తెలంగాణలో రజాకార్ల దురాగతాలను సాహసంతో ప్రతిఘటించిన అమరవీరుల్లో పటేల్‌ ‌చింతపూడి రామిరెడ్డి ఒకరు. ఆయన చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఇంతకీ, రామిరెడ్డికి నిజాం సాయుధ బలగాలతో ఘర్షణ దేనికి, వారిని ఆయన ఎలా ఎదిరించాడు?

రామిరెడ్డిది నల్లగొండ జిల్లాలోని భువనగిరి మండలం రేణుకుంట గ్రామం. దీనికి మైలు దూరంలో రాజాపేట సంస్థానం ఉండేది. ఎనిమిది మైళ్ల దూరంలో జైన దేవాలయం కొలువుదీరిన ప్రసిద్ధ కొలనుపాక గ్రామం, ఆరు మైళ్ల దూరంలో జగదేకపురం ఉన్నాయి. నాడు ఆ గ్రామంలో 260 గడపలు మాత్రమే.

రేణుకుంటకు మూడు మైళ్ల దూరంలో బేగంపేట అనే గ్రామం ఉంది. అది ముక్తా (చిన్న జాగీరు)గా ఉండేది. మహమ్మదీయుడైన ముక్తేదారు చనిపోవడంతో ఆ జాగీరు కోసం ముక్తేదారు కూతురు, కొడుకుల మధ్య తగాదా మొదలైంది. ఈ గొడవలో చింతపూడి రామిరెడ్డి ఆ ముక్తేదారు కూతురు పక్షం వహించాడు. ఆమెకు సహాయంగా ఉంటూ అక్కడ భూములను సాగు చేయించి రక్షణగా నిలుచున్నాడు. కానీ ముక్తేదారు కొడుకు తన సోదరి భూములనే స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు కొనసాగించాడు.  చింతపూడి రామిరెడ్డిని భయపెట్టి అక్కడి నుంచి తరిమేయాలని హైదరాబాద్‌ ‌నుండి అరబ్బుల ముఠాను రప్పించాడు. ఆ రోజుల్లో నిజాం పాలనలో అరబ్బులకు ఓ ప్రత్యేక స్థానం ఉండేది. నిజాం ఖజానాకు కాపలాదారులుగా వాళ్లే ఉండే వారు. అందువల్ల వారికి ప్రత్యేక అధికారాలు, సౌకర్యాలు కూడా ఉండేవి. ఎవరైనా ఎదురు మాట్లాడితే చాలు బొడ్లో నుండి బాకు తీసి చంపడానికి సిద్ధమయ్యేవారు. నిజాం పోలీసు కూడా వారికి భయపడేవాడు. అరబ్బుల ముఠా బేగంపేట వచ్చి రామిరెడ్డిని సవాలు చేసింది. ఆయన నిర్భయంగా ఇతర గ్రామస్తుల సహాయంతో అరబ్బుల ముఠాను ముఖాముఖీ ఎదుర్కొన్నాడు. రామిరెడ్డి దళం ముందు అరబ్బు దళం నిలవలేకపోయింది. ఆ ముఠా నాయకుడిని పట్టుకొని ముక్కు, చెవులు కోసి పంపించాడు రామిరెడ్డి. వారు హైదరాబాద్‌ ‌పారిపోయారు. రామిరెడ్డి ధైర్యానికి గ్రామస్తులంతా మెచ్చుకున్నారు. ఆ ముక్తేదారు కూతురుకు తన తండ్రి భూములపై న్యాయంగా యాజమాన్యపు హక్కు దక్కింది. చుట్టుపక్కల గ్రామాల వారు రామిరెడ్డిని తమ ‘రక్షకుడి’గా చూడటం ప్రారంభించారు.

మూటకొండూరు గ్రామంలో మరో భూతగాదా వచ్చింది. రామిరెడ్డి ఈసారి పోలీసులను ఎదుర్కో వలసి వచ్చింది. ఘర్షణ తీవ్రస్థాయికి చేరేసరికి పోలీసు కానిస్టేబుల్‌ ‌తుపాకీ పేల్చాడు. వెంట్రుక వాసిలో రామిరెడ్డి తన ప్రాణాన్ని రక్షించుకోగలిగాడు. ఆ కాల్పుల్లో పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌నేలకొరిగాడు. హత్యానేరంపై రామిరెడ్డి అరెస్టు అయ్యాడు. పులి బోనులో చిక్కిందని రజాకార్లు సంతోషపడ్డారు. కానీ రామిరెడ్డి ధైర్యం కోల్పోకుండా తాను హత్య చేయలేదనే అంశాన్ని నిరూపించాడు. పోస్టుమార్టం రిపోర్టులో హతుని శరీరంలో ఉన్న తూటా కానిస్టేబుల్‌దేనని సాక్ష్యాధారాలు దొరికాయి. దాంతో రామిరెడ్డి తన గౌరవాన్ని నిలుపుకుని విడుదల అయ్యాడు. ఈసారి ఆయన పేరు మరిన్ని చుట్టుపక్కల గ్రామాలకు చేరింది. రామిరెడ్డి ఆ తర్వాత అలాంటి కుట్రపూరిత కేసులు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆగస్టు 15, 1947 దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు.. రామిరెడ్డి ఆధ్వర్యంలో రేణుకుంటలో స్వాతంత్య్ర ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అప్పటికి నిజాం స్వతంత్ర ప్రతిపత్తి కోసం మొండిగా వ్యవహరిస్తున్నాడు. రజాకార్లు మతోన్మాదంతో హిందువులను పీడిస్తూ నిజాంకు అండగా నిలిచారు. గ్రామాలను దోచుకుంటున్నారు. అరాచకాలు సృష్టిస్తున్నారు. అప్పటికి రేణుకుంట ప్రజల జోలికి వెళ్లే ప్రయత్నం వారు చేయలేదు. ఈ ఘర్షణల నేపథ్యంలో రామిరెడ్డి తన భార్యాపిల్లలను తెనాలికి పంపించాడు. పెద్ద కుమారుడు రంగారెడ్డితో తాను ఆ గ్రామంలోనే ఉంటూ ఒక రక్షణదళాన్ని ఏర్పాటు చేశాడు. కొనఊపిరి వరకు పోరాడైనా తన గ్రామాన్ని, ప్రజలను రజకార్ల నుండి రక్షించాలని ప్రతిజ్ఞ చేశాడు. అరవై తుపాకులు తెప్పించి గ్రామరక్షణ దళానికి తర్ఫీదు ఇప్పించాడు. తాను ఉపయోగించేందుకు ట్వెల్‌బోర్‌ ‌తుపాకీ తెప్పించు కున్నాడు. రక్షణదళ సభ్యులకు షూటింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి అందులో నైపుణ్యం గల పగడాల సత్తయ్య, వేచల్ల పుల్లారెడ్డిని నియమించాడు. రామిరెడ్డి తన రెండంతస్తుల మేడ పైభాగంలో తుపాకులు అమర్చి శత్రువులను ఎదుర్కోడానికి ఏర్పాట్లు చేశాడు. రాజాపేట నుండి రజాకార్లు వస్తే వారిపై కాల్పులు జరపడానికి వీలుగా తన మేడ ముందున్న చెట్లను నరికించాడు. రజాకార్లు దాడిచేస్తే గ్రామస్తులంతా జట్లుగా విడిపోయి వారిపై దాడి చేయాలని మానసికంగా వారిని సిద్ధం చేశాడు. ఈ ఏర్పాట్లన్నిటి గురించి పాలకులకు, అధికారులకు తెలిసింది. అంతేకాదు, హైదరాబాద్‌ ‌సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని రామిరెడ్డి ప్రచారం చేశాడు. ప్రజల్లో జాతీయభావాన్ని మేల్కొల్పాడు. ఈ పరిణామాల వల్ల నిజాం పాలకులకు ఆయన కంటిలో నలుసులా తయారయ్యాడు. ఎలాగైనా రామిరెడ్డి అడ్డు తొలగించుకోవాలని రజాకార్లు ప్రణాళిక వేసుకున్నారు. కొలిపాకలోని ముస్లిం తహశీల్దారు, జగదేవ్‌పూర్‌లోని అబ్దుల్‌ ‌రహ్మన్‌, ‌రాజాపేటలోని రజాకార్‌ ‌నాయకుడు హషీం ఆలీ, ముస్త్యాలలోని రజాకార్‌ ‌సైనికాధికారి చోటేమియా ఈ కుట్రలో కీలకంగా వ్యవహరించారు. ఈ నలుగురు సాయుధ రజాకార్లు, నిజాం సైనికుల సహాయంతో రేణుకుంట గ్రామంపై, రామిరెడ్డిపై దాడికి పథకం రచించారు. 50 మంది సిపాయిలు, 200 మంది సాయుధులైన పోలీసులు, రజాకార్లు, ముస్లిం అధికారుల నాయకత్వంలో 12 ట్రక్కుల్లో, జీపుల్లో హైదరాబాద్‌ ‌నుండి బయలుదేరిన దళం ఆలేరు కొలిపాక మార్గం ద్వారా రాజాపేట వైపు వస్తున్నది.

అప్పటికి రేణుకుంటలో గాంధీ మందిరం కట్టడానికి నిర్ణయమైన నేపథ్యంలో అందుకు కావాల్సిన రాళ్ల కోసం ఆ గ్రామానికి చెందిన వడ్డర్లు కొండపైకెక్కి రాళ్లు చెక్కుతుండగా తెల్లవారుజామున మూడు గంటల వేళకి దుమ్ము రేపుకుంటూ రజాకార్ల బలగం రావడం చూసిన ఓ వడ్డరి ఒక్కసారిగా కొండపై నుంచి దూకి రామిరెడ్డి దగ్గరకు పరిగెత్తి ‘దొరా.. ఇది పగవాళ్ల రాత్రి మనం మేల్కొని ఉండాలి’ అని హెచ్చరించాడు. రామిరెడ్డి వడ్డరి మాట ప్రకారం తన గ్రామ రక్షణదళాన్ని సిద్ధంచేశాడు. తుపాకులు పుచ్చుకొని గ్రామం వెలుపల గల ఇసుకవాగు వద్దకు వచ్చి పొంచి ఉన్నారు. శత్రువర్గం రేణుకుంటకు రెండు పర్లాంగుల దూరంలో ఆగి రెండు దళాలుగా విడిపోయి ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. ఈ లోగా రామిరెడ్డి దళం వారు కాల్పులు జరిపారు. అప్పటికి ఇంకా ఎదుటి పక్షం కాల్పులు జరపలేదు. రామిరెడ్డి తన దళాన్ని వెనక్కి నడిపి తన మేడపైకి ఎక్కి శత్రువును చురుగ్గా ఎదుర్కోవటానికి ఏర్పాట్లు చేశాడు. ఈలోగా గ్రామస్థులందరూ తుపాకీ కాల్పులు విని మేల్కొన్నారు. కొన్ని కుటుంబాలు వచ్చి రామిరెడ్డి భవనంలో తలదాచుకున్నాయి. రామిరెడ్డి దళం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల దాకా శత్రువులపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. రజాకార్ల దళం మరింత దగ్గరగా వచ్చి రామిరెడ్డి భవంతిని చుట్టుముట్టింది. వారి లక్ష్యం రామిరెడ్డిని అంతం చేయడమే.

ఆ తరువాత గ్రామస్తులు సునాయాసంగా లొంగిపోతారని వారి ఉద్దేశం. ఈ లోగా భవంతిపైనున్న దళ సభ్యులు ఇద్దరు మరణించారు. ఓ పదిహేను మంది శత్రుదళ సభ్యులు భవంతి దగ్గరకు రాగా రామిరెడ్డి బాంబు విసిరి వారిని హతమార్చాడు. ఎదురు కాల్పులు ఆగిపోయాయి. ఓ గంట పాటు నిశ్శబ్దం అలుముకుంది. శత్రు ముఠా నుండి ఎలాంటి అలజడి వినిపించడం లేదని రామిరెడ్డి తన భవంతి పిట్టగోడ దరికి వచ్చి, దానికి ఆనుకుని తలపైకెత్తి చూశాడు. హఠాత్తుగా వెనకాల నుండి పేలిన తుపాకీ తూటా రామిరెడ్డి తలలో నుంచి దూసుకుపోయింది. వెంటనే రామిరెడ్డి కిందపడిపోయాడు. తన ప్రతినననుసరించి గ్రామరక్షణ కోసం వీరోచితంగా పోరాడి అమరుడయ్యాడు.

అసలు జరిగిందేమంటే రామిరెడ్డి ఇంటి వెనకాల ఓ డెబ్భై గజాల దూరంలో, ఓ పాత ఇంటి పెరట్లో పెద్ద చింత చెట్టు ఒకటి ఉంది. పోరాటం మధ్యలో నిశ్శబ్దం ఆవరించిన సమయంలో నిజాం సైనికుడొకడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రామిరెడ్డి తల ఎత్తగానే దాని మీద నుండి గురిచూసి అతని తలలోకి తూటాను దింపాడు. రామిరెడ్డి మరణించగానే మిగతా దళం సభ్యులు హడలెత్తి పోయారు. ఈలోగా రజాకార్లు ‘మాకు కావలసింది రామిరెడ్డి. అతడు మరణించాడు. కాబట్టి మీకు ఏ హాని చేయం. బయటకు రండి’ అని ప్రకటించారు. ఇది నమ్మి వారంతా బయటకు వచ్చారు. కానీ రజాకార్లు అత్యంత కర్కశంగా వారిని వరసగా నిలబెట్టి స్టెన్‌గన్‌తో కాల్చేశారు. మరణించిన వారిలో రామిరెడ్డి తమ్ముడు, కొడుకు రంగారెడ్డి, పగడాల సత్తయ్య, వేచల్ల పుల్లారెడ్డి, యేమల్ల నరసింహారెడ్డి, చాకలి యాదగిరి, మంగలి రాజయ్య, బురుగు చందారెడ్డి, బురుగు వెంకటరెడ్డి, యాదగిరి రెడ్డి తదితరు లున్నారు.

గ్రామస్తులందరిని ఒక దగ్గర చేర్చి ‘మిమ్మల్ని ఏమీ చేయం. మిగతా దళసభ్యుల పేర్లు చెప్పండి’ అని రజాకార్లు వారిని బెదిరించారు. వారు అమాయకంగా కొందరి పేర్లు చెప్పారు. వారిని వెతికి పట్టుకొని మరీ కాల్చి చంపారు. ఆ శవాలను ఎడ్ల బండిలో వేసి గ్రామస్తులతో ఆ బండిని లాగించి ఇసుకవాగు దగ్గర దానిపై చెత్త వేసి బండికి నిప్పటించారు. సగం కాలీ కాలని ఆ శవాలు ఆనవాలు లేకుండా మసిబారిపోయాయి. మిగిలిన వారిలో 70 మందిని హైదరాబాద్‌ ‌తీసుకుపోయారు. వారిని జైల్లో పెట్టారు. పోలీసు చర్య అనంతరం వారిని విడుదల చేశారు. రేణుకుంటపై పోలీసులు, రజాకార్లు దాడి చేసి రామిరెడ్డిని హత్య చేశాక ఆనాటి హైదరాబాద్‌ ‌రేడియో ఈ వార్తను ప్రసారం చేసింది. రామిరెడ్డి పోరాట గాథను నల్లగొండ జిల్లాలో ‘బాల సంతులు’ అనే భిక్షకులు గానం చేస్తూ తిరిగేవారు. ఆయన వీరోచిత పోరాటం గురించి, నిజాం సాయుధ బలగాలను ఆయన ఏ విధంగా ఎదిరించి నదీ నేటికీ అక్కడివారు గుర్తుచేసుకుంటారు.

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
Instagram