– జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ ‌నజీర్‌, ‌సుప్రీంకోర్టు న్యాయమూర్తి

 1. సభలో ఉన్న న్యాయమూర్తులు, న్యాయ సలహాదారులు న్యాయాన్ని ప్రకటించటంలో రాజుకు తోడ్పడాలి. వారు నిర్భయులుగా, స్వతంత్రులుగా ఉంటూ, రాజు పొరపాటు చేయకుండా నిరోధించ గలిగేవారు కావాలి. వివాదానికి దిగినవారిపై రాజు అనుచిత శిక్ష విధిస్తున్నట్లయితే, సలహాదారులు, న్యాయమూర్తులు రాజును వారించాలి. విచారణ పక్రియలో సహకరించే న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని కచ్చితంగా ప్రకటించాలి. ఒకవేళ రాజు దానిని పెడచెవిన పెట్టినా, న్యాయమూర్తి తన ధర్మాన్ని నిర్వర్తించిన వాడవుతాడు. రాజుకు ప్రియమైన మాటలు చెప్పటంగాక, తన కర్తవ్యాన్ని నిర్వహించి తీరాలి. ఇందులో విఫలుడైన న్యాయ మూర్తి దోషి అవుతాడు.
 2. నాగరికత ముందుకు సాగినకొద్దీ, రాజుపైన కార్యభారం పెరగటంతో, వివాదాల నన్నింటినీ స్వయంగా విని తీర్పునివ్వటం అలవికాని పని అయ్యింది. అప్పుడు వృత్తిపరంగా న్యాయ మూర్తులను నియమించడం ఆరంభమైంది. న్యాయమూర్తి కావడానికి ఉన్నతమైన అర్హతలు ఉండాలి. నిరాడంబరునిగా, నియంత్రణ కల్గిన వానిగా ఉండాలి. నిష్పాక్షిక వైఖరితో, అచంచలంగా, దైవభీతి గలవాడై ఉండాలి. కోపానికి దూరంగా ఉండి, ధార్మిక జీవనం గడిపేవాడు కావాలి. శ్రమించే స్వభావం గలవాడు కావాలి. మంచి వంశంలో పుట్టినవాడై ఉండాలి.
 3. కాలక్రమేణ న్యాయాధికారుల బృందాలు పెరిగి, రాజుకు ఈ పని నుండి వెసులుబాటు నిచ్చాయి. అయితే, ఆనాటికీ అత్యున్నత స్థాయిలో తీర్పు చెప్పే బాధ్యత, అవకాశమూ రాజుపై ఉండేది. మౌర్యుల పాలనాకాలానికే, స్వతంత్రంగా వ్యవహరించే న్యాయవ్యవస్థ రూపుదిద్దుకొంది.

చ) ప్రాచీన హిందూ దేశ న్యాయవ్యవస్థలో నీతి- నిజాయితీ.

23) ఇప్పుడు నేను ఆనాటి న్యాయమూర్తుల సామర్థ్యం ఏ స్థాయిలో ఉండేదో, వారు పాటింప వలసిన నియమ నిబంధనలు ఏమిటో కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నాను. న్యాయమూర్తికి ఉండవలసిన అత్యంత ప్రాథమిక లక్షణం- నీతి నిజాయితీలతో వ్యవహరించటం, వ్యక్తులపట్లగాని, సమూహాలపట్ల గాని రాగం (అభిమానం) ద్వేషం (వ్యతిరేక భావన) లేకుండా నిష్పాక్షికంగా ఉండటం అందులో ప్రధానాంశం. నిజాయితీ అనే భావనకు చాలా విస్తృతమైన అర్థం చెప్పారు. న్యాయాధి కారులకు వర్తించే నిజాయితీ సంబంధమైన నిబంధనావళి చాలా కఠినంగా అమలయ్యేది. బృహస్పతి చెప్పినది ఇలా ఉంది : ‘‘న్యాయమూర్తి తనకు లభించగల ప్రయోజనాలనుగాని, ఎదురు కాగల ప్రమాదాలనుగాని పట్టించుకోకుండా / సరకు చేయకుండా శాస్త్ర గ్రంథాలలో నిర్దేశించిన విధంగా విచారణ జరపాలి. ఈ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వహించే న్యాయమూర్తి ఒక యజ్ఞాన్ని చేసినవానితో సమానంగా పుణ్యం సంపాదించుకొన్నవాడవు తాడు!’’

 1. న్యాయమూర్తులు నిష్పాక్షికంగా వ్యవహరించేవారుగా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకొనేవారు. విచారణ న్యాయస్థానంలో నలుగురి ముందు జరగాలి. వివాదంతో సంబంధం ఉన్న వారితో న్యాయమూర్తులు విడిగా (ఆంతరంగికంగా) మాట్లాడరాదు. అలా మాట్లాడినట్లయితే పక్షపాతానికి దారితీయవచ్చు. ‘‘అభిమానం, ఆశ, భయం, శత్రుత్వం, ఆంతరంగికంగా మాట్లాడడం- ఈ ఐదూ నిష్పాక్షికతను దెబ్బతీస్తాయి, న్యాయ మూర్తులు ఏదో ఒకవైపునకు మొగ్గుచూపేటట్లు చేస్తాయి.’’ అని ఈ శుక్రనీతిసారం చెప్పింది.
 2. ఏ వివాదమైనా ఒకే న్యాయమూర్తితో విచారించి, తీర్పు ప్రకటించడం సరికాదన్న నియమమూ ఉండేది. న్యాయాధికారులు నిజాయితీ తప్పి వ్యవహరించకుండా తీసుకున్న జాగ్రత్తలలో ఇదొకటి. రాజుకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇద్దరు కలసి, తమలో తాము తర్కించుకొని నిర్ణయం చేసినపుడు తప్పిదాలు, అవినీతి తక్కువగా జరుగుతాయని మన పూర్వికులు గుర్తించారు. న్యాయవిచారణ సమయంలో రాజు సైతం న్యాయ సలహాదారులతో కూడి, వివాదాన్ని విచారించాలి. న్యాయమూర్తులు బేసి సంఖ్యలో ఉండాలి. వేదవిదులై, వ్యవహార జ్ఞానం ఉన్న న్యాయాధికారులు ముగ్గురు లేదా ఐదుగురు లేదా ఏడుగురు ధర్మాసనంలో ఉండాలని శుక్రనీతిసారం చెబుతున్నది. ధర్మాన్ని నిర్ణయించి చెప్పేందుకు, ముగ్గురు న్యాయమూర్తులు వివాదాలను వినవలసి ఉంటుందని కౌటిల్యుడు చెప్పాడు.
 3. బ్రిటిష్‌వారు ఏర్పరచిన నేటి న్యాయవ్యవస్థ మన దురదృష్టం కొద్ది అద్భుతమైన ఈ జాగ్రత్త పట్ల శ్రద్ధ వహించడం లేదు. పొదుపు పేరుతో దిగువ న్యాయస్థానాలన్నింటిలోనూ ఒకే మున్సిఫ్‌ ‌లేదా ఒకే సివిల్‌ ‌జడ్జ్, ‌లేదా ఒకే జిల్లా జడ్జ్ ‌వివాదాలను విని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాచీనకాలంలో వ్యయాన్ని తగ్గించాలన్న దృష్టితో కాకుండా నాణ్యమైన తీర్పులపై దృష్టి పెట్టారు.
 4. న్యాయవ్యవస్థ నిజాయితీగా పనిచేసేదిగా ఉండాలని స్మృతులన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి. శుక్రనీతిసారం, ‘న్యాయమూర్తిగా రాజు నియమించే వ్యక్తి వివేకి, నీతిమంతుడు, సత్యవాది, న్యాయ విదుడు, కార్యవిధానాలు తెలిసినవాడూ కావాలి. చురుకుగా ఉండాలి, ఆశపోతు, కోపస్వభావి కాకుండా ఉండాలి’ అంటుంది. అవినీతి చాలా నీచమైన నేరమని భావించేవారు. నీతి తప్పిన న్యాయమూర్తికి అత్యంత కఠిన దండన విధించాలని ఆనాటి గ్రంథాలు ముక్తకంఠంతో పేర్కొంటున్నాయి. లంచం తీసుకొని, న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం సడలిపోయేలా ప్రవర్తించివానికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాలని బృహస్పతి ఆదేశించాడు. అవినీతిపరుడైన న్యాయమూర్తి, దొంగ సాక్ష్యం చెప్పే సాక్షి, బ్రాహ్మణుని మట్టుపెట్టిన హంతకుడు-ఈ ముగ్గురినీ సమానమైన అసాధారణ నేరం చేసిన వారిగా పరిగణించేవారు. అవినీతిపరుడైన న్యాయమూర్తి ఆస్తినంతటినీ స్వాధీనం చేసుకొని రాజ్యంనుండి వెళ్లగొట్టాలని విష్ణువు నిర్దేశించాడు.

జ) ప్రాచీన హిందూ దేశంలో న్యాయశాస్త్ర గ్రంథాల మీద వివరణలు, విశ్లేషణలు చేయడానికి కూడా కొన్ని నియమాలను అనుసరించారు.

 1. న్యాయసూత్రాలను వివరించేందుకు, వ్యాఖ్యానించేందుకు, ఇదమిత్థమని నిర్ణయించేందుకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సూత్రాలు అమలై నాయి. సమ్యక్‌-‌యత్‌ ‌శాస్త్రం, శాస్త్రోదితేన విధినా- అంటే శాస్త్రం నిర్దేశించిన సూత్రాల కనుగుణంగా వ్యాఖ్యానించడం న్యాయమూర్తుల పని. గ్రంథాలలో చెప్పిన వాటిని అన్వయించడం న్యాయమూర్తుల పని. ఈ పనిలో ఎన్నో సమస్యలు తలఎత్తేవి. కొద్దిమందికి మాత్రమే తెలిసిన అస్పష్టమైన, గూఢమైన శబ్దార్థాలను విశదీకరించడం, ఒకే చట్టంలో పరస్పర విరుద్ధంగా కనపించే అంశాలను సమన్వయం చేయడం కూడా వారి బాధ్యతే. సమన్యాయం, అందరికీ న్యాయం వంటి విస్తృత న్యాయసూత్రాలకూ, ఏదైనా చట్టంలోని అంశాలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తే ఆ ఘర్షణకు పరిష్కారం వెదకడం, ప్రజలు పాటిస్తున్న ఆచారా లకూ, స్మృతులకూ మధ్య తేడా ఉంటే సర్దుబాటు చేయడం… ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమౌతూ ఉండేవి. న్యాయస్థానాల నిర్వహణపైనా అనేక న్యాయసూత్రాలు రూపొందించారు. వీటిలో ధర్మశాస్త్రం, అర్థశాస్త్రాలకు మధ్య ఘర్షణ ఏర్పడే సందర్భాలను కీలకమైనవిగా భావించేవారు.
 2. తీర్పు ఇవ్వడానికి ప్రాతిపదిక చేసుకోదగిన మూడు విధానాలు.  1ధర్మశాస్త్రం, 2. అర్థశాస్త్రం, 3. ఆ ప్రాంతం లోని ఆచార వ్యవహారాలు (సదాచారం)- అని న్యాయస్థానాలు గుర్తించాయి. అర్థశాస్త్రం, స్మృతులు ఆమోదించిన న్యాయసూత్రాలే ధర్మశాస్త్రాలు. ఈ రెండు గ్రంథాల నుంచి తీసుకున్న సూత్రాలు కొన్నిసార్లు పునరుక్తికి గురైనట్లు కనిపించేవి. కొన్ని సందర్భాలలో ఒక్కొక్క వివాదంలో ఆ రెండింటి మధ్య ఘర్షణ తలెత్తేది. అలాంటి సందర్భాలలో న్యాయ స్థానాలు ఏమిచేసేవి?
 3. అవిరోధ అనేది మొట్టమొదటి సూత్రం. ఇరువురు ఘర్షణ పడుతున్నపుడు, వారి మధ్య ఘర్షణను పరిష్కరించే ప్రయత్నం న్యాయస్థానం చేయాలి. ఇప్పుడు దీనిని (The Principle of Harmonius Construction) అని వ్యవహరిస్తు న్నారు. ఘర్షణకు సామరస్యంగా పరిష్కరించటం, కుదరనపుడు ధర్మశాస్త్రం చెప్పిన విధంగా నిర్ణయం జరగాలి. అది అభిలషణీయం. ‘‘స్మృతి -అర్థశాస్త్రం భిన్నమైన వైఖరులతో ఉన్నచోట అర్థశాస్త్రాన్ని తోసిపుచ్చి స్మృతికి అనుగుణమైన నిర్ణయం జరగాలి. కాగా రెండు స్మృతుల మధ్య లేదా ఒకే స్మృతిలోని రెండు అధికరణాల మధ్య భిన్నత్వం వ్యక్తమైన సందర్భాలలో ఏది సమన్యాయమో దానిని ఎంచుకోవాలి’’ అని భవిష్య పురాణం చెబుతున్నది. నారద స్మృతి కూడా ఇటువంటి సందర్భాలలో-రెండు స్మృతుల మధ్య విభేదం ఉన్నపుడు-వ్యాఖ్యానం ఇదేవిదంగా ఉండాలని నిర్దేశిస్తున్నది. లిఖిత పూర్వకంగా ఉన్న గ్రంథాలను ఆధారం చేసుకొని తీర్పు వెలువరించే సందర్భాలలో- గ్రంథాన్ని గుడ్డిగా అనుసరించటం కాక, న్యాయం చేయటమే తమ మౌలిక కర్తవ్యమనే స్పృహతో నాయ్యస్థానం వ్యవహరించాలని కూడా ఈ స్మృతి గుర్తు చేసింది. ‘‘కేవలం శాస్త్ర గ్రంథాలలోని మాటలను పట్టుకొని నిర్ణయాలు చేసే పద్ధతి పట్టుకొని వేలాడరాదని, నిర్ణయం గనుక హేతుబద్ధంగా లేనట్లయితే ధర్మహానికి పాల్పడినట్లు కాగల’’దంటూ బృహస్పతి చేసిన హెచ్చరికను గమనించాలి. ఏ దేశంలో (ప్రాంతం) నిర్ణయం జరుగవలసి ఉన్నదో అక్కడి ప్రజలలో ఉన్న రూఢి (ఆచారములు, అలవాట్లు, కాణాచి) పరిగణనలోకి తీసికొని న్యాయస్థానం నిర్ణయం ప్రకటించవలసి ఉంటుందని కూడా బృహస్పతి వెల్లడించాడు. ఈ విషయంలో పొరబాట్లు జరిగిన సందర్భాలలో సాంఘిక పరిస్థితులు, దిగజారిన ఉదాహరణలను బృహస్పతి ఉదహ రించాడు. ‘‘మత్య్స మాంసాలు, మద్యం, మేనరిక వివాహాలూ బ్రాహ్మణుల వర్జింపవలసినవి అయినప్పటికీ, దక్షిణ హిందూ దేశంలోని బ్రాహ్మణు లలో మేనరికాలు పరిపాటి. మధ్యదేశ (ఉత్తరదేశంలో) బ్రాహ్మణులు కాయకష్టం చేస్తారు. కాబట్టి వారు మాంసాహారులు కావటం కద్దు. తూర్పు ప్రాంతాలలోని (బెంగాల్‌, అస్సాం) బ్రాహ్మణులు చేపలు తినడానికి అలవాటు పడినవారు, పశ్చిమ ప్రాంత బ్రాహ్మణ స్త్రీపురుషులు మద్యపానానికి అలవాటుపడినవారు కాబట్టి అక్కడ ఆచారంగా చెల్లుబాటవుతున్న పనులు చేసినవారిని దోషులుగా పరిగణించరాదు’’ అంటాడు బృహస్పతి.
 4. ప్రాచీన హిందూ చట్టాల నిర్మాణం- ఆచారాలకు ఇచ్చిన ప్రాధాన్యం.
 5. సమాజంలో ఆచారం లేదా సదాచారం (కాణాచి) నిర్వహిస్తున్న పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రాచీన కాలంలో ప్రభుత్వాలు గమనంలోకి తీసుకునేవి. వివిధ ప్రాంతాలలో ఎలాంటి ఆచారాలు రూఢిగా ఉండేవో వాటిని సాధికారికంగా నమోదు (రికార్డు) చేసేవి. ఒకచోట ఒక ఆచారం పాటిస్తు న్నట్లుగా స్పష్టమైనపుడు, అది గౌరవించదగినది/ పాటించదగినది (ధార్యము) అని రాసిపెట్టి రాజముద్ర వేసి భద్రపరిచేవారు. అయితే అలాంటి ఆచారాలలో సమన్యాయం లేదని స్పష్టమైతే వాడుకలో ఉన్నప్పటికీ తొలగించేవారు. కాలం చెల్లిన, తప్పుదారి పట్టిన, భ్రష్టమైపోయిన ఆచారాలను (లేదా వాటిలోని కొన్ని భాగాలను) తొలగించడం సార్వభౌమాధికారి అయిన పాలకుని కర్తవ్యంగా ఉండేది. ‘‘ఏ ఆచారమైనా న్యాయ విరుద్ధంగా ఉన్నదని స్పష్టమైనపుడు గతంలో దానిని రాజముద్ర వేసి గుర్తించిన విధంగానే – మరల సమష్టి నిర్ణయ పక్రియ ద్వారా రద్దు చేయాలి’’ అని కాత్యాయనుడు సూత్రీకరించాడు.

 విశేష ప్రాధాన్యం గల ఏర్పాట్లను గమనిస్తే ప్రాచీన హిందూ న్యాయ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందినదో అర్ధమవుతుంది.

 1. చాలా సందర్భాలలో వివాదాల మీద ధర్మ నిర్ణయం చేసినప్పుడు అందుకు సంబంధించి ఒక ఆచారం అమలులో ఉన్నదని రుజువు చేయటం ద్వారా జరిగేది. న్యాయ నిర్ణయం చేసేందుకు ఆధారం ఈ నాలుగింటిలో ఏదైనా కావచ్చునని నారదుడు స్పష్టం చేశాడు- 1.ధర్మశాస్త్రం 2. గతంలో న్యాయస్థానాలు చెప్పిన తీర్పు 3. ఆచారం (చరిత్ర), 4. రాజశాసనం లేదా నిర్దేశం. ఈ వరుసలో ముందు చెప్పిన దానికంటే తర్వాత పేర్కొన్నదే ఎక్కువ ప్రభావవంతమైనదిగా పరిగణిం చారు. అర్థశాస్త్రం లోనూ ఈ ప్రస్తావన ఉంది.
 2. నిజానికి ఈ విధమైన ఏర్పాట్ల ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. మారుతున్న ఆచారవ్యవహారాలకు అనుగుణంగా, అదే వేగంతో న్యాయాన్ని కూడా నడిపించి ప్రాచీన హిందూ దేశ న్యాయవ్యవస్థ చట్టానికి లౌకిక భావనను ఆపాదించింది. కాలాను గుణంగానే చట్టం కూడా రూపును సంతరించు కుంటుందన్న కల్పనను మన ముందుంచింది. చట్టం శాశ్వతమైనది, కాలాతీతమైనది, స్వయం శుద్ధమైనది అనే భావనలను తోసిపుచ్చింది. కృతయుగం నాటి చట్టాలు త్రేతా ద్వాపర యుగాల నాటి చట్టాలకు భిన్నమైనవి. అలాగే కలియుగంలోని చట్టాలు కూడా. యుగరూపానుసరతః ఏ యుగంలోని చట్టాలు ఆ యుగంలోని అవసరాలకూ, సందర్భాలకూ తగినవిగా ఉంటాయి.
 3. ప్రాచీన హిందూ దేశంలో సాక్ష్యాన్ని సేకరించే చట్టం ఎలా ఉండేది?
 4. సాక్ష్యాలకు చెందిన చట్టం, సాక్ష్యాధారాలను సేకరించే విధానాలు, ప్రమాణాలు ఎంత పటిష్టంగా, దృఢంగా ఉండేవో, దానినిబట్టి ఆనాటిది ఎంత నాణ్యమైన న్యాయవ్యవస్థో గుర్తించవచ్చును. ఈ కోణం నుంచి సమకాలీన ప్రపంచంలోని ఇతర దేశాల న్యాయవ్యవస్థల కంటే, హిందూ న్యాయవ్యవస్థ ఎంత బాగా అభివృద్ధి చెందిందో అర్ధమవుతుంది.
 5. ప్రాచీన సమాజాలలో మానవాతీతమైన పద్ధతులతో దోషులు తమ నిరపరాధత్వాన్ని రుజువు చేసుకోవలసి వచ్చేది. అగ్నిపరీక్షలను ఎదుర్కోవలసి వచ్చేది. మధ్యయుగం ముగింపు వరకు ఇంగ్లండ్‌లో కూడా ఇవే పద్ధతులు అమలులో ఉండేవి. తమ కళ్లతో చూచినవారు నోరు తెరచి సాక్ష్యమీయగల పరిస్థితి ఉంటే- మానవాతీతమైన పద్ధతులను ఆశ్రయించడాన్ని మన న్యాయవ్యవస్థ నిషేధించింది.
 6. ఏ న్యాయవ్యవస్థకైనా నిజమైన పరీక్ష ఏది? సత్యాన్ని వెలికితీసే సామర్థ్యం కలిగి ఉండటం. అలాంటి పరీక్షలో నాటి హిందూ న్యాయస్థానాలు ఉన్నత స్థాయి కనబరిచేవి. ‘‘తమ ముందుకు వచ్చిన వివాదంలో ఏది సత్యమో, ఏది అసత్యమో సాక్షుల ద్వారా రాబట్టి న్యాయస్థానం నిర్ధారించవలసి ఉన్నది’’ అని గౌతమ న్యాయ నిర్ణయ విధానం చెబుతుంది.

మనకు లభిస్తున్న సాక్ష్యాధారాలు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. దొంగ సాక్ష్యం లేదా తప్పుడు సాక్ష్యం చెప్పిన వ్యక్తిని ప్రాచీన హిందూదేశంలో అత్యంత నీచునిగా పరిగణించేవారు. క్రీ.పూ.3వ శతాబ్దంలో ఇక్కడకు వచ్చిన మెగస్తనీస్‌, ‌క్రీ.శ.7వ శతాబ్దంలో వచ్చిన హ్యూయాత్సాంగ్‌ – ‘‘‌ప్రాపంచిక విషయాలలో కూడా హిందువులలో సత్యంతో కూడిన వ్యవహారమే ఉండేది’’ అని పేర్కొన్నారు. హర్షవర్ధనుడి కాలంలో హిందూ దేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు కూడా అటువంటి అనుభవాలనే నమోదు చేశారు. వేల సంవత్సరాలుగా పాటించిన ఒక ఉత్తమ గుణం న్యాయ నిర్ధారణలో సత్సంప్ర దాయంగా రూపుదిద్దుకొన్నది.

 1. నిజానికి న్యాయస్థానాలలో అనుసరించిన విధి విధానాలు, పద్ధతులు, అక్కడ ఉన్న వాతావరణం అబద్ధాలు చెప్పేందుకు అవకాశమిచ్చేవి కావు. సాక్షిచేత న్యాయమూర్తి ప్రమాణం చేయించేవాడు. ఈనాటి మాదిరిగా కోర్టు గుమాస్తాలు ప్రమాణం చేయించే పద్ధతి లేదు. సాక్షి చేత ప్రమాణం చేయించే సమయంలోనే సత్యసంధత ఎంతటి ఉత్తమ గుణమో, దొంగ సాక్ష్యం లేదా తప్పుడు సాక్ష్యం ఎంత ఘోర పాపమో న్యాయమూర్తి వారికి వివరించేవాడు. ధర్మశాస్త్రాలలో పట్టు కలిగిన న్యాయమూర్తులు సత్యానికి ఉన్న ఉత్కృష్టతను ప్రశంసిస్తూ, ఎదుటి వ్యక్తి అంతరంగం నుంచి అబద్ధం చెప్పాలన్న దురాలోచనలను పారద్రోలేవారు. సాక్షితో న్యాయమూర్తి మాట్లాడే సమయంలో నిర్ధారించిన పడికట్టు పదాలు వల్లించడానికే పరిమితం కాకుండా, దైవం పట్ల భక్తి భావన నిలిపి, పాపభీతిని కల్పించే వారు. ప్రాచీన గ్రంథాలన్నీ ఈ విషయాన్ని ముక్తకంఠంతో నిర్ధారిస్తున్నాయి. ‘‘న్యాయమూర్తిని చూడగానే సాక్షిగా వచ్చినవానిలో గౌరవభావం కలగాలి. సత్యానికి ఉన్న ఔన్నత్యం, అసత్యానికి ఉన్న నీచస్థానం ఆయన పలుకులలో వ్యక్తం కావాలి’’ అని నారదుడు అంటాడు. న్యాయస్థానంలో అబద్ధం చెప్పడం ఒక నీచకృత్యమే కాక, తీవ్ర నేరమని స్మృతులన్నీ ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. అంటే అబద్ధాలు చెప్పే అవకాశాలను తగ్గించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొనేవారు. వీలయినంత త్వరగా విచారించి, సాక్ష్యం నమోదు చేయించే బాధ్యత/ విశేషాధికారం రాజుకు ఉంది. సాక్ష్యం నమోదులో ఆలస్యమైతే సాక్షి తాను చూసిన విషయాలు మరిచిపోయి, కల్పనలు జోడించి చెప్పే ప్రమాదమున్నది. ‘‘సాక్ష్యం విని, నమోదు చేయడంలో తాత్సారం జరగకూడదు, అందుకు అవకాశం ఇవ్వరాదు. అదే జరిగితే సత్యదూరమైన, న్యాయ విరుద్ధమైన పద్ధతిని సాక్షి అనుసరించ వచ్చును. ఈ విషయంలో రాజు అప్రమత్తుడై న్యాయం అందించాలి’’ అంటాడు కాత్యాయనుడు.
 2. ప్రాచీన హిందూ దేశంలో ప్రశాసనిక విధులు అమలు జరిగిన తీరు.
 3. ప్రాచీన హిందూ దేశంలోనూ ప్రభుత్వ పరంగా పెద్ద స్థాయిలో పరిశ్రమలు, వ్యాపారం సాగేవి. మౌర్య చక్రవర్తుల పాలనలో గనుల నిర్వహణ, వస్త్ర పరిశ్రమ, వ్యాపార సంస్థల నిర్వహణ ప్రభుత్వం ద్వారా జరిగేవి. ఆ పనుల నిర్వహణకు నావాధ్యక్ష (నౌకల రాకపోకలను పర్యవేక్షణాదికారి) సూత్రాధ్యక్ష (వస్త్రపరిశ్రమ పర్యవేక్షణాధికారి) ఆకరాధ్యక్ష (గనుల నుండి ముడి లోహాన్ని వెలికితీసే పనుల పర్యవేక్షణాధికారి) వంటి అధికారులు ఉండేవారు. వాణిజ్యరంగానికీ పర్యవేక్షణాధికారులు ఉండేవారు. వారు తమ విధులను ఏ విధంగా నిర్వహించాలో అర్థశాస్త్రం నిర్దేశించింది కూడా. ఆ గ్రంథంలోని కొన్ని ఉదాహరణలు మీ ముందుంచు తాను-
 4. సముద్రాలలో, నదులలో నావలను నడిపించే విధానాన్ని నిర్దేశించే నియమావళి అర్థశాస్త్రంలో ఉంది. నావాధ్యక్షుని బాధ్యతలు ఇవి. సముద్రాల మీదుగా, నదీ ముఖాలలో నుండి తీసుకొచ్చిన లేదా ఎగుమతి చేసే సరుకుల లెక్కలే గాక, సరస్సులలోను, కాలువలలోనూ స్థానికంగా రవాణా చేసే సరుకులకూ లెక్కలు ఉండాలి. నౌకాయానం భద్రంగా సాగేందుకు నియమాలనూ, నిబంధనలనూ పాటించాలి. చిన్న చిన్న సాధనాలలో దాటేందుకు వీలుకాని పెద్ద నదుల వద్ద తగినంత సిబ్బందితో పెద్ద పడవలు (భారీ నావలు- లాంచీల వంటివి కావచ్చు) ఉండాలి. వాటికి శాసకుడు (కెప్టెన్‌), ‌నియామకుడు (పైలట్‌) ఉం‌డాలి. తాళ్లు, కొడవళ్లతో సదా సిద్ధంగా ఉండే సిబ్బంది ఉండాలి (పడవలోనికి నీరు చేరితే, ఎత్తిపోయటం వారి పని).

(ఇంకా ఉంది)

అను: డా।। వడ్డి విజయసారథి

About Author

By editor

Twitter
YOUTUBE