– కాశింశెట్టి సత్యనారాయణ

పంట పొలాలలోన తెలవారులు నిద్దుర కాచి, వేకువనే ఇంటికి వచ్చి చద్ది మెతుకులు ఎంగిలి చేసో, చేయకో పశువుల వెంటపడి కాననములకు పోయెడి వాడు కాపుబిడ్డ… వీరికి వేరే ప్రపంచం తెలియదు. అటువంటి వారిపైనా నిజాం ప్రభుత్వం కక్ష బూనింది. ఎందరినో పొట్టన పెట్టుకుంది. గ్రామాల్లో నిశ్శబ్దత, భయానక వాతావరణం ఏర్పడింది. ఏం చేయాలో ప్రజలకు తోచలేదు. ఆంధ్ర మహాసభ గ్రామ కమిటీలు రైతాంగ విప్లవ కమిటీలుగా పనిచేశాయి.

నిజాం పాలనలో తెలంగాణలోని పల్లెల్లో వెట్టిచాకిరి, అక్రమ పన్నులు, అక్రమంగా భూములు లాక్కోవడం, ధాన్యం వసూళ్లు.. వీటిని కాదన్న వారిపై దౌర్జన్యం, ఎదురు తిరిగితే చంపడం పరిపాటైంది. అయితే ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో చాలా చోట్ల రజాకార్లపై, నిజాం సాయుధ పోలీసులపై తిరుగుబాట్లు జరిగాయి.

1946 ఆగస్ట్‌లో మిర్జా ఇస్మాయిల్‌ ‌హైదరాబాద్‌కు ప్రధానమంత్రి అయ్యాడు. ఇతడు ప్రజా అనుకూల ప్రధాని అని ఆంధ్రమహాసభ భావించింది. కానీ ఇతడి హయాంలోనే ప్రభుత్వం నిర్బంధాలను తీవ్రతరం చేసింది. ప్రజలు ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నారని తెలిసి ఇతడు మిలటరీని కూడా ఉపయోగించాడు. జనగామ తాలూకాలోని దేవరుప్పల, కామారెడ్డి గూడెం; సూర్యాపేట తాలూకాలో బాలెంల, పాత సూర్యాపేట గ్రామాలు, హుజుర్‌నగర్‌ ‌తాలూకాలోని మల్లారెడ్డి గూడెం, భువనగిరి తాలూకాలోని పులిగిల్ల గ్రామంలో మిలటరీ కాల్పుల కారణంగా స్థానిక నాయకులు వీరమరణం పొందారు.

బాలెంలపై సాయుధ దాడికి ప్రభుత్వం రిజర్వు దళాలను పంపింది. దళాలు తెల్లవారుఝామున గ్రామంపై దాడి చేసి కాలకృత్యాలకు వెళ్లిన వారిపైన, సోదాల పేరుతో ఇండ్లలో చొరబడి స్త్రీ, పురుషుల పైన దెబ్బల వర్షం కురిపించారు. దాంతో కొందరు యువకులు గార్ల అనంతరెడ్డి, పటేల్‌ ‌మట్టారెడ్డి నాయకత్వంలో వారిపై తిరగబడి 25 మంది సాయుధ పోలీసులను ఎదిరించగా పోలీసులు వీరిని కాల్చేశారు. దాదాపు ఇదే సమయంలో జనగామ తాలూకాలోని దేవరుప్పల, కామారెడ్డి గూడెం గ్రామాల్లోనూ మిలటరీ బలగాలు దాడులు చేశాయి. స్థానిక కార్యకర్తలను కాల్చివేశారు. ఆ కాల్పుల్లో ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడుతున్న ప్రజానీకాన్ని చూసి మిలటరీ కూడా నిరుత్సాహ పడేస్థితికి వచ్చింది.

దేవరుప్పలపై తెల్లవారి 3 గంటల ప్రాంతంలో దాడిచేసి పురుషులందరినీ అరెస్టు చేశారు. ఈ ఊరు అమరజీవి దొడ్డి కొమరయ్య జన్మస్థలం. ఇక్కడ మందడి సోమిరెడ్డిని, గోలి పాపిరెడ్డిని కాల్చి చంపారు. పక్క గ్రామం కామారెడ్డి గూడెం స్త్రీలు కారపుముంతలు పట్టుకొని గ్రామానికి రక్షణ కవచంలా నిలిచారు. దాంతో మిలటరీ లారీలు ఈ గ్రామంలో చొరబడటానికి ధైర్యం చేయలేదు. కొద్ది సేపటికి ఎలాగోలా గ్రామంలోనికి వచ్చి ఓ 400 మందిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇందుకు నిరసనగా జనగామ, భువనగిరి తాలూకాల నుంచి సుమారు 3000 మంది ప్రజలు ఊరేగింపుగా వచ్చి తమ అసమ్మతిని తెలిపారు. దేవరుప్పల స్త్రీలు వంట చేసి వచ్చిన ప్రజానీకానికి పెట్టారు. అరెస్ట్ అయిన వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు.

బాలెంల, పాత సూర్యాపేట, దేవరుప్పల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకులు వ్యూహాలు మార్చారు. సైనికులు దాడి చేసినప్పుడు ఎదిరించకుండా జారుకోవాలని ఆదేశించారు. కాని ఆ సందేశం సకాలంలో ప్రజలకు చేరలేదు. దాంతో మల్లారెడ్డి గూడెంలో అప్పిరెడ్డి అమరుడయ్యారు. డిసెంబర్‌ 29, 1946‌న మల్లారెడ్డిగూడేన్ని మిలటరీ ముట్టడించింది. ప్రజలు మామూలు పద్ధతిలో దండోరా వేశారు. మార్చిన వ్యూహం వీరికి చేరలేదు. జనం మిద్దెల మీద ఊరు బయట చేరారు. వడిసెలలు విసిరారు. ఊరి చుట్టూ మొక్కజొన్న పొలాలున్నాయి. మిలటరీ ఎంత ఉందో కన్పించడం లేదు. ఉభయ సేనల మధ్య యుద్ధం జరిగింది. మిలటరీ అధికారులూ, కలక్టర్‌ ‌గ్రామస్తులను లొంగి పొమ్మని హెచ్చరించారు. ప్రజలు ఖాతరు చేయలేదు. ప్రజల తరఫున ఒకరిని మధ్యవర్తిగా పంపమని కోరగా అప్పిరెడ్డిని పంపారు. కానీ వారు అప్పిరెడ్డిని, వడిసెలకు రాళ్లు అందిస్తున్న ఓ స్త్రీని కాల్చేశారు. ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు. మిలటరీ గ్రామం మీద పడింది. చిన్న, పెద్ద, స్త్రీ, పురుష భేదం లేకుండా అందరినీ చిత్రహింసలు పెట్టింది. ప్రజలందరిని ఒకచోట చేర్చారు. ముస్లింలను వదిలేసి 400 మంది హిందువులను తీసుకువెళ్లారు. గ్రామం ఎడారి అయింది. పాడుబడినట్లైంది. మిగిలిన వారిని ఓదార్చేవారు లేరు.

నల్లగొండ, వరంగల్‌ ‌జిల్లాల్లో మార్షల్‌ ‌లా ప్రకటించి సైన్యానికి అప్పగించారు. నిజాం నవాబు మొత్తం సైన్యం 50,000 కాగా దానిలో 20,000 సైన్యాన్ని ఈ జిల్లాలో దింపారు. వారు స్థానిక యువకుల్ని పట్టుకొని నాయకుల జాడ చెప్పాలని నానా యాతనలు పెట్టారు. గోళ్లలో సూదులు గుచ్చారు. స్తంభాలకు జనపనారలతో కట్టేసి పైనుంచి నీళ్లు గుమ్మరించారు. నీళ్లు పడుతూంటే నార బిగుసు కుంటుంది, యాతన పెడుతుంది. అరచేతుల మీద మంచంకోళ్లు పెట్టి మంచం మీద ఎగిరారు. కారం పూసిన కర్రలు ఆసనాల్లో దూర్చారు. నోళ్లలో మూత్రించారు. మంచుగడ్డల మీద పడుకోబెట్టి పై నుంచి నీళ్లు పోశారు. కళ్లల్లో కారం కొట్టారు. అరికాళ్లను కత్తులతో చీరారు. ఇలాంటివి ఇంకా అనేక హింసలు పెట్టారు. అయినా వారు నాయకుల జాడ చెప్పలేదు. స్త్రీలనూ హింసించారు. వారిని దిగంబరంగా తిప్పారు. మానభంగాలు చేశారు. భర్తల ముందు భార్యలను, బావ ముందు మరదలను అమానుషంగా చెరిచారు. ఆ గ్రామాల్లో పర్యటించిన కుమారి పద్మజా నాయుడు ఇలా వ్రాశారు- ‘స్త్రీలను మానభంగం చేయడంలో నాజీలను తలతన్నారు. ఒక పదహారేళ్ల అమ్మాయిని మానభంగం చేయబోగా భర్త అడ్డు తగిలాడు. అతని తలకు తుపాకీ పెట్టి, భర్త ముందే భార్యను అమానుషంగా అత్యాచారం చేశారు. ఆ గ్రామాల్లో దోచుకోని ఇల్లు లేదు. అవమానభారంతో క్రుంగని స్త్రీ లేదు. గర్భిణులను, బాలింతలను కూడా హింసించారు. ఇంతకన్నా ఘోరాలు కూడా జరిగాయి’ అన్నారు.

స్వామి రామానంద తీర్థ నవంబర్‌ 28, 1946‌న ఓ పత్రికా ప్రకటన చేశారు. ‘సూర్యాపేట మిలటరీ క్యాంపు వలెనున్నది. మిలటరీ లారీలు జోరుగా తిరుగుతున్నాయి. ఉదయం గ్రామానికి వెళుతున్నాయి. లారీలలో జనాలను ఎక్కించుకుని సాయంత్రం తిరిగి వస్తున్నాయి. నేను బాలెంలా వెళ్లాను. ఒక పోలీసు అధికారి ఇద్దరు రైతులను కాల్చి చంపాడు. దీనిపై బహిరంగ విచారణ జరిపించాలి’ అని అన్నారు. అంతేకాదు, ‘మేం పాత సూర్యాపేట వెళ్లాం. మాకు ఒక స్త్రీ గుండెలు పగిలిన ఏడ్పులు వినిపించాయి. మేం లోనికి వెళ్లి చూశాం. ఆమె ఎవరో కాదు, అంతకు ముందు పోలీసు కాల్పుల్లో మరణించిన వ్యక్తి భార్య! ఆ గ్రామం నుండి 170 మందిని పోలీసులు తీసుకువెళ్లారు. అనేక మంది స్త్రీ, పురుషులపై గాయాలున్నాయి. ప్రభుత్వం ఈ మిలటరీ చర్యను వెంటనే రద్దు చేయాల’ని రామానంద డిమాండు చేశారు. లేదంటే పరిస్థితులు విషమిస్తాయని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టేట్‌ ‌కాంగ్రెస్‌పై నిషేధం తొలగించారు. నిజాం పుత్రుడు ముకర్రం జాహ్‌ ‌కల్లోలిత ప్రాంతాలను దర్శించాడు. ‘ప్రజలు నా బిడ్డలు. వారి బాధలు నా బాధలు’ అని బట్టలు పంచిపెట్టాడు. ప్రధాని మిర్జా ఇస్మాయిల్‌ ‌కల్లోలిత ప్రాంతాల్లో పర్యటించాడు. ఆ సందర్భంలో ‘పరుల హింసించు వారలు బాగుపడెడు మాట వట్టిది, నాశనమ్మౌట నిజము’ అన్నాడు దాశరథి కృష్ణమాచారి.

ప్రజా చైతన్యజ్వాల దొరలు- పటేల్‌ – ‌పట్వారీలు, ప్రజాద్రోహులు, గూండాల గుండెల్లో మంటలు రేపింది. పాత సూర్యాపేటలో దొరను, పోలీసు పటేల్‌ను చితకబాదారు. కాళ్లు, చేతులు విరిచేశారు, చందుపట్లలో దొరను బండిలోంచి లాగి బాదారు. కడివెండిలో దోచుకోవడానికి వచ్చిన గూండాలను ఎదిరించి దేహశుద్ధి చేశారు. సీతా పురంలో పోలీసు పటేల్‌ను హతమార్చారు. రామన్న పేటలో దొరను కొట్టి చంపారు. బక్కమంతుని గూడెంలో దొరను, దొర తమ్మున్ని హతమార్చారు. గ్రామాలు ప్రజల పరమయినాయి. అయినా ఈ అమానుషకాండ 1947 మే చివరి వరకూ కొన సాగింది. ప్రజలు క్రమేణా బలపడి, ప్రజాశత్రువులను ఎదిరించారు.

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
Instagram