మార్చి 7  హోలి

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

వసంత రుతువు ఆగమనానికి సంకేతం హోలీ పున్నమి. రాలే ఆకులు రాలుతూ, వచ్చే ఆకులు వచ్చే వేళ, ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి సంకేతంగా  ఈ పండుగను భావిస్తారు. ఫాల్గుణ, చైత్ర మాసాల సంధికాలంలో  జరుపుకునే ఈ  పండుగ గురించి  భవిష్య, నారద పురాణాలతో పాటు గాథాసప్తశతి, మాళవికాగ్నిమిత్రం, నాగావళి లాంటి గ్రంథాలు పేర్కొన్నాయి.  ఆధునిక కాలంలో సామాజిక సమైక్యత, సమష్టి భావనకు  ప్రతీకగా నిలిచినట్లే,  ఈ పండుగకు పురాణ నేపథ్యమూ ఉంది. ముఖ్యంగా కాముని దహనం, ప్రహ్లాద చరిత్ర ఈ పండుగతో  ముడిపడి ఉన్నాయి.

లోకకంటకుడు త్రిపురాసుర సంహారానికి లోకనాయకుడు (కుమారస్వామి) అవతరించాలి. అందుకు తపోదీక్షలో ఉన్న శివుడు ప్రణయాను రక్తుడు కావాలి. తపస్సునుంచి దృష్టిని మళ్లించేం దుకు బ్రహ్మ సూచన మేరకు మన్మథుడు అకాల వసంత రుతువును సృష్టించి సుమబాణ ప్రయో గంతో పరమేశ్వరుడి మనసు చలింపచేస్తాడు. ఆగ్రహించిన హరుడు ఫాలనేత్రం (మూడవ కన్ను)తో రతీపతిని ఫాల్గుణ పున్నమినాడు భస్మంచేసినట్లు శివమహా పురాణం పేర్కొంది. మరో గాథ ప్రకారం, పరమశివుడిని వివాహమాడాలనుకున్న హిమ వంతుని కుమార్తె గిరిజ, తపోదీక్షలో ఉన్న ఆయనను ప్రసన్నుడిని చేసుకోవాలనుకుంటుంది. అందుకు మన్మథుని సహాయాన్ని కోరగా, ఆతని పుష్పబాణ ప్రయోగంతో తపోభంగమై మహేశ్వరుడు తన ఫాలనేత్రంతో మన్మథుడిని దహించివేశాడు. రతీదేవి, దేవతల విన్నపాన్ని మన్నించిన శివుడు ఆతనిని పునర్జీవుని చేశాడు. ఆ రోజు ఫాల్గుణ పౌర్ణమి కావడంతో అది ‘కాముని పున్నమి, ‘కామదహ నోత్సం’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ కామం అంటే శృంగారపరమైన ‘వాంఛ’ అనే అర్థంలోనే కాకుండా ‘కోరిక’ అనే లౌకిక అర్థంలో గ్రహించాలని పెద్దలు సూచిస్తారు. మానవుడు ఐహికమైన కోరికలను పరిత్యజించి నిష్కామకర్మతో వ్యవహ రించాలని హోలీ పండుగ సందేశాన్ని ఇస్తోంది. మీనాక్షీదేవి ఘోరతపస్సు చేసి సుందరేశ్వరుడిని పరిణయమాడిందీ ఫాల్గుణ పౌర్ణమి నాడే. ఆ రోజున ఆదిదంపతులకు పూజాదికాలు నిర్వహించి ‘హోలికా మిశ్రమం’ (మామిటిపూత, వేపచిగుళ్లు, తేనె మిశ్రమం)ను భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. ప్రహ్లాద గాథను అనుసరించి, ప్రహ్లాదుడితో హరి నామస్మరణ మానిపించే ప్రయత్నంలో భాగంగా తండ్రి హిరణ్యకశిపుడు అనేక విధాల శిక్షలు విధిస్తుంటాడు. పసిపిల్లలను అపహరించే ఆయన సోదరి హోలిక మహాశక్తి సంపన్నురాలు. అగ్నికూడా దహించలేని ఆమె ద్వారా ప్రహ్లాదుని అగ్ని ప్రవేశం చేయించాలనుకుంటాడు హిరణ్యకశిపుడు. అన్న ఆజ్ఞ మేరకు హోలిక మేనల్లుడిని ఒడిలో కూర్చుండపెట్టు కుని అగ్నిప్రవేశం చేస్తుంది. అయితే ఆతని స్పర్శ కారణంగా హోలిక అగ్ని కీలలకు ఆహుతి కాగా, ప్రహ్లాదుడు భద్రంగా బయటికి వస్తాడు. హోలిక దహనమైన ఫాల్గుణ పౌర్ణమినే ‘ప్రహ్లాద పౌర్ణమి’ అంటారు. రాక్షసి పీడ వదలినందుకు సంతోషంతో ప్రజలు రంగునీళ్లు (వసంతాలు) చిమ్ము కుంటూ వేడుక జరుపుకున్నారట. హోలీ నాడు జనావాస కూడళ్లలో పెద్ద మంటలు (భోగి మంటల మాదిరి) వేసి అగ్నికి ప్రదక్షిణ చేసి ఆ భస్మాన్ని నుదుటిన ధరిస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనిని ‘ధూళి వందన్‌’‌గా వ్యవహరిస్తూ, దీనివల్ల ప్రతికూలశక్తులు దూరమై, సానుకూల శక్తులు సమకూరుతాయిని విశ్వాసం. కాముని పున్నమి నాడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పశువుల కాపరులు వారిలో ఒకరికి ఎలుగుబంటి వేషం వేసి ఇళ్ల ముందు ఆడిస్తూ పాటలతో భిక్షాటన చేసేవారని తెలుస్తోంది.

పాలిచ్చే సాకుతో తనను చంపవచ్చిన రక్కసి పూతన ప్రాణాలను బాలకృష్ణుడు హరించిన రోజు పౌర్ణమే. గండం నుంచి బయటపడిన ఆయనను వ్రేపల్లె మహిళలు ఊయలలో వేసి పండుగ జరుపు కోవడంతో ‘డోలోత్సవం’ అనే పేరు వచ్చిందని చెబుతారు. శ్రీకృష్ణుడికి ఈ ఉత్సవం నిర్వహించి, బొబ్బట్లు నివేదిస్తారు. ఫాల్గుణ శుక్ల అష్టమి నుంచి పున్నమి వరకు ‘హోలాష్టకం’ అంటారు. ఈ ఎనిమిది రోజులూ అష్టదిక్పాలకులను, నవగ్రహా లను, దశ మహాశక్తులను నవధాన్యాలతో అర్చించే ఆచారం కొన్ని ప్రాంతాలలో ఉంది. అలా పూజించిన తరువాత ఆయా దేవతలకు ఉద్వాసన పలికి వారి మూర్తులపై గల చందన పన్నీటి మిశ్రమాన్ని చిలకరించడమే హోలీ వేడుకగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు.

ఆనందంతో పాటే ఆరోగ్యం

 హోలీనాడు ఆనందాన్ని పంచుకునే క్రమంలో వాడే రంగులను వేపగింజలు, కుంకుమ, పసుపు తదితర ప్రకృతి సిద్ధ, ఆయుర్వేద పదార్థాలతో తయారు చేసేవారు.

కాలక్రమంలో రసాయనాలతో నిండిన రంగులు వచ్చాయి. వీటి కారణంగా ఆనందం, వినోదాలను అటుంచి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని, వాతావరణం కలుషితమవుతోందని వైద్య నిపుణులంటున్నారు. సంప్రదాయకంగా వస్తున్న పండుగలను జరుపుకుంటూనే, నియమాలను పాటిస్తే ఆరోగ్యాలను, పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram