– ‌డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గొడ్బొలె

భారత్‌ ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. ఈ తేదీనే 1930 నుంచి 1947 వరకు ‘స్వాతంత్య్ర దినం’గా జరుపుకున్నామన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. గణతంత్ర దిన వేడుకల్లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ఎం‌దుకు పాల్గొనడంలేదని సంఘ్‌ ‌వ్యతిరేకులు చేసే విమర్శ. జనవరి 26, 1930న మొట్ట మొదటిసారి ‘పూర్ణస్వరాజ్‌’ ‌దినం జరుపుకున్నారు. 1950 నుంచి ఇదే రోజును ‘గణతంత్ర దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. మరి జనవరి 26,1930న సంఘ్‌ ఎక్కడుంది? అదేవిధంగా జనవరి 26, 1950న ఈ సంఘ్‌ ఏమైపోయింది? ఈ ప్రశ్నలకు సంఘ్‌ ఆర్కైవ్స్, ‌మహారాష్ట్ర నుంచి వెలువడిన ‘కేసరి’ పత్రిక ఆధారంగా ఈ వ్యాసంలో సమాధానాలు ఇచ్చాం. జనవరి 26, 1950 తేదీనే గణతంత్ర దినోత్సవంగా ఎందుకు నిర్ణయించాల్సి వచ్చింది?

ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌యాక్ట్-1947 ‌నాటి భారత్‌ను రెండు స్వతంత్ర అధినివేశ ప్రాంతాలుగా విడగొట్టింది. ఒకటి భారత్‌, ‌రెండవది పాకిస్తాన్‌. ఆ ‌విధంగా విడగొట్టిన తేదీ ఆగస్టు 15, 1947. దీంతో అప్పటి వరకు శాసన కార్యకలా పాలను నిర్వహించిన ఇంపీరియల్‌ ‌కౌన్సిల్‌ ‌నుంచి, భారత రాజ్యాంగ సభ అధికారాలను హస్తగతం చేసుకుంది. 1949, నవంబర్‌ 26‌న ఇది రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించింది. ఇక రాజ్యాంగం అమల్లోకి వచ్చే తేదీని నిర్ణయించడమే మిగిలింది. కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ ఇందుకు అనుకూలమన్నది బ్రిటిష్‌ ‌పాలకుల అభిప్రాయం. జనవరి ఆఖరి తేదీని నిర్ణయించాలంటే మహాత్మా గాంధీని హత్యచేసిన రోజుకు సమీపంగా ఉండటంతో కాంగ్రెస్‌కు ఇష్టంలేదు. అందువల్ల జనవరి నెలలో ఏదో ఒక తేదీ నిర్ణయించవచ్చు. కానీ అప్పటికి సరిగ్గా ఇరవయ్యేళ్ల క్రితం జవహర్‌లాల్‌ ‌నెహ్రూ నాయకత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్‌ ‌యాదృచ్ఛికంగా జనవరి 26, 1930ను ‘‘పూర్ణ స్వరాజ్‌’’ ‌దినంగా ప్రకటించింది (కేసరి, జనవరి 27,1950). ఈ నేపథ్యంలో ఇదే తేదీని భారత జాతీయ కాంగ్రెస్‌ ‌గణతంత్ర దినోత్సవానికి ఎంచు కుంది. అప్పటికి ఐదు దశాబ్దాల కాలంలో ఎంతో మంది విప్లవకారులు తమ ప్రాణత్యాగాలు చేశారు. వారి కుటుంబాలు హత్యలు, దేశ బహిష్కరణకు గురయ్యారు. జైళ్లపాలయ్యారు. వారి ఆస్తులు జప్తులకు గురయ్యాయి. మరి వీరందరూ ఇంతటి త్యాగాలు చేసింది పూర్ణస్వరాజ్యం కోసమే కదా! కనీసం వారిని తలుచుకోవడానికి కూడా అవకాశాలు లేవు. మరి అంతటి త్యాగశీలురైన విప్లవకారులకు ఏవిధమైన మన్నన లేకుండా, కాంగ్రెస్‌కు ప్రత్యేకించి నెహ్రూకు చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ తేదీని సర్వసత్తాక, ప్రజాస్వామ్య గణతంత్ర భారత్‌కు నిర్ణయించారు.

సంతోషం, ఆగ్రహం

గణతంత్ర దేశం ఆవిర్భవించిన సందర్భాన్ని పురస్కరించుకొని 1950, జనవరి 26, 27 తేదీల్లో వేడుకలు జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణ యించింది. ఈవిధంగా భారత్‌ ‌గణతంత్రరాజ్యంగా అవతరించడంపై దేశంలోని వివిధ రాజకీయ వర్గాల అభిప్రాయం ఎలా ఉన్నదనేది తీసుకుంటే, అప్పటికి రాజకీయాధిపత్యం కలిగిన కాంగ్రెస్‌ ‌మాటకే ఎక్కువ విలువ. ముఖ్యంగా గాంధీజీ హత్యను సాకుగా తీసుకొని, నెహ్రూ అఖిల భారత హిందూమహాసభ (ఏబీహెచ్‌ఎం), ‌సంఘ్‌లను అణగ దొక్కేశారు. నెహ్రూ దేశ సంధానకరణకు సంబంధించిన తన దృక్కోణంలో ఈ గ్రూపులకు అసలు స్థానమే కల్పించలేదు. మహాత్మాగాంధీ హత్యకు ఆగ్రహంతో వినాయక్‌రావ్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌పై విచారణ జరపగా, గణతంత్ర రాజ్యం ఆవిర్భావానికి కేవలం ఒక ఏడాది ముందు జైలునుంచి విడుదలయ్యాడు. అప్పుడు సావర్కర్‌ ఒక గొప్ప ప్రకటన చేశారు. అదే, ‘‘దేశంలోని ప్రతి పౌరుడికి తన మాతృభూమి పట్ల హృదయపూర్వకమైన సంపూర్ణ విధేయత ఉన్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. బ్రిటిష్‌ ‌దాస్య శృంఖలాల నుంచి బయటపడిన నేపథ్యంలో జరుపుకునే వేడుకల్లో వీరు కూడా పాల్గొనగలరు. అయితే మనం ప్రాంతీయత, మూర్తిమత్వ భావన, పార్టీల మధ్య ఉన్న జగడాలను పక్కనపెట్టి ఈ ఉత్సవాలను ఒకే వేదికపై నిర్వహించాలి. ఆ వేదికే మన మాతృభూమి. మన విజయాన్ని ప్రపంచానికి చాటాలి’’-(బోంబే క్రానికల్‌, ఏ‌ప్రిల్‌ 5, 1950). అప్పటికి కొత్త రాష్ట్రపతి బాబు రాజేందప్రసాద్‌ ‌నిర్దేశంతో, వయసు మీరుతున్నప్పటికీ వీర్‌ ‌సావర్కర్‌ ‌తన సేవలను కొనసాగించారు.

ఏబీహెచ్‌ఎం ఉపాధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్‌ అశుతోష్‌ ‌లహిరిని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు అప్పటి ప్రభుత్వం అండమాన్‌ ‌జైల్లో ఖైదు చేసింది. ఆయన ఇప్పుడు అన్ని హిందూ యూనిట్లను సమీకృతం చేసి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేలా కృషి చేశారు (కేసరి, జనవరి24, 1950). జనవరి 27, 1950న బొంబాయిలో ఏర్పాటు చేసిన ఏబీహెచ్‌ఎం ‌కమిటీ సమావేశం భారత్‌ ‌రిపబ్లిక్‌గా ఏర్పడటాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేసింది (కేసరి, జనవరి 31, 1950).

అయితే భారత్‌ ‌రిపబ్లిక్‌గా ఏర్పడటం కొందరిలో ఆగ్రహం కలిగించింది. జనవరి 26న కమ్యూనిస్టులు బొంబాయిలోని కాలాచౌక్‌లో ధర్ణా జరిపారు. పోలీసులు వారిని వెనక్కి వెళ్లమని కోరగా, యాసిడ్‌ ‌బాంబులను విసిరారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసు సబ్‌-ఇన్‌స్పెక్టర్లకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ సందర్భంగా 55 మంది కమ్యూనిస్టులను అరెస్ట్ ‌చేశారు (జనవరి 27, 1950, కేసరి). బొంబాయిలోని కొలాబా ప్రాంతంలో పతాక వందన కార్యక్రమాల వద్దకు వెళ్లిన కమ్యూ నిస్టులు ఈ పతాకాలను దించేసి నల్లజెండాలను ఎగురవేయాలని కోరారు. ఇది గొడవలకు దారితీసింది (జనవరి 31,1950). ఫార్వర్డ్ ‌బ్లాక్‌, ‌పెజెంట్‌ అం‌డ్‌ ‌వర్కర్స్ ‌పార్టీ ఇతర సంస్థల కార్యాలయాలపై నల్లజెండాలను జనవరి 26న ఎగుర వేసినట్టు కేసరి పత్రిక ప్రచురించింది. బొంబాయి, కలకత్తా నగరాల్లో రిపబ్లిక్‌ ‌వేడుకలను అడ్డుకునేందుకు కమ్యూనిస్టులు దుష్టయత్నాలు చేశారు. (ఫిబ్రవరి 3, 1950,కేసరి).

కామ్టీ (సెంట్రల్‌ ‌ప్రావెన్స్) ‌ప్రాంతంలో ఒక మసీదు వద్ద, రిపబ్లిక్‌ ‌డే ఊరేగింపును అడ్డుకున్నారు. ఊరేగింపులో సంగీతం వాయిస్తున్నారన్న కారణంతో ఈ చర్యకు పూనుకున్నారు. సంగీతం ఆపిన తర్వాత మాత్రమే ఈ ఊరేగింపు ముందుకు సాగడానికి అనుమతించారు. ఈ ఊరేగింపు తిరుగు ప్రయాణం సందర్భంగా లాఠీలు ధరించిన హిందూయేతరులు దాడులు జరపడానికి సిద్ధంకాగా, సాయుధ పోలీసులు ఏవిధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా అడ్డుకున్నారు (ఫివ్రబరి 6,1950, కేసరి).

 జనవరి 24,1950న కేసరి పత్రిక ఈ విధంగా ప్రకటించింది. ‘‘కాంగ్రెస్‌ ‌సేవాదళ్‌, ‌స్కౌట్‌ ‌విద్యార్థులు, రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ ఇతర సంస్థలు కలసి జనవరి 26న వేకువ సమయంలో ప్రభాత్‌ ‌ఫెరీలు నిర్వహిస్తాయి’’. కాంగ్రెస్‌ ‌సేవాదళ్‌ ‌కార్యకర్తలు, బాల స్వయంసేవక్‌లు, కాంగ్రెస్‌ ‌సేవాదళ్‌, ‌సోషలిస్ట్ ‌రాష్ట్ర సేవాదళ్‌లతో కలిసి రెండు రోజుల ఉత్సవాల్లో పాల్గొన్నారని కూడా కేసరి రాసింది (జనవరి 27,1950,). బొంబాయిలో సంఘ్‌ ‌కార్యక్రమం గురించి కేసరి పత్రిక రాస్తూ ‘జనవరి 26న చౌపట్టీలో సంఘ్‌ ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం ఎంతో ఆకర్షణీయంగా జరిగింది. ఈ సందర్భంగా వీరు ప్రదర్శించిన క్రమశిక్షణ, వైభవం నిజానికి పోలీసులు, సైన్యానికి ఏమాత్రం తీసిపోవు’ (జనవరి 31,1931).

సంపూర్ణ స్వరాజ్యంపై కాంగ్రెస్‌ ‌వైఖరి

 డిసెంబర్‌ 27, 1927‌న జరిగిన మద్రాస్‌ ‌సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్‌ ‌కమిటీ కార్య దర్శి జవహర్‌లాల్‌ ‌నెహ్రూ సంపూర్ణ స్వరాజ్యానికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఈ విధంగా ఉంది. ‘‘భారత ప్రజల లక్ష్యం సంపూర్ణ స్వరాజ్యమని కాంగ్రెస్‌ ‌ప్రకటిస్తోంది’’ (1927లో మద్రాస్‌లో జరిగిన 42వ భారత జాతీయ కాంగ్రెస్‌ ‌సమావేశం: ఆహ్వాన సంఘం,42వ భారత జాతీయ కాంగ్రెస్‌ ‌సమావేశం మద్రాస్‌ ‌పేజీ నెం.15). సంపూర్ణ స్వరాజ్యం, బ్రిటిష్‌ ‌వస్తువుల బహిష్కరణ అనే ఈ తీర్మానంలోని అంశాలు గాంధీజీకి ఇష్టం కానివి (డి.జి. తెండూల్కర్‌, ‌మహాత్మా: లైఫ్‌ ఆఫ్‌ ‌మోహన్‌దాస్‌ ‌కరమ్‌చంద్‌ ‌గాంధీ, విఠల్‌భాయ్‌.‌కె ఝవేరీ, డి.జి. తెండూల్కర్‌, ‌ముంబయి 1951, వాల్యూమ్‌-2, ‌పేజీలు 402, 429-430). ఇక ముందు వలసవాద స్వయంపాలన అనేది భారత జాతీయ కాంగ్రెస్‌ అభిమతమై ఉండాలి. అప్పటి ఐ.ఎన్‌.‌సి. అధ్యక్షులు ముక్తార్‌ అహ్మద్‌ అన్సారీ ‘సాధ్యమైతే బ్రిటిష్‌ ‌సామ్రాజ్యంలో, అవసరమైతే అందులో భాగం కాకుండా’ (మద్రాస్‌ ‌కాంగ్రెస్‌ ‌రిపోర్ట్, అనుబంధం 1, పేజీ 3).

డిసెంబర్‌ 28, 1928 ‌నుంచి జనవరి 1, 1929 వరకు కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ ‌సమా వేశంలో నాయకుల మధ్య విభేదాలు పొడచూపాయి. జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, సుభాష్‌ ‌చంద్రబోస్‌లు సంపూర్ణ స్వరాజ్య భావనకు మద్దతివ్వగా, మహాత్మా గాంధీ, ఐ.ఎన్‌.‌సి-ఎలక్ట్ అధ్యక్షులు మోతీలాల్‌

‌నెహ్రూ అధినివేశ ప్రతిపత్తికి మద్దతు పలికారు. భవిష్యత్‌ ‌భారత రాజ్యాంగం ఎట్లా ఉండాలనే దానిపై ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశాన్ని పురస్కరించు కొని ఈ అధినివేశ ప్రతిపత్తి ఆధారంగానే మోతీలాల్‌ ‌తన నివేదికను తయారుచేశారు. ఈ నివేదికకు అనుకూలంగా మెజారిటీ సభ్యుల మద్దతు లేకపోతే, తాను సమావేశానికి అధ్యక్షత వహించబోనని మోతీలాల్‌ అప్పట్లో స్పష్టం చేశారు. అప్పుడు గాంధీ ఒక మధ్యేమార్గాన్ని ప్రతిపాదించారు. ‘‘ డిసెంబర్‌ 31, 1930‌కి ముందు ఆమోదం పొందనట్లయితే ప్రతిపాదిత రాజ్యాంగానికి కాంగ్రెస్‌ ‌బద్ధురాలై ఉండదు. ఇక రెండో విషయం ఏమంటే ఈ రాజ్యాంగాన్ని డిసెంబర్‌ 31, 1930‌లోగా బ్రిటిష్‌ ‌పార్లమెంట్‌ ఆమోదం తెలపకపోతే కాంగ్రెస్‌, అహింసాయుత పద్ధతిలో సహాయ నిరాకరణోద్యమం చేపడుతుంది’’ (తెండూల్కర్‌ ‌పేజీలు 439:440).

గాంధీ చెప్పిన గడువు ముగియక ముందే అంటే అక్టోబర్‌ 31, 1929‌న వైస్రాయ్‌ ఇర్విన్‌ ఒక ప్రకటన చేస్తూ, భారత రాజ్యాంగ రచన అధినివేశ ప్రతిపత్తి దిశగా పురోగతిలో సాగుతున్నదని చెప్పారు. ఇదే సమయంలో ఆయన గాంధీ, జిన్నా వంటి నాయకులకు ‘రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం ఎప్పుడు నిర్వహించే తేదీని ఇపుడే చెప్పడం సాధ్యంకాదని’ స్పష్టం చేశారు. అంటే అధినివేశ ప్రతిపత్తి ఇచ్చే విషయంలో ఏ విధమైన హామీ ఇవ్వలేదని అర్థం. దీంతో ఆశలు అడియాశలైన గాంధీ తక్షణమే పూర్ణ స్వరాజ్యమే లక్ష్యమని ప్రకటించారు. 1929 డిసెంబర్‌లో లాహోర్‌లో జరిగిన అఖిలభారత కాంగ్రెస్‌ ‌జాతీయ సదస్సు, జవహర్‌లాల్‌ ‌నెహ్రూ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సు పుణ్యమాని సంపూర్ణ స్వరాజ్య ప్రకటన కోసం దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది (ఆర్‌.‌సి. ముజుందార్‌, ‌హిస్టరీ ఆఫ్‌ ‌ఫ్రీడమ్‌ ‌మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇం‌డియా, ఫిర్మా, కె.ఎల్‌. ‌ముఖోపాధ్యాయ – కలకత్తా వ్యాల్యూమ్‌-3, ‌పేజీలు 322, 325).

కాంగ్రెస్‌ ‌రచించిన రాజ్యాంగంలోని అధికరణ-1లో పేర్కొన్న ‘స్వరాజ్‌’ అం‌టే సంపూర్ణ స్వరాజ్యమని అర్థమంటూ లాహోర్‌ ‌సదస్సులో మహాత్మా గాంధీ ప్రకటించారు. దీంతో మోతీలాల్‌ ‌నెహ్రూ రూపొందించిన నివేదిక బుట్టదాఖలైంది. ఇకముందు కాంగ్రెస్‌వాదులు సంపూర్ణ స్వరాజ్య సాధన దిశగా పూర్తిస్థాయిలో పనిచేస్తారన్న ఆశ వ్యక్తమైంది (44వ వార్షిక కాంగ్రెస్‌ ‌లాహోర్‌ ‌సదస్సుపై భారత జాతీయ కాంగ్రెస్‌ ‌నివేదిక, రిసిప్షన్‌ ‌కమిటీ పేజీ. 88).

పూర్ణ స్వరాజ్‌ ‌సిద్ధాంతాన్ని దేశప్రజల ముందుంచేందుకు వీలుగా భారత జాతీయ కాంగ్రెస్‌ ‌జనవరి 2, 1930న ఒక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఏటా జనవరి 26వ తేదీని దేశ వ్యాప్తంగా ‘పూర్ణ స్వరాజ్య దినం’గా పాటించాలి. దీనికి సంబంధించిన మేనిఫోస్టోను మహాత్మా గాంధీ తయారుచేయగా కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ ఆమోదం తెలిపింది. ఇక గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలు, సదస్సులో పాల్గొన్న ప్రేక్షకులు కేవలం ఈ మేని ఫెస్టోకు అనుకూలంగా చేతులెత్తడం ద్వారా సమ్మతి తెలపడం తప్ప చేసేదేం లేదు. (మజుందార్‌ -‌పేజీ.331).

హెడ్గేవార్‌ ‌హర్షం

ఏటా జనవరి 26న పూర్ణ స్వరాజ్‌ ‌దినంగా పాటించాలని నిర్ణయించడం దేశభక్తులందరిలో ఆనందం నింపింది. అటువంటి వారిలో రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ ‌వ్యవస్థాపకులు డా.కేశవరావ్‌ ‌బలిరామ్‌ ‌హెడ్గేవార్‌ ఒకరు.

హెడ్గేవార్‌ ‌తొలి నుంచి సంపూర్ణ స్వరాజ్యం కోసమే కోరారు. ఇందుకోసం ఆయన ఏబీహెచ్‌ఎం, ఐఎన్‌సీల్లో పనిచేస్తూనే విప్లవ పంథాను అనుసరిం చారు. అయితే హిందువుల సంఘటన ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆయన బలంగా నమ్మారు. ఈ లక్ష్యంతోనే 1925లో సంఘ్‌ను స్థాపించారు. ఈ నేపథ్యంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ‌సంపూర్ణ స్వరాజ్‌ ‌కోసం తీర్మానించడం ఆయనకు ఆనందం కలిగించింది. స్వయంసేవకులంతా తమ స్థాయిని బట్టి జాతీయ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో జనవరి 21, 1930న ఆయన దేశవ్యాప్తంగా స్వయం సేవకులకు లేఖ రాస్తూ, ‘భారత జాతీయ కాంగ్రెస్‌ ఎట్టకేలకు పూర్ణ స్వరాజ్‌ ‌లక్ష్యాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 1930, జనవరి 26న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలు, సాయంత్రం సరిగ్గా ఆరుగంటలకు జాతీయ పతాకానికి వందనం చేయాలి’. (సంఘ్‌ ఆర్ఖీవ్‌లు, హెడ్గేవార్‌ ‌పేపర్స్, ఎ ‌పత్రక్‌ ‌బై డా।।హెడ్గేవార్‌ ‌టు ది స్వయంసేవక్‌, ‌జనవరి 21,1930).

అయితే ఆనాడు సంఘ్‌ ఎక్కువగా మరాఠీ మాట్లాడే ప్రాంతాలైన నాగ్‌పూర్‌, ‌వార్ధా, చందా (నేటి చంద్రాపూర్‌), ‌భందరల్లో వ్యాప్తిలో ఉండేది. అమరావతి, బుల్ధన, అకోలా, యావత్‌ ‌మాల్‌ ‌ప్రాంతాల్లో సంఘ్‌ ‌కార్యకలాపాలు తక్కువ.

హెడ్గేవార్‌ ‌నిర్దేశం మేరకు దేశవ్యాప్తంగా సంఘ్‌ ‌శాఖలు, కాంగ్రెస్‌ను ప్రశంసిస్తూ తీర్మానాలు చేశాయి. జనవరి 26, 1930 సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు విశ్వనాథ్‌ ‌వినాయక్‌ ‌క్కేర్‌ ‌నేతృత్వంలో స్వాతంత్య్ర దిన వేడుకలు నాగ్‌పూర్‌లో జరిగాయి. ప్రధానవక్తగా నారాయణ్‌ ‌వైద్య వ్యవహరించారు. హెడ్గేవార్‌, ‌లక్ష్మణ్‌ ‌వాసుదేవ్‌ ‌పరంజపె, నవాథే తదితరులు పాల్గొన్నారు.

చందాలో కార్యక్రమం

జనవరి 29, 1930న చందా ప్రాంత సంఘ కార్యదర్శి రామచంద్ర రాజేశ్వర్‌ అలియాస్‌ ‌తాత్యాజీ దేశ్‌ముఖ్‌, అక్కడ నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన నివేదికను హెడ్గేవార్‌కు పంపారు. దీని ప్రకారం, హెగ్డేవార్‌ ‌లేఖ అందడానికి ముందే స్వాతంత్య్ర దినోత్సవం జరపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తర్వాత లేఖ అందింది. కాంగ్రెస్‌ ‌కార్యదర్శి అభ్యర్థన మేరకు జనవరి 26 ఉదయం స్వయంసేవకులు చందాలో ఒక పెద్ద ఊరేగింపు జరిపి, జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. ఇక సాయంత్రం తాలూకా కాంగ్రెస్‌ ‌కార్యదర్శి, తమ పార్టీ తరపున నిర్వహించే ఊరేగింపులో పాల్గొనాలని ఆహ్వానించినా సంఘటన్‌ ‌నిర్వహించాలని అప్పటికే నిర్ణయం జరగడంతో అందులో పాల్గొన లేక పోయారు. ఇదే విషయాన్ని సంఘ్‌ ‌కాంగ్రెస్‌ ‌తాలూకా కార్యదర్శికి తెలియజేసింది.

సాయంత్రం 4.30 గంటలకు జరిగిన సంఘటన్‌ ‌సందర్భంగా కేశవరావ్‌ ‌బొడకే, దేశ్‌ ‌ముఖ్‌లు ప్రసంగించారు. ఈ సందర్భంగా భాగవత్‌ ‌సంక్షిప్తంగా మంచి ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా పూర్ణ స్వరాజ్‌ను సమర్థిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. నిజానికి కాంగ్రెస్‌ ‌కంటే ఎంతో ముందే సంఘ్‌ ‌పూర్ణ స్వరాజ్‌ను తీర్మానించింది. ఈ కారణంగానే కాంగ్రెస్‌ ‌తీర్మానానికి మద్దతు

తెలిపింది.

అను: జమలాపురపు విఠల్‌రావు

About Author

By editor

Twitter
Instagram