రగిలే పొగలు, పగిలే బాంబులు, మండే మంటలు

మృత్యుదేవత నీలినీడలు..పారాడే లోతుగుంటలు!

సైనిక భాషలో ‘శాంతి’కి సరైన అర్థం ఏముంది?

ఎవరివో  ఆర్తనాదాలు చెవుల్ని బద్దలు చేస్తున్నాయి

దొంగ తోడేళ్ల కుట్రలూ కుహకాల ధ్వనులు వినవస్తున్నాయి

ఎముకల కొరుక్కుతినే చలిలో కాళ్లూ చేతులూ కొంకర్లు పోతున్నాయి

నెత్తురు గడ్డక•ట్టింది, చూపంతా బిగబట్టి ఉంది

కత్తులూ తుపాకులూ కదం తొక్కే కోర కదన వేదిక ఇది….

జ్వలన ప్రజ్వలనాల్లో కర్తవ్య నిర్వహణం, పరీక్షల నిరీక్షణాక్షణం!

కవినేత్రం చూసిన ఆ దృశ్యాన్ని మనం ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. యుద్ధం అనేది ఎప్పుడూ అంతే! శాంతి పరిరక్షణ సదా కత్తి మీద నడకే!! అటువంటి స్థితిగతుల్లో మహిళామణులు ముందుకే నడవటమన్నది ఎప్పుడూ విశేషమే. ప్రపంచంలో ఎక్కడ ఏ వైపరీత్యం తలెత్తినా, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నా ప్రత్యక్షమవుతోంది వనితాశక్తి. సంక్షోభ నివారణ దిశగా తన వంతు బాధ్యత నెరవేర్చి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఇక మన భారత సైన్యంలోనైతే ఇంకొంత మందికి, అందునా అధికారిణులకు పూర్తిస్థాయి కల్నల్‌ ‌హోదా కలిగిస్తున్నారు. ప్రస్తుతం లెఫ్టినెంట్‌ ‌కల్నల్స్‌గా ఉన్నవారిని త్వరలోనే కల్నల్స్ ‌చేయనున్నారు. వీరంతా రణక్షేత్రంలోనే కాకుండా ఇంజనీరింగ్‌, ‌సిగ్న లింగ్‌, ఆర్మీ ఎయిర్‌ ‌డిఫెన్స్, ఇం‌టెలిజెన్స్ ‌తదితర విభాగాలకు చెందినవారు. స్పెషల్‌ ‌సెలెక్షన్‌ ‌బోర్డు ద్వారా పదోన్నతులు అందుకుంటున్న పడతులు. ఇంటా బయటా ఇంతటి ఏర్పాటు పూర్వాపరాల్ని మనమిప్పుడు పరిశీలిద్దాం.

ప్రపంచంలోని పలు దేశాల్లో అతివలు సైనిక   హోదాలతో పని చేస్తున్నారు. ముఖాముఖి పోరాటాల్లో కొందరు, సహాయక  – అనుబంధ విభాగాల ద్వారా మరికొందరు. చరిత్రను పరికించి చూస్తే, రహస్య సాయుధ దళాల సభ్యులుగా పోరు సాగించిన వారెందరో కనిపిస్తారు. వారంతా తుపాకులు చేత పట్టినవారే. శతాబ్ది నాటి సంఘటనలను గుర్తు చేసుకుందాం. అప్పట్ల్లో ఇండియన్‌ ‌రిపబ్లికన్‌ ఆర్మీ ఉండేది. పోరాట వీరులకు ఆయుధాలందించడం, ప్రత్యర్థుల తంత్రాల గుట్టుమట్లను తెలుసుకోవడం కూడా వారి పని. అణచివేత పెరిగిపోవడంతో, నాడు చిట్టగాంగ్‌ ఉద్యమంలో సాయుధ స్త్రీలు పటిమ చాటారు. బాంబులు తయారుచేసి ప్రయోగించిన వారూ అప్పట్లో ఉన్నారు. అవన్నీ ఆంగ్లేయ దురహంకార పాలనకు వ్యతిరేకంగా కొనసాగిన కార్యకలాపాలు. ఆ త్యాగాలు, తెగువ సాటిలేనివి. సమయ సందర్భాలకు అనుగుణంగా వ్యవహరించి, దేశభక్తిని చూపిన ముదితలెందరో. భారత స్వాతంత్య్ర సమరంలో పురుషయోధులతో పాటు నారీమణులూ అనేకమంది ఉండటాన్ని నేటికీ కథలుగా చెప్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం. కాలపరిణామాల్లో భాగంగా ఎన్నెన్నో మార్పు చేర్పులు చోటుచేసు కున్నాయి.

భారత స్వాతంత్య్ర సాధన దరిమిలా, జాతీయ రక్షణ అకాడమీలో ముదితలకూ ప్రాతినిధ్యం లభిం చింది. పదాలు, నావికా, వైమానిక దళాధిపతులతో సంప్రదింపులు అనంతరం- వీరనారుల పాత్ర,  ప్రాధాన్యం పెరిగాయి. అదే సందర్భంలో పరమోన్నత న్యాయస్థానం కూడా, రక్షణ దళాలు కూడా మహిళలకు సముచిత స్థానమివ్వడాన్ని స్వాగతిం చింది. ఫలితంగా అకాడమీ నిర్వహించిన ప్రవేశ పరీక్షకు అభ్యర్థినులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తదుపరి స్థితిలో సైనిక పాఠశాలలు, మిలటరీ సంస్థల్లో కూడా స్త్రీ స్థానం హెచ్చింది.

రక్షణ రంగంలో సైతం వారు చరిత్ర సృష్టించే సావకాశం విస్తృతమైంది. మహిళలెందరో త్రివిధ దళాల్లో చేరి రాణిస్తున్నారు. శక్తియుక్తులన్నింటినీ కేంద్రీక రిస్తూ, యుద్ధనీతిలో రాటుదేలి, పోరు మార్గాల్లో ముందు నిలిచి, ఆధునికతకు పర్యాయ పదంగా  మారుతున్నారు.

కాంతి దీపమాలికలు

ఝాన్సీలక్ష్మి, రుద్రమదేవి – ఇలా ఎందరు లేరు ధీరవనితలు! ఆ అందరూ స్ఫూర్తి ప్రదాతలే. వర్తమానానికి వస్తే, మన నౌకాదళంలోని యుద్ధ హెలికాఫ్టర్లను నడిపేవారిలో  కొందరు నారీమణులే! వారిని ఎయిర్‌బార్న్ ‌టెక్నిషియన్లుగా పరిగణిస్తుం టారు. తొలి ఇద్దరిలో హైదరాబాద్‌కు చెందిన రీతీసింగ్‌ ఒకరైతే, ఘజియాబాద్‌కు సంబంధించిన కుముదినీ త్యాగి మరొకరు. ఉభయులూ నావికా విభాగపరంగా (కమాండ్‌ ‌నిఘా సంబంధిత) కఠోర శిక్షణ పొందారు. ఇద్దరూ బీటెక్‌ ‌కంప్యూటర్స్ ‌చేసినవారే. అలాగే మరో ధీరవనిత అంబాలా. సమర విమానాలు  నడిపే స్క్వాడ్రన్‌కు ఎంపికయ్యారు. ఇదంతా భారతదేశీయమైతే, ఇదే ఆదర్శం, ఇతర దేశాల అభినందనలనీ అందుకుంది. ఇప్పటికీ మన దేశంలో, ప్రత్యేకించి విమానదళంలో వందలాది అధికారిణులున్నారు. పైలెట్లుగా, నావిగేటర్లుగా విధులు నిర్వహిస్త్తున్నారు. అంతెందుకు – ఫ్టైట్‌  ‌లెఫ్టినెంట్‌ ‌కాంతా. ఇదివరలోనే పాకిస్థాన్‌తో జరిగిన సమరంలో ఆమె పాల్గొన్నారు. మరో ఇద్దరు ఫ్లైట్‌ ఆఫీసర్లు గురించీ ప్రస్తావించుకోవాలి మనం. అటు తర్వాత దీపిక, నివేదిత. భావన అయితే నాడు తొలి ఫైటర్‌ ‌పైలెట్‌. ఇలా 1995, 1999, 2006, 2012, 2019, తదుపరి సంవత్సరాల్లో సైతం నారీశక్తి నిరూపితమైంది. మొట్టమొదటి శాశ్వత కమిషన్డ్ ఆఫీసర్‌గా షాలిజా సేవలను గుర్తు చేసుకోవాలి. పోరాటపటిమ కనబరచినవారిలో మింటీ, పద్మావతి, పునీత,  ప్రతిభ వంటి పలువురు పురస్కారాలు సాధించారు. మిలిటరీతో పాటు పారా మిలిటరీ విభాగాల్లోనూ స్త్రీలదే ఆధిక్యత. తీరప్రాంత పరిరక్షక దళ పారామిలిటరీ విభాగాల్లోనూ స్త్రీలదే ఆధిక్యత. తీరప్రాంత పరిరక్షక దళ అధికారులుగా ఒకేసారి నలుగురు ఎంపికైన సందర్భమూ ఉంది. ఆరేళ్లకిందట అసోం రైఫిల్స్ ‌దళంలో కూడా శతాధి కంగా మహిళలు చేరారు. విమెన్‌ ‌రైఫిల్‌ ‌బృందంలో, సెంట్రల్‌ ‌పోలీస్‌ ‌ఫోర్స్‌లో కూడా బాగా పనిచేసిన వారున్నారు. సరిహద్దు భద్రతాదళంలో విధి నిర్వహణతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన వారూ ఎందరెందరో. శాంతి పరిరక్షణే లక్ష్యంగా జీవితాల్ని అంకితం చేసినవారే వీరంతా. ఉదాహరణలు మరెన్నో.

తరగని క్రియాశీలత

నితికా గురించి ఎంత చెప్పినా తక్కువే. పెళ్లయిన కొన్ని నెలలకే భర్త అమరుడయ్యారు. ధైర్యాన్ని కూడగట్టుకున్న ఆమె  జీవిత భాగస్వామి ధ్యేయాలనే స్ఫూర్తిగా స్వీకరించారు. అవిశ్రాంతంగా శ్రమించి, లెఫ్టినెంట్‌గా రంగంలోకి దిగారు. సైనిక ధీరుడిగా పోరాడుతూ యుద్ధక్షేత్రంలోనే తుదిశ్వాస విడిచిన    ఆయనకు తన లక్ష్య సాధనను అంకితమిచ్చారు. తానూ సైన్యంలో అడుగుపెట్టడమే భర్తకిచ్చిన నివాళి అన్నారు. వేరొక నారీరత్నం శివ. తాను సియాచిన్‌లో కెప్టెన్‌. అది పాకిస్థాన్‌ ‌సరిహద్దుల్లోని పర్వత ప్రాంతం. అక్కడ ప్రథమంగా ఆమె భద్రతా విధులు నిర్వర్తించి ‘శభాష్‌’ అనిపించుకున్నారు. సముద్రమట్టానికి వేలాది అడుగుల ఎత్తున ఉండేచోట, మంచువల్ల శరీరం గడ్డకట్టుకుపోతున్న ప్రాంతాన కర్తవ్య నిర్వహణ అంటే మాటలా? మరోవైపు, వివిధ దేశాల్లో శాంతి సామ రస్యాలే ప్రధానంగా కృషిచేసిన వనితలూ అనేక మంది దీనిని  విశిష్టంగా స్వీకరించిన ఐక్యరాజ్య సమితి తన కార్యక్రమాలను విస్తరించింది. అంతర్జాతీయ శాంతి పరిరక్షణ పేరిట బృందాలను నియోగిస్తూ వచ్చింది. అంటే శాంతిస్థాపనను శాశ్వతీ కరించడం. దీన్ని దళంగా రూపుదిద్ది ఎనిమిది దశాబ్దాలు దాటింది. క్రీయాశీలకంగా వేలాది సిబ్బంది నియమితులయ్యారు. ఘర్షణలు, సంఘ ర్షణల తదుపరి ఆయా ప్రాంతాల్లో ఉండి, స్థితిగతు లన్నింటినీ సమగ్రంగా సమీక్షించడం దళ బాధ్యత. మునుపటి శాంతి స్థాపన ఒప్పందాల సమర్థ అమలుకు సహకరించడమూ విధుల్లో ఒక భాగం. ఒక్క భద్రత అంశమే కాదు; సామాజిక, ఆర్థిక పురోగమనానికి చర్యలూ  దీనితో  ముడివడి ఉన్నాయి. ఇదే శాంతి భద్రతల పరిరక్షకులను వాడుకలో ‘బ్రాహెల్మెట్స్’ అని పిలుస్తుంటారు. వారంతా లేత నీలిరంగు దుస్తులు ధరించడమే  దీనికి కారణం. నియం త్రణ సమస్తం సమితిదే. శాంతి రక్షణకు కార్యాచరణ విభాగం సభ్య దేశాల సహాయ సహకారాలతో పని చేస్తుంటుంది. నిర్వహణ, విస్తరణలను ఆసాంతం పర్యవేక్షిస్తూ ఉంటుంది.

బాధ్యత అందరిదీ

విభిన్న ప్రాంతాల్లోని శాంతిపరిరక్షక బృందాలకు అండదండగా నిలవడాన్ని భారత్‌ ‌తన కర్తవ్యంగా భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ దేశాన ఎటువంటి సహకారం అవసరమైనా, తాను ఉన్నానంటూ ముందుకొస్తోంది. తన  సేవా బృందా లనే, ప్రత్యేకించి వైద్యసిబ్బందినీ కొరియా ప్రాంతానికి పంపించింది. సోమాలియా,కాంగో మొదలైన దేశాల్లో నియుక్తమైన ఐరాస విభాగాలకు సహాయ హస్తం అందించింది. అందరూ స్త్రీలే ఉన్నటీమ్‌ ‌నిర్మాణ పక్రియను చేపట్టడం మరింత విశేషం. అలా ఒక ప్రత్యేక పరిరక్షక బృందమే కొన్ని సంవత్సరాల క్రితం లైబీరియా పరిసర ప్రాంతాలకు వెళ్లింది. సైనికులైనా, పోలీసులైనా అంతా వనితలే. వారు చిత్తశుద్ధితో తమవంతు కర్తవ్యాలకు పరిపూర్ణ న్యాయం చేశారు. ఇందులోనే దౌత్యం, సేవ, భద్రత, చేయూత వంటి అనేకం నెలకొన్నాయి. సమితికి ప్రత్యేకమైన నిధులుండటం అత్యంత కీలక అంశం. అవి సభ్య దేశాల నుంచే సమకూరాలి కాబట్టి, ఆ విధంగానూ మన దేశం తోడూ నీడా అవుతోంది. ఇటువంటి కృషి కలాపాలన్నీ సర్వసహజంగానే యుద్ధ భయాన్ని నివారిస్తాయి. ప్రజల సహజ సిద్ధ హక్కులను పరిరక్షిస్తాయి. శాంతిని శాశ్వతంగా స్థాపించడమనేది ఉమ్మడి కర్తవ్యం. సాంస్కృతిక, వారసత్వ సంపదల పరిరక్షణలూ ఒనగూడుతాయని అందరమూ ఆశించ వచ్చు. శాంతి సంరక్షణలో వనితల బాధ్యతాయుత నిర్వాహకత్వం ఎంతైనా వందనీయం, అభినంద నీయం. లక్ష్యమూ, దాని సాధనా ఉన్నత రీతుల్లో ఉంటాయంటే స్త్రీ భాగస్వామ్యమే మూలం. ఇది ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram