తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. పుష్యమాస బహుళ పక్షంలో వచ్చే ఈ పండుగ సమాజంలోని అన్ని వర్గాలకు ఆనందదాయకమైనది. మానవ సంబంధాలకు నెలవు. అందుకే బతుకు తెరువు రీత్యా ఎక్కడెక్కడో ఉండేవారు ఈ పండుగా నాటికి సొంతూరు చేరాలని అభిలషిస్తారు. సంక్రాంతి పర్వదినంలో ఇమిడి ఉన్న ప్రతి అంశం మనం సంస్కృతీ సంప్రదాయ వైభవాన్ని చాటిచెబు తుంది. దానధర్మాలను ప్రోత్సహిస్తుంది. ఈ పండుగను భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే పేర్లతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ప్రతి పండుగకు ఒక్కో ప్రత్యేక దేవతను ఆరాధించినట్లే సంక్రాంతికి అధిష్ఠానదేవత పేరు ఏడు రకాలుగా, ఆ పండుగ వచ్చే వారాన్ని బట్టి ఉంటుంది. ఆ క్రమంలో ఈ ఏడాది (2023) సంక్రాంతి ఆదివారం నాడు కనుక అధిష్ఠానదేవత పేరు ‘ఘోర’.


సంక్రాంతి ఆనందానికి, ఆరోగ్యానికి, ఐశ్యర్యానికి ప్రతీక. ‘సం’ అంటే మిక్కిలి, ‘క్రాంతి’ అంటే ప్రగతి పూర్వక మార్పు. ‘సంక్రమణం’ అంటే ‘చక్కగా క్రమించడం’ అంటే ‘నడవడం’ అని భావం. సమస్త ప్రాణులకు జీవప్రదాత సూర్యభగవానుడు ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. పుష్యమాసంలో ధనూరాశి నుంచి మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. అలా సూర్యుడు సంచరించే కాలం ఆధారంగా సంవత్స రాన్ని దక్షిణాయనం, ఉత్తరాయణం అని రెండు భాగాలుగా పరిగణించారు. సూర్యుడు ధనుస్సు నుంచి మకరరాశికి మారడం దక్షిణాయనానికి వీడ్కోలు, ఉత్తరాయణానికి స్వాగతం పలికినట్లవు తుంది. మకర సంక్రమణాన్ని భోగి, మకర సంక్రాంతి, కనుమ అనే పేర్లతో మూడు రోజుల పాటు, కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజున కూడా (ముక్కనుమ) చేసుకుంటారు. పెద్దల పండుగగా వ్యవహరించే సంక్రాంతిని వివిధ దేశాలలోను జరుపుకుంటారు. ‘బేకన్‌ ‌ఫెస్టివల్‌’ (‌గ్రీకు), ‘నమ్‌ ‌ఫెస్టివల్‌’ (ఈజిప్టు), ‘బ్యాక్‌డేస్‌’ (‌రోమన్‌), ‘‌ఫైర్‌ ‌ఫెస్టివల్‌’ (‌యూరప్‌), ‘‌మృతువీరుల సంస్మరణ దినం’ (స్వీడన్‌) ‌పేర్లతో వ్యవహరిస్తారు.

జీవితం నిత్యనూతనంగా సాగాలన్న అభిలాషతో ఈ పండుగనాటి వేకువజామున ఇళ్లలోని పాత సామగ్రిని భోగి మంటల్లో వేస్తారు. మనసులో తపస్సు అనే అగ్నిని జ్వలింపచేసుకొని అరిషడ్వర్గాలను దహింప చేయడం ద్వారా కోరికలకు అతీతుడై భగవంతుడిని చేరవచ్చని సూచించేవే భోగిమంటలని పెద్దలు చెబుతారు. భోగి పండుగను జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. భోగి మంటలను ఉత్తర భారతదేశంలో ‘లోడి’ అంటారు. పంటలు ఇచ్చినందుకు కృతజ్ఞత తోనూ, త్వరగా తొలకరిని అనుగ్రహించాలని, సమీప భవిష్యత్‌లోని వేసవి తీవ్రతను తగ్గించాలనే ప్రార్థనతో ఆ రోజు ఇంద్రుడికి పొంగలిని (‘ఇంద్ర’ పొంగలి) నివేదిస్తారు.  నరనారాయ ణులు బదరికా వనంలో తపస్సు చేసినప్పుడు బదరీ (రేగు) పండ్లతో ఆకలి తీర్చుకున్నారట. వారి ఆశీస్సులు కావాలన్నట్లు భోగినాడు చిన్నారులపై రేగుపళ్లు, బంతిపూలరేకులు, నాణాలు కలిపి తలంబ్రాలులా పోస్తారు. మహిళలు భోగి ముందు రోజు బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు కొనసాగిస్తారు. దీనివల్ల గ్రహ బాధలు తొలగు తాయని విశ్వాసం. బొమ్మల కొలువు పూర్తయిన తర్వాత మరుసటి సంవత్సరం కోసం వాటిని భద్రపరుస్తారు. అయితే తర్వాతి పండుగ నాటికి ఆ బొమ్మల సమూహంలో కొత్తది కనీసం ఒకటైనా చేరాలన్నది నియమం. తనను భర్తగా ఊహించుకుంటూ నెలరోజుల పాటు శ్రీవ్రతం (దీక్ష) ఆచరించిన ప్రియభక్తురాలు గోదాదేవిని శ్రీమన్నా రాయణుడు అనుగ్రహించినది ఈరోజేనని పురాణ గాథ. అలా ఆమెకు భోగభాగ్యాలు ప్రసాదించిన రోజుకు ‘భోగి’ అనే పేరు వచ్చిందని చెబుతారు.

సంక్రాంతిని పెద్దల పండుగ, పంటల పండుగ, పశువుల పండుగ అంటారు. పరలోకంలో ఉన్న తాతముత్తాతలను కృతజ్ఞతతో స్మరించే సమయం కనుక పెద్దల పండుగ అంటారు. పితృదేవతలకు తర్పణాలు వదిలి, వారి పేరిట బియ్యం, పప్పు, కూరగాయలు దానంగా ఇవ్వడం (స్వయంపాకం) ఆనవాయితీ. మకరరాశికి శని అధిపతి కనుక శని ప్రీతి కోసం తిలదానం ఆచారంగా వస్తోంది. తిలదానం, నల్ల నువ్వులతో హోమం చేయడం వల్ల శని దోష నివారణ, అకాల మృత్యుదోషం తప్పు తుందని; కూష్మాండ (గుమ్మడి) దానం వల్ల బ్రహ్మాండానంతటిని విష్ణుమూర్తికి దానం చేసినంత ఫలితం తక్కుతుందని విశ్వాసం. సృష్టి ఆరంభంలో శ్రీమన్నారాయణుడు మకరరాశిలోని శ్రవణ నక్షత్రంలోనే బ్రహ్మకు అనంత పద్మనాభస్వామిగా సాక్షాత్కరించాడట. తన పూర్వికులను పునీతులను చేసేందుకు భగీరథుడు గంగానదిని మకర సంక్రాంతి నాడే భువికి రప్పించాడని ప్రతీతి. వామనుడికి బలి చక్రవర్తికి మూడడుగుల నేలను దానమివ్వగా, హరి రెండడుగులతో బ్రహ్మాండమంతా వ్యాపించి మూడవ అడుగుగా పాదాన్ని బలి తలను మోపి పాతాళానికి పంపినది ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలోనే. సంక్రాంతి ప్రకృతికి, పశువులకు, అన్నదాతకు విడదీయరాని సంబంధం ఉంది. గ్రామీణులకు, ముఖ్యంగా రైతులకు కనుమ చాలా ప్రీతిపాత్రమైన పండుగ. ‘కనుమ’ అంటే పశువు అని అర్థం. వ్యవసాయానికి చేదోడువాదోడుగా నిలిచే పశువులను కృతజ్ఞతాపూర్వకంగా ఆరోజు ప్రత్యేకంగా పూజిస్తారు. పంటలను చీడపీడల నుంచి కాపాడాలని కోరుతూ రైతులు సూర్యునికెదురుగా కొత్తకుండలో పాయసం వండి నివేదిస్తారు. ప్రసాదంగా స్వీకరించి, పొంగ లిలో పసుపు, కుంకుమ కలిపి పొలాల్లో చల్లుతారు. దీనిని ‘పొలి చల్లడం’ అంటారు. గోసంరక్షణ, పశుపోషణ సమాజం కర్తవ్యమని ఈ పండుగ చాటి చెబుతోంది. ‘పాడిచ్చే గోవులకు పసుపూ కుంకం/పనిచేసే బసవనికి పత్రీపుష్ఫం’ అంటూ భావకవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక చలనచిత్ర గీతంలో సంక్రాంతి, కనుమ విశిష్టతను క్లుప్తంగా, హృద్యంగా వ్యక్తీకరించారు.

ఈ పండుగ నిర్వహణలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. కనుమనాడు కోన సీమలో జరిగే ‘ప్రభల ఉత్సవం’ అందుకు ఉదాహరణ. అంబాజీపేట, ముమ్మిడివరం, ఉప్పల గుప్తం, మామిడికుదురు తదితర సుమారు తొంభ య్‌కిపైగా గ్రామాలలో దాదాపు నాలుగు వందల ఏళ్ల నుంచి ఈ జాతరను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి తరువాత ప్రభలను ఊరు పొలిమేరలు దాటిస్తే గ్రామాలు పచ్చగా ఉంటాయని విశ్వాసం. ఈ ప్రభలు రుద్ర రూపాలతో (ప్రతిమలు) తయారవుతాయి. కోన సీమలోని మొసలపల్లి- ఇరుసుమండ మధ్యలోని జగ్గన్న తోట జాతర (జగ్గన్నతీర్థం) ప్రత్యేక ఆకర్షణ. భక్తులు ప్రభలను ఎంత దూరమైనా భుజాల మీదనే మోసుకెళ తారు తప్ప ఎలాంటి వాహనం వాడరు. ఆ జాతరలో కొలువుదీరే ఏకాదశ రుద్రులలో వ్యాఘ్రేశ్వరస్వామి (వ్యాఘ్రేశ్వరం) ప్రథములని విశ్వాసం. ఆ జాతరకు ఆయనే అధ్యక్షత వహిస్తారంటారు. అందుకే ఆ ప్రభ చేరిన తరువాతనే వేడుక మొదలుపెడతారు.

ముక్కనుమ

కొత్తగా పెళ్లయిన యువతులు ముక్కనుమ నాడు నుంచి సావిత్రీ గౌరీవ్రతం, బొమ్మల నోము పేరుతో తొమ్మిది రోజులు చేస్తారు. ఈ నోమును తొమ్మిదేళ్ల పాటు కొనసాగించవలసి ఉందని చెబుతారు. భర్త పట్ల అనురాగం పెరుగుతుందని విశ్వాసంతో కొత్తగా పెళ్లయిన యువతులు కనుమ మరునాడు (ముక్కనుమ) నుంచి ఈ వేడుకను ప్రారంభించి తొమ్మిది రోజులు చేస్తారు. సంతానం కోరే మహిళలు నట్టింట్లో ఊయల ఏర్పాటు చేసి తొమ్మిది మంది ముత్తయిదు వలు తెచ్చిన బొమ్మలను అందులో ఉంచి ఊరేగిస్తారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE