– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఈ విజయం ఆ పార్టీకి ప్రత్యేకం. నైతికబలాన్ని అందించే సందర్భం. ఎన్నికలలో గెలుపు, ఓటములు సహజమే అయినా, గెలుపు అలవాటుగా మారిన వాళ్లకు, అరుదుగా దాన్ని దక్కించుకునే వాళ్లకు దానిని ఆస్వాదించడంలో తేడా ఉంటుంది. విజయం అలవాటైన వారికి, అప్పుడప్పుడు ఎదురయ్యే వైఫల్యం పూర్తిగా కుంగిపోయేలా చేయదు. అదే సమయంలో ఏళ్ల తరబడి పరాజయాలు తరుముతున్నప్పుడు నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం, నైతిక స్థైర్యం సన్నగిల్లుతాయి. సహజంగా ఏ పార్టీ అయినా బలహీనపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో వచ్చే విజయం మెరుపులా నైరాశ్యాన్ని తరిమేస్తుంది. యంత్రాంగంలో జవజీవాలు నింపుతుంది. హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఇప్పుడు ఆ ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

గత నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నో పరాజయాలను ఎదుర్కొంది. 2018లో రాజస్తాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌లలో గెలిచిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ తన ఉనికిని చాటుకోలేదు. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోయింది. తను సవాలు విసరగలిగే స్థాయిలో ఉండే ఉత్తరాఖండ్‌, అసోంలలోనూ ప్రతికూల ఫలితాలే వచ్చాయి. మరోవైపు మోదీ నాయకత్వంలో బీజేపీ విజయాలతో తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. బలమైన కేంద్ర నాయకత్వం, వ్యవస్థాగత యంత్రాంగం, పటిష్టమైన కార్యాచరణ ఆ పార్టీకి పెట్టని కోటలు. అలాంటప్పుడు హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎలా చేజారింది? అందులోనూ అది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్ర మైనప్పుడు? ఈ విషయాన్ని పార్టీ లోతుగా సమీక్షించు కోవాలి. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌పాలిత మూడో రాష్ట్రమైంది.

ఒకసారి ఒక పార్టీని గెలిపిస్తే, తదుపరి ఎన్నికల్లో మరో పార్టీకి అధికారం అప్పచెప్పటం ఇక్కడ రివాజు. మూడు దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్‌ ‌చెరో దఫా అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నాయి. ఈసారి కాంగ్రెస్‌ ‌వంతు వచ్చింది. 68 స్థానాలున్న హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ ‌పార్టీకి 40, బీజేపీకి 25, ఇతరులకు 3 స్థానాలు దక్కాయి. ఓటు షేరు విషయానికొస్తే.. కాంగ్రెస్‌, ‌బీజేపీ మధ్య పెద్దగా తేడా లేదు. కాంగ్రెస్‌కి 43.9 శాతం, బీజేపీకి 43 శాతం ఓట్లు లభించాయి. ఇతరులకు 13.1 శాతం దక్కాయి. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు 19 సీట్లు పెరిగితే, బీజేపీకి ఆ మేరకు తగ్గాయి. 2017తో పోలిస్తే ఎక్కువ మంది ఓట్లరు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఈ ఫలితాలు చెప్పేదేమిటి?

ఇప్పుడు హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో లభించిన విజయం కాంగ్రెస్‌కు ఒక పాఠం. నాయకులు సమన్వయంతో కలిసికట్టుగా, పట్టుదలతో పనిచేస్తే బీజేపీని ఓడించటం అసాధ్యం కాదనే సత్యాన్ని అది చాటింది. కాంగ్రెస్‌ ‌ప్రచారం మొత్తం స్థానిక అంశాలపైన (హైపర్‌ ‌లోకలైజ్‌డ్‌ ‌క్యాంపెయిన్‌) ‌సాగింది. పాతపెన్షన్‌ ‌స్కీం, యాపిల్‌-‌బెల్ట్ ‌రైతుల సమస్యలు, నిరుద్యోగం అనే అంశాలకు పరిమిత మైంది. ప్రచార బాధ్యతలు తలకెత్తుకున్న ప్రియాంక కూడా స్థానిక నేతలకు మద్దతు ఇస్తూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగారు. బీజేపీ సిద్ధాంతాలపై ధాటిగా విరుచుకుపడింది లేదు. ఇక కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహులయితే, ఎన్నికలనేవి పరిగణనలోకి తీసుకోవలసినంత తీవ్రమైన విషయం కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పంజాబ్‌ ఎన్నికల్లో వైఫల్యం తర్వాత ‘భారత్‌ ‌జోడో యాత్ర’ ప్రారం భించారు. బీజేపీని ఎదుర్కోవడం అనేది ఎన్నికల మార్గంలో కాదని, సిద్ధాంతాల విధానంలో అని ప్రవచిస్తున్నారు. దీని దారుణమైన ప్రభావం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది. గుజరాత్‌లో ప్రత్యర్థిని సవాలు చేసే స్థాయిలో ఉన్న పార్టీ కాస్తా చావుతప్పి కన్నులొట్ట పోయిన చందంగా రెండో స్థానంలోనే ఉన్నా కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయింది. (2017లో 41.4 శాతం ఓట్లు, 77 సీట్లు; ఇప్పుడు 27.3 శాతం ఓట్లు, 17 సీట్లు)

మరోవైపు కాంగ్రెస్‌ ‌స్థానాన్ని ఆప్‌ ఆ‌క్రమిస్తూ వస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌లలో అది కాంగ్రెస్‌ ‌నుంచి అధికారాన్ని గుంజుకుంది. గుజరాత్‌, ‌గోవాలలో కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. బీజేపీని ఎదిరించి నిలబడగల సత్తా ఉన్న ప్రతిపక్షం తమదేనని చాటు కోవటానికి ఉవ్విళ్లూరుతోంది. దీనిని ఎదుర్కోవ టానికి కాంగ్రెస్‌ ‌నుంచి తగిన సన్నద్ధత కనిపించటం లేదు. 2023లో ఎన్నికలు జరిగే.. రాజస్తాన్‌, ‌ఛత్తీస్‌గఢ్‌లలో అది అధికారంలో ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే, 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఎదుర్కోవటం ఆ పార్టీకి అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలేమిటి?

హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌.. ‌రెండింటిలో గ్రూప్‌ ‌తగాదాలున్నా, ఈసారి వాటివల్ల నష్ట పోయింది బీజేపీనే. కాంగ్రెస్‌ ‌సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీ 44 మందిలో 11 మందిని తప్పించి కొత్త వారికి ఇచ్చింది. దీంతో టిక్కెట్లు దక్కని వారు పోటీలో ఉండిపోయారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రెబెల్‌ ‌నాయకులతో మాట్లాడవలసి వచ్చిం దంటే, పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకో వచ్చు.  కేవలం బీజేపీ తిరుగుబాటు అభ్యర్థుల వల్లనే కాంగ్రెస్‌ 12 ‌చోట్ల విజయం సాధించిందని ఆ పార్టీ నేతలే అంచనా వేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ల మధ్య సమన్వయం లోపం మరో ముఖ్య మైన అంశం. జైరాం ఠాకూర్‌ ‌రికార్డు స్థాయిలో మెజార్టీని సాధించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏడుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో విజయంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే మాట్లాడుతూ, ‘ఇది కాంగ్రెస్‌ అనుకూలంగా పడిన ఓటు కాదు. బీజేపీకి వ్యతిరేకంగా పడిన ఓటు’ అని వ్యాఖ్యా నించారు. పాత పెన్షన్‌ ‌విధానం అమలు చేస్తామని, ఏడో పే కమిషన్‌లో బకాయిలను అందిస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రభుత్వ ఉద్యోగుల్లో సానుకూల ఫలితాన్నిచ్చింది. రాష్ట్రంలో రెండు లక్షల 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మొత్తం ఓటర్లలో వారిది నాలుగు శాతం. పాత పెన్షన్‌ ‌విధానంలో ఉద్యోగుల బాధ్యత అంతా ప్రభుత్వమే చూసుకుంటే, కొత్త పథకంలో ప్రభుత్వం, ఉద్యోగులు ఇద్దరి భాగస్వామ్యం ఉంటుంది.

భారత ఆర్మీలోకి ఎక్కువ మందిని పంపే రాష్ట్రం హిమాచల్‌ ‌ప్రదేశ్‌. ‌ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌స్కీం పైన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. భారీ స్థాయిలో ఆందోళనలు ఇక్కడ చోటుచేసుకున్నాయి. అది ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా మారింది.  ప్రతి ఎన్నికల్లో యాపిల్‌ ‌రైతుల పాత్ర కీలకం. దాదాపు 17 అసెంబ్లీ స్థానాలున్న ప్రాంతాన్ని ‘యాపిల్‌ ‌బెల్ట్’‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర జీడీపీలో 13.5 శాతం, అంటే.. దాదాపు ఆరువేల కోట్లు యాపిల్‌ ‌వాణిజ్యం ద్వారానే లభిస్తుంది. ఈ ఏడాది ఇరాన్‌ ‌తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యాపిళ్లను దిగుమతి చేసుకోవటం వల్ల రాష్ట్రంలో ధరలు గణనీయంగా పడిపోయాయి. యాపిల్‌ ‌కార్టన్‌ ‌బాక్స్‌లు, కార్డ్ ‌బోర్డులపైన ప్రభుత్వం విధించిన 18 శాతం జీఎస్టీ రైతులకు భారంగా మారింది. ఉద్యానవన శాఖ ద్వారా అందించే రసాయనాల సబ్సిడీని ఇవ్వటం మానేసింది. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం యాపిల్‌ ‌రైతుల గోడును పట్టించు కోలేదు. విదేశీ యాపిళ్లపైన నిషేధం విధించాలని, ప్యాకేజింగు మేటీరియల్‌పై జీఎస్టీ తగ్గించాలని, కశ్మీర్‌తో సమానంగా కనీసం అమ్మకం ధర అందించాలన్న వారి డిమాండ్లను పెడచెవిన పెట్టింది. ఫలితంగా కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంలో 12 స్థానాలు దక్కాయి.

ఇక కాంగ్రెస్‌ ‌ప్రకటించిన మహిళలకు రూ. 1500, గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పైన రూ. 500 సబ్సిడీ ఇవ్వటం అనేది మహిళా ఓటర్లపైన సానుకూలమైన ప్రభావం చూపింది. 68 అసెంబ్లీ స్థానాల్లో, 42 చోట్ల పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరంతా కాంగ్రెస్‌ ‌వైపు మొగ్గు చూపారు. ఎన్నికల ఫలితాలను తల్లకిందులు చేయగల స్థితి ఇక్కడున్న కాంగ్రా రీజియన్‌కు ఉంది. ఈ ప్రాంతం 15 మందిని అసెంబ్లీకి పంపుతుంది. 2017లో కేవలం మూడు సీట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈసారి ఈ ప్రాంతంలో పది సీట్లు సాధించింది. బీజేపీ నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఇక్కడ నుంచి పోటీ చేసిన ఇద్దరు మంత్రులూ ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్‌ ‌ప్రచారంలో పూర్తిగా స్థానిక అంశాల పైన దృష్టి కేంద్రీకరిస్తే, ఎప్పటి మాదిరిగానే బీజేపీ జాతీయ స్థాయి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ‘డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌’ అన్న నినాదం ప్రజల్లోకి అంతగా వెళ్లలేదు. ‘హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌చరిత్రను తిరగరాస్తాం. ఈసారి కూడా మేం అధికారాన్ని అందుకుంటాం’ అని నేతలు ప్రచారం చేశారు. బీజేపీ హిందుత్వ నినాదానికి వ్యతిరేకంగా ‘హిమాచల్‌.. ‌హిమాచలియత్‌ ఔర్‌ ‌హమ్‌’ అనే స్థానిక నినాదాన్ని కాంగ్రెస్‌ అం‌దిపుచ్చుకుంది. ‘చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. కానీ ఓటర్లకు మా అభిప్రాయాలను సక్రమంగా చెప్పుకోలేకపోయాం. రెబెల్స్ ‌వల్ల కూడా మాకు నష్టం సంభవించింది’ అని మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ ‌పరిస్థితిని వివరించారు.

కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్విందర్‌ ‌సింగ్‌

‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిభాసింగ్‌, ‌సుఖ్విందర్‌సింగ్‌, ‌ముకేశ్‌ అగ్నిహోత్రి ప్రధానంగా పోటీపడ్డారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ ‌భార్య ప్రతిభాసింగ్‌ ‌ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. వీరభద్ర సింగ్‌కు మంచి పేరుంది. ఆరు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహ రించిన ఆయనను అందరూ రాజాసాహెబ్‌ అని పిలుస్తారు. 2017లో బీజేపీ విజయం సాధించ టంతో ఆయన స్థానంలో జైరాం ఠాకూర్‌ ‌ముఖ్య మంత్రి అయ్యారు. ఈ ఏడాది జులైలో వీరభద్రసింగ్‌ ‌కన్నుమూశారు. దాంతో ఆయన భార్య ప్రతిభా సింగ్‌కు అవకాశం లభించవచ్చన్న ప్రచారం సాగింది. ఇక సుఖ్విందర్‌ ‌సింగ్‌ ‌రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు. హమీద్పూర్‌ ‌జిల్లా నాదౌన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాది. సిమ్లాలోని హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌యూనివర్సిటీలో చదువుతూ సామాజిక కార్యకర్తగా ఎదిగారు. కాంగ్రెస్‌ ‌విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూకి 1980లో రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరించారు. 2000లో రాష్ట్ర యూత్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు. 2019 నుంచి ప్రతిభాసింగ్‌ ‌వచ్చే వరకూ పీసీసీ చీఫ్‌ ‌బాధ్యతలు చేపట్టారు. ఇక ముఖేశ్‌ అగ్నిహోత్రి మొన్నటి వరకూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన అనుభవం ఉంది.

వీరభద్రసింగ్‌ ‌కుటుంబ ప్రభావం నుంచి పార్టీని తప్పించాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచించింది. అందుకే సుఖ్విందర్‌ ‌సింగ్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి, ముకేశ్‌ అగ్నిహోత్రికి ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ప్రతిభాసింగ్‌ ‌కుమారుడు, సిమ్లా ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్‌కు మంత్రిగా అవకాశం ఇస్తామని నచ్చచెప్పి ఆమెను దారిలోకి తెచ్చుకున్నారు. ఆమె హుందాగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరై రాహుల్‌ అభినందనలు అందుకున్నారు. రాబోయే రోజుల సంగతేమోగానీ, ప్రస్తుతానికి పార్టీలో అసమ్మతి ప్రభావం ఉండక పోవచ్చని అంచనా వేస్తున్నారు.

About Author

By editor

Twitter
YOUTUBE