– రాజేంద్ర

ఇటీవల జరిగిన ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార బీజేపీ పోరాడి ఓడిపోయిందని చెప్పవచ్చు. పోలింగ్‌ అనంతరం వెల్లడైన ఎగ్జిట్‌ ‌పోల్‌ ‌ఫలితాలు బీజేపీని మరీ తక్కువగా అంచనా వేశాయి. పార్టీ ఘోరంగా విఫలమవుతుందని అవి అంచనా వేశాయి. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చిన విషయాన్ని గమనించాలి. దీనిని బట్టి ప్రచార, ప్రసార మాధ్యమాలు బీజేపీ పట్ల ఎంత గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శించాయో అర్థమవుతుంది.

మొత్తం 250 సీట్లు గల ఢిల్లీ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌నాయ కత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ 134 సీట్లతో సంపూర్ణ మెజార్టీ సాధించింది. నిన్నటి దాకా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 104 సీట్లు కైవసం చేసుకుంది. హస్తం పార్టీ 9, స్వతంత్రులు 3 సీట్లు గెలుచుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన మాట వాస్తవమే. కానీ ఆ పార్టీ గౌరవప్రదమైన సీట్లు సాధించింది. మెజార్టీకి 22 సీట్లే తగ్గాయి. కానీ బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనా వేశాయి. ఫలితాల అనంతరం బీజేపీ హుందాగా వ్యవహరించింది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహ రించి నగర ప్రగతికి దోహదపడతామని స్పష్టం చేసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నగర బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌ ‌గుప్తా రాజీనామా చేశారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పటేల్‌నగర్‌ ‌నియోజక వర్గంలోని నాలుగు వార్డుల్లో పార్టీ ఓడిపోయింది.

ఎన్నికల ప్రకటన, ప్రచారం సందర్భంగా అధి కార బీజేపీపై ఆప్‌ ‌చేసిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికలకు సమాంతరంగా ఢిల్లీ ఎన్నికలు ప్రకటించారని, తమను దెబ్బతీయడమే ఇందులోని ఆంతర్యమని ఆప్‌ ఆరోపించింది. గుజరాత్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ఎన్ని కల ప్రచారంలో తమ అధినేత కేజ్రీవాల్‌ ‌బిజీగా ఉంటారని, ఇదే అదనుగా ఢిల్లీ ఎన్నికలు ప్రక టించారని పేర్కొంది. దీనివల్ల ఢిల్లీలో తమ అధినేత ప్రచారం చేసేందుకు అవకాశం ఉండదని అప్పట్లో పేర్కొంది. కానీ ఇది అహేతుక విమర్శన్నది కాస్తా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కేజ్రీవాల్‌ ‌మాదిరిగానే బీజేపీ నాయకులు కూడా గుజరాత్‌, ‌హిమాచల్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటారన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది ఆప్‌. అదే సమయంలో బీజేపీకి ఢిల్లీకన్నా గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ముఖ్యమన్న విషయాన్ని మరువరాదు. కానీ గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌కన్నా ఆప్‌నకు ఢిల్లీ ముఖ్యమన్న విషయాన్ని విస్మరించ రాదు. వాస్తవాలు ఇలా ఉండగా ఏకపక్ష విమర్శలు, ఆరోపణలు చేయడం ఆప్‌కే చెల్లింది.

ఢిల్లీ నగర పాలక సంస్థ 1958లో ఏర్పాటైంది. 2012లో నాటి కాంగ్రెస్‌ ‌ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ ‌ఢిల్లీని మూడు కార్పొరేషన్లుగా విభజించారు. వాటిని ఈ ఏడాది విలీనం చేసి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ‌ఢిల్లీగా పునరుద్ధరించారు. గత పదిహేనేళ్లుగా ఢిల్లీ నగర పాలక సంస్థ బీజేపీ ఏలుబడిలో ఉంది. రాజధాని నగర ప్రగతికి అనేక కార్యక్రమాలు ఆ పార్టీ చేపట్టింది. వేలకోట్ల రూపాయలు వెచ్చించింది. నీటి వసతిని మెరుగుపరిచింది. నాలా వ్యవస్థను పకడ్బందీగా తీర్చిదిద్దింది. ప్రముఖ రహదారులతో పాటు మారుమూల బస్తీల రహదారులను బాగు చేసింది. విద్యుత్‌ ‌సరఫరాను మెరుగుపరిచింది. అయి నప్పటికీ మహానగరంలో ప్రజల అవసరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నగర జనాభా అంచనా లకు మించి ఏటేటా పెరిగిపోతోంది. పెరుగుతున్న ప్రజల అవసరాలను తీర్చడం నగర పాలక సంస్థకు శక్తికి మించిన పనిగా మారింది. ఇదే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఫలితాల అనంతరం బీజేపీపై ఆప్‌ ‌చౌకబారు ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేసింది. తమ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టడానికి బీజేపీ బేరసారాలు చేస్తోందని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. తమ పార్టీ కౌన్సిలర్లను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ‌మాట్లాడుతూ ‘మిమ్మల్ని కొనడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఫోన్లు చేయడం ప్రారంభించారు. కొందరికి పది లక్షలు, మరికొందరికి 50 లక్షలు ఇస్తామని ఆశ చూపుతున్నారు. మీరు వారి ఉచ్చులో పడరని నాకు తెలుసు. కానీ వారి అసలు రంగును మీరు బయటపెట్టాలి. వారు ఫోన్లు చేసినప్పుడు రికార్డు చేయండి’ అని అన్నారు. సంపూర్ణ మెజార్టీ సాధించిన పార్టీ ఇలా బేలగా మాట్లాడటం తగదు. అధికారం కావాలంటే బీజేపీకి ఇంకా రెండు డజన్ల మంది కౌన్సిలర్లు అవసరం. అలాంటి ప్రయత్నాలకు పార్టీ ఆది నుంచి దూరంగా ఉంది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పూనావాలా ఆప్‌ ఆరోపణలను తిప్పికొట్టారు. కేజ్రీవాల్‌ ‌ప్రతినిధి శిఖాగర్గ్ ‌నాయ కత్వంలోనే బేరసారాలు జరుగుతున్నాయని ఆరోపిం చారు. అమ్ముడుపోయేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, ఆప్‌ అలాంటి ప్రయత్నాలకు తెర దించాలని ఆయన సూచించారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినందున దానిని గౌరవించి మంచి పాలన అందించేందుకు, ఢిల్లీ ప్రగతికి దోహదపడాలని ఆయన కోరారు.

ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, దానిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. వాస్తవానికి ఇలాంటి మాటలు గెలిచిన పార్టీ నుంచి రావాలి. అంతేతప్ప ఓడిపోయిన పార్టీ నుంచి కాదు. నిజానికి కేజ్రీవాల్‌ ‌పార్టీనే ఇలాంటి ప్రయత్నాలు చేసి అభాసుపాలైంది. హస్తం పార్టీ నుంచి ఆప్‌లోకి చేరిన కొద్ది గంటలకే ఢిల్లీ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ ఉపాధ్యక్షుడు మెహదీ హసన్‌, ఇద్దరు మహిళా కౌన్సిలర్లు సబీలా బేగం, నాజియా ఖాతూన్‌ ‌తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. చివరి వరకు తాము రాహుల్‌ను, కాంగ్రెస్‌ను వీడబోమని వారు స్పష్టం చేశారు. దీనిని బట్టి ఎవరు ప్రలోభ రాజకీ యాలు చేస్తున్నది అర్థమవుతుంది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram