ఆమె పేరు హీరా. వజ్రమంటే వజ్రమే. ‘నిండు నూరేళ్లకు పైగా జీవితం’ అనాలనిపిస్తుంది. ‘శతాధిక వయస్కురాలు’ అని రాయాలనిపిస్తుంది. కానీ విషాదాల విధి అలా అనుకోలేదు, రాసే అవకాశమైనా ఇవ్వలేదు. 99 సంవత్సరాల ఆరునెలలకే తనతోపాటు తీసుకెళ్లింది. ఎక్కడికి? ఈ భవనం నుంచి ఆ గగనానికి! ఎందుకిలా చేశావంటే, ‘రెండింటినీ కలిపే మాతృహృదయ వారధి కదా! అందుకూ….!’ అని బదులిచ్చిందా విధి।। ఎలా స్పందించాలంటూ సువిశాల భారతావని ప్రధాని నరేంద్రమోదీ మనసు మౌనంగా శోకించింది. ‘నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయావా అమ్మా!’ అనుకున్న ప్రతీక్షణమూ ఆయన కంట నీరు!! ఇంకా ఏమన్నారో తెలుసా? ‘నాకు ఇప్పుడు అమ్మలేదు. అమ్మ కూడా తల్లి ప్రేమకు నోచుకోలేదు. తన చిన్నతనంలోనే అమ్మను కోల్పోయింది. తల్లి ముఖమైనా తనకు గుర్తులేదు. కనీసం తల్లి ఒడి చేరిన క్షణాలైనా ఆమెకు లేవు’ అంటున్నప్పుడు ప్రధానమంత్రి మది వేదన అనంతం.

‘ఉన్న ఒక్క పేగుబంధమూ నన్ను వీడి వెళ్లింది. ఇక్కడి నుంచీ అక్కడి త్రిమూర్తి రూపాన్ని చూస్తున్నాను నేను. ఆ మూడు సేవలూ, విలువలూ, కర్మయోగ భావనలూ. వాటి ఉమ్మడి తత్వమే మా అమ్మ. ఆమె జీవితమే తపస్సు. ఆమె ఒక తపస్వి’ అంటూ ప్రధనమంత్రి నరేంద్రమోదీ కన్నీటి నివాళి సమర్పించారు. ప్రాతఃకాల సమయంలో ఆమె అంతిమ శ్వాస సమాచారం తెలిసిన తక్షణమే ‘ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కి చేరి, స్వస్థలంలోని ఇంటికి వెళ్లి, పార్థివదేహం వద్ద పుష్పాంజలి ఘటించారు. భావోద్వేగం నిలువెల్లా నిండిన స్థితిలో, మాతృదేవత పాదాల ముందు ప్రణమిల్లారు. అటు తర్వాత… అదీ గుండెభారంతో ఆ మృతశరీరాన్ని భుజాల మీద మోశారు. స్వర్గరథంలో శ్మశానవాటిక వరకు చేర్చే క్రమంలో, తానూ వెంట ఉండి ప్రయాణం చేస్తున్నంతసేపూ మోదీ అంతటా సంచలన తరం గమే! సోదరులతో కలిసి, తల్లి చితికి నిప్పంటించే టప్పుడు హృదయమంతా కల్లోలమయం. అమ్మా! అమ్మా!!

హీరాబెన్‌ ‌జననం, మరణం-రెండూ గుజరాత్‌ ‌లోనే. ఆమె స్వస్థలం మోహసాన్‌ ‌ప్రాంతంలోని వాద్‌నగర్‌. ‌పుట్టిన సంవత్సరం జూన్‌ 18, 1923. ‌పరమపదించింది డిసెంబర్‌ 30, 2022‌న. అనారోగ్యానికి గురైన ఆమెను అహ్మబాద్‌లోని కార్డియాలజీ-రీసెర్చ్ ‌సెంటర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడురోజుల పాటు చికిత్స జరిపినా ఫలించ లేదు. అస్వస్థత విషయం తెలిసి మోదీ వెంటనే అక్కడికి చేరి చాలాసేపు ఉండి, వైద్యులతో మాట్లాడి, తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం మరికొన్ని గంటలకే, వినకూడనిది వినాల్సి వచ్చింది. ఆ జ్ఞాపకాల వెల్లువ ఆయన మానసాన్ని ఆసాంతం ముంచెత్తింది. వివరాల్లోకి వెళ్తే – హీరా, దామోదర్‌ ‌దాస్‌ ‌మూల్‌ ‌చంద్‌ ‌దంపతులకు ఐదుగురు తనయులు, ఒక తనయ. మూడో సంతానమే నరేంద్రమోదీ. భర్త తిరిగిరాని లోకానికి తరలివెళ్లాక, హీరా తన కుమారుల్లో ఒకరైన పంకజ్‌ ఇం‌టికి మారారు. గాంధీనగర్‌లోని ఆ గృహానికి పలుమార్లు వెళ్లి తల్లి దీవెనలు పొంది వస్తున్నారు నరేంద్రమోదీ. ఆమెను అనేకమంది ‘హీరాబా’ అని అపార గౌరవాదరాలతో పిలుస్తుంటారు. మోదీ ప్రధాని అయినా, అంతకు ముందు గుజరాత్‌ ‌ముఖ్య మంత్రిగా ఉన్నా, ఆమెది మాత్రం తొలి నుంచీ ఎంతో సాదాసీదా జీవితం. చుట్టుపక్కల వారితో ఎంతగానో ఆప్యాయంగా మాట్లాడేవారు. పండుగలూపబ్బాల్లో ఆశీస్సులందిస్తూ, ప్రతి ఒక్కరి అభిమానాన్ని అందుకున్నారు. ఆ సహృదయతను ఎన్నటికీ మరవలేమని, ఆ దయామయ చూపులు ఎప్పటికీ గుర్తొస్తుంటా యంటూ ఇరుగుపొరుగు వారు నేటికీ కన్నీటి పర్యంతమవుతున్నారు. మునుపటి పుట్టినరోజున తన ఆశీర్వాదాలు కోరిన కుమారుడు ప్రధానితో ‘ఏ పనినైనా మనసుతో చెయ్‌, ‌జీవితాంతం స్వచ్ఛతనే పాటించు’ అనేవారు. ఆ మాటలను గుర్తు చేసుకుంటూ ఆయనే అన్నట్లు, ఆమెది సుదీర్ఘ జీవనయానం. అది సాటిలేనిది.

ఆదరణ, ఆప్యాయత

మొదటి నుంచి హీరాకు అన్నీ కష్టాలే! సమస్యలతోనే బతుకుబండి సాగుతుండేది. చిన్నపాటి ఇంట్లో ఆరుగురు బిడ్డల ఆలనాపాలనా చూసుకునే వారు. పుస్తక పఠనంతో పాటు జీవన విలువలనూ రంగరించి చెప్తుండేవారు. ఎండ, వాన, చలి అన్నీ ఇంట్లోనే!! అన్నింటినీ భరించగలిగే తత్వాన్ని పిల్లలకు నేర్పించారు. ఎండ వేడిమి తగలకుండా, వాననీటికి తడవకుండా, చలి తీవ్రతకు వణికిపోకుండా ఎన్ని జాగ్రత్తలుంటాయో అన్నీ తీసుకునేవారు. ఆ సమయాల్లో బిడ్డలకు ఆమె ప్రకృతి మాత. కుటుంబాన్ని పోషించేందుకు, ఖర్చులను భరించేం దుకు కొన్ని ఇళ్లల్లో పనులు చేస్తుండేవారు. అప్పుడు ఆమె వారికి జీవితతత్వ బోధకురాలు. గురువుగా, మిత్రురాలిగా కూడా పిల్లలను తీర్చి దిద్దారు. కష్టాలు ఎదురైనా, నష్టాలు చుట్టుముట్టినా, ఏ దశలోనూ వెనుకడుగు వేయలేదు. తనకు దీటుగా చక్కని తీరున పెంచి పోషించి చదివించి, సమాజ ప్రయోజకులుగా రూపొందించారు. వ్యక్తిత్వాలను, మూర్తిమత్వాలను తీర్చిదిద్దిన చల్లని తల్లి. భారతీయ ఆదర్శాలు, ధర్మచింతనను ఆచరించి చూపిన చరితార్థ. ఆస్పత్రిపాలైన కొన్ని రోజులుతప్ప; ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో కనిపించేవారు. సదా ఏదో ఒక పనిచేస్తూ, పెద్దలూ పిన్నలకు ఎన్నెన్నో మంచి మాటలు చెప్తూ, మానసికంగా కొండంత అండగా ఉండేవారు. తన వద్దకు వచ్చిన కార్మికులు, ఇతర కష్టజీవులను నోరారా పలకరించి టీ ఇచ్చేవారు. వారితో కష్టసుఖాలన్నీ మాట్లాడి, అన్నీ తెలుసుకుని, అదే నవ్వుతో పంపిస్తుండేవారు. ఇంటాబయటా కూడా ఆమె అమ్మగారు. మంచితనాన్ని అంతటా పంచడం అంటే ఏమిటో చేసి చూపిన ధన్యురాలు. అందుకే ఆ తల్లి శాశ్వత నిష్క్రమణ కుటుంబ సభ్యులతో పాటు అనేక మందిని ఆరని తీరని వేదనకు లోను చేస్తోంది. ‘ ఇంతటి పెను విషాదం తమ ఇంట్లోనే సంభవించింది’ అనేంతగా ఎంద రెందరో ఇవాళ్టికీ అల్లాడిపోతున్నారు. అతి సాధారణంగా కనిపించే ఆమెలో అద్భుత వ్యక్తిని దర్శించిన అనుభవం వారిది.

తీర్చిదిద్దిన ఘనత

హీరా పుస్తకాలు చదవలేదు. జీవిత పాఠాల్ని చదివారు. ఆ ప్రభావం నరేంద్రమోదీ మీద ఎంతో ఎక్కువ. ఒకసారి ఆయన తన తల్లితో ‘మనసులో మాట’ చెప్పారు. ‘నాకు ఇంతటి చదువు చెప్పిన నిన్ను సన్మానిస్తా’ అన్నారు. ‘సన్మానం నాకు కాదు. చిన్నప్పుడు నీతో అక్షరాలు దిద్దించిన టీచరు గారికి చేయాలి’ అన్నారామె. ఇది చాలదా, హీరామా ఆలోచనల లాలిత్యం తెలుసుకోవడానికి? కాలం ఏనాడూ ఆగదు. అది సాగిపోతూనే ఉంటుంది. అమ్మ చెప్పిన, నేర్పిన పాఠాలు మటుకు బిడ్డలకు బంగారు పూలబాటలు పరుస్తాయి. అందుకు తల్లి మనసు అన్నింటికన్నా మిన్న. అదే కొడుకులనైనా కూతుళ్లనైనా ఉన్న దశనుంచి ఉన్నతస్థితికి చేరుస్తుంది. ఆమె స్పర్శ, పరామర్శ చాలవా బిడ్డల జీవితాన్ని పునీతం చేయడానికి? కుటుంబం అనేది ప్రేమానురాగాల కూడలి. అక్కడ ‘మానవరూపంలోని దేవతామూర్తి తల్లి. అమృతం అనే పదానికి ఒకే ఒక అర్థం అమ్మ. ఎవరు ఎంతటివారైనా, ఆకాశ మంత ఎత్తుకు ఎదిగినా, ఆపై స్థానంలో నిలిచి ఆశీస్సుమాలు చల్లే ఏకైక దేవత అమ్మే! ‘అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు/ సరితూచమంటే నేను, ఒరిగేను అమ్మవైపు’- అనుకోవాల్సిందే ఎవరైనా.

అమ్మే దైవం

ఇది సరిగ్గా ఏడేళ్లనాటి జ్ఞాపకం. నరేంద్రమోదీ అప్పట్లో భారత ప్రధాని హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఒక కీలక సమావేశంలో తన మాతృమూర్తి ప్రస్తావన రాగానే, ఆయన విచలితులయ్యారు.

‘ఆమె నా దైవం’ అంటూ భావోద్వేగభరితు లయ్యారు. బిడ్డల పరమోన్నత భవిష్యత్తు కోసం జీవితమంతటినీ త్యాగం చేసే తల్లిని మించి ఎక్కడ ఏ లోకంలోనైనా వేరే దైవమంటూ ఉండదన్నారు. ఆ మాటలంటుంటే, ఆయనకి కొంతసేపు మాట పెగలలేదు. కన్నీరు ఆగలేదు. భారతీయతలోని మాతృమూర్తికి అంతట ప్రాధాన్యముంది. బిడ్డల జీవితం, ఉనికి, మనికి సమస్తం అమ్మతనంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఆమె కల్పవృక్షం. ప్రేమను పంచి ఇచ్చే మహోత్తుంగ తరంగం.

ఆమె పేరు హీరా.

ఆదర్శ మాతృమూర్తిగా ఆమె వజ్రం.

ఆ జీవితమంతా మనందరికీ స్ఫూర్తిమంతం.

– జంధ్యాల శరత్‌బాబు,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram