– లక్ష్మణసూరి

జనవరి 12 సుబ్బారావు జయంతి


జనవరి 12న – ఇద్దరు కారణజన్ముల పుట్టుక ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలను రూపుమాపింది. ఇందులో ఒకరు భారతీయుల మనోమస్తిష్కాన్ని పట్టిపీడిస్తున్న ఆత్మవిస్మృతిని, జడత్వాన్ని వదలగొట్టి నరనరాన జాతీయవాదాన్ని నింపి ‘ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్‌ ‌నిబోధత’ అంటూ చికాగోలో కొలంబస్‌ ‌హాలు వేదికగా గర్జించి భారతదేశ సనాతన ధర్మ శంఖారావాన్ని పూరించిన స్వామి వివేకానంద. కాగా మరొకరు అనేక ప్రాణాంతక వ్యాధులకు మందుల ద్వారా శాశ్వత పరిష్కారాన్ని చూపి, మానవుడు ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని తనకు తానుగా ఉద్ధరించుకునే మేధస్సును సాధించగలగా లంటూ అమెరికాలోని లెడర్లే ప్రయోగశాల వేదికగా ఎన్నో ఔషధాలను రూపొందించిన మందుల మాంత్రికుడు, వైద్య, జీవరసాయన శాస్త్రరంగానికే ధృవతారగా నిలిచిన యల్లాప్రగడ సుబ్బారావు.

జనవరి 12, 1895న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (బ్రిటిష్‌ ఇం‌డియాలోని మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ)లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు యల్లాప్రగడ. రాజమండ్రిలో మెట్రిక్యులేషన్‌ ‌చదివారు. అదే సమయంలో తండ్రి జగన్నాథం కన్నుమూత, ఎప్పుడూ వెన్నంటి ఉంటూ ఎంతగానో ప్రోత్సహించే పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన స్ప్రూ వ్యాధితో మరణం, వారం తిరగకుండానే మరో సోదరుడు కృష్ణమూర్తి మృతి ఆయనను కుంగ దీశాయి. అయినా నిరుత్సాహపడకుండా చదువు సాగించాలనుకున్నాడు. ప్రాణాంతక వ్యాధులకు మందులు కనిపెట్టాలని ఆనాడే నిర్ణయం తీసుకు న్నాడు. కుమారుడి ఆశయాన్ని గమనించిన తల్లి వెంకమ్మ మంగళ సూత్రాలను అమ్మి సుబ్బారావును మద్రాసులోని హిందూ ఉన్నత పాఠశాలలో చేర్పించారు.

మైలాపూర్‌లోని రామకృష్ణ మిషన్‌లో సేవచేస్తూ గడిపేద్దామని ఒక దశలో నిర్ణయించుకున్న సుబ్బారావుకు ‘అన్ని సమస్యలకు పరిష్కారం విద్య మాత్రమే’ అన్న వివేకానందుని మాటలు స్ఫూర్తి నిచ్చాయి. వైరాగ్యాన్ని వీడి హిందూ కళాశాలలో చదువు కొనసాగించాడు. ఆ నిర్ణయమే ప్రపంచానికి ఓ గొప్ప జీవరసాయనిక శాస్త్రవేతను అందించింది.

భారత స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయమది. మద్రాస్‌లో జరుగుతున్న విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమానికి ప్రభావితుడై బ్రిటిష్‌ ‌వారిచ్చిన సర్జికల్‌ ‌దుస్తులను విడిచి ఖద్దరుతో చేసిన సర్జికల్‌ ‌గౌన్‌తో తరగతులకు, ప్రయోగశాలలకు వెళ్లసాగారు. అక్కడి ప్రొఫెసర్ల మాటను తిరస్కరించిన కారణంగా సర్జరీ ప్రొఫెసర్‌ ‌M.C. బ్రాడ్‌ఫీల్డ్ ఆ‌గ్రహానికి గురయ్యాడు. ఫలితంగా ఎంబీబీఎస్‌ ‌డిగ్రీని కోల్పోవలసి వచ్చింది. ఎంబీబీఎస్‌ ‌కంటే తక్కువ విలువ ఉన్న Licentiate of Medicine and surgeray (LMS) డిగ్రీతో బ్రిటిషర్లు ఆయనను బయటకు పంపారు. ఈ చిన్న విద్యార్హతతో మద్రాస్‌ ‌మెడికల్‌ ‌సర్వీసెస్‌లో ఉద్యోగం పొందలేక, అక్కడే డాక్టర్‌ ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేదిక్‌ ‌కాలేజీలో అనాటమీ ప్రొఫెసర్‌గా చేరారు. అప్పుడే సుబ్బా రావుకు ఆయుర్వేదంపై ఎంతో ఆసక్తి కలిగింది. ‘నాస్తిమూలమనౌషధం’ ప్రతి చెట్టు ఔషధ గుణాలు కలిగి ఉంటుందని, దానికి ఆధునికత ఆపాదించాలని సంకల్పించారు. మామగారి ప్రోత్సాహం, కాకినాడ మల్లాది ఛారిటీస్‌ ‌వారి ఆర్థిక, హార్థిక సహకారాలతో అక్టోబర్‌ 26, 1922‌న అమెరికాలోని బోస్టన్‌ ‌నగరం లోని హార్వార్డ్ ‌స్కూల్‌ ‌ఫర్‌ ‌ట్రోఫికల్‌ ‌మెడిసిన్‌లో చేరి డిప్లొమా పొందారు. ఆ విశ్వవిద్యాలయంలోనే జూనియర్‌ ‌లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిం చారు. శరీర ద్రవ్యాలలో (Body Fluids), కణజాలలలో (Tissues) ఫాస్పరస్‌ (‌భాస్వరం) మూలకం పరిమాణాన్ని నిర్ధారించడానికి సైరస్‌ ‌ఫిస్కేతో కలిసి పరిశోధన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఫిస్కే-సుబ్బారావు విధానం’గా జీవరసాయన శాస్త్రంలో ఈ పద్ధతి విఖ్యాతి చెందింది. 1925లో మొట్టమొదటగా ది జర్నల్‌ ఆఫ్‌ ‌బయలాజికల్‌ ‌కెమిస్ట్రీలో ఇది ముద్రిణ అయింది. Energy Currency of a cell గా పిలుచుకొనే ATP (Adonosine triphosphate) మీద విస్తృతంగా ప్రయోగాలు చేసి ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిం చారు. కండరాల సంకోచంలో ఫాస్ఫోక్రియాటైన్‌ ‌పాత్ర, శక్తిని ATP ఏ విధంగా నిల్వచేసుకొంటుంది? అనే అంశంపై పరిశోధన చేసి 1930లో పీహెచ్‌.‌డి పొందారు. నాడు అన్ని జీవరసాయన శాస్త్ర పుస్తకాల్లో తన పరిశోధన అంశాన్ని చేర్చారు. హార్వర్డ్ ‌విశ్వ విద్యాలయంలో జీవరసాయన శాస్త్రం (బయో కెమిస్ట్రీలో)లో మొట్టమొదటి డాక్టరేట్‌ ‌పొందిన భారతీయుడిగా గుర్తింపు పొందారు.

ఆ తర్వాత ఎదురైన వర్ణ వివక్షతో ఆ విశ్వవిద్యాల యాన్ని వదలి న్యూయార్క్‌లోని లెడర్లే లేబొరేటరీలో అసోసియేట్‌ ‌డైరెక్టర్‌ ఆఫ్‌ ‌రీసెర్చిగా చేరారు. పరిశోధనే ధ్యాసగా, శ్వాసగా; మానవ శరీరమే ప్రయోగశాలగా, ఆకాశమే హద్దుగా అవిశ్రాంతంగా పాటుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఎన్నో ఔషధాల తయారీకి ఆద్యుడు యల్లాప్రగడ సుబ్బారావే. కానీ ఈ విషయాన్ని బ్రిటిషర్లు తమ ఘనతగా ప్రకటించుకొని నిజాన్ని దాచిపెట్టారు. అంటువ్యాధులకు, క్యాన్సర్‌కు మందులు లేని ఆ రోజుల్లో నాలుగు ప్రముఖ ఔషధాల సృష్టికర్తగా యల్లాప్రగడ ఎందరికో ప్రాణదాతగా నిలిచారు. మొట్టమొదటి టెట్రాసైక్లిన్‌ ఆం‌టీ బయాటిక్‌ అరోమైసిన్‌ (‌Aureomycin) కనుగొనడంద్వారా అతిపెద్ద శాస్త్రీయ పరిశోధకుడిగా ప్రపంచ విఖ్యాతి చెందారు. ప్రపంచ యుద్ధంలో ఎంతోమంది సైనికులకు మలేరియా, పైలేరియాసిస్‌ (‌క్యూలెక్స్ ‌దోమ కాటు వలన వచ్చే బోదకాలు వ్యాధి)ని హైట్రాజన్‌ అనే ఔషధంతో నివారించారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఆ ఔషధాన్ని వాడుతు న్నారు. ఇది జంతువులకు సోకే ఫైబ్రోసిస్‌ ‌వ్యాధిని కూడా నివారిస్తుంది. అనీమియా, ట్రోపికల్‌ ‌స్ప్రూరి వ్యాధికి ఫోలిక్‌ ఆసిడ్‌ (‌B9)ను కనిపెట్టడం ద్వారా ఎంతోమందిని అనీమియా (రక్తహీనత) నుంచి కాపాడారు. B12 విటమిన్‌పై ఎన్నో పరిశోధనలు చేశారు. క్యాన్సర్‌ ‌కణాలపై విస్తృత పరిశోధనల నేపథ్యంలో Aminoptrin అనే ఫోలిక్‌ ఆమ్లం అమైనో ఉత్పనాన్ని కనుగొన్నారు. దీనిని సోరియాసిస్‌ (‌చర్మ సంబంధ దీర్ఘకాలిక వ్యాధి)కి వాడతారు. ఈ రోజు ఎన్నో రకాల క్యాన్సర్‌ ‌చికిత్సాలలో వాడే ఔషధం Methotrexate సుబ్బారావు కృషి ఫలితమే. ఆయన నోబెల్‌ ‌బహుమతి పొందకపోయినా Father of Chemotheropyగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఒక ఫంగస్‌కు యల్లాప్రగడ జ్ఞాపకార్థం సుబ్బా రోమైసిన్‌ ‌స్ప్లెండెన్స్ అని పేరు కూడా పెట్టారు. ఇప్పుడు మనం వింటున్న Pfizer కంపెనీ (ఒకప్పటి Lederle)కి మూలస్తంభం యల్లాప్రగడే. తనతో కలిసి పనిచేసిన సైరస్‌ ‌ఫిస్కే న్యూక్లియోటైడ్స్‌పై సుబ్బారావు చేసిన పరిశోధనా పత్రాలను వెలుగులోకి రానీయ లేదు. ఈర్ష్య, అసూయలకు బలి అయిన నిస్వార్థ, ఉదారవాది ఆయన.

సుబ్బారావు పరిశోధనలు Biochemistry Pharmocology, మైక్రో బయాలజీ, ఆంకాలజీ, న్యూట్రిషన్‌ ‌సైన్స్ ‌వంటి ఎన్నో రంగాలను ప్రభావితం చేశాయి. ఒక వ్యక్తిలో ఇన్ని శక్తులు ఉండటం బహుశా భారతీయుల లక్షణమేమో. శాస్త్రవేత్తగా, అధ్యాపకునిగా, వేదాంతిగా, మానవతావాదిగా, సంచాలకునిగా బహుముఖ ప్రజ్ఞత్వంతో, ఔషధ విజ్ఞానంతో సనాతన హిందూ రసాయన శాస్త్రవేత్తల పరంపరను ఆయన కొనసాగించారు. 53 ఏళ్ల వయస్సులో ఆగస్టు 8, 1948లో సుబ్బారావు పరమపదించిన నాడు జీవరసాయన శాస్త్రవేత్తలు అమెరికా నుండి గుంటూరు మెడికల్‌ ‌కాలేజీ దాకా ఆయన విగ్రహాలను ప్రతిష్టించి ఘననివాళి అర్పించారు. Science Simply Prolongs life But religion deepens it అంటూ యువతలో విజ్ఞాన స్ఫూర్తిని రగిల్చి ఎంతోమంది భావి శాస్త్రవేత్తలకు మార్గదర్శిగా నిలిచిన యల్లాప్రగడకు ఘనమైన నివాళిని అర్పిద్దాం!

About Author

By editor

Twitter
Instagram