభుత్వానికి హక్కు ఉంది. ఇది గతంలోను జరిగినదే. అవన్నీ మరచిపోయి మమత, కేజ్రీవాల్‌ ‌వంటివారు దిగజారి విమర్శలకు దిగుతు న్నారు. కేజ్రీవాల్‌ అయితే దేశానికి చదువుకున్న ప్రధాని కావాలని అవమానకరమైన వ్యాఖ్య చేశాడు. పార్లమెంట్‌లో జరిగిన దానికీ, విదేశాలలో జరిగిన దుష్ప్రచారానికీ, అదాని గ్రూప్‌నకు జరిగిన నష్టానికీ ఈ విపక్షాలు బాధ్యత వహిస్తాయా?

About Author

By editor

Twitter
Instagram